రణబీర్ విశ్వరూపం: సంజు

0
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని చోట్ల చాలా బాగున్న సన్నివేశాలుంటే, మరి కొన్ని చోట్ల చాలా పేలవంగా వచ్చాయి. ఎడిటింగ్ కు అవకాశం వున్న సినెమా” అంటూ “సంజు” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]సం[/dropcap]జయ్ దత్ వొక నటుడిగానే కాక వొక వ్యసనపరుడుగా, మత్తుపదార్థాలకు బానిసగా, స్త్రీలోలుడుగా, అనధికారికంగా మారణాయుధాలు కలిగివున్న నేరం మీద జైలు జీవితం అనుభవించినవాడిగానూ తెలుసు. ఇది బయోపిక్కుల కాలం కాబట్టి సంజు గురించి కూడా జనం యెదురు చూశారు. కారణం అతని జీవితంలో కూడా చాలా ఆసక్తికర నాటకీయత వుండడమే. యూజీ తో సంబంధాలు వుండడం వగైరా చిత్రంలో చాలావరకు నొక్కి పెట్టి, లేదా రంగు మార్చి చూపారని విమర్శలున్నాయి. కాని నేనేమంటానంటే అతను భాగ్యవంతుల , సెలబ్రటీల ఇంట పుట్టి చిన్న వయసులోనే చాలా చెడు ప్రలోభాలకు లొంగి పాతాళం వరకూ వెళ్ళిన మనిషి, తిరిగి స్వస్థత పొంది తిరిగి రావడం, తన పని (నటన) ఇదివరకు కంటే మెరుగ్గా చేయగలగడం : ఇది చాలదా అతన్ని నాయకుడనడానికి. మత్తుకు బానిసలైన వారందరికీ అతను వొక స్ఫూర్తి, తిరిగి స్వస్థత వైపు అడుగులు వేయడానికి.

రాజ్ కుమార్ హీరాని మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. మున్నా భాయ్, 3 ఇడియట్స్ లాంటివి తీసిన ఇతని ఈ చిత్రం మాత్రం కొంచెం సాగదీసినట్టు అనిపించింది. ప్రేక్షకుడిని రెండు సీన్ల మధ్య వూపిరి ఆడకుండా చేయాల్సిన అవసరం సినెమాకి ఇదివరకు కంటే ఇప్పుడు యెక్కువ వుంది. వొకటి attension span తగ్గడం, రెండోది వికర్షణలు పెరిగిపోవడం. అది కాక ఈ బయోపిక్ లో సంజు గురించిన చాలా విషయాలు అతను అమాయకంగా చేసినట్లో, లేక వాటిలో ఇరికించబడ్డట్టో చూపించారు. అది అంతగా నమ్మబుద్ధి కాదు. అతను కరడు గట్టిన టెర్రరిస్టు కాకపోవచ్చు, కాని అమాయకుడు కూడా కాదు. మీడియా మీద మొత్తం నేరం మోపడం కూడా అతి అనిపించేలా వుంది. అతనికున్న మంచి స్నేహితులందరికీ ప్రతీకగా కమలేశ్ లేదా కమలీ (విక్కీ కౌశల్), చెడుస్నేహితులందరికీ ప్రతీకగా జుబిన్ (జిం శరభ్) లను పెట్టడం కథను అనుకూలంగా మలచుకోవడానికి పనికి రావడమే కాదు, చాలా నిజ జీవితంలో పాత్రలను స్పృశించకుండా వుండే వీలును కూడా కల్పిస్తుంది. అతను మత్తుకు యెంతగా బానిసయ్యాడో తల్లి ఆసుపత్రిలో వున్నప్పటి సన్నివేశాలు చాలా సమర్థవంతంగా చూపిస్తాయి. ఇక్కడ వొక మాట చెప్పాలి. రణబీర్ కేవలం సంజు నడక, మాట, లాంటివి పునర్నిర్మించడం మాత్రమే కాకుండా ఆ పాత్ర ఆత్మను మహానటిలో కీర్తి సురేశ్ ను ఈ సందర్భంలో తలచుకుంటే ఆమె కేవలం సావిత్రి హావభావాలు మాత్రం పట్టుకున్నట్టు అర్థమవుతుంది. అయితే రణబీర్‌ను దర్శకుడు సమర్థవంతంగా వాడుకోలేదనే చెప్పాలి.

ఆ మత్తు బానిసత్వం వో పార్శ్వమైతే, అతను మారణాయుధాలు కొనడం (ఆత్మ రక్షణ కోసమైనా), అండర్‌గ్రౌండ్ మనుషులతో సాంగత్యం కలిగి వుండడం, ముంబై అల్లర్లలో అతను కూడా వున్నాడని వార్తలు రావడం, జైలు కెళ్ళడం ఇవన్నీ అతని వ్యక్తిత్వాన్ని దగ్గరగా పరిశీలించే అవకాశాన్ని వదిలేసి అతని ఇమేజ్‌ను ప్రక్షాళన పరచడానికి అవకాశాన్ని వాడుకున్నట్టు అనిపించింది. ఇక నటన దగ్గరకొస్తే రణబీర్ మరో సారి గొప్ప నటన ప్రదర్శించాడు. అతని గురించైనా తప్పకుండా చూసి తీరాల్సిన చిత్రం ఇది. అతని తర్వాత అంతే అద్భుతంగా చేసింది విక్కి కౌశల్. మసాన్ చిత్రానికి అవార్డు సంపాదించాడు. వొక పంజాబి కుర్రాడు మసాన్‌లో బనారసీగా, రాజి లో పాకిస్తాని గా, ఇందులో గుజరాతీ గా చేసినా అతని మాట తీరు వొకదానికొకటి భిన్నంగా వున్నాయి, అలాగే నటన కూడా. మసాన్ లో టీనేజ్ లవర్గా, రమణ్ రాఘవ్ లో క్రూర్ రాఘవ్ సింఘ్ గా, రాజి లో ప్రేమ, దేశభక్తుల విధేయతల మధ్య నలిగిపోయిన ఆత్మగా, ఇందులో గొప్ప మనసున్న స్నేహితుడుగా; వొక దానికొకటి సంబంధమే లేని అన్ని రకాల నటనలు కనబరిచాడు. కొత్త తరంలో ఇతను ప్రముఖుడు. ఇక మిగతా పాత్రలు చేసిన వాళ్ళందరూ బాగానే చేశారు. పెద్దగా చెప్పుకోవాల్సింది మాత్రం లేదు. సంగీతం, సినెమేటోగ్రఫీ బాగున్నాయి. కర్ హర్ మైదాన్ ఫతే, రూబి పాటలు బాగున్నాయి.

మున్నాభాయ్ సిరీస్ లో బాపును వాడుకోవడం అక్కడ అతికింది. కాని ఇందులో కూడా మొదట్లో బాపు ఔర్ భాయ్ అని కొంత అతి చేశారు. పోలికే లేని చోట పోలిక పెట్టడం లాంటివి, బయోగ్రఫీ వ్రాయించే సందర్భంలో కథకు కీడు చేస్తుంది. అతను వొక నెగటివ్ మనిషి, తప్పులు చేశాడు, శిక్షలు అనుభవించాడు; ఆ వొడ్డు వరకూ వెళ్ళి తిరిగి వచ్చాడు. ఇది చూపిస్తే చాలదా, యెలాంటి రంగులూ అద్దకుండా. అప్పుడతనిమీద సానుభూతి పెరిగే అవకాశం కూడా వుండేది కదా. కారణం చెప్పలేను గాని హీరాని తన సహజమైన ఎలిమెంట్స్‌లో లేడనిపించింది. కొన్ని చోట్ల చాలా బాగున్న సన్నివేశాలుంటే, మరి కొన్ని చోట్ల చాలా పేలవంగా వచ్చాయి. ఎడిటింగ్ కు అవకాశం వున్న సినెమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here