నిరంతర దైవ నామస్మరణ

0
3

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘నిరంతర దైవ నామస్మరణ’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]చారయుక్తంగా జపం చేసుకోవడానికైతే కొన్ని నియమాలను పాటించాలి కానీ, దైవ నామస్మరణ ఎక్కడైనా.. ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకు కావలసింది చిత్తశుద్ధి, పవిత్రమైన మనస్సు, భగవంతునిపై అచంచల విశ్వాసం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. నిత్యం అనేక సమస్యలతో, ఆందోళనలతో సతమతమయ్యే వారికి నిరంతర దైవ నామస్మరన ఒక్కటే దివ్యౌషధమని అన్నో అనుభవాలు చెబుతున్నాయి. నిరంతరం హరినామాన్ని స్మరించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది. హరినామాన్ని స్మరిస్తూ ఆనందాన్ని పొందాలి, అనుభూతి చెందాలి. అప్పుడు విశేషమైన భగవత్ కృప లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు, అవి మనశ్శాంతి, రెండవది సంతృప్తి అని పెద్దలు చెబుతుంటారు.

భగవంతుని నామ స్మరణ చేస్తే చాలు, వెలకట్టలేని రెండు సంపదలనూ ఇస్తాడు అన్నది అసంఖ్యాకమైన భక్తుల అచంచల విశ్వాసం.

ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి. అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి. ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి. నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం. అది మనలోని దుష్ట సంస్కారాలను అరగదీసి పవిత్రతతను ఆపాదిస్తుంది. సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అన్నది శాస్త్ర వాక్యం. అంటే మేల్కొలుపు, స్వప్నం మరియు గాఢనిద్ర అనే మూడు స్థితులలోనూ భగవంతునిపై నిరంతర చింతన చేసేవారికి సత్వరమే భగవంతుని కృప అవ్యాజంగా లభిస్తుంది.

అనేక నీచజన్మలెత్తే జీవికి మానవ జన్మనిచ్చేది దైవ నామం మాత్రమే. పక్షులు మరియు జంతువులు ఒకే ఒక్కసారి పవిత్ర నామాన్ని వినడం ద్వారా మానవ జన్మను పొందగలవని ఎన్నో పురాణగాథలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ దైవ నామ పునశ్చరణ భగవంతుని పట్ల ప్రేమతో, విశ్వాసంతో, చిత్తశుద్ధితో జరగాలి. దురదృష్టవశాత్తు, దైవ నామాన్ని అనేకసార్లు పునశ్చరణ చేసినప్పటికీ మానవులలో ఎటువంటి పరివర్తన జరగడం లేదు. అందుకే పూర్తి విశ్వాసంతో దైవ నామాన్ని హృదయపూర్వకంగా జపించాలి. విశ్వాసం భగవంతుని పట్ల ప్రేమను పెంపొందిస్తుంది మరియు భగవంతుని పట్ల ప్రేమ మానవ జన్మనిస్తుంది. మన పాపాలన్నీ నశించి ఉత్తమ జన్మలు కలుగుతాయి. మనస్సు స్వతాహాగా చంచలమైనది. అది అటు ఇటూ పరుగులు తీస్తూ మనలని నిరంతరం ఆందోళనకు గురి చేస్తుంది. అయితే మనస్సును దైవ నామంపై స్థిరంగా నిలబెట్టినట్లయితే గొప్ప పరివర్తనను సాధించవచ్చు. ఏ పని చేపట్టినా చిత్తశుద్ధితో చేయాలి. అందుకు ముందుగా మనస్సు యొక్క స్వచ్ఛతను పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఏ పైనైనా మానసిక స్వచ్ఛతతో చేపట్టి భగవంతుడిని ప్రార్థిస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది. దైవ నామస్మరణ, ఎక్కువసార్లు అనవసర విషయాలు మాట్లాడకుండా మౌనం పాటించడం, దైవపూజ, ఇంద్రియ నిగ్రహం, జపం.. వీటిని పాటిస్తే చాలు పాపాల నుంచి విముక్తులమై ఆయన అనుగ్రహం పొందవచ్చు. పాపకర్మలను పుణ్యకర్మలుగా మార్చుకునే సాధనం నిరంతర దైవ నామ స్మరణ. మొదట్లో కాస్త కష్టంగా వున్నా నిత్యం క్రమం తప్పకుండా ఆచరిస్తే క్రమంగా మనసుకు ఇది అలవాటై పోతుంది. ఇక పాపకర్మల వైపు మనసు మళ్లదు. అలాంటి వాళ్ల మనసు నిర్మలంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు.

ఇది సత్యం, సత్యం, సత్యం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here