పూచే పూల లోన-31

0
3

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సుందర్ – జ్యోతి, చిత్ర లతో కలిసి ఓ నాటకం చూడడానికి డాఫోడిల్స్ ఆడిటోరియమ్‍కి వెళ్తాడు. తనకి ఎడమ వైపు చిత్ర, కుడి వైపు జ్యోతి కూర్చుంటారు. ఏదైనా మాట్లాడమని వాళ్ళు అడిగితే, ఏదైనా షో ఉన్నప్పుడు తాను పెద్దగా మాట్లాడనని చెప్తాడు సుందర్. ఆ ఆడిటోరియమ్ కొంకణి సంస్కృతికి ప్రాణం పోసిన కళాక్షేత్రమనీ, వేరే ఏ కార్యక్రమాలు ఇక్కడ జరిగినా నెలకి ఒకసారి ఖచ్చితంగా నాటక ప్రదర్శన ఉండటం పరిపాటి అనీ చెప్తాడు.  ఇంతలో సుందర్ మొబైల్ మ్రోగుతుంది. సమీర్ మాట్లాడుతాడు. తాను కాసేపట్లో వెళ్ళిపోతానని, తన మిత్రుడు జోవాక్విమ్‍ని కలిసి వెళ్లమని చెప్తాడు. తెర లేస్తుంది. ఇద్దరమ్మాయిలు అందంగా నాట్యం చేస్తుంటే, కొంకణి భాషలో ఒక పాట వస్తుంది. కాసేపయ్యాకా, ఓ వృద్ధుడి వేషంలో జోవాక్విమ్ స్టేజ్ మీదకి వస్తాడు. అద్భుతమైన ప్రదర్శనతో నాటకం పూర్తవుతుంది. స్టేజ్ మీద జోవాక్విమ్ ఒక పువ్వు గురించి చెప్పి – ఆ పువ్వు రేకులు ప్రమాదమని అంటాడు. వాటిని తింటే ప్రాణాలు పోతాయని సుందర్ చిత్రకీ, జ్యోతికి చెబుతాడు. ఇక చదవండి.]

[dropcap]షో[/dropcap] అయిపోయిన తరువాత మెల్ల మెల్లగా అందరు బయటికి వెళ్లిపోయారు. ముందర ఏమో అనుకున్నాను, కానీ హాలు దాదాపుగా నిండినట్లే. నాకు ఇరుప్రక్కలా కూర్చున్న చిత్ర, జ్యోతి నేను ఎప్పుడు లేస్తానా అని చూస్తున్నారు. ఎందుకో వాళ్లు లేవటం లేదు. మా ముందు వరుస, వెనుక వరుసలోని వాళ్ళు మమ్మల్ని కొద్దిగా వింతగా చూస్తు బయటకి కదులుతున్నారు. కొందరు స్టేజ్ మీద విన్న పాటలను నెమరేసుకుంటూ పోతున్నారు. స్టేజ్ మీద తెర పడిపోయి ఉంది.

“ఇద్దరున్నారు గదా అటూ ఇటూ..” ఎవరో అంటున్నారు, “..ఒక టికెట్‍కే రెండు షోలు చూడాలేమో!”

“ఎందుకని కూర్చున్నాం ఇంకా?” చిత్ర అడిగింది.

“రెండు” అన్నాను.

“ఇదో దిక్కున అలవాటు మీది”

“చాలా దిక్కుమాలిన అలవాట్లున్నాయి నాకు. ఇదేమిటో చెబితే బాగుంటుంది.”

“ప్రతి దానికీ రెండు అనటం!”

జ్యోతి వైపు చూసాను. ఎందుకో తల వంచుకుంది.

“మొదటిది..” చెప్పాను, “..జనం వెళ్లిపోతే హాయిగా అవతలకి పోవచ్చు!”

“రెండవది?”

“రెండవది, అసలుది.. ఇక్కడ షో అయిపోలేదు”

“ఏంటి?”, ఇద్దరు అడిగారు. నవ్వాను.

“మన ముగ్గురి కోసమా?”

“అవును”

మెల్లగా లైట్లు ఆరిపోతున్నాయి. అలా అని స్టేజ్ మీద లైట్లు వెలగటం లేదు.

“ఏం జరుగుతోంది సార్?”

“భయపడకండి”

ఎక్కడి నుంచో ఒక పెద్దాయన వచ్చాడు.

“సార్ రమ్మంటున్నారు”, అన్నాడు. ముగ్గురం లేచాం.

“మేమూ రామా?” వీళ్లు అడిగారు.

“రావాలి. ఆ ప్రధాన పాత్ర పోషించిన జోవాక్విమ్‍ని చూడరా?”

“ఓ. అతనా? పదండి”

ఆ పెద్దాయన స్టేజ్ మీదకి తీసుకుని వెళ్లి దాని వెనకున్న మెట్ల మీదుగా క్రిందికి తీసుకుని వెళ్ళాడు. ఈ ఆడిటోరియమ్ క్రింద ఇంత ప్రపంచం ఉన్నదంటే ఎవరూ నమ్మరు. కేవలం మేకప్ రూమ్ అనుకుంటారు. కానీ ఏకంగా ఎన్నో గదులు, ఒక అతి పెద్ద హాలు, ఒక వంట గది – ఇలా చాలా ఉన్నాయి.

చివరగా ఒక ఆఫీసులా ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళాడు. అడుగడుగునా సమీర్ పోస్టర్లు, అతని కేరికేచర్లు అక్కకక్కడ దర్శనమిస్తున్నాయి. ఆఫీసులోకి వెళ్లాం. ఎదురుగా ఓ అద్భుతమైన పెయింటింగ్ దర్శనమిచ్చింది. మామూలుగా చూస్తే అవి గిటార్, డ్రమ్స్ అనుకోము. మెట్లు లాగా అమర్చి వాటిల్లో రంగులు నింపారు. ఆ గోడ మీద ఒక మూల నుండి ఇంకో మూలకి అమర్చిన గిటార్ వెనక రకరకాల గోవా బొమ్మలు, మనుషులు, కొంకణి కన్యలు, ఎప్పటిలానే సముద్రం, సూర్యబింబం అన్నీ చోటు చేసుకున్నాయి. టేబిల్ వెనక కుర్చీ బదులు ఒక బెంచీ వేసి ఉంది. దాని మీద కాళ్ళు జాపుకుని, గోడకి ఆనుకుని టేబిల్ మీద చెయ్యి ఆన్చుకుని  ఉన్నాడు జోవాక్విమ్. ఒక్కసారిగా లేని ఎంతో వినయంతో తల వంచి నమస్కారం చేసాడు. జుట్టు పూర్తిగా ముందరికి వాలటంతో వెనక్కి లాక్కుని మమ్మల్ని కూర్చోమని కుర్చీలు చూపించాడు. సమీర్ చెప్పిన్ జో అన్నమాట ఇతను.

“పెర్‍ఫార్మెన్స్ బావుంది”, చిత్ర అన్నది.

“ఆమె చిత్ర..”, చెప్పాను. “..డాక్యుమెంటరీ మేకర్.”

జ్యోతి వైపు చూసాడు.

“ఈమె జ్యోతి. మంచి రచయిత్రి, ఆర్టిస్ట్.”

“హలో” అనుకున్నారు ఇద్దరూ.

“నాటక కళను ఇంకా నమ్ముకునే ఉన్నారు. గొప్ప విషయం”, చిత్ర కాంప్లిమెంట్ ఇచ్చింది.

జో ఆలోచించాడు.

“ఓ కార్టూన్‍లో కథ చెప్పవచ్చు..” చెప్పాడు. “..ఓ బొమ్మలో కథ చెప్పవచ్చు. ఓ మాటలో ఎంతో అనవచ్చు. కానీ నాటకంలో చెప్పేది గొప్పది.”

“ఎందువలన?”

“మనకి జరిగిన దానిని ఎన్నో సార్లు రకరకాల పద్ధతులలో అనుభవించి మరల మరల చెప్పవచ్చు, చెప్పుకోవచ్చు కూడా!”

“ఏం జరిగింది?” జ్యోతి టక్కున అడిగింది. జ్యోతికి ఇదో అలవాటు. ఎవరైనా కొద్దిగా అటూ ఇటూ పలుకుతున్నారనిపిస్తే చక్కగా, సూటిగా దారిలోకి వచ్చేయమని నిర్ధారించేస్తుంది!

జో ఒక్క సారిగా షాక్ తిన్నవాడిలా ఆగిపోయి ఆమెను అలా చూస్తూ ఉండి పోయాడు. పైకి చూసాడు.

“చూడండీ, ఈ క్రింద జరిగిన దానికి పైన ఏదో చూపిస్తూ ఉంటాం.”

“అంటే?”

“కలాన్‌గుటె ఒక సామాన్యమైన ఊరు కాదు. ఇక్కడున్న బీచ్‌లూ సామాన్యమైనవి కావు.”

చిత్ర రికార్డర్ ఆన్ చెయ్యబోయింది. జో ఆపాడు. చిత్ర నన్ను చూసింది. వద్దని సైగ చేసాను.

“వైన్, జూస్, కాఫీ, టీ..” జో అన్నాడు.

”టీ” అన్నాను.

నవ్వాడు.

“నాకు తెలుసు. కానీ గోవా మర్యాద ఇది. ముందరవి పలుకకపోతే తప్పు పడతారు” అని చెప్పి అక్కడ కుర్రాడి వైపు చూసాడు.

అతను చిరునవ్వు కూడా ఆఫర్ చేసి అక్కడ్నించి వెళ్ళిపోయాడు.

“ఇక్కడ తయారైన షిప్పులు ఎందరో శాస్త్రజ్ఞులను విస్మయపరచాయి. కొచ్చిన్, మలబార్‌ నుంచి వచ్చి ఇక్కడ వీటిని నిర్మించారని కొందరంటారు. మామూలుగా రస్ట్ పట్టే ఇనుము కాకుండా ఎన్నటికీ రస్ట్ పట్టని ఇనుముతో ఎలా చేసారన్నది ఎవరికీ అర్థం కాలేదు.”

“ఆ చరిత్ర ఎక్కడా మిగలలేదా?” చిత్ర అడిగింది.

“వెతికితే ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది!”

జ్యోతి కళ్ళు మూసుకుంది. నాకు కొద్దిగా భయం వేసింది.

“ఈ చరిత్రలనే స్టేజ్ మీద చూపిస్తున్నారా?”

“చరిత్ర ఏంటండీ? మీరూ, నేనే కదా? కాకపోతే మన వెనుక ఉన్నదానిని – అంటే చరిత్రని మన వెనుక నిలబెట్టి మనం ఎలా ఉన్నా, ఇలా ఎందుకున్నామని నేను నాటకంలో చూపిస్తాను.”

“ఎందుకు?” జ్యోతి ప్రశ్న అది.

జ్యోతిని జో వింతగా చూసాడు.

“నిజానిజాలు మనకి అనవసరమా?”

“ఎందుకు?”

టీ వచ్చింది. మేము కప్పులను జాగ్రత్తగా తీసుకుంటుంటే జో దీర్ఘంగా ఆలోచిస్తూ తన కప్పు పుచ్చుకున్నాడు.

“ఆ.. జ్యోతి కదా మీ పేరు? యస్, చూడండి జ్యోతీ, అబద్ధపు ఊయలలో ఊగుతూ నిద్ర పోవటం కంటే నిజమనే పాము పడగ నీడలో మేల్కొని ఉండటం మేలు!”

“వావ్! లైను బాగుంది.”, చిత్ర చప్పట్లు కొట్టింది.

“నా మాటలు కావు!” జో అన్నాడు.

“ఎవరివి?”

“సమీర్‌వి”

“ఓ. మీకు ఆయన మంచి మిత్రులా?”

కళ్ళు మూసుకున్నాడు జో.

“నేనెవరో, అతనెవరో. మా మధ్య ఉన్నది చరిత్ర”

“ఆటోరియమ్ బాగుంది” అన్నాను.

“మీరు చాలా చోట్ల చారిత్రాత్మక కట్టడాలను చూస్తారు. ఇక్కడా చూసి ఉంటారు. కానీ మీరు కూర్చున్న ఈ భవనం ఏ చారిత్రాత్మక భవంతికీ తీసిపోదు. అంతే కాదు. ఇక్కడ చరిత్రను పలు మార్లు స్టేజ్ మీద పునరావృతం చేస్తారు. ఇక్కడ చరిత్ర మాట్లాడుతుంది. డాఫోడిల్స్ ఈ రోజువి కావు. అవి ఈ లోకం లోకి వచ్చినప్పుడల్లా కొత్త కథ చెబుతాయి..” మాట్లాడతూనే లేచి నిలబడ్డాడు జో.

తలుపు దాకా వెళ్లి “రండి” అన్నాడు.

అందరం లేచాం. రోడ్డు మీదకి తీసుకుని వచ్చి ఆలోచించాడు.

“నడవగలరా?” అడిగాడు.

“ఎంత దూరం?”

“అదుగో ఆ బీచ్ రోడ్డు నుంచి కొద్దిగా కుడి వైపు తిరగాలి.”

“పదండి” అంది చిత్ర.

“ఇంతకీ ఎక్కడికి?”, జ్యోతి అడిగింది.

నడక మొదలు పెట్టాం. అప్పటికే రాత్రి పది దాటింది.

“మీరు నమ్మినా నమ్మకపోయిన ఒక నిజం ఉంది”

“మీరు చెప్పకముందే నమ్మేసాను.”

“ఈ డాఫోడిల్స్ ఆడిటోరియమ్ నుంచి ఇప్పుడు మనం వెళ్లే చోటుకి ఒక సొరంగం ఉంది.”

“అందులోంచే వెళ్లేవాళ్లం గదా?” అడిగాను.

జో నవ్వాడు.

“నేను రెడీ. మీరు?”

“నో” ముక్త కంఠంలో అన్నాం.

“ఐనా అది మూసేసారు”

“ఎందుకు?”

“ఇలాంటివి నన్ను కాదు, మధుకర్ గవడెని అడగాలి.”

“ఓ. అర్థమైంది! దేశంలో ఇలా చాలా సొరంగాలు మూసేసారు.” ఒక బ్రిడ్జ్ మీదకి ఎక్కి ముందుకు సాగాం. దూరంగా కనిపిస్తున్న సముద్రం మీద ఇంకా దూరంగా ఏవో మెరుస్తున్నాయి. అటుగా సాగుతున్న నౌకలవి. ఆ బ్రిడ్జ్ మీది నుండి చిత్ర, జ్యోతి కొన్ని ఫొటోలు తీసుకున్నారు. బ్రిడ్జ్ దిగిపోయి జో నడిపిస్తున్న దారిలోకి వెళ్లాం. గోవాలో ఏ ప్రాంతమైనా కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది. జనం మధ్యలోంచి ఓ సందు తిరిగితే చాలు, అంతా నిర్మానుష్యమైపోతుంది. ఇక్కడా అలాగే సందు తిరిగి చెట్లు మధ్యలోకి వెళ్లగానే అలాగే అనిపించింది. కొద్దిగా ఎత్తు పెరుగుతోంది. ఏదో గుట్టలాగా వుంది. దాని క్రిందికి మెట్లు కనిపిస్తున్నాయి. మెట్ల క్రింద ఓ పాత భవనం కనిపిస్తోంది. రెండు మూడు లైట్ల కంటే లేవు..

జాగ్రత్తగా ఆ గుట్ట దిగాం. ఒకరి వెనుక ఒకరున్నాం. అందరికంటే ముందర జో ఉన్నాడు. ఎందుకో ఆగి రెండు చేతులో అడ్డంగా పెట్టి మా వైపు తిరిగాడు. అందరికంటే చివర నిలుచుని ఉన్న జ్యోతిని చూపించాడు. అటు తిరిగాం. మా ముగ్గురికీ అరడుగుల దూరంలో నిలబడి ఉంది జ్యోతి. రెండు చేతులూ భుజాల మీద పెట్టుకుంది. తల వంచుకొని ఉంది. చిత్రకి అనుమానం వచ్చింది. జాగ్రత్తగా తన దగ్గరకెళ్లింది.

“జ్యోతీ..” చిత్ర అడిగింది. సమాధానం లేదు.

“జ్యోతీ.. ఏమైంది?”

“నా బట్టలు..!” జ్యోతి అంది.

“నీ బట్టలు..” చిత్ర అంటుండాగానే జ్యోతి గట్టిగా అరచింది.

“నా బట్టలు.. వద్దు, వద్దు, నన్ను వదిలెయ్యండి!”

ఆ గొంతు నింగిని తాకింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here