[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
భారతీయ సినీ దిగ్గజం – దర్శకనిర్మాత నటుడు వి. శాంతారామ్:
70 ఏళ్ళ ప్రస్థానంలో వి. శాంతారామ్ గారు భారతీయ చలనచిత్ర రంగంపై వేసిన ముద్ర బలమైనది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
~
అవి ప్రమతేష్ బారువా గారి దర్శకత్వం వహించిన ‘దేవదాస్’ సినిమా విడుదలైన తర్వాతి రోజులు. ఆ చిత్రం ప్రభావం వల్ల దేశమంతా ఓ విధమైన నిరాశలో కూరుకుపోయినట్లయిందని భావించిన వి. శాంతారామ్ – దేశ యువతకి ఓ సానుకూల సందేశం ఇవ్వదలచారు. అందుకని ‘ఆద్మీ’ (1939) చిత్రాన్ని రూపొందించారు, ఈ సినిమాలో హీరో తన ప్రేయసిని కోల్పోయినా కూడా, నిరాశకు లోనుకాకుండా తన బాధ్యతలకి కట్టుబడి ఉన్నట్లు చూపించారు.
అదేవిధంగా, వి శాంతారామ్ గారు తీసిన పలు క్లాసిక్ చిత్రాలలో ప్రధాన ఇతివృత్తంగా బలమైన సామాజిక వ్యాఖ్యానం కొనసాగింది. ఉదా: ‘దో అంఖే బారాహ్ హాత్’ (నేరస్థుల పునరేకీకరణ), ‘ఆద్మీ’ (వేశ్యల పునరావాసం), ‘పడోసి’ (మత సామరస్యం), ‘దహేజ్’ (వరకట్న దురాచారం), ఇంకా ‘దునియా నా మానే’. ఒక వృద్ధుడితో జరిగిన తన వివాహాన్ని నిరసిస్తూ అతని జీవితాన్ని దుర్భరం చేసే యువతి పాత్రలో ‘దునియా నా మానే’ చిత్రంలో నటించారు శాంతా ఆప్టే. సమాజాన్ని పీడిస్తున్న అంటువ్యాధులను బహిర్గతం చేయాలనుకున్నప్పుడల్లా, శాంతారామ్ మరొక గొప్ప సినిమా తీశారని అనిపిస్తుంది.
సంభాషణలనే నటనగా ఉపయోగించడమనే శైలి వల్ల, శాంతారామ్ గారి సినిమాలు థియేటర్‌లో చూస్తున్న నాటకాల్లా ఉంటాయని ఆరోపణలు వచ్చాయి. ఇవి పూర్తిగా అవాస్తవం కానప్పటికీ, ఆయన తన స్వంత సొగసును అభివృద్ధి చేసుకునేందుకు ఆ రెండు రూపాలను మిళితం చేశారు. ‘అమృత్ మంథన్’ (1934) సినిమా ప్రారంభ సన్నివేశంలో, ఎవరిని బలి ఇవ్వాలా అని చంద్రమోహన్ వెతుకుతున్నప్పుడు ఆయన కంటికి దగ్గరగా ఉండేలా క్లోజప్ షాట్ తీసి సినిమాల దృశ్య భాషపై కూడా తనకున్న పట్టును నిరూపించారు శాంతారామ్.
1920లో అరంగేట్రం చేసినప్పటి నుండి, 1990లో మరణించే వరకు, భారతీయ చలనచిత్ర రంగపు ప్రతి ముఖ్యమైన మైలురాయిలోనూ తాను ఉండటమే కాకుండా, అటువంటి ఎన్నో గొప్ప మైలురాళ్ళకి తానే కారణమయ్యారు శాంతారామ్.
శాంతారామ్ బాల గంధర్వ థియేటర్ గ్రూప్‌లో రంగస్థల నటుడిగా నట జీవితం ప్రారంభించారు, తరువాత 1920లో బాబూరావు పెయింటర్ గారి మహారాష్ట్ర ఫిల్మ్ కంపెనీలో చేరారు. భారతదేశపు మొట్టమొదటి ఆర్ట్ ఫిల్మ్‌గా విస్తృతంగా ఆమోదించబడిన ‘సౌకరీ పాష్’ (1925)లో శాంతారామ్ ప్రధాన పాత్ర పోషించారు. శాంతారామ్ 1929లో నలుగురు భాగస్వాములతో ‘ప్రభాత్’ సంస్థను ప్రారంభించారు; చంద్రమోహన్, దుర్గా ఖోటే, శాంతా ఆప్టే వంటి గొప్ప ప్రతిభావంతులను పరిచయం చేస్తూ ‘అమృత్ మంథన్’ (1934) మరియు ‘అమర్ జ్యోతి’ (1936) వంటి అనేక ముఖ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
‘దునియా నా మానే’ (1937), ‘ఆద్మీ’ (1939), ‘పడోసి’ (1941) అనే మూడు క్లాసిక్ చిత్రాల తరువాత, శాంతారామ్ ‘ప్రభాత్’ సంస్థను వదిలి, సొంతంగా ‘రాజ్‌కమల్ స్టూడియోస్’ను స్థాపించి ‘శకుంతల’ అనే సూపర్ హిట్ సినిమా తీశారు. ఈ సినిమా హీరోయిన్ జయశ్రీని ఇష్టపడి, మొదటి భార్య ఉండగానే, జయశ్రీని రెండో పెళ్ళి చేసుకున్నారు శాంతారామ్. వీరిద్దరూ కలిసి బయోగ్రాఫికల్ సూపర్‌హిట్ ‘డాక్టర్ కోట్నిస్ కీ అమర్ కహానీ’ (1946) రూపొందించారు. ఐతే శాంతారామ్ గారి 1950ల నాటి సినిమాలు నిరాశపరిచాయి. అదే సమయంలో శాంతారామ్ తన దృష్టిని సంధ్య వైపు మళ్లించడం ద్వారా తనను తాను పునరుద్ధరించుకున్నారు. ఆమెను మూడో భార్యగా చేసుకున్నారు. ఆమెతో తీసిన నృత్యప్రధాన చిత్రం ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ (1955) భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ‘దో అంఖే బారాహ్ హాత్’ (1957). ‘నవరంగ్’ (1959) వంటి చిత్రాలలో, తన భార్యను గ్లామరైజ్ చేసే కళాకారుడిలా – తన కల్పనల్లో సంధ్యను తన అధిదేవతగా మార్చి ఆసక్తికరంగా చూపించారు.
తరువాతి సంవత్సరాలలో, (1933లో జరిపిన జర్మనీ పర్యటన ప్రభావంతో), వాన్ స్టెర్న్‌బర్గ్ గారి ‘ది బ్లూ ఏంజెల్’ ఆధారంగా ‘పింజరా’ అనే విజయవంతమైన సినిమా తీశారు. కానీ పెరుగుతున్న వయసు కారణంగా పనిభారాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది.
ముగ్గురు భార్యలు, బహు సంతానం, బొంబాయి నగరం నడిబొడ్డున విశాలమైన స్టూడియో, దిగ్గజ హోదా! మరణానికి ముందే అమరత్వం పొందిన అతి కొద్దిమంది ఘనులలో ఆయన ఒకరు.
~
వి. శాంతారామ్‍గా ప్రసిద్ధులైన శాంతారామ్ రాజారామ్ వణకుద్రే (18 నవంబర్ 1901–30 అక్టోబర్ 1990) నటుడు, చలనచిత్ర నిర్మాత, దర్శకులు. ఆయన ‘డా. కోట్నిస్ కీ అమర్ కహానీ’ (1946), ‘అమర్ భూపాలి’ (1951), ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ (1955), ‘దో ఆంఖేన్ బారాహ్ హాత్’ (1957), ‘నవరంగ్’ (1959), ‘దునియా నా మానే’ (1937), ‘పింజ్రా’ (1972), ‘చని’, ‘అయ్యే మరాఠీ నగరి’, ‘జుంజ్’ తదితర చిత్రాలు తీశారు.
ఆయన 1927లో తన మొదటి చిత్రం, ‘నేతాజీ పాల్కర్’కి దర్శకత్వం వహించారు. 1929లో, విష్ణుపంత్ దామ్లే, కె.ఆర్. ధైబర్, ఎస్. ఫతేలాల్, ఎస్.బి. కులకర్ణి లతో కలిసి ‘ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ’ని స్థాపించారు. 1932లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అయోధ్యేచ రాజా’, తొలి మరాఠీ చలనచిత్రంగా గుర్తింపు పొందింది. ఆయన 1942లో ‘ప్రభాత్’ను విడిచిపెట్టి బొంబాయిలో ‘రాజ్‌కమల్ కళామందిర్’ని స్థాపించారు. కాలక్రమంలో, ‘రాజ్‌కమల్’ దేశంలోని అత్యంత అధునాతన స్టూడియోలలో ఒకటిగా మారింది.
శాంతారామ్ గారి మరాఠీ చిత్రం ‘మనూస్’ చార్లీ చాప్లిన్ ప్రశంసలు పొందింది. చాప్లిన్‌కి ఈ సినిమా బాగా నచ్చిందని అంటారు.
అన్నాసాహెబ్ అని ఆప్యాయంగా పిలవబడే శాంతారామ్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు దర్శకనిర్మాతగా అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉన్నారు. సామాజిక మార్పు సాధనంగా చలనచిత్ర మాధ్యమం సామర్థ్యాన్ని గ్రహించిన తొలి దర్శకనిర్మాతలలో ఆయన ఒకరు. ఒకవైపు మానవతావాదాన్ని సమర్థిస్తూ మరోవైపు మతోన్మాదం, ఇంకా అన్యాయాన్ని బహిర్గతం చేయడానికి సినిమాని విజయవంతంగా ఉపయోగించారు. వి.శాంతారామ్‌కి సంగీతంపై చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లో సంగీతం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు, అంతేకాదు, తన సంగీత దర్శకులలో చాలా మంది కోసం అనధికారికంగా సంగీతం అందించారు. ఆయన సినిమాల్లోని కొన్ని పాటలను ఆయన ఆమోదం పొందేముందు, చాలాసార్లు రిహార్సల్ చేయాల్సి వచ్చేది.
ఆయనకు 1985లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. 1992లో పద్మవిభూషణ్‌తో సత్కరించారు.
వారి ఆత్మకథ ‘శాంతారామ’ హిందీ, మరాఠీ భాషలలో ప్రచురితమైంది.
1967లో వి. శాంతారామ్‌ను మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ హాల్‌లో సన్మానించారు. ఆయన పట్ల గౌరవ సూచకంగా దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫాల్కే అవార్డు గ్రహీత బి ఎన్ రెడ్డి తన అభిమాన దర్శకనిర్మాతని అభినందించారు. నటి కాంచన శాంతారామ్ గారికి పుష్పగుచ్ఛం ఇచ్చారు.
శాంతారామ్ 30 అక్టోబర్ 1990న ముంబైలో మరణించారు. వారి స్మారక పురస్కారంగా కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ‘వి. శాంతారామ్ అవార్డు’ను ఏర్పాటు చేశాయి. 1993లో స్థాపించబడిన వి. శాంతారామ్ మోషన్ పిక్చర్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ కల్చరల్ ఫౌండేషన్, సినీ నిర్మాతలకు వివిధ అవార్డులను అందిస్తోంది. ఈ అవార్డును ఏటా నవంబర్ 18న అందజేస్తారు. వి. శాంతారామ్ గౌరవార్థం ఇండియా పోస్ట్ 17 నవంబర్ 2001న ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.