మరుగునపడ్డ మాణిక్యాలు – 74: సోనీ

0
3

[సంచిక పాఠకుల కోసం ‘సోనీ’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]పో[/dropcap]లీసుల గురించి వచ్చిన చిత్రాలలో చాలా వాస్తవికంగా ఉండే హిందీ చిత్రం ‘సోనీ’ (2018). ఇందులో పెద్ద పోరాటాలు, కారుల్లో పారిపోతున్న వారిని జీపుల్లో తరిమి పట్టుకునే సన్నివేశాలు ఉండవు. ఆ మాటకొస్తే అసలు సాంప్రదాయికంగా సినిమాల్లో ఉండే కథ లాంటిది ఈ చిత్రంలో ఉండదు. ఇది ఇద్దరు మహిళా పోలీసుల జీవితాల చిత్రణ. మహిళా పోలీసులకి ఎదురయ్యే అనుభవాలు చూపించారు. ఇవన్నీ దిల్లీలో జరుగుతాయి. దిల్లీ సంస్కృతి ప్రభావం కూడా ఉంటుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

చిత్రం మొదట్లో ఒక యువతి రాత్రివేళ సైకిల్ తొక్కుకుంటూ వెళుతుంటుంది. ఒక పోకిరి ఆమె వెంటపడతాడు. అతను కూడా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. రోడ్లు నిర్మానుష్యంగా ఉంటాయి. ఆ యువతి వేగంగా వెళుతూ ఉంటుంది. అయితే కంగారుపడదు. ఆమె ఒక సందు దగ్గర సైకిల్ దిగి నడుచుకుంటూ సందులోకి వెళుతుంది. ఆ పోకిరి కూడా ఆమె వెనకాలే వస్తాడు. పోకిరిమాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆమె ఆగి వెనక్కి తిరిగి “ఎందుకు కుక్కలా నా వెంట వస్తున్నావు?” అంటుంది. “చలిగా ఉంది. కాస్త వెచ్చగా రావచ్చు కదా” అంటాడతను. “వెళ్ళి మీ అమ్మని అడుగు” అంటుందామె. అతను బూతు మాటలు తిడుతూ ఆమె మీదకి లంఘిస్తాడు. ఆమె తిరగబడి పిడిగుద్దులు గుద్దుతుంది. కిందపడేసి కొడుతుంది. ఇంతలో కొందరు పోలీసులు దూరం నుంచి పరుగెత్తుకుని వస్తారు. ఇంతకీ ఆ యువతి ఒక పోలీసు. పేరు సోనీ. పోలీసులందరూ కలిసి ఈ పథకం వేశారు. ఇలాంటి పోకిరీలని పట్టుకోవటానికి ఒక దీర్ఘకాలిక ఆపరేషన్ ఇది. ఈ విధంగా పోకిరీలలో భయం పుట్టించవచ్చని వారి ఉద్దేశం. ఏదైనా అత్యాచారం జరిగిన తర్వాత హడావిడి చేసి మళ్ళీ మరచిపోవటం కాకుండా ఇలాంటి ముందస్తు ప్రణాళికలు ఉంటే కొన్ని ఘోరాలనైనా ఆపవచ్చు.

సోనీ పై అధికారిణి కల్పన. ఆమె సోనీని పక్కకి పిలిచి “నీకేం చెప్పాను? చెప్పిన మాట వినవా?” అంటుంది. “వాడు హద్దుమీరి ప్రవర్తించాడు” అంటుంది సోనీ. “ఇక ప్రోటోకాల్ ఉన్నది ఎందుకు?” అంటుంది కల్పన. ఈ నాలుగు నిమిషాల సన్నివేశంలో ఇద్దరు పాత్రల స్వాభావాలను చక్కగా ఆవిష్కరించారు. సోనీ దుందుడుకు మనిషి. కల్పన శాంతంగా ఉంటుంది. సోనీ అతిగా ప్రవర్తించిందని తెలిసి కూడా ఆమె శాంతంగా ఉంటుంది. తన కారులో ఆమెని ఇంటికి తీసుకువెళుతుంది. “ఎందుకలా చేశావు?” అని అడుగుతుంది. “వాడు మీద పడ్డాడు. ఆ మాత్రం చేస్తేగానీ బుద్ధి రాదు కదా మేడమ్” అంటుంది సోనీ. “స్వీయ రక్షణలో కొన్ని దెబ్బలు తగలొచ్చు. కానీ నువ్వు హద్దు దాటావు. వాడి దగ్గర కత్తి ఉంటే ఏం జరిగేది?” అంటుంది కల్పన. సోనీ మాట్లాడదు. “నేనెందుకు చెబుతున్నానో ఆలోచించు” అంటుంది మళ్ళీ కల్పన.

తెల్లవారుతుంది. సోనీ ఇంటికి వచ్చాక పక్కింటామె వస్తుంది. ఆమె సోనీ గురించి చింతపడుతుందని ఆమె మాటల్లో తెలుస్తుంది. ఓ పక్క రోడ్డు మీద జులాయిలు. ఓ పక్క పక్కింటి వారిని ఆప్యాయంగా చూసుకునే స్త్రీలు. దిల్లీ సంస్కృతి విశిష్టమైనది. మాటల్లో సోనీ భర్త నవీన్ అని, అతను వేరుగా ఉంటున్నాడని తెలుస్తుంది. పక్కింటామె “నీకు కోపం జాస్తి. అతనికి ఫోన్ చెయ్” అంటుంది. సోనీ పట్టించుకోదు. ఇంకో పక్క కల్పన తన ఇంటికి వెళుతుంది. ఆమె భర్త క్రైమ్ బ్రాంచ్ (సీఐడీ) అధికారి. ఆమె నైట్ డ్యూటీ చేసి వస్తే ఆమె భర్త అఫీసుకి బయల్దేరుతుంటాడు. ఆమె అత్తగారు మంచిమనిషే కానీ “ఇదేం కాపురం? ఇలా అయితే పిల్లలు కలిగేదెన్నడు?” అంటుంది. కల్పన నవ్వి ఊరుకుంటుంది. సోనీ భర్త నుంచి వేరుపడింది. స్వతంత్రభావాలు కలది. ఒకరి అజమాయిషీ నచ్చదు. ఒకసారి పక్కింటామె “నా పెళ్ళికి ముందు పోకిరీలు నా వెంట పడేవాళ్ళు. నేను పాపిట్లో కుంకుమ పెట్టుకోవటం మొదలెట్టాను. వెధవలు దారికొచ్చారు” అంటుంది. పెళ్ళయిన వారి జోలికి రావటానికి జంకుతారు. అయినా ఇది అన్నివేళలా పని చేయదు. సోనీకి పక్కింటామె మాటలు వింతగా ఉంటాయి. కల్పన పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో అత్తగారి బాగోగులు చూసుకుంటుంది. అలాగని ఆమె జీవితం సాఫీగా లేదు. పిల్లలు కలగలేదని అందరూ అడుగుతుంటారు. అదే సోనీ అయితే “ఆ సంగతి నీకెందుకు?” అనేది. బయటివారి వికృతచేష్టలు, ఇంట్లోవారు ప్రేమతో చేసే అజమాయిషీ ఒకటే అనుకుంటే ఎలా? ఉద్దేశం గమనించాలి. లేకపోతే కలిసి ఉండటం కష్టం.

సైకిల్ మీద వెంబడించిన పోకిరీకి దెబ్బలు బాగా తగిలాయని తెలిసి కల్పన సోనీని తిడుతుంది. ఆ రోజు సోనీకి డ్రంకెన్ డ్రైవ్‌లో ఒక నౌకాదళ కమాండర్ దొరుకుతాడు. కారులో అతని స్నేహితుడు కూడా ఉంటాడు. “నా పుట్టినరోజు. రేపు నా పెళ్ళి. ఈరోజు బ్యాచిలర్స్ పార్టీ. అందుకే తాగాను” అంటాడు. “కారు దిగండి” అంటుంది సోనీ. “నేను నేవీ ఆఫీసర్‌ని. నిన్ను సస్పెండ్ చేయిస్తాను. నా మాట విను” అని ఆమె చేయి మీద చేయి వేస్తాడు. సోనీ అతన్ని చెంపదెబ్బ కొడుతుంది. తోటి పోలీసులు ఆమెని పక్కకి లాగుతారు. విషయం పై దాకా వెళుతుంది. పోలీస్ కమిషనర్ కోపంగా ఉంటాడు. కల్పన తన భర్త ఆఫీసుకి వెళ్ళి సోనీని వదిలేయమని అడుగుతుంది. “నా తప్పు కూడా ఉంది. ఆ రోజు ఆమెని అందరి ముందూ తిట్టాను” అంటుంది. “నువ్వు అందరినీ నెత్తికెక్కించుకుంటావు” అంటాడతను. “వాళ్ళు బాగా తాగి ఉన్నారు కదా” అంటుంది. “అయితే పోలీసులు మిలిటరీ వాళ్ళని కొట్టేస్తారా?” అంటాడతను. “కొట్టటం తప్పే. ఆమె ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు” అంటుందామె. అతను పట్టించుకోడు. మిలిటరీలో ఉంటే నియమాలు వర్తించవా? ఈ బుద్ధి ఎప్పుడు వస్తుంది? మిలిటరీలో ఉన్నంత మాత్రాన తాగి కారు నడిపితే ఇతరుల కంటే బాగా నడుపుతాడా? తాగి కారు నడపటం తప్పైతే ఎవరికైనా తప్పే. మిలిటరీలో ఉంటే ఇంకా బాధ్యతగా ఉండాలి. కారు నడపటానికి డ్రైవర్‌ని పెట్టుకోవచ్చు. ఇదంతా అహంభావం. ఉన్నతోద్యోగుల్లో ఈ ప్రవృత్తి. సామాన్యుల్లో లెక్కలేనితనం. ఎవరూ తక్కువ కాదు. అందరిలో మార్పు రావాలి. ఎవరో ఎందుకు, కమిషనర్ ఆ నేవీ కమాండర్‌ది తప్పని ఎందుకు చెప్పడు? అక్కడ కూడా రాజకీయాలే.

సోనీ మీద విచారణకి ఆదేశిస్తారు. అంతవరకు కంట్రోల్ రూమ్‌లో డ్యూటీ వేస్తారు. అంటే ఫోన్లలో వచ్చిన ఫిర్యాదులు తీసుకోవటం. సోనీకి విచారణ విషయం చెబుతుంది కల్పన. “మీకు అంతా తెలుసు. అది చాలు. ఈ ఇంక్వైరీ గురించి నాకేం బెంగ లేదు” అంటుంది సోనీ. కల్పన తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన చెబుతుంది. “నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్ బయట పోలీసులు ఒకతన్ని కొట్టడం చూశాను. వాడు దెబ్బలు భరించలేక అరుస్తున్నా వాళ్ళు కొడుతూనే ఉన్నారు. వాడు స్పృహ కోల్పోయాడు. తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే వాడు మా స్కూల్ అమ్మాయిలని ఏడిపించేవాడు. అయినా వాడి మీద నాకు జాలి తగ్గలేదు” అంటుంది. దండనకి కూడా ఒక హద్దు ఉండాలని కల్పన ఉద్దేశం. అంతకంటే ముందు ఒక పద్ధతి ఉండాలి. పోలీసుల పని దండించటం కాదు, కేసులు రాసుకోవటం మాత్రమే. చట్టం ప్రకారం ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడుతుంది. పరిస్థితి హద్దు దాటితేనే పోలీసులు బలప్రయోగం చేయాలి. ఇది కల్పన సిద్ధాంతం. సైకిల్ మీద వెంబడించిన పోకిరి కేసులో పోలీసులు కేసు బలంగా ఉండటానికి తప్పుడు సాక్ష్యం జోడిస్తారు. కల్పన వారిని చీవాట్లేస్తుంది. చుట్టూ జరుగుతున్న ఘోరాలు చూస్తూ కూడా ఆమె శాంతంగా ఉంటుంది. మన పని మనం చేయాలి, తప్పులు చేయకూడదు, ఆ తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది అంటుంది. సోనీకి ఆమె మీద గౌరవం. కానీ ఆమె నైజం వేరు. కంట్రోల్ రూమ్‌లో ఒక మహిళా పోలీసు ఆమెకి పని నేర్పిస్తుంది. ఒక వ్యక్తి ఫోన్ చేస్తే ఇద్దరూ వింటారు. “మా ఇంటి దగ్గర దుర్వాసన వస్తోంది. కుక్క చచ్చిపోయినట్టుంది” అంటాడతను. ఇది అసలు పోలీసులకి ఫోన్ చేయాల్సిన విషయమే కాదు. అయినా ఆ పోలీసు వివరాలు తీసుకుంటుంది. “మీకు మావాళ్ళు ఫోన్ చేస్తారు. కానీ ఇక నుంచి మీరు ఇలాంటి వాటికి మునిసిపల్ ఆఫీసుకి ఫోన్ చేయండి” అంటుంది. “మీ మాట తీరు బావుంది. మీ సెల్ నంబర్ ఇవ్వండి. మీకు వేరుగా ఫోన్ చేస్తాను” అంటాడతను. ఈమె నవ్వేసి “కాల్ చేసినందుకు థ్యాంక్స్” అని ఫోన్ పెట్టేస్తుంది. సోనీతో “ఇలాంటివి ఒకటో రెండో కాల్స్ రోజూ వస్తాయి” అంటుంది. సోనీ వింతగా చూస్తుంది. ఆమె అయితే మునిసిపల్ ఆఫీసుకి ఫోన్ చేయకుండా కంట్రోల్ రూమ్‌కి చేసినందుకు చిరాకు పడేది. తన సెల్ నంబర్ అడిగితే తిట్టిపోసేది. అన్నివేళలా దుడుకుతనం పనిచేయదు.

పోలీస్ స్టేషన్‌కి వచ్చే కేసులు కూడా కొన్ని ఈ చిత్రంలో చూపించారు. చాలా సహజంగా ఉంటాయవి. ఒకామె తన ఇంటి యజమాని అద్దె పెంచుతాన్నాడని, అతనితో పడుకుంటే పెంచనన్నాడని ఫిర్యాదు చేస్తుంది. చివరికి తనని బలాత్కరించాలని ప్రయత్నించాడని అంటుంది. తన వేసుకున్న కుర్తా చిరిగిపోయిందని చూపిస్తుంది. సోనీ వివరాలు అడుగుతుంది. ఆ స్త్రీ భర్త, ఇంటి యజమాని కూడా అక్కడే ఉంటారు. ఇంటి యజమాని “వాళ్ళు నేనిచ్చిన భూమి కాకుండా ఇంకా కబ్జా చేసి కూర్చున్నారు. నేను అద్దె పెంచమంటే ఈ నాటకమాడుతున్నారు. నేనే తప్పు చేయలేదు” అంటాడు. ప్రాథమిక విచారణ చేసిన పోలీసు “అది ప్రభుత్వ భూమి. లీజుకి తీసుకున్నాడు. అద్దెకివ్వకూడదు” అని సోనీకి చెబుతాడు. సోనీ ఇంటి యజమానిని ‘ఇది తప్పు కాదా?’ అన్నట్టు చూస్తుంది. అతను “నేనెప్పటి నుంచో అక్కడ ఉంటున్నాను. ఇల్లు గడవాలిగా” అంటాడు. సోనీ ఆ స్త్రీ భర్తని “ఇదంతా జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు?” అని అడుగుతుంది. “నేను కూరల మార్కెట్‌కి వెళ్ళాను” అంటాడతను. “ఈరోజు శనివారం. మార్కెట్ ఎక్కడిది? అందరూ కలిసి నాటకమాడుతున్నారు. పొండి” అంటుంది సోనీ. ఇది దొంగ కేసని ఆమెకి తెలిసిపోతుంది. ఆ భూమిని ఎలాగోలా కబ్జా చేయాలని ఆ స్త్రీ, ఆమె భర్త ప్రయత్నిస్తున్నారని ఆమెకి అర్థమవుతుంది. “ఇది తప్పుడు కేసు. మాట్లాడి పంపించెయ్” అని తోటి పోలీసుకి చెబుతుంది. అయితే ఈ కేసు కల్పనకి తెలిసి సోనీ, మిగతా టీమ్‌తో “తప్పుడు కేసని మీరే నిర్ణయించేస్తారా? ఎఫ్ఐఆర్ రాసుకోండి” అంటుంది. అయితే ఆ స్త్రీ రాతపూర్వకంగా ఫిర్యాదు చెయ్యటానికి ఒప్పుకోదు. సోనీ ఊహే నిజమయింది. అది తప్పుడు కేసని తేలిపోయింది. సోనీకి కోపం ఎక్కువైనా ఆమె చురుకైనదని కల్పనకి మరోసారి అర్థమవుతుంది. మరో పక్క ఆమె సోనీకి బదులుగా మరో పోలీసుని తన టీమ్ లోకి తీసుకోవటానికి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటుంది. సరైన వారు దొరకరు. ఆమె తన భర్తతో “సోనీ లాంటి పోలీసు దొరకదు. మా ఆపరేషన్ కి ఎవరని బడితే వారిని తీసుకోలేను. సోనీని వదిలేయొచ్చు కదా? ఆమె మనసు పెట్టి పని చేస్తుంది” అంటుంది. “బుర్ర కూడా పెట్టాలి కదా? నువ్వు నీ టీమ్‌తో ఇంత అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు. అంత తేలిగ్గా మళ్ళీ బదిలీ చేయరు” అంటాడతను. “నేనామెకి కౌన్సెలింగ్ చేస్తాను. మీరు కమీషనర్‌తో మాట్లాడండి” అంటుందామె.

తప్పుడు కేసులు ఒక రకమైతే పోలీసులు చేసే తప్పులు మరో రకం. ఒక అమ్మాయి ఒక మాల్లో ఏడుస్తూ కనపడితే పోలీసులు స్టేషన్‌కి తీసుకువస్తారు. ఆమెని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కల్పన వస్తుంది. అక్కడ ఆడ పోలీసు లేకపోవటంతో ఆమే ఆ అమ్మాయితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి రాంచీకి చెందినదని, దిల్లీలో ఆమెకి ఎవరూ లేరని తెలుస్తుంది. అంతకంటే ఆ అమ్మాయి ఏమీ చెప్పదు. కల్పన కానిస్టేబుల్‌ని పక్కకి పిలిచి “ఆ అమ్మాయి భయంతో బిక్కచచ్చిపోతుంటే ముగ్గురు మగ పోలీసులు చుట్టూ చేరి ప్రశ్నలు వేయటమేమిటి? ఆడ పోలీసుని పిలవాలని తెలియదా?” అంటుంది. పోలీసుల నిర్లక్ష్యం కూడా ఒక సమస్యే. లంచగొండి పోలీసులు ఇంకో సమస్య. ఇలా అన్ని రకాల సమస్యలని చూపించారు ఈ చిత్రంలో.

ఈ చిత్రానికి ఇవాన్ ఐర్ స్క్రీన్ ప్లే సహకారం అందించి దర్శకత్వం వహించాడు. సోనీగా గీతికా ఒల్యాన్, కల్పనగా సలోనీ బత్రా నటించారు. జాగ్రత్తగా గమనిస్తే చిత్రంలో సూక్ష్మమైన విషయాలు చాలా ఉంటాయి. కల్పన కళ్ళ కింద నల్ల వలయాలు ఉంటాయి. ఆమె నిద్రలేమితో బాధపడుతోందని ఇలా చెప్పారు. పోలీస్ స్టేషన్లో సోనీ, ఆమె తోటి పోలీసు ఒక ఫిర్యాదు వింటుంటే మరో పోలీసు కంప్యూటర్ దగ్గర నుంచి లేచి వచ్చి ఈ పోలీసుని కంప్యూటర్ మీద సాయం కోసం తీసుకువెళతాడు. కంప్యూటర్ల వాడకం ఇంకా పూర్తిగా అలవాటు కాలేదు. సోనీ ఎంత కఠినంగా కనిపించినా ఇంట్లో దేవుడి దగ్గర అగరుబత్తి వెలిగిస్తుంది. కానీ అగరుబత్తిని సవ్యదిశలో కాక అపసవ్యదిశలో తిప్పుతుంది. ఇది కాస్త వింతగా ఉంటుంది. తెలియక చేసిందా? లేక కొన్ని ప్రాంతాల్లో ఇలా కూడా చేస్తారా? నాకైతే తెలియదు. సోనీ ఎవరినీ చెప్పులు వేసుకుని వంటింట్లోకి రానివ్వదు. ఆమె సంప్రదాయ కుటుంబంలో పెరిగిందని మనకి తెలుస్తుంది. చిత్రంలో ఫోటోగ్రఫీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. విరామం లేకుండా దీర్ఘంగా సాగే సన్నివేశాలు చాలా ఉంటాయి. ఇవన్నీ నిజంగా జరుగుతున్న సంఘటనలు చూసిన భావం కలిగిస్తాయి.

ఈ క్రింద చిత్రంలోని మరి కొన్ని సంఘటనలు ప్రస్తావించటం జరిగింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు.

కల్పన భర్త కమిషనర్‌తో మాట్లాడటంతో సోనీ మళ్ళీ ఆమె టీమ్ లోకి వస్తుంది. ఒక రాత్రి ఆపరేషన్‌లో భాగంగా ఒక పార్క్‌కి వెళితే అక్కడ ఒక చోట ఒక జంటని పోలీసులు పట్టుకోవటం చూస్తారు. దూరం నుంచి చూస్తూ ఉంటారు. పోలీసులు ఆ జంటని లంచం అడుగుతారు. అది చూసి కల్పన, సోనీ వాళ్ళ దగ్గరకి వెళతారు. ఆ జంటని పంపించేస్తారు. తర్వాత కల్పన సోనీతో “లంచం విషయం పక్కన పెడితే సిటీలో ఇన్ని సమస్యలున్నాయి. మనవాళ్ళేమో మోరల్ పోలీసింగ్ చేస్తున్నారు” అంటుంది. ఇష్టంగా కలిసిన జంటలను వేధించటం పోలీసులకి అలవాటే. వారికి వార్నింగ్ ఇచ్చి పంపించాలి. వీలైతే అమ్మాయిని జాగ్రత్తగా ఇల్లు చేరేలా చూడాలి. డబ్బులు లాగటం కాదు. తర్వాత ఒక రాత్రి కల్పన, సోనీ ఒక రెస్టారెంట్లో ఏమైనా తినాలని వెళతారు. సోనీ బయట ఉన్న బాత్రూమ్‌కి వెళితే లోపలి నుంచి తాళం వేసి ఉంటుంది. తలుపు కొడితే మగ గొంతులు వినపడతాయి. సోనీ మళ్ళీ మళ్ళీ తలుపు కొట్టటంతో ఒకతను తలుపు తీస్తాడు. అక్కడ ముగ్గురు యువకులు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. సోనీ వాళ్ళని వెళ్ళమంటుంది. వాళ్ళు వెళ్ళకపోగా అసభ్యంగా మాట్లాడతారు. సోనీ ఒకతన్ని చెంపదెబ్బ కొడుతుంది. మళ్ళీ కథ మామూలే. ఆ యువకుడు మంత్రిగారి మిత్రుడి కొడుకు. మళ్ళీ కల్పన సోనీని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఆమె భర్త వినడు. పైగా ఆమెదే తప్పని అంటాడు. కల్పనకి విసుగు వస్తుంది. అయితే ఆమె ఏ విధంగా స్పందించిందనేది వాస్తవికంగా ఉంటుంది.

సోనీ భర్త ఆమెతో మాట్లాడటానికి వస్తాడు. అతను చిన్న చిన్న వ్యాపారాలెన్నో చేశాడు. ఎందులోనూ స్థిరపడలేదు. ఆమెకి అది నచ్చదు. అయినా సమస్య అదొక్కటే కాదు. గతంలో ఏదో జరిగింది. అదేమిటి అనేది చిత్రంలో చెప్పలేదు. అది ముఖ్యమూ కాదు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అతను “నేను చేసినదానికి నన్ను కొట్టాలంటే కొట్టు” అంటాడు. “దానివల్ల లాభం ఉంటుందంటే ఎప్పుడో ఆ పని చేసేదాన్ని. నిన్ను ఎంతో నమ్మాను. నన్ను నట్టేట వదిలేశావు” అంటుందామె. “నాకింకో అవకాశం ఇవ్వు” అంటాడతను. ఆమె మౌనంగా ఉండిపోతుంది. భార్యాభర్తల గొడవలు సినిమాల్లో చూపించినపుడు చాలా హడావిడి ఉంటుంది. నాటకీయత ఉంటుంది. ఇక్కడ చాలా సహజంగా చూపించారు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

చివరికి సొనీకి నిర్వేదం వస్తుంది. దీనికి ఎన్నో కారణాలు. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన యువకుడి కేసులో కల్పన “వాడిని కొట్టకుండా నా దగ్గరకి వచ్చి చెప్పి ఉంటే డ్రగ్స్ కేసులో అరెస్టు చేసేవాళ్ళం కదా. ఎందుకు కొట్టావు?” అని అడుగుతుంది. “ఆడవాళ్ళ బాత్రూమ్‌లో దూరింది వాడు. అసభ్యంగా మాట్లాడింది వాడు. డ్రగ్స్ తీసుకున్నది వాడు. చీవాట్లు నాకా?” అంటుంది సోనీ. ఆపరేషన్లో భాగంగా ఆమె ఒక రాత్రి ఒంటరిగా వెళుతుంది. కల్పన, మిగతా పోలీసులు దూరంగా ఉంటారు. సోనీ వెళ్ళిన చోట కొందరు మగవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకునేది సెక్స్ గురించి. హోటల్ కి వెళితే గుట్టుగా ఉంటుందని ఒకడు అంటాడు. హోటల్ వాళ్ళు డబ్బులు తీసుకుని పోలీసులకి ఫోన్ చేస్తారని మరొకడు అంటాడు. ఈ మాటలు విని సోనీకి నిస్పృహ కలుగుతుంది. వెనక్కి వచ్చేస్తుంది. మగవాళ్ళ బుద్ధిలోనే లోపం ఉంటే పోలీసులు ఎంతవరకు సరిదిద్దగలరు? సమాజానికి బాధ్యత లేదా? ‘మగవాడన్నాక ఇది మామూలే’ అని రాజకీయనాయకులే మాట్లాడుతుంటే మార్పు ఎక్కడ నుంచి మొదలవ్వాలి? సోనీ రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటుంది.

కల్పన అన్న కూతురు స్కూల్లో ఎదురైన అసభ్య సంఘటన గురించి కల్పనకి చెప్పి ఏడుస్తుంది. కల్పన ఆమెని ఓదారుస్తుంది. “నువ్వు ధైర్యంగా ఉంటావు కాబట్టి వాళ్ళు నిన్ను ఎలాగైనా వంచాలని ఈ పనులు చేస్తున్నారు. నువ్వు నీ ధైర్యాన్ని వదలకూడదు. ఫిర్యాదు చెయ్యి” అంటుంది. తర్వాత ఆమె సోనీ ఇంటికి వస్తుంది. “మా అన్న కూతురికి ధైర్యం చెప్పి వచ్చాను. దాని వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు. కానీ నా కర్తవ్యం నేను చేశాను” అని సోనీని రాజీనామా చేయొద్దని కోరుతుంది. తర్వాత కల్పన డ్రగ్స్ తీసుకున్న యువకుడి మీద కేసు పెడుతుంది. అతను తండ్రి పలుకుబడి గురించి చెప్పి బెదిరించాలని చూస్తాడు. అతను బెదిరించిన కొద్దీ కల్పన కేసుని ఇంకా బలంగా పెట్టమని కానిస్టేబుల్‌కి చెబుతుంది. ఆఖరున సోనీ కంట్రోల్ రూమ్ లో పని చేస్తూ ఉండగా చిత్రం ముగుస్తుంది.

పరిస్థితులు చూసి నిస్పృహ చెందితే అది శ్మశాన వైరాగ్యం లాంటిదే. రోజూ పేపరు చూస్తే ఎన్నో ఘోరాలు. నేను ఏం చేస్తే ఏం లాభం అనుకుంటే మన కర్తవ్యాన్ని విస్మరించినట్టే. ఎవరికోసమో ఎందుకు చేయాలి? నేను చేయగలిగినంత నా ఆత్మతృప్తి కోసం చేస్తాను అనుకుంటే ప్రశాంతంగా ఉండవచ్చు. సజ్జనులు విరక్తి చెంది పని మానేస్తే సమాజం మరింత దిగజారుతుంది. మన పని మనం చేస్తే ఎవరూ మెచ్చకపోయినా దైవం మెచ్చుతుంది. ఎవరు మారకపోయినా మన కృషికి మనలోనే మార్పు వస్తుంది. ఆత్మోద్ధరణ కన్నా గొప్ప పని ఏముంటుంది? సోనీని మళ్ళీ కంట్రోల్ రూమ్‌కి బదిలీ చేశారు. అయినా ఆమె కల్పన ప్రోద్బలంతో సహనంగా పరిస్థితులని ఎదుర్కొంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. సోనీ నిబద్ధతని చూసి కల్పన కూడా భర్తకి ఎదురు నిలబడి తన కర్తవ్యం తాను చేసింది. ఎదురుదెబ్బలు తగలవచ్చు. తట్టుకుని సాగిపోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here