ఇద్దరు మిత్రుల దక్షతని చాటే ‘పరువు’

5
3

[డా. జి.వి. పూర్ణచందు రచించిన ‘పరువు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]

[dropcap]ఇ[/dropcap]ద్దరు వ్యక్తులు కలసి ఎక్కువ కాలం పనిచెయ్యడం కష్టమంటారు. అలాంటిది ఇద్దరు వ్యక్తులు కలసి పనిచేస్తూ సాహితీ సంస్థలను నడపడం మామూలు విషయం కాదు. కాని అసాధ్యాలను సుసాధ్యం చేయడం, విజయం సాధించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎంత కష్టమయిన కార్యక్రమాలనయినా, వేలాది మందితో నిర్వహించవలసి వచ్చినా, సునాయాసంగా భుజాన వేసుకుని చే(మో)స్తారు. అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ నిర్వహణా సామర్థ్యం ఒకనాటితో వచ్చింది కాదు. సుదీర్ఘకాలం నుంచి కొనసాగిన చెలిమి వీరి సాహితీ కలిమికి దోహదం చేసింది.

వీరే కృష్ణాజిల్లా రచయితల సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు, డా. జి. వి. పూర్ణచందులు. వీరి స్నేహానికి, కలసి కొనసాగించిన కృషికి 50 సంవత్సరాలు నిండిన స్వర్ణోత్సవం సందర్భంగా ఈ ‘పరువు’ పుస్తకాన్ని ముద్రించారు.

‘పరువు’ అంటే పరుగు, పరిపక్వత, గౌరవం వ్యాపించటం అనే అర్థాలున్నాయి. ఈ ముప్పేట మణిహారం అయిన గుత్తికొండ సుబ్బారావుతో కలసి చేసిన సుదీర్ఘ సాహితీయాన విశేషాలను బహు క్లుప్తంగా 64 పేజీల చిన్ని పుస్తకంలో నిక్షిప్తం చేసి సాహితీ లోకానికి అందించారు డా. జి. వి. పూర్ణచందు.

ఈ గ్రంథంలో తామిద్దరూ కలసి నిర్వహించిన సభలు, సదస్సులు, అవార్డు కార్యక్రమాలు, యాత్రలు, వెలువరించిన ఆకర గ్రంథాలు – అవి ఇవి అనేమిటి సమస్తాన్నీ ప్రస్తావించారు.

1975, 82 లలో కృష్ణాజిల్లా రచయితల మహాసభలు, 1978లో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల మహాసభలను నిర్వహించారు. ఈ సభలను నవ్య సాహితీ సమితి సహకారంతో నిర్వహించడం జరిగింది.

1983లో ‘కృష్ణాజిల్లా రచయితల సంఘాన్ని’ స్థాపించారు. ఈ సంఘాన్ని ప్రారంభంలో ఆనాటికి లబ్ధప్రతిష్ఠులయిన రచయితలు, రచయిత్రులు కార్యవర్గ సభ్యులుగా నిర్వహించడం విశేషం.

1984 నుండి ప్రతి రెండేళ్ళకీ ఒకసారి 1994 వరకు తెలుగు సాహిత్యంలోని వివిధ అంశాలను తీసుకుని మహసభలను నిర్వహించారు.

మహామహులందరూ తెరమరుగయ్యాక కొంత కాలం కార్యక్రమాలు అరకొరగా చిరుజల్లులా సాగాయి. ఇలాకాదు పునర్వైభవం తీసుకునిరావాలనే ప్రయత్నం మొదలయింది.

సంఘానికి నాలుగు మూలస్తంభాలు మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, గుత్తికొండ సుబ్బారావు, డా. జి. వి. పూర్ణచందుల నేతృత్వంలో 2006లో జాతీయ రచయితల మహాసభలను నిర్వహించారు. ఈ సభలలోనే సంకల్పసిద్ధి చేసుకుని 2007లో మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించారు. ఇప్పటికి ఐదు మహాసభలను, 2019 జనవరిలో ‘ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల తొలి మహాసభ’ లను నిర్వహించారు.

వివిధ అంశాలకి సంబంధించి అనేక సదస్సులని నిర్వహించారు. వీటిలో అంతర్జాలంలో తెలుగు యూనీకోడ్ లిపి అభివృద్ధి, తెలుగు మాండలికాలు, ‘న్యాయస్థానాలలో తెలుగు అమలు’, ‘తెలుగే ప్రాచీనం’, ‘సింధు కృష్ణాలోయల నాగరికతల తులనాత్మక అధ్యయన సదస్సు’, తానా వారితో కలసి ‘తరతరాల తెలుగు సంస్కృతి’ మొదలయిన పలు సదస్సులను విజయవంతగా నిర్వహించారు.

మహాసభలను, సదస్సులను నిర్వహించిన సందర్భాలలో వజ్రభారతి, తెలుగు పసిడి, తెలుగే ప్రాచీనం, తెలుగు మణిదీపాలు, తరతరాల తెలుగు సంస్కృతి, మహిళ వంటి ఆకర గ్రంథాలు వెలువరించారు.

2007లో డా. బెజవాడ గోపాలరెడ్డి శతజయంతి సందర్భంగా మచిలీపట్నం నుండి నెల్లూరు వరకు తెలుగు రచయితలతో ‘తెలుగు సంస్కృతి పాదయాత్రను’ 150 మందికి పైగా రచయితలతో నిర్వహించడం గొప్ప విజయం.

ప్రముఖ కవులు దాశరథి, సినారె, కుందుర్తి, వంటి వారితో పాటు శ్రీయుతులు ముక్కామల నాగభూషణం, శ్రీ విహారి, పువ్వాడ తిక్కన సోమయాజి, డా. త్రిపురనేని వెంకటేశ్వరరావు, పైడిపాటి సుబ్బరామశాస్త్రి, శ్రీమతి తెన్నేటి హేమలత, ఇంద్రగంటి జానకీబాల, డి. సుజాతాదేవి వంటి వారి సహాయ సహకారాలు, సూచనలు ఈ సంఘానికి లభించాయి.

వీరిద్దరి గురించి డా. రాళ్ళబండి కవితా ప్రసాద్, “సుబ్బారావు హార్డ్‌వేర్ – పూర్ణచందు సాఫ్ట్‌వేర్” అనీ, ఆచార్య వెలుదండ నిత్యనందరావు శ్రీ గుత్తికొండ, శ్రీ జి. వి. పూర్ణచంద్ ఒక విడదీయరాని ద్వంద్వసమాసం అని వచించారు.

నానీల నాన్న ఆచార్య యన్. గోపి “కృష్ణార్జునుల్లా కుదిరింది వీరి జంట” అన్నారు. గోపి గారి ప్రశంసలను మరింత విపులంగా తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదివి తీరవలసిందే!

మరి కొంతమంది సాహితీ ప్రముఖలు వీరిని గురించి చెప్పిన మాటలు పుస్తకంలో చదివి తెలుసుకోవాలి.

మరో విషయం తప్పకుండా ప్రస్తావించాలి. పూర్ణచందు ఈ పుస్తకం వ్రాస్తున్నట్లు చెప్పగానే శ్రీ మండలి బుద్ధప్రసాద్ “మీ ఇద్దరి కథ అంటే, అది కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆత్మకథే అవుతుంది. అందులో రామరత్నం గారిది ప్రధానపాత్ర. ముఖ్యంగా ఆమె వండి వడ్డించే తీరు గురించి నువ్వు రాయడం మరిచిపోకు. వాళ్ళింట్లో మీటింగ్ అంటే మంచి విందు దొరుకుతుందని అర్థం” అన్నారట. సభల సందర్భంగా బందరు వెళ్ళిన ప్రముఖ రచయితలు, రచయిత్రులు ఆమె చేతి భోజనం తిన్నవారే.

“శతాధిక గ్రంథకర్త పూర్ణచందు-ఏకైక గ్రంథకర్త సుబ్బారావు” – మరి గుత్తికొండ గొప్పదనమేమిటి అనే వారికి ఈ చిన్న గ్రంథమే చాలా సమాధానాలు చెపుతుంది.

ఒక ‘స్పందన’ ప్రచురణకర్తగా 75 మంది రచయితల తొలి పుస్తకాలు తన ఖర్చుతో ముద్రించడం, స్వంత ధనాన్ని ఖర్చు పెట్టి ‘స్పందన వాణి’ పత్రికను నడపడం ఆయనకే సాధ్యమయింది. ఈ నాటికీ కృష్ణాజిల్లా రచయిత సంఘానికే కాదు- ఇతర జిల్లాలలోనో వివిధ పట్టణాలలోని అనేక సాహితీ సంస్థలకు హార్థిక సాయమే కాదు. ఆర్థికసాయాన్నీ అందిస్తున్నారు.

తన శ్రీమతి పేర ‘శ్రీమతి గుత్తికొండ రామరత్నం ఛారిటబుల్ ట్రస్ట్’ పేరుతో బందరులోని అనాథ వృద్ధాశ్రమానికి భవంతిని నిర్మించారు. ఈ సంస్థ పేరుతో పుస్తక ప్రచురణ, జీవనసాఫల్య పురస్కారాల ప్రదానం, పేద విద్యార్థినులకు చదువుకునే నిమిత్తం ఆర్థిక సాయం (భార్య కోరిక) అందించడం మొదలయినవి చెయ్యడం విశేషం. తను చేసే గుప్తదానాలకి అంతేలేదు. ‘దటీజ్ గుత్తికొండ సుబ్బారావ్!’.

“నడక నాకు నేర్పిన గురువులు అనేకులు కానీ! పరుగు నేర్పింది సుబ్బారావే!” అన్న పూర్ణచందు మాటలు అక్షర సత్యాలు.

శ్రీ కుందుర్తి ఆంజనేయులు వీరిద్దరితో రచనలు చేస్తారా? సాహితీ కార్యకర్తృత్వం చేస్తారా? ఏదో ఒకటి ఎంచుకోండి అన్నారట. దానికి ప్రతిగా పూర్ణచందు సాహితీ సృజన, కార్యకర్తృత్వం చేస్తూ సవ్యసాచిగా నిలిచారు. గుత్తికొండ సాహితీ సృజన మాని, కార్యకర్తగానే కాదు – సాహితీ సంస్థల, సామాజిక సంస్థల సేవకుడిగా బహుముఖీనగా నిలిచారు. డా. గోపి గారిచ్చిన “ఎప్పటి గుత్తికొండ! ఇప్పటికీ బంగారు కొండ!” అన్నమాటని సార్థకం చేసుకున్నారు.

వీరిద్దరి పరుగు, వేగం, పనితనం, నిబద్ధత, స్నేహశీలత్వం గురించి తెలుసుకోవాలంటే ‘పరువు’ చదివి తీరవలసిందే!

***

పరువు
రచన: డా. జి.వి. పూర్ణచందు
ప్రచురణ: శ్రీమతి గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రస్ట్, మచిలీపట్టణం
పేజీలు: 64
వెల: అమూల్యం
ప్రతులకు:
శ్రీమతి గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రస్ట్,
గృహప్రియ ఫుడ్స్, 24-388,
రామానాయుడు పేట, మచిలీపట్టణం 521001
ఫోన్: 9440167697

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here