[శ్రీ ఎన్.టి.ఆర్. గారి శతజయంతి సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంగా డా. సి. భవానీదేవి అందిస్తున్న కవిత.]
[dropcap]ఆ[/dropcap] పేరు తల్చుకుంటేనే
మనసంతా వెలుగైపోతుంది
ఆ సమ్మోహన రూపం చూస్తేనే
భువిలో దివ్యోదయమవుతుంది
ఆ జనాకర్షకస్వరం వింటేనే
ఎడారి ఆశకు చూపొస్తుంది
రక్తం పంచుకుని పుట్టకపోయినా
పెంచుకున్నదేదో భాషాబంధం
ఎన్ టి ఆర్ పేరు తెలుగుకు శ్వాస
ఆడబడుచులకదే అభయహస్తం
ఒక వెండితెర అందగాడు
అసాధారణంగా అందరివాడవటానికి
ఎంత కఠోరతపస్సు చేసుండాలి
ఇంటింటి దేవుడుగా మారటమంటే
కారణజన్ములకే సాధ్యం కదా!
అమ్మభాషంటే ఎగిసిపడే కడలికి
అవధుల్ని విధించతరమా!
జాతి ఆత్మగౌరవ పతాకం
నీతికి నిలువెత్తు నిదర్శనం
జనులందరికీ మేలైన నాయకత్వం
కార్మికుడైనా కన్నయ్యయినా
అసంభవాన్ని సంభవం చేసే
దక్షత నిండిన ధీరపాలకత్వం
ఎన్నోసార్లు బాధితులకోసం
జోలె పట్టాడు రామన్న
మరెన్నోసార్లు చైతన్యరథంలో
ఖాకీయాత్రా దీపకుడైనాడు
రూపానురూపమైన అపురూపానికి
మా కంటిచూపయిన తెలుగు గర్వానికి
వందనం.. శతాధిక జన్మదినోత్సవ అభివందనం