[డా. కోగంటి విజయ్ రచించిన ‘కొత్త దారిలో..’ అనే కవితని అందిస్తున్నాము.]
~
[dropcap]నీ [/dropcap]వొచ్చిన దారుల్లోనే
మెల్లగా నడిచెళ్ళి చూడు
ముళ్ళను తొలగించుకుంటూ వెళ్లిన
నీ ఉద్విగ్నపు నడకలో
నీవు మరచిన పూల చెట్టో
అనూహ్యంగా ఆసక్తికరంగా నీ నడకను
మలుపు తిప్పిన తోవో
ఇన్ని పూలను రాల్చి నీకు దారి పరిచిన స్నేహ వృక్షమో
ఏదో ఒకటి కనిపించ వచ్చు
అర్థం కాని సందర్భాలలోనో
సందిగ్ధాలలోనో
నీవు కాదనుకున్న బంధమే
నిన్ను కౌగిలించుకు సేద తీర్చవచ్చు
ఏ విరక్తితోనో నీవు చేజార్చుకున్న
సంతోషపు అరల తాళపుచెవీ దొరకవచ్చు
పరిమళపు చెలిమిని పంచిన
ఒక లత కూడా
నీవు పట్టించుకోని క్షణాన్ని తలుస్తూ
నీకై వేచి చూస్తూ ఉండవచ్చు
నీవు నడిచొచ్చిన దారి
నీ హృదయం లోనిదే కదా
ఓసారి మెల్లగా ఆ వైపుకి నడిచెళ్ళి చూడు
కొత్త దారిలో
నీవేం మరచి పోకూడదో నేర్పిస్తుంది మళ్ళీ