ఏఱకుమీ కసుగాయలు

0
3

[శ్రీమతి జి. వాత్సల్య రచించిన ‘ఏఱకుమీ కసుగాయలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయం పదిగంటలవేళ వీధిలోనుండి వంటాయన కేకేయడంతో పెద్దన్నయ్య, చిన్నన్నయ్య ఆయనతో మాట్లాడటానికి బయటికెళ్ళారు. వసారాలో మాట్లాడుకుంటున్న మూడో అన్నయ్య, ఆఖరన్నయ్య మాత్రం తమకేమీ పట్టనట్టే ఉన్నారు.

అన్నయ్యలిలా రెండు జట్లుగా ఉంటే వదినలేమీ తక్కువ తినలేదు. వాళ్ళు కూడా ఇద్దరిద్దరు చొప్పున జట్టుగా పనులు చేసుకుంటూ అత్యవవసరమైతే తప్ప మిగతా ఇద్దరితో మాట్లాడటం లేదు. అక్కయ్యలు ముగ్గురూ గంట క్రితమే వెళ్ళిపోయారు.

మొన్న రాత్రి ఛాతీలో నెప్పిగా ఉందని చెప్పిన అమ్మని ఆసుపత్రికి చేర్చేలోపే అనాయాసంగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఢిల్లీలో ఉన్న పెద్దక్క నిన్న సాయంత్రానికి కానీ రాలేకపోవడం వల్ల అమ్మని ఈరోజు ప్రొద్దున్నే సాగనంపాము.

అమ్మని సాగనంపి ఇంటికి రాగానే అక్కయ్యలు ముగ్గురూ ఎటువాళ్ళటు బయల్దేరారు. తప్పదు కాబట్టి మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్యా మిగతా ఇద్దరు అన్నయ్యలతో కలిసి ఉంటున్నారు కానీ లేకపోతే వాళ్ళూ ఈపాటికి బయల్దేరేసేవాళ్ళే. పిల్లలు కూడా పనులున్నాయని బయల్దేరిపోయారు. పన్నెండోరోజు కార్యక్రమం అయ్యాకా బయలుదేరుదామని నేను ఉండిపోయాను.

ఎనిమిదిమంది సంతానం, ఉద్యోగంలో నిక్కచ్చిగా ఉండటం వల్ల నాన్న ఇంజనీరుగా చేసినా రిటైర్ అయ్యే సమయానికి సొంతూరిలో మూడు గదుల ఇల్లు తప్ప వెనకేసుకున్నదేమీ లేదు. అందర్లోకి నేనే చిన్నదానిని కావడంతో మా అన్నయ్యలు, అక్కయ్యల పిల్లలు పుట్టడం నాకిప్పటికీ గుర్తే.

మూడో అన్నయ్య అమ్మ, నాన్నల దగ్గర ఉండి నాన్నకి వారసత్వంగా వచ్చిన రెండెకరాల పొలాన్ని చూసుకుంటూ ఉండేవాడు. సెలవలొస్తే చాలు మేమందరం పిల్లలతో ఆ మూడుగదుల ఇంట్లో వాలిపోయేవాళ్ళము. అప్పట్లో మా మనసులు విశాలం కాబట్టి ఇల్లు ఇరుకన్న సంగతే మాకు ఎరుకలో ఉండేది కాదు. ఆఖరి అన్నయ్య కూడా అదే ఊర్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఇంకో ఇంట్లో ఉండేవాడు.

మా ఎనిమిదిమందికీ ఇద్దరిద్దరు చొప్పున అమ్మ, నాన్నగారికి పదహారుమంది మనవలు. సెలవలొచ్చినప్పుడు ఇంతమంది పిల్లలు సందడిగా కలగలిసి తిరుగుతుంటే వారి ఆనందానికి హద్దుండేది కాదు. ఉద్యోగాలున్నవాళ్ళం పిల్లలని అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి మళ్ళీ స్కూళ్ళు తెరిచే సమయానికి వచ్చి తీసుకెళ్ళేవాళ్ళం. పిల్లలకి వేసవి సెలవులు ఉత్సాహంగా గడిచిపోయేవి. జూన్ రెండోవారంలో కజిన్స్‌ని వదిలి రావడం పిల్లలకి కష్టంగా ఉన్నా తప్పదు కాబట్టి మాతో పాటు వచ్చేవాళ్ళు. కానీ సంవత్సరం పొడుగునా వాళ్ళ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉండేవి. ఇప్పటిలా వాట్సాప్ సౌలభ్యం లేదు కద! ఇంకా చెప్పాలంటే అసలు ఫోనే లేదు.

ముప్ఫైయేళ్ళక్రితం నాన్న హఠాత్తుగా పోయినప్పుడు ఎనమండుగురం పిల్లలం కలసికట్టుగా కార్యక్రమాలన్నీ జరిపించాము. ఊర్లో ఉండే అన్నయ్యలు, వదినలు అమ్మని బాగా చూసుకుంటారనే నమ్మకం ఉన్నా కానీ మేము నెలకొకళ్ళం వచ్చి అమ్మతో ఉండేవాళ్ళం. నాన్నకి నెల నెలా పెట్టే మాసికాలైతే మాకొక గెట్టుగెదర్లా ఉండేవి. ఆ తరువాత సంవత్సరీకం, ప్రతీ సంవత్సరం తద్దినాలు కూడా ఇలాగే జరిగాయి.

క్రమంగా మా అందరి పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. మా పిల్లలని చెప్పుకోవడం కాదు కానీ, అందరూ చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కద! మా అందరికీ ఇంకేదో కావాలనే ఆశ బయల్దేరింది. మా కళ్ళు ఊళ్ళో ఉన్న రెండెకరాల పొలం, అందరం వచ్చినప్పుడు అనువుగా ఉండటానికి మూడుగదుల ఇల్లు స్థానే నాన్న పెన్షన్ డబ్బులు కూడబెట్టి కట్టిన రెండంతస్తుల ఇంటిమీద పడ్డాయి.

అప్పటివరకూ ఊళ్ళో ఉండి పొలం చూసుకుంటున్న మూడో అన్నయ్యని లెక్కలడగని మేము లెక్కలడగడంతో చిలికిచిలికి గాలివానగా మొదలైన గొడవల వల్ల నలుగురం చొప్పున ఒక వర్గంగా ఏర్పడేటట్లు తయారయ్యాము.

ఇన్నాళ్ళూ తాను తల్లిదండ్రులని చూసుకున్నాను కాబట్టి పొలం తనకే దక్కాలని మూడో అన్నయ్య పట్టుదల. పొలం మీద రాబడి లేనప్పుడు ఇంట్లో ఖర్చులు, ఆడపిల్లల పురుళ్ళు, పెట్టుపోతల వంటివి తాను చూసుకున్నాను కాబట్టి ఇల్లు తనకి చెందాలని ఆఖరన్నయ్య వాదన. పైగా ఈ మధ్య రాబడి కంటే ఖర్చు పెరిగి పొలం లాభసాటిగా లేదని ఊర్లో ఉండే అన్నయ్యలిద్దరూ చెప్పినా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మాలో చిన్న అనుమానం మొదలై వటవృక్షమైపోయింది.

ఇదే విషయమై ఊర్లో వాకబు చేసామని వాళ్ళకి తెలిసి అగ్గిమీద గుగ్గిలమైపోయారు. ఎవరేమి చేసుకున్నా ఎవ్వరికీ పొలంలో, ఇంట్లో వాటా ఇవ్వమని, అవసరమైతే కేసు వేసుకోమని చెప్పి వాటా అడిగేవాళ్ళు ఇంటికి రానక్కర్లేదని ఖరాఖండీగా చెప్పేసారు ఇద్దరూను.

తన కళ్ళముందే పిల్లలు రెండు వర్గాలుగా విడిపోయి మాటలు లేకుండా ఉన్నా ఏమీ చెయ్యలేని వయసు అమ్మది.

నేనూ తక్కువ తినలేదు. ఊర్లో ఉంటున్న ఇద్దరన్నయ్యల వ్యతిరేక వర్గంలో చేరి వాళ్ళకి వంతపాడుతున్న ఇద్దరక్కయ్యల మీద కేసులు వేసాను.

ఓ సారి ఆ కేసు విషయమై ఫోనులో మాట్లాడి శ్రీవారికి భోజనం వడ్డిస్తుండగా ఆయన ముభావంగా ఉండటం గమనించాను.

“మాధవీ! నిజంగా నీకు ఓ ఐదారు లక్షలు తక్కువయ్యాయా?” సూటిగా నా మొహంలోకి చూస్తూ అడిగారు.

“ఏంటండీ? ఏమంటున్నారు? గెజిటెడ్ ఆఫీసరు హోదాలో ఉన్న నేను రెణ్ణెలల్లో సంపాదించుకోగలను. ఇంత సంపాదిస్తున్నాననే మా వాళ్ళకి కుళ్ళు” ఆవేశంగా అన్నాను.

“సరే! వాళ్ళకి కుళ్ళే అనుకుందాము. ఆ ఐదులక్షలూ మన పెళ్ళిరోజు సందర్భంగా ఏ సంస్థకో ఇచ్చాననుకోవచ్చు కద! ఆ డబ్బు మా అమ్మ వాళ్ళ గుర్తు వగైరా కబుర్లు చెప్పకు మధూ! మీ వాళ్ళని గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళు సంపాదించిన ఆస్తులు అమ్మగా వచ్చే డబ్బులే అక్కర్లేదు కద? కావాలంటే వాళ్ళు వాడిన వస్తువులేమైనా తెచ్చుకో! వాళ్ళు నేర్పిన విలువలని మనసులో పదిలంగా పెట్టుకో. కష్టం సుఖం చెప్పుకోవడానికి నీకు ఏడుగురు తోబుట్టువులని, మన పిల్లలకి పధ్నాలుగు మంది కజిన్స్‌ని ఇచ్చిన మీ తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పుకోవాలంటే మీ వాళ్ళందరూ తిరిగి కలిసే ప్రయత్నం మొదలెట్టు. బయట అందరికీ ఆదర్శంగా నిలిచే నువ్వు డబ్బుల కోసం రక్తసంబంధాన్ని పలచన చేసుకోవడం సబబేనా? ఆలోచించు!”

ఆయన మాటలకి ఆలోచనలో పడిన నేను శ్రీవారు భోజనం ముగించి లేచిన విషయమే గమనించలేదు.

మరునాడు ఆఫీసునుండొచ్చాకా నా ‘వైరి’ వర్గానికి చెందిన ఇద్దరక్కలతో మాట్లాడాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించగపోగా, ఎకసెక్కాలు ఎదురయ్యాయి.

అందరం కూర్చుని ఒకసారి మనసువిప్పి మాట్లాడుకుంటే పొరపొచ్చాలు తొలగుతాయేమోనని వ్రతం వంకతో ఏడుగురు తోబుట్టువులనీ ఇంటికి పిలిచాను. నాతో మాటలున్న తోబుట్టువులు ఒకరోజు ముందే వస్తే, నా ‘వైరి’ వర్గం వాళ్ళేమో వ్రతానికొచ్చి భోజనం చేసిన వెంటనే మాయమైపోయారు.

ఇంతలో అమ్మ హఠాత్మరణం. అక్కడ కూడా రెండు వర్గాలు తయారు.

ఈ రాత్రికైనా అందరూ ఉంటే ఓసారి మాట్లాడదామనుకున్నాను కానీ అప్పుడే అందరూ సర్దుకుని వెళ్ళిపోయారు. నేను, నలుగురన్నయ్యలు, వదినలు మాత్రమే ఇంట్లో మిగిలాము.

చిన్నన్న, ఆఖరన్నయ్య తమ వర్గం కాదని నాతో మాట్లాడరు. ఇదంతా నాకు చిరాగ్గా తోచింది. ఇలా మాటల్లేకుండా ఎన్నాళ్ళుంటామని, అందరం కలిసుందామని చెప్పబోతుండగా రెండో అన్నయ్య అందుకుని పొలం, ఇల్లు వాటాల విషయం ముందు తేల్చమని మొండిపట్టుపట్టాడు.

కళ్ళకి డబ్బు పొరలు కమ్మిన ఆ అన్నయ్య ప్రవర్తన నాకు ఆశ్చర్యమనిపించలేదు. పెద్దన్నయ్య కూడా ఈ తమ్ముడిని వెనకేసుకురావడం చూసి బాధ కలిగినా ఏమీ చేయలేని నిస్సహాయత.

కనీసం ఆడపిల్లలం కలిసుంటే మగపిల్లలు మారతారేమో అనుకుని ఎప్పుడొస్తున్నారని అక్కయ్యలకి మెసేజి పెడితే, పదోరోజుకి వచ్చి స్నేహితుల ఇంట్లోనో లేదా హోటల్లోనో దిగుతామన్నారే తప్ప ఇంటికొస్తామని అనకపోవడంతో మనసు చివుక్కుమంది.

ఒకప్పుడు మూడు గదులుగా ఉన్న ఈ ఇంట్లో ఎన్నిసార్లు అందరం సర్దుకుని పడుకున్నామో, ఎన్నెన్ని అనుభూతులు మూటగట్టుకున్నామో గుర్తొచ్చి మనసు బాధతో మూలిగింది.

ఈ కార్యక్రమాలు అయిపోతే ఎవరికి వారే యమునా తీరే అని నాకు తెలుసు. అందరం ఎదురుపడేది మళ్ళీ కోర్టులోనే అన్న స్పృహ రాగానే మనసులో గుచ్చినట్లయ్యింది.

పదోరోజు శుక్రవారం వచ్చింది కాబట్టి తోబుట్టువుల పిల్లలు సెలవు పెట్టి ఆరోజు కార్యక్రమానికో లేదా పదకొండో రోజైన శనివారానికో వస్తారనుకుంటే శుక్రవారం ప్రొద్దున్న వరకూ వాళ్ళెవరూ రాలేదు. పదోరోజు కార్యక్రమం పెద్దల మౌనవ్రతాలతోనే ముగిసింది. పెద్దవారందరూ ఎన్నో యేళ్ళ తరువాత కలిసినా అందరూ ముళ్ళమీదున్నట్టే ఉన్నారు. పోనీ పిల్లలుంటే అయినా సందడిగా ఉంటుందనుకుంటే మా పిల్లలిద్దరూ తప్ప మిగతా పిల్లల ఆచూకీ లేదు.

మరునాడు ఆఫీసులకి సెలవున్నా కానీ నా తోబుట్టువుల పిల్లల్లో ఎంతమంది వస్తారో, అసలు వస్తారో రారో కూడా తెలియదు. నేను ఇప్పుడు గనుక ఏదో ఒకటి చెయ్యకపోతే జానకిరామయ్య-వైదేహి గార్ల పిల్లలు, మనుమలు ఇక ఎప్పటికీ కలవరని నాకు తెలుసు.

మనుషులం కద! మంచి మాటలు విని మంత్రం వేసినట్టు కలిసిపోలేమనే సత్యం కూడా ఎరుకలో ఉంది. ఏదో ఒకటి చెయ్యాలని నా మనసు పెట్టే పోరు తట్టుకోలేక అప్పటికప్పుడు మా అందరి పిల్లల నంబర్లతో ఒక వాట్సాప్ గ్రూపు తయారు చేసి అందరినీ శనివారం కార్యక్రమానికి రావలిసిందిగా అభ్యర్ధిస్తూ సందేశం పెట్టాను.

నాతో మాటల్లేని తోబుట్టువుల పిల్లలైతే ఆ గ్రూపులోంచి బయటకొచ్చేసారు. ఇక ఇలా కాదని వాళ్ళకి ఫోను చేసాను. ఏ కళనున్నారో కానీ ఫోను ఎత్తారు.

ఆ ఒక్కరోజుకి మాత్రం వచ్చి ఆదివారం ప్రొద్దున్నే బయల్దేరవచ్చని నా స్వభావానికి విరుద్ధంగా దాదాపు ఏడ్చి బ్రతిమాలాను. ఈ ఒక్కసారి వస్తే ఇంకెప్పుడూ రమ్మనమని అడగనని మరీ మరీ చెప్పడంతో రావడానికి అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళందరూ మూడు నాలుగు గంటల ప్రయాణ దూరంలోనే ఉండటం కూడా నా అదృష్టమనే చెప్పాలి.

పదకొండోరోజు కార్యక్రమం మొదలవ్వబోతుండగా తోబుట్టువుల పిల్లలు ఒక్కొక్కరే వచ్చారు. పిల్లలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. వారిలో ‘వైరి’ వర్గం కజిన్స్ పట్ల అసహనం ప్రస్ఫుటంగా కనపడుతుంటే నిట్టూర్చడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను.

ఆ రాత్రి భోజనాలయ్యాకా పిల్లలందరినీ డాబా మీదకి పిలిచాను. అయిష్టంగానే వచ్చారందరూ.

పెద్దవాళ్ళం వేసిన బాటలోనే రెండు వర్గాలుగా కూర్చుని విసుగ్గా ఫోనులు చూసుకుంటూ ఎప్పుడెళ్ళిపోదామా అన్నట్టున్నారు.

“ఒక్క అరగంట మీ ఫోనులు ఆపెయ్యగలరా?” అని నేను గొంతు సవరించుకోగానే అందరూ ఆశ్చర్యంగా చూసారు.

చిన్న అత్తని/పిన్నిని అన్న గౌరవంతో కాబోలు ఫోన్లు ప్రక్కన పడేసి నన్నే తదేకంగా చూడటం మొదలెట్టారు.

‘నా కళ్ళముందు పుట్టిన పిల్లలు ఎంత ఎదిగిపోయారు? వీళ్ళల్లో కొంతమందికి పెళ్ళిళ్ళయ్యి పిల్లలు కూడా…’ అని మనసులో అనుకుని అందరినీ ఆశ్చర్యంతో చూస్తుండిపోయాను.

“పిన్నీ..! అత్తా.. ఏదో చెప్తానన్నావు..” కలగలుపుగా మాటలు వినపడటంతో ఈలోకంలోకొచ్చాను.

“ఈ ఇంటి వాకిట్లోని వేపచెట్టు, దానికి కట్టిన ఉయ్యాల మీలో ఎంతమందికి గుర్తుంది?” మొదటి ప్రశ్న సంధించాను. నానుండి ఇది ఊహించలేదని వాళ్ళ వదనాలే చెప్తున్నాయి.

కాసేపు గుసగుసల తరువాత అందర్లోకీ పెద్దదైన పెద్దక్క కూతురు మణి గొంతు సవరించుకుని, “నాకు గుర్తుంది పిన్నీ! ఎండదెబ్బ తగుల్తుందని అమ్మమ్మ లోపలకి రమ్మని గోలపెట్టేది. పెద్దమామయ్య కొడుకు బాచిగాడేమో ఎప్పుడూ ఆ చెట్టు మీదే ఉండేవాడు. తనని ఎక్కువవసేపు ఊగనీయలేదని జానకేమో వాళ్ళమ్మకి ఫిర్యాదు చేసేది!” అంది నవ్వుతూ.

“నేను ఫిర్యాదు చేయడమేంటే! నువ్వసలు ఉయ్యాల దిగేదానివేకాదు. పెద్దదానివని మా అందరి మీదా ఆజమాయిషీ చేసేదానివి” నవ్వుతూ అటునుండి ఇటొచ్చి మణి వీపుమీద ఒక్కటేసింది జానకి.

“వేసవి కాలంలో డాబా మీద పడుకోవడానికి బకెట్లతో నీళ్ళు పట్టుకెళ్ళడం అబ్బాయిలకి అప్పజెప్పి వీళ్ళేమో సాయంత్రాలు ఉయ్యాలలూగుతూ ఉండేవారు” అక్కసుగా అన్నాడు మా అన్న కొడుకు, మగపిల్లలందర్లోకీ పెద్దవాడైన అభి.

“అవునన్నయ్యా! పరుపులు, రాత్రిపూట త్రాగడానికి కూజాలో నీళ్ళు నింపుకెళ్ళే పని కూడా మనదే! వీళ్ళు మాత్రం ప్రొద్దున్నే లేచి పరుపులు క్రిందకి తీసుకురమ్మంటే పైనుండి చుట్ట చుట్టి క్రిందకి వేసేవారు” నవ్వుతూ గతంలోకెళ్ళిపోయాడు ఇంకొకడు.

మధ్యాహ్నాలు భోజనాలయ్యాకా కంచాలు తియ్యడానికి వేసుకున్న వంతులు, ఆవకాయ ప్రహసనం, వడియాలు పెట్టినప్పుడు పక్షులు రాకుండా కూర్చున్న కాపలా, కలిసి ఆడుకున్న అష్టాచెమ్మా, రాముడు-సీత ఆటలు గుర్తు తెచ్చుకుని అందరూ ఒక్కసారి చిన్నపిల్లలైపోయారు.

“బాబీ! అన్నం మధ్యలో గుంట చేసి దానిలో పులుసు పోయించుకుని, ముక్కలన్నీ కంచంలోనే వదిలేసే అలవాటు నీకింకా పోలేదనుకుంటాను. మధ్యాహ్నం చూసాలే” అంది మా అమ్మాయి సారిక తన కజిన్ బాబీని చూస్తూ.

“నువ్వు మాత్రం వంకాయ కూర తింటున్నావేంటి? ఈరోజు ఆకులో వదిలెయ్యలేదూ” కౌంటరేసాడు బాబిగాడు.

“ఇప్పటికైనా ఏడ్వకుండా సినిమా చూస్తున్నావా?” అని ఒకడు ఇంకొకడిని ఏడిపిస్తే, “దెయ్యాల కథలతో మీ పిల్లలని కూడా భయపెడుతున్నావా?” అంటూ మరో పంచ్ పడింది.

పిల్లలందరూ తమ చిన్నప్పటి సంగతులు, వేసవి శలవల్లో అందరూ కలసికట్టుగా గడిపిన రోజులు, చూసిన సినిమాలు, మధ్యాహ్నాలు కొనుక్కున్న ఐస్‌ఫ్రూటులు, పెరట్లోని నిమ్మకాయలతో చేసుకున్న నిమ్మరసాలు తలచుకుని ఒక్కసారిగా తాము పెద్దవాళ్ళమయ్యామనే సంగతి మర్చిపోయి అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు.

పెద్దయ్యేకొద్దీ కొన్ని భావాలు అలా పునాదుల్లోకెళ్ళిపోతాయి. పునాదుల మీద ఆశల భవంతులు లేపేసి ఉంటాము కద! అక్షరాలా ఓ గంటన్నరపాటు వాళ్ళలా మాట్లాడుకుంటూనే ఉన్నారు.

“నేను ఆపమనకపోతే ఈ రాత్రంతా ఆగేటట్టులేరే!” అని నేను నవ్వుతూ అనగానే అందరూ ఒక్కసారిగా మాటలాపేసారు.

“మీరేమో ఇన్నిన్ని అనుభవాలని బాల్యంలో మూటలుగట్టుకుని మీ పిల్లలకి అవన్నీ దూరం చెయ్యడం భావ్యమా? మీ కజిన్స్ అందరూ చిన్నప్పటిలా కలిసి ఉండకపోవడానికి పెద్దవాళ్ళమే కారణం అని ఒప్పుకుంటున్నాను. రెండెకరాల పొలం, రెండంతస్తుల ఇంట్లో వాటాల కోసం రక్తసంబంధాలని దూరం చేసుకోవడం సబబో కాదో మీరే ఆలోచించండి. ఇంటికి పిలిచి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వక్కర్లేదు కానీ ఒక్కో పండగ ఒక్కో కజిన్ ఇంట్లో చేసుకుంటే మీ పిల్లలకీ బంధాల విలువ తెలుస్తుంది. చిన్నప్పుడు బాదంచెట్టు మీద నుంచి నేల మీదకు రాలిన పిందెలను ఏరుకుని మీరు వాటినే పళ్ళనుకునేవారు. ఇప్పుడేమో పెద్దవారి మాట పట్టింపుల కోసం బంధాలని తెంచుకోవడమే జీవితమనుకుంటున్నారు.

ఇంకో పది, పదిహేనేళ్ళల్లో మా తరంలో ఒక్కళ్ళం కూడా ఉండము. అప్పటిలోపు మా చిన్నప్పటి ప్రేమలు, ఆప్యాయతలని తిరిగిపొందేటట్లు చేయగలిగే సత్తా మీకే ఉంది. నా అనేవారితో నాలుగు మాటలే మాకు ఈ వయసులో మంచి టానిక్. మీరు కలిసుంటే పెద్దవాళ్ళు మనసు మార్చుకోవచ్చేమో! రక్తసంబంధాలే మన బలం. ఆ బలాన్ని పెంచుకుంటారో, తుంచుకుంటారో మీ ఇష్టం. ఇంక నేను చెప్పేదేమీ లేదు” అని ముగించి వెనక్కి తిరిగి చూడకుండా క్రిందికొచ్చేసాను.

***

“అమ్మగారూ! ఇన్ని చెప్పులుంటే వాకిట్లో ముగ్గెలా వెయ్యాలి? సాయంత్రం రానా?” అంటున్న పనిమనిషి కేక విని బద్ధకంగా కళ్ళు తెరిచేసరికి రాత్రంతా డాబా మీద నుండి వినబడ్డ మాటలు, నవ్వులు గుర్తుకురాగానే మనసు తేలికపడింది. ఆదివారం ఉదయం ఏడింటిలోపల బయల్దేరతామనే మాట మీద వచ్చిన పిల్లలెవ్వరూ నిద్ర లేవలేదు.

ఎప్పుడూ పిన్నలే కాదు, చాలాసార్లు పెద్దవాళ్ళం కూడా పొరపాట్లు చేస్తాము. తెలియకుండానే పిల్లలని కూడా ఆ మార్గంలోకి లాగుతాము. అది సరిద్దుకోలేకపోతే రాబోయే తరాలకి తీరని ద్రోహం చేసినవాళ్ళమవుతాము. నేను సరిదిద్దుకున్నాననే తృప్తి మనసంతా నిండిపోయింది.

చిన్నప్పుడు వల్లెవేసిన

‘ఏఱకుమీ కసుగాయలు

దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ’

అనే సుమతీ శతక పద్యం అప్రయత్నంగా గుర్తొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here