నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-54

1
3

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

సెప్టెంబర్ 3, 1948

[dropcap]రా[/dropcap]జు ఫోన్ చేశాడు. పుల్లా రెడ్డితో మాట్లాడాను. డాక్టర్ హదీ హాసన్, శ్రీమతి ఎద్రూస్‍ల గురించి మొరార్జీ దేశాయ్‌తో మాట్లాడాను. ఎద్రూస్‌ను బొంబాయి రానిచ్చేందుకు మొరార్జీ దేశాయ్ విముఖుడిగా ఉన్నాడు. కానీ ఆమెను గౌరవించే బాధ్యత తనపై ఉందన్నాను. చివరికి ఆమెకు అనుమతి లభించింది.

ధ్యానం మానేశాను. ధ్యానం చేయటం కష్టంగా ఉంది. స్వాధ్యాయం  కొనసాగిస్తున్నాను.

ఓమ్నిబుక్ వారి చారిత్రాత్మాక రచన ‘ఈగల్ ఇన్ ది స్కై’ సారాంశం చదివాను. స్టిల్‍వెల్ రచన ‘డైరీ’ చదివాను.

గుప్తా పంపిన ట్రంకులు అందాయి. ఈ విషయం మమ్మీకి చెప్పాను. భవన్ వ్యవహారాల్లో అమ్మ తలమునకలుగా ఉంది. లత కూడా అధికంగా పనిచేస్తోంది. అనారోగ్యం పాలయింది. లతకి పని తగ్గించమని మమ్మీతో చెప్పాను.

భవన్ వెనుక ఉన్న పాడుపడ్డ బంగళాకు మరమ్మత్తులు పూర్తయ్యాయి. పాఠశాల పిల్లలు ఆ భవంతిలో ఉంటున్నారిప్పుడు. ఆ బంగళాలో కొంత భాగాన్ని స్త్రీ సేవా సంఘం వారు వాడుకుంటున్నారు. డిబెంచర్లపై లోను ఇచ్చేందుకు అఖానే ఆమోదాన్ని తెలిపాడు. మమ్మీ కూడా డిబెంచర్ల పై కాస్త సొమ్ము సేకరించింది. అంధేరీ కాలేజ్ హాస్టల్ సిద్ధం అయింది. త్వరలో హాస్టళ్లలో విద్యార్థులు నివసిస్తారు.

నాలుగు గంటలగు పండిత్ వచ్చాడు. ‘శకుంతల’ చదివి వినిపించాడు. నేను దాదాపుగా 47 ఏళ్ల క్రితం ‘శకుంతల’ చదివాను. ‘శకుంతల’ లోని శ్లోకాలను విశ్లేషించటం ఆరంభించాను. 1902లో ‘శకుంతల’ చదివినప్పటి అనుభూతిని మళ్లీ అనుభవించాను. కళ్ళు చెమర్చాయి.

జైలు నుంచి విడుడలయిన ఖామిర్ హమీది, తన అంకుల్‍తో కలిసి వచ్చి నన్ను పూలమాలతో సత్కరించాడు.

ఇంగ్లండ్‌లో, ఫ్రాన్స్‌లో ప్రచారం కొనసాగించమని డెస్మండ్ యంగ్‌ను క్లాడే స్కాట్ ఆదేశించాడు.

రాత్రి సర్దార్ ఫోన్ చేశారు. సర్ ‘ఎం’ తో మాట్లాడేను. ఆయన నిజామ్‍కు ఘాటైన ఉత్తరం రాస్తున్నారు. అయితే ఏదీ పరిస్థితులను వేగవంతం చేయలేదు.

సెప్టెంబర్ 4, 1948

హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో జరుపుతున్న అత్యద్భుతమైన ప్రచారం బాధను కలిగిస్తోంది.

‘దేవల్ దేవి’ విసుగు వస్తోంది. ‘శకుంతల’ చదివాను. ఒక సందేశం అందింది.

సెప్టెంబర్ 5, 1948

నిన్న లాయల్ అలీ ఇచ్చిన ఉపన్యాసం స్వాతంత్ర ప్రకటన లాంటింది. అతని మాటలు మర్యాదగా ఉన్నా, వాటిల్లో విద్రోహ భావనలు పొంచి ఉన్నాయి. హైదరాబాద్ సభ్యులను మద్రాసు జమీందార్లతో సర్దార్ పోల్చటం అతనికి ఆగ్రహం కలిగించి ఉంటుంది.

నిజామ్ సమాధానాన్ని వైర్‌లెస్ ద్యారా సర్దార్‌కు పంపాను. అద్భుతమైన సమాధానం! హైదరబాదులో అంతర్గతంగా అభద్రత అన్నది లేదు. సరిహద్దు వద్ద జరుగుతన్న సంఘటనలకు భారత్‌దే బాధ్యత. మీర్జాకు హైదరాబాద్, అందులోని కృతఘ్నత గురించి తెలియదు. ‘హైదారాబాద్‌లో సైన్యానికి అనుమతి లభించదు. నాకు తెలియకుడా నా మంత్రివర్గం నిర్ణయం తీసుకోదు’ అనుకుంటున్నాడు.

సర్దార్ నుంచి టెలిఫోన్ వచ్చింది. కశ్మీర్ కమీషన్ ఏర్పాటు ప్రకటన వెలువడుతుంది. ఆ తరువాత ఓ నిర్ణయం తీసుకుంటారు.

మమ్మీ ఢిల్లీకి వెళ్ళింది.

సెప్టెంబర్ 6, 1948

ఉదయం NAZ కలిశాడు. తన ప్రయత్నాలలో జుల్ ఖాదర్ విఫలమయ్యాడు. గతంలోలా దీన్ ఇప్పుడు శక్తిమంతుడు కాడు.

సిడ్నీ కాటన్ విమానంలో హైదరాబాదు బృందం, మొయిన్ నవాజ్ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితికి ప్రయాణమవుతోంది. సర్దార్ నిశితమైన సమాధానాల తరువాత మరో ప్రత్యామ్నాయం మిగలలేదు. కాటన్ కొన్ని రోజల కోసం హైదరాబాద్ వచ్చాడు. పాకిస్తాన్ వాయు దళాధికారులతో, హైదరాబాదు లోని పాకిస్తాన్ ఏజంట్ జనరల్ ముస్తాక్ అలీ కూడా ఉన్నట్టు వినికిడి. భారత్ విడుదల చేసిన శ్వేతపత్రానికి సమాధానాన్ని క్లాడే స్కాట్ తయారు చేశాడు.

గణేశ చతుర్థి: రామాచారి, ధూత్ లతో కలసి గణేశ ఉత్సవానికి వెళ్ళాను.

సెప్టెంబర్ 7, 1948

నిజామ్ కనీసం ఒప్పుకోవాల్సిన డిమాండ్లను పండిట్‌జీ పార్లమెంట్‌లో ప్రకటించారు.

అవి: (1) రజాకార్ల పై నిషేధం విధించాలి (2) సికిందరాబాద్‌లో భారత సైన్యానికి అనుమతి లభించాలి.

ఇవే షరతులతో వైర్‌లెస్ ద్వారా వి.పి. మీనన్ నుంచి అధికారిక లేఖ అందింది. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమాచార పత్రాన్ని లాయక్ అలీకి పంపాను. చట్టసభ సమావేశం అయిపోయింది. సాయంత్రం పింగళి వెంకట్రామరెడ్డి అధికారిక ప్రకటనను జారీ చేశాడు.

కోదాడ దగ్గర జరిగిన సంఘటన సమాచారం స్టేట్స్ మినిస్ట్రీ నుంచి అందింది. నిజామ్ సైనికులు, రజాకార్లు కొందరు భారతీయ సైనికులను నిర్బంధించారు. రాత్రి తొమ్మిదింటికి లాయక్ అలీకి నిరసనను తెలిపాను.

సెప్టెంబర్ 8, 1948

ఔషధాల విషయమై ఎడ్వర్డ్స్ పత్రికలకు ఒక ప్రకటనను విడుదల చేశాడు. హైదరాబాద్‌లో సంచలనం ప్రారంభమయింది. నవల రాయబుద్ధి కావటం లేదు. టెలీఫోన్‍లో మమ్మీతో మాట్లాడాను. ‘ఎం’ – మిస్ ‘..’ తో వచ్చాడు. బానిస రోజులు ఇంకా పోలేదు.

రాత్రి ఎనిమిది గంటలక్ సర్దార్ టెలిఫోన్‍లో మాట్లాడేరు. తొమ్మిదవ తారీఖు నుంచి హైదరాబాద్ లోని యూరోపియన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించటం ప్రారంభమవుతుంది. కోదాడ దగ్గర భారత్ సైన్యం బంధించిన 5 గురు ఆఫీసర్లు, 90 సైనికులను విడుదల చేయాలని నిజామ్ కోరాడు.

సెప్టెంబర్ 9, 1948

స్టేట్స్ మినిస్ట్రీ నుంచి ఉదయం వైర్‍లెస్ సమాచారం అందింది. ఢిల్లీ సైనిక కేంద్ర కార్యాలయం నుంచి, దక్షిణ  కమాండ్, పూనా నుంచి ఫోన్లు వచ్చాయి. ‘ఫ్రై’కు ఫోన్ చేశాను. హైరదాబాద్ వెలుపలకు వెళ్తున్న యూరోపియన్లకు విమాన సదుపాయం కల్పించి లాయక్ అలీకి లేఖ రాశాను. మొత్తానికి పరిస్థితులలో కదలిక వస్తోంది.

న్యాయవాదుల నిరసన కమిటీ రాసిన ఉత్తరం కాపీని వినాయకరావు, ఇతర లాయర్లు అందచేశారు. రోజంతా ఉత్తేజితంగా గడిచింది.

గత జూన్‍లో జరిపిన చర్చలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ దృక్కోణానికి కూడా సమర్థన నివ్వాలని నిజామ్ రాజాజీకి టెలిగ్రామ్ పంపాడు.

రాత్రి సర్దార్‌తో ఫోనులో మాట్లాడేను.

సెప్టెంబర్ 10, 1948

ఉదయమే లేచాను. బ్రిటీష్ పౌరులను తీసుకువెళ్ళే విమానం దక్షిణ సదన్ పైనుంచి ప్రయాణించింది. ఉత్తేజితుడనయ్యాను. గత తొమ్మిది నెలలుగా నేను పడుతున్న శ్రమ వ్యర్థం కాలేదన్న భావన కలుగుతోంది. మొత్తానికి అందరూ సమస్యను పరిష్కారం వైపు ప్రయాణింప జేస్తున్నారు.

తాతాచారి వచ్చాడు. తరువాత ఆర్.ఎస్.ఎం. వచ్చాడు. ‘టైమ్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ’ పుస్తకంపై కొంత పని చేశాను.

బుచ్, బారూచా లతో ఫోన్‍లో ట్రాన్స్‌మీటర్ల గురించి మాట్లాడేను. మమ్మీకి ఓ సమాచారం అందజేయమని లతకు సంస్కృతంలో చెప్పాను.

సురక్షిత ప్రాంతలకు తరలించవలసిన ఆఫీసర్ల జాబితా తయారు చేయమని శంకర్ నారాయణన్‌ను ఆదేశించాను (ఇది అందరి భయాన్ని, కంగారును తగ్గించటానికి).  నిజానికి మమ్మల్ని ఇక్కడి నుంచి కదపాలని ఢిల్లీలో వాళ్ళు అనుకోవటం లేదు.

193 మంది బ్రిటీషర్లు వెళ్ళిపోయరు. 10 కుటుంబాలు రైల్లో వెళ్ళాయి.

నగరంలో ఉద్విగ్నత కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో సైన్యం కోదాడ వైపు వెళ్తోంది. రాత్రి 7-30 ని॥ లకు భారత ప్రభుత్వ కోరికలను నిజామ్ తిరస్కరిస్తున్నట్టు సమాచారం అందంది. వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీకి అందచేశాను.

బ్రౌన్ సందేశం అత్యంత ఆసక్తికరమైనది.

రాత్రి 11.15 గంటలకు రాజాజీ నుంచి నిజామ్‍కు సందేశం అందింది. భారత్ డిమాండ్లకు ఆమోదం తెలపమని మరోసారి అభ్యర్థిస్తున్నారు. నిజామ్ అప్పటికే నిద్రపోయాడని తెలిసింది.

సెప్టెంబర్ 10న భారత గవర్నర్ జనరల్, నిజామ్ ఉత్తరానికి సమాధానం పంపాడు. నిజామ్‍పై నమ్మకంతో, యథాతథ ఒప్పందం ప్రకారం భారత సైన్యాన్ని ఉపసంహరించుకున్నామనీ, కానీ ఆ తరువాత హైదరాబాదులో శాంతి భద్రతలు కరువయ్యాయనీ, నిజామ్ ప్రభుత్వం రజాకార్లకు అదపులో పెట్టటంలో కానీ, కమ్యూనిస్టులను అణచివేయటంలో కానీ విఫలమయిందనీ, ఇలాంటి పరిస్థితులలో భారత ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిలా సరిహద్దుల దగ్గర నుంచి చూస్తూ ఉండిపోదని స్పష్టంగా రాశారు.

10వ తారీఖున రాజాజీ ఇచ్చిన టెలిగ్రామ్‌కు సమాధానంగా, నిజామ్, తన సైన్యానికి శాంతి భద్రతలను కాపాడగల శక్తి కలదన్నాడు. భారత సైన్యం హైదరాబాదులో ప్రవేశించటం నైతికం కాదనీ, న్యాయబద్ధం కాదని, అందువల్ల అనవసరమైన అశాంతి చెలరేగుతుందనీ నిజామ్ సమాధానం ఇచ్చాడు.

ఉదయం 7-15 కు రాజాజీ సందేశాన్ని మేజర్ సింగ్ నిజామ్‌కు అందజేశాడు. బ్రిటీషర్లను తీసుకువెళ్ళేందుకు యార్క్ విమానం మళ్లీ వచ్చింది. ఓ రెండు వందల మంది ఇంకా మిగిలి ఉన్నారు. బ్రిటీష్ సైనికులు హైదరాబాద్ వదిలి వెళ్ళటానికి ఇష్టపడలేదు. వారు ఇతరు పౌరులు చేసే ఉద్యోగాలు చేసేందుకు సిద్ధపడ్డారు. ఇదొక మోసం. వారికి నిజామ్ ఇచ్చే డబ్బులు వదలుకోవటం ఇష్టం లేదు. అమెరికా పౌరులను తీసుకువెళ్ళే విమానంలో మిస్టర్ W, అతని కుక్క వెళ్లిపోయారు. హైదరాబాదుకు సహాయం చేసేందుకు కింగ్ ఫారూఖ్ సిద్ధంగా ఉన్నాడని వినికిడి. ఇది నిజమో కాదో నాకు తెలియదు.

పన్నాలాల్‌తో కలిసి లంచ్ చేశాను. బుచ్‍కి ఫోన్ చేశాను.

నిజామ్ మళ్ళీ టెలిగ్రామ్ పంపించాడు. నిజామ్ గొప్పవాడు.

సాయంత్రం పాత్రికేయులు నన్ను కలిశారు. ప్రశాంతంగా డిన్నర్ చేశాను. నిజామ్‍కు చివరి హెచ్చరిక నిస్తూన్న మీనన్ అధికారిక టెలిగ్రామ్ సాయంత్రం 7.30కు అందింది.

సర్దార్‌తో టెలిఫోన్‍లో మాట్లాడేను. మన సైన్యం త్వరలో ఇక్కడికి రాబోతోంది. రాజు, వెంకట వర్ధన్, రామ్‌సింగ్‌లు సెలవుల మీద వెళ్ళిపోయారు. Y పారిపోయాడు. అతనిపై ఆగ్రహం కలిగింది. బుచ్‍తో అతని గురించి మాట్లాడేను.

మమ్మీతో మాట్లాడేను. ఆమె హైదరాబాద్ వస్తానంది. వద్దన్నాను. ఆమె ఢిల్లీలో రాజాజీ, సర్దార్, మిసెస్ పండిత్ లను, ఇతరులను కలిసింది.

భవన్‍కు రూ.40,000 విరాళం కోసం ఎం.పి. అమిన్‌తో మాట్లాడేను ఉదయం.

పాకిస్తాన్ విమానం వస్తోందన్న వార్త అందింది. ఢిల్లీకి, పూనాకు ఈ విషయం తెలిపాను. అది అసలైన విమానం కాదు.

హైదరాబాద్‌కు కలగబోతున్న  ఈ ఉపద్రవానికి కారణమయిన మొయిన్ నవాజ్ జంగ్ 10వ తారీఖున రాత్రి హైదరాబాద్ బృందాన్ని తీసుకుని సిడ్నీ కాటన్ విమానంలో భద్రతామండలికి ప్రయాణమయ్యాడు. ఆయన తన కుటుంబాన్ని, ఇతర వస్తువులను తీసుకుని వెళ్లాడు. ఇలా కుటుంబాన్ని, వస్తువులను వెంటతీసుకుని వెళ్లటం – అతనికి తన కల చెదిరిపోయిందని, నిజామ్ ఆశలు నిరాశలయ్యాయన్న గ్రహింపు కలిగిందన్న భావన నిస్తుంది. హైదరాబాద్ రాష్ట్రం, నిజామ్, ఆశలు అన్నీ అతని పగిలిన కలల హార్మ్యాల శకలాల క్రింద పడి నలిగిపోయాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here