విశ్వాసఘాతకుడు

0
3

[శ్రీ కర్లపాలెం హనుమంతరావు రచించిన ‘విశ్వాసఘాతకుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సె[/dropcap]ల్ అదే పనిగా రింగవుతోంది.. అన్‌నోన్ నెంబర్ నుంచి!

మూడోసారికి.. ఎత్తక తప్పింది కాదు.

“రామారావుగారేనా?”

“యస్.. ప్లీజ్”

“మీ కజిన్ సీతారాముడిగారి నైబర్ సుబ్బారావుని సార్! మీరు అర్జంటుగా హిమాయత్‌నగర్ పోలీస్ స్టేషను కొచ్చేయాలి!”

సీతారాముడు మా పెదనాన్నగారి అబ్బాయి. చెన్నయ్ షా వాలెస్ కంపెనీ స్టోర్ కీపర్. వాడు కాకుండా వాడి నైబర్ కాల్ చేయమేంటి?!

ఉన్నపళంగా పోలీస్ స్టేషనుకు బైల్దేరా. టాంక్‌బండ్ మీదుండగా మళ్లీ కాల్.. సుబ్బారావ్ నుంచే!

“కంగార్లో చెప్పడం మర్చిపోయా సార్. మినిమమ్ ట్వంటీ ఫైవ్ థౌజండన్నా.. వెంట తెచ్చుకోండి..ఇదిగో మీ బ్రదర్.. మాట్లాడ్తారా?”

“ఫోనివ్వండి!”

పక్క నేవో గుసగుసలు.. కాస్సేపు!

“కస్టడీ మనిషితో కాంటాక్ట్స్ కుదరవంట! జస్ట్ ఇంక వనవరే టైమ్ సార్ మనకు. ఆనక కేసు కోర్టుకెళ్లిపోతుందంటున్నాడు ఇక్కడి సి.ఐ. ఏం చేసినా ఎఫ్ఫయ్యారవక ముందేనండీ మనం చేసుకోవాల్సిందీ!”

స్టోర్ స్టాక్‌లో తేడాలొచ్చాయని మేనేజ్ మెంటిచ్చిన కంప్లయింట్ మీద మా సీతారావుణ్ణి సెల్లో వేశారుట పోలీసులు. ఈ సుబ్బారావు చెప్పిందాన్ని బట్టి ఓ గంట లోపల గాని ‘కొంత’యినా ముట్ట చెప్పందే అరెస్టు ముప్పు తప్పేట్లు లేదు. పరువు కోసం ప్రాణమిచ్చే కుటుంబాలు మావన్నీ.

సుబ్బారావు చెప్పిన ఆ ‘కొంత’ మొత్తమయినా ఆఫీసు కెళ్లి ఓ అర్ధగంట ట్రై చేస్తే గాని సానుకూలపడే వ్యవహారం కాదు. ఇంత షార్ట్ టైంలో అది సాధ్యమయేనా? బైక్ స్పీడ్ మరింత పెంచి పది నిమిషాల్లో అఫీసుకు చేరిపోయాను.

అప్పటికే వచ్చికూర్చున్నాడు సుబ్బారావు మరో ఖాకీ యూనీఫామ్ శాల్తీతో సహా. “ఇట్లాంటి డీల్స్‌ అక్కడ స్టేషన్లో కుదరవండీ. అందుకే ఇక్కడ దాకాతీసుకొచ్చిందీ ఎస్సైగారిని” అన్నాడతగాడు.

ఇచ్చిన మనీ పేకెట్ ఇంచక్కా జేబులో కుక్కేసుకొని “గంట లోగా మీవాడు బైటకొస్తాడు.. మీకు ఫోన్ చేస్తాడు” అని చల్లంగా నిష్క్రమించాడా రక్షక భటుడు సుబ్బారావుతో సహా.

గంట కాదు.. రెండు గంటలు గడిచాయి. సీతారావుడి జాడా లేదు.. ఫోన్ మోగా లేదు! ఇంకో గంట వెయిట్ చేసి నేనే సుబ్బారావుకు కాల్ చేశా. వరసగా మూడు సార్లు చేసినా నో యూజ్!

పోలీస్ స్టేషన్ దాకా పోయి చూశా చివరికి. లింగు లింగు మంటూ ఒక్క రైటరు మాత్రమే కనిపించాడక్కడ టేబుల్ ముందు కునుకు తీస్తూ.

తట్టి లేపి అడిగితే ‘సీతారావుడూ లేడు. సుబ్బారావూ లేడు. పో పొమ్మ’ని తరిమేశాడా కుంభకర్ణుడు.

సీతారావుడికే నేరుగా కాల్ చేశానీ సారి. ఊహించినట్లే బదులు రాలేదు. గుంటూరులోని వాడి బ్రదర్ సూరికి ఫోన్ చేస్తే తెలిసింది.. మా సీతారావుడు ఇదివరకు మల్లేనే సుబ్బరంగా చెన్నయ్ షా వాలెస్ కంపెనీలో అదే జాబు చేసుకొంటున్నాడని. కస్టడీ కథంతా ఆ సుబ్బారావనే త్రాష్టుడెవరో తెలివిగా అల్లిన కట్టుకథ. నా కష్టార్జితం కృష్ణార్పణం అవటానికే జరిగినట్లుందీ చిత్రం.

ఆర్నెల్లు గడిచిం తరువాత జరిగింది ఇంతకు మించిన మరో విచిత్రం.

ఆరోజు ఆఫీసులో ఎప్పట్లానే రోటీన్‌గా ఇన్‌వర్డ్ పోస్ట్ చూస్తున్నా. పోస్టు మధ్య నా అడ్రసుతో కనిపించిందో పెద్ద కవరు. ఓపెన్ చూసినప్పుడు సాక్షాత్కరించిందో మూర్తీభవించిన మానవత్వం.

నీళ్ళొదులుకొన్న ఆర్నెల్ల కిందటి ఆ పాతిక వేల సొమ్ముకు మరో ఐదు వేలు జత చేసుకొని వచ్చిన డ్రాఫ్ట్ కన్నా.. దానికి ఎటాచయి వున్న లేఖలోని ప్రతి అక్షరం కంటి ముందు ప్రత్యక్షమయే ‘మానవీయతకు స్వచ్ఛమైన ప్రతిరూపం’ అనిపించింది.

“మీరను కొన్న ఆ ‘లేని సుబ్బారావు’ అసలు శాల్తీ నేనే సార్! నా పేరు శంకరం. నూలు మిల్లు చిరుద్యోగి మా నాన్న కోవిడ్ కారణంగా మరణించిన తరువాత మగ నలుసుగా పుట్టినందుకుగాను గంపెడు సంసారం నెత్తి కెత్తుకోవలసొచ్చింది. ఆ క్రమంలో కాకతాళీయంగా మీ కజిన్ సీతారాముడుగారి దగ్గర పని చేసే అవకాశం లభించింది. అదే టైములో అనేక విఫల ప్రయత్నాల అనంతరం.. కారుమబ్బులో కాంతి కిరణంలా పోలీసు కానిస్టబుల్ పోస్టు చేతికి అందేంత దూరంలోకి వచ్చి ఆశ రేపెట్టింది. కాని, నాకూ దానికీ మధ్య పాపిష్టి లంచమో పాతిక వేలు ముళ్ళ కంచెలా అడ్డమొచ్చిందండీ! కొంత కాలంగా మీ తమ్ముడుగారి దగ్గర నమ్మకంగా మసిలినందు వల్ల మీకు మీ తమ్ముడిగారి మీదున్న అభిమానం ఎంత గట్టిదో అర్థమయింది. అందుకే నేను నా లక్ష్య సిద్ధికి పావుగామీ బంధం వాడుకోగలిగింది. సుబ్బారావుగా నేసు నడిపించిన కథ తప్పుడు దారిలో నడుస్తున్నదని తెలుసు. ఏం చెయ్యను? పి.జి చేసినా ఓ.సీ.లో పుట్టిన కారణంగా ఏజ్ బార్ దగ్గర పడే దాకా ఏ ఉద్యోగం దొరికింది కాదు. ఆ నిస్పృహలో ఈ తప్పు చేయక తప్పింది కాదు. మీ అన్నదమ్ముల అనుబంధాన్ని స్వలాభాపేక్షతో నేను చిన్నబుచ్చిన మాట నిజమే. నా నిస్సహాయతను అర్థం చేసుకొని పెద్ద మనసుతో నన్ను క్షమించమని అర్థిస్తున్నాను. చేసిన అపరాధానికి జరిమానా కింద దోచుకున్న మీ పాతికవేలకు మరో ఐదు వేలు కలిపి నా ఉద్యోగం మొదటి వేతనం నుంచి మీకు సమర్పించుకొంటున్నా. స్వీకరించి నాకు మనశ్శాంతి ప్రసాదించమని మరీ మరీ అభ్యర్థిస్తున్నా.

ఇట్లు

మీ విశ్వాసఘాతకుడు

శంకరం ఉరఫ్ సుబ్బారావు.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here