సిరివెన్నెల పాట – నా మాట – 24 – దేశ గౌరవాన్ని చాటిన పాట

0
3

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఏ దేశమేగినా

~

చిత్రం: శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: కీరవాణి

గానం: సురేష్ పీటర్

~

పాట సాహిత్యం

పల్లవి:
ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమన్నా పొగడరా నీ మాతృభూమి భారతిని
We Love India wherever we are
We Love India
She is our Mother We Love India

చరణం:
అలజడులెదురొస్తే కదలని ఎవరెస్టై నిలిచిన దేశములో మా పుణ్యము పుట్టింది
అలలుగ కలలిట్టే కలతలు కవ్విస్తే చెదరని సంద్రంలా మా ధర్మం మిగిలింది
ప్రతిజాతి కాలమ్ముందర తలవంచి శిథిలాలై నిన్నటి కథగా మారింది
మనదేశం కాలాలన్నీ ఎదురించి కలకాలం నిలిచే వుంటుంది
Tell me brother where is that great Nation మేరే వతన్ హిందుస్తాన్.
..We Love India

చరణం:
బ్రతుకును అందించే అమ్మానాన్నల్నే కనబడు దైవాలే అనుకుంటూ పూజిస్తాం
మనసులు బంధించే మమతల మంత్రంతో మనషుల గుండెల్లో రాజ్యాలే పాలిస్తాం సహనాన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తాం శరణంటే శత్రువునైనా దీవిస్తాం
మతమంటే మంచిని పెంచే సిద్ధాంతం అటువైపే అంతా పయనిద్దాం Tell me brother who gave us this Notion,
That is again India…We Love India

అపి స్వర్ణమయీ లంకా న, మే, లక్ష్మణ రోచతే।
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ॥

లంకలో రావణాసురునితో యుద్ధం పూర్తి అయి, రావణుడు నిర్జింపబడిన తరువాత స్వర్ణమయమై మనోహరముగా ఉన్న లంకా వైభవాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకి లోనైన లక్ష్మణుడు, లంకా సౌందర్యం మీద, లంకా వైభవం మీద పెరిగిన మక్కువతో అన్నగారైన రాములవారితో మనం ఇక్కడనే స్థిరపడదాము, మరల అయోధ్యకి తిరిగి వెళ్ళుట ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఆ సందర్భంలో రాముల వారు లక్ష్మణునితో మాతృమూర్తి యొక్క, మాతృభూమి యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పిన అమోఘమైన వాక్యాలు.

“ఓ లక్ష్మణా! లంక స్వర్ణమయమైననూ నాకు రుచించదు, ఇష్టం లేదు. ఎందుకంటే జనని మరియు జన్మ భూమి స్వర్గము కంటెనూ ఉత్కృష్టమైనవి”. శ్రీ మద్రామాయణములో వాల్మీకి మహర్షుల వారు శ్రీ రామచంద్రుని ద్వారా శ్లోక రూపంలో అందించిన అమోఘమైన సందేశ వాక్యాలివి.

దేశభక్తి, జాతీయభావం కలిగిన వారినెవరినైనా, ఈ శ్లోకం పులకింపజేస్తుంది.

~

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠ మెక్కినా, ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీ జాతి నిండు గౌరవము.
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగబలమో
జనియించినాడవీ స్వర్గఖండమున
ఏ మంచి పూవులన్ ప్రేమించినావో
నినుమోసే నాతల్లి కనక గర్భమున
……………………
అవమానమేలరా? అనుమానమేలరా?
భారతీయుడనంచు భక్తితో పాడరా

అంటూ దేశభక్తిని పరవళ్ళు తొక్కించారు రాయప్రోలు సుబ్బారావుగారు.

~

పుణ్యభూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
మహామహుల కన్నా తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం నా దేశం..

అని దేశభక్తి సందేశాన్ని అందించారు జాలాది.

~

జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా..

అని, నవ మాసాలు మోసిన తల్లి రుణం తలకొరివితో తీర్చుకోగలమనీ, మాతృభూమి రుణం తీర్చీకునే మార్గం సైనికుడికి తప్ప మరెవ్వరికీ లేదని, కితాబిచ్చారు దాసరి నారాయణరావు.

~

జై భారతీ వందే భారతీ
సర్ పే హిమాలయ్ కా ఛత్ర హై
చరణోమే నదియా ఏక్ హై
హాథోంమే వేదోంకా పత్ర హై
దేశ్ నహీ ఐసా అన్యత్ర..

అని భారతదేశం యొక్క గొప్పదనాన్ని, చరిత్రను, ధర్మాన్ని, ఝాన్సీ, శివాజీ, వంటి వీరులను ప్రశంసిస్తూ, భరత్ వ్యాస్ జగద్గురు ఆదిశంకరాచార్య చిత్రం కోసం, ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు.

~

ఇలా చెప్పుకుంటూ పోతే, సినీ గీతాల్లోనే అన్ని భాషల్లోనూ ఎంతో గొప్ప దేశభక్తి సాహిత్య ఉంది. ప్రస్తుతం మనం విశ్లేషించుకునే పాట కూడా సిరివెన్నెల వ్రాసిన ఒకానొక దేశభక్తి గీతం.

కీరవాణి సంగీతంలో, ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, చిత్రం కోసం సురేష్ పీటర్ ఆలపించిన ఈ గీతం ఎక్కువ పాపులర్ అవ్వలేదు కానీ ఇందులో ఎంతో మంచి సాహిత్యం ఉంది.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమన్నా పొగడరా నీ మాతృభూమి భారతిని
We Love India wherever we are
We Love India
She is our Mother We Love India

దుబాయిలో తమ జీవన భృతి కోసం చిన్న చిన్న పనులు చేసుకుని నలుగురు యువకులు పాడుకునే నేపథ్యంలో ఈ పాట సాగుతుంది.

అందుకే వారు wherever we are

We Love India.. అని పాడుకుంటారు.

అలజడులెదురొస్తే కదలని ఎవరెస్టై నిలిచిన దేశములో మా పుణ్యము పుట్టింది
అలలుగ కలలిట్టే కలతలు కవ్విస్తే చెదరని సంద్రంలా మా ధర్మం మిగిలింది
ప్రతిజాతి కాలమ్ముందర తలవంచి శిథిలాలై నిన్నటి కథగా మారింది
మనదేశం కాలాలన్నీ ఎదురించి కలకాలం నిలిచే వుంటుంది
Tell me brother where is that great Nation మేరే వతన్ హిందుస్తాన్.
..We Love India

సింధు నాగరికతలో పుట్టిన వేద సంస్కృతి నుండి ప్రారంభమైన భారతీయత ఎన్నో విదేశీ దండయాత్రలను, ఆక్రమణలను, ఎదుర్కొంది. గ్రీకులు, యవనులు, హూనులు, కుషానులు, శకులు, గజనీ, ఘోరీ, మొఘలుల వంటి మహమ్మదీయులు, పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, వంటి యూరోపియన్లు భారతదేశాన్ని వివిధ కాలాల్లో ఆక్రమించి, రాజ్యాలు స్థాపించి దేశాన్ని అన్ని రకాలుగా దోచుకొని అతలాకుతలం చేశారు.

అన్ని అలజడులను కూడా తట్టుకొని దేశం నిలబడగలిగింది.‌ విదేశీ శక్తులనే సంద్రమంత అలలను, కల్లోలాలను కూడా తట్టుకొని భారతదేశంలో ధర్మం నిలబడగలిగింది.

అందుకే సిరివెన్నెల అంటారు, భారతదేశంలో పుట్టడం ఎవరెస్ట్ అంత పుణ్యం చేసుకున్న వారికే సాధ్యమని! ఎంతమంది ఎన్ని కుయుక్తులతో ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని పోరాడుతున్నా, ప్రపంచంలో ఇంకా హిందూ ధర్మం నిలబడే ఉంది! గతంలో సుసంపన్నమైన భారతదేశం పడరాని పాట్లు ఎన్నో పడినప్పటికీ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది. ఆ కష్ట కాలమంతా ఇప్పుడు తీరిపోయిందనీ, నిన్నటి శిధిలాల కథ సమసి పోయిందనీ, ఎన్ని రకాల ఇక్కట్లనైనా తట్టుకొని కలకాలం భారతదేశం వర్ధిల్లుతుందన్న ఆశాభావాన్ని, ఈ పాటలో వ్యక్తపరిచారు సిరివెన్నెల.

బ్రతుకును అందించే అమ్మానాన్నల్నే కనబడు దైవాలే అనుకుంటూ పూజిస్తాం
మనసులు బంధించే మమతల మంత్రంతో మనషుల గుండెల్లో రాజ్యాలే పాలిస్తాం సహనాన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తాం శరణంటే శత్రువునైనా దీవిస్తాం
మతమంటే మంచిని పెంచే సిద్ధాంతం అటువైపే అంతా పయనిద్దాం Tell me brother who gave us this Notion, That is again
We Love India.

ఇంకా రెండవ చరణం అయితే, పూర్తిగా భారతీయ సిద్ధాంతాలకు, భావాలకు అద్దం పడుతుంది. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా పూజించడం, మానవత్వంతో అందరి హృదయ సామ్రాజ్యాలను ఏలడం భారతీయుల ప్రత్యేకత అని ప్రశంసిస్తున్నారు సిరివెన్నెల. అంటే రాజ్యాకాంక్షతో ఇతర దేశాలపై దాడి చేసే రక్త పిపాసులం మేము కాదని ఘంటాపథంగా చెప్తున్నారు. మా దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం, మా సహనమే! అందుకే ఎన్నో రకాల శత్రుదాడులను తట్టుకున్నాం, ఎంతోమంది శత్రువులను అక్కున చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చాం. శరణుకోరి వస్తే శత్రువునైనా ఆదరిస్తారు. మతమంటే మంచితనాన్ని పెంచేది, అనేది భారతీయ సిద్ధాంతం.

విదేశీ ప్రభావం లేనంతవరకు భారతదేశంలో కులాల, మతాల కుమ్ములాటలు లేవు. అందరూ మనవాళ్లే, అందరూ సమానమే అనే గొప్ప సిద్ధాంతం మనది. లోకాన్ సమస్తా సుఖినోభవంతు అని, సర్వేజనా సుఖినోభవంతు, అని ప్రార్థన చేస్తాం. ఇదే భారతదేశం ప్రత్యేకత! అందుకే ప్రపంచంలో ఏ దేశస్తులైనా భారతీయతను అంతగా గౌరవిస్తారు. ఒక్క మన దాయాది శత్రు దేశాలు తప్ప, ఇంకెక్కడైనా భారతదేశ గౌరవానికి ఏమాత్రం లోటులేదు. అన్ని రంగాల్లో మనల్ని మన శక్తియుక్తున్ని నిరూపించుకుంటూనే ఉన్నాం. ఎందరో మహనీయులు జన్మించిన మన భారతదేశం ఎంతో గొప్పది. విశ్వమానవ సౌబ్రాతృత్వాన్ని తన ధర్మంగా స్థాపించుకున్న భారతదేశం ఎప్పటికీ విశ్వభారతమే!

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here