భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-8

0
4

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-9: త్యాగయ్య కీర్తనలు – పరిశీలన-మొదటి భాగం

[dropcap]ఈ[/dropcap] అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలోని అంతర్గర్భిత భావనను, త్యాగయ్య అనుభవేకవేద్యంను, సంగీతలోకానికి త్యాగయ్య చేసిన సేవలను పరిశీలిద్దాం.

~

కాంభోజి రాగ లక్షణము:

కాంభోజి రాగము ప్రసిద్ధమైనది, ప్రాచీనమైనది. ఇది రక్తి రాగము, 28 మేలయగు హరికాంభోజి జన్యం.

ఆ: స రి గ మ ప ద స

అ: స ని ద ప మ గ రి స్

~

సని ప ద స – కా॥ ని॥ పలికించుట సంప్రదాయమైన భాషాంగము. క్షేత్రేయ ఈ రాగాన్ని  వారి రచనలో బాగా వాడారు. ఇతర వాగ్గేయకారులు కూడా ఈ రాగంలో రచనలు చేసారు. సర్వ గమిక వరిక రాగము. శుద్ధ కర్నాటక రాగములలలో ఇది ఒకటి.

మేళకర్తల ఆవిర్భావమునకు పూర్వమే ఈ రాగం ప్రచారములో వుంది. కావ్యములందు కూడా ఈ రాగాన్ని గూర్చి చర్చించారు. రామరాజ భూషణుడు తన వసుచరిత్ర యందు – నాయికయగు గిరిక వసురాజు విరహమును తాళలేక ‘కాంభోజి విపంచి కారవమున ఎలుగెత్తి  ఏడ్చిన’ దని ఉత్ప్రేక్షించుకున్నాడు. అనగా సుమారు 5,6 వందల సం॥ లకు పూర్వము నుండియు కాంభోజి తెలుగువారి సొమ్మేమో! దీనిని యే కాలము నందు ఎట్లెట్లు పాడుచుండింరో నిర్ధాణముగ చెప్పుట కొంచెం కష్టము. శృంగార, భక్తి భావములు రెంటికి ఆలంబనముగ ఈ రాగం ఒప్పుచున్నదనుటలో సందేహము లేదు. క్షేత్రయ్య వారి పదములు దొరికినంతలో 28 కనబడుచున్నవి. వయ్యారములకు సంగతి సందర్భముల నొప్పెడి యీ రాగము నుండి మీరు రచనలను చెప్పలేదేమని సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రుల వారిని ప్రశ్నించగా “కాంభోజి యందు ఎవరు మాత్రము ఏమి చెప్పుకొనుటకు మిగిల్చినాడు క్షేత్రయ్య” అని సమాధానం చెప్పినారట.

అవతారిక:

కీర్తన యందు ఆధ్యాత్మ రామాయణం నందలి సారమును దర్శించిన ద్రష్ట త్యాగయ్య గారు. ‘శక్తి స్వరూపిణి యగు మా జానకిని చేబట్టిన కారణమున నీవు మహరాజు వైతివి. నీకొరకే అగ్ని భట్టారకుని వద్ద నిజ రూపము నుంచి మాయా సీతయై, రావణుని వెంట జని, యశోక వృక్షపు నీడ నుండి, వాని దుర్భాషలకు కోపగించి, ఒక్క కనుచూపుతో వానిని భస్మము చేయగల శక్తి యుండియు, రావణారి యను కీర్తి నీకు కలిగించుటకై యూరకనే యుండిన ఆ తల్లి ప్రభావము కాదే నీ కీర్తి రామచంద్రా!’ అని ప్రకృతి పురుషులైన సీతారాముల లీలలను చెప్పుకొనుచున్నారు.

సీతమ్మ వారిని గురించి అయ్యవారు సకృత్తుగా చెప్పిన రచనలలో ఇది ఒకటి.

ఉదా 1: కాంభోజి- ఆది – మా జానకి చెట్టబట్టగా

~

కృష్ణ పరమాత్మని ప్రార్థించుచూ, శ్రీరమాలోలుడవగు నీకు మమ్ము బ్రోచుటకు భారమా? అని గోపికలు వేడుచున్నట్లు అయ్యవారు చెప్పుకున్నారు. ఈ కీర్తనలో ముద్రాచరణము కానరాదు. బహుశా ఇది ‘నౌకాచరిత్ర’ అను యక్షగానము నందలి రచన కావచ్చు.

ఉదా 2: కాంభోజి- రూపకం – ఏలరా శ్రీకృష్ణా నాతో చలముయేలరా కృష్ణా

~

ఈ కీర్తనలో ‘భక్త పరాధీనుడవు, సత్యసంధుడవు, పరమ భాగవతులను, కరుణించు వాడువును, శక్తి గల మహాదేవుడవు అయిన నీవు యిందు లేవా, నీవు సర్వాంతర్యామివి, స్థిరచిత్తుడవు. ఎవరి మాట విని యిందు రాకున్నావు? నీ ఆర్షేయ పౌరుషేయములు అతి చోద్యముగా వున్నవి సుమా!’ అని త్యాగరాజ స్వామి వేడుకొనుచున్నారు.

ఉదా 3: కాంభోజి- ఆది – ఎవరి మాట విన్నావో

~

ఈ కీర్తనలో – సముద్రుని గర్వము అణచిన వాడును, ఇతరులకు కల యందైన తేరి చూడరానిదగు శివధనువును విరిచిన వాడును, సురలకు రిపుడైన రావణనిని మూల బలములను దూది కొండలకు అగ్ని వంటి వాడును అగు శ్రీరామచంద్రుని ‘శరశర సమరైక శూర’ అని తాగయ్య కీర్తించాడు.

ఉదా 4: కుంతలవరాళి – ఆది – శరశరసమరైకసూర

~

28వ మేళజన్య. ఈ రాగంలో రచనలు కానవచ్చుట లేదు. తాళ్ళపాక వారి రచనలు కొన్ని కనబడుచున్నవి. కనుక, ఇది ప్రాచీన రాగములలో నొకటి అని చెప్పవచ్చు. అయ్యవారు సృష్టించుకొన్న రాగములలోనిది గానే భావించవలసి వున్నది. ఇందు రిషభ, గాంధారములు లేకుండట జేత దీనిని యింకను కొన్ని మేళకర్తలకు జన్యమని చెప్పుకొనుటకు అవకాశం కలదు. కానీ హరికాంభోజిలో జన్యమనే చెబుదురు.

~

ఈ కీర్తనలో ‘వేణు గాన లోలుడుగు శ్రీ కృష్ణుని గాన మాధుర్యమునకు పరవశులై గోపికలు వికసిత పంకజవదనలై, వివిధ గతుల పాడుచు, నాడుచు, దృష్టి చుట్టి సేయుచు రాగ, సకల సురలు మ్రొక్కుచు వేడుచు నుండెడి ఆ దృశ్యమును చూచుటకు వేయి కన్నులు కావలెను’ అని ఆనంద పారవశ్యంలో త్యాగయ్య గారు వ్రాసారు.

ఉదా 5: కేదారగౌళ – రూపకం – వేణుగానలోలుని గన

~

ఈ కీర్తనలో – దేహికి సర్వ వ్యాపారములకును ప్రధానమై యుండెడి మనస్సను విషయములను విటులకు నొసగినచో వానికి రాముని కృప ఎట్లు కల్గును – అని చెప్పచు, తన తలుపొక రింటికి తీసిపెట్టి తా కుక్కల గాయు రీతిగను, తవుడు తెచ్చుకొనుటకు, రంకాడ బోయిన కూటి తప్పెల కోతి గొంపోయినట్లును, చెవిటికి ఉపదేశించినట్లు ఉన్నదనీ చెబుతారు.

ఉదా 6: నాటకురంజి – ఆది – మనసు విషయ నట విటుల

~

ఈ కీర్తన యందు – తామస, రాజస గుణములు గల వారికి దూరముగ నుండు వాడును, సముద్రమునకు సేతువును కట్టినవాడును, శ్రీ రమణి లోలుడు, మరకత మణి నిభమగు దేహము గల వాడును, అహల్యా శాప విమోచనమును చేసిన వాడును, శంకర ప్రభృతులగు దేవతలచే స్తుతింప బడువాడును, అగు శ్రీరామచంద్రుని, అవధులు లేని సుఖము నిచ్చువాడని – త్యాగయ్య కొనియాడారు

ఉదా 7: రవిచంద్రిక – ఆది – నిరవధి సుఖద’.

28 Mela Janya

స రి గ మ ద స

ప ని ద మ గ రి స

పంచమము వర్జ్యము. ఈ రాగంలో ఇతర రచనలు లేవు. ఇదియు అయ్యవారు సృష్టించిన రాగమే.

~

అవతారిక:

ఈ కీర్తన యందు ‘మన్మథునికి కన్నతండ్రివైన రామచంద్రా! జగము లన్నిటిని ఏక సూత్రమున బంధించి సూత్రధారుడవై ఆడించు చున్నావు. ఇది తెలిసిన వారికి విచారమేల? నీవు సద్భక్త మందారుడవు కదా!’ అని అయ్యవారు జగన్నాటక సూత్రధారి యగు సాకేత రాజకుమారుడునచు శ్రీ రామచంద్రుని కీర్తించారు.

ఉదా 8: రవిచంద్రిక – ఆది – మాకేలరా విచారము’.

అవతారిక:

ఈ కీర్తనలో ‘నా సర్వస్వమును నీవేయని నెనరులో నమ్మియున్నాను. మేఘములను గాలివలె దూరము చేయు ఓ జలధిగంభీర! కలిలో మాటలు నేర్చుకొని, కాంతలను తనయులను బ్రోచుటకు శిలాత్ముడై నేను పలుకనేరనురా’ అని తన ఆరాధ్య దైవమునకు త్యాగరాజస్వామి చెప్పుకొనుచున్నారు.

ఉదా 9: మాళవి – ఆది – నెనరుంచినాను’.

ప్రాచీన రక్తి రాగము. 28 హరికాంభోజిలో జన్యం.

స రి గ మ  ప మ ద ని స

స ని ద ని ప మ గ మ రి స

ఈ రాగమునందు ఇతర వాగ్గేయకారుల రచనలు లేవు. తాళ్ళపాక వారి రచనలు ఇటీవలనే బయలు పడినవి. కాని ఇది అయ్య వారి సృష్టే.

~

ఈ కీర్తనందు సీతాపతి యగు శ్రీరామచంద్రుడు వాతాజ్మదులు తన్ను కొలచు సమయమున ప్రేమతో నా భక్తులకు ఈ మహిని భయమేమిటికి, అని పలికిన పలుకులు నిజమని తాను నమ్మునట్లు చెప్పుకొనుచున్నారు. తరచుగా శ్రీరాముని స్మరించుట వల త్యాగయ్యగారి కలలో కూడా శ్రీరాముని సాక్షాత్కారము జరుగుచుండును.

ఉదా 10: 28 మేళ జన్య. ప్రాచీన రక్తి రాగము.

ఆ: స మ గ మ ప ద ని స

అ: స ని ద ప మ గ రి స

కాకలి నిషాదము – పాడురురు కొంతమంది భాషాంగముగా. కానీ త్యాగయ్య రచనలో అది లేదు. దేశీయ రాగమని కొందరి వాదన. రామదాసు, ఇతర వాగ్గేయకారులు ఈ రాగంలో రచనలు చేసారు.

ఉదా 11: కమాస్‌ – ఆది – సీతాపతీ నామనసున’.

~

ఈ కీర్తన యందు శ్రీరామచంద్రుని – సుజన జీవన సుగుణ భూషణ, చారునేత్ర, శ్రీ కళత్ర, శ్రీరమ్యరాత్ర, తారకాధి పానన, ధర్మపాలనము- మొదలగు విశేషణములతో త్యాగయ్య కీర్తించారు. ఇచట ఒక విశేషము వున్నది. భక్తులు, పండితులు కొంత మంది త్యాగయ్య గారి కీర్తనల నుండి అష్టోత్తరము, సమస్ర నామావళి, ఏరి కూర్చి వారి సమాధి వద్ద రామచంద్రునితో పూజా కైంకర్యములు చేయున్నడు ఉపయోగించునట్లు ఏర్పరచియున్నారు. అట్టి మహత్కార్యములను చేసెడివారు మహనీయులు గాక సామాన్యులు కారు.

ఉదా 12: కమాస్‌ – రూపకం – సుజన జీవన’.

~

ఇలా ఎన్నో కీర్తనలు, అనుభవసారంతో భగవత్ సాక్షాత్కారముతో, అలవోకగా అయ్యవారి నోటి వెంట జాలువారిన ముత్యాలు ఏరుకొనుట, పేర్చుకొనుట కష్టమైనప్పటికీ, ‘మనిషి’ తనకు అందుబాటులో వున్నంత వరకు రామపాద సేవయే మోక్షమార్గమని తలచి, నిరంతర అభ్యాసముతో కర్నాటక సంగీత విదుషిమణులకు త్యాగయ్య ఇచ్చిన అపురూప, అరుదైన, విలువ కట్టలేని విద్యను ప్రసాదించారు.

~

అవతారిక:

ఈ కీర్తనమునందు కోవూరునందు వెలసియున్న సుందరేశ్వరుని కీర్తించుచూ ‘నీవు భక్తుల యాసలను తీర్చి ధన ధాన్యాదుల నొసగి కీర్తి ప్రతిష్ఠలతో వారిని ఆనందింప చేయుదువు’ అని ఆ దేవుని త్యాగరాజు స్వామి పొగడుచున్నారు.

ఉదా 13: శహాన – ఆది – ఈవసుధ నీవంటి దైవము’.

28 మేళ జన్య.

ఆ: స రి గ మ ప మ ద ని స

అ: స ని ద మ ప గ రి గ స

ఈ రాగము నందు ప్రాచీనుల రచనలు అనేకము గలవు. క్షేత్రయ్య వారి పదములు రాగ స్వరూపమును తెలుసుకొనుటకు ఎంతయో ఉపయుక్తముగా నున్నవి. దీనిని కొందరు బాషాంగమని చెప్పారు. కాని వాడుకలో వున్న శహాన భాషాంగ స్వరూపము కాదు.

~

అవతారిక:

ఈ కీర్తనమునందు శ్రీరామచంద్రుని పరివారులెల్ల విరిసురటులచే నిలబడి విసురుచు కొలుచుచుండ గిరిపై నెలకొని యుండగా దర్శించిన త్యాగరాజు స్వామి పులకాంకితులై మాటలాడవలెనని యనుకొనగా శ్రీరామచంద్రుడే పది పూటలపై కాచెదనని సెలవిచ్చారు. తాగయ్యగారు ఇందు భద్రగిరి శ్రీ రామచంద్రుని దర్శనము అయ్యవారికి కల్గినదో ఏమో అనిపించుచున్నది.

ఉదా 14: శహాన – ఆది – గిరిపై నెలకొన్న రాముని’.

పల్లవి:

గిరిపై నెలకొన్న రాముని గురితప్పక గంటీ

అను పల్లవి:

పరివారులు విరిసురటులచే నిల

బడి విసరుచుఁ కొసరుచు సేవింపఁగ

చరణము:

పులకాంకితుఁడై యానందాశ్రు

వుల నింపుచు మాటలాడవలెనని

కలువరించఁగని పదిపూటలపైఁ

గాచెదనను త్యాగరాజవినుతుని.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here