[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘పెళ్ళి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]స్నే[/dropcap]హితురాలు అహల్య వెడ్డింగ్ కార్డు చూసేడు వెంకటేష్. అహల్యకి సాగర్‌తో పెళ్లి జరుగుతున్నట్లు వుంది అందులో. మరో వారం రోజుల్లో పెళ్లి. పెళ్లి కొడుకు పేరు చూసి ఆశ్చర్యపోయాడు. రాఘవ పేరు బదులు సాగర్ పేరు ఉండడం అతని ఆశ్చర్యానికి కారణం.
అసలు రాఘవ ఎవరో తెలియాలంటే, వెంకటేష్ అహల్యల స్నేహం, మిగిలిన విషయాలు తెలియాలి.
అహల్య అతని చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరి కుటుంబాలు ఒంగోలులో లాయర్ పేటలో ఒకే వీధిలో ఉండేవి.
ఇంటర్మీడియట్ వరకు కలిసే చదువుకున్నారు. వెంకటేష్‌కి I.I.T లో సీట్ వచ్చేక, ముంబై వెళ్లి పోయినా, సెలవలకి వూరు వెళ్లినప్పుడు కలుస్తూండేవాడు. బి.టెక్ అయ్యేక, చెన్నైలో మంచి వుద్యోగంలో జాయిన్ అయిపోయాడు.
వుద్యోగంలో జాయిన్ అయ్యేక, ఒంగోలు వెళ్లడం కూడా తక్కువ అయిపోయింది.
ఈ మధ్య వాళ్ళ నాన్నగారు చూడాలని వుంది, రమ్మన్నా, వెళ్ళడానికి వీలు పడలేదు. టికెట్స్ బుక్ చేసి, అమ్మ, నాన్నలనే చెన్నై రప్పించుకున్నాడు. ఆయన రైల్వేలో పని చేసి, రిటైర్ అయ్యేరు.
అహల్యకి మేనత్త కొడుకు రాఘవ అంటే చాలా ఇష్టం. కాలేజీలో వాళ్ళిద్దర్నీ మొగుడు పెళ్ళాలు గానే తామంతా పిలుస్తూ వుండేవారు. వెడ్డింగ్ కార్డు మీద రాఘవ పేరు కాకుండా.. సాగర్ అని ఎవరి పేరో ఉందేమిటి..?.. ‘వెంటనే అడిగి తెలుసుకోవాలి’ అనుకున్నాడు.
ఆ సాయంత్రం కాల్ చేసేడు. అహల్య మాటల్లో ఉత్సాహం లేదు.
“ఏం చెప్పమంటావు వెంకటేష్. మా నాన్నకి మా మేనత్త కొడుకు సంబంధం ఇష్టం లేదు.
వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు. పైగా మా రాఘవకి పెద్ద వుద్యోగం రాలేదు. మా అత్తకి భర్త లేడు కదా.. పెళ్లి అయిన దగ్గర నుండీ, మీ దగ్గరే ఉంటుంది.. నువ్వు సుఖపడలేవు అమ్మా..
అయినా నాకేం తక్కువ.. నిన్ను డబ్బున్న వాళ్ళ కుటుంబం లోనే ఇస్తాను.. అన్నాడు మా నాన్న”.
నీకు తెలుసుగా, మా నాన్న మాట తప్ప ఎవరి మాట ఈ ఇంట్లో చెల్లదు. మా అమ్మకి నోరు లేదు.
మా నాయనమ్మ చనిపోయేక, మా నాన్నని అదుపులో పెట్టేవాళ్ళు లేరు. ఆవిడ బతికి ఉంటే, నాకు రాఘవని కాకుండా ఎవరినీ చేయనివ్వదు. ఏం చేస్తాం.. నా ఖర్మ.” అంది.
వెంకటేష్ ఆశ్చర్య పోయాడు.
“బి.టెక్ చదివి, నీ పెళ్లి విషయంలో మీ నాన్నని ఎదిరించలేవా?” అన్నాడు.
“మా నాన్న సంగతి తెలుసు కదా.. తనకి నచ్చినట్లు చేసుకోకపోతే, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని బెదిరించేడు. మా అమ్మ ఏడుపు తప్ప, ఏమీ చెయ్యలేదు. నాకు ఇంక ఏం చెయ్యాలో తోచలేదు.. సరే అన్నాను” అంది.
“మా ఇంట్లో ఆడవాళ్ళకి స్వంత ఆలోచనలు, ఉద్దేశాలు ఉండకూడదు వెంకటేష్. నా తల రాత ఎలా ఉంటే అలా” అని నిట్టూర్చింది.
“అయితే, ఈ సాగర్ ఎవరు?” అన్నాడు.
“బయటి సంబంధం. అతను నేవీలో పెద్ద ఆఫీసరట.. మాట్రిమోనీలో చూసి సెలెక్ట్ చేసేరు.
మనిషి అందంగా, టిప్‌టాప్‌గా వున్నాడు. పెళ్ళిచూపులకి స్వంత కారులో హైదరాబాద్ నుండి వచ్చేడు. వాళ్ళది హైదరాబాదట. అతను ప్రస్తుతం కొచ్చిన్‌లో పనిచేస్తున్నాడట.” అంది.
వెంకటేష్‌కి ఆమెని తలుచుకుంటే.. జాలి వేసింది.
పెళ్ళికి వెళ్లాలని కూడా అనిపించలేదు. మళ్ళీ ఫోన్ కూడా చెయ్యలేదు.
ఒక నెల గడిచింది. ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాడు. ఒంగోలులో వున్న పెదనాన్న మరణించారు. నాన్న రమ్మన్నారని, వెంటనే సెలవు పెట్టి ఒంగోలు వచ్చేడు వెంకటేష్.
పెదనాన్న కర్మకాండలు అయిపోయేక, సాయంత్రం బోర్ కొడుతోంది అని.. అలా చెరువు దగ్గర పార్క్ వరకు.. నడుచుకుంటూ వెళ్ళేడు.
పార్క్ లోంచి స్కూటర్ మీద అహల్య, రాఘవ వెళ్తూండడం చూసేడు. మళ్ళీ షాక్.
‘ఇదేమిటి! అహల్యకి సాగర్ అనే వ్యక్తితో పెళ్లి ఈ పాటికి అయ్యి ఉండాలి కదా.. ఇదేమిటి?’ అనుకున్నాడు.
ఓ గంట ఆగి ఫోన్ చేసేడు. “ఎలా వున్నావ్”.. అన్నాడు..
“హాయ్ వెంకటేష్.. ఎప్పుడు వచ్చేవు?.. మా ఇంటికి రాగలవా.. నీతో చాలా మాట్లాడాలి” అంది.
అహల్య గొంతులో మునుపటి ఉత్సాహం మళ్ళీ కనిపిస్తోంది.. ఏం జరిగి ఉంటుంది.. అంతా సస్పెన్స్‌గా అనిపించింది వెంకటేష్‌కి. రాత్రి 7 గంటలకి, అహల్య ఇంటికి వెళ్ళేడు. ఇంట్లోకి వెళ్తూంటే.. ఎదురు వచ్చింది.
లోపలికి తీసుకు వెళ్ళింది. హాల్‌లో సోఫాలో రాఘవ చిద్విలాసంగా కూర్చుని వున్నాడు.
“మా అయన రాఘవ.. నీకు తెలుసుగా..” అంది.
“హాయ్ రాఘవా” పలకరించేడు వెంకటేష్. ప్రతిగా.. “హాయ్ వెంకట్” అన్నాడు రాఘవ. లేచి కరచాలనం చేసుకున్నారు. హాల్లోంచి పక్క గది లో వాళ్ళు క్లియర్‌గా కనిపిస్తున్నారు.
పక్క గదిలో మంచం మీద నీరసంగా కనిపిస్తున్నాడు అహల్య వాళ్ళ నాన్నగారు సుధాకర్ గారు.
అహల్య తల్లి ఆయన పక్కన కూర్చుని, ఆయనకు పళ్ళ రసం ఇస్తోంది.
హాల్లోంచే వాళ్ళిద్దరికీ అభివాదం చేసేడు వెంకటేష్. గుర్తు పట్టి, పలకరింపుగా నవ్వేరు ఆ దంపతులు.
వెంకటేష్ మొహంలో ఆశ్చ్చర్యం గమనించింది అహల్య.
“నువ్వు నా పెళ్ళికి రాలేదు కదా. నీకు కొన్ని విషయాలు తెలియవు.. చెపుదామనే పిలిచేను, కూర్చో” అని.. కాఫీ గ్లాస్ అందించింది.
కాఫీ తాగుతూంటే.. జరిగిన విషయాలు ఇలా చెప్పింది:
“పెళ్లి చూపులకి వచ్చినప్పుడు సాగర్ తన కజిన్, అతని భార్యతో వచ్చేడు.
మీ నాన్న గారు, అమ్మగారు రాలేదా అని అడిగేరు నాన్న. “లేదు అంకుల్.. డాడీ, మమ్మీ, రేపు వస్తారు” అని చెప్పేడు అతను.
“ఈ రోజు నేను మీ అమ్మాయిని చూసేసి ఇక్కడి నుండి చెన్నై వెళ్ళాలి, మా ఆఫీస్ అసైన్మెంట్ ఒకటి వుంది అక్కడ. నేను మళ్ళీ పెళ్లి టైం వరకు సెలవు పెట్టుకోవడం కుదరదు” అన్నాడు.
పెళ్లి చూపులు అవడం, అతను వెళ్లిపోవడం జరిగింది. మర్నాడు, అతని తల్లిదండ్రులు వచ్చి చూసి వెళ్ళేరు. వాళ్ళు వెళ్లిన వారంలో సంబంధం నచ్చింది అని చెప్పి, మాటలకి వచ్చేరు.
10 లక్షలు కట్నం, 15 తులాల బంగారం ఇవ్వడానికి మాటలు కుదిరేయి. ఒక 15 రోజుల్లోనే ముహుర్తాలు కుదుర్చుకున్నారు. నాన్న దగ్గర కట్నం డబ్బులు ముందే తీసుకున్నారు . పెళ్లి సమయానికి అనుకున్న బంగారం నగలు రెడీ చేసుకోమన్నారు.
నాన్నగారు అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేసేరు. రేపు పెళ్లి అనగా, ముందు రోజు పెళ్లి వారు అందరూ వచ్చేసేరు. పెళ్లి కొడుకు రాలేదు.
తెల్లవారితే పెళ్లి. నాన్నకి కంగారు వేసింది. పెళ్లి కొడుకు తండ్రిని అదే విషయం అడిగితే.. “ఏదో రాత్రికి వచ్చేస్తాడు లెండి.. నేవీ కదా కొద్దిగా రిలీవ్ చేయడానికి ఫార్మాలిటీస్ ఉంటాయి” అని దబాయించేరు.
తెల్లవారింది. పెళ్ళికొడుకు తల్లి, తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు పరారీ అయిపోయారు.
నగలు నాన్న ముహూర్తానికి ఇస్తాను అనడంతో అవి వాళ్లకి దక్కలేదు. లేకపోతే, అవి కూడా పోయేవి. నాన్నకి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్‌కి బయలుదేరేరు.
ఇంతలో పోలీసులే మండపానికి వచ్చేరు. వాళ్ళతో బాటు నేవీ ఆఫీసర్ ఒకాయన కూడా వచ్చేరు. వాళ్ళు చెప్పిన నిజాలు తెలుసుకున్న మా అందరికీ, ముచ్చెమటలు పట్టేయి.
పెళ్ళికొడుకు సాగర్‌కి ఈ పెళ్లి ఇష్టం లేదు.. అతనితో బాటు పెళ్ళిచూపులకి వచ్చింది భార్యాభర్తలు కాదు. వాళ్లిద్దరూ వేరు వేరు వ్యక్తులు. వచ్చిన అమ్మాయి పెళ్ళికొడుకుతో బాటు పనిచేసే వ్యక్తి భార్య, అతను లేపుకుని వచ్చిన అమ్మాయి. ఆ మగవాడు పెళ్లి కొడుకు పాత స్నేహితుడు. వాళ్ళిద్దరినీ “కజిన్, అతని భార్య” అని పరిచయం చేసేడు అతను మా ఇంటికి పెళ్లి చూపులకి వచ్చినప్పుడు.
పోలీసులతో వచ్చిన నేవీ ఆఫీసర్ ఆ అమ్మాయి అసలు భర్తట. తన భార్యని సాగర్ లేపుకుని వచ్చేసేడు అని అతను వెతుక్కుంటూ ఉంటే.. ఈ పెళ్లి వ్యవహారం తెలిసి, మన వూరు వచ్చేడుట. ఇక్కడ పోలీసుల సహాయంతో సాగర్‌ని పట్టుకుందామని వచ్చేరు.
సాగర్ తప్పించుకుని పోయాడని తెలిసి, తెల్లారేసరికి, అతని నాన్న, అమ్మ, కుటుంబసభ్యులు పరారీ అయిపోయేరు.
నాన్న ఆ షాక్‌కి, కూలబడిపోయేరు. నాన్నకి పెరాలిసిస్ వచ్చింది. ఒక చెయ్యి, ఒక కాలు పడిపోయి, మాట కూడా పోయింది. వచ్చిన చుట్టాలు అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే వెళ్లిపోయారు. పెళ్లి మండపంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. సమయానికి రాఘవ మా నాన్నని హాస్పిటల్‌లో జేర్పించేడు. అదృష్టవశాత్తూ, నాన్న బతికేడు. ఒక వారం రోజులకి నాన్నకి మాట కూడా వచ్చింది.
నాన్నకి నన్ను చూస్తే పిచ్చెత్తినట్లు అయిపోయింది. ఆయనకు బతుకు మీద ఆశ తగ్గిపోయింది. పంతులు గారిని పిలిపించి, మరొక ముహూర్తం చూడమన్నారు. ఆయన బతికిఉండగా నేను పెళ్లి చేసుకోవాలి, నన్ను పెళ్లిబట్టలలో చూసుకోవాలి అనుకున్నారు. మళ్ళీ వారంలో ముహూర్తం ఫిక్స్ చేసి, నన్ను, బావని కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని వచ్చెయ్యమని పంపించేరు.
మరో 5 రోజులకి, నాన్నని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వచ్చేము. ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా మెరుగు అయ్యింది. రోజు విడిచి రోజు డాక్టర్ గారు ఇంటికి వచ్చి, నాన్నని చూస్తున్నారు.
మరో పదిరోజుల్లో లేచి తిరుగగలరని డాక్టర్ గారు చెపుతున్నారు.
అదీ విషయం.. అలా ఆ దొంగ పెళ్ళికొడుకు బారినుండి తప్పించుకుని, రాఘవతో జీవితాన్ని పంచుకున్నాను.. ” అని చెప్పింది అహల్య.
జరిగిన విషయాలు విని, హతాశుడయ్యాడు వెంకటేష్. పోనీలే భగవంతుడి దయవలన, ఆ దుర్మార్గుడు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత, విషయాలు బయటపడలేదు. నువ్వు అదృష్టవంతురాలివి” అన్నాడు.
“అవును.. అందరూ అదే అన్నారు.” అంది అహల్య.
విధి లిఖితం అంటే ఇదే అనుకున్నాడు వెంకటేష్.
— సమాప్తం —