[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘స్మార్ట్ చిల్డ్రన్’ అనే నాటిక అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. మొదటి భాగం ఇక్కడ]
దృశ్యం-8
[dropcap]లై[/dropcap]ట్లు వెలుగుతాయి.
(బెర్హంపూర్‌లో అర్జునరావు వాళ్లిల్లు. ఆయన బెర్హంపూర్ యూనివర్సిటీలో సంస్కృతం ప్రొఫెసర్‍గా చేసి రిటైరైనాడు. అక్కడే యిల్లు కట్టుకొని స్థిరపడ్డారు. ఆ ఊరు ఆంధ్రా బార్డరుకు కేవలం 30, 35 కి.మీ.ల లోపే ఉంటుంది. తెలుగువారు ఎక్కువగా నివసిస్తారు. తెలుగు సినిమాలన్నీ అక్కడ రిలీజవుతాయి.)
సుగుణ: మన అమ్మాయి, అల్లుడు, ఎందుకో బాగా డిప్రెస్ అయినట్లు అనిపిస్తుందండీ! మనుమరాలి కోసమేనా ఇదంతా?
అర్జునరావు: సుగుణా, ఈ కాలం పిల్లలకు పేరెంటింగ్ తెలియదు. ఉరుకుల పరుగుల జీవితం. ఉన్న ఒక్క పిల్లనో పిల్లవాడినో పెంచడం గగనమైపోతుంది వాళ్లకు.
సుగుణ: మన కాలంలో మన అమ్మానాన్నలు ఏడెనిమిది మందిని కనేసి, అవలీలగా పెంచేవారు.
అర్జునరావు: అవును. మేము ఏడుమందిమి. ముగ్గురన్నదమ్ములం నలుగురు ఆడపిల్లలు.
సుగుణ: మేమేం తక్కువా ఏమిటి? ఇద్దరు అన్నల తర్వాత వరుసగా మేము ఆడపిల్లలం నలుగురం.
అర్జునరావు: ఈ కాలం జంటలు పెంచడానికి భయపడి పిల్లలను కనడమే మానేస్తున్నారు. మా కొలీగ్ త్రినాథ్ బెహరా కొడుకు పెళ్లి చేసి ఐదేళ్లు దాటింది. ఇంకా పిల్లా జెల్లాలేరు. ఇంకా ‘ప్లానింగ్’ చేసుకోలేదట.
సుగుణ: ఏ ప్లానింగో పాడో! ఆ లెక్కన మన పిల్లలే నయం. సరేగాని, వైజాగ్ ఇంటర్ సిటీ టికెట్లు బుక్ చేశారా లేదా? అంత సులభంగా దొరికి చావవు.
అర్జునరావు: దొరికాయిలే, కానీ ఎ.సి. ఛెయిర్ కార్లో లేవు. మామూలు సెకండ్ క్లాసులో దొరికాయి.
సుగుణ: పోనీలెండి. మనమేమయినా పుట్టినప్పటి నుండి ఏ.సిల్లో పెరిగామా ఏమన్నానా?
అర్జునరావు: అదే సుమా మనకూ మన తర్వాతి తరానికీ తేడా. మనం కష్టపడి ఈ స్థితికి వచ్చాము. ఇప్పుడు అన్నీ ఉన్నా, పెద్దగా మనకు అనిపించదు. కంఫర్ట్స్‌కి మనం బానిసలు కాలేదు. కానీ మన పిల్లలు, దే టేక్ కంఫర్ట్ ఫర్ గ్రాంటెడ్!
సుగుణ: తల్లి కడుపులోంచే ఏ.సి.లో బయటికి వచ్చేవారు అలా కాక ఎలా ఉంటారు?
అర్జునరావు: చిన్నప్పుడు సోంపేటలో మా నాన్న ఎర్రటి ఎండలో పొలానికి నడిచి వెళ్లేవారు. మా స్కూలు కూడ రెండు మైళ్లుండేది. నడిచేవెళ్లేవాళ్లం. అదో పెద్దపని అనిపించేది కాదసలు.
సుగుణ: ఇప్పుడసలు వీళ్లకు ఎక్సర్‌సైజ్ అనేదే లేకుండా పోయింది.
అర్జునరావు: ఒకమాట చెబుతా విను వ్యాయామం అనేది వృత్తిలో భాగంగా ఉండేది ఒకప్పుడు. కానీ, ఇప్పుడు? బోలెడు డబ్బుపోసి జిమ్‍లకు వెళితే గాని కుదరదు. పట్టుమని పది పర్లాంగులు నడిచేవాళ్లెవరు? ప్రతిదానికి బుర్రుమని బైక్! లేదా కారు!
సుగుణ: మా చిన్నప్పుడు, రణస్థలం దగ్గర పల్లెటూరు మాది. మంచినీళ్లు కిలోమీటరు దూరమున్న వాగు నుండి తెచ్చుకునేవాళ్లం, చెలిమెలు తవ్వుకొని బిందెలు మోసుకొని.
అర్జునరావు: సైకిలు తొక్కడమే మానేశారు. సైకిలింగ్ ఎంత చక్కని వ్యాయామం? గట్టిగా నాలుగిడ్లీలు తిని హరాయించుకోలేరు. అన్నట్లు ఈరోజు టిఫినేమిటి?
సుగుణ: మీకిష్టమైనదే! పెసరట్టుప్మా!
అర్జునరావు: అయితే పద! ఒక పట్టు పడతాను!
దృశ్యం-9
(మర్నాడు 2 గం||. మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి, హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. విద్య వచ్చి తాతయ్య ఒళ్లో కూర్చుంటుంది)
విద్య: నువ్వు, అమ్మమ్మ వస్తున్నారని, మధ్యాన్నమే వచ్చేశా. లంచ్ బాక్సు కూడ తీసుకెళ్లలేదుగా (అంటుంది ముద్దుగా)
అర్జునరావు: (పాపను ముద్దుపెట్టుకుంటాడు.) అమ్మలూ! ఈ కళ్లజోడేమిటే నీకు, దరిద్రంగా! అస్సలు బాలా. యాక్! తీసెయ్యి ముందు! (విద్య కళ్లల్లో వెలుగు! శ్రీకర్ హిమజల కళ్లల్లో ఆశ్చర్యం)
హిమజ: నాన్నా, అదేమిటి.. (అంటూ ఏదో అనబోతుంటే శ్రీకర్ కళ్లతోనే వారిస్తాడు. సుగుణ నవ్వుతూ చూస్తోంది)
విద్య: (కళ్లజోడు తీసేసి) అమ్మమ్మా, అమ్మ నన్ను అస్తమాటికీ “గుడ్డి ముండవైపోతావ్” అని తిడుతుంది! అమ్మను తిట్టు!
సుగుణ: మీ అమ్మే ఒక పిచ్చిముండ! దానికేం తెలుసు? (విద్య కిలకిల నవ్వింది. పుట్టినప్పటినుండి ఆ పాప అంతగా నవ్వడం తల్లిదండ్రులు చూడలేదు. అమ్మమ్మ తాతయ్య రాత్రి మాట్లాడుకుంటున్నారు)
సుగుణ: హిమజ చాలా డిప్రెస్ అయినట్లుందండీ. అల్లుడే కొంచెం బెటర్! విద్యవాళ్ల మిస్ చెప్పింది నిజమేననిపిస్తూందండి!
అర్జునరావు: అవును. మొత్తం క్రైసిస్‌కు కారణం ఆ సెల్‌ఫోనే అని అర్థమైంది కదా! ఒక్క క్షణం దాన్ని వదలి ఉండలేకపోతుంది. బాగా అడిక్ట్ ఐంది.
సుగుణ: అవును. మనం రేపటి నుంచి రంగంలోకి దిగుదాం. పాజిటివ్‌గా నరుక్కొద్దాం. ఇదేమంత పెద్ద విషయం కాదు.
అర్జునరావు: చిన్న చిన్న విషయాలను స్పెషలిస్ట్‌ల దగ్గరికి వెళ్లి కాంప్లికేట్ చేసుకోవడంలో ఈ తరాన్ని మించినవారు లేరు! ఐ పిటీ దెమ్!
(మర్నాడు ఉదయం. విద్య లేచి, బ్రష్ చేసి, జూనియర్ హార్లిక్స్ తాగింది)
సుగుణ: అమ్ములూ! ఈ రోజుకు మీ స్కూలుకు సెలవులిచ్చేద్దాం. ఓకెనా? నేను తాతయ్యా వచ్చేశాం కదా! నీవు స్కూలుకెళితే మరి మాకు కబుర్లెవరు చెబుతారు? మీ అమ్మ నాన్నా ఆఫీసులకెళ్లిపోతారు!
(విద్య ఆనందంగా గెంతులు వేసింది)
విద్య: బలే, బలే! కాని అమ్మ.. అమ్మ ఒప్పుకోదేమో అమ్మమా!
సుగుణ: మీ అమ్మకు నేను చెబుతాగా! సరేగాని, నీవు నేను తాతయ్య ఒక ఆట ఆడదామా?
విద్య: నాకు ఏ ఆటలూ రావు! (అంటుంది దిగులుగా)
అర్జునరావు: మేం నేర్పిస్తాంగా! దాక్కునే ఆట! భలే గమ్మత్తుగా ఉంటుంది తెలుసా!
విద్య: అయితే సరే.
సుగుణ: ఏమండీ మీరు దాక్కోండి! మేం కనిపెడతాం!
(65 ఏళ్ల వయస్సున్న రిటైర్డ్ శాన్‌స్క్రిట్ ప్రొఫెసర్ పిల్లిలా వెళ్లి వంటింట్లో ఫ్రిజ్ చాటున దాక్కున్నాడు)
సుగుణ: ఈ తాతయ్య ఏమయ్యాడబ్బా! విద్యా, ఇలారా, వెళ్లి బెడ్ రూంలో చూడు! (విద్య చూసి వచ్చి అక్కడ లేడంటుంది.)
సుగుణ: (విద్య చెవిలో రహస్యంగా వంటిట్లోకి వెళ్లి వెతుకు! (విద్య వంటింట్లో, ఫ్రిజ్ పక్కన మొకాళ్ల మీద నక్కి కూర్చున్న తాతయ్యను కనిపెట్టేస్తుంది)
విద్య: అమ్మమ్మా! (ఎక్సయిట్మెంట్) తాతయ్య దొరికాడు. ఫ్రిజ్ చాటున దాక్కున్నాడు. (అరుస్తుంది)
(తాతయ్య ఓడిపోయిన ముఖం పెట్టుకొని మనవరాలితో పాటు బయటికి వస్తాడు. విద్య ముఖం విజయగర్వంతో వెలుగులీనుతుంటుంది)
సుగుణ: ఇప్పుడు నేను, మీ ఇద్దరూ కళ్లు మూసుకోండి! (అంటూ వెళ్లి గ్రిల్డ్ బాల్కనీలో వాషింగ్ మిషన్ చాటున దాక్కుంది)
(వీళ్లిద్దరూ ఇల్లంతా వెతుకుతారు. అమ్మమ్మ కనబడదు)
అర్జునరావు: బుజ్జిబంగారూ ఇలారా! (పాప చెవిలో) బాల్కనీలో, వాషింగ్ మిషన్ వెనక.. (విద్య శరవేగంగా పరుగెత్తుతుంది. అమ్మమ్మను పట్టుకుంటుంది. ఉద్వేగంతో ఉరకలు వేస్తూందా పిల్ల చిట్టి మనసు)
విద్య: అమ్మమ్మ దొరికిపోయిందోచ్! తాతయ్యా అమ్మమ్మను కనిపెట్టేశాను. వచ్చి చూడు! త్వరగా రా తాతయ్య! (పాప గొంతులో ఎక్సయిట్మెంట్)
సుగుణ: ఇప్పుడు నీ వంతు (అంటూ ఎక్కడ దాక్కోవాలో కూడా చెప్పింది) (ఇద్దరూ పాపను వెతుకుతున్నట్లు చాలాసేపు నటించారు.) ఎక్కడ ఉంటుందబ్బా! ఎక్కడా లేదే! అంటూ పాపకు వినబడేలా అరుస్తూ ఇల్లంతా తిరిగారు. చివరికి?
అర్జునరావు: పాపా! మేం ఓడిపోయాం! ఎంత ప్రయత్నించినా నిన్ను కనుక్కోలేక పోయాం! వచ్చేయి తల్లీ! (బిగ్గరగా)
సుగుణ: నేను చెప్పానా, మన బంగారు తల్లే విన్నరని! (బిగ్గరగా)
(విద్య సెకండ్ బెడ్ రూంలోని వార్డ్ రోబ్లో, క్రింది అరలో, బట్టల చాటున నుంచి బయటకొచ్చి, అమ్మమ్మను, తాతయ్యను తన చిట్టి చేతుల్తో వాటేసుకుంటుంది)
విద్య: మీరోడిపోయారోచ్! అమ్మమ్మా ఈ ఆట బలే బావుంది.
సుగుణ: ఇదేముంది? మా ఇద్దరికీ బోలెడు ఆటలు వచ్చు. పద టిఫిన్ చేద్దాం. (డైనింగ్ టేబుల్ వద్ద, తను పుట్టినప్పటినుండి, మొదటిసారిగా, ఫోన్ అడగకుండా మూడు ఇడ్లీలు తిన్నది పాప. అరగంట సేపు ఆడటం వల్ల ‘ఆకలి’ అనే దాన్ని గురించి ఆ పిల్లకు తెలిసింది. అప్పుడు ఎనిమిదైంది)
అర్జునరావు: పాపా, నీవు ఫోన్ చూస్తూ ఉంటావే, బొమ్మల కథలు, నాకొకటి చెప్పవా? (ఎంతో ఆసక్తితో)
విద్య: నిజంగానా తాతయ్య! అయితే ‘ఛోటా భీమ్’ కథ చెబుతా (విద్య తన ముద్దు మాటల్తో కథ చెబుతుంటే ఇద్దరూ అతి శ్రద్ధగా విన్నారు)
అర్జునరావు: భీముడు అంటే ఎంత బలం ఉంటుందో తెలుసా? నీవు ఉదయం ఎన్ని ఇడ్లీలు తిన్నావు?
విద్య: త్రి!
సుగుణ: భీముడు త్రీహండ్రెడ్ తింటాడు తెలుసా! (విద్య కళ్లు పెద్దవయ్యాయి!)
విద్య: బాబోయ్ త్రీహండ్రెడా? (గుండెలమీద చేయి వేసుకొంటుంది) అన్ని తింటాడా! అంత పెద్ద బొజ్జ ఉంటుందా భీముడికి?
అర్జునరావు: నీకు ఎలిఫెంట్ తెలుసు కదా, ఏనుగు?
విద్య: తెలుసు మా పుస్తకంలో బొమ్మ ఉంది. గణేష్‌కు హెడ్ అదే కదా!
సుగుణ: వెరీగుడ్! ఎలిఫెంట్తో కూడా ఫైట్ చేసి క్రింద పడేయగలడు భీముడు!
విద్య: బాబోయ్! అంత బలమా అమ్మమ్మా!
అర్జునరావు: ఈ ఆదివారం మనం ‘జూ’ కు వెళదాం. అక్కడ నీకు బోలెడు యానిమల్స్ చూపిస్తాలే.
విద్య: ఈ రోజే వెళదాం అయితే.
సుగుణ: సండే అయితే అమ్మానాన్నా వస్తారు తల్లీ. నీకు భీముని సినిమా చూపిస్తా ఉండు. ఏమండీ యూట్యూబ్‌లో ‘పాండవ వనవాసం’ సినిమా పెట్టండి. టీవీలో!
(భీముడు సౌగంధిక పుష్పం కోసం వెళ్లడం, దారిలో ఆంజనేయస్వామితో గొడవ. దేవలోకంలో ఏనుగుతో ఫైటింగ్ ఉన్న దృశ్యాలు వచ్చేంత వరకు ఫార్వర్డ్ చేసి చూపాడు తాతయ్య. ఆ నలభై నిమిషాల పాటు కళ్ళార్పకుండా చూసింది. మధ్యలో కేరింతలు కొట్టింది. సెల్‌పోన్ మర్చిపోయింది ఉదయం నుంచీ)
సుగుణ: తల్లీ ! నీకు ఏ కూర అంటే ఇష్టం? ఏమేం తింటావ్ లంచ్ టైంలో?
విద్య: పొటాటో ఫ్రై, ఫ్రెంచి ఫ్రైస్, న్యూడిల్స్!
సుగుణ: (నవ్వి) అదేం తిండి! ఈ రోజు వంట నే చేశాను. సరేగాని మీ స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఎవరు?
(మాటల్లో పెట్టి, బీరకాయ కూర అన్నం, చారన్నం, పెరుగన్నం తినిపించింది అమ్మమ్మ. చివర్లో అరటిపండు తిననంటే దాన్ని చిన్న ముక్కలు చేసి పెరుగన్నంలో కలిపితే తినేసింది.)
లైట్లు ఆరిపోతాయి.
దృశ్యం-10
లైట్లు వెలుగుతాయి.
(ఎం.వి.పి. కాలనీలో ఒక పెద్ద పార్కు. విశాలమైన లాన్స్, పెద్ద పెద్ద చెట్లు. వెయ్యి చ.గజాల విస్తీర్ణంలో మందంగా మెత్తటి ఇసుక పరచిన చోట రకరకాల ఆటలకు వీలుగా పరికరాలు సీ-సా, జారుడు బండ, ల్యాడర్స్, ఉయ్యాలలు, చిన్ని రంగులరాట్నాలు)
సుగుణ: విద్యా మనం ముగ్గురం ‘పట్టుకునే ఆట’ ఆడదామా?
విద్య: అంటే?
అర్జునరావు: నీవు పరుగెత్తుతుంటే మేం వచ్చి నిన్ను పట్టుకుంటాం. అలాగే మేం పరుగెత్తుతే నీవు వచ్చి మమ్మల్ని పట్టుకోవాలి.
విద్య: బలే బలే! (అంటూ తూనీగలా పరుగెడుతుంది. వీళ్లిద్దరూ అందుకోలేనంత వేగంగా దొరికినట్లే దొరికి, క్షణంలో తప్పించుకుంటుంది)
సుగుణ: (ఆయాసపడుతూ) అమ్మ! మా చేతకాదు బాబూ. నిన్ను క్యాచ్ చేయడం! ఎంత స్పీడుగా పరుగెడుతుందో మా విద్యమ్మ?
(విద్య గర్వంగా చూస్తుంది. ఒళ్లంతా చెమటలు పట్టి, గౌను తడిసిపోయింది)
అర్జునరావు: ఇక మమ్ముల్ని పట్టుకో మరి (ఇద్దరూ పరుగు తీస్తారు. కానీ పది సెకండ్లలో మనుమరాలికి దొరికిపోతారు)
సుగుణ: ఇసుకలోకి వెళదాం పదండి! (ముగ్గురూ వెళతారు)
అర్జునరావు: ఇదిగో తల్లీ, ఈ ల్యాడర్ ఎక్కిపోయి, అటునుంచి జారి కిందికి రావాలి. నేను అటువైపుంటా! ఒకే?
విద్య: అమ్మో, నాకు భయం! పడిపోతానేమో?
సుగుణ: ఎందుకు పడిపోతావు? చూడు, నీకంటే చిన్నబాబు, చకచక ల్యాడర్ ఎలా ఎక్కుతున్నాడో? (విద్య ల్యాడర్ ఎక్కి అవలీలగా క్రిందికి జారుతుంది. స్లోప్ మీదుగా అలా పది పన్నెండుసార్లు)
(మనుమరాలిని రకరకాల ఆటలు ఆడిస్తారు. చీకటి పడుతుంది. పార్కులో లైట్లు వెలుగుతాయి. పార్కు బయట రకరకాల తినుబండారాలమ్మే బళ్లు ఉంటాయి)
విద్య: తాతయ్యా, నాకు ఐస్‌క్రీం కావాలి?
అర్జునరావు: కొనిపెడతా తల్లీ! అదేం భాగ్యం? కాని దానికి ముందు నీవు ఒక పని చేయాలి.
విద్య: (ప్రశ్నార్ధకంగా చూస్తుంది) ఏమి చెయ్యాలి తాతయ్యా?
(తాతయ్య అక్కడున్న ఉడకపెట్టిన శనగలు (గుగ్గిళ్లు) బండివాడి దగ్గర మూడు పొట్లాల శనగలు తీసుకుంటాడు. నిమ్మకాయ పిండి, తాటాకు స్పూన్ వేసి ఇస్తాడు)
విద్య: ఏమిటవి తాతయ్యా?
అర్జునరావు: శనగలు, బాగుంటాయి తిను!
(విద్య ఒక స్పూన్ తిని, బాగున్నాయని తలపకింస్తూ తినసాగింది)
అర్జునరావు: సుగుణా, శనగల్లో ప్రోటీన్‌తో బాటు, పీచు పదార్థం కూడ ఉంటుంది. పొటాషియం కూడ మలబద్దకానికి చాలామంచిది.
సుగుణ: పీచు పదార్థం అంటే పైబరే కదండి!
అర్జునరావు: (నవ్వి) ఖర్మ! ఇంగ్లీషులో చెబితేగాని దాని విలువ తెలియదు
సుగుణ: మీలాగా సంస్కృతం, తెలుగు చదువుకున్నానా నేను? (ఇద్దరూ నవ్వుకుంటారు)
అర్జునరావు: తల్లీ, విద్యమ్మా, తినేశావా? వెరీగుడ్! నీకు ఐస్‌క్రీం బదులు ఒక డ్రింక్ తాగిస్తా. ఓ.కె.నా?
విద్య: నాకు ధమ్స్ అప్ కావాలి!
సుగుణ: ఛీ! అది తాగకూడదు. (ముగ్గురూ చెరుకురసం బండి దగ్గరకు వెళతారు)
అర్జునరావు: మూడు గ్లాసులు చేయి బాబు. ఐస్ వేయకు, నిమ్మకాయ ఎక్కువ పిండు.
విద్య: (చెరుకు రసం తాగుతూ, మనస్ఫూర్తిగా) అమ్మమ్మా ఈ డ్రింక్ ధమ్స్ అప్ కంటే నిజంగా బాగుంది. అరె! మీ ఇద్దరికీ మీసాలు వచ్చాయి
అర్జునరావు: నీక్కుడా మీసాలు వచ్చాయిలే! (నవ్వుతూ తన కర్చీఫ్‌తో పాప నోటికంటిన నురగను తుడిచేస్తాడు.
లైట్లు ఆరిపోతాయి.
దృశ్యం-11
లైట్లు వెలుగుతాయి.
(ఒక ఆదివారం అందరూ కైలాసగిరికి వెళతారు. రోప్ వేతో బాగా ఎంజాయ్ చేస్తుంది విద్య. అందరూ శిపార్వతుల విగ్రహం ముందున్న పచ్చికలో కూర్చుంటారు. హిమజ పులిహోర, పెరుగన్నం తెచ్చింది)
తాతయ్య: విద్యా, మనం రన్నింగ్ రేస్ పెట్టుకుందామా?
విద్య: నేను రెడీ తాతయ్య.
సుగుణ: మీ అమ్మానాన్న కూడా రావాలి.
హిమజ: మేం పరిగెత్తలేం బాబూ!
సుగుణ: సిగ్గులేదేమే ఆ మాటనడానికి? నిండా ముప్ఫై ఏళ్లు కూడా నిండలేదు ఇద్దరికీ. లేవండి! ఇంకా పదకొడున్నరేగా అయింది.
శ్రీకర్: (నవ్వుతూ) చెప్పండి అత్తయ్యా, ఏం చేయాలో?
అర్జునరావు: అదిగో, ఆ యాకలిప్టస్ చెట్ల దగ్గర అందరం నిలబడాలి. నేను వన్,టు, త్రి అంటాను. త్రి అనగానే అందరం గబగబా పరుగెత్తాలి. పరుగెత్తి దూరంగా కనబడుతుందే ఆ వాటర్ ఫౌంటెన్, దాని దగ్గరకు వెళ్లి మళ్లీ చెట్ల దగ్గరకు రావాలి. ఎవరు ముందు వస్తే వారు విన్నర్. (గొంతు తగ్గించి) ఎలాగైనా విద్య గెలిచేలా చూడాలి.
(రన్నింగ్ రేస్ ప్రారంభమయ్యింది. తాతయ్య ‘త్రి’ అనగానే విద్య తూనీగలా పరుగెత్తింది. ఫౌంటెన్ వద్దకు వెళ్లి, గిరుక్కున తిరిగి మళ్లీ చెట్ల దగ్గరకొచ్చింది. వీళ్లంతా వెనక పడిపోయారు. విద్య కళ్లల్లో విజయ గర్వం!)
విద్య: అమ్మా! నేనే విన్నర్! మీరంతా ఓడిపోయారు.
సుగుణ: మా విద్య ఎప్పుడూ విన్నరే! బంగారుతల్లి!
(అక్కడ ఒక పెద్ద మంటపం ఉంది. దానికి నాలుగు స్తంభాలున్నాయి. అక్కడికి తీసుకువెళ్లాడు తాతయ్య)
అర్జునరావు: విద్యా చూశావా? ఒక్కో స్తంభం వద్ద ఒక్కొక్కరు చొప్పున నిలబడాలి. మధ్యలో ఒకరు. మీ అమ్మమ్మ పాట పాడుతూంటూంది. ఒక స్తంభం నుండి ఇంకో దానికి అందరూ తిరుగుతుండాలి. అమ్మమ్మ పాట టక్కున ఆపుతుంది. అప్పుడు స్తంభం దగ్గర లేకుండా మధ్యలో ఎవరుండిపోతారో వారే దొంగ.
విద్య: భలె భలే! ఈ ఆట చాలా బాగుంది (ఆట ప్రారంభమయింది)
సుగుణ: ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసనుంటే’ (అని పాడుతూంటూంది)
అర్జునరావు: మీ అమ్మ చూడు హిమజా, నేను పక్కనలేనని బాధపడుతూంది!
సుగుణ: (సిగ్గుతో) చాల్లెండి ఏమిటా మాటలు పిల్లల ముందు!
శ్రీకర్: (హిమతో మెల్లిగా) హిమా, ఆ వయసులో ఎంత ఎనర్జిటిక్‌గా, జాలీగా ఉన్నారో చూశావా మామయ్య వాళ్ళు! మనం కూడా అలా ఉండాలి. రాను రాను మనం మరీ యాంత్రికంగా తయారవుతున్నాం కదూ!
హిమజ: అవునండి! మనం కూడా మారాలి (మనస్ఫూర్తిగా అంటుంది)
(పాట ఆగుతూనే శ్రీకర్ ‘దొంగ’ అవుతాడు. తర్వాత తాతయ్య. విద్య మాత్రం చివరివరకు స్తంభం వదలదు. విద్యను విన్నర్‌గా డిక్లేర్ చేస్తారు.)
విద్య: అమ్మమ్మా నాకు ఆకలేస్తుంది!
(హిమజ ఆశ్చర్యంగా చూస్తుంది కూతురి వైపు, ఆనందంగా కూడా)
సుగుణ: పదండి, భోజనాలు చేద్దాం!
లైట్లు ఆరిపోతాయి.
దృశ్యం-12
లైట్లు వెలుగుతాయి.
(రాత్రి అందరూ భోజనాలు చేస్తుంటారు. అన్నంలో ఆకుకూర పప్పు కలిపి పాపకిస్తుంది అమ్మమ్మ)
హిమజ: అదేం ఆకు అమ్మా? ఎప్పుడు తెచ్చావు?
సుగుణ: దాన్ని పొన్నగంటి కూర అంటారు. కంటి జబ్బులకు అద్భుతంగా పనిచేస్తుంది పప్పుతో వండాను.
(విద్య పప్పన్నం తినేసింది. అమ్మమ్మ కొద్దిగా అన్నంలో ఏదో పొడి వేసి కలిపి నెయ్య వేసి మళ్లీ కలిపింది. విద్య అది కూడ ఇష్టంగా తిన్నది.)
హిమజ: ఈ పొడి ఎప్పుడు చేశావే?
అర్జునరావు: పార్కు నుంచి వచ్చేటప్పుడు మార్కెట్కు వెళ్లాం హిమజా. పొన్నగంటి కూడా, మునగాకు తెచ్చాము. మునగాకు పొడి అమ్మ ఇప్పుడే కొట్టింది. చిరుచేదు రాకుండా తెల్లనువ్వులు వేయించి కలిపి మిక్సీలో వేసింది.
సుగుణ: నాకు పెరుగన్నం కావాలి. అరే పెరుగు అందరికీ సరిపోదే?
విద్య: అయితే ముందు నాకు పెరుగన్నం కలిపి పెట్టు.
సుగుణ: దొంగ భడవా! అయితే ఒక షరతు.
విద్య: ఏమిటది అమ్మమ్మా, చెప్పు త్వరగా.
అర్జునరావు: మనం మామిడి పళ్లు తెచ్చాం కదా! రసాలు! ఆ గుజ్జు తీసి పెరుగన్నంలో కలిపిస్తా! తినేయాలి సుమా!
విద్య: (మామిడిపండు గుజ్జు కలిపిన పెరుగన్నం తింటూ) తాతయ్యా! భలే వుంది. మ్యాంగో ఐస్‌క్రీం కంటే బాగుంది.
(అందరూ హాల్లో కూర్చుంటారు. విద్య సోఫాల్లోంచి క్రిందకు దూకసాగింది.)
హిమజ: ఏయ్! వద్దు, పడిపోతావు. సోఫాలు పాడవుతాయి.
సుగుణ: ఏం పడిపోదు, సోఫాలకేమీ కాదు. నీవు దూకు తల్లీ! వెరీగుడ్! సూపర్! (అంటూ ఎంకరేజ్ చేస్తుంది)
అర్జునరావు: పిల్లలను అలా కంట్రోల్ చేయకూడదు తల్లీ! వాళ్లు జలజలపారే సెలయేర్లు. దబదబ దుమికే జలపాతాలు. ఈ జనరేషన్ దురదృష్టం, పిల్లల బాల్యాన్ని అత్యంత అసహజంగా గడిపేలా మనమే చేస్తున్నాం. వాళ్ల ఉత్సాహాన్ని అణచివేసి, వాళ్లను చదువుకునే యంత్రాలుగా తయారు చేస్తున్నాం.
హిమజ: సారీ నాన్నా (గిల్టీగా తలవంచుకుంటుంది).
అర్జునరావు: సారీ ఎందుకు తల్లీ. ఇప్పటికైనా అర్థమైతే అంతే చాలు.
శ్రీకర్: మీరు రావడం మాకు తత్త్వం బోధపడింది మామయ్య. ఇంతవరకు పాపను పెంచడంలో నిర్లక్ష్యం వహించాము.
హిమజ: నేను జాబ్ మానేద్దామనుకుంటే, హోమ్ లోన్, పాప కోసం ఇన్వెస్ట్‌మెంట్, ఇంకా కొన్ని ఇ.ఎమ్.ఐలు, ఆయన ఒక్కరి జీతంలో కట్టలేం నాన్నా! ఐ కాన్ట్ అఫర్డ్ టు బి ఎ హౌస్ వైఫ్!
సుగుణ: జాబ్ మానేయాలని ఎవరన్నారమ్మా! పాపకు సరైన ఆహారం, వ్యాయామం ఉండాలి. మీరు కూడా స్మార్ట్ ఫోన్లు పట్టుకని కూర్చోకుండా, దాన్ని ఎంగేజ్ చేయాలి. సాధ్యమైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీ కల్పించాలి. స్కూల్లో మెంటల్ యాక్టివిటీ ఉంటుంది కదా!
అర్జునరావు: ‘స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’ తప్పదు అల్లుడుగారు! కాని అందులోనే కొంత సమయం హెల్త్‌కు ఫిట్‌నెస్‌కు తప్పనిసరిగా కేటాయించాలి. “హెల్త్ ఈజ్ వెల్త్” అన్నారు కదా! ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వేస్ట్!
సుగుణ: అమ్మాయ్. రోజూ ఉదయం పొన్నగంటాకు రసం అరగ్లాసు, బెల్లం కలిపి పాపకు పట్టు. పప్పులో వేసి పెట్టు. మునగాకు పొడి, నెయ్యి వేసి అన్నంలో పెట్టండి. కళ్లకు చాలా మంచివి. డైజెషన్‌కు కూడా!
అర్జునరావు: రోజూ రెండు పూటలా ఏదో ఒక పండు తప్పనిసరిగా పెట్టండి బంగారుతల్లికి. పళ్లు తినకనే ఈ రోగాలన్నీ వచ్చేది!
సుగుణ: నూడుల్స్, పీజాలు, బర్గర్లు ఎప్పుడైనా తినొచ్చుకాని, అవే ఆహారం అయితే ఎలా? అన్నింటిలో ‘మైదా’ కలుపుతారు. అది చాలా చెడ్డది. అవసలు మన భారతీయ ఆహారమే కాదు.
అర్జునరావు: ఒక కిలోమీటరు వరకు పాపను నడిపించండి. కబుర్లు చెబుతూంటే హ్యాపీగా నడుస్తారు పిల్లలు. ఈ రోజు పార్కు నుంచి నడిచే వచ్చాం తెలుసా? పార్కులో పరిగెత్తించండి బాగా! ఎముకలు బలంగా తయారవుతాయి.
తవిటమ్మపై ఒక కన్నేసి ఉంచండి. సెల్‌ఫోన్ దానికి మప్పింది ఆ అమ్మాయే! మీరు లేనప్పుడు పాపను చూసుకునేది ఆ పిల్లే కద! దానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి.
లైట్లు ఆరిపోతాయి.
(మూడు నెలలు గడిచాయి. విద్య పూర్తిగా సెల్‌ఫోన్ చూడడం మానేసింది)
సుగుణ: విద్యా, పద స్నాక్స్ తిందువుగాని, మనం ఈరోజు శివాజీ పార్కుకు వెళ్లొద్దూ?
విద్య: ఈ రోజు ఏం స్నాక్స్ చేశావు అమ్మమ్మా .
సుగుణ: లేత మొక్క జొన్న పొత్తులు! మంటపై దోరగా కాల్చి, ఉప్పు, కారం, నిమ్మకాయ రసం పూశాను.
విద్య: నాకు గింజలు వలిచి పెట్టవా ప్లీజ్!
సుగుణ: ఛీ, ఛీ, అలా తింటే ఏం మజా వస్తుంది? పళ్లతో పీక్కొని తినాలి పొత్తును. (విద్య మొక్క జొన్న పొత్తును ఎంజాయ్ చేస్తూ తింటుంది)
(శివాజీ పార్కులో ఒక ఆర్టిఫిషియల్ హిల్ నిర్మించారు. బండరాళ్లతో అచ్చం కొండలాగే. ఎక్కడానికి మధ్యలో గ్యాప్స్ ఇచ్చారు)
అర్జునరావు: విద్యా, మనం ఈ రోజు ట్రెక్కింగ్ చేద్దామా?
విద్య: ట్రెక్కింగా? అంటే ఏమిటి తాతయ్యా?
సుగుణ: కొండ ఎక్కడం తల్లీ! అదిగో ఆ కొండే!
విద్య: అమ్మో! నాకు భయం! క్రింద పడిపోతే?
అర్జునరావు: ఏం పడిపోవు! మేం లేమూ! సైడ్‌కి రెయిలింగ్ కూడ ఉంటేను! పదండి ఎక్కుదాం!
(బండరాళ్ల మధ్య స్లోప్ ఉంది. జారకుండా గ్రిప్ కోసం మధ్యలో రాళ్లు పాతారు. వాటిని బేస్ చేసుకొని, ముందు తాతయ్య, తర్వాత విద్య, తర్వాత అమ్మమ్మ ఎక్కసాగారు. పైకి చేరడానికి ఇరవై నిమిషాలు పట్టింది. పాపకు బాగా చెమట పట్టింది. కానీ ఆయాసం రాలేదు. అమ్మమ్మకు తాతయ్యకు ఆయాసం వచ్చింది. కొండపైన చదునుగా ఉండి. బెంచీలు వేసి ఉన్నాయి దూరంగా సముద్రం, చల్లని గాలి విసురుగా వీస్తూంది. కాసేపు కూర్చున్నారు. క్రిందికి దిగేది వేరే దారి. విద్య సులభంగా పరుగుతో దిగేసింది)
విద్య: తాతయ్యా! ట్రెక్కింగ్ ఈజ్ సూపర్! భయం లేదు అమ్మమ్మా! పోయింది.
అర్జునరావు: దటీజ్ అవర్ విద్య! గుడ్ గర్ల్!
(ముగ్గురూ పార్కు బయటకు వస్తారు. వేడివేడి పునుగులు తినిపిస్తాడు. తాతయ్య, నిమ్మకాయ షర్బత్ తాగుతారు. ఆటో పిలవబోతే వద్దంటుంది విద్య. కాసేపు సరదాగా నడుద్దామంటుంది. ముగ్గురూ కిలోమీటరు పైగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారు. దారిలో పెద్ద బెలూన్ కొంటుంది అమ్మమ్మ)
(రాత్రి ఎనిమిదిన్నర. అందరూ భోజనాలు చేస్తుంటారు)
విద్య: అమ్మమ్మా, సాంబారులో ముల్లంగి, ఆనపకాయ, క్యారెట్ ముక్కలు నాకు ఎక్కువ వెయ్యి. ఉట్టివి తినేస్తా! ఎంత బాగుంటాయో! (అంటూ వేయించుకుంటుంది)
హిమజ: ఎంతగా మార్చేశారే అమ్మా మీ మనవరాలిని!
తవిటమ్మ: మన విద్యమ్మ నన్న కూడ సెల్ఫోన్ చూడనివ్వడం లేదండి అమ్మగారు.
(అందరూ నవ్వుతారు)
అర్జునరావు: అల్లుడూ, మేం రేపు మా ఊరికి బయలుదేరతాం. ఉదయం వైజాగ్, బరంపురం ఒరిస్సా ఆర్‌టిసి బస్ ఉంది. దానికి రిజర్వేషన్ అవసరం లేదు.
హిమజ: ఇంకా కొంతకాలం ఉండొచ్చుగదే అమ్మా!
సుగుణ: ఇక చాలు! మీకు మా అవసరం లేదు! (మళ్ళీ నవ్వులు)
లైట్లు ఆరిపోతాయి.
దృశ్యం-13
(విశాఖపట్నం ఆర్‌టిసి కాంప్లెక్స్. విశాఖ నుంచి బరంపురం వెళ్లే ఓయస్ ఆర్‌టిసి బస్సు సిద్ధంగా ఉంది. సమయం ఉదయం 7 గంటలు. టెక్కలి, పలాస, ఇచ్చాపురం మీదుగా ఆ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ బస్సు మధ్యాహ్నం 12 గంటలకు బరంపూర్ చేరుతుంది. సుగుణ, అర్జునరావులకు వీడ్కోలు ఇవ్వడానికి హిమజ, శ్రీకర్, పాపను తీసుకొని వచ్చారు. విద్య కాంప్లెక్స్‌లో పరుగులు తీస్తూంది. ఆరోగ్యంతో, ఉత్సాహంతో తుళ్లిపడుతోంది.)
హిమజ: (మురిపెంగా కూతుర్ని చూసుకుంటూ) ఈ మూడు నెలల్లో బాగా సన్నబడిందే విద్య! యాక్టివ్‌నెస్ బాగా పెరిగింది.
శ్రీకర్: కాన్‍స్టిపేషన్ ప్రాబ్లం పూర్తిగా పోయినట్లే! మామయ్యా! మీరు చేసిన మేలు మరచిపోలేం! వుయ్ ఆర్ ఇన్‌డెడెట్ టు యు.
హిమజ: పాపను మళ్లీ మనుషుల్లో పడేశారే మీరు అమ్మా (ఆమె గొంతుగాద్గదికమవుతుంది) ఒక దశలో, ఏమైపోతుందో అనుకున్నాం.
సుగుణ: పిచ్చిపిల్లా! మేం చేసిందేముందే! అంతా ప్రకృతిలోనే ఉంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే సరి. మనం ప్రకృతిని మరిచిపోయి కృత్రిమంగా బ్రతకబట్టే ఈ గొడవంతా!
శ్రీకర్: మొన్న మళ్లీ ఐ టెస్ట్ చేయించాను. సైట్ పూర్తిగా నార్మల్ అని చెప్పారు అత్తయ్యా! (అతని కళ్లలో వెలుగు) ఇక గ్లాసెస్ అవసరం లేదని చెప్పారు డాక్టరుగారు.
అర్జున్‍రావు: హోమియోపతిలో నాకున్న మిడిమిడి జ్ఞానంతో ‘యూమ్రేషియా’ డ్రాప్స్ రోజూ కంట్లో వేశాను. అల్లుడూ! అది కంటిన్యూ చేయండి. డైజెషన్‌కు ‘నక్స్ వామికా’ రోజు ఆరు మాత్రలు వేయండి. మంచి మందులవి. రెగ్యులర్‍గా వాడండి.
శ్రీకర్: తప్పకుండా మామయ్యా.
విద్య: తాతయ్య, నేనూ వస్తాను మీతో (గారాబంగా అంటుంది)
సుగుణ: పరీక్షలయ్యాక సెలవులిస్తారు కదమ్మా, బోలెడు. అప్పుడు వద్దువుగానిలే తల్లీ. యిప్పుడు వస్తే స్కూలు మిస్ అవుతావు.
విద్య: అమ్మమ్మా, నీవు నేర్పించావే పద్యం. అది మొన్న స్కూలు ప్రేయర్లో పాడాను తెలుసా! అందరూ మెచ్చుకున్నారు. మా హెడ్మాస్ అయితే “రోజూ పాడమ్మా విద్యా” అంది.
హిమజ: ఏమిటా పద్యం? ఒకసారి పాడమ్మా
సుగుణ: ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై’ అన్న పోతన గారి పద్యం చక్కగా నేర్చుకుంది.
అర్జునరావు: ఇంకా ‘శ్రీరాముని దయచేతను’, ‘శుక్లాంబరధరం’, ‘సరస్వతీ నమస్తుభ్యం’, ‘రామాయ రామభద్రాయ’ వంటి శ్లోకాలు, కొన్ని వేమన పద్యాలు నేర్పాం. దాని గొంతు కూడా బాగుంటుంది.
(హిమజ శ్రీకర్ లిరువురూ బస్టాండులోనే వారి పాదాలకు నమస్కరిస్తారు)
అర్జునరావు: అబ్బాయీ! ఒక్కటే గుర్తుపెట్టుకోండి. పిల్లలు ‘స్మార్ట్’ గా ఉండాలంటే స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండాలి. కనీసం ఒక వయసు వచ్చేంతవరకు లేకపోతే డీ’స్మార్ట్’ అయ్యే ప్రమాదం ఉంది! బి అలర్ట్! శుక్రాచార్యులవారు సప్త వ్యసనాలే చెప్పారు. ఈ అష్టమ వ్యసనం ఆయనకు తెలియదు పాపం.
సుగుణ: టెక్నాలజీ అనేది జీవితం అనే వంటలో ఉప్పులాంటిది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. లేకపోతే అది మొత్తం జీవితాన్నే దెబ్బతీస్తుంది. ఉప్పెక్కువైతే వంటను తినగలమా? సెల్‌ఫోనూ అంతే! మితిమీరితే ఏదైనా ప్రమాదమే! అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు పెద్దలు.
అర్జునరావు: యంత్రాన్ని మనం శాసించాలి కాని, అదే మనల్ని శాసించకూడదు. అదిగో! డ్రైవర్ ఎక్కి కూర్చున్నాడు విద్యలూ! ఒక ముద్దివ్వు బంగారూ! (విద్య అమ్మమ్మకు తాతయ్యకు, అమ్మమ్మకు బుగ్గలమీద ముద్దిచ్చింది. పాప కళ్లల్లో కించిత్తు దిగులు. ఇద్దరూ బస్ ఎక్కి కూర్చుంటారు)
సుగుణ: అమ్మాయి! ఆనప, బీర, కీర, దోస, ముల్లంగి, క్యారెట్ రెగ్యులర్‌గా వాడడం మరిచిపోవద్దు. ఫ్రూట్స్ తప్పకుండా రోజూ వాడాలి. ఇంకా..
అర్జునరావు: ఇక చాలు వాళ్లకు వినపడదు (నవ్వుతూ).
లైట్లు ఆరిపోతాయి.
(సమాప్తం)