మరుగునపడ్డ మాణిక్యాలు – 73: వధ్

0
3

[సంచిక పాఠకుల కోసం ‘వధ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]దు[/dropcap]ర్మార్గులకు శిక్ష పడాలంటే పాపం పండాలంటారు. దుర్మార్గం హద్దు దాటితే? పాపం పండటానికి అదొక చిహ్నం. అప్పుడు దైవం ఎవరో ఒకరిని నిమిత్తమాత్రులని చేసుకుని శిక్ష వేస్తుంది. ఆ నిమిత్తమాత్రుడు సామాన్య పౌరుడే కావచ్చు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సామాన్య పౌరులని ప్రభుత్వం వదిలేయదు కదా? మరి దైవసంకల్పం వ్యర్థమేనా? ఈ ఇతివృత్తంతో వచ్చిన హిందీ చిత్రం ‘వధ్’ (2022). ఎవరినైనా స్వార్థం కోసం చంపితే అది హత్య. సమాజహితం కోసం చంపితే అది వధ. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

శంభునాథ్ మిశ్రా, మంజు మిశ్రా వృద్ధ దంపతులు. కొడుకు చదువు కోసం పాండే అనే వడ్డీ వ్యాపారి దగ్గర బోలెడు అప్పు చేశారు. కొడుకు అమెరికా ఎగిరిపోయాడు. పెళ్ళి చేసుకున్నాడు. ఒక కూతురు కూడా పుట్టింది. తలిదండ్రులని పట్టించుకోడు. శంభునాథ్‌కి ఇల్లు ఒకటే ఆస్తి. టీచరుగా పని చేసి రెటైర్ అయ్యాడు. పెన్షన్ వస్తుంది. పిల్లలకి పాఠాలు చెబుతాడు. మంజుకి దైవభక్తి ఎక్కువ. ఆ దంపతుల భయమంతా పాండే అప్పు ఎలా తీర్చాలనే. బాకీ పది లక్షలు. పాండేది చిన్నవయసే. కానీ దుర్మార్గుడు. శంభునాథ్ ఇంటికి ఒక యువతితో వచ్చి పడగ్గది వాడుకుంటూ ఉంటాడు. దంపతులిద్దరూ ఏం చేయలేక మౌనంగా భరిస్తారు. పాండే ఆ ప్రాంత ఎమ్మెల్యేకి అనుచరుడు. పాండేకి కూడా ఒక మొగుడున్నాడు. అతను ఇన్‌స్పెక్టర్ శక్తి సింగ్. ఎమ్మెల్యే చేయించే అక్రమాలని చూసీ చూడనట్టు వదిలేయటానికి శక్తి సింగ్ పాండే దగ్గర లంచాలు తీసుకుంటూ ఉంటాడు. శక్తి సింగ్ ఎక్కువ లంచం అడుగుతూ ఉండటంతో ఎమ్మెల్యే అతని సంగతి చూడమని పాండేకి చెబుతాడు. పాండే తానొక పథకం వేశానని ఎమ్మెల్యేకి చెబుతాడు.

శంభునాథ్ దగ్గరకి నైనా అనే పన్నెండేళ్ళు అమ్మాయి చదువుకోవటానికి వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిది నిరుపేద కుటుంబం. దంపతులిద్దరికీ ఆ అమ్మాయి అంటే అమితమైన ప్రేమ. “అమ్మాయిల తీరే వేరు” అంటాడు శంభునాథ్. అమ్మాయిలైతే తలిదండ్రుల బాగోగులు పట్టించుకుంటారని అతని భావన. మంజుకి కీళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. ఎన్ని కష్టాలు ఉన్నా ఆమె శంభునాథ్ కంటే ధైర్యంగా ఉంటుంది. కొడుకు మీద ఆమెకి నమ్మకం. అంతకంటే దేవుడి మీద నమ్మకం. “అబ్బాయితో మాట్లాడండి” అని చెబుతూనే ఉంటుంది. శంభునాథ్ అప్పు సంగతి ఎత్తుదామనుకుంటాడు కానీ కొడుకు ఎప్పుడూ బిజీగా ఉంటాడు. మాట వినిపించుకోకుండా “ఐదు వేలు అకౌంట్లో వేస్తాను” అని ఫోన్ పెట్టేస్తాడొకసారి. అతని ఉద్దేశంలో అంతవరకే అతని బాధ్యత.

ఒకరోజు పాండే బజార్లో ఆగిపోయిన తన కారుని శంభునాథ్‌తో తోయించి అవమానిస్తాడు. అక్కడికి వచ్చిన శక్తి సింగ్ పాండేని తిట్టి “రండి మాస్టారూ” అని శంభునాథ్‌ని అక్కడి నుంచి తీసుకువెళతాడు. తర్వాత పాండే ఒక వ్యక్తిని శంభునాథ్ ఇంటికి తీసుకువచ్చి ఇల్లు అతనికి అమ్మేస్తానని, ఇల్లు ఖాళీ చేయమని అంటాడు. నైనా అక్కడే చదువుకుంటూ ఉంటుంది. పాండే నైనాని వంకరగా చూడటం గమనిస్తాడు శంభునాథ్. ఇక భరించలేక పోలీస్ స్టేషన్‌కి వెళతాడు. ఫిర్యాదు చేద్దామని శక్తి సింగ్ గదిలోకి వెళతాడు. అక్కడ శక్తి సింగ్ ఎదురుగా పాండే ఉంటాడు. “ఫిర్యాదు చేయటానికి వచ్చావా? చెయ్యి” అని వెళ్ళిపోతాడు పాండే. శంభునాథ్ ఫిర్యాదు చెయ్యబోతే “అప్పు చేశారుగా? మీ ఇంటికి వచ్చాడంటే రాడా? ఏదో ఒకటి చేసి అప్పు తీర్చేయండి” అంటాడు శక్తి సింగ్. అంటే పాండే శక్తి సింగ్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నమాట. పాండే ఎమ్మెల్యేకి చెప్పిన పథకం అదే. శంభునాథ్ హతాశుడై ఇంటికి వచ్చేస్తాడు.

ఆ రోజు రాత్రి పాండే శంభునాథ్ ఇంటికి వస్తాడు. మంజు గుడిలో భజనకి వెళ్ళింది. పాండే “నా మీద ఫిర్యాదు చేస్తావా?” అని శంభునాథ్‌ని కొడతాడు. తర్వాత అతన్ని కూర్చోబెట్టి “నాలుగు నెలల వడ్డీ రద్దు చేస్తాను. అసలు నుంచి ఓ లక్షన్నర మినహాయిస్తాను. ఇల్లు అమ్ముడుపోయాక ఓ నాలుగు లక్షలు కూడా ఇస్తాను. ఒక్క పని మాత్రం చెయ్యి. వెళ్ళి నైనాని తీసుకురా” అంటాడు. శంభునాథ్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. తలుపు తీసుకుని వెళుతున్నవాడిని పాండే వెనక్కి పిలిచి మందులోకి మిక్స్చర్ తెమ్మంటాడు. శంభునాథ్ ఇంట్లో ఉన్న మిక్స్చర్ తెస్తాడు. ఒక పెద్ద స్క్రూడ్రైవర్ కూడా తెస్తాడు. దానితో పాండే గొంతులో పొడుస్తాడు. పాండే చచ్చిపోతాడు. మంజు గుడి నుంచి వచ్చి చూసి నిర్ఘాంతపోతుంది. శంభునాథ్ ఆమెని లోపలికి వెళ్ళమంటాడు. తర్వాత పాండే దేహాన్ని ముక్కముక్కలుగా కోసి గోనె సంచుల్లో పెట్టుకుని వెళ్ళి ఊరవతల కాల్చేస్తాడు. మంజు అతనితో మాట్లాడటం మానేస్తుంది.

శంభునాథ్‌కి పోలీసులు సాయం చేయలేదు. అయినా అతను ఊరుకునేవాడేమో? కానీ పాండే నైనాని తీసుకురమ్మనే సరికి అతనికి సహనం చచ్చిపోయింది. ఏం చేయగలడు? ఇప్పుడు బతిమిలాడి ఒప్పించినా తర్వాత నైనాకి రక్షణ ఉంటుందా? అందుకే పాండేని చంపేశాడు. పన్నెండేళ్ళ పిల్లని కామించేవాడిని చంపటమే కరెక్టేమో. దైవమే శంభునాథ్ చేత ఆ పని చేయించింది. అతను నిమిత్తమాత్రుడు. మరి చిన్నపిల్లలపై అత్యాచారాలు చేసేవాళ్ళనందరినీ దేవుడు ఎందుకు శిక్షించడు? దైవబలం ఉండాలి. మంజు దైవభక్తే శంభునాథ్‌కి శక్తిని ఇచ్చింది. నైనాని కాపాడింది. ఆ సంగతి మంజుకి కూడా అర్థం కాలేదు. మరి ఇప్పుడు చట్టం నుంచి తప్పించుకోవటం ఎలా? ఇక్కడే కథ రసవత్తరంగా మారుతుంది.

పాండే ఫోన్ సిగ్నల్ ఆధారంగా శక్తి సింగ్ విచారణ కోసం శంభునాథ్ ఇంటికి వస్తాడు. శంభునాథ్ తనకేమీ తెలియదంటాడు. శక్తి సింగ్‌తో వచ్చిన కానిస్టేబుల్ అక్కడ కథల పుస్తకాలు చూసి చదివిన తర్వాత తనకి ఇవ్వమని శంభునాథ్ ని అడుగుతాడు. ఆ కానిస్టేబుల్ కి శంభునాథ్ మీద అనుమానమే లేదు. శక్తి సింగ్ శంభునాథ్ ని అతని భార్యని పిలవమంటాడు. ఆమె భయంగా పడగ్గది తలుపు దగ్గరికి వస్తుంది. శక్తి సింగ్ ఆమె వాలకం చూసి జాలి పడి ఏం అడగకుండా వదిలేస్తాడు. తర్వాత పాండే భార్య తన కూతుర్ని తీసుకుని వస్తుంది. “నా భర్త మంచివాడు కాదని తెలుసు. కానీ అతను నా బిడ్డకి తండ్రి. అతను ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పండి” అంటుంది. శంభునాథ్ తనకి తెలియదంటాడు. ఆమె వెళ్ళిపోయాక మంజు “మనం మహాపాపం చేశాం. దేవుడిని నమ్ముకోకుండా ఒక మనిషిని చంపేశాం. ఒక పిల్లకి తండ్రి లేకుండా చేశాం” అని రోదిస్తుంది. ఆమె బాధ చూసి శంభునాథ్ పోలీసులకి లొంగిపోదామని వెళతాడు. శక్తి సింగ్ అక్కడ ఉండకపోవటంతో కానిస్టేబుల్‌తో మాట్లాడతాడు. తానే పాండేని చంపానని చెప్తే ఆ కానిస్టేబుల్ నమ్మడు. శంభునాథ్ ముసలివాడు, పైగా మాస్టారు. కథల పుస్తకాలు బాగా చదవటం వల్ల ఏదో కట్టుకథ చెబుతున్నాడని కానిస్టేబుల్ అనుకుంటాడు. దేవుడి లీల అంటే ఇదే. నిజం చెప్పినా కానిస్టేబుల్ నమ్మలేదు. సమయానికి శక్తి సింగ్ కూడా లేడు. మనలో కల్మషం లేకపోతే పరిస్థితులు మనకి అనుకూలంగా మారిపోతాయి.

శంభునాథ్ ఇంటికి వెళ్ళి మంజుతో మాట్లాడతాడు. “నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాను. నేను పాపం చేశానని వెళ్ళలేదు. నువ్వు నేను పాపం చేశానని అనుకుంటున్నావని వెళ్ళాను” అని ఆమెకి జరిగినదంతా చెబుతాడు. పాండే ఏం అడిగాడో విని మంజుకి కంపరం కలుగుతుంది. శంభునాథ్ “కోపం వచ్చింది కదా? నాకూ కోపం వచ్చింది. అందుకే చంపేశాను. నేను చేసింది హత్య కాదు. రాక్షస వధ. నాకు అదే న్యాయం అనిపించింది. చేశాను” అంటాడు. ఆమె అతన్ని అర్థం చేసుకుంటుంది. శంభునాథ్ మనసు తేలిక పడుతుంది. అయితే కానిస్టేబుల్ శక్తి సింగ్ కి జరిగిన విషయం చెబుతాడు. నేరం ఒప్పుకోవటానికి వచ్చిన మనిషిని వదిలేసినందుకు శక్తి సింగ్ కానిస్టేబుల్ ని చెంప దెబ్బ కొడతాడు. కానిస్టేబుల్ చేత స్టేట్‌మెంట్ రాయించి, శంభునాథ్‌ని పిలిపించి సంతకం చేయమంటాడు. శంభునాథ్ “నేనేం చెప్పలేదు. వీడే కట్టు కథ రాశాడు. నేను హత్య చేశాననటానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? శవముందా? ఆయుధముందా? నా వేలి ముద్రలేమన్నా దొరికాయా? నేను సంతకం చేయను” అంటాడు. కథల పుస్తకాలు చదవటం వల్ల అతనికి పోలీసు వ్యవహారాల మీద అవగాహన వచ్చింది. దాంతో ధైర్యంగా మాట్లాడాడు. శక్తి సింగ్ ఏం చేయలేక అతన్ని వదిలేస్తాడు. ఇక్కడ కథ మరో మలుపు తిరుగుతుంది.

ఈ చిత్రానికి జస్పాల్ సింగ్ సంధూ, రాజీవ్ బరన్వాల్ స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించారు. వారికి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకత్వం (క్రిటిక్స్) అవార్డ్ దక్కింది. జస్పాల్ సింగ్ ఎమ్మెల్యే పాత్ర కూడా వేశాడు. చిత్రంలో మాటలు చాలా బావుంటాయి. ఒక సందర్భంలో శంభునాథ్ “ఒకసారి స్కూల్లో ఒక ఆకతాయి పిల్లాడిని కొట్టాను. మూడు రోజులు నిద్ర పట్టలేదు. పాండేని గొంతులో పొడిచి చంపాను. అయినా నాకేం బాధ లేదు” అంటాడు. దుష్టులని దండించేటపుడు తప్పు చేస్తున్నాననే భావం ఉండాల్సిన అవసరం లేదు. పాండే శక్తి సింగ్‌ని బ్లాక్‌మెయిల్ చేసేటపుడు “మీరు పుణ్యం మూటకట్టుకోండి. మా పాపాల జోలికి రాకండి” అంటాడు. శక్తి సింగ్ పుణ్యం చేస్తే పాండే బ్లాక్‌మెయిల్ ఎలా చేశాడు? పాండే లాంటి వాడి నిఘంటువులో పుణ్యానికి కూడా వేరే అర్థం ఉంటుంది. నైనాని శంభునాథ్ ‘పిల్లి’ అంటూ ఏడిపిస్తాడు. ముచ్చటైన వారి అనుబంధాన్ని హృద్యంగా చూపించారు దర్శకులు. నైనా పుట్టినరోజు తమ ఇంట్లో జరుపుకున్నాక మంజు శంభునాథ్‌తో “నా పుట్టినరోజు ఎప్పుడూ చేయలేదే మీరు” అంటుంది. “తేదీ తెలియదు కదా” అంటాడతను. “ఏదో ఒక తేదీ పెట్టి చేయండి” అంటుందామె. “సరే. ఇక నుంచి నైనాది, నీదీ ఒకే పుట్టినరోజు. ఒకరు చిన్న పిల్లి, ఒకరు పెద్ద పిల్లి” అంటాడతను. ఇలా చిన్న చిన్న మాటలలో వారి మధ్య ఉన్న అనురాగాన్ని కూడా ఆవిష్కరించారు. శంభునాథ్‌గా సంజయ్ మిశ్రా నటించాడు. పాండే దగ్గర అవమానపడే సీన్లలో అతని నటన ఎంతో సహజంగా ఉంటుంది. అతనికి ఫిల్మ్ ఫేర్ వారు ఇచ్చే ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డ్ దక్కింది. మంజుగా సీనియర్ నటి నీనా గుప్తా చక్కగా నటించింది. అన్ని రకాల పాత్రలూ చేయగల బహు కొద్దిమంది నటీమణులలో ఆమె ఒకరు. శక్తి సింగ్‌గా మానవ్ విజ్ మంచి మార్కులు కొట్టేశాడు. పాండేగా నటించిన సౌరభ్ సచ్‌దేవా ఆ పాత్ర మీద నిజంగా అసహ్యం కలిగేలా నటించాడు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

శంభునాథ్‌ని ఎమ్మెల్యే పిలిపిస్తాడు. పాండేని అడ్డుపెట్టుకుని వడ్డీ వ్యాపారం చేసేది అతనే. ఇల్లు అప్పగించమని అంటాడు. శంభునాథ్ తాను పాండేకి బాకీ మొత్తం ఇచ్చేశానని అంటాడు. ఎమ్మెల్యే పాండే కన్నా కర్కోటకుడు. “పాండే దొరకట్లేదు. మీరు పాండేని తీసుకురండి. పాండే నా డబ్బు నాకిస్తాడు. మీ ఇల్లు మీకే ఉంటుంది. మూడు రోజుల గడువు ఇస్తాను” అంటాడు. శంభునాథ్ మళ్ళీ ఇరకాటంలో పడతాడు. ఇదిలా ఉండగా శక్తి సింగ్ గుడి దగ్గర కాపు కాసి మంజుతో మాట్లాడతాడు. “ఈరోజు కాకపోతే రేపు ఆయన దొరికిపోతారు. మాకు సహకరించమని చెప్పండి” అంటాడు. ఆమె “దేవుడి లాంటి మనిషిని ఇలా వేధించటానికి మీకు సిగ్గు లేదా? ఆయన్ని నలభై ఏళ్ళుగా ఎరుగుదును. ఆయన ఎప్పుడూ ఏ తప్పూ చేయలేదు. ఇప్పుడూ చేయలేదు” అని వచ్చేస్తుంది. ఆమెకి తన భర్త అప్పు తీర్చలేక పాండేని చంపలేదని తెలుసు. నైనాని కాపాడటానికి చంపాడని తెలుసు. అది తప్పు కాదు. రాక్షసులను చంపటం తప్పు కాదు. అందుకే భర్తకి అండగా నిలబడింది. అప్పు తీర్చలేక చంపాడని అనుకుంటే ఆమె శక్తి సింగ్‌తో అలా మాట్లాడేది కాదు.

ఎమ్మెల్యే బెదిరించటంతో దారిలేక దంపతులిద్దరూ ఇంటర్నెట్ సెంటర్ నుంచి కొడుక్కి స్కైప్ కాల్ చేస్తారు. పది లక్షలు బాకీ ఉందని చెబుతారు. కొడుకు ఈసడించుకుంటాడు. “నేను ఇల్లు కొనుక్కున్నానని తెలుసు కదా? మీ కోరికలకి అంతు లేదా?” అంటాడు. శంభునాథ్ కాల్ కట్ చేస్తాడు. ఇద్దరూ కొడుకు మీద ఆశ వదులుకుంటారు. మరో పక్క శక్తి సింగ్ విచారణ మొదలుపెడతాడు. వధ జరిగిన రాత్రి శంభునాథ్ కదలికల గురించి తెలుసుకుంటాడు. శంభునాథ్‌ని బస్టాండ్‌కి తీసుకెళ్ళిన రిక్షావాడిని పట్టుకుని మాట్లాడతాడు. శంభునాథ్ ఒక ఏటీఎమ్ దగ్గర ఆగాడని తెలుస్తుంది. అక్కడ సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు శక్తి సింగ్ చూస్తాడు. అతనికి శంభునాథే హత్య చేశాడని అర్థమవుతుంది. అనుమానం కలిగించే ఆధారాలు దొరికినా అతన్ని రిమాండ్ లోకి తీసుకోకుండా అతన్ని ఒక హైవే పక్కకి తీసుకెళ్ళి మాట్లాడతాడు. యూనిఫార్మ్ కాకుండా మామూలు బట్టలు వేసుకుంటాడు. “ఏటీఎమ్‌లో మీ వీడియో చూశాను. మిమ్మల్ని రిమాండుకి పంపటానికి అది చాలు. మీరు పాండేని ఏం చేశారో నాకు అనవసరం. నాకు వాడి ఫోన్ కావాలి. అది మాత్రం ఇవ్వండి” అంటాడు. శంభునాథ్ తనకి పాండే గురించి కానీ, అతని ఫోన్ గురించి కానీ ఏం తెలియదంటాడు. “సరే. రేపు యూనిఫార్మ్‌లో వస్తాను” అంటాడు శక్తి సింగ్. పాండే ఫోన్‌లో శక్తి సింగ్‌ని ఇరుకున పెట్టేదేదో ఉందన్నమాట. దానితోనే పాండే అతన్ని బ్లాక్‌మెయిల్ చేశాడు. శంభునాథ్ ఇంటికి వచ్చి వెతికితే సోఫా సందులో పాండే ఫోన్ దొరుకుతుంది. దాని కోసం షాపులో చార్జర్ కొని, అక్కడే దాన్ని ఆన్ చేసి చూస్తాడు. అతనికి విషయం తెలుస్తుంది. ఈ సన్నివేశాలన్నిటిలో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎమ్మెల్యే గానీ, శక్తి సింగ్ గానీ శంభునాథ్‌ని బహువచనంతోనే సంబోధిస్తారు. సమాజంలో బ్రాహ్మణులకి, అందునా మాస్టార్లకు ఉన్న గౌరవానికి ఇది అద్దం పడుతుంది. పాండే కూడా ఎక్కువ అమర్యాదగా మాట్లాడడు. హిందీలో ‘ఆప్’, ‘తుమ్’, ‘తూ’ అని మూడు సంబోధనలు ఉంటాయి. తెలుగులో రెండే – ‘మీరు’, ‘నువ్వు’. హిందీలో ‘తూ’ అనేది పిన్నవయస్కులకి వాడతారు. లేదా కించపరిచేటపుడు వాడతారు. పాండే ఎప్పుడూ శంభునాథ్‌ని ‘తూ’ అని సంబోధించడు.

శంభునాథ్‌కి శక్తి సింగ్‌ని ఇరుకున పెట్టే విషయం పాండే ఫోన్లో దొరికింది. దానితో అతను శక్తి సింగ్ మీద పైచేయి సాధించవచ్చు. ఇది కూడా అతనికి అనుకూలంగానే జరిగింది. మామూలుగా అయితే ఆ విషయం అతనికి తెలిసేది కాదు. పాండేని చంపినప్పుడే ఆ విషయం తెలిసే మార్గం కూడా ఏర్పడింది. శంభునాథ్ నిబ్బరంగా ఉండటంతో ఆ విషయాన్ని తెలుసుకోగలిగాడు. భయపడి శక్తి సింగ్‌కి నిజం చెప్పేస్తే అంతా తలకిందులయ్యేది. ‘ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు’ అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పినట్టు అవసరమైనపుడు అబద్ధం చెప్పవచ్చు. మంచితనం ఉండవచ్చు కానీ మెతకదనం ఉండకూడదు. ఎప్పుడూ నిజమే చెబుతాను అని కూర్చుంటే కుదరదు. అలా అయితే భారతయుద్ధంలో ద్రోణుడు మరణించేవాడు కాదు. కృష్ణుడు ధర్మరాజు చేత అబద్ధం చెప్పించటం వలనే ద్రోణుడు మరణించాడు. కలియుగంలో ఇంకా లౌక్యంగా ఉండాలి.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

శంభునాథ్ ఇంటికి వచ్చేసరికి ఎమ్మెల్యే మనుషులు ఇంటి సామాను బయట పారేస్తుంటారు. ఎమ్మెల్యే కూడా అక్కడే ఉంటాడు. మంజు ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసిన శంభునాథ్ కోపంతో ఎమ్మెల్యే కారు అద్దం పగలగొడతాడు. ఎమ్మెల్యే అతన్ని చెంపదెబ్బ కొడతాడు. గత్యంతరం లేక శంభునాథ్ “ఇల్లు ఖాళీ చేసేస్తాం” అంటాడు. ఎమ్మెల్యే తన మనుషులను తీసుకుని వెళ్ళిపోతాడు. శంభునాథ్, మంజు విలపిస్తారు. నీరసంతో ఆస్పత్రిలో చేరతాడు శంభునాథ్. మంజు అక్కడే ఉంటుంది. శక్తి సింగ్ వస్తాడు. మంజు బయటకి వెళుతుంది. శక్తి సింగ్ “మిమ్మల్ని లాకప్‌లో వేసి కొడదామనుకున్నాను. మీరు బయటే కొట్టించుకున్నారు. ముందే మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి అవకాశం ఇచ్చాను” అంటాడు. “నన్ను కాదు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలనుకున్నారు” అంటూ పాండే ఫోన్ ఇస్తాడు శంభునాథ్. తానెందుకు పాండేని చంపాడో చెబుతాడు. ఇక మీ ఇష్టం అంటాడు. బయటికొచ్చిన శక్తి సింగ్‌తో మంజు “ఆయన్ని జైలుకి పంపితే నేను కూడా ఆయనతోనే వెళతాను. కావాలంటే నాకు తెలిసిన ఆధారాలు కూడా ఇస్తాను” అంటుంది.

శక్తి సింగ్ పాండే ఫోన్ తెరిచి చూస్తాడు. అందులో ఒక వీడియో ఉంటుంది. అది శక్తి సింగ్‌కి, ఎమ్మెల్యే భార్యకి ఉన్న అక్రమ సంబంధం వీడియో. అది చూపించి పాండే శక్తి సింగ్‌ని బ్లాక్ మెయిల్ చేశాడు. “ఎవరినైనా సంతృప్తిపరచటం పుణ్యమే” అంటాడు వెటకారంగా. శక్తి సింగ్ మంజు చెప్పిన ఆధారాల కోసం వాళ్ళింటికి వెళతాడు. అక్కడ కుళాయి దగ్గర నాపరాయి కింద పాండే బట్టలు, స్క్రూ డ్రైవర్ ఉంటాయి. అవి ఎమ్మెల్యే ఇంట్లో దొరికాయని తప్పుడు రిపోర్ట్ రాసి శక్తి సింగ్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తాడు. ఈ విధంగా ఎమ్మెల్యేని కటకటాల వెనక తోస్తాడు. ఇది శంభునాథ్, శక్తి సింగ్ కలిసి రచించిన పథకం. ఇందులో ఇద్దరి స్వార్థం ఉంది. కానీ చట్టం నుంచి తప్పించుకోవాలంటే శంభునాథ్‌కి ఇదే మార్గం. ఈ ముగింపు కొంచెం అవాస్తవికంగా ఉంటుంది. శంభునాథ్ చదివిన కథల ప్రభావం ఉందని అనిపిస్తుంది. ఒకవేళ శక్తి సింగ్ శంభునాథ్ పేరు బయటపెడితే శంభునాథ్ శక్తి సింగ్ అక్రమ సంబంధం సంగతి బయటపెడతాడు. అందుకే ఇద్దరూ తోడుదొంగలుగా ఉండిపోతారు. చివరికి శంభునాథ్, మంజు తమ ఇల్లు నైనా పేర్న రాసేసి ఊరు విడిచి వెళ్ళిపోతారు.

థ్రిల్లర్ అంటే ఆర్భాటం ఉండాలి అనుకునే ఈరోజుల్లో కేవలం సామాన్యుల కథతో, పాత్రోచితమైన సన్నివేశాలతో థ్రిల్లర్ రూపొందించటం దర్శకుల ప్రతిభ. అదీ వృద్ధులైన దంపతుల కథతో. సరైన నటులు ఉంటే సినిమా ఎంత రక్తి కడుతుందో చెప్పటానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here