[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[సమయం చూసుకోకుండా కథ చెప్పుకుపోతున్న జనార్దన మూర్తి వాగ్ధాటికి అడ్డం వస్తాడు రమణ. పదయిపోయిందని, భోం చేస్తె, రెస్టారెంట్ సిబ్బంది కూడా వెళ్ళిపోతారని అంటాడు. అందరూ భోజనాలకి లేస్తారు. భోజనాల పూర్తవుతుంటే, క్రింద ఉన్న కౌన్సిలింగ్ హాల్‍ని బుక్ చేసి ఉంచానని, కావాలంటే కథని కొనసాగించవచ్చని చెప్తాడు రమణ. అందరూ రమణను అభినందిస్తారు. జనార్దనమూర్తి చెప్పడం మొదలుపెడతాడు. మర్నాడు బాల్రెడ్డి పటేల్ ఇంటికి వెళ్తాడు డాక్టర్సాబ్. పటేల్ పనిలో ఉండడంతో, కాసేపు వేచిచూసి, అతనొచ్చాకా, లోపలికి వెళ్ళి వనజమ్మ ఆరోగ్యం గురించి ప్రశ్నిస్తాడు. ఆమెకి ఇంజక్షన్ చేస్తాడు. రోజు ఉదయం పూట ఏదైనా తినమని, ఇంజెక్షన్ చేయించుకునే ముందు తిని ఉండడం అవసరమని చెప్తాడు. బయటకొచ్చాకా, పటేల్‌తో ఏకాంతంగా మాట్లాడాలని అంటాడు. కాసేపయ్యాకా, పటేల్, డాక్టర్సాబ్ ఓ గదిలో కూర్చుంటారు. వనజమ్మ కోసం మందులిచ్చి, ఎలా వాడాలో చెప్తాడు. ఆమె జబ్బు స్వభావం తెలియడం కోసమంటూ కొన్ని ప్రశ్నలు రాసి ఉన్న కాగితాన్ని పటేల్‍కిస్తాడు. ఆ ప్రశ్నలు చదివిన పటేల్‍కి కోపం వస్తుంది. ఇవి అవసరమా అని అడుగుతాడు. అవసరమే అనీ, ఆ వివరాలు లేకుండా వైద్యం చేయడం కుదరదని అంటాడు డాక్టర్సాబ్. పటేల్ అడిగిన మీదట ఆయనకి అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యూనాని వైద్య విధానాల గురించి చెప్పడం మొదలుపెడతాడు. ఇక చదవండి.]
[dropcap]“అం[/dropcap]టె మందు జబ్బును బట్టి ఉండదా!” ప్రశ్నించాడు పటేలు.
“జబ్బును బట్టే మందు ఉంటుంది. కాని జబ్బుకు కారణం వాయులోపమా, అగ్నిలోపమా, జలలోపమా అన్న విషయాన్ని వైద్యుడు ముందుగా తెలుసుకుంటాడు. వైద్య పరిభాషలో ఈ లోపాలను వాత, పిత్త, కఫ దోషాలంటారు. ఇప్పుడు వచ్చిన జబ్బు ఏ దోషం వల్ల వచ్చిందో కనుగొన్న వైద్యుడు రోగికివ్వవలసిన మందును నిర్ధారించుకొంటాడు. రోగి శరీర తత్త్వాన్ని బట్టి మందుకు తగిన అనుపానాన్ని ఎంచుకొంటాడు” వివరించాడు డాక్టరు.
“అనుపానం అంటే!”
“అనుపానమంటే మందుతో పాటు చేర్చి వేసుకొనేది. ఒకే మందును పలు రకాలుగా వేసుకోవచ్చు. చన్నీళ్ళతో, వేణీళ్ళతో, చల్లతో, గోరువెచ్చని పాలతో, తేనెతో, చక్కెరతో, బెల్లంతో ఇలాగన్నమాట. మందు ఒక్కటే అయినా ఒక్కొక్క అనుపానం ఒక్కొక్క ఫలితాన్నిస్తుంది. వ్యాధిని బట్టి, శరీర ధర్మాన్ని బట్టి వైద్యుడు మందు మోతాదును, అనుపానాన్ని మారుస్తుంటాడు.”
“ఆయుర్వేదంల పథ్యం కూడ ఉంటదేమొ కద”
“మంచిగ గుర్తు చేసిన్రు. మనం తినే ఆహార పదార్థాలను బట్టి, సేవించే పానీయాలను బట్టి మన ఆరోగ్యం బాగుపడడమో, చెడిపోవడమో, నిలకడగా ఉండడమో జరుగుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వచ్చే కొద్దిపాటి తేడాలను శరీరమే సర్దుకుపోతుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు శరీరం సున్నితమైపోతుంది. కాబట్టి ఆహార విహారాలలో జాగ్రత్తలు వహించాలి. ఈ జాగ్రత్తలనే పథ్యం అంటాం. పథ్యమన్నది జబ్బు మీద, శరీర ధర్మమ్మీద, ఇచ్చే మందుల మీద ఆధారపడి వుంటుంది. సాధారణంగా చేయకూడని పనులు లేదా తినకూడని వస్తువులకు పథ్యం అన్న పదాన్ని వాడుతున్నాం. నిజానికి తినదగిన ఆహారానికి సంబంధించి పథ్యం అన్న పదాన్ని వాడాలి. “
“నువ్వింత మంచిగ చెప్తున్నవు కద డాక్టర్సాబ్! మరి ఆ వైద్యంపట్ల ఎవలగూడ సదభిప్రాయం లేదు కద. అట్లెందుకైందంటవు?” అడిగాడు పటేలు.
“ఆయుర్వేద మొకప్పుడు ఉత్కృష్ట స్థాయిలో ఉండింది. చరకుడు వైద్య విధానంలో ప్రసిద్ధుడు. అంటే ఇప్పటి భాషలో ‘ఫిజీషియన్’ అన్నమాట. సుశ్రుతుడు శస్త్ర చికిత్సలో నిష్ణాతుడు అంటే ఇప్పటి ‘సర్జన్’ అన్నమాట. వేలేండ్ల కిందనే రోగ నిదానానికి మన పూర్వులు ముప్పై రెండు రకాల పద్ధతులను ప్రవేశపెట్టారు. బౌద్ధమత వ్యాప్తి కాలంలో అహింసను లోపభూయిష్టంగా నిర్వచించిన కారణంగా మనం శస్త్రచికిత్సా నిష్ణాతను పోగొట్టుకొన్నాం. విదేశీ దాడుల కారణంగా ఆయుర్వేద వైద్య విధానం తన ప్రాధాన్యతను పోగొట్టుకున్నది.”
“ఇదంత గమనించినంకనైన మనం ఆయుర్వేదాన్ని పునరుద్ధరించుకోవచ్చు గద” అన్నాడు పటేలు.
“నిజమే కాని, అల్లోపతి చూపించినంత త్వరాగా ఆయుర్వేదం తన గుణాన్ని చూపించదు. ఆయుర్వేదం మన శరీరంలోని రోగనిరోధ కణాలను బలోపేతం చేసి వాటి ద్వారా రోగక్రిములను నశింపచేస్తుంది. అందుకు సమయం పడుతుంది. అంత ఓపిక రోగులకుండడం లేదు. మనమింతకు ముందనుకున్న పథ్యం, అనుపానం కూడ రోగులకు నచ్చడం లేదు. ఇంగ్లీషు వైద్యుడు మాత్ర ఇచ్చి వేసుకొంటే చాలు అంటాడు. నువ్వేం తిన్నా, తాగినా పరవాలేదంటాడు. ఆయుర్వేద వైద్యుడు ఆహార విహారాల నిర్బంధమే ప్రధానమంటాడు. జనం ఎటువైపు మొగ్గు చూపుతారో మీరే చెప్పండి.”
“ఇదేమంత పెద్ద ముచ్చట కాదుగద! సమాజానికి విషయాన్ని వివరించి కిందికో మీదికో నడిపిస్తె సరిపోతుండె గద” అన్నాడు పటేలు.
“పెద్ద ముచ్చట కాదు గని, వైద్యునిలో నిబద్ధత, నిజాయితి వుండాలె. రోగిలో శ్రద్ధ వుండాలె. ఓపిక ఉండాలె. ఈరోజుల్ల వైద్యునికి గని, రోగికి గని ఈ విషయమై ఉండవలసినంత శ్రద్ధ ఉంటలేదు.”
“సరె! తతిమ్మా వాటి సంగతి చెప్పున్రి. ఔగని పోలీసు పటేలుకు వైద్యశాస్త్రంతోని ఏం పని బడదని ఇవన్ని నాకు చెప్తున్నవు.”
“మీకు పని బడ్తదని కాదు. మీకు విషయం తెలిసుంటె నాకు వైద్యం చేసుడు అలుకగైతదని”
“అంటె!”
“నేను అడిగిన ప్రశ్నలు అసంబద్దంగున్నయని అభిప్రాయపడిరి గద. అందుకే ఇదంత నేను చెప్పుకొస్తున్న”
“అసలు నువ్విప్పటిదన్క చెప్పిందాట్లే ఆ ఊసే లేకపాయె”
“అదే! ఆడికే వస్తున్న పటేలా!”
“నారిగా! లోపటికి బొయ్యి మల్లోపారి చాయత్తేపోర! ఈ డాక్టర్సాబియ్యాల నా ఉసురు బుచ్చుకొంటుండు” మచ్కూరికి పురమాయించాడు పటేలు.
“అగొ అంత ఇబ్బందిగుంటె చెప్పజాల పటేలా!”
“బడె ఉషారుకాడ వున్నవు. మంచి పట్టుమీదికి దీసుకచ్చి ఊకుంటనంటావు. ఆయింత చెప్పినంకనె నువ్వీడికెల్లి పోవాలె” ఆజ్ఞాపించాడు పటేలు.
“యూనాని అంటె జడీబూటిల వైద్యమన్నట్టు. చెట్ల కొమ్మలు, బెరడులు, వేర్లు, ఆకులు, పూలు, కాయలు, పండ్లు నేరుగ వాడ్తరన్నట్టు. గోలీలు, పొడులు, కషాయాలు ఉంటయి కని అవన్ని కూడ ఓషధుల మూల రూపాలలోనే వుంటాయన్నమాట.
ఆయుర్వేదం మందులు కూడ వనస్పతుల నుండే తయారయినా, కొన్ని మూలకాల వాడకం కూడా అందులో ఉంటుంది. ఆయుర్వేద మందుల తయారీలో వండడం, వడకట్టడం, నానబెట్టడం, రుబ్బడం, నూరడం, బట్టిపెట్టి ఆవిరిని చల్లార్చడం వంటి వివిధ ప్రక్రియలుంటాయి. తద్వారా తయారైన చూర్ణాలను, మాత్రలను, అరిష్టాలను, అసవాలను, చోష్యాలను, లేహ్యాలను రోగులకు ఇస్తారు.
యూనాని వైద్యం కూడ జబ్బు లక్షణాలను బట్టి చేసే వైద్యమే. లోతైన జ్ఞానం లేని వారికి ఆయుర్వేదము, యూనాని వైద్యమూ ఒకలాగునే కనిపిస్తాయి. చాలావరకు ఈ వైద్యవిద్య మహ్మదీయులకు పరిమితమయిపోయింది.
ఇక హోమియోపతి. ఇది జర్మనీ దేశంలో పుట్టింది. శామ్యూల్ హానిమన్ అన్నాయన కనుక్కున్నాడు..”
“వార్నీ హోమియో మన దేశపు వైద్యం కాదన్నట్టు. ఇప్పటిదన్క ఇది మనదే అనుకుంటున్న. అయితే ఆయుర్వేదం, యూనాని వరకె మనయన్నట్టు” ఆశ్చర్యపోయాడు బాల్రెడ్డి.
“అవును పటేలా! హోమియో కూడ విదేశి వైద్యమే. కాని ఇంగ్లీషు వైద్యానికి, హోమియోకు జమానాస్మాన్ ఫరకున్నది. వింటె నీకె తెలుస్తది” అంటూ చెప్పసాగాడు డాక్టరు గారు.
“హోమియోపతిలో మందులు అరకు రూపంలో వుంటవి. ఆ అరకును చక్కెర గోలీలల్ల, లేదా గ్లూకోజు పొడి కలిపి ఇస్తం. అరకును నేరుగ కూడ వాడ్తం.
ఈ వైద్య విధానంలో రోగ నిదానం కష్టదాయకమైనది. రోగి చెప్పే లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ జరుగుతుంది. ప్రతి చిన్న లక్షణం లెక్కకె వస్తుంది. ఒకాయనకు మబ్బుల తెలివి పడ్డది. తెలివి పడంగనె పది పదిహేను తుమ్ములస్తయి. కని అది సర్ది కాదు. ఒకాయనకు అవే తుమ్ములు పొద్దుగాలు పదింటికస్తయి. ఇద్దరికి ఒకటే మందంటే కలువది. సర్దయితది. అజీర్తి వల్ల వచ్చె సర్దికి ఒక మందుంటది. చల్లగాలికి సర్దయితే ఒక మందుంటది. ఆయుర్వేదంల గూడ అంతె. కని హోమియోపతిలో చీమిడి కార్తున్నదా! ఎంత గార్తున్నది. ఏ తీరుగున్నది కూడ లెక్కనె. రోగి చెప్పే లక్షణాలను బట్టి రోగం యొక్క మూలానికి పోతమన్నట్టు. ఎందుకొఱకంటె రోగి ఏ లక్షణాలున్న వ్యాధిని కలిగి వున్నడో అదే వ్యాధికి సంబంధించిన ప్రకృతి సహజ మూలకాన్ని మందు రూపంల ఇస్తము. రోగి ఏ వ్యాధితో బాధపడుతున్నడో అదే వ్యాధిని బలహీన రూపంలో ప్రకృతి సహజంగ కలుగజేస్తం. ఈ బలహీనమైన జబ్బును జయించిన సైనిక రక్త కణాలు విజృంభించిన ఉత్సాహంతోని వ్యాధికారక రోగ కణాలను నశింపజేస్తయి. ఈ పద్ధతిలో సైనిక రక్త కణాలు నిరంతర జాగరూకతకు అలవాటుపడుతవి కనుక హోమియో విధానంలో నయమైన జబ్బులు తిరగబెట్టే అవకాశాలు తక్కువ.”
“అయితే హోమియో వైద్య విధానమే వేరంటవు” అడిగాడు పటేలు.
“అవును. అల్లోపతిల జబ్బు ప్రధాన లక్షణం తెలిస్తె సరిపోతది. ఆయుర్వేదంల అనారోగ్య కారణం తెలుస్తె సరిపోతది. హోమియోపతిలో రోగి మానసిక లక్షణాలు కూడ తెలువాలె. ఆరోగ్యంగ ఉన్నప్పుడు ఒకానొక విషయం పట్ల అతని స్పందనలెట్లున్నవి, అనారోగ్యం వున్నప్పుడు అదే విషయం పట్ల అతని స్పందనలేమిటి అన్నది తెలువాలె. ఇగొ ఈ కారణాల వల్ల అక్క అనారోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు రాసిచ్చిన. ఆడవాళ్ళు ప్రాణప్రద రహస్యంగా భావించే అంశాలకు సంబంధించిన ప్రశ్నలు కాబట్కె మీకు రాసిచ్చిన. అక్కనడిగి మీరు రాస్కోని నాకిస్తే నేను హోమియో వైద్యం మొదలు పెడ్త. అల్లోపతిల అక్క వ్యాధికి మందు లేదు. తక్కువైనట్టు కన్పిస్తది కని తిరుగబెడ్తది. నాకు యూనాని వైద్యం రాదు. ఆయుర్వేదపు అనుపానాలు, పథ్యాలు ఇప్పుడు అక్క ఉన్న ఆరోగ్య పరిస్థితిల సాధ్యం కాదు. అయ్యా! ఇదీ సంగతి” డాక్టరు తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగించాడు.
“అది సరే! సమజయింది గని. వనజమ్మకు జ్వరమున్నది. తిండి సయిస్తలేదు. ఎండుకపోతున్నది. నువ్వన్ని ఆమె ఓరకుండె విషయాల గురించి అడుగుతున్నవు. ఎందుకు అన్నదే నా అనుమానం” ఈ సారి అడగడంలో బాల్రెడ్డి గొంతులో కోపం లేదు. తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రమే ఉన్నది.
“అయ్యా! తప్పుబట్టుకోవద్దు. వైద్యరంగంల ఒక దొడ్డు సామెత ఉన్నది. మొగోని అనారోగ్యానికి కారణం నోరు. ఆడిదాని అనారోగ్యానికి కారణం మానం అని. మన మొగోల్లకు నోరు కట్టుకొనుడు రాదు. ఇది తినచ్చా, ఇది తాగచ్చా అన్న ఆలోచననె వుండది. పొట్ట ఉబ్బిపోతనె ఉంటది కని మన తినుడు తాగుడు బందు కాదు.”
“ఇది నూటికి నూరు పాల్లు నివద్దె డాక్టర్సాబ్!” అంగీకరించాడు బాల్రెడ్డి పటేలు.
“ఆడోళ్ళు తిండి విషయంల చాలా నియమంగ ఉంటరు. అవసరానికన్న తక్కువ తిని ఇబ్బంది పడ్తారు. అది గూడ మంచిది కాదు కని దేవుడు వాళ్ళ విషయంల సహకరిస్తడనే చెప్పుకోవాలె. ఇకపోతే ఆడోళ్ళ అనారోగ్యం వాల్లకు తెలువకుంటనె మొదలైతది. నెలసరి వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తది. పురుళ్ళు పుణ్యాలల్ల వాళ్ళ శరీరంల వచ్చే ఇతర మార్పులతో పాటు నెలసరి విధానం మార్తది. దాన్ని గమనించుకోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలె. ఆడోళ్ళు తమ నెలసరిని భర్తతో చర్చించడానికే ఇష్టపడరు. ఇక బయటి వాళ్ళకెక్కడ తెలుస్తది. డాక్టరు అడిగితె కూడ చాలమంది ఆడవాళ్ళు లోపాన్ని కప్పిపుచ్చుకోని అబద్ధాలు చెప్తారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుంటరు కావచ్చు కని వివరంగ మాట్లాడుకుంటరని నేననుకోను.
“చివరకు ఫలితమేందంటే – వాల్లు మంచాన పడేవరకు మనకు విషయం తెలువది. తప్పనిసరై అప్పుడు విషయం చెప్తరు కావచ్చు కని, చాన సందర్భాలల్ల అప్పటికే రోగం వైద్యుని చెయ్యి దాటిపోయుంటది. అందుకే హోమియోపతిల స్త్రీ అనే రోగి వస్తె ఆమెకున్న బాధతోని సంబంధం ఉన్న లేకున్న నెలసరి గురించిన ప్రశ్నలడుగుతం. ఇదయ్యా సంగతి” ముగించాడు డాక్టరు.
“విషయం లోతుగనె వున్నది. ఇదంత అందరికి తెలిసేదెట్ల”
“అందరికి తెలిసె అవుసరం లేదు. డాక్టరు అడిగినప్పుడు దాచుకోకుంట చెప్తే చాలు. ఇంకో సంగతి చెప్త ఇను. ఓరకుంటే బయట ఉండాన్న, ఇంట్ల కలుపుకోవాన్న, బడికి పోవచ్చునా, కొలువులకు పోవచ్చునా, ఆటలాడచ్చునా, ఇట్ల అక్కరాని చర్చలు మేధావులు మస్తు చేస్తరు గని అసలు విషయంపైన అవగాహన కలిగించరు. ఆ నాలుగు రోజుల్ల ఆమెకు విశ్రాంతి లభిస్తున్నదా! నెత్తురు అవసరాన్ని మించిపోతున్నదా! నాలుగోనాడు ఆగిపోతున్నదా లేదా! పది పదిహేను దినాలదాక నెత్తురు పోతనే వున్నదా! ఆ సమయంల మానసిక ఒత్తిడికి లోనవుతున్నదా! చిరాకుపడుతున్నదా! సరిగ్గా ఇరువై ఎనిమిది దినాలకవుతున్నదా లేదా! ఇవన్ని వాళ్ళకు అవగాహన కలిగించవలసిన విషయాలు.
జ్యోతిశ్శాస్త్రం ప్రకారం చంద్రుడు స్త్రీలకధిపతి. మనసు కధిపతి. స్త్రీల మనసు సున్నితం. చంద్రునికి ఇరవై ఎనిమిదిన్నర రోజులకొక నెల. స్త్రీల నెల కూడ ఇరవై ఎనిమిది రోజులకు వస్తది. ఇగో ఇవన్ని ప్రతి స్త్రీకి తాను పెద్దమనిషైన రోజే తెలిసినయనుకో – వాళ్ళ అనారోగ్య సమస్యలు కంసెకం బారాన మందం తగ్గిపోతయి” వివరించాడు డాక్టరు గారు.
రెండవ విడత చాయలు వచ్చాయి. చాయ్ తాగుతూ ఏవేవో లోకాభిరామాయణం మాట్లాడుతుండగా పటేలు కొఱకెవరో వచ్చారు. టీ తాగడం అయిపోగానే బయల్దేరాడు డాక్టరుగారు “రేపు పొద్దున్న తొమ్మిది వరకస్త పటేలా” అంటూ.
రెండవ రోజు ఉదయం డాక్టరు వచ్చేటప్పటికి పటేలు కచ్చేరిలో లేడు. లోపలే వున్నాడు. పటేలమ్మకు సూది ఇచ్చి బయటకు వచ్చారు. చతుశ్శాల భవంతి ముందు భాగంలోకొచ్చాక వివరాలు రాసిన కాగితాన్ని డాక్టరు గారి కందించాడు పటేలు. దానివంక చూడకుండానే బ్యాగులో పెట్టుకొన్నాడు డాక్టరు. “ఇయ్యాల రేపు అధ్యయనం చేసినంక చెప్త పటేలా!” అన్నాడు ప్రశ్నార్థకంగా తనవేపే చూస్తున్న పటేలుతో. చిరునవ్వుతో తల పంకించాడు పటేలు.
***
రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మెలకువ వస్తే ఆసుపత్రి గదిలో పెద్దగా వెలుగు కనిపిస్తోంది డాక్టరమ్మకి. లేచి వచ్చి చూచింది. రెండు లాంతర్లను అటోపక్క ఇటోపక్క పెట్టుకొని ఆ వెలుగులో చదువుకొంటున్నాడు డాక్టరు గారు. భార్య వచ్చిన అలికిడిని కూడ గమనించే స్థితిలో లేడాయన.
“ఏంటండీ! గడియారం చూశారా! ఒంటి గంట దాటిపోయింది” అడిగింది డాక్టరమ్మ.
ఉలిక్కిపడి చూశాడాయన. పక్కనే అర్ధాంగి. “రా కూర్చో” ఎదురుగా ఉన్న కుర్చీని చూపించాడు. వచ్చి కూర్చుంది.
“పటేలు భార్య కేసు స్టడీ చేస్తున్నాను. సమయం తెలీలేదు.”
“వదిన పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉందా!”
“అవును. వీరలక్ష్మికీ ఈవిడకీ ఒకటే జబ్బు. వీరలక్ష్మి నా దగ్గరకు ప్రాథమిక దశలో వచ్చింది. ఈవిడ దగ్గరకు మనం వెళ్ళేనాటికి జబ్బు ముదరిపోయే దశలో వుంది. అంతే తేడా!”
“వీరలక్ష్మిదీ ఈవిడదీ ఒకటే జబ్బా! ఆవిడకీ ఈవిడకీ ఏమిటి సంబంధం. అంటే ఇదేమన్నా గాలితో, ధూళితో సోకే అంటువ్యాధా! ఆ లెక్కన ఊళ్ళో చాలామంది ఈ జబ్బుతో వివిధ దశల్లో బాధపడ్తూ ఉండాలే” ఆందోళనతో అడిగింది డాక్టరమ్మ.
“నువ్వేం కంగారు పడకు. ఇది గాలితోనో, నీళ్ళతోనో సోకే జబ్బు కాదు. నువ్వడిగావు చూడు ఆవిడకీ ఈవిడకీ ఏమిటి సంబంధం అని, సంబంధం ఉంది. బాల్రెడ్డి పటేల్” చిరునవ్వుతో చెప్పాడు డాక్టరు.
“అంటే!” అర్థం కానట్టుగా చూసింది డాక్టరమ్మ.
“ఆ మాత్రం అర్థం చేసుకోలేవా! వీరలక్ష్మి బాల్రెడ్డి పటేలు ఉంపుడుకత్తె”.
“అమ్మో! అమ్మో! ఎంత గుండెల్డీసిన బంటు. నేనారోజే చెప్పాను వీరలక్ష్మితో జాగ్రత్తగా ఉండాలని. ఎందుకో ఏమో! నాకారోజే స్ఫురించింది ఆమె మంచి వ్యక్తి కాదని” దాదాపుగా అరచినంత పనిచేసింది డాక్టరమ్మ.
“ఉష్ మెల్లగా! అర్ధరాత్రి దాటింది. అందరూ పడుకునుంటారు. నీ కేకలకి లేవగలరు. వాళ్ళ సంబంధాలకి మనకు ఏం సంబంధం. నేను వైద్యుణ్ణి. వాళ్ళు రోగులు. పరిచయం అంతకే పరిమితం. విషయం నీ వరకే ఉంచుకో. ఎవరి దగ్గరా ప్రస్తావించకు” గొంతు తగ్గించి చెప్పినా గట్టిగా చెప్పాడు డాక్టరు.
“ఏమోనండి! నాకంతా అయోమయంగా ఉంది. మీరు మటుక్కు జాగ్రత్తగా ఉండండి. ఆ వగలాడి మీమీద ఏం వల వేస్తుందోనని భయంగా ఉంది” గొంతు తగ్గించినా ఆవిడ గొంతులో ఆందోళన తగ్గలేదు.
“వీరలక్ష్మి బాల్రెడ్డిల సంబంధం ఊరందరికీ తెలుసు. అయినా ఎవరన్నా చెవులు కొరుక్కుంటున్నారా! లేదే! ఎవళ్ళకి వాళ్ళు మామూలుగానే వున్నారు. నువ్వన్నావు చూడు అమృత గురించి ఆమెదీ అదే పద్ధతి. ఇదీ నాకు తెలిసున్న విషయం” వివరించి చెప్పాడు డాక్టరు గారు.
“మీకీ విషయం మొదట్నించే తెలుసా! నాకెందుకు చెప్పలేదు” భర్తను నిలదీసింది డాక్టరమ్మ.
“నాకూ తెలియదు. నువ్వు ఆమెకు టీ ఇచ్చిన రోజు కూడా నాకు తెలియదు. జబ్బు పూర్తిగా నయమవకుండానే మధ్యలో వైద్యానికి రావడం మానేసింది. సమ్మక్క అని తనతో కూడా మొదట్లో వచ్చేది కదా! ఆ అమ్మాయి వేరే ఎవర్తోనో వస్తే అడిగా ‘వీరలక్ష్మి. రావడం లేదు. జబ్బు నయమైందా!’ అని. ఆమె చెప్తే విషయం తెలిసింది. వీరలక్ష్మి భర్తక్కూడా వైద్యమవసరమయ్యే జబ్బు. అందుకని భర్తను వెంటబెట్టుకు రమ్మన్నాను. బాల్రెడ్డి పటేలును వెంటబెట్టుకు రావడం సాధ్యం కాదు గనుక వైద్యానికి రావడం మానేసిందట. తనవరకైనా వైద్యం చేయించుకోవడం మంచిదని సమక్కకి చెప్పాను. అప్పట్నించి వస్తోంది.”
“మరిప్పుడు నయంగా వుందా!”
“మొదట్లో మీదట పరవాలేదు. నేను ఫీజు కూడా తీసుకోవడం లేదు”
“అయ్యో పాపం ఎందుకటా జాలి!” వెటకారంగా అడిగింది డాక్టరమ్మ.
“సమ్మక్క చెప్పిన వీరలక్ష్మి కథ విన్నాక నాకు జాలేసింది”
“ఏమిటో ఆ కథ”
“పెళ్ళైన రెండేళ్ళకే భర్త కల్లు గీస్తూ తాటిచెట్టు మీంచి పడి చచ్చిపోయాట్ట. తను అత్తమామల సేవచేస్తూ ఉండిపోయిందట. పుట్టింటి వారు వచ్చి తీసుకెళ్తామన్నా, మళ్ళీ పెళ్ళి చేస్తామన్నా ఒప్పుకోలేదుట. కాలక్రమంలో అత్తమామలూ పోయారు. ఒంటరి ఆడదాన్ని పోలీసు పటేలు చేరదీశాట్ట. అదీ విషయం” ముగించాడు డాక్టరు.
“బాల్రెడ్డి పటేలు వీరలక్ష్మిని ఆమె అత్తమామలుండగానే చేరదీశాడా లేక పోయాక చేరదీశాడా” లా పాయింటు లేవనెత్తింది. డాక్టరమ్మ.
“ఉండగానేట”
“మరింకేం. ఈ కథలో నాకు జాలి పడాల్సిందేమీ కనపడలేదు” తన తీర్పుని చెప్పేసింది డాక్టరమ్మ.
“ఏమో! నాకాక్షణంలో సమ్మక్క చెప్పిన తీరులో జాలి అనిపించింది. ఫీజు తీసుకోను అని చెప్పేశాను. ఇప్పుడడిగితే బాగుంటుందా! ఇష్టం. ఈసారి వచ్చినపుడు అడుగుతాను. పాతవి వదిలేసినా ఇప్పట్నించి తీసుకుంటాలే!” చెప్పాడు డాక్టరు గారు ఇబ్బంది పడ్తూ.
“ఒకసారి వద్దన్నాక మళ్ళీ ఏం అడుగుతారండీ. ఒదిలేయండి. ఇక పడుకుందామా!” లేస్తూ అడిగింది డాక్టరమ్మ.
డాక్టరుగారు పుస్తకాన్ని మూస్తూ ఒక లాంతరును ఆర్పేసి రెండోలాంతరు వెలుగును తగ్గిస్తుంటే అనుమానంగా అడిగింది డాక్టరమ్మ.
“వీరలక్ష్మి నుండి బాల్రెడ్డి ద్వారా వనజమ్మకు ఈ వ్యాధి వచ్చి వుండాలి కదా! ఆ లెక్కన వీరలక్ష్మి అమాయకురాలెలా అవుతుంది.” గట్టిగా నవ్వాడు డాక్టరుగారు. చిన్నబుచ్చుకుంది డాక్టరమ్మ. ఆవిడ చుబుకం ఎత్తి ముద్దుపెట్టుకొంటూ చెప్పాడు “పిచ్చి తల్లీ! బాల్రెడ్డి ఏమీ అమాయకుడు కాడు. ఏ వరంగల్లులోనో, హైదరాబాదులోనో అంటించుకొచ్చిన జబ్బుని ఇద్దరికీ సమంగా పంచిపెట్టాడు.”
“అమ్మ బాబోయ్! పటేలు అంతటి దుర్మార్గుడా!” గుండెల మీద చేయివేసుకొంది డాక్టరమ్మ.
గుండెలమీద వేసుకున్న చేతిని తీసివేసి డాక్టరమ్మను దగ్గరగా తీసుకొంటూ అన్నాడు డాక్టరు గారు. “ఇందులో దుర్మార్గమూ లేదు, సన్మార్గమూ లేదు. లోకంలో అనేక విషయాలు జరుగుతుంటాయి. అదంతే. ఈ విషయాలన్నీ మగవాళ్ళకి మామూలుగానే కనిపిస్తాయి. ఆడవాళ్ళకి గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి.”
“అంటే మీరు కూడా.. అవును లెండి మీరూ మగవారేగా!” భర్త నుండి దూరంగా జరిగింది డాక్టరమ్మ.
భార్యను మరింత వేగంగా దగ్గరకు లాక్కుని హత్తుకున్నాడు డాక్టరు. “ఈ విషయంలో నేను మగవాణ్ణి కాదండి”
“ఛీ పొండి” అంటూ భర్త కౌగిలిలోకి ఒదిగిపోయింది డాక్టరమ్మ.
(ఇంకా ఉంది)