రచయిత, అనువాదకులు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ ప్రత్యేక ఇంటర్వ్యూ

0
3

[‘పోరాట పథం’ అనే స్వీయచరిత్ర అనువాదాన్ని వెలువరించిన శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం కోడీహళ్ళి మురళీమోహన్ గారూ.

కోడీహళ్ళి మురళీమోహన్: నమస్కారమండీ!

~

ప్రశ్న 1: డా. హెచ్. నరసింహయ్య గారి గురించి మీకు ఎప్పుడు ఎలా తెలిసింది? కన్నడంలో వారి స్వీయచరిత్ర రాకముందే మీకు వారి గురించి తెలుసా? డా. హెచ్. నరసింహయ్య గారిని ఎప్పుడైనా కలిశారా?

జ. 1983లో ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక నేను కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా (ప్రస్తుతం చిక్కబళ్ళాపుర్ జిల్లా) లోని గౌరీబిదనూరులోని ఎ.ఇ.ఎస్.నేషనల్ కాలేజీలో బి.ఎస్.సి.లో చేరి ఒక సంవత్సరం చదువుకున్నాను. ఆ సమయంలో నేషనల్ విద్యాసంస్థలకు డా.హెచ్.నరసింహయ్యగారు అధ్యక్షులుగా ఉండేవారు. వారి కార్యాలయం బెంగళూరులో ఉన్నా వారంలో కనీసం ఒకరోజు గౌరీబిదనూరు కాలేజీకి వచ్చేవారు. అప్పుడే నేను మొదటిసారి వారిని చూసింది. వారి గురించి అప్పుడు నాకు చాలా తక్కువగా తెలుసు. వారు హేతువాది అని, బెంగళూరు యూనివర్సిటీకి ఉపకులపతిగా పనిచేశారని మాత్రం తెలుసు. వారి వేషధారణ చూసి వారు మా సంస్థల చైర్మన్ అంటే మొదట నమ్మలేదు. నేను అక్కడ చదివిన స్వల్పకాలంలో వారిని అనేక సార్లు చూశాను. మాకు ఒకటి రెండు ఫిజిక్స్ క్లాసులు తీసుకున్న జ్ఞాపకం ఉంది. అయితే సబ్జెక్టు కన్నా మిగతా విషయాలు చెప్పేవారు. వారితో సంభాషించ లేకపోయినా అతి సమీపం నుండి చూసిన అనుభవం ఉంది. 1984లో డిప్లొమా ఇంజనీరింగు చదవడానికి గౌరీబిదనూరు వదిలిన తరువాత నరసింహయ్యగారి గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం రాలేదు. పద్మభూషణ్ అవార్డు వచ్చినట్లు పేపర్లో చదివాను. 2018 వరకూ నాకు వారి గురించి తెలిసింది అంతంత మాత్రమే.

ప్రశ్న 2: డా. హెచ్. నరసింహయ్య గారి స్వీయచరిత్రని అనువదించే అవకాశం మీకెలా వచ్చింది

జ. 2017లోనో 18లోనో బెంగళూరులోని సప్న బుక్ స్టాల్ సందర్శించినప్పుడు అక్కడ ‘హోరాటద హాది’ పుస్తకం కనిపించింది. అది హెచ్. నరసింహయ్యగారి ఆత్మకథ అని తెలిసాక మా కాలేజీకి సంబంధించిన వ్యక్తి కావడంతో కుతూహలంతో ఆ పుస్తకం కొన్నాను. ఆ పుస్తకం చదివాక డా.హెచ్.ఎన్ గురించి పూర్తిగా తెలిసి వచ్చింది. అంత వరకు తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి. ఇంత గొప్ప వ్యక్తిని నేను చదువుకునే రోజుల్లో గుర్తించలేక పోయానని ఒక అపరాధభావం లాంటిది కలిగింది. అప్పటికే నేను తెలుగులో చిన్నా చితకా రచనలు చేస్తున్నాను. అందరూ గుర్తించేలా ఏదైన ఒక సాలిడ్ వర్క్ చేయాలని అనుకునేవాడిని. ఆ సమయంలో చదివిన ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు ఎందుకు పరిచయం చేయకూడదు అనిపించింది. ఈ పుస్తక అనువాదం నాకు గుర్తింపును తెస్తుందని నమ్మకం కలిగింది. ఇది నా రెండవ అనువాద రచన. అంతకు ముందొక కన్నడ కథను తెలుగులోనికి అనువదించాను. కన్నడ నా మాతృభాష కాకపోయినా కర్ణాటక సరిహద్దు గ్రామానికి చెందిన వాడిని కావడం మూలాన నాకు కన్నడభాషతో కొంతపరిచయం ఉంది. మొదట సుమారు 50 పేజీలను అనువదించి సాహితీమిత్రుడు, అనువాదకునిగా పేరు ప్రఖ్యాతులు గడించిన కొల్లూరి సోమశంకర్ గారికి చూపించి వారి అభిప్రాయం అడిగాను. వారు ఈ రచన చదివించే విధంగా ఉందని అనువాదం కొనసాగించమని ప్రోత్సహించారు. అయితే కొందరు ఈ అనువాదం చేసేముందు కాపీహక్కులు కలిగిన నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనుమతి తీసుకొనమని, ఇదివరకే ఎవరైనా ఈ పుస్తకాన్ని అనువదించారో లేక వారి అనుమతితో అనువదిస్తున్నారో తెలుసుకుని ముందుకు సాగమని సలహా ఇచ్చారు. బెంగళూరులోని నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి అనుమతి కోసం ప్రయత్నించాను. అయితే అప్పుడు నా ప్రయత్నాలు ఫలించలేదు. దానితో నా అనువాద ప్రయత్నానికి కొంత బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్టును కొనసాగించలేక పోతున్నానే అని నా మనసులో ఒక కొరత ఉండేది. అయితే 2023 జనవరి నెలలో నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి కొత్త కార్యవర్గం ఎన్నుకోబడినట్లు, సొసైటీ అధ్యక్షునిగా డా.హెచ్.ఎన్.సుబ్రహ్మణ్య ఎన్నికైనట్లు తెలిసింది. వారు మా కుటుంబానికి ముఖ్యంగా మానాన్నగారికి పరిచయస్థులు. హైదరాబాదుకు వచ్చినప్పుడు మా ఇంటికి ఒకటి రెండు సార్లు వచ్చారు. దానితో నాకు మళ్ళీ ఆశలు చిగురించాయి. వారిని తెలుగులోనికి అనువదించడానికి అనుమతి కోరాను. వెంటనే వారి నుండి అనుమతి లభించింది. ఈమధ్య కాలంలో కన్నడ పుస్తకాన్ని ఐదారుసార్లు చదివి ఉంటాను. అనుమతి పొందాక మళ్ళీ ఒకసారి చదివి ఉత్తేజితుణ్ణయ్యాను. అయితే నాలుగైదు సంవత్సరాలు గ్యాప్ రావడంతో పని పూర్తిచేయగలనో లేదో అనే శంక మొదలయ్యింది. మళ్ళీ అనువదించడం అయితే మొదలు పెట్టాను కానీ ఆఫీసు పని ఒత్తిడి, ఇతర కారణాలతో ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియని సందిగ్ధావస్థలో ఉన్నాను. ఆ సమయంలో సంచిక సంపాదకులు, నా మిత్రులు కస్తూరి మురళీకృష్ణతో మాటల సందర్భంలో ఈ రచన ప్రస్తావన వచ్చింది. వారు వెంటనే దానిని సంచికలో సీరియల్‌గా వేద్దామని ప్రతిపాదించారు. అయితే నరసింహయ్యగారు వివాదాస్పద వ్యక్తి అనీ, వారి అభిప్రాయాలను పాఠకులు స్వీకరించలేరేమోనని నా సందేహాన్ని వ్యక్తం చేశాను. వారు దానిని తేలిగ్గా తీసిపారేస్తూ 2023 ఏప్రిల్ నెలలో ‘పోరాట పథం’ ధారావాహికగా వారంవారం రాబోతున్నదని ప్రకటించేశారు. దానితో వారానికి సరపడా మ్యాటర్‌ను ప్రతీ వారం అనువదించక తప్పింది కాదు. అయితే పాఠకుల నుండి మంచి స్పందన రావడంతో లభించిన ఉత్సాహంతో మిగిలిన భాగాలను చాలా త్వరగా అనువదించాను. సంచికలో సీరియల్‌గా రాకపోయి ఉంటే ఈ రచన వెలువడటానికి ఎంత సమయం పట్టేదో చెప్పలేను.

ప్రశ్న 3: హోరాటద హదిను అనువాదానికి అవకాశం వచ్చినప్పుడు ఓ కన్నడ పుస్తకాన్ని తెలుగులోకి తేవడంగా భావించారా లేక డా. హెచ్. నరసింహయ్య గారి స్వీయచరిత్రలోని అంశాలు, వారి వ్యక్తిత్వం మిమ్మల్ని ఆకర్షించి అనువాదానికి అంగీకరించారా?

జ. వారి వ్యక్తిత్వం, ముఖ్యంగా వారి నిరాడంబరత్వం, పోరాట పటిమ, సమాజం పట్ల వారికున్న తపన ఇవన్నీ నన్ను ఈ పుస్తకాన్ని అనువదించడానికి ప్రేరేపించాయి. అనువాదం చేయమని నన్ను ఎవరూ కోరలేదు. నా స్వంత ఆసక్తితో ఈ పనికి పూనుకున్నాను.

ప్రశ్న 4: పోరాట పథంసంచికలో ధారావాహికంగా ప్రచురితమై, పాఠకులని ఆకట్టుకుంది. డా. హెచ్. నరసింహయ్య గారి స్వీయచరిత్ర కన్నడంలో తొలుత ఒక వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. ఆ ధారావాహికకి పాఠకుల స్పందన ఎలా ఉండేది? కన్నడంలో పుస్తక రూపంలోకి వచ్చాకా, పాఠకాదరణ పొందిందా?

జ. ఇది 1994లో ప్రముఖ కన్నడ వారపత్రిక సుధాలో ధారావాహికగా వచ్చింది. ఆ పత్రిక ఉప సంపాదకుడు, వీరి శిష్యుడు ఐన హెచ్.ఎన్.ఆనంద్ బలవంతంపై వీరు ఆ పత్రికలో తమ జీవిత విశేషాలను వ్రాయడం మొదలు పెట్టారు. ఈ ధారావాహిక పాఠకులను ఎంతగా ఆకట్టుకుందో ఒకటి రెండు దాఖలాలు ఈ పుస్తకంలోనే కనిపిస్తుంది. తన పూర్వ విద్యార్థి నరసింహమూర్తి (అలియాస్ పాపచ్చి)ని ఈ ధారావాహిక వల్ల కలుసుకోగలగడం అందులో ఒకటి. 1995లో మొదటి ముద్రణ పొందిన ఈ పుస్తకం ఇంతవరకు ఆరు ముద్రణలు పొందింది. ఈ పుస్తకానికి కర్ణాటక రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

ప్రశ్న 5: హోరాటద హదిపుస్తకం ఆంగ్లం, ఇతర భారతీయ భాషలోకి అనువాదమైనదా? ఏదైనా విదేశీ భాషలోకి తర్జుమా అయినట్లు మీ దృష్టికి వచ్చిందా?

జ. ఈ పుస్తకాన్ని బసవనగుడి నేషనల్ కాలేజీ ప్రొఫెసర్ ఒకాయన Path of Struggle పేరుతో ఆంగ్లంలోనికి అనువదించారు. కానీ అది సంక్షిప్త రచన మాత్రమే. ఇతర భారతీయ భాషలలోనికి అనువాదమైన విషయం నాకు తెలియదు. కానీ అన్ని భాషలలోకీ అనువాదం కావలసిన ఆవశ్యకత మాత్రం ఉంది.

ప్రశ్న 6: హోరాటద హదితెలుగు అనువాదంలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి? బాగా కుదిరాయనకున్న వాక్యాలో పేరాలో ఉండి అనువాదకుడిగా మీకు తృప్తిని కలిగించాయా?

జ. ఒక పేరానో, ఒక వాక్యమో పేర్కొనాలంటే చాలా కష్టం. మొత్తం పుస్తకమే అనువాదంలో బాగా కుదిరింది. ముఖ్యంగా భయపడవద్దు అనే పేరా క్రింద పేర్కొన్న కనకదాసు కీర్తన తెలుగు అనువాదం బాగా వచ్చింది అనుకుంటున్నాను. అనువాదం మొత్తం నాకు తృప్తిని ఇచ్చింది.

ప్రశ్న 7: ఈ ఆత్మకథని యథాతథంగా అనువదించానని, అనువాదకుడిగా అక్కడక్కడా కొంత స్వేచ్ఛ తీసుకున్నానని అనువాదకుని మాటలో అన్నారు. ఆ సందర్భాలేమిటో, మీరు తీసుకున్న స్వేచ్ఛ ఏమిటో ఒకటి రెండు ఉదాహరణలు చెప్పగలరా?

జ. 1. కన్నడ మూలంలో డా.హెచ్.ఎన్ నడిపిన రహస్య లిఖిత పత్రిక ఇంక్విలాబ్ లోని కొన్ని విషయాలను పేర్కొన్నారు. ‘మైసూర్ ఛలో’ ఉద్యమానికి సంబంధించిన వార్తలు, ఉద్యమకారులకు సూచనలు వగైరా సంక్షిప్తంగా వాటిలో పేర్కొన్నారు. అవి తెలుగు పాఠకులకు అవసరం లేదని అనిపించి ఆ భాగాలను తొలగించాను. దానికి బదులుగా ఆ పత్రిక ప్రతులు దొరికితే వాటి ఫోటోలు మచ్చుకు ఒకటి రెండు ఇద్దామని అనుకున్నాను. కానీ అవి లభించలేదు.

2. నేను అనువదించిన పుస్తకం 2015లో ముద్రించబడిన నాలుగవ ఎడిషన్. దీనిలో మొదటి ముద్రణ తరువాత రెండు కొత్త అధ్యాయాలు వచ్చి చేరాయి. మూలంలో ఇవి పోరాటపథం అనే అధ్యాయం తరువాత ఉన్నాయి. అయితే నేను ఈ అధ్యాయాలను ముందుకు జరిపి పోరాటపథం అనే అధ్యాయాన్ని చివరకు ఉంచాను. ఆ అధ్యాయంతో ముగించడం నాకు సబబు అనిపించింది.

ప్రశ్న 8: ఈ అనువాదంలో ఏవైనా భాషాపరమైనా, ఇతర ఇబ్బందులు ఎదుర్కున్నారా? ఎదుర్కుంటే వాటిని ఎలా పరిష్కరించుకున్నారు?

జ. అదృష్టవశాత్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఎందుకంటే నరసింహయ్యగారు వాడింది చాలా వ్యావహారికమైన కన్నడ భాష. అందులోనూ తెలుగు ప్రాంతానికి సమీపంలో ఉన్న కోలార్ ప్రాంతంలో వాడే భాష. కవిత్వంలో ఉపయోగించే హళెగన్నడ వంటి గ్రాంథిక భాష కాదు. కాబట్టి నాకు సులభంగా అర్థమయ్యింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు.

ప్రశ్న 9: విద్యావేత్తగా, విశ్వవిద్యాలయ ఉపకులపతిగా డా. హెచ్. నరసింహయ్య గారి కృషి శ్లాఘనీయం. వారి ఈ స్వీయచరిత్ర కర్నాటకలోని పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో గాని విద్యార్థులకు పాఠ్యాశంగా ఉందా?

జ. ఈ విషయం నా దృష్టికైతే రాలేదు. ఖచ్చితంగా వీరి ఆత్మకథలోని కొంత భాగం పాఠ్యాంశంగా ఎక్కడో ఒకచోట ఉండే ఉంటుంది.

ప్రశ్న 10: ఈ ఆత్మకథని తెలుగులో అనువదించడానికి ఎంత కాలం పట్టింది? ‘పోరాట పథం పుస్తకం రూపంలో తీసుకురావడంలోని అనుభవాలేవైనా పంచుకుంటారా? ఈ పుస్తకానికి ప్రచారం ఎలా కల్పించదలచారు?

జ. ముందే చెప్పినట్లు 2018లో కొంత భాగం, 2023లో మిగిలిన భాగం అనువదించాను. గట్టిగా ఆరు నెలల సమయం పట్టి ఉండవచ్చు అనువదించడానికి. ఇక దీనిని పుస్తకరూపంలో తీసుకువచ్చే బాధ్యతను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ కర్ణాటక కార్యదర్శి శ్రీ వి.వెంకటశివారెడ్డి గారు స్వీకరించి అందంగా ముద్రించి ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో బెంగళూరులో ఆవిష్కరణ సభ ఉంటుంది. తరువాత తెలుగు ప్రాంతాలలో పుస్తకపరిచయ సభలు ఏర్పాటు చేసి ప్రచారం కల్పించాలి.

ప్రశ్న 11: ఈ ఆత్మకథ ద్వారా డా.హెచ్.నరసింహయ్యగారు యువతకు ఇస్తున్న సందేశం ఏమిటి?

జ. ఏ విషయాన్నీ గ్రుడ్డిగా నమ్మకూడదు. అన్నింటినీ శాస్త్రీయ కోణంలో పరిశీలించాలి. ప్రశ్నించే స్వభావాన్ని అలవరచుకోవాలి. సమాజానికి చేతనైన సేవ చేయాలి.

ప్రశ్న 12: రచయితగా, అనువాదకుడిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

జ. ప్రత్యేకమైన ప్రణాళిక అంటూ ఏమీ లేదు. తోచింది వ్రాయడం, నచ్చిన రచనను కన్నడ నుండి తెలుగులోనికి అనువదించడం.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు మురళీమోహన్ గారూ.

కోడీహళ్ళి మురళీమోహన్: నా అభిప్రాయలను వెలిబుచ్చే అవకాశం ఇచ్చినందుకు సంచికకు ధన్యవాదాలు!

***

పోరాట పథం (ఆత్మకథ)
మూలం: డా. హెచ్. నరసింహయ్య.
అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
ప్రచురణ: ది నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ కర్నాటక, బెంగుళూరు.
పేజీలు: 475/-
వెల: ₹ 500/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
అనువాదకులు మురళీమోహన్ గారి 9701371256 నెంబరుకి ₹ 500/- ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి మీ చిరునామా తెలియజేస్తే, పుస్తకం రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపబడుతుంది.

 

 

 

~

‘పోరాట పథం’ పుస్తక సమీక్ష ఇక్కడ:
https://sanchika.com/porata-patham-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here