కాస్త సమయం వెచ్చించండి

0
3

[మాయా ఏంజిలో రచించిన ‘’Take time out’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(సామాజిక బాధ్యతను గుర్తు చేసే కవిత!)

~

[dropcap]వా[/dropcap]ళ్ళనలా చూసినపుడు
మీరంతా అడగాలి
మెడలో పూసలు ధరించి
రెండువైపులా సంచీలను వేలాడేసుకొని
నిబంధనలను పాటించకుండా
రోడ్లపై కట్లు కొడుతూ
ఇష్టమొచ్చినట్టుగా బైక్ సవారీ లతో
దూసుకుపోయే యువతని
మీరంతా పశ్నించాలి
రోడ్ల మీద జర్రున జారుతూ
సాగిపోయే వాహన చోదకులని
ఏమిటీ ఉత్కంఠ కలిగించే పరుగులని,
ఎందుకీ మృత్యు విన్యాసాలని
ప్రశ్నించండి..
కొంచెం సమయం వెచ్చించండి

తలనిండా గాయపు కట్లతో
సైనిక స్థావరంలోని మిగులు బంకే
తన పడకగా సవరించుకుంటున్న
వీరుడెపుడైనా కనిపిస్తే
ఎందుకీ యుద్ధాలు
కొట్లాటలు మోసాలు ద్వేషాలు
ఏమిటీ రక్తపాతం
అసలు
ఎవరికి ఏం కావాలని
అడిగి తెలుసుకోవడం మంచిది
కాస్త సమయం చిక్కించుకోండి

తిరిగే ఒకే ఒక రైలునందుకోవాలని
వర్షంలో చెప్పుల్లేని కాళ్ళతో
తొట్రుపడుతూ నడిచే ఆమెని చూసినపుడు
అడగాలి మీరు
పడుతూ లేస్తూ
ఎక్కడికీ ప్రయాణమని పలకరించండి
ఎందుకీ ప్రయాస అని తెలుసుకోండి
కాస్త సమయం వెచ్చించండి
ఒక్క నిమిషం
వారి వేదన కొంత పంచుకోండి

ఒక్క నిమిషం తీసుకోండి
మీ తోటివారి కోసం
వారి బాధలు గాధలు వినండి
వారికై కొంచెం ఆలోచించండి
రేపు అనేది ఒక పిలుపు దూరంలో ఉన్నదని
భావించే వాళ్ళకు
కొంత సహానుభూతిని ఇవ్వండి
అంధత్వం కళ్ళకి మాత్రమే
సంబంధించిన అనారోగ్యమని
భావించే వారికోసం
కొంత సమయం వెచ్చించండి
కొంత దయని చూపించండి

మన పరుష వాక్కులు
మన ఆక్రందనలు
ఏం తెచ్చి పెడుతున్నాయి మనకు
యువత ఈ పరుగుల్లో మరణిస్తుందని..
నా కూతురు నీ కొడుకుతో
మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తుందని..
మన భయాలేంటో మనం ఓ సారి
చూసుకోవడం మంచిది
………………..
కొంత సమయం తీసుకోండి..!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


  1. సంతోషంగా ఇచ్చినపుడు, కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరించినపుడు, ఇరువైపుల వారూ ఆనందిస్తారు.
  2. ఏమైనా జరగనీ, ఈ రోజెంత చెడుగానైనా ఉండనీ, జీవితం సాగుతూనే ఉంటుంది. రేపు తప్పకుండా బాగుంటుంది.
  3. గొప్ప గొప్ప విషయాలు సాధించేందుకు సరిపడా సమయం అవసరం.
  4. నువ్వు ఒక్కడివే చాలు. ఎవరికీ ఏమీ నిరూపించనవసరం లేదు.
  5. తగినంత ధైర్యాన్ని పెంపొందించుకొండి. తద్వారా మీరు నిలదొక్కుకోవడమే కాకుండా, ఇతరులకు బాసటగా నిలబడగలరు.
  6. సాహిత్యం ఇచ్చిన ప్రాణశక్తి నన్నెంతో ముందుకు నడిపించింది. మళ్ళీ నేను బాల్యంలోకి వెళ్ళగలిగితే నా చిన్నప్పటిలాగే పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను.
  7. మీరు ఒక ప్రదేశానికి మాత్రమే చెందిన వారు కాదని మీరు గ్రహించినపుడే మీరు స్వేచ్ఛగా ఉంటారు. మీరు అన్ని ప్రదేశాలకూ చెందిన వారు, అలాగే ఒకే ప్రదేశానికి పరిమితమైన వారు కారు, మూల్యం అధికం. ప్రతిఫలం అమూల్యం.
  8. మిమ్మల్ని మీరు వినండి. ఆ నిశ్శబ్దంలో మీరు ఆ దేవుడి స్వరాన్ని వినగలుగుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here