చదువులమ్మ చెట్టునీడలో..

0
3

[దేశాయి నాగరాజు గారి ‘చదువులమ్మ చెట్టునీడలో..’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ప్ర[/dropcap]తి ఒక్క మనిషి జీవితంలో బాల్యం ఒక మరపురాని తీపిగురుతు. ఆ దశలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకం. ఆటపాటలు, చిల్లరపనులు, కష్టసుఖాలు ఏవైనా కానీ మన వెన్నంటి ఉండి మనకు అండగా నిలబడేది ఒక్క స్నేహితుడు మాత్రమే. అందరికన్నా మన జీవితంలో చెరగని ముద్ర వేసేది పదవతరగతి వరకూ మనతో పాటు చదువుకున్న మన బాల్యమిత్రులు. వారితో ఉన్న మన జ్ఞాపకాలు మరపురానివి, మరిచిపోలేనివి. పదవ తరగతి తరువాత దూరమైన స్నేహితులను 42 సంవత్సరాల తరువాత కలుసుకుంటే కలిగే ఆనందం అది అనుభవించినవారికే తెలుస్తుంది.

గుత్తి మాల్టస్ స్మిత్ జూనియర్ కాలేజీలో 1980-81లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు గత ఆదివారం అంటే 17 డిసెంబర్ 2023న తమ విద్యాలయంలో సమావేశమయ్యారు. ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముందు  గుత్తిలో అందుబాటులో ఉన్న మిత్రులు గంగవరం సత్యనారాయణ, జడ్ సతీష్, రఫీక్, ఇనాయతుల్లా, ఫయాజ్, బషీర్, దేశాయి నాగరాజు, ఇసాక్, మల్లికార్జున, చంద్రశేఖరరెడ్డి (బాబు) తదితరులను కలుపుకుని చాలా కసరత్తు చేసిన మిత్రుడు శ్రీధర్ (బాచి). ఈ మిత్రులంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో నివసిస్తున్న మిత్రుల ఫోన్ నెంబర్లు సేకరించి వారిని ఆ గ్రూపులో చేర్చారు. ప్రతి ఆదివారం వీరంతా కలుసుకుని ఈ సమావేశాన్ని రూపకల్పన చేయడానికి ఎంతో శ్రమించారు. చివరకు తేదీ నిర్ణయించి ఈ ఆత్మీయ సమావేశానికి అందరు మిత్రులను కుటుంబ సభ్యులతో సహా ఖచ్చితంగా రావాలని ఆహ్వానించారు.

ఆహ్వానాన్ని అందుకున్న మిత్రులంతా తమ సమ్మతిని తెలియజేసి ముందు రోజు అంటే 16వ తేదీనుండే చెన్నై, హైదరాబాదు, మేడ్చల్, ప్రొద్దుటూరు, హిందూపురం, అనంతపురం వంటి ప్రాంతాల నుండి మిత్రులు తరలి రావడం జరిగింది. స్థానిక మిత్రబృందం వారిని ఆప్యాయంగా ఆహ్వానించి వారు రాత్రికి బస చేయడానికి కావలసిన సదుపాయాలను సమకూర్చింది.  మరుసటి రోజు ఉదయం 6 గంటల నుండి ఏర్పాట్లను సమీక్షిస్తూ స్కూలు వద్ద పెద్దపెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మిత్రులందరికీ ఆహ్వానం పలికారు. ఉదయం 9 గంటలకు మిత్రులందరూ చేరుకోగానే ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఫలహారాలను ముగించి ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. తదుపరి సమావేశం ప్రారంభమయ్యింది. మొట్టమొదటిగా శ్రీధర్ (బాచి) వచ్చిన మిత్రులందరిని పేరుపేరునా వేదిక వద్దకు ఆహ్వానించి అందరిని ఆసీనులు కావలసినదిగా కోరారు. తదుపరి తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు మరియు తమ మధ్య లేని కొందరు ఆప్తమిత్రులను స్మరించుకుంటూ సంతాప తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా దేశాయి నాగరాజును ఆహ్వానించారు. తమకు విద్యాబుద్ధులు గరపిన గురువులతో పాటుగా, తమ మధ్య లేకపోయినటువంటి కీర్తిశేషులైన అలవల మంజునాథశెట్టి, నూర్‌భాషా, శ్రీనివాసులు (కానిస్టేబుల్), కరాటే రహమతుల్లా, రామచంద్రశేఖర్ (గుత్తి అనంతపురం), పాతకొత్త చెరువు ముత్యాలరెడ్డి, ఇబ్రహీమ్, పూలదాసరి శ్రీనివాసులు, సి.పి.ఐ.రాము, అడ్వొకేట్ దివాకర్, ఉప్పర గోపాల్, ప్రభుదాసు, నారప్ప తదితర మిత్రులను సంస్మరించుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ హాజరైన మిత్రులు, వారి కుటుంబ సభ్యులు అందరూ లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

తదుపరి మిత్రులందరూ ఒక్కొక్కరుగా వచ్చి వారి పరిచయం వారి కుటుంబ సభ్యుల పరిచయాలను చేస్తూ తమ చిన్ననాటి అనుభవాలు, జ్ఞాపకాలు, స్కూలు వదిలిన తరువాత తమ జీవితాలలో జరిగిన ప్రధాన ఘట్టాలను మిత్రులతో పంచుకున్నారు. ఆనాటి గురువులు ఎ.కె.మార్క్, లూథర్ డేవిడ్, జాన్ పాపారావు, క్రిష్టఫర్, మఠం శ్రీనివాసరావు, పార్థసారథి, సత్యనారాయణ, సుబ్బయ్య, కృపాబాయి, భారతి మొదలైన వారిని గుర్తు చేసుకున్నారు. మగ్బుల్, శంకర్, చెన్నమయ్య, బాలరాజు, చెన్నకేశవులు, మధుబాబు, మోహన్ రావు, కొల్లూరి మురళీకృష్ణ, జగదీష్, పి.రమేష్,  గంగవరం సత్యనారాయణ, వేణుగోపాల్, పి.టి.నాగేంద్ర, వన్నూర్, రవికుమార్, బషీర్ అహమ్మద్, సంపత్ కుమార్, గోవర్ధన గిరిధర్ రెడ్డి,  షేక్ మహమ్మద్ రఫీ, సి.ఎండి. ఇసాక్, అబ్దుల్ రఫీక్, నరేంద్ర రెడ్డి,  వై ఎం డి ఫయాజ్, మహబూబ్ బాషా, ఉప్పలప్ప, శ్రీనివాసులు, నూర్ మహమ్మద్, ఇనాయతుల్లా, కోడీహళ్ళి మురళీమోహన్, కేశవచంద్ర, స్టీఫెన్, చిట్టిబాబు, జడ్.సతీష్, మల్లికార్జున, ఆదాము, జాఫర్, దారా పాల్, రహంతుల్లా, రాజారత్నం, దేశాయి నాగరాజు తదితరులంతా ఈ 42 సంవత్సరాల కాలంలో వారి జీవనయాత్రను, వారి పిల్లల విద్య, ఉద్యోగ, వివాహ విషయాలను వివరించారు. శంకర్ పాటలను కమ్మగా పాడి వినిపించారు. చెన్నమయ్య తన నాటకాల అనుభవంతో రాగయుక్తమైన పద్యాలు ఆలపిస్తూ శ్రీకృష్ణరాయబారం నాటకంలోని పడక సీనును ఆహూతుల ముందు ప్రదర్శించారు. మోహన్ రావు స్నేహం గురించి కవితలను చదివారు. ఈ విధంగా మిత్రులందరు తమ తమ కళలను ప్రదర్శించి అలరింపజేశారు. ఉపాధ్యాయుడు, అడ్వొకేట్, ఇంజనీర్, డాక్టర్, పోలీస్, జర్నలిస్ట్, బిజినెస్, రాజకీయాలు మొదలైన వివిధ వృత్తులలో ఉన్నా అందరూ ఎటువంటి భేషజాలకు పోకుండా తమతమ స్థాయిలను మరచిపోయి ఆప్యాయంగా ఒకరితో ఒకరు కలిసి ముచ్చటించుకున్నారు. మధ్యాహ్నం మంచి రుచికరమైన భోజనాలను మిత్రులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భుజించారు.

తాము చదువుకున్న తరగతి గదులను చూసి ఆనాటి వైభవాన్ని, నేటి దుస్థితిని పోల్చుకున్నారు. క్రైస్తవ మిషనరీ నడుపుతున్న ఒక శతాబ్దానికి పైగా ఘనచరిత్ర, అద్భుతమైన కట్టడం కలిగిన ఈ పాఠశాల ఒకప్పుడు 1400 మంది విద్యార్థులతో చదువులోనూ, క్రీడలలోనూ జిల్లా స్థాయిలో మంచి పేరు గడించింది. ఇప్పుడు కేవలం 200 విద్యార్థులతో, శిథిలమైపోయిన గదులతో, ఉపాధ్యాయుల కొరతతో సమస్యలను ఎదుర్కుంటూ ఉండడం తెలుసుకుని తమ బాధను వ్యక్తం చేశారు. పాఠశాలకు పునర్వైభవం తీసుకుని రావడానికి చేయదగ్గ సహాయాన్ని అందించడానికి దాదాపు అందరూ తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే ఏ విధంగా సహాయం చేయవచ్చు అనే విషయమై నాలుగైదు సూచనలు ఈ సమావేశంలో వ్యక్తం అయ్యాయి. ఈ సూచనలను కూలంకుషంగా చర్చించి వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానం చేశారు. తరచుగా వీలైతే ప్రతియేటా ఇలాంటి ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకుని మిత్రులందరూ కలిసి ఆనందించాలని అభిలాషను వ్యక్తం చేశారు.

సాయంత్రం మిత్రులందరూ గ్రూప్ ఫోటోలను తీసుకున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించిన మిత్రబృందానికి అందరూ తమ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జాతీయగీతాన్ని ఆలపించారు. మధురమైన జ్ఞాపకాలతో, బరువెక్కిన హృదయాలతో మిత్రులంతా తమతమ ప్రాంతాలకు వెనుదిరిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here