[జనవరి 12, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ రచన అందిస్తున్నారు ఎన్. సాయి ప్రశాంతి]
[dropcap]స్వా[/dropcap]మి వివేకానంద..
ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది ఏమిటి?
ధైర్యం మరియు సాహసం.. యువతరానికి ఆయన ఆదర్శం..
కాని ఆయన మన యువతరం నుండి ఆశించినది ఏమిటి..
కేవలం ఉపన్యాసాలకే స్వామీజీ పరిమితమా..
జనవరి 12 ఒకరోజే ఆయనని గుర్తు చేసుకోవాలా…
స్వామి వివేకానంద జీవిత చరిత్ర యువతరానికి ఒక పాఠం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి దశలో అంతులేని ఆత్మ విశ్వాసం, ధైర్యం యువతకి తమ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే శక్తి ఇస్తుంది.
అలాంటి కఠినమైన, దుర్భరమైన పరిస్థితులు ఎన్నో ఆయన జీవితంలో..
ధైర్యం అనగా ఏమిటి? ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొని నిలబడగడమే అసలైన ధైర్యం. స్వామి వివేకానందలో అత్యంత ప్రముఖమైన లక్షణాలలో ఈ ధైర్యము, ఆత్మవిశ్వాసం అనేది ఒకటి. ఆయన తన జీవితంలో ఈ ఆత్మవిశ్వాసాన్ని ఈ శక్తిని ఆచరించి చూపించారు. ఏ విధంగా అంటే ఆయన బాల్యం నుండి ఆయన యవ్వన దశలో కూడా ఈ ధైర్యాన్ని కలిగి ఉండేవారు. ఆత్మవిశ్వాసం అంటే మనకు మొదట గుర్తొచ్చేది స్వామి వివేకానందయే. ఆ ధైర్యాన్ని ఆయన తన జీవితంలోని అనేక కఠిన పరిస్థితులలో చూపించారు. ఆయన తన యవ్వన దశలో ఉన్నప్పుడు తన తండ్రి అకస్మాత్తుగా మరణించారు. ఆ సందర్భంలో ఆయనకు ఎవరు సహకరించలేదు, పైగా ఆయనకి ఇబ్బందులు కలిగించారు మరియు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన మీద అసూయతో అనేకమంది ఆయనకు సమస్యలు కలిగించారు. అయినప్పటికీ ఆయన తన ధైర్యాన్ని నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇది నేటి యువతకి ఒక పాఠం. నేటి యువత ప్రతి చిన్న పరిస్థితికి ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఇటువంటి సందర్భాలలో స్వామి వివేకానంద జీవితంలోని అనేక విషయాలు, అనేక సంఘటనలు మనకి ధైర్యాన్ని కలిగిస్తాయి. స్వామి వివేకానంద ఒక మాట అనేవారు వజ్ర సంకల్పం కలిగి ఉండండి అని. ఇటువంటి సంకల్పం ఉన్న వ్యక్తులను ప్రపంచంలో ఏ శక్తి ఏమీ చేయలేదు అనేవారు. అందువల్ల స్వామి వివేకానంద జీవితంలోని ధైర్యం అనే విషయం యువతకి ఒక ఆదర్శం.
స్వామి వివేకానంద జీవితంలో మనం నేర్చుకోదగిన మరో పాఠం వ్యక్తిత్వం. ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎంత దుర్భర దారిద్రం ఉన్న ఆయన తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి వ్యవహరించలేదు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే అని. అనేక పరిస్థితులలో ఆయన స్నేహితులు ఆయనని చెడుదారులలో నడపడానికి ప్రయత్నించారు. ఏ పరిస్థితులలో కూడా స్వామీజీ ఎప్పుడూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ప్రవర్తించలేదు. అమెరికా వెళ్ళిన సమయంలో కూడా అనేక మంది స్త్రీలు ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తించేందుకు ప్రోత్సహించారు. కానీ ఆయన తృణ నిశ్చయమ్ముందు వారి ప్రయత్నాలు నిలవలేదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న యువత కావాలి, ఎలాంటి ఆకర్షణకు లోను కాని యువత కావాలి అని స్వామీజీ ఆకాంక్షించారు. స్వామీజీ జీవితంలోని అనేక సంఘటనలు మనకు వ్యక్తిత్వం యొక్క ఉదాత్తతని వివరిస్తాయి. వ్యక్తిత్వం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి.
స్వామీజీ జీవితంలో మరొక ముఖ్యమైన పాఠం జ్ఞాన తృష్ణ. ఆయన జ్ఞానాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఎటువంటి కఠినత్వాలు ఎదురైన ఆ జ్ఞానాన్ని సాధించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించి దాన్ని సాధించారు. ఏ విషయంలోనూ మూఢనమ్మకాలకు లోను గాకుండా సత్యాన్ని స్వయంగా తెలుసుకుని తెలుసుకొని ప్రయత్నించారు. సత్యాన్ని తెలుసుకుని దాన్ని నిరూపించుకొని అప్పుడే దాన్ని విశ్వసించారు. ఇది నేటి యువతకు ఒక పాఠం. ఏ విషయమై ఏ విషయమైనా స్వయంగా తెలుసుకోవాలి, ఎవరు చెప్పింది గుడ్డిగా నమ్మకూడదు. ఇది శాస్త్రీయమైన వ్యక్తిత్వానికి ఉదాహరణ శాస్త్రీయ స్వభావం. అంటే సత్యాన్ని స్వయంగా తెలుసుకుని అప్పుడే దానిని విశ్వసించారు. గుడ్డిగా నమ్మకుండా స్వయంగా తెలుసుకుని దానిని రుజువు చేసుకొని విశ్వసించడము.
ఈ విధమైన స్వభావం వల్ల యువత తన జీవితం యొక్క లక్ష్యాలని తన జీవితం యొక్క అనేక విషయాలను స్వయంగా తెలుసుకొని విశ్వసిస్తారు. వాళ్లకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. వాళ్ల లక్షణాలు సాధించే క్రమంలో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలుగుతారు.
స్వామీజీ జీవితంలో మరొక ముఖ్యమైన అంశం సేవా భావం. స్వామీజీ ఎప్పుడూ యువతకి ఒక విషయాన్ని బోధించేవారు. భారతదేశానికి ఆదర్శాలు త్యాగము మరియు సేవ ఈ రెండు ఆదర్శాల ద్వారా ఏమి చేయాలని ప్రయత్నించిన తక్కినవన్నీ సమకూరుతాయి, మీరు ఈ విషయాలలో దృష్టి సారించండి అనేవారు. దేశభక్తితో యువత సేవ చేస్తే అది అందరికీ ఉపకారి అవుతుంది. దేశభక్తితో సేవ చేయడాన్ని స్వామి వివేకానంద చాలా ప్రోత్సహించారు. సేవ అనగా మనము లేనివారికి ఇవ్వడం మాత్రమే కాదు అది ఒక దైవారాధన వంటిది అని బోధించేవారు. స్వామి వివేకానందలో ముఖ్యమైన అంశం ఇది. అనేకమందిని దేశ సేవకై ప్రోత్సహించారు. అనేకమంది యువతను స్వాతంత్రోద్యమం వైపు ప్రోత్సహించారు. దేశానికి దేశం కోసం త్యాగం చేసేందుకు స్వామి వివేకానంద సందేశం ఆ సందర్భంలోని యువతను ఎంతగానో ప్రోత్సహించింది. స్వామి వివేకానంద కేవలం ఒక సన్యాసి మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప దేశభక్తుడు, ఒక గొప్ప త్యాగి, ఒక గొప్ప యోగి, ఒక గొప్ప దార్శనికుడు. యువతకు ఆయనకు మించిన ఆదర్శం లేదు. ఆయనని మనం కేవలం జనవరి 12వ తారీకు మాత్రమే గుర్తు తెచ్చుకోవడం కాదు, ఆయన యొక్క సందేశం మన జీవితాన్ని ఫలప్రదమైన మార్గం వైపు నడిపిస్తుంది. మన జీవితపు వాస్తవికతను మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఆయన మన అందరి జీవితాలకు మార్గదర్శి కావాలని మనం ప్రార్థించాలి. మన యువత నిరంతర స్ఫూర్తి కోసం స్వామి వివేకానందను మించిన శక్తి గాని వ్యక్తి గాని లేడు.