జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-76

0
3

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

చింతయి త్వేతి భూపాలః శిలాప్రవాహణైర్ణ ఢైః।
ఉల్లోల సరసో మధ్యమప్యగాధమపూరయత్॥
(జోనరాజ రాజతరంగిణి 940)

[dropcap]ఫ[/dropcap]ణిరాజు  కోసం  ఉచితమైన నివాసాన్ని సరస్సు మధ్యలో నిర్మించాలని నిశ్చయించుకున్న జైనులాబిదీన్ వెంటనే పని ఆరంభించాడు. సరస్సు మధ్య భాగం ఎంతో లోతైనది. కానీ నౌకలలో పెద్ద పెద్ద బండరాళ్లను తీసుకుని వచ్చి ఆ లోతుల్లో వేయించాడు. రాళ్లతో లోతులను పూడ్చేశాడు.

చరిత్ర పరిశోధకులు ఉల్లోల సరస్సును ప్రస్తుతం ‘వూలూరు’ సరస్సుగా గుర్తించారు. ఈ ప్రాంతంలో పరిశోధకులకు పర్షియన్ రాతలున్న రాతిపలకలు  లభించాయి. ఇది క్రీ.శ. 1436 ప్రాంతం నాటి శాసనంగా గుర్తించారు. వారికి లభ్యమైన శాసనంలో ‘షాహ జైన్’ అన్న పేరును గుర్తించారు. దీని ఆధారంగా జైనులాబిదీన్ సరస్సులో నిర్మాణాన్ని క్రీ.శ. 1434/35 ప్రాంతంలో ఆరభించి ఉంటాడని ఊహిస్తున్నారు. వూలూరు సరస్సు దగ్గర ఉన్న మసీదు వద్ద పరిశోధకులకు పర్షియన్ రాతలున్న మరో రాయి లభించింది. మేజర్ ఎస్ బారెట్ అనువాదం ప్రకారం ఆ రాతి పలకలపై ‘ఈ భవనం స్వర్గం ఉన్నంత కాలం స్థిరంగా ఉండుగాక. ప్రపంచంలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఆభరణం లాంటిది ఈ భవనం. జైనులాబిదీన్ ఈ భవంతిలో నిత్యం సంబరాలు జరుపుగాక’ అని రాసి ఉంది. ఈ రాతలు కూడా జైనులాబిదీన్ కాలానికి చెందినవనీ, క్రీ.శ. 1443/44 ప్రాంతానికి చెందినవని నిర్ధారించారు. ప్రస్తుతం ఈ రాతి పలకలు శ్రీనగర్ లోని ప్రతాప్ సింగ్ పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయి.

సరసస్తు తతస్తస్య స్థలీభూతేథ భూపతిః।
మధ్యదేశే మహారాజో జైనలంకా వినిర్మమే॥
(జోనరాజ రాజతరంగిణి 941)

సుల్తాన్ సరస్సు మధ్యలో ఏర్పాటు చేసిన భూమి ‘జైన లంక’గా ప్రసిద్ధి పొందింది. గతంలో రాక్షసరాజుల సహాయంతో జయాపీడుడు ఈ సరస్సు తీరప్రాంతంలోనే సరస్సు నుంచి భూమిని వెలికి తీశాడు. ఇప్పుడది తామరలు, నీటితామరలు, ఇతర మొక్కల నడుమ ఉంది. చుట్టూ ఉన్న మొక్కలను తొలగించిన తరువాత సరస్సు ఒడ్డున జయాపీడుడి నిర్మాణాలు కనిపిస్తాయి. సరస్సు ఒడ్డున సుయ్యాకుండల వంటి నగరాలు, వాటి నిర్మాణాల ఆనవాళ్లు కనిపిస్తాయి. పర్వతాలు సైతం మునిగిపోయే ఈ సరస్సులో సుల్తాన్ జైనులాబిదీన్ ఆకాశం తాకే మహాద్భుతమైన హర్మ్యాలు నిర్మించాడు.

రుయ్య ఖండాపతిం శిల్ప కౌశలాభ్యుల్ల సన్మతిమ్।
రాజధానీ మహాద్వారం నష్టం యోయోజయత్ పునః॥
(జోనరాజ రాజతరంగిణి 946)

నిర్మాణాల్లో  నిష్ణాతుడు, అత్యంత తెలివైన వాడయిన ‘రుయ్య’ అనేవాడిని సరస్సు నడుమ నిర్మించిన ఈ నూతన నగర అధిపతిగా నియమంచాడు. ఈయన గతంలో రాజధాని మహా ద్వారానికి నష్టం కలిగితే దానికి మరమ్మత్తులు చేశాడు. సుల్తాన్ సరస్సు నడుమ నగరాన్ని ఎంత గొప్పగా నిర్మించాడంటే, ఎట్టి పరిస్థితులలోనూ నగరం మునిగిపోయే వీలు లేని విధంగా నిర్మించాడు.

హిమాలయాల గర్వమణచేంత రీతిలో క్రామరాజ్యం వద్ద సుల్తాన్, సురత్రాణపురం  నిర్మించాడు. విదేశీ అనువాదకులు ఈ సురత్రాణపురాన్ని ‘సుల్తాన్ పురం’ గా పొరబడి అనువదించారు. శత్రువుల మదమణిచిన జైనులాబిదీన్ ‘జైన కోట’ ను నిర్మించాడు. ఆ కోట చుట్టు అందంగా అలంకరించిన ఐశ్యర్యం ఉట్టిపడే భవంతులు నిర్మించాడు. భవంతులపై జెండాలు రెపరెపలాడుతుంటాయి.

జీర్ణోద్ధారేషు సర్యషు నిర్మాణేషు నరేషు చ।
ఆజ్ఞ రాజ్ఞ బభీ హేతూ రుయ్య భాండపతేన్ద ధీ॥
(జోనరాజ రాజతరంగిణి 949)

జీర్ణమయిన భవంతులను ఉద్ధరించమని, నూతన నిర్మాణాలు చేపట్టమన్న ఆజ్ఞలు రాజు నుంచి అందినా, ఆ ఆజ్ఞల వెనుక ‘రుయ్య భాండ’ మేధ ఉంది. అంటే జైనులాబిదీన్ నిర్మాణాల విషయంలో ఆలోచనలు, సలహాలు, సూచనలకు ‘రుయ్య భాండ’ ఇస్తున్నాడన్న మాట.

మహాపద్మాసరస్తీరే జైనోపపదశాలినః।
పురమండపి కాద్యో షాంస్తధా శ్రీజైనమండలమ్।
స జైనపత్తనం చాపి విధధే ధరణీపతిః॥
(జోనరాజ రాజతరంగిణి 950)

మహాపద్మ సరస్సు తీరంలో జైనులాబిదీన్ జైన పదం ముందు కల జైనమండల, జైన పట్టణాలను నిర్మించాడు. ఆ పట్టణాలలో ప్రాకే మొక్కలను పెంచడం వల్ల నగరమంతా పాకిన ఆ మొక్కల తీగలు నగరానికి అలంకరణల్లా ఉన్నాయి.

ఇక్కడి నుంచి 48 శ్లోకాలు జైనులాబిదీన్ లిద్దర్ నది ప్రవహాన్ని మళ్ళించిన గాథను చెప్తాయి. అయితే ఈ 48 శ్లోకాలను ప్రధాన రాజతరంగిణిలో బాగంగా గుర్తించలేదు పండితులు. వీటిని ప్రక్షిప్తాలుగా కొందరు భావిస్తే, జోనరాజే వీటిని రచించాడని ఇంకొందరు నమ్ముతారు. ఏదీ నిర్ధారణ కాకపోవటంతో ఈ శ్లోకాలను రాజతరంగిణికి అనుబంధంగా చేర్చారు. అయితే ఈ శ్లోకాల అర్థాలు తెలుసుకోవటం శ్రేయస్కరం. ఎందుకంటే కశ్మీర చరిత్రలో ప్రధాన అంశాలతో ముడిపడి ఉంటుంది ఈ శ్లోకాలలోని అంశం. ఈ శ్లోకాలు తొలగించినా రాజతరంగిణి కథకు  ఎలాంటి లోపమూ కలగదు.

లిద్దర్ నదికి ఎడమ వైపున ఉన్న మార్తాండ పీఠభూమి నీటి విడుదల వైపు సుల్తాను దృష్టి మళ్లింది. ఈ పని చేస్తే తనకు   పేరుప్రఖ్యాతులు వస్తాయని సుల్తాన్ భావించాడు. ఆ పీఠభూమిలో నీటి వసతులు సరిగ్గా లేవని, అక్కడ వర్షం సరిగ్గా పడదని తెలుసుకున్న సుల్తాన్ పీఠభూమిపైకి నీళ్ళు మళ్ళించాలని ఆతృత పడ్డాడు. లిద్దర్ నదికి నీళ్లు అమరేశ్వరం నుంచి అందుతాయని నిపుణులు సుల్తానుకు తెలిపారు. అయితే ఈ నిర్మాణం తలపెట్టాలంటే అమరేశ్వరుడి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అమరేశ్వరుని ప్రార్థిస్తే, ఆయన అనుగ్రహిస్తే రాజు తలపెట్టిన నిర్మాణం విజయవంతమవుతుందని తెలిపారు. దాంతో, అమరేశ్వరుడిని ప్రార్థించి, ప్రసన్నం చేసుకుని, అనుగ్రహం సంపాదించేందుకు పర్వతాన్ని అధిరోహించాలని సుల్తాన్ నిశ్చయించుకున్నాడు. అయితే, కొండ ప్రాంతాలలో నాగులుంటారు. వారు ప్రాకే మొక్కల కొమ్మల్లో, పర్వతాలలో ఎక్కడబడితే అక్కడ ఉంటారు.

తె లూతాభ్య ఇవ మ్లేచ్ఛా నాగోభ్యః శంకయాకులాః।
నాన్యోన్యమపి సంలాపం తత్ర మూకా ఇవ వ్యాధుః॥
(జోనరాజ రాజతరంగిణి 1235)

పర్వతం పై తీగల్లా ఎక్కడబడితే అక్కడ ఉండే నాగులంటే అందరికీ భయం. దాంతో సుల్తాన్ వెంట వచ్చిన మ్లేచ్ఛులు గట్టిగా మాట్లాడడానికి భయపడ్డారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నా, తములో తాము గుసగుసలాడుతున్నట్లే ఉంది. ఈ శ్లోకం – జోనరాజ రాజతరంగిణిలో భాగమే అయి ఉంటే ఈ శ్లోకం ఆనాటి పరిస్థితుల్లోని ఒక అంశాన్ని ఎత్తి చూపిస్తుంది. సుల్తాన్ జైనులాబిదీన్ ఎంత పరమత సమానం ప్రదర్శిస్తున్నా ఎంతగా కశ్మీరును వదిలి వెళ్ళిన పండితులను కశ్మీరుకు పిలిపించి వారికి ఉన్నత పదవులను అందించి, రక్షణనిస్తున్నా ఇంకా సుల్తాన్‌ను మ్లేచ్ఛుడిగా, పరాయి వాడిగా గ్రహించి దాడులు జరపుతూనే ఉన్నారన్న మాట నాగులు. అంటే, కశ్మీరీ పండితులు పరిస్థితులతో రాజీపడినా నాగులు సుల్తానుల ఆధిక్యాన్ని ఆమోదించలేదు. వారికి తలవంచలేదన్న మాట. ఈ విషయం తరువాత శ్లోకం మరింత స్పష్టం చేస్తుంది.

త్వగ్రోగి నామివా స్వస్థ్యాస్తురూక్షాణాం వనస్థితాః।
నాగా దర్శనమప్యన్తార్తసహంత కదాచన॥
(జోనరాజ రాజతరంగిణి 1236)

ఆరోగ్యవంతులు, కుష్ఠువ్యాధిగ్రస్తుడిని చూసేందుకు ఎలా ఇష్టపడరో, ఎలా కుష్ఠు వ్యాధిగ్రస్తుడి పొడగిట్టదో, అలాగే, నాగులు ఎట్టి పరిస్థితులలో తురుష్కులను చూసేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. తురుష్కులను చూడాల్సి వస్తుందని వారు నగరాలు వదిలి, అరణ్యాలలో, కొండలు, కోనల్లో నివసించడం ఆరంభించారు. ఇది ఎంత మెత్తగా చెప్పినా, ఆ కాలంలో కాశ్మీరు మూలవాసులయిన నాగులకు, తురుష్కులకు నడుమ ఉన్న ఉద్విగ్నతలను, ద్వేష భావనలను ప్రస్ఫుటం చేస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here