36. సంభాషణం – కథా, నవల, నాటక రచయిత డా॥ వి. ఆర్. రాసాని అంతరంగ ఆవిష్కరణ

6
3

[సంచిక కోసం కథా, నవల, నాటక రచయిత డా॥ వి. ఆర్. రాసాని గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

రాయలసీమ సాహితీ క్షేత్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి డా. వి. ఆర్. రాసాని:

వృత్తిపరంగా విద్యారంగంలో వుండి, ప్రవృత్తిగా రచనా వ్యాసంగాన్ని చేపట్టి సాహిత్య రంగంలో కూడా అదే స్థాయిలో తమ వంతుగా కృషిచేసి ఫలితాలు సాధించడం అందరికీ సాధ్యం కాదు. అంతమాత్రమే కాదు, తెలుగు సాహిత్యంలో, అనేక ప్రక్రియలలో పట్టు సాధించి విజయం సాధించడం కూడా అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యం. అలాంటి అతికొద్దిమందిలో, వి. ఆర్. రాసానిగా చెప్పబడే, డా. వెంకట్రామయ్య రాసాని ఒకరు. ప్రముఖ కధారచయిత శ్రీ మధురాంతకం రాజారామ్ వంటి సాహితీ పెద్దల ప్రశంశల నందుకున్న డా. రాసాని కథలు రాశారు, నవలలు రాశారు, నాటకాలు రాశారు. ఎందుకోగానీ ఆయన శ్రమకు తగ్గ ఫలితం లభించినట్టు కనిపించదు. నాటకాలు రాయడమే కాదు, నాటకప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా కూడా శ్రీ రాసాని తమ సేవలు అందిస్తుంటారు. అడిగిన వెంటనే ‘సంచిక’ తో, సంభాషించడానికి సంతోషంగా అంగీకరించిన శ్రీ రాసాని, తన రచనా వ్యాసంగాన్ని గురించిన మరిన్ని విషయాలు ఏమి చెబుతారో చూద్దామా..!

~

నమస్కారం డా. రాసాని గారు! ‘సంచిక’ అంతర్జాల మాసపత్రిక మీకు స్వాగతం పలుకుతోంది.

నమస్కారం డా. ప్రసాద్ గారూ.

ప్రశ్న 1. మీరు రచనా వ్యాసంగంలోకి ఎప్పుడు, ఎలా ప్రవేశించారు? ప్రారంభ దశలో మీ అనుభవాలు చెప్పండి.

జ: నేను నాలుగో, అయిదో క్లాసు చదివేటప్పుడు అనుకుంటా సాహిత్యంలో తొలి అడుగు పడింది. అదీ నాకు తెలీకుండానే.

మా ఊర్లో మేజారి గోవిందయ్య అనే అతను తొమ్మిదివరకు చదువుకున్నవ్యక్తి. మా ఊర్లో మొదట స్కూల్లో అంతవరకు చదువుకున్న వ్యక్తి అతనొక్కడే. అయితే పేదరికం వల్ల తొమ్మిదిలోనే చదువు మానేసి టైలరింగ్ నేర్చుకుని గుడ్డలు కుట్టేవాడు. అప్పటికతనికి పెళ్లి కాలేదు, రాత్రుల్లో ఊర్లో చదువుకుంటున్న పిల్లలకి ఉచితంగా ట్యూషన్ చెప్పేవాడు. నేనూ ఆ ట్యూషన్‌కు పోయేవాణ్ణి. మాకంటే ముందు గుడి దొరస్వామి అనే అతను ఎనిమిదో క్లాసులో వుండేవాడు, అతనూ ట్యూషన్‌కు వచ్చేవాడు. అప్పట్లో ఎనిమిదినుంచీ తెలుగు ఛందస్సు ప్రారంభమయ్యేది. గోవిందు బాగా పద్యాలు రాసేవాడు. ఆ కారణంగా ఒకరోజు దొరస్వామికి కంద పద్య లక్షణాలు – గగ, భ, జ, స, నల అనే గణాల గురించి చెప్తున్నాడు. నేను అలా కండ్లు మూసుకుని వింటున్నాను. అంతా అయిపోయాక “లక్షణాలు విన్నావు కదా. ఒక కంద పద్యం రాసి చూపించు” అన్నాడు. అతను రాయలేదు గానీ ఏకాగ్రతగా విన్న నేను పలకలో టకటకా ఒక పద్యం రాసి చూపించాను. ఆ పద్యం చదివి, “బాగుందిరా నువ్వెప్పటికైనా గొప్ప కవయిపోతావు” అన్నాడు గురువు. ఆ పద్యం ఇప్పటికీ నాకు గుర్తుంది.

శ్రీరామా యన్నంతనె

ఓరామా నొసగి తౌర మోక్షపదంబుల్

శ్రీరామా నిన్ను దలతు

నోరామా నన్ను బ్రోవుమా రఘురామా.

అదే నా తొలి అడుగు. ఆ తర్వాత పుంఖానుపుంఖంగా నోట్సులో ఎన్నో పద్యాలు రాసి పెట్టుకున్నాను.. నేను హైస్కూలు కొచ్చింతర్వాత గొప్ప మార్క్సిస్టు మేధావి, అనువాదకులు, అరుణానంద్ పేరుతో తమిళంలో కవిగా గుర్తింపబడిన వారు మా హిందీ మేష్టారు కీ.శే. వి.జి. యతి రాజులు గారు. ఒకరోజు నన్ను పిలిచి “వరే, నువ్వేదో పద్యాలు రాస్తావంటనే, ఏదీ చూపించు” అన్నారు. నోట్సులో పద్యాలు చూపించాను. ఆయన చాలా మెచ్చుకున్నారు. “బాగా రాస్తున్నావురా. కానీ ఈ కాలంలో పద్యాలు ఎవరు చదువుతారు? వచన కవిత్వం రాయి” అని ఆ రోజుల్లోనే మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ఇచ్చి “ఇలా రాయి” అన్నారు. ‘మహాప్రస్థానం’ ఆ వయసులోనే బట్టీ పెట్టేశాను. దాని ప్రభావంతో కొన్ని కవితల్ని రాసి యతి రాజులు గారికి చూపించాను. వాటిలో బాగున్నవి తీసుకుని కొద్దిగా దిద్ది వాటిని ‘ప్రజాశక్తి’కి పంపించారు. అలా అయిదారు చిన్న కవితలు ప్రింటయినాయి. అప్పుడు నేను ఎయిత్ క్లాసులో చదువుతున్నాను.

వి.ఆర్.రాసాని దంపతులు

నేను అప్పటికే కథలు, నవలలు చదువుతుండేవాడిని, నేను బాగా చదువుతానని మా ఊర్లో అప్పటికి ఎనభై ఏండ్ల వయనన్న కంబళ్ల చెంగయ్య తాత, మరికొందర్ని ప్రోగేసి రాత్రివేళ మాయింటి ముందర స్టూల్ పైన కిరసనాయిల్ లాంతర్ పెట్టి నా చేత రోజు కొంత చొప్పున కథల పుస్తకాలను చదివించుకుని ఆనందపడిపోయేవారు. ఆ విధంగా నేను సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి, భట్టి విక్రమార్క కథలు, పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర, భోజరాజు కథలు, కాశీమజిలీ కథలు వంటివి చదివి వినిపించాను. అదే విధంగా నేను ఆరవ క్లాసు చదివేటప్పుడు చొక్కలింగం పిళ్లై అనే తెలుగు మాష్టారు ప్రతిరోజూ తన పీరియడ్‌లో కొంత సేపు నవలల్ని సీరియల్‍గా నా చేతనే చదివించేవాడు. అలా నేను చదివిన మొట్టమొదటి నవల కలువకొలను సదానందం గారి ‘బంగారు నడిచిన బాట’, బలివాడ కాంతారావు గారి ‘ఇదే దారి’ అనే సాంఘిక నవల. బలివాడ కాంతారావు నవల ఏదో పాతకాలం నాటి సినిమా చూసినట్టుండేది. ఆ కారణంగా దాని ప్రభావంతో నేను ఎనిమిదో తరగతిలో వున్నప్పుడు ‘రాధామాధవీయం’ అనే నవలని రాసి మా తెలుగు అయ్యవారు కె.విశ్వనాథరెడ్డి గారికి చూపించాను. దాన్ని చదివి వారు “బాగుంది రా. ఇట్లే రాస్తావుండు. ఎప్పటికైనా నువ్వు పెద్ద రచయితవైపోతావు” అన్నారు.

ఇంటర్ కొచ్చింతర్వాత ఒక కుష్ఠు రోగి గురించి ‘ఇది కథకాదు’ అన్న చిన్న నవలను రాశాను. అలాగే డిగ్రీ మొదటి సంవత్సరంలో మరో నవల రాశాను. అవి ప్రింటయ్యే స్థితిలో లేవు, ప్రస్తుతం అని నా దగ్గర లేవు కూడా.

మా వూరు వీధి నాటకాలకు ప్రసిద్ధి. ఆ నాటకాల్లో చిన్నప్పుడే చిన్న చిన్న వేషాలు వేసేవాణ్ణి. ఈ నాటకాల అనుభవంతో నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదుకునేటప్పుడు ‘స్వర్గానికి ఇంటర్వ్యూ’ అనే ఒక హాస్యనాటికను రాసి ప్రదర్శింపజేశాను. మా మా ఊరు ఒకప్పటి చిత్తూరు జిల్లాకు చెందిన పులిచెర్ల మండలంలో ‘కురవ పల్లె’ అనే చిన్న విలేజి. పులిచెర్లలో ఒకప్పుడు ప్రఖ్యాతి చెందిన న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఓనర్సు వుండేవారు. పులిచెర్లలో ‘బి.వి.రెడ్డి అండ్ సన్స్’ పేరుతో గ్రవున్నట్ ఆయిల్ ఫ్యాక్టరీ వుండేది. చిత్తూరులో న్యూట్రిన్ స్వీట్స్ ఫ్యాక్టరీ ఉండేది. కడప కోటిరెడ్డి కూతురు ఇందిరా రెడ్డి గారు బి.వి. రెడ్డి గారి పెద్దకోడలు. ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ ఆమే చూసేది. ఆమె నన్ను వారి బంగ్లాకు పిలిచి, వారి ఉద్యోగస్థులతో కలిపి ‘వెంకటరమణా ఫైనార్ట్స్’ అనే ఒక నాటక సమాజాన్ని స్థాపించి నాచేత నాటికలు, నాటకాలు రాయించి ప్రదర్శింపచేశారు. వారి ద్వారా మన రాష్ట్రంలోనేగాక కర్నాటక లోని బళ్లారి, తమిళనాడులోని చెన్నైలోను దాదాపు 70-80 నాటికలు, నాటకాలు ప్రదర్శించి ఉంటాము. ఆ నాటక సంస్థ దాదాపు పాతిక సంవత్సరాలు నడిచింది.

శ్రీ రాసాని కుటుంబ సభ్యులు

నేను మొదట 1980లో అనుకుంటా మొదటి కథ ‘మధుర క్షణం’ రాశాను. అప్పటి కాలంలో విజయవాడ, పున్నమ్మ తోట వీధిలో వున్న సాహితీకల్పన అనే ఒక సంస్థ కథల పోటీలు నిర్వహిస్తే దానికి ఆ కథను పంపాను. అందులో సాధారణ ప్రచురణకు ఎన్నికైంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు కుటుంబ పరిస్థితుల వల్లనూ, నాటక ప్రదర్శనల్లో మునిగిపోవడం వల్లను కథలు రాయలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రభ వారపత్రికలో 1988లో ముద్రింపబడిన ‘నేలరాలిన వసంతం’ కథతో తిరిగి నా కథా ప్రయాణం ఆరంభమైంది. ఆ విధంగా మొదలైన నా కథా సాహిత్యంలో 160 పైన కథలు వెలుగు చూశాయి. ఇప్పటివరకు మెరవణి, పయనం, ముల్లుగర్ర, మృత్యుక్రీడ, రాసాని కథలు (అరసం), మా వూరికతలు, విషపురుగు, శ్రీకృష్ణదేవరాయల కథలు – అన్న కథా సంపుటాలు వచ్చాయి. అలాగే 1993లో ఆంధ్రప్రభలో ‘చీకటిరాజ్యం’ అన్న నవల సీరియల్‌గా వచ్చింది. నేను ఎం.ఎ. చదువుకునే రోజుల్లో రాసిన నవల అది. దాని తర్వాత మట్టి బతుకులు, ముద్ర, చీకటి ముడులు, పరస, వలస, ఏడో గ్రహం, వొలికల బీడు, ఆదియోధుడు, వక్రగీత, స్వప్నజోతి అనే పదకొండు నవలలు ముద్రింపబడ్డాయి. ఇంకా కపిరి, రక్తచందనం అనే రెండు నవలలు ముద్రణకు సిద్ధంగా వున్నాయి.

నాటక సాహిత్యానికొస్తే న్యూట్రిన్ ఫ్యాక్టరీ వారి ఆర్థిక సహాయంతో ‘స్వరానికి ఇంటర్వ్యూ’ అనే నాటకం 1983లో ముద్రింపబడింది. సాహిత్యంతో నా మొదటి పుస్తకం అది. దాని తర్వాత నరమేధం, శ్రీరామ నిర్యాణం, ప్రాసిక్యూటర్ పరంధామయ్య, ధర్మం చచ్చిపోయింది, మెరవణి, అగ్గి చెలమ, ముద్ర, తెల్ల దెయ్యం, వీరజాటీ, రంగులకల, కొలిమి, శ్యామ సుందరీయం, నేలతీపి, జల జూదం, మనిషి పారిపోయాడు – వంటివి దాదాపు పాతిక నాటికలు రాశాను. వాటిలో పదహారు నాటికలు ఆకాశవాణి కడప, తిరుపతి రేడియో కేంద్రాల నుంచీ ప్రసారమైనాయి, తెలంగాణ శకుంతల ప్రధాన పాత్రగా కొలిమి అనే నాటకం హైదరాబాదు దూరదర్శన్ నుంచీ ప్రసారమైంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, చెంచిత, కాటమరాజు యుద్ధము, అజ్జాతం, పసుపు చీర అనే నాటకాలూ ప్రదర్శింపబడి ముద్రింపబడ్డాయి. ‘చెడపకురా చెడేవు’ అనే టెలీఫిల్మ్‌కి దర్శకత్వం కూడా వహించాను. డిగ్రీలో మాకు తెలుగు బోధించిన సింగరాజు సచ్చిదానందం ‘నాటిక’ అనే పేరుతో నాటక సమాజాన్ని నడుపుతున్న గొప్ప కళాకారుడు. దళవాయి సుధాకర్ కోసం తరిగొండ వెంగమాంబ పైన నాటకం రాయమని అంటే నాకు భక్తి పైన నమ్మకం లేకపోయినా బాగా పరిశోధన చేసి ‘మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ’ అనే చారిత్రక పద్య నాటకాన్ని రాశాను. దాన్ని 30-4-2007న, 18-11-2007న తిరుపతిలోని మహాతి ఆడిటోరియంలో ప్రదర్శించాము. అప్పుడు టి.టి.డి.కి ఈ.ఓ.గా వున్న సహృదయులు డాక్టర్ కె.వి. రమణాచారి, సినీ దర్శకులు కె.విశ్వనాథ్, నిర్మాత బి.ఎన్. విశ్వనాథరెడ్డి లాంటి వారు తొలి ప్రదర్శన చూసి చాలా అభినందించారు. ఆ తర్వాత టి.టి.డి. ద్వారా అది సురభి కళాకారుల చేత వందసార్లకు పైగా ప్రదర్శింపబడింది, ఈ నాటకం 2008లో టి.టి.డి వారి ఆర్థిక సాయంతోనే ముద్రింపబడింది. దీనికంటే ముందు 32 రాత్రులు సాగే సుదీర్ఘమైన, ప్రపంచంలోనే అతి పెద్దదైన వీరగాథా చక్రం (Ballad Cycle) ను ‘కాటమరాజు యుద్ధము’ పేరుతో నాటకంగా రాయడం, దాన్ని 2000లో ముద్రించడం జరిగింది. ఆ తర్వాత ‘చెంచిత’ అనే జానపద నాటకం, పసుపు చీర అన్న సాంఘిక నాటకం 2021లో ముద్రింపబడ్డాయి, అజ్ఞాతం, నేలతీపి, జల జూదం, మనిషి పారిపోయాడు, దృష్టి, అనే నాటికలూ ముద్రింపబడ్డాయి.

 

అలాగే నాలుగు పత్రికల్లో కాలమ్ రచనలు చేసిన అనుభవం కూడా వుంది. వాకాటి పాండురంగారావు గారు ఆంధ్రప్రభ వారపత్రికకు సంసాదకులుగా వున్నప్పుడు ‘ఇది తిరుపతి’ అన్న శీర్షికను నిర్వహించాను. రాయలసీమ ఎడిషన్ ప్రాంభించినప్పుడు ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి.ఆర్. శాస్త్రి, కవి ఆఫ్సర్ నా చేత ‘మావూరి కతలు’ పేరుతో కథా శీర్షికను రాయించారు. ఆ తర్వాత తిరుపతి నుంచీ వచ్చిన దినపత్రిక ‘కామధేను’లో ‘రాయలసీమ నటరత్నాల” పేరుతోను, తిరుపతి నుంచే రాఘవశర్మగారు నడిపిన ‘కళాదీపిక’ అన్నపక్షపత్రికలో ‘లోకూలు’ అనే ఒక వాక్య కవితా శీర్షికను, ‘తెలుగు నాటక పద్యాలు’ అనే మరో శీర్షికను కొన్ని సంవత్సరాల పాటు నిర్వహించాను.

విశాలాంధ్ర వారు నా విమర్శనా వ్యాసాలను ‘లోచూపు’ అనే పేరుతో ముద్రించారు. అమరావతి పబ్లికేషన్స్ వారు నా చేత ప్రసిద్ధ తెలుగు నాటకపద్యాలు, అమరజీవి పొట్టి శ్రీరాములు, భారత వీరనారీమణులు, వేడుక పాటలు, పనిపాటలు వంటి పరిశోధనా గ్రంథాలు రాయించి ముద్రించారు. కేంద్రసాహిత్య అకాడమీ వారు ‘శంకరంబాడి సుందరాచార్యులు’ అనే మరో గ్రంథాన్ని నా చేత రాయించి ముద్రించారు.

ఇవన్నీ నా రచనారంభం నుంచి ఇంతవరకు రచనలు చేసిన నా అనుభవాలు.

ప్రశ్న 2: మన తెలుగు సాహిత్యంలో ఏ ప్రక్రియ అంటే మీకు మక్కువ ఎక్కువ? ఎందుచేత?

జ: నేను చిన్నపుడు మొదట పద్యాలు రాశాను. ఆ తర్వాత వచన కవితలు, ఆ తర్వాత నాటకాలు, కథలు, నవలలు క్రమేపీ సృష్టించాను. కాబట్టి అందమైన పద్యాలంటే నాకు ఇష్టమే. తిక్కన, పోతన, వేమన, వర్ణనల్లో కృష్ణదేవరాయలు వంటి వారి పద్యాలంటే చాలా ఇష్టపడతాను. బహుశా ఆ కారణంగానేమో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, చెంచిత, కాటమరాజు యుద్ధము, శ్రీరామనిర్యాణం లాంటి పద్యనాటకాలు రాశాను. చెంచిత అనే పద్యనాటకాన్ని జనరంజకంగా రాయగలిగి, నంది, గరుడ లాంటి నాటక పోటీల్లో నా దర్శకత్వంలో ప్రదర్శించి బహుమతులందుకోవడం కూడా జరిగింది. బహుశా ఆ పద్యం పైన మక్కువ వల్లే వీధినాటక కళాకారుల జీవితనేపథ్యంలో రాసిన ‘అజ్ఞాతం’ అనే సాంఘిక నాటకంలోనూ సందర్భానుసారంగా పద్యాలు పెట్టాను,

ఏ తల్లికైనా నీకు ఏ బిడ్డ ఇష్టమని అడిగితే ఏం చెబుతుంది. అందరూ ఇష్టమే అంటుంది. నిజమైన సృజనాత్మక సాహితీకారుడికి నీకు ఏ ప్రక్రియ ఇష్టమంటే అన్నీ ఇష్టమే అంటాడు. ఆ విధంగానే నాకు పద్యం తర్వాత కథన్నా, నవలన్నా చాలా ఇష్టం. అందుకే 160 దాకా కథలను, 13 దాకా నవలలను రాయగలిగాను. మనకు నచ్చిన, మెదడులోకి వచ్చిన ఏ సంఘటనైనా కథగా మలచడానికి బాగుంటుంది. అలాగే మనకు తెలిసిన, లేదా చూసిన ఒక వ్యక్తి జీవితంలోని ఒడిదుడుకులను గూర్చి రాయాలని కూడా అనిపిస్తుంది. కాబట్టి కథలన్నా, నవలన్నా నాకు ఇష్టమే. కానీ ఈ ఆధునిక కాలంలో పద్యానికి ఆదరణ లేదు. ఈ కాలానికి అది అవసరం కూడా లేదనిపిస్తుంది. ఏదైనా సులభంగా పాఠకుడిగా చేరువయ్యేది, అర్థమయ్యేది వచన రచనే. ఆ కారణంగా నవల, కథ నేటి సాహిత్యాభిలాషులకు చేరువైంది. కాబట్టి అవంటే నాకూ ఇష్టమే.

గురువు శ్రీ కేతు విశ్వనాధ రెడ్డి గారితో శ్రీ రాసాని

ప్రశ్న 3: మీరు నవల గానీ, కథ గానీ రాయాలనుకున్నప్పుడు ఎలాంటి వస్తువుకు ప్రాధాన్యతనిస్తారు? ఎందుచేత?

జ: నేను రచనా రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచీ రచనా పరంగా ఒక అవగాహన ఉండేది. అది ఇప్పటికీ వుంది. అదేమిటంటే అందరూ చెప్పిన విషయాలే మనమూ చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఏదైనా ఎవరూ చెప్పని కొత్త విషయమైనా చెప్పాలి. లేదా అందరూ చెప్పిన విషయమైనా ఎవరూ చెప్పని రీతిలో కొత్తగానయినా చెప్పాలి. నేను అదే పాటిస్తున్నాను. అందుకే సామాన్యంగా ఎవ్వరు అంతకు ముందు చెప్పని విషయాలేమున్నాయా అని నిత్యం అన్వేషిస్తూ వుంటాను. నిగూఢంగా పరిశీలిస్తూనే వుంటాను. కాబట్టే తెలుగు సాహిత్యంలో బసివినుల గురించి నేనే ‘మట్టిబటుకులు’, ‘ముద్ర’ అనే నవలల్ని రాసి మొదట పరిచయం చేశాను. నక్కటోళ్ళ గురించి ‘పయనం’, ‘ఎన్‍కౌంటర్’ వంటి కథలని, గువులోళ్ళ గురించి ‘నల్లపూసలు’ కథలోనూ, ‘కుబుసాలు’, ‘విషప్పురుగు’, ‘వేట’ వంటి కథల్లో యానాదుల గురించి; జంగమల గురించి ‘పొడిగింపు’ వంటి కథల్లోనూ చిత్రించాను. ఇలానే గంగిరెద్దుల వారి గురించి ‘పరస’ నవలలోనూ; ఎవరు చెప్పని గొరవయ్యల గురించి ‘నాలుగో నాటకం’, ‘మల్లేసు కుక్కలు’ అనే కథలోనూ; ఎరుకల స్త్రీల గురించి ‘వక్రగీత’ నవలలోనూ; వీధినాటక కళాకారుల గురించి ‘బతుకాట’ నవలలోనూ; స్క్రిజోఫ్రీనియా అనే మానసిక రోగి గురించి ‘స్వప్నజీవి’ నవలలోనూ, కాటికాపరుల గురించి ‘వొలికల బీడు’ నవలలోనూ; గొర్రెల కాపరులయిన కురవల గురించి ‘చీకటి రాజ్యం’, ‘కపిరి’ నవలల్లోనూ చెప్పాను. అలాగే దేవత పేరుతో ఆడవాళ్ళను బసినిగా మార్చేస్తే, మగవాళ్ళనీ ఉలిగమ్మ పేరుతో ముద్రేసి వదిలేస్తారు. ఈ ఉలిగమ్మల గురించి ‘వొలికల బీడు’ నవలలో కొంత, ‘గొగ్గమ్మ వెళ్ళిపోయింది’ కథలోనూ కొంత  చిత్రించి ఉలిగమ్మ పదాన్ని తెలుగు సాహిత్యంలో నేనే మొదట పరిచయం చేశాను. ఇంకా బహు గిరిజన, సంచార జాతుల వారి గురించీ నా కథల్లో చిత్రించాను.

అలాగే రచనా పరంగా తీసుకున్నా కొన్ని కొత్త ప్రయోగాలు చేయటానికి ప్రయత్నించాను. ఇప్పుడు జనాలకు బుక్ కల్చర్ పోయింది, లుక్ కల్చర్ ఎక్కువైంది. ఆ కారణంగా కథను కూడా ఒక దృశ్యం చూస్తున్నట్టుగా రాయాల్సిన అవసరం ఉంది. అలా రాయకపోతే కథ ఇంకా వెనకబడిపోతుందన్న ఆలోచనతో దృశ్యాత్మక కథలు పేరుతో ‘తృతీయవర్గం’, ‘హత్య’ వంటి కొన్ని కథల్ని రాశాను. అలాగే అసంగత పద్ధతినీ, మ్యాజిక్ రియలిజమ్ పద్ధతినీ కలిపి ‘అమ్మా అమ్మా నన్ను చంపేయవూ?’, ‘గుండె గృహంలో నెత్తుటి దీపం’ వంటి కథలు రాశాను. కానీ ఇలాంటి ప్రయోగాలు మన పాండిత్యాన్ని, మేధోపరమన ఈగోని తెలియజేయడానికి తప్పితే మరో సామాజిక ప్రయోజనం ఏమీ లేదనుకుని ఆ ప్రక్రియను కొనసాగించలేదు. ఏది ఏమైనా నాకు కథ, నవలా ప్రక్రియ అంటేనే ఎక్కువ మక్కువ. కారణం అవి పాఠకులకు సులభంగా అర్థమవుతుతాయి, సులభంగా దగ్గరవుతాయనే నమ్మకం. పైగా వాటి ద్వారా సామాజిక చైతన్యాన్నేమైనా తేగలమేమోనన్న ఆశ. అంతే, అలాంటివాటికే నేను ప్రాధాన్యమిస్తాను.

ఒక సాహిత్య సభలో ప్రసంగిస్తూ..

ప్రశ్న 4: మీరు మీ రచనల్లో స్థానిక మాండలికానికి ప్రాధాన్యతనిస్తారా? ఎందుచేత? మాండలికంలో కథలు/నవలలు రాయడం వల్ల మన సాహిత్యం తెలుగువాళ్ళందరికీ రుచిస్తుందని మీరు భావిస్తున్నారా? వివరించండి.

జ: ఏ రచనకైనా ఔచిత్యం అనేది ఒకటుంటుంది. మనం ఏ సమాజం నుంచీ ఎటువంటి వ్యక్తుల గురించి రాస్తున్నామో ఆ వ్యక్తులు నిత్యం మాట్లాడుకునే భాషలో ఆ రచన చేయడమే తగిన ఔచిత్యం. విద్యావ్యవస్థ పెరిగిన తర్వాత పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఒక రకమైన కాస్త సంస్కారవంతమైన భాషను ప్రచారం చేశాయి. దాన్ని శిష్ట వ్యవహారికం అంటారు. ఒక మారుమూల ఏ విద్యాగంధం లేని ఒక కులవృత్తికారుడి లేక సంచారజాతి వాడి గురించి రాసేటప్పుడు అతను మాట్లాడే భాషలోనే సంభాషణలు మొదలుపెట్టాలి. అలాగాకుండా, ఆ పాత్ర చేత గ్రాంథికమో, శిష్ట వ్యవహారికమో పలికిస్తే ఔచిత్యం ఏముంటుంది? అలాగే ఒక కలెక్టరో, లేదా, పెద్ద స్థాయిలో వుండే అధికారుల గురించి కథ రాస్తున్నప్పుడు ఆ పాత్రల చేత మాండలికం పలికిస్తే ఔచిత్యం మంట కలిసినట్టే. సహజత్వాన్ని అటకెక్కించినట్టే. కాబట్టి నేను మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, చెంచిత వంటి పద్య నాటకాలు రాసినా, సులభ వ్యవహారికంలో రాశాను. గిరిజన సంచార, యాచకవృత్తికారుల మీద నేను చాలా కథలు రాశాను. వాటిలో వారు జీవించిన ప్రాంతపు అచ్చమైన మాండలికంలోనే వారి మాటల్ని రాశాను. పైగా శిష్ట ప్రపంచానికి తెలియని ఎన్నో మాండలిక పదాలను రచనల్లో చేర్చడం వల్ల ఏ సంభాషణకైనా పద సౌష్టవం, పద సంపత్తి తప్పకుండా పెరిగి ఆ భాష సుసంపన్నం అవుతుంది. అది గొప్ప భాషా సేవ అవుతుంది.

ఒకసాహిత్య సభలో శ్రీ అన్నవరం దేవేందర్, విల్సన్ రావు, యాకుబ్, నలిమెల భాస్కర్ కవులతో శ్రీ రాసాని

అయితే ఒక ప్రాంతపు మాండలికం మరో ప్రాంతం వారికి అర్థం కాదు కదా అన్న అపవాదు కూడా ఒకటుంది. మొదటిదశలో అంటే ముప్ఫయి, నలభై ఏళ్ళకు ముందంటే ఆ ప్రాబ్లం కొంచెం వుండేదే. కానీ కొన్ని సినిమాల్లోను, ప్రసార మాధ్యమాల్లోనూ తరచు కొన్నిపాత్రలకి మాండలిక భాషను ప్రయోగించడం వల్ల ఆయా మాండలికాలు అందరికీ దగ్గరవుతూ వచ్చి, ఈ మధ్యన పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల వచ్చిన ‘సెల్’ వల్లా ప్రపంచమే ఒక అరచేతిలో ఒదిగిపోయినట్టయింది. ఆ కారణంగా పలు ప్రాంతాల సంభాషణలు, కార్యక్రమాలు ఆయా ప్రాంతాల మాండలికాలలో వస్తుండడం వల్లా మాండలికాలు అర్థం కావు అనే మాటకు అర్థం లేకుండా పోయింది. ఏదైనా కొంచెం కష్టపడ్డాలి. అలా కష్టపడి అలవాటు చేసుకుంటే శిష్ట సాహిత్యంలో లేని విశిష్టమైన భాషా సౌందర్యం మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. పైగా ఈమధ్య కాలంలో మాండలికంలో కథలు రాయడమే ఫ్యాషన్ మారిపోతూండడం కూడా మనం గమనించవచ్చు. నేను మొదటినుంచీ గ్రామీణ ఇతివృత్తాలతోనే రచనలు చేస్తుండడం వల్ల నేను ఎక్కువ మా ప్రాంతపు మాండలికమే వాడాను. మాది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ప్రాంతం. నేను పూర్తిగా మాండలికంలో రాసిన కథలు ‘మావూరి కతలు’, పూర్తిగా ఆద్యంతమూ సులభ మాండలికంలో రాసిన ‘వొలికల బీడు’ నవల పలువురి ప్రశంసల్ని అందుకున్నాయి. తెలుగు వారి మన్ననల్ని అందుకున్నాయి.

ప్రశ్న 5: మా రచనలు ఇతర భాషలలోకి అనువాదం అయ్యాయా? మన తెలుగు రచనలను ఇతర భాషలలోకి అనువదించవలసిన అవసరాన్ని తెలియజేయండి.

జ: నావి చాలా రచనలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆంగ్లము, హిందీ, కన్నడ, తమిళ, ఉర్దూ భాషల్లోకి  నా రచనలు అనువదింపబడ్డాయి.

నా మొదటి నవలయిన ‘చీకటిరాజ్యం’ను ఆంగ్లంలోకి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలోని ఆంగ్లభాష శాఖాధ్యక్షులు, మంచి సాహితీవేత్త అయిన తుమ్మపూడి భారతి గారు ‘ఇన్ ది రిజిమ్ ఆఫ్ డార్క్‌నెస్’ పేరుతో అనువదిస్తే దాన్ని ద్రవిడ విశ్వవిద్యాలయం వారు ముద్రించారు. అది కొంతకాలం ఆ విశ్వవిద్యాలయంలోని అనువాద శాఖలో అనువాదానికి ఒక రెఫరెన్స్ పాఠ్యాంశంగా ఉండేది. ఈ భారతి గారే వీరజాటి, పయనం లాంటి కథలనీ, దాసరి క్రిష్ణమూర్తి మహన్నభావుడు మా నామాల సాయిబు వంటి కథలను ఆంగ్లం లోకి అనువదించారు. అలాగే ప్రఖ్యాత మార్స్కిస్టు అనువాదకులు ఎ.జి. యతి రాజులు గారు మిన్నేరు వంటి కొన్ని కథలకు తమిళంలోకి అనువదించారు.

ప్రసిద్ద స్త్రీవాద రచయిత్రి శ్రీమతి ఓల్గా దంపతులతో శ్రీ వి.ఆర్.రాసాని

గుల్బర్గాలోని కన్నడ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆచార్య టి. డి. రాజన్న తగ్గె నా ‘ముద్ర’ నవలను ‘జోగతి’ పేరుతో కన్నడంలోకి అనువదించారు. ఈ నవల కన్నడంలో ఇప్పటికే ఐదు ముద్రణలకు నోచుకుంది. వీరే ఆంధ్ర ప్రదేశ్ లోని డిగ్రీ మొదటి సంవత్సరానికి ఏడేండ్లు పాఠ్యాంశంగా వున్న ‘బతుకాట’ నవలను ‘బణ్ణద బతుకు’ పేరుతో అనువాదం చేస్తే దాన్ని ద్రవిడ విశ్వవిద్యాలయం వారు ముద్రించారు. ఈ రాజన్న తగ్గె గారే నా ‘మెరవణి’ కథలను, ‘తరిగొండ వెంగమాంబ’ నాటకాన్ని కన్నడంలోకి అనువదించారు. అలాగే కన్నడంలో ప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత కుంబి వీరభద్రప్ప (కుం.వీ) కొన్ని కథల్ని, కస్తూరి మరికొన్ని కథలను కన్నడంలోకి అనువదించారు.

‘ముద్ర’ నవలను. ‘మొహర్’ పేరుతో డా॥ ఆర్. బి. వాణిశ్రీ హిందీలోకి అనువదించారు. వీరే నా కవితల్ని దాదాపు 40 కవితల్ని ‘ఆశ్రుయజ్ఞ్’ పేరుతో అనువదించారు. అలాగే ఆ ‘ముద్ర’ నవలను డా॥ ఎస్. హసీనా బేగం గారు ‘మొహర్’ పేరుతోనే ఉర్దూలోకి అనువదించారు.

ప్రస్తుతం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (నెల్లూరు) డైరెక్టర్ ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు ‘వొలికల బీడు’ నవలని తమిళంలోకి అనువదిస్తున్నారు. మరో ప్రసిద్ధమైన నా నవల ‘ఆదియోధుడు’ను డా॥ వి. జగదీష్ హిందీలోకి అనువదిస్తున్నారు. త్వరలో ఇవి ముద్రింపబడుతాయి.

మన తెలుగు లోను గొప్ప గొప్ప కావ్యాలు, నవలలు, నాటకాలూ వస్తున్నాయి. ఇవి ప్రపంచ సాహిత్యంలో నిలబడగలిగిన స్థాయిలోనూ వున్నాయని నేననుకుంటున్నాను. బండి నారాయణ స్వామి గారి ‘శప్తభూమి’, కేశవరెడ్డి ‘మూగవాడి పిల్లనగ్రోవి’, నా ‘ముద్ర’, ‘వొలికల బీడు’, ‘ఆదియోధుడు’ లాంటి నవలలు; తెలంగాణాలో పెద్దింటి అశోక్ కుమార్, విశాఖ ప్రాంతంలో చింతక్రింది శ్రీనివాస్, స్వామి, ఇనాక్, రాసాని లాంటి వారు రాసిన కొన్ని కథలు ఇతర భాషల్లోకి పోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. మనవారు ఆ దారిలో ప్రయత్నించక పోవడం దురదృష్టం.

ప్రశ్న 6: మన తెలుగు రాష్ట్రాలలో, అనేక విశ్వవిద్యాలయాలూ, వాటిలో తెలుగుశాఖలూ వున్నాయి. అనువాద ప్రక్రియకు సంబంధించి, వీటి కృషి ఎలా వుంది అని మీరు భావిస్తున్నారు?

జ: మన రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలోని విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలు వున్నాయి. అనేక మంది తెలుగు ఆచార్యులూ వున్నారు. ఇప్పుడున్న అందరూ అనను గానీ, చాలామంది రొటీన్ పరిశోధనా గ్రంథాలనే రాయిస్తున్నారు. కొత్తదనం ఏమీ లేదు. పైగా డబ్బులు తీసుకుని కొందరు గైడులే పిహెచ్‌డి. గ్రంథాలు రాసివ్వడం, లేదా ఇతరుల దగ్గర డబ్బులిచ్చి రాయి౦చడం విశ్వవిద్యాలయాల్లో ఎక్కువగా కొనసాగుతున్న తంతు. ఆ డబ్బులు తీసుకుని థీసిస్సులు రాసివ్వడం వ్యాపారంగా మలచుకున్న వారినీ చూశాను. వారంతా వేరే థీసిస్సులను, పరిశోధనా గ్రంథాలను చూసి దించేయడమే. పైగా తమ దగ్గర చేరిన మహిళా పరిశోధకుల్ని లైంగికంగా వాడుకునో, వేధించో థీసిస్సులు రాసిచ్చే వాళ్లూ వున్నారు. అలాంటి పరిస్థితుల్లో అనువాదాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో అనువాద శాఖ లాంటివి అరకొరగా అనువాదాలు సాగిస్తున్నాయి గానీ మిగిలిన యూనివర్శిటీల్లో దాని జోలికే పోవడం లేదు. కేంద్ర ప్రభుత్వాలు కానీ, యూజిసీ వారు కానీ ప్రతి యూనివర్శిటీలోను భాషాశాఖ లలో అనువాదాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం వుంది. అలా చేస్తే నేటి సాహిత్యం ఏ దారిలో నడుస్తోంది, ఏ ప్రాంతపు సంస్కృతి ఎలా వుంది, ప్రజల ఆలోచనలెలా సాగుతున్నాయి అనే అంశాలు ఇతర భాషల వారికీ అందే అవకాశం వుంటుంది. సమాజం ఇంకొంచెం ముందుకుపోవడానికి అవకాశం వుంటుంది.

ప్రసిద్ద కవి శ్రీ శివారెడ్డి గారితో శ్రీ రాసాని

ప్రశ్న 7: మంచి కథ, మంచి నవల అని చెప్పడానికి ఏదైనా ప్రాథమిక సూత్రాలున్నాయా? సవివరంగా చెప్పగలరా?

జ: నేటి సాహిత్యమేదయినా సామాజిక ప్రయోజనం కలిగి వుంటుంది. అందుకే మంచి సాహిత్యం మంచి సమాజాన్ని నిర్మిస్తుంది అన్నమాట ప్రపంచ వ్యాప్తంగా వుంది. అందుకే మొదటినుంచీ సాహితీవేత్తలకు మంచి గౌరవమూ గుర్తింపు వుండేది. ఈ సామాజిక ప్రయోజనం ఆధారంగానే సాహితీవేత్తలు సమాజ దిశానిర్దేశాన్ని నిర్ణయిస్తారనే ప్రగాఢ నమ్మకం కూడా ప్రజల్లో వుండేది. ఈ విషయాన్నే పి. బి. షెల్లీ ‘Poets are unacknowledged legislators of mankind’ అని అన్నట్లుగా ఎక్కడో చదివిన గుర్తు. కాబట్టి ప్రథమంగా ఏ రచనకైనా వుండాల్సింది సామాజిక ప్రయోజనం. అది లేకుండా తమ భాషా ప్రతిభనీ, రచనా ప్రతిభనీ ప్రదర్శించడం చేస్తే అవి అష్టావధానాలకు పనికొస్తాయిగానీ సామాజిక ప్రయోజనానికి కాదు.

కథ ఒకటి రెండు సంఘటనలాధారంగా రాసే రచన, నవల ఒక వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించేది. ప్రాజ్ఞులు చాలామంది ఈ వచన రచనలకి పాత్రచిత్రణ, ప్రారంభమూ, ముగింపు లాంటి చాటి గురి౦చి శిల్ప వైపుణ్యం గురించే చెబుతూనే వుంటారు. ప్రధానమైన ప్రాథమిక సూత్రమేమంటే వాస్తవ జీవిత చిత్రణతో చెప్పదల్చుకున్న దాన్ని ఎక్కడా డీవియేట్ కాకుండా చెప్పడమే, ఆ చెప్పడం ఆకర్షణీయంగా, అందంగా చెప్పడానికి ప్రయత్నించడమే. అయితే తన రచన ద్వారా ఎవరికి, ఎందుకు, ఏం చెబుతున్నామనీ స్పృహ రచయితకు తప్పనిసరిగా ఉండాల్సిన అంశం. అంటే రచయిత ముందు నిర్ధారించుకోవాల్సిన అంశాలు మూడు, తను ఎవరి కోసం రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు. దాని ద్వారా ఏం చెప్పదలచుకున్నాడు – అనే స్పృహ వుంటే చాలు; ఆ రచన సక్రమంగానే తయారవుతుంది. అలా తయారవడానికి ఇంకో విషయం కూడా రచయితలు గుర్తుంచుకోవాల్సివుంది. పాఠకులు ఊహల్లో తేలిపోయే అవాస్తవిక రచనలు చేయడం వల్ల ప్రయోజనమేమీ వుండదు. ఎవరి మెప్పు కోసమో, లేదా పొగడ్తల కోసమో, ప్రచారాల కోసమో ఆరాటపడి రచనలు చేసినా అవి నిలబడవు. పరిశీలించే గుణం వుండాలే గానీ మన చుట్టునే ఎన్నో కథలుంటాయి. మనకు తారసపడిన వ్యక్తుల ప్రవర్తనలనీ, వారు మాట్లాడే భాషను, వారి బాధలను, గాథలను, వారి జయాపజయాలను, కోపాలను, కన్నీళ్లను గమనించి చూస్తూ వుండాలి. అలా చూస్తే కథలు అవే పుట్టుకొస్తాయి. అలా రాసినవే సహజంగా వుంటాయి. అందర్నీ ఆకట్టుకుంటాయి.

ఆం.ప్ర.మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో

అవి నవలలయినా సరే, కథలయినా సరే తప్పకుండా ఆదరణను పొందుతాయి. అయితే ఈనాడు చాలామంది సీరియస్ రచయితలు సైతం అవార్డుల్ని, లక్షల బహుమతుల్ని దృష్టిలో పెట్టుకుని నవలల్ని, కథలని రాస్తున్నారు, రాయొచ్చు. అవార్డులొస్తే రచయితలకు టానిక్స్‌లా పని చేస్తాయి. కానీ ఆయా సంస్థల కనుగుణంగా రాయడం వల్ల తాత్కాలికంగా పేరు రావచ్చు గానీ కాలగతిలో అవి నిలబడడం కష్టమే. ఎవరో అన్నట్లు నంది అవార్డుల కంటే మంచి మెచ్చుకోలే నిజమైన అవార్డులు. ఈమధ్య కాలంలో ఈ పురస్కారాలు పైరవీల పరమైపోయి, కాపీ రచనలకు, అనుకరణ రచనలకే పరిమితమైపోతుండడడం బాధాకర విషయం. కాబట్టి బహుమతులొచ్చినవో, అవార్డులొచ్చినచో గొప్ప రచనలనుకునే రోజులు కనుమరుగైమతుండడం గమనించవలసిన విషయం. అయినా మనం పైన చర్చించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని మనకు తెలిసిన జీవితాన్ని చక్కగా చిత్రించి సక్సెస్‌గా నిలచిన కథే లేదా నవలే బహుకాలం నిలబడగలదని నా నమ్మకం.

ప్రశ్న 8: తెలుగుభాష అంతరించపోబోతుందిఅన్నది ఇప్పుడు ప్రతి నోట వింటున్న మాట. దీనికి మీరు ఏకీభవిస్తారా? ఎందుచేత?

జ: ఇప్పటికిప్పుడు తెలుక్కొచ్చిన తెగలు తెగులు ఏమీ లేదు కానీ ఇప్పటి పరిస్థితులిలాగే సాగితే దీర్ఘ కాలంలో అంతరించి పోతుందనడంలో అనుమానమే లేదు. దానికి కారణం జనాలలో విపరీతంగా పెరిగిపోయిన ఆంగ్ల వ్యామోహం. ఆంగ్లంలో చదివితే ఉద్యోగాలొస్తాయి, అదుంటే ప్రపంచంలో ఎక్కడికైనా పోయి బతకవచ్చు అన్న అన్న అపోహ బలంగా వుంది. ఆంగ్ల భాషా ప్రయోజనం ఆ విషయంలో కొంతవరకూ నిజమే కావచ్చు. అంతమాత్రాన మాతృభాష దేనికీ పనికి రాదనుకోవడం అజ్ఞానం. ఏ మనిషికైనా భాష తెలిసేదీ, నేర్చుకునేది కన్నతల్లి నుంచే. తల్లి ఏ భాషలో అయితే బిడ్డలో మాట్లాడుతూ పెంచుతుందో ఆ భాష ఆ మనిషికి వస్తుంది. తల్లి ద్వారా వస్తుంది కాబట్టే ఆ భాషను మాతృభాష అంటారు. మిగిలిన భాషలు చదవడం వల్లా, పెద్దయ్యాకా.. తోటి వారితో మాట్లాడ్డం వల్లా అలవడుతాయి. ఈ పరభాషా జ్ఞానాన్ని ఎంత పెంచుకున్నా ముందుగా ఆ భాషా వాక్యాలు, పదాల అర్థాలు మైండ్‌లో నిక్షప్తమై వున్న మాతృభాషలోనే నిర్మితమై కలం ద్వారానో, నోటి ద్వారానో, పరభాషా రూపం దాల్చుకుంటాయి. కాబట్టి మాతృభాషలో పట్టు రాకపోతే ఎంత గొప్పదయినా పరభాష పట్టుబడదు. ఈ నిజం తెలియని సూడో మేధావులు, సర్కారు వారు తమ స్వలాభాల కోసం మాతృభాషను నిరాదరిస్తున్నారు. మాతృభాష పైన ప్రేమలేనివాడికి తన మాతపైనా, మాతృదేశంపైన కూడా గౌరవం లేనట్టే. ఈ విషయాన్ని గమనించే ప్రభుత్వాలు ఈ విద్యావ్యవస్థలో మాతృభాషను పాఠ్యాంశాలుగా పెట్టుకున్నారు. కానీ ఈనాటి ప్రభుత్వాలు రాను రాను ప్రైవేటు పాఠశాలల్ని బతికించడం కోసం చిన్న క్లాసుల నుంచే తెలుగును తొలగించడం, డిగ్రీస్థాయిలో రెండేండ్ల వరకూ వున్న తెలుగు భాషను మొదటి సంవత్సరానికే కుదించడం వంటి దుశ్చర్యలతో మాతృభాషను అంపశయ్య పైకి పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అటు మాతృభాషా సరిగ్గా రాక, ఆంగ్లభాషపై పట్టురాక వారి ఎదుగుదల అంతంత మాత్రంగానే మిగిలిపోతోంది. ఇలాగే వుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మాతృభాష కూలీల్లోనూ, భిక్షగాళ్లలోనూ మాత్రమే కనిపించే పరిస్థితి దాపురిస్తుంది. ఈ దురవస్థకు మూల కారణం ఓట్ల కోసం, ప్రైవేటు వ్యవస్థల ద్వారా వచ్చే కాసుల కోసం ప్రభుత్వాలు విద్యాలయాల్లో మాతృభాషను తొలగిస్తూ రావడమే. ఈ దురవస్థ తొలగిపోవాలంటే డిగ్రీ వరకూ తెలుగును తప్పక పాఠ్యాంశంగా చేర్చాల్చిందే.

నాటి మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు గారితో

ప్రశ్న 9: వృత్తి పరంగా మీరు విద్యాబోధనలో వున్నారు. ఈ నేపథ్యంలో నేటి యువత, తెలుగు భాష, తెలుగు సాహిత్యం పట్ల ఆకర్షింపబడాలంటే ఏమి చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం చెప్పండి.

జ: నేను సమారుగా ముప్ఫయిదు సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశాను. నలభై ఏండ్లకు పైగా రచనా అనుభవము వుంది, ఇన్నేండ్ల నా అనుభవంలో నేను గ్రహించిందేమిటంటే.. తిరిగి మాతృభాష వైపు, మన సాహిత్యం వైపు యువతను ఆకర్షించాలంటే ముందు తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. చిన్నప్పటినుంచే పిల్లలకు కథలు చెబుతూ, పాటలు వినిపిస్తూ, పాఠ్యాంశాలతో బాటు ఇతర కథల పుస్తకాలను చదివిస్తూ పెంచాలి. మన చుట్టూ గాలి, వెలుతురు, చీకటి వంటి వాతావరణం ఎలా వ్యాపించి వుందో, మనం సమాజంలో భాగంగా ఎలా ఉన్నామో అదే విధంగా పుస్తక పఠనం అలవర్చి, సాహిత్య వాతావరణంలో పిల్లలు పెరిగేటట్లు చేయాలి. అలాగే భాషోపాధ్యాయులు విద్యార్థులకు రకరకాల సాహిత్య గ్రంథాలను, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవలలను, కథలను పరిచయం చేస్తూ వాళ్ల చేత కథలను, కవితలను, నవలలను చదివిస్తూ, రోజూ ఒక గంట సేపయినా గ్రంథాలయంలో కూర్చొని చదివే అలవాటును కలిగించడం చేయాల్సి వుంది. చిన్న క్లాసుల నుంచే కథలను, నవలలను, కవితలను చదివించి వాటి సారాంశాన్ని రాయించి వాటికి మార్కులు కేటాయించే విధంగా, పాఠ్యాంశంలో భాగంగా చేయగలిగితే మాతృభాషకు ఇంతవరకు ఆవరించిన రుగ్మతలన్నీ తొలగిపోతాయి. ఇది నా అభిప్రాయం.

ప్రశ్న 10: ప్రభుత్వపరంగా గానీ, ఇతర సంస్థల పరంగా గానీ ఇచ్చే అవార్డుల విషయంలో న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం సెలవివ్వండి.

జ: ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడిస్తున్న అవార్డులు మరీ దారుణంగా తయారయ్యాయనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ఒక పురస్కారం, ఒక కాపీ గ్రంథానికీ, అదీ అమ్మాయిలని వేధించిన రచయితకిచ్చి ఆ సంస్థ పరువు తీసేశారు. ఆ సంస్థే తిరిగి ఫక్తు కాపీ రచయితైన మరో రచయిత గ్రంథానికి ఇచ్చారు. దాంతో ఇక ఆ అవార్డు తీసుకోవడం కూడా అవమానంగా తయారయ్యే పరిస్థితి రాపురించడం తెలుగు వారు చేసుకున్న పాపం అనిపిస్తోంది, అలాగే పెద్ద ఎత్తున ఇచ్చే అవార్డులూ.. ముందే మాట్లాడుకుని, అవార్డు రూపంలో ఇచ్చే సొమ్ములో కమీషన్లు ఇచ్చేవారికే దత్తం చేస్తున్నట్లు ఎన్నో ఏండ్లుగా నలుగురైదుగురుకే, ఇంకెవ్వరూ లేనట్లు ఆవార్డులివ్వడం జరుగుతుందని కూడా చెప్పుకుంటున్నారు. అందుకే ఆ అవార్డుల పైన జనాలకు నమ్మకం పోయింది. కానీ సాహిత్యంలో అలాంటి పైరవీగాళ్లదే పై చేయి అయిపోతోంది. ఇంతకంటే వాటి గురించి ఏం చెప్పుకోగలం.

మిమిక్రీ పెద్దలు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్(వరంగల్) గారితో…

ప్రశ్న 11: మీ వివిధ రచనల గురించి వివరంగా చెప్పండి.

జ: ఇంతకు ముందే నా రచనానుభవంలో నా రచనల వివరాలు తెలియజేశాను. నేనింత వరకు 160 కి పైగా కథలు రాశాను. 14 నవలలు, 400కు పైగా వ్యాసాలు, కవితలు, గేయాలు; 100 కు పైగా జీవితచరిత్రలు రాశాను. వాటి వివరాలు ఇవి.

1. కథాసంపుటాలు-8.

మెరవణి, పయనం, మావూరికతలు, శ్రీకృష్ణదేవరాయ కథలు, మృత్యక్రీడ (ప్రకృతి వైపరీత్యాల కథలు) ముల్లుగర్ర, విషప్పురుగు, వి.ఆర్. రాసాని కథలు.

2. నవలలు-14

చీకటి రాజ్యం, మట్టి బతుకులు, బతుకాట, ఏడో గ్రహం, ముద్ర, పరస, చీకటి ముడులు, వలస, వొలికల బీడు, స్వప్నజీవి, ఆదియోధుడు, కపిరి, రక్త చందనం, వక్రగీత.

3. నాటకాలు – 6

శ్రీరామనిర్యాణం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, కాటమరాజు యుద్ధము, చెంచిత, అజ్ఞాతం, పసుపు చీర.

4. నాటికలు – 6.

స్వర్గానికి ఇంటర్వ్యూ, జల జూదం, దృష్టి, నేల తీపి, మనిషి పారిపోయాడు, పుత్తడి బొమ్మ.

5. రేడియో నాటికలు.

మెరవణి, వీరజాటి, తాలు గింజలు, రంగుల కల, కొలిమి, శ్యామసుందరీయం, అగ్గి చెలమ, కాంతామణి కాలిమెట్టె, తెల్ల గుర్రం, ముద్ర, వంటివి.. దాదాపు 22 నాటికలు ఆకాశవాణి కడప, తిరుపతి కేంద్రాలనుంచీ ప్రసారమైనాయి, కొన్ని గుర్తుకు రావడం లేదు.

6. దూరదర్శన్లు ప్రసాదమైనవి. -3.

‘టెలి ఫిల్మ్స్’ – చెడపకురా చెడేవు. దర్శకత్వంతో..

‘తెలంగాణ శకుంతల ప్రధాన పాత్రగా – కొలిమి – నాటకం

చిక్కుల్లో చికూరావు – మద్రాస్ కేంద్రం నుంచీ..

7. పరిశోధనా గ్రంథాలు – 7.

రాయలసీమ వేడుక పాటలు – ఒక పరిశీలన – పి.హెచ్.డి గ్రంధం. జానపదగేయాలలో పురాణాలు, వేడుక పాటలు, పనిపాటలు, లోచూపు, ప్రసిద్ధ తెలుగు నాటక పద్యాలు, భారతవీరనారీమణులు,

8. జీవిత చరిత్రలు – 2

అమరజీవి పొట్టి శ్రీరాములు, శంకరంబాడి సుందరాచార్యులు.

9. సంపాదకత్వంలో- 2

తెలుగుకథ – దళిత, బహుజన, గిరిజన మైనారిటీ జీవితం.

మునిపల్లె రాజు కథలు.

అలాగే మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ ద్వారా 2000 నుంచీ ప్రచురించిన `కథావార్షిక’ పది సంకలనాలకు సహసంపాదకత్వం.

10. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచీ చీకటిరాజ్యం, స్వప్నజీవి నవలలు సీరియల్ గాను, 12 కథలు, మరికొన్ని భావగీతాలు, సంగీత రూపకాలూ ప్రసారమైనాయి.

ప్రశ్న 12:  మీరు పొందిన అవార్డులు, సన్మానాల గురించి చెప్పండి.

జ: నాకింత వరకు కొన్ని వందల సన్మానాలు జరిగాయి. అవిటి గురించి  చెప్పాలంటే పెద్ద లిస్టే అవుతుంది.

అవార్డుల గురించి చెప్పాలంటే వాటిలో కొన్ని మాత్రం చెబుతాను.

నా మొదటి కళల సంపుటి ‘మెరవణి’కి విమలాశాంతి పురస్కారం, ‘చీకటి రాజ్యం’ అనే నా మొదటి నవలకు కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, ‘బతుకాట’ నవలకు తెలుగు విశ్వ విద్యాలయం ధర్మనిధి పురస్కారం, ‘తరిగొండ వెంగమాంబ’ నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య పురస్కారం, ‘జల జూదం’ నాటికకు మండలి కృష్ణారావు పురస్కారం, ‘ప్రసిద్ధ తెలుగు నాటక పద్యాల’కు రెండవసారి అదే పురస్కారం లభించింది.

ప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య గంగప్ప పురస్కారమూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అధికారభాషా పురస్కారం రెండు సార్లు, ఉత్తమ నాటక రచయితగా కందుకూరి వీరేశలింగం నాటక పురస్కారం రెండుసార్లు, గిడుగు రామ్మూర్తి గారి మాతృభాషా పురస్కారం అందుకున్నాను. గురజాడ సాహితీ పురస్కారమూ అందుకున్నాను. 2012లో సినిమా నంది పురస్కార సభ్యునిగా అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బంగారు నంది అవార్డు, ఆ తర్వాత నంది నాటకమ పోటీల న్యాయనిర్ణేతగా మూడుసార్లు బంగారు నంది పురస్కారాలు అందుకున్నాను. ఇటీవల ప్రఖ్యాత సినీనటులు నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎం.వి.రమణ గారి చేతుల మీరుగా ఎన్‍టిఆర్ అవార్డును అందుకున్నాను ఉత్తమ రచయితగా. ఇంకా చిన్న చిన్న పురస్కారాలు చాలా వున్నాయి, ఇటీవల ‘వొలికల బీడు’ నవలకు పెళ్లకూరు జయప్రద పురస్కారం కూడా వచ్చింది.

సన్మానం అందుకుంటూ శ్రీమతి & శ్రీ రాసాని

అలాగే నేను 1978 నుంచి నాటక సమాజాన్ని నడిపి వంద దాకా నాటకాలు ప్రదర్శించిన అనుభవం వుంది. నాటక ప్రయోక్తగా, ఉత్తమ నటుడిగా, ఉత్తమ హాస్యనటుడిగా, ఉత్తమ ప్రతినాయకుడిగా పలు బహుమతులందుకున్నాను . 1984లో బళ్లారిలో నా రచనా, స్వీయదర్శకత్వంలో ‘నరమేధం’ నాటిక వేసినప్పుడు బళ్లారి రాఘవ దత్తపుత్రుడిగా పేరుగాంచిన గొప్పనటుడు దొడ్డన గౌడు చేతుల మీదుగా బెస్ట్ విలన్ బహుమతి అందుకోవడం మరచిపోలేని జ్ఞాపకం.

ఈ ‘నరమేధం’ నాటిక గురించి కొంచెం చెప్పాల్సి వుంది. నేను ఇంటర్ చదివే రోజుల్లో చిత్తూరులో శ్రీలక్ష్మీ థియేటర్ అనే కొత్త సినిమా థియేటర్ ఆరంభంలో మొదటిరోజున ఒక పిల్లవాణ్ణి దానికి నరబలిగా చంపేస్తే అది బయటపడి దాన్ని సీల్ చేశారు. అది ఇప్పటికే చిత్తూరులోవుంది. ఆ సంఘటననాధారంగా రాసిన నాటిక ‘నరమేధం’. ఎనభయ్యవ దశకంలో సినీ నటుడు ఎల్.బి, శ్రీరామ్ రాసిన ‘హుష్ కాకి’ని తిరుపతి కళాకారులు ఒక ప్రభంజనంలా ప్రదర్శిస్తూ వుండేవారు. సినీ నటుడు, మాజీ ఎం.పి. ఎన్. శివప్రసాద్ గారు దర్శకులు. ఎక్కడ ప్రదర్శించినా దానికి పోటీనే లేకుండా వుండేది. దానికి నా ‘నరమేధం’ నాటిక మాత్రం పలుచోట్ల దాని పోటీని ఎదుర్కుంది. దాన్ని దాదాపు 17 సార్లు ప్రదర్శించాము. ఒకసారి మా వూరు పులిచెర్ల దగ్గర ఒక దళితవాడలో 1984లో 7వ ప్రదర్శనగా వేస్తుంటే.. అందులో మాంత్రికుడి వేషం నాది. నాకు బావమర్ది వరుసైన సహదేవుడు యువకుడిగా వేశాడు. ఒక భూస్వామి తన కొత్త సినిమా థియేటర్‍కి యువకుడిని బలిచ్చే సన్నివేశమది. దాన్ని చూడడానికి అయిదారు మైళ్ళ దూరం నుంచీ ఎద్దులబండ్లలో ప్రేక్షకులొచ్చారు, దాదాపు 5,6 వేల మంది. పులిచెర్లకు 5 కిలోమీటర్ల దూరంలో మా అక్కగారి వూరు. ఆ ఊరి నుంచీ ఓ పదిమంది మా అక్కతో కలిసి ఆ నాటకం చూడడానికి వచ్చారు. అప్పటికి వారొచ్చారని నాకు తెలీదు. యువకుడిని మాయ చేసి బలికి సిద్ధం చేసిన ఘట్టంలో సహదేవుడి తల్లి నాగమ్మ స్టేజీపైకొచ్చేసి “ఆపండి” అన్నది. నేను “ఏమత్తా?” అన్నాను. “ముండ నా బట్టల్లారా, నా కొడుకుని చంపేస్తారా?” అంటూ అరుస్తూ పెద్ద రాద్ధాంతం చేసింది. మా అక్క సిద్ధమ్మా స్టేజిపైకొచ్చి “నాయనా ఇట్టా యేసికం నువ్వెయ్యద్దు. పాపం నాయనా” అంటూ క్లాసు పీకింది. ప్రేక్షకులు మేము ప్రదర్శించేదే నిజమనుకునే రీతిలో మేము వేశామనిపించింది. అలా ప్రజలు స్పందించడమే కదా నిజమైన పురస్కారం. అలాగే నేను లెక్చరర్‍గా పనిచేసే ఎస్.వి. జూనియర్ కాలేజీలో పిల్లల చేత ఆ నాటకాన్ని వేయించినప్పుడు అప్పటి టి.టి.డి. కార్యనిర్వహణాధికారి కృష్ణయ్య గారు గొప్పగా ప్రశంసించారు. పిల్లలు నాటకమయిపోగానే నన్ను భుజాలకెత్తుకుని స్టేజీ పైకెత్తుకెళ్ళి పూలమాలల్లో ముంచెత్తేశారు. ఇంతకంటే గొప్ప పురస్కారం ఏముంటుంది? వీటి ముందర – అంతకు ముందు నేను చెప్పిన పురస్కారాలన్నీ తీసికట్టే.

సినీనటి కరాటే కల్యాణితో శ్రీ రాసాని

ప్రశ్న 13: చివరగా కథ/నవల రాయబోయే ఔత్సాహిక రచయితలకు మీరిచ్చే సలహాలు?

జ: ఇప్పుడు యువతీ యువకులు బాగా కథలు రాస్తున్నారు. కవిత్వమూ నవలలూ రాస్తున్నారు. బాగానే వున్నాయి. కానీ వీళ్ళకు నేనిచ్చే సలహా ఒక్కటే.. అధ్యయన లోపం వారి రచనల్లో బాగా కనిపిస్తోంది. ఈనాటి యువ రచయితలు గతంలో వచ్చిన కథలనీ, నవలలనీ విరివిగా చదవాలి. ఎక్కువ చదివి తక్కువ రాయాలి. అలా చేస్తే తాము చేసిన అధ్యయనం వల్ల తమ రచనల్లో శిల్పదోషాలు తొలగుతాయి. ఇప్పటి యువకవులు, రచయితలు తక్కువ రాసి ఎక్కువ ప్రచారం కోసం ప్రాకులాడుతున్నారు. అలా తెచ్చుకున్న పేరు తాత్కాలికం. అది గుర్తుంచుకుని ముందు మనం పరిపక్వమైన రచన చేయటంలో ఉత్సాహం చూపించాలి. అదే నేనిచ్చే సలహా.

~

ధన్యవాదాలు డా. రాసాని గారు.

ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here