సిరివెన్నెల పాట – నా మాట – 23 – ‘సంతోషం’ విలువను ప్రకటించే పాట

0
3

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా

~

చిత్రం: చిరునవ్వుతో

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: దిల్ రాజ్

గాత్రం: ఎస్.పీ. బాలసుబ్రమణ్యం

~

గీత సాహిత్యం

పల్లవి:
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ
చరణం:
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా?
చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా, లేనిపోని సేవచెయ్యకు
మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా?
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా?
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ
చరణం:
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైన ఆగదుగా?
నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ, నిద్రమానుకోగలమా?
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ, లేవకుండా ఉండగలమా?
కలలుగనీ అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ..
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా

“తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయచుట్టంబౌ,
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ.”

మన సంతోషంలోనే మన స్వర్గం దాగుందని, మన దుఃఖమే మనకు నరకప్రాయమనీ హితబోధ చేస్తాడు సుమతీ శతకంలో, బద్దెన కవి. ప్రతి ఓటమిలోనూ, ప్రతి నిరాశలోనూ మన నిస్పృహను తరిమేసి, మనల్ని విజయ తీరాలకు నడిపించే ప్రేరణాత్మకమైన ఎన్నో పద్యాలు, కవితలు, నానుళ్ళు, సామెతలు, పాటలు మనకు ప్రపంచంలోని అన్ని భాషల్లో విరివిగా వినిపిస్తుంటాయి. ఏదైనా మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే, నిరాశకు లోనవుతాం, దాన్ని తరిమేయడానికి దుఃఖాన్ని, బాధని ఆశ్రయిస్తాం. కానీ జీవితంలో నెగ్గాలంటే, కావలసింది మనం ఒక negative situation కి కృంగిపోవడం కాదు. ఆ పరిస్థితి పట్ల మనలో ఉప్పొంగే భావోద్వేగాన్ని సరైన దిశలో నడిపించడం. అందుకే ఈ ఆధునిక ప్రపంచంలో, Intelligent Quotient-IQకన్నా, Emotional Quotient-EQకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. Stress Management లో మానసిక సమతౌల్యతను పెంచి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే EQ, ఇప్పుడు ఉద్యోగ సాధనలోనూ విజయాన్ని సాధించి పెట్టడమే కాకుండా, వారి వారి నిర్దేశిత రంగాల్లో ఉన్నత శిఖరాలకు కూడా చేరుస్తోంది. ప్రశాంతమైన విశ్రాంత జీవితాన్ని కోరుకునే Senior citizens అయినా, ఒత్తిడి లేకుండా జీవితాన్ని గడపాలనుకునే యువత అయినా, ముఖ్యంగా పెంపొందించుకోవాల్సిన భావోద్వేగ సూచీ అయిన EQ భావోద్వేగ మేధస్సు (ఎమోషనల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా నిర్ధారించబడుతుంది.

Emotional intelligence is “the ability to understand, use, and manage your own emotions in positive ways to relieve stress, communicate effectively, empathize with others, overcome challenges and defuse conflict.”

“ఏడవకు ఏడవకు చిట్టి పాపాయి,
ఏడిస్తే నీ కళ్ళ నీలాలు కారు,
నీలాలు కారితే నీ చూడలేను..”

అంటూ చంటి పాపాయిని కూడా ఏడవకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ, మనం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనే సందేశాన్ని పురిట్లోనే మనకు అందిస్తారు తల్లులు. “సంతోషమే సగం బలం”, అన్నది తెలుగు నాట ఎంతో ప్రఖ్యాతమైన నానుడి. చింతలో, బాధలో, వ్యథలో ఉన్నప్పుడు మన శక్తి మొత్తం నీరుకారి, నిర్వీర్యం అవుతుంది. అదే సంతోషకరమైన ఆలోచనతో అయితే! ఆ ఆలోచనే చెప్పలేనంత శక్తినిస్తుంది! అందుకే ఎప్పుడూ హాయిగా నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ, జీవితాన్ని ఆనందమయంగా గడపాలి.

ఇదే కాన్సెప్ట్‌ని, ఎంతో ప్రేరణాత్మకమైన motivational song లాగా తీర్చిదిద్ది “సంతోషం సగం బలం”, అనే పాటను మనకు అందించారు సిరివెన్నెల.

‘చిరునవ్వుతో’ అనే చిత్రం కోసం, సిరివెన్నెల ఈ పాటను వ్రాయగా, దిల్ రాజ్ స్వరకల్పనలో, తేనెలూరే తన మధుర కంఠంతో ఆలపించారు ఎస్పీబీ. ఈ పాట సగటు ప్రేక్షకుడిని కూడా గొప్పగా అలరించింది. ఎంతోమంది ఈ పాట నుండి ప్రేరణ పొంది, వారి జీవితంలో నిరాశలను జయించారట. ఈ చిత్రంలో కథానాయకుడు వేణు, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలనే స్వభావాన్ని కలిగిన వ్యక్తి. తన మామ కూతురు అయిన అరుణ, ప్రేమలో మోసగింపబడి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు, ఆమెకు ధైర్యాన్ని నూరిపోస్తూ, జీవితంలో ఉత్సాహాన్ని నింపేలాగా పాడే పాట ఇది.

When things go wrong అనే కవిత.. కష్టాలు మనలోని బలాన్ని నిరూపించడానికే వస్తాయనీ, పరిస్థితులు నిరాశజనకంగా ఉన్నా, సానుకూల దృక్పథంతో వాటిని చక్కబరుచుకోవచ్చని సందేశం ఇస్తుంది.

What if the things are wrong?
You know that you are strong,
What if the light is dim?
And the situation is grim,
You think positive and everything will be fine,
That is the only prayer in life,
It is really divine,
So stay in a positive frame of mind!

అసలు ఈ పాట పల్లవే మనల్ని ఎంతో ఉల్లాసపరుస్తుంది. నాలుగు వాక్యాల చిన్న పల్లవిలోనే అనంతమైన భావాన్ని ఇమిడ్చి ‘సంతోషం’ విలువను ప్రకటించారు సిరివెన్నెల.

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ?
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ..

సంతోషంతో మన బలహీనతలు దూరం చేసుకుని హాయిగా నవ్వమనీ, ఆ నవ్వుల సంగీతంలో దుఃఖం నుండి స్వేచ్ఛ పొంది గువ్వలాగా ఎగరమనీ, ఎంతో భావుకతతో, ఒక నిత్య సత్యాన్ని బలపరుస్తారు సిరివెన్నెల. మనసులోని ఆనందం కళ్ళలో ప్రతిఫలించగా, వాటిలో జాబిలి వెలుగులు కనిపిస్తాయని, హాయిగా నవ్వుకుంటూ బ్రతుకు గడిపే కుటుంబాల లోగిళ్లలో సంతోషాల మతాబులు వెలుగుతూ, దీపావళి తిష్ట వేసుకుని ఉండిపోతుందని బలంగా సెలవిస్తారు ఆయన.

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే, రేపటి వైపుగా నీ చూపు సాగదుగా?
చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాళ్లు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా, లేనిపోని సేవచెయ్యకు
మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా?
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా?
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ

గతంలో మనకు కలిగిన బాధని, కష్టాన్ని మళ్లీ మళ్లీ తవ్వుకుంటూ ఉంటే, మన భవిష్యత్తుకు బాటలు ఎలా కనిపిస్తాయి? సంతోషం మనతో జీవితకాలం సాగిపోయే నేస్తమైతే, కష్టం అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టం మాత్రమే. దాన్ని చిరునవ్వుతో సాగనంపాలి కానీ, లేనిపోని సేవలు చేస్తూ మనతో ఉండిపోనియ్యకూడదు. మనసును ముసురుకునే చీకట్లు భయపడి దూరంగా పారిపోవాలంటే, చిన్నదైనా ఒక చిరునవ్వే చాలు! అంటూ ప్రబోధిస్తారు సిరివెన్నెల. నిజంగా ఇంత అద్భుతమైన సందేశాన్ని మనం పాటించగలిగితే, మన జీవితాన్ని పాజిటివ్ గా మలచుకోలేమా?

Afeksi cita రాసిన It’s okay అనే కవిత మనకు ఇదే భావాన్ని అందిస్తుంది

It’s okay, you don’t always have to smile It’s okay to cry for a little while Sometimes life can be hard But it’s okay, you don’t have to play all of it’s parts
It’s okay, don’t be scared to let it go Cause soon you’ll find your own glow Yes, there will come the time when you’ll find it And soon all your tears and fears will be worth it.

ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైన ఆగదుగా?
నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ, నిద్రమానుకోగలమా?
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ, లేవకుండా ఉండగలమా?
కలలుగనీ అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ..
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా..

ఏ కష్టం ఎదురైనా జీవితం సాగిపోతూనే ఉండాలి.‌ జీవితంలో పీడకల లాంటి కష్టం ఒకటి వస్తే, దాన్ని తలుచుకుంటూ ఎన్ని రాత్రులు నిద్ర మేలుకోగలం? ఒకవేళ స్వప్నం మంచిదే అయినా, ఆ ఆనందంలోనే ఎంతకాలం వుండిపోగలం? ఏ కల అయినా కరిగిపోయేదే కాబట్టి, కొంత కాలానికి మరుపు రావాల్సిందే, కొత్త బాటలలో సాగుతూ ముందుకు వెళ్లాల్సిందే, కొత్త గమ్యాలు చేరుకోవాల్సిందే! కలను ‘కల’ అని గుర్తించడమే అసలైన జ్ఞానం అంటారు సిరివెన్నెల. కిలకిలా నవ్వుకుంటూ పీడకల లాంటి కష్టాలను, నూరామడల దూరం తరిమేయాలి. అదే జీవితం.

Prevail అనే కవితలో Amanda వ్యక్తీకరించే అంశం కూడా, ఇదేవిధంగా మనల్ని ఉత్తేజపరుస్తుంది.

I will always Look for sun after rain
As it flashes through the prism vein
Of the coloured bow

I will always Look for trust amongst a betray
For conscience will always have its way And regret will show

I will always Look for anger’s smiling frown
As turns a shout upside down
Allowing laughter to exhale

I will always Let love control hearts hate Over a constant populace of hate lovers Hoping love will prevail..

నవ్వు, ఉత్సాహం, ధైర్యం, ఆశ అనే ఎన్నో తీపి మాత్రలని ఎంతో భావుకత నిండిన తన రచనల ద్వారా మన మనసుకు అందించే, మానసిక వైద్యుడు సిరివెన్నెల. జీవితంలో ఎదురయ్యే ప్రతి చిక్కులో నుండి, చింతల ఊబిలోనుండి మనకు చేయూతనందించి, ఉత్తేజపరిచి కొత్త ఆశల బాటలో మనల్ని నడిపే సహృదయ కవి మిత్రుడు, ఆత్మీయుడు సిరివెన్నెల. సముద్రమంత లోతైన భావాలను, చేప పిల్ల మొప్పెలంత చిన్న పదాలతో చిందులేయించడం, సిరివెన్నెల జాలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here