అక్షరాల్లో ఒదిగిన ఓ విశిష్ట వ్యక్తి జీవితం

2
3

[శ్రీ రాథోడ్ శ్రావణ్ రచించిన ‘బంజారా భీష్మ అమర్ సింగ్ తిలావత్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]వృ[/dropcap]త్తిపరంగా హిందీ లెక్చరర్, ప్రవృత్తిపరంగా కవి, వ్యాసకర్త అయిన శ్రీ రాథోడ్ శ్రావణ్ తమ సమూహానికి చెందిన ఎందరో గొప్ప వ్యక్తులపై వ్యాసాలు రాశారు. బంజారాల విద్య కోసం పాటుపడిన స్వర్గీయ బానోత్ జాలం సింగ్ గారి గురించి ఓ పుస్తకం రాశారు. తెలంగాణాలో లంబాడీలకు రిజర్వేషన్ సాధించిపెట్టడంలో కృషిచేసిన వారిలో ప్రముఖులు, మాజీ పర్యాటక మంత్రి అయిన శ్రీ అమర్ సింగ్ తిలావత్ జీవితం గ్రంథస్థం చేయాలనే ఆలోచన కలిగి, ‘బంజారా భీష్మ అమర్ సింగ్ తిలావత్’ అనే పుస్తకాన్ని వెలువరించారు

ఈ పుస్తకంలో అమర్ సింగ్ తిలావత్ గారి జీవితాన్ని పాఠకుల కళ్ళ ముందు ఉంచారు రచయిత.

‘బాల్యం – విద్యాభ్యాసం’ అనే అధ్యాయంలో అమర్ సింగ్ గారు చదువుకి వాళ్ళ తాతగారు గోప్య నాయక్ ఏ విధంగా పునాది వేశారో తెలిపారు రచయిత. అమర్ సింగ్ చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ పాఠశాల చదువునూ, ఇంటర్మీడియట్ చదువునూ పూర్తి చేశారు. 1969లో తెలంగాణా ఉద్యమం తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నారు. చదువుకు మధ్యలో విరామం రావడంతో, గిరిజన కోఆరేటివ్ సొసైటీలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అనంతరం చదువు కొనసాగించి, బైపిసి పూర్తి చేసి, ఎంసెట్ రాసి మంచి ర్యాంకు తెచ్చుకున్నారు కానీ, రిజర్వేషన్ జాబితాలో ఉన్న సమూహానికి చెంది, తన కన్నా తక్కువ మార్కులు వచ్చిన ఓ యువకుడికి సీటు రావటంతో తమ సమూహం కోసం పోరాడవలసిన అవసరం అమర్ సింగ్ గ్రహించారు. తర్వాత డిగ్రీ చేసి, లా చదివి, న్యాయవాదిగా స్థిరపడ్డారు.

‘జీవిత రహస్యాలు’ అనే అధ్యాయంలో, వేంకటరామ్ తిలావత్, రంగీబాయి దంపతులు వివాహమై, 12 ఏళ్ళయినా పిల్లలు పుట్టకపోవడం గురించి, వారు అనుభవించిన మానసిక వేదన గురించి రచయిత తెలియజేశారు. ఓ రోజున అనుకోకుండా తమ ఇంటికి వచ్చిన ఓ సాధువును వేంకటరామ్ తిలావత్ గారి తండ్రి గోప్యా నాయక్ ప్రశ్నించబోగా – ఆ సాధువే “నీ కుమారుడికి సంతానం లేదు కదూ?” అని ప్రశ్నించి, నివారణోపాయం చెప్పడం జరిగింది. ఆ సాధువు సూచన మేరకు శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి వ్రతం చేసుకుంటారా దంపతులు. కాలక్రమంలో వారికి 29 జనవరి 1953 నాడు అమర్ సింగ్ తిలావత్ జన్మించారు. వీరి జననం తర్వాత వారి ఇంట్లో జరిగిన కొన్ని అద్భుతాలను రచయిత ఈ అధ్యాయంలో వివరించారు.

అమర్ సింగ్ తిలావత్ గారి కుటుంబం గురించి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళ గురించి ‘జననం-కుటుంబం’ అన్న అధ్యాయంలో తెలుసుకోవచ్చు. వారిది వ్యవసాయం, పశుపోషణ వృత్తులుగా కుటుంబం. అమర్ సింగ్ తిలావత్ పట్టుదల ఎలా ఉంటుందో రచయిత తెలిపిన ఒక ఉదాహరణ పాఠకులను ఆశ్చర్యపరుస్తుంది. అప్పటి గ్రామీణ జీవనానికీ, ఇప్పటి గ్రామీణ జీవనానికీ ఉన్న వ్యత్యాసాలను, మనుషుల స్వభావాలలో వచ్చిన ప్రధానమైన మార్పులను ఈ అధ్యాయంలో క్లుఫ్తంగా వివరించారు రచయిత.

అమర్ సింగ్ గారి వివాహం, సంతానం గురించి ‘వైవాహిక జీవితం’ ఆధ్యాయంలో తెలిపారు రచయిత. అమర్ సింగ్ గారి పెళ్ళిచూపుల ఉదంతం, పదో తరగతి వరకు చదువుకున్న భార్య లక్ష్మిగారికి ఇంగ్లీషు నేర్పాలన్న అమర్ సింగ్ గారి ప్రయత్నం గురించి, గృహ నిర్వహణలో ఆమె సామర్థ్యం గురించి, వారి ఇద్దరి కుమారుల గురించి ఈ అధ్యాయం వెల్లడిస్తుంది.

అమర్ సింగ్ గారి రాజకీయ రంగ ప్రవేశం, తమ జాతి ఉద్ధరణ కోసం వారు చేసిన కృషిని ‘రాజకీయాలు’ అనే అధ్యాయంలో వివరించారు రచయిత. రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే 1971లో బంజారాలకు రిజర్వేషన్ కోసం జరిపిన ఉద్యమం కోసం ‘ఆంధ్రప్రదేశ్ బంజారా యూత్ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ’ని స్థాపించడంలో అమర్ సింగ్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ ఉద్యమంలో వీరు చేసిన కృషి ఫలించి, 1976లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించేలా పార్లమెంటులో చట్టం చేశారు. ఈ పోరాట క్రమంలో అమర్ సింగ్‍ ఎందరో రాష్ట్ర, జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారు. బంజారా సమూహపు నేతగా ఎదిగి 1978లో రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో బోధ్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్.ఎల్.ఎ.గా ఎన్నికయ్యారు. వీరి సమర్థతని గుర్తించిన ప్రభుత్వాలు టిటిడి బోర్డు సభ్యునిగా, గవర్నమెంట్ విప్‍గా నియమించాయి. అనంతరం 1982లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు అమర్ సింగ్.

అధికార భాషా సంఘం సభ్యుడిగా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా విశిష్టమైన సేవలందించిన అమర్ సింగ్‌కు అనేక భాషలపై పట్టు ఉందని, తెలుగు, హిందీ, ఆంగ్లం, మరాఠీ భాషలలో అనర్గళంగా ఉపన్యసించగలరని తెలియజేశారు రచయిత.

ఎమ్.ఎల్.ఎ.గా ఉన్నప్పుడు తన నియోజక వర్గంలోని ఓ రోడ్డు మార్గం విషయంలో ఎదురైన ఓ సంఘటన – అమర్ సింగ్ గారిని ‘లా’ చదివి న్యాయవాదిగా మారేందుకు దోహదపడింది. ఆ సంఘటన ఏమిటో, న్యాయవాదిగా ఆయన సాధించిన విజయాలను ‘నోటరీ అడ్వకేట్’ అన్న అధ్యాయంలో తెలుసుకోవచ్చు.

రవీంద్ర నాయక్ గారితో అమర్ సింగ్ గారికి ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి వారిరువురూ తమ సమూహానికి సేవలందించేందుకు ఎలా ప్రేరణ అయిందో వివరించారు రచయిత. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన తొలిదశ, మలిదశ ఉద్యమాలలో అమర్ సింగ్ గారికి కృషిని ‘తెలంగాణ ఉద్యమం’ అన్న అధ్యాయంలో చదవవచ్చు.

ఆంధ్రా ప్రాంతంలో ఎస్.టి.లుగా ఉన్న బంజారాలను తెలంగాణ ప్రాంతంలో డి.ఎన్.టి.లుగా గుర్తించడంతో, విద్య ఉద్యోగ అవకాశాల్లో అసమానతలు పెరిగిపోయాయి. దాంతో అమర్ సింగ్, రవీంద్ర నాయక్ తదితరులు ఎన్నో పోరాటాలు చేసి బంజారాలను తెలంగాణ ప్రాంతంలో ఎస్.టి. జాబితాలో చేర్పించగలిగారు. అత్యంత స్ఫూర్తిదాయకం వీరి పోరాటం.

ఎస్.టి. రిజర్వేషన్ కోసం సాగిన బంజరాల ఉద్యమాన్ని, నేతల పోరాటాన్ని ‘ప్రాంతీయ విభేదాలు’ అనే అధ్యాయంలో అక్షరబద్ధం చేశారు రచయిత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 జనగణనను అనుసరించి పది శాతం రిజర్వేషన్ పెంపుదల కోసం సాగిన న్యాయపోరాటాన్ని వివరించారు రచయిత. దాదాపు ఎనిమిదేళ్ళ పాటు సాగిన పోరాట ఫలితంగా 2022లో విద్యా ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గిరిజనులకు రిజర్వేషన్‍ని పదిశాతానికి పెంచింది ప్రభుత్వం.

అఖిల భారతీయ బంజారా సంఘంలో అమర్ సింగ్ గారు పోషించిన కీలకపాత్రని ఓ అధ్యాయంలో తెలిపారు రచయిత. తమ సమూహం ఉద్ధరణకై ఈ సంఘం చేసిన పోరాటాలను, నిర్వహించిన సమావేశాలను చేసిన తీర్మానాలను సవివరంగా తెలిపారు రచయిత. మరో అధ్యాయంలో బంజారాల భాష అయిన ‘గోర్‌బోలీ’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‍లో చేర్పించేందుకు అమర్ సింగ్ గారు చేసిన ప్రయత్నాలను తెలిపారు. గోర్‍బోలీ భాషకు లిపిగా దేవనాగరిని ఎంచుకున్న వైనాన్ని వివరించారు.

బంజారా జాతి మహాపురుషుల్లో ఒకరైన బాబా లక్కీషా బంజారా జీవితాన్ని, చరిత్రని – అమర్ సింగ్ గారు వెలుగులోకి తెచ్చిన విధానం గురించి, తెలంగాణాలో బంజారాలను ఎస్.టి. జాబితాలో చేర్చేందుకు కృషి చేసిన ప్రముఖుల గురించి రచయిత తెలియజేశారు. అమర్ సింగ్ తిలావత్ గారి వ్యక్తిగత వివరాలను అందజేశారు, ఆయన జీవన క్రమాన్ని వివరించారు.

చివరగా పలు జీవోలు, రిజర్వేషన్ సాధన చట్టాల ప్రతులు కమిటీల సభ్యుల వివరాలు అందించారు. అమర్ సింగ్ గారి సుదీర్ఘ ప్రస్థానంలో – ప్రముఖులతో ఆయన దిగిన ఫోటోలను చేర్చారు.

ఈ విశిష్ట వ్యక్తి సఫల జీవితం ఎందరికో ప్రేరణగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

***

బంజారా భీష్మ అమర్ సింగ్ తిలావత్ (బయోగ్రఫీ)
రచన: రాథోడ్ శ్రావణ్
ప్రచురణ: శ్రీ యజ్ఞ పబ్లికేషన్స్, హైదరాబాద్
పుటలు: 150
వెల: ₹ 200/-
ప్రతులకు:
శ్రీ యజ్ఞ పబ్లికేషన్స్,
2-2-1144//11/5,
శ్రీ సాయికృష్ణ నిలయం అపార్ట్‌మెంట్,
న్యూ నల్లకుంట,
హైదరాబాద్-44. ఫోన్: 8247543551

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here