[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని ఆరాధన’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవానువాచ:
స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః।
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్॥
(భగవద్గీత, 4 వ అధ్యాయం, 3వ శ్లోకం)
[dropcap]”ఓ[/dropcap] అర్జునా! నువ్వు నా భక్తుడివి మరియు నా స్నేహితుడివి కాబట్టి ఈ నిగూఢమైన, రహస్యమైన, అతి పవిత్రమైన భగవంతునికి భక్తునికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసే తత్వాన్ని నీకు మాత్రమే ఉపదేశిస్తున్నాను” అని పై శ్లోకం భావం.
నాస్తికులు మరియు జన్మతః దానవ ప్రవృత్తి కలవారు భగవత్ చింతన లోనికి రావడానికి వందల జన్మలు పడుతుంది. పూర్వ జన్మ సంస్కారం చేత అర్జునుడు ప్రస్తుత జన్మలో అత్యుత్తమనైన భక్తుడు అయిన కారణంగా శ్రీ కృష్ణ భగవానుడు అతనికి మాత్రమే ఈ తత్వపు రహస్యాలను ఉపదేశించడానికి నిర్ణయించుకున్నాడు. శ్రీ కృష్ణుడు అర్జునుడికి ప్రాచీన శాస్త్రాన్ని అందించడం అసాధారణమైన రహస్యమని చెప్పాడు.
భగవంతుని పట్ల భక్తిని అయిదు విధాలుగా లేదా ఏదైనా ఒక విధంగా అభ్యసించవచ్చు. అవి శాంత భావ అంటే భగవంతుడిని మన రాజుగా ఆరాధించడం, దాస్య భావ అంటే భగవంతుని పట్ల దాస్యం భావన, సఖ్య భావ అంటే భగవంతుడిని మన స్నేహితుడిగా భావించడం, వాత్సల్య భావము అంటే భగవంతుడిని మన స్వంత మనిషిగా భావించి ప్రేమించడం, మరియు మాధుర్య భావ అంటే భగవంతుడిని మన ఆత్మ-ప్రియుడిగా ఆరాధించడం. అర్జునుడు దేవుణ్ణి తన స్నేహితునిగా ఆరాధించాడు, కాబట్టి శ్రీ కృష్ణుడు అతనితో తన స్నేహితుడు మరియు భక్తుడిగా గుర్తించి ఎవరికీ లభించని భగవద్గీత ఉపదేశం అనే వరాన్ని ప్రసాదించాడు.
భగవంతుని ఆరాధన లేదా భగవంతుని ప్రార్థన అనేది మనస్సులో పవిత్రత, ఏకాగ్రత, భగవత్ భక్తి లేకుండా యథాలాపంగా వేదాలు లేదా ఇతర వేద గ్రంథాల నుండి ఆచారాలు లేదా మంత్రాలు లేదా శ్లోకాలను యాంత్రికంగా పఠించడం కాదు. మన మనస్సును భగవంతునికే అర్పించి, సర్వశ్య శరణాగతి చేస్తూ అనుక్షణం భగవంతుని చింతనలో నిమగ్నమై వుండడం. అటువంటి భగవత్ భక్తులకు మాత్రమే అనుపలభ్యమైన భగవత్ కృప లభిస్తుంది. అట్టి కృప అర్జునుడికి లభించడం వెనుక అంతరార్థం అర్జునుడు తన పూర్వపు జన్మలలో చేసుకున్న భగవత్ ఆరాధన మాత్రమే. నిజానికి భగవంతునికి పేరు లేదా రూపం లేదు. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు, ఈ సృష్టికి ఆది, అంతము కూడా ఆయనే. అయితే, నిరాకార, గుణ రహిత భగవంతుడిని పూజించడం అంత సులభం కాదు. భక్తిని, ఏకాగ్రతను పెంపొందించుకోవాలంటే ఏదో ఒక రూపంలో భగవంతుని ఆశ్రయించాలి. ప్రతి భక్తునికి తనకు నచ్చిన దైవత్వాన్ని ఆరాధించే హక్కు ఉంది. ఇది ఇష్ట-దేవతా ఉపాసన. అయితే రూపం ఏదైనా కావచ్చు, కావలసిందల్లా భగవంతుని పట్ల ఏకాగ్రత, చిత్తశుద్ధి, ప్రగాఢమైన విశ్వాసం, భక్తి, ప్రేమలు. నిరంతరం ధ్యానం చేయడం మరియు అతని ఇష్టదేవతను స్మరించుకోవడం ద్వారా, భక్తుడు భగవంతునితో ఐక్యం అవుతాడు. పూజలను ఆడంబరంగా చేయడం, ఏ సమయంలోనైనా వాడిపోయే మరియు వాడిపోయే పువ్వులను సేకరించడానికి మీరు మీ సమయాన్ని వృథా చేయనవసరం లేదు. మీ హృదయపు పువ్వు శాశ్వతమైనది, ఎప్పుడూ తాజాది మరియు సువాసనగా ఉంటుంది, దీని కోసం మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరం లేదు. అదే నిజమైన పుష్పం. ఈ పుష్పం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి అత్యున్నత జ్ఞానం కలిగి ఉంటాడు అని అమృతానందమయి అమ్మవారు పూజను చేయాల్సిన విధానాన్ని అత్యద్భుతంగా తెలిపారు. జీవితంలోని ఒడిదుడుకులన్నిటిలోనూ శాంతియుతంగా ఉండాలి. అప్పుడే దైవానుగ్రహం లభిస్తుంది. రామదాసు, త్యాగరాజు, తుకారాం, ద్రౌపది వంటి గొప్ప భక్తులు ఎన్నో కష్టాలు పడ్డారన్న విషయం మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది. వారు అన్ని బాధలను సహనంతో భరించారు. ఆత్మశాంతి లేకుండా ఆనందాన్ని పొందలేరని త్యాగరాజు అన్నారు. మనిషికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలలో శాంతి అవసరం. ఈ శాంతి ద్వారానే భక్తుడు అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చు. జీవితంలోని ఒడిదుడుకులన్నిటిలోనూ శాంతియుతంగా ఉండాలి. అప్పుడే దైవానుగ్రహం లభిస్తుంది. ఇతరుల పట్ల మనం చూపే కరుణ మరియు చిరునవ్వు భగవంతుని పట్ల మనకున్న ప్రేమను, భక్తిని కూడా తెలియజేస్తుంది. మనము భక్తితో మన హృదయాలను భగవంతునికి తెరిచినప్పుడు భగవంతుని పట్ల ప్రేమ ఆకస్మికంగా జరుగుతాయి. అప్పుడు మనం ఎవరిపైనా కోపంగానూ, ప్రేమించకుండానూ ఉండము. అందరినీ సమానంగా చూడగలం.