[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘కాశ్మీరు లోయలోని వృక్ష జాతులు 2 – దేవదారు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
[dropcap]దే[/dropcap]వదారు వృక్షాన్ని దేవతల వృక్షంగా భావిస్తారు. ఈ వృక్షం పుష్పించే మొక్కలకు చెందినది. ‘దేవదారు’ అనే పదానికి దేవతల కలప అని అర్థం. ఈ చెట్లు ఎక్కువగా పర్వత ప్రాంతాలలో, కాశ్మీరు ప్రాంతంలో పెరుగుతాయి. దేవదారు వృక్షాలకు కాయలు, పండ్లు లేకుండా విత్తనాలు మాత్రమే కాస్తాయి. ఈ చెట్టు ‘జిమ్నో స్పెర్మ్స్’ లోని పైనోఫైటా విభాగానికి చెందిన పైన్ బాతుల లోని మొక్క. దీని శాస్త్రీయ నామం ‘సెడ్రస్ డియోడరా’.
చల్లని ప్రదేశాలలో పెరిగే మహావృక్షం. అరణ్యాలలోనే పెరుగుతుంది. ఈ వృక్షానికి ఔషధ లక్షణాలు కూడా ఉన్నాయి. దీని ఆకుల నుంచి వచ్చే నూనెకు కంటి, మెదడుకు సంబంధించిన సమస్యల్ని తగ్గించే గుణమున్నదని నమ్ముతారు. ఈ చెట్టు మాను నుంచి తీసిన నూనెలతో పూర్వకాలంలో స్నానానికి ఉపయోగించేవారు. హిమాలయాల్లో ఎక్కువగా పెరగటం వలన దీనికి దైవత్వం ఆపాదించబడింది. వినాయక చవితి పత్రిలోని 21 రకాల ఆకులలో ఇది పదమాడవ ఆకు. ఎప్పుడూ ఆకుపచ్చ రంగులో ఆకులు పెద్దవిగా ఉంటాయి. ఆకుల చివర సూది మొనలతో ఉంటుంది వీటి ఆకులకు సువాసన ఉండటం వలన సుగంధ భరితంగా ఉంటుంది. ఈ చెట్లు ఆకులు, పువ్వులు కూడా ఔషధ లక్షణాలు కలవి. ఈ ఆకులతో కాచిన తైలాలు సైతం కళ్ళకు చలవదనాన్ని కలగజేస్తాయి. ఈ చెట్టును ఔషధ మొక్కగానే గుర్తించవచ్చు. ఈ చెట్టు ఆకులను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. చర్మ వ్యాదుల్ని నయం చేయడానికి, చిన్న చిన్న దెబ్బలు నయం చేయడానికి దేవదారు చెట్టు ఆకులు ఉపయోగపడటాయి.
లోయల్లో పెరిగే అతి పొడవైన చెట్లులలో ఇదొకటి. ఇది సాధారణంగా 130 నుంచి 164 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. ఒక్కోసారి అనూహ్యంగా 197 అడుగుల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది. ఇంత పొడవైన చెట్టుకు కాండం ఎంత వెడల్పు ఉండవచ్చనుకుంటున్నారు. పది అడుగుల వరకు ఉంటుంది. ఎంత లావైన కాండం కదా! ఈ చెట్లును ‘సంతత హరిత కుంబాకార చెట్లు’ అంటారు. ఈ చెట్టు ఆకారం శంఖాన్ని పోలి ఉండటం వల్ల వీటికా పేరు వచ్చింది. ఆకులు కూడా సూదిలాగా ఉంటాయి. ఆకులు పొడవుగా సన్నగా ఒకటి లేదా రెండు అంగుళాల పొడవు ఉంటాయి. ఒక మిల్లీమీటర్ మందంతో ఉంటాయి. ఒక్కోసారి ఆకులు మూడు అంగుళాల వరకు పెరగవచ్చు. ఆకులు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తర్వాత గ్లాకాస్ నీలంగా మారి, ఆ తర్వాత ఆకుపచ్చరంగుకు మారుతూ ఊటాయి. ఈ చెట్లలో గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. చెట్లు మీద ఆడ శంకువులు, పురుష శంకువులు విడివిడిగా ఉంటాయి. పురుష శంకువులు ఒకటిన్నర అంగుళాలు పొడవుతో ఉంటాయి. ఆడ శంకువులు బారెల్ ఆకారంలో ఉండి రెండున్నర అంగుళాల పొడవుతో ఉడుంటాయి. పరి పక్వం చెందాక రెక్కల విత్తనాలు వెదజల్ల బడుతాయి.
కాశ్మీరు లోయల్లో ఈ చెట్లను చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. హిమాలయాల్లోని దేవదారు వృక్షాలతో నేను పిల్లల కోసం ఛార్టులు చేశాను. నేను పైన్ చెట్ల శంకుల్ని సేకరించి తెర్చుకున్నాను. వాటిలో దేవదారు శంకులు కూడా ఉండవచ్చు. కానీ స్పష్టంగా దేవదారు చెట్టు కింద శంకుల్ని ఏరి తెచ్చుకోలేదు. ఈసారి కాశ్మీర్ వెళ్ళినప్పుడు తప్పక ప్రయత్నిస్తాను. వీటి బెరడు పొలుసులుగా ఉటుంది. కాండం బలంగా ఉంటుంది. దేవదారు కాండాలకు తెగులు, చెదలు పట్టే అవకాశం చాలా చాలా తక్కువ. అందువలననే ముఖ్యమైన మత పరమైన దేవాలయాలు, చర్చీలు, మసీదును దేవదారు కలపతో నిర్మించేవారు. దీనికి ఉదాహరణగా మేము శ్రీనగర్ లోని ఒక మసీదును దర్శించినప్పుడు తెలిసింది.
శ్రీనగర్ లోని పురాతన నగరంలో ఒక అద్భుతమైన శిల్పసంపద కలిగిన మసీదును దర్శించాం. మసీదు మొక్క ప్రధాన మందిరం దాదాపు 200 అడుగల ఎత్తులో ఉన్నది. ఈ మందిరం మధ్యలో పొడవైన నాలుగు స్తంభాలను నిలబెట్టారు. ఎక్కడా ఈ కత్తిరించి అతికింపు లేని ఒకే పొడవు కలిగిన దేవదారు కాండాలతో ఈ మసీదును కట్టారని అక్కడి వారు చెప్పారు. అద్బుతంగా అనిపించింది. దేవదారు కాండాలను పాలిష్ చేసే కొలదీ అత్యంత నునుపు తేలుతుందట. మేము వాటిని చూసినపుడు అద్భుతం అనిపించింది. ప్రత్యక్షంగా దేవదారు చెట్టు కింద నిలబడి ఫోటో తీసుకోవడం సాధ్యం కాలేదు కాని దేవదారు కలపతో తయారైన మసీదులో కలప స్తంభాల పక్కన నిలబడి ఫోటో తీసుకున్నాను. శ్రీనగర్ మొత్తాన్ని పర్యటించినపుడు ఎక్కువగా కలప దుకాణాలు కనిపించాయి.
శ్రీనగర్‌లో ఉండే అనేక హౌస్ బోట్లు నిర్మానానికి దేవదారు కలపనే ఉపయోగిస్తారు. దేవాలయాల చుట్టూ ఉన్న ల్యాండ్ స్కేపులకూ ఉపయోగిస్తారు. బ్రిటిష్ వారి కాలంలో వంతెనలు, బ్యారెక్‌లు, కాలువలు, రైల్వే కార్ల నిర్మాణానికి దేవదారు కలపను వినియోగించేవారు. దీనికి పెళుసు స్వభావం ఎక్కువ. పాకిస్తాన్ భారత్ లలో ఎక్కువగా దీని కలపను వినియోగిస్తారు.
అనేక హిందూ పురాణాలలో దేవదారు వృక్షం యొక్క ప్రస్తావన చేయబడింది. వాల్మీకి రామాయణంలో కూడా రాముడు సీతను వెతికే సమయంలో దేవదారు వృక్షాల అడవులలో వెతకాలి అనే పద్యం ఉటుంది. ఈ చెట్టు యొక్క గమ్‌తో టిబెట్ నేపాల్ దేశాలలో ధూపం వేస్తారు. ఈ జాతులు ఎక్కువగా ఆఫ్ఘనిస్తున్, నేపాల్, పాకిస్తాన్, నైరుతి టిబెట్, ఉత్తర మధ్య భారత దేశంలో ఎక్కువగా పెరుగుతాయి. ఇది పాకిస్తాన్ దేశం యెక్క జాతీయ వృక్షం. అంతేకాక హిమచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర చెట్టు కూడా.
దేవదారు చెక్కలో సెడియోడారిన్, సెడ్రిన్, ఆంపెలోప్సివ్, సెర్రినోసైతే వంటి రసాయనాలు ఉంటాయి. అత్యంత చలిని తట్టుకునే చెట్లుగా ఇది పేరు గాంచాయి. కాశ్మీర్ లోని పాలిదూర్ గార్పెన్స్ లోని దేవదారు వృక్షాల నుండి విత్తనాలను సేకరించి వాణిజ్యం చేస్తున్నారు. పార్కులలో, ఉధ్యానవనాలలో ఎక్కవగా అలంకారం కోసం, ఆకుల కోసం ఈ దేవదారు వృక్షాలను పండిస్తారు. సెడార్ ఆయిల్‌ను ఆరోమాథెరపీలో ఉపయోగిస్తారు. ఈ నూనెలతో సబ్బులు, పరిమల ద్రవ్యాలు, ఫ్లోర్ పాలిష్ లలో వాడుతారు. అంతే కాకుండా క్రిమి సంహారక మందులలో సైతం ఉపయోగిస్తారు. వస్తువులను నిలవ ఉంచే గోడౌన్ల లోనూ పుయోగిస్తారు. ఇవీ నేను కాశ్మీర్‌లో చూసిన దేవదారు వృక్షాల విశేషాలు.