రేపటి ఘనతకు సాక్షాలు.. నేటి సిరా ముద్రలు!

0
4

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘రేపటి ఘనతకు సాక్షాలు.. నేటి సిరా ముద్రలు!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]మావాస్య చీకట్లు కమ్ముకున్న రాత్రిళ్ళు..
నిద్ర లేకుండా గడిపిన నిశి తోడైన సమయాలు..
ఓటమి చేసిన గాయాలను మర్చిపోలేక సతమతమవుతూ..
కష్టాన్ని తట్టుకుంటూ..
భారంగా..
భయంకరమైన కలల్ని మోస్తూ..
ఉలికిపాటుకు గురై..
చీకటితో సహవాసం చేసిన దీనస్థితులెన్నో..
జరిగిన కాలాన్ని తిరిగితేలేము..
మర్చిపోలేని వేదనాభరితమైన కథనే అదంతా..!
కానీ నేస్తం.. అదంతా గతం!

మన కృషి..
మన పట్టుదల..
మన ఆత్మస్థైర్యం..
మన పోరాటం..
ఇదే జీవితంగా సాగుదాం!

ఓటమి నేర్పిన పాఠం సదా జ్ఞప్తికొస్తూనే ఉంటుంది!
గాయాన్ని గేయంగా మార్చే భవిత మన స్వంతమవ్వాలి!
అదే మన జీవిత గమన మవ్వాలి!
ఆనందాలు నిండిన హృదయాలు జయ సంకేతాలు!
రాబోయే రేపటి ఘనతకు సాక్షాలు!
చరిత్ర ని తిరగ రాసే సువర్ణాక్షరాలు.. కలం పరిచయం చేసే సిరా ముద్రలు..!
అందుకే అక్షరాన్ని ఆలంబనగా చేసుకుందాం..
పుస్తకమే ప్రాణంగా.. విజ్ఞానమే శ్వాసగా.. కదులుదాం!
కష్టం సృష్టించిన భయంకరాన్ని తరిమే..
రూపుమాపే శక్తి .. ధృడమైన మనో సంకల్పంకే సాధ్యం!
..అదే మన బలమవ్వాలి!
అక్షరాన్ని ప్రేమిస్తూ.. వెలుగు బాటలో.. ఉత్సాహంగా ముందడుగు వేద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here