కలవల కబుర్లు-47

0
3

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]వి[/dropcap]వాహాలు దివిలో నిర్ణయించబడతాయి. భువిలో జరుగుతాయి.

ఆ నిర్ణయాలూ.. జరగడాల గురించి కాదు కానీ, వాటి నిర్వహణ భారాల గురించి చెప్పుకుందాం.

ఫస్ట్ పెళ్ళి కుదరడం దగ్గర నుంచి మాట్లాడుకుందామా? మామూలుగా ఏ దగ్గర బంధువులో, తెలిసినవారో, స్నేహితులో ఈ పెళ్ళి కుదర్చడం అనేది తలపెట్టుకుంటారు. అదైతే ఫర్వాలేదు.. మనవాళ్ళే కదా.. మన కోసమే చెపుతారన్నమాట. అది కాకుండా ఇదివరలో అయితే డబ్బు తీసుకుని పెళ్ళిళ్ళు కుదిర్చే పెళ్ళిళ్ళ పేరయ్యలూ, ఇప్పటి రోజుల్లో రకరకాల మేట్రిమోనియల్సూ కుప్పలు తెప్పలన్నమాట. ఇవన్నీ సగం పైగా ‘వెయ్యి అబద్ధాలు ఆడైనా పెళ్ళి కుదరాలి’ అనే సిద్ధాంతం మీదనే వుంటూంటాయనుకోండి. అయినా మన వాకబులు, మన ఎంక్వయిరీలు, మనకుంటాయనుకోండి. ఇక్కడ మొదలు ఓం ప్రథమం.. మన ఖర్చు మొదలన్నమాట. మనకి ఇచ్చే వివరాలని బట్టి మనం ఇచ్చుకునే ఫీజు వుంటుంది. అలా మనకి సరిపడా సంబంధం దొరికే వరకూ వారికీ మనకీ సంబంధం కొనసాగుతుంది. ఒకవేళ వీళ్ళతో పని కాకపోతే ఇలాంటిదే మరోటి. ఏ రాయైతేనేం పళ్ళూడడానికీ.. పెళ్లి కుదరడానికీ..

అలా ఎవరి అదృష్టం మేర వారికి, ఒకటి రెండు మేచ్‌లు చూడగానే కొందరికి కుదిరితే.. అక్కడే ఓ లకారమైనా వదలకొట్టుకుని మరి కొందరికి పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఆ కుదరడాలలో వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్, జాతకాలు కుదరడాలు వంటివి తర్వాత మాట్లాడుకుందాం.

పెళ్ళిచూపులు సంగతికి వస్తే.. పాతకాలపు పద్ధతులు చాలా వరకూ మారపోయాయిలెండి. ఇవన్నీ దాటుకుని వచ్చి.. ఎంగేజ్మెంట్ దగ్గరకి వచ్చేసరికి అసలు ప్రహసనం మొదలవుతుందన్నామాట. ఈ తాంబూలాలు మార్చుకోవడమనే ప్రక్రియే చిన్న సైజు వివాహ తంతులా వుంటోంది. ‘తాంబూలాలు ఇచ్చేసా ఇక తన్నుకు చావండి’ అన్న చందాన.. ఇక ఆరోజు మొదలు.. ఇరువైపులా కూడా.. ధారాపాతంగా అయే డబ్బు ఖర్చు చూసుకుని తన్నుకు చావాల్సిందే..

ఓ పెద్ద హోటల్ లో ఫంక్షన్ హాలు మినిమమ్ రోజుకి లక్ష తక్కువుండదు. రకరకాల పేర్ల తెలీని వంటకాలు ఒకొక్క ప్లేటూ వెయ్యి రూపాయలు కూడా వుంటున్నాయి. అందులో తినేది తక్కువ, వదిలేసేది ఎక్కువ. ఈ ఖర్చు వచ్చి తినేవారి సంఖ్య మీద వుంటుంది అనుకోండి. అయినా అధమ పక్షం వందమందికి తక్కువేం వుండరునుకుంటున్నాను.

డెకరేషన్ విషయానికి వస్తే.. మయసభని తలపించేలా వుంటోంది. ఎవరికి వారే.. ఎవరూ చేసుకున్నట్లు వుండకూడదు.. తమదే ప్రత్యేకంగా వుండాలి అంటూ లక్షల లక్షల రూపాయలు ఈ డెకరేషన్‌కి ఖర్చు పెడుతున్నారు. ఒక్క రోజులో వాడిపోయే పూవుల అలంకరణలు.. ఎన్ని డబ్బులని ఇలా వాడి, వాడిపోతున్నాయో కదా! ఇలా ఫంక్షన్ అయిపోగానే అలా పీకి ఆవలకి గిరాటు కొట్టడం.. ఆ పూలకే మనసుంటే ఎంత బాధ పడతాయో కదూ? ఇక బట్టల విషయానికి వస్తే..  అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ అధమ పక్షం రెండు మూడు డ్రస్సులైనా మార్చాలీ.. ఇద్దరివీ మేచింగులుండాలీ.. ఫోటోలలో బాగా కనపడాలీ.. జిగేల్ జిగేల్ మనిపించేలా వర్క్ చేయించుకున్న జాకెట్లు.. ఒకొక్కదానికీ పెట్టే ఖర్చుతో ఒక బీద కుటుంబం నెలవారీ తిండి ఖర్చు అయిపోయేలా వుంటుందనడంలో సందేహం లేదు.

ఇక ఫోటోగ్రాఫర్లూ, వీడియోగ్రాఫర్లూ.. వీళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. పురోహితుడు లేకపోయినా ఫంక్షన్ జరిగిపోతుందేమో కానీ.. వీళ్ళు లేనిదే ఏ ఫంక్షన్ కూడా జరగదు అనడంలో నూటికి నూరు పాళ్ళు నిజమే వుంది. అసలు తంతు జరగనీకుండా.. కెమెరాలతో వాళ్ళే చుట్టుముట్టేస్తారు. రకరకాల ఫోజులు పెట్టిస్తూ..  అమ్మాయి అబ్బాయిలతో చెడుగుడు ఆడిస్తూంటారు. ఈ ఫోటోగ్రాఫర్ల మీద పెట్టే ఖర్చు.. మొత్తం పెళ్ళి ఖర్చులో పావువంతు పైగానే వుంటుంది. ఇక అమ్మాయి అబ్బాయిల స్నేహితులు చేసే కోలాహలం అంతా ఇంతా కాదు. కేకులు కట్ చేయించడం, ఆటలూ పాటలూ ఒకటి కాదు.. వీటి కోసం అదనపు భారం.

రిటర్న్ గిఫ్ట్‌లు తమ తాహతు చూపించుకునేలా వుంటాయి. వాటి ఖరీదులు, మళ్లీ అందమైన పేకింగులూ ఇదో తడిసి మోపెడూ. మళ్లీ పెళ్లిలో ఇచ్చే బహుమతులూ ఇవీ ఒకటి కాదు. అప్పుడు మళ్ళీ వేరే వుంటాయిగా!  ఇలా ఎంగేజ్మెంట్ కోసం చేసే ఆర్భాటం, డబ్బు ఖర్చు లెక్క చూసుకుంటే సగం పెళ్లి అయిపోయినట్టే అనిపిస్తుంది.

ఎంగేజ్మెంట్, తాంబూలాలు పుచ్చుకోవడం అంటే అటువేపు పెద్దలూ, ఇటువేపు పెద్దవారూ కూర్చుని, ఇరుగు పొరుగులనో, బంధుగణాలలో పెద్దవారినో, పక్కన కూర్చోపెట్టుకుని, ఇరువైపులా నచ్చిన తేదీన పెళ్లి ఖాయం చేసుకుని, ఖరారు అయినట్లు ఒకరికొకరు తాంబూలం ఇచ్చి పుచ్చుకోవడం.. బట్టలు పెట్టుకోవటం.. ఆనవాయితీ, వుంటే ఏదైనా నగ ఇచ్చి పిల్ల మాది అనిపించుకోవడం, ఫలానా శుభ ముహూర్తాన పెళ్ళి నిశ్చయం చేసుకుని, బ్రాహ్మణునితో లగ్న పత్రిక రాయించుకోవడం వరకూ వుండేది. ఇప్పట్లా ఇంతింత వేడుకలు మచ్చుకైనా కానవచ్చేవి కావు. ఇంతింత ఖర్చులూ వుండేవి కావు.

వచ్చే వారం మరి కాసివి కబుర్లు చెప్పుకుందాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here