(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[షూటింగ్ లంచ్ బ్రేక్‍లో అందరూ కలిసి భోం చేస్తుంటారు. ప్రమోద్ కుమార్ ఇంటి నుంచి వచ్చిన పదార్థాలని ఆయనే అందరికీ స్వయంగా వడ్డిస్తాడు. తింటూ సెన్సార్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ మధ్య ఎన్నో విషయాలు చర్చకి వస్తాయి. ఆ వివరాలను నోట్ చేసుకుంటుంది అల. సినిమా సినిమాకీ బాంధవ్యం పెరుగుతుందనీ, క్రమంగా సొంతవాళ్ళతో బాంధవ్యం కొద్దిగా తగ్గుతుందని అనుకుంటుంది అల. ఇంకా ప్రారంభం కావల్సిన సత్యమోహన్ గారి సినిమాని, హిందీ ‘ధీర’ తదుపరి షెడ్యూల్‍లో పాల్గొనాల్సి ఉందని గుర్తుచేసుకుంటుంది. వినోద్ కపూర్, కమల్ జీత్, తరుణీ కిద్వాయ్‍లను గుర్తు చేసుకుంటుంది. సాయంత్రం ఇంటికి ఫోన్ చేస్తే, అమ్మ ఒక్కర్తే ఇంట్లో ఉండడంతో తల్లీకూతుళ్లు మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఎక్కడ ఉన్నా ధైర్యంగా, క్షేమంగా ఉండమని అల అమ్మ చెప్తుంది. మర్నాడు ఉదయం ఆరింటికి మహతి ఫోన్ చేసి సాయంత్రానికల్లా నీ దగ్గర ఉంటాను అని అలకి చెబుతుంది. కనకాక్షితో ఇల్లంతా శుభ్రం చేయిస్తుంది అల. సదాశివరావు గారికి ఫోన్ చేసి చెప్తుంది. సత్యమోహన్ గారికి కూడా చెప్పమంటారాయన. కళ్యాణిగారికి ఫోన్ చేసి చెప్తే, అలనీ, మహతిని తమ ఇంటికే వచ్చేయమంటుంది. సాయంత్రం మహతి వచ్చాకా, ఆ రాత్రికి కళ్యాణి గారింటికి తీసుకువెళ్తుంది అల. కళ్యాణి గారితో కబుర్లు చెప్పుకుని భోజనం చేసేసరికి రాత్రి 12.30 అవుతుంది. మర్నాడు ఉదయం కాఫీ తాగుతూ తాను హైదరాబాద్ ఎందుకు రావల్సి వచ్చిందో చెబుతుంది మహతి. తన తండ్రి మేనత్త కూతురు ఇందిర గారి నుంచి ఫోన్ వచ్చిందనీ, అందుకే వచ్చామని అంటుంది మహతి. ఖచ్చితమైన కారణం తెలియకపోయినా, బహుశా హెల్త్ కండీషన్ కావచ్చని అభిప్రాయపడుతుంది కళ్యాణి. మరో గంటలో బయల్దేరి వెళ్తానుగదా, అసలు కారణం తెలుస్తుంది, మీకు చెప్తాను అంటుంది మహతి. మా డైరక్టర్ గారినీ, సదాశివరావు గారినీ ఎప్పుడు కలుస్తావని అల అడిగితే, ఈ ట్రిప్‍లో అందరినీ కలిసే వెళ్తానని అంటుంది మహతి. ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయమని చెప్తుంది కళ్యాణి. – ఇక చదవండి.]
మహతి-2 అల-20:
[dropcap]“అ[/dropcap]ర్జెంటుగా వచ్చెయ్” అని మహతి అమ్మగారు అహల్య ఫోన్ చేశారు. అప్పటికే కళ్యాణి గారు చేసిన ఇడ్లీ, గారెలని గబగబా తినేని బయలుదేరింది మహతి.. కళ్యాణిగారు ఓ కారు, డ్రైవర్‌నీ ఇచ్చి, “మహీ.. హైదరాబాద్‌లో వున్నన్నినాళ్ళు యీ కారునీ, డ్రైవర్‍నీ మీ దగ్గరే వుంచుకోండి. మరో గది రెడీ చేయిస్తా. ఇక్కడ హాయిగా ఉండొచ్చు.” అన్నది
“థాంక్స్ అమ్మా, ప్రస్తుతం కారు, డ్రైవరూ చాలు. మీ మేలు జన్మలో మరచిపోలేను.” అన్నది మహి. కృతజ్ఞత అనేది కళ్ళలో కనిపిస్తుందని ఆనాడు చూశాను.
“నీ మొహం” చిన్నగా నవ్వింది కళ్యాణి గారు.
“నేనూ రానా?” అన్నాను.
“వద్దు అలా. ఎందుకంటే, ఎందుకు నన్ను తీసుకొచ్చారో నాకూ తెలియదు. రెండోది నువ్వు సెలెబ్రిటీవి. ఐసియులో అన్‌కాన్సస్‌గా పడివున్న వాళ్ళు కూడా నువ్వొచ్చావని తెలిస్తే సెలైన్ బాటిల్స్ పీకేసి మరీ వస్తారు, సెల్ఫీల కోసం. కనుక నువ్విక్కడే రెస్టు తీసుకో, నేను వెళ్ళి వచ్చెద గాక!” అంటూ కారెక్కింది మహి.
అంత టెన్షన్‍లో వుండి కూడా దాని సెన్స్ ఆఫ్ హ్యూమర్‍కి నాకు నవ్వోచ్చింది. కళ్యాణి గారైతే పడీపడీ నవ్వి, “నువ్వు హాస్పటల్‌కి వెడితే ఎంత హడావిడి జరుగుతుందో! అలా జరుగుతుందని ముందే వూహించిన మహి నిజంగా ఇంటిలిజెంట్” అని మెచ్చుకున్నది.
***
కళ్యాణి గారు వంటకి రెడీ చేస్తుండగా నేనూ, కూరలు తరుగుతూ కబుర్లు చెప్పసాగాను.
“ఇవ్వాళ ఎక్‌స్ట్రా పెరుగన్నం అంటే curd rice చేసున్నాను. ఎందుకో చెప్పు చూద్దాం?” అన్నది కల్యాణిగారు.
“నేనొచ్చానని కదూ!” ఆవిడ్ని కావలించుకుని అన్నాను.
“యస్.. ఫస్ట్ కారణం అదే. మరొక కారణం ఏమంటే, హాస్పటల్లో పరిస్థితులు మనకి తెలియవు గదా! డ్రైవర్‍కి ఇచ్చి కర్ట్ రైస్ సాంబార్ రైసూ పంపితే వాళ్ళ కాస్త స్తిమిత పడవచ్చు.” అన్నది కళ్యాణి గారు.
ఆమె కన్సర్న్‌కు నాకు కళ్ళు చెమ్మగిల్లాయి.
“మీలా ఆలోచించడం నాకు యీ జన్మలో వస్తుందా అమ్మా?” అన్నాను.
“పిచ్చిదానా, ఎందుకు రాదూ? అన్నీ జీవితమే నేర్పుతుంది” నా తల నిమిరి అన్నది. కూరలు తరుగుతూ మా అమ్మని తలచుకున్నాను. ఏనాడూ అమ్మకి కూరలు తరిగివ్వలా. అదే మాట కళ్యాణి గారితో అన్నాను.
“ఒకవేళ నువ్వు చేస్తానన్నా ఆవిడ చెయ్యనివ్వదు. ఎందుకో తెలుసా? నీ పెళ్ళి అయ్యాక అత్తవారింట్లో ఎలాగూ తప్పదుగా! అఫ్ కోర్స్.. అది అప్పటి విషయం.” అన్నది.
“మరి ఇప్పుడు?”
“పది మంది వంటవాళ్ళను నువ్వే పెట్టుకోగలవు!” పకపకా నవ్వి అన్నది కళ్యాణి గారు.
“పదిమందా?” షాక్‌తో అన్నాను.
“అమ్మాయ్! డబ్బుకీ దర్పానికీ చాలా దగ్గరి చుట్టరికం వుంది. మా వూళ్లో ఓ పెద్దాయన ఆన్నాడు. బాగా డబ్బు సంపాయించాడు. గుర్రబ్బండి నించీ కాస్ట్లీ కారు దాకా అన్నీ కొన్నాడు. గొప్పగొప్ప వాళ్ళందరిని భోజనానికి పిలిచి, ‘అయ్యా ఇతను ఢిల్లీ నించి రప్పించిన కుక్.. బ్రహ్మాండంగా ఆలూ పరాట, సమోసా, టిక్కీ, నార్త్ ఇండియన్ డిషెస్ అద్భుతంగా చేస్తాడు. అదిగో, ఆ బట్టతల వాడు బెంగాల్ నుంచి వచ్చాడు. బెంగాలీ స్వీట్స్‌ని అదరగొట్టేస్తాడు. రసగుల్లా, సందేశ్, క్షీరమోహన్ చెయ్యడంలో ఇతన్ని కొట్టే వాళ్ళు లేడు. అదుగో, ఆవిడ పాలకొల్లు నించి వచ్చింది. ఈస్ట్ గోదావరి స్పెషల్స్‌కి పెట్టింది పేరు’ అంటూ వంట వాళ్ళని పరిచయం చేసి తెగ స్పెషల్స్ చేయించేవాడు. వాళ్ళు వెళ్ళేప్పుడు దండిగా బుట్ట నిండా స్వీట్లు హాట్సు పెట్టి పంపేవాడు, ఘనమైన కానుకలతో పాటు” చెప్పింది కళ్యాణి గారు.
“ఎందుకూ?”
“ఎందుకా? ద్విభాషా హీరోయిన్ అలగారు ఎప్పుడో ఒకప్పుడు ఏ ఇంటర్యూలోనో, ‘కళ్యాణిగారు పులిహోర బొబ్బట్లూ సూపర్‌గా చేయడమే గాక డబ్బాల నిండుగా నాకు ఇచ్చి పంపేది’ అని నువ్వు ఒక్కమాట అంటే నా జన్మ తరించి పోదా! నా వాళ్ళందరి ముందూ నా లెవెల్ అమాంతం పెరగదా!!” పకపకా నవ్వి కళ్యాణి గారు నా బుగ్గని ప్రేమగా ముద్దు పెట్టుకుంది.
“అయితే ఇవ్వాళే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా” నేను నవ్వేసి అన్నాను.
***
సత్యమోహన్ గారు ఫోన్ చేశారని కనకాక్షి ఫోన్ చేసి చెప్పింది. వంటలు అప్పుడే అయ్యాయి.
“నువ్వు కేరేజీలో పేక్ చేసి భోజనం పట్టుకెళ్దువు గాని. నేనూ పెరుగన్నం, సాంబారన్నం పేక్ చేసి, నిన్ను ఇంట్లో దింపి హాస్పటల్‌కి వెళ్ళాను. వాళ్ళకి ఇచ్చి వచ్చాకా నీకు ఫోన్ చేస్తాను” అన్నది కళ్యాణి గారు.
“సరేనమ్మా” అన్నాను.
చక్కని హాట్ పేక్స్‌లో నాలుగు కర్డ్ రైస్, నాలుగు సాంబార్ రైస్ పేక్ చేసి నంజుకోవడం కోసం నాలుగు జిప్ లాక్ పేకెట్లలో ఆవకాయ పేక్ చేశారు. నాలుగు ప్లేట్స్ కూడా తీసి, అన్నీ ఓ బుట్టలో పెట్టి, నాలుగు వాటర్ బాటిల్స్ కూడా ఆ బుట్టలో పెట్టారు. ఆ శ్రద్ధ, ఆ పొందిక చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది.
“నాలుగోదెవరికి?” అన్నాను.
“నాకే. ఒక్కోసారి కాస్త ప్రెజర్ పెడితే తప్ప హాస్పటల్లో తినడానికి ఎవరూ ఇష్టపడరు. నేనూ భోజనం చెయ్యలేదంటే, వారు తప్పక తింటారు. ఇక డ్రైవర్ సంగతంటావా.. అతను వెళ్ళే ముందే డబ్బులు ఇచ్చి పంపించాను.” అన్నది కళ్యాణి గారు.
ఏ పని అయినా చక్కగా, సూక్ష్మంగా ఆలోచించి చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రోజున కళ్యాణి గారి దగ్గర నేర్చుకున్నాను. ‘మహీ’ని కేవలం గెస్టుగా భావించి, అతిథి మర్యాదలతో పంపలేదు. మహిని మొదట మనిషిగా, అతిథిగా, ఆప్తురాలిగా చూశారు కళ్యాణి. అంతేకాదు ఏవి అవసరమవుతాయో ఆలోచించి అవి సిద్ధం చేశారు.
మిగతా వారిలా ఆవిడ ఏ విషయాన్ని కేజువల్‍గా తీసుకోలేదు. అన్నట్టు గానే నన్ను ఇంట్లో దింపి తను హాస్పటల్‍కి వెళ్ళింది కళ్యాణి గారు.
నేను సత్యమోహన్ గారికి ఫోన్ చేశాను.
“ఏం లేదమ్మా. మొదట అనుకున్న కథ చాలా బాగుంది. అందులో ఏ సందేహమూ లేదు.. కానీ ఇప్పటి నీ స్టేచర్‍కి అది ఎంతవరకూ పనికొస్తుందో తెలీటం లేదు. అందుకే చాలా మార్పులు చేశాము. నీకూ ఒకసారి వినిపించి, నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫోన్ చేశాను. అదీ కాక మహతి వచ్చిందని సదాశివరావు గారు చెప్పారు. మహతిని కూడా కలవాలని ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో నించి బయటపడేసిందిగా.” అన్నారు సత్యమోహన్.
“అలాగేనండి. ప్రస్తుతం తను వాళ్ళ బంధువుల కోసం ఓ హాస్పటల్‌కని వెళ్ళింది” అన్నాను.
“అయితే ఇవాళ సాయంకాలం వీలుంటే ఓ రెండు గంటలు మనతో గడపగలదేమో కనుక్కో. తనకీ కథ చెబుతాను.” అన్నారు సత్యమోహన్.
‘సరే’ అని ఫోన్ పెట్టేశాను. రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల నిద్ర వచ్చేలా అనిపించింది. హాయిగా పడుకున్నాను. నిద్రాదేవి ఎంత దయ గల దేవతో!
***
సాయంత్రం 4.30కి మహతి నా ఇంటికి (కళ్యాణి గారిల్లు) వచ్చింది. చాలా డిస్టర్బ్‌డ్‌గా వుంది. రాగానే “అలా నేను కాసేపు పడుకుంటానే.. తలనొప్పిగా వుంది” అన్నది.
“అలాగే” అన్నాను. అప్పటికే నేను సత్యమోహన్ గారిని కలవడానికి సిద్ధంగా వున్నాను. మహతికి ఏం చెప్పాలో తెలీలేదు. అప్పుడు తను నా వంక చూసింది. “ఓహ్.. డ్రెస్ అయి వున్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా?” అంది. అప్పుడు చెప్పాను – మమ్మల్నిద్దర్నీ సత్యమోహన్ గారు స్టోరీ డిస్కషన్‌కి పిలిచారని.
ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు తరువాత అన్నది.. “సరే నేనూ వస్తాను” అని.
“అలసిపోయావుగా మహీ, తరువాత కలుస్తామని చెబుతాను” అన్నాను.
“అలసిపోవడం నిజమే, అది మానసినమైన అలసట. అది పోవాలంటే నిద్ర తోనో, మౌనంతోనో పోదు. ఏదో వేరే విషయాన్ని బలవంతంగానైనా ఆలోచించి మనసు దారిని మళ్ళించాలి.” నాతో అని బాత్రూమ్ లోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది. సల్వార్ కమీజ్ వేసుకుని సిద్ధమైంది.
“ఇలా నువ్వు ఎప్పుడూ డ్రెస్ చేసుకోలేదా!” అన్నాను.
“బండి నేర్చుకోవాలంటే ఇదే కంఫర్టబుల్” నవ్వి అన్నది.
“బండి నడుపుతున్నావా?” ఆశ్చర్యంగా అడిగాను.
“బండే కాదు, కారూ ట్రాక్టరూ కూడా నడపగలను. ఛాన్సు దొరికితే లారీ బస్సూ కూడా నడపడం నేర్చుకుంటాను.” బొట్టు పెట్టుకుంటూ అని, రెడీ అన్నట్టు తల వూపింది.
“నువ్వో ఆశ్యర్యాల గంపవి” నవ్వి బయలుదేరాను.
“ఈ లోకంలో నేర్చుకోవలసినవి ఎన్ని కోట్ల పనులున్నాయో తెలుసా? వాటిల్లో ఇదెంత! క్షణాన్ని వృథాగా గడపకుంటే కావాల్సినంత టైమ్ మన చేతిలో వుంటుంది. టైపూ షార్ట్‌హ్యాండూ కూడా నేర్చుకున్నా. ఇంకా నేర్చుకోవలసినవి చాలా చాలా వున్నాయి.” అన్నది.
“ఎందుకు? అన్ని విద్యలు నేర్చి ఏం చేస్తావూ?” అడిగాను.
“ప్రస్తుతానికి ఏదీ చెప్పలేను. కానీ ఫ్యూచర్‍లో చెప్పగలను.. ఈ విద్యలన్నీ దేనికి వుపయోగపడతాయో!”
సత్యమోహన్ గారు పంపిన కార్లో నాతో పాటు వెనక సీట్లో కూర్చుని అన్నది మహతి.
***
సత్యమోహన్ గారూ, సదాశివరావుగారూ, వసంత్‍కుమార్ గారూ, డైలాగ్ రైటర్ శివసాగర్ అందరూ మహతిని చూసి ఆనందపడ్డారు. “మీ గురించే సత్యమోహన్ గారూ, సదాశివరావు గారూ మాట్లాడుకుంటుంటే విన్నాను. సో హేపీ టూ మీ యూ” అన్నారు శివసాగర్, వసంత కుమార్.
“అల చెప్పేవన్నీ నా మీద ప్రేమతో చెప్పిన అతిశయాలే. నా మీద మీరు మాట్లాడుకునేంత గొప్పదాన్ని కాదు” చిన్నగా నవ్వి అన్నది మహతి.
ప్లెజంటరీస్ అన్నీ అయ్యాకా, కథ చెప్పడం మొదలుపెట్టారు సత్యమోహన్‍గారు. అద్భుతంగా వుంది. రెండున్నర గంటల పాడు నేను కథని వినలేదు. మనోనేత్రాలతో, మనసనే సెల్యులాయిడ్ విూద చూస్తున్నా. మహీ కూడా ఆఖర్లో అదే మాట అన్నది.
“మహీ మీకు ఎక్కడైనా ఎబ్బెట్టుగానో, ఇబ్బంది గానో అనిపిస్తే తప్పక చెప్పొచ్చు. అలాగే ఏమన్నా సలహాలు ఇచ్చినా తప్పక పరిగణన లోకి తీసుకుంటాం. ఫీల్ ఫ్రీ. సినిమా కథని అసలు అత్యంత ముఖ్యమైన వారికి తప్ప ఎవరికీ చెప్పం. మీతో
చెప్పడానికి కారణం ‘ధీర’ సినిమా ఇబ్బందుల్లో వున్నప్పుడు మీరు అల ద్వారా ఇచ్చిన సలహాలు, రెండోది ఏమంటే, ప్రత్యక్షంగా చూశాక మీ మీద ఏర్పడ్డ నమ్మకం.” అన్నారు సత్యమోహన్.
“హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ప్రస్తుతం నేనేమీ చెప్పలేను. మీరు కథ చెప్పినా విధానం నన్ను ముగ్ధురాలిని చేసింది.. ఈ సమయంలో తప్పొప్పులో, సూచనలో, సలహాలో కనిపెట్టడమూ, మీకు చెప్పడమూ కూడా అసంభవమే. కథని మెల్లిగా జీర్ణించుకున్నాక బహుశా ఏదైనా చెప్పగలనేమో! సార్, కథ వింటున్నంత సేపూ అల రూపమే నా మనసులో బలంగా కదిలింది. ఆ పాత్రలో అల జీవించగలదనే నమ్మకం నాలో చాలా వుంది” అన్నది మహిత. నేను మహితనే చూస్తున్నాను.
“నువ్వన్నది నూటికి నూరు పాళ్ళు నిజం అమ్మా – ఓ కథని తయారుచేసుకున్న వెంటనే అది అద్భుతంగా అనిపిస్తుంది. ఒక్కటికి పదిసార్లు సింగిల్ లైన్ (ఆర్డర్) వేసుకునేటప్పుడే అనేక అంశాలు మిస్ అయ్యామని మనసుకు తడతాయి. మరో విషయం ఏం ఆ కథ తయారు చేసుకున్నది నేనే గనక ప్రతి సన్నివేశమూ అద్భుతంగానే వచ్చిందనిపిస్తుంది.” అన్నారు సత్యమోహన్.
“ఈ మాట రైట్ సత్యం. గొప్ప కథా రచయితా, డైరెక్టరూ, డైలాగ్ రైటరూ అయిన సత్యమూర్తి గారు అదే మన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి గారు కూడా ఇదే మాట అనేవారు. అందుకే ఆయన వ్రాసిన కథలన్నీ విజయ బాపినీడు గారితో డిస్కస్ చేసేవారు.” అన్నారు సదాశివరావు గారు.
“నేను రెండు మూడు రోజులు ఇక్కడే వుంటానండీ. మళ్ళీ కలుద్దాం. మిమ్మల్నందర్నీ కలవడం నాకెంతో సంతోషంగానూ, గర్వంగానూ వుంది. వెండితెర తారల్ని ఇలా నేరుగా కలిసి చూడటం ఓ గొప్ప వరం. మీరు పడే శ్రమా, తపనా మీ మాటల్లో తెలుస్తున్నాయి. సినిమా అనేది ఓ తపస్సు లాంటిదని ఇవాళ్ళ నాకు అర్థమయింది.” రెండు చేతులూ ఎత్తి లేచి నిలబడి నమస్కరించింది మహి. నేనూ లేచాను. ఓ అందమైన ‘డైరీ’ని బహుమతిగా సత్యమోహన్ గారు ఇచ్చారు. ఓ గోల్డ్ కలర్ పెన్నుని బహుమతిగా ఇచ్చారు సదాశివరావుగారు. కారు వరకూ వచ్చి మమ్మల్ని కారెక్కించారు. కారు బయలుదేరాక మహతి కళ్ళల్లో చెమ్మ.
“సినిమా వాళ్ళంటే చాలా అహంభావంతో వుంటారని అనుకునేదాన్నే. ఇంత సింపుల్‌గా, ఇంత కమిటెడ్‌గా వుంటారని ఇవ్వాళే తెలిసింది” అన్నది మహతి. నేను చిన్నగా నవ్వి తన చేతిని పట్టుకున్నాను.
“ఏమైనా.. ఇదో వేరే ప్రపంచం. తెల్లటి పరుపులు బాలీసుల మీద కూర్చుని కథా చర్చ జరపడం చాలా ఆహ్లాదకరంగా వుంది. కాఫీ టీ తెచ్చిచ్చే ‘బోయ్స్’ లోనూ ఓ నిబద్ధత, శ్రద్ధ కనిపించింది. ఏమైనా, నువ్వూ చాలా అదృష్టవంతురాలివే అలా, ఏ కలా కనకపోయినా, ఓ కలల ప్రపంచమే నీ దగ్గరకొచ్చి నీదైపోయింది” నా భుజాన్ని గట్టిగా నొక్కి అన్నది మహతి.
ఇంటి కెళ్ళాగానే మహతి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది. “నేను మళ్ళీ హాస్పటల్‍కి వెళ్ళాలి అలా! అక్కడ్నించి ‘ఇందిర’ అంటే మా నాన్న గారి మేనకోడలు ఇంటికి వెళ్ళాలట. బట్టలు వెంట తీసుకుని రమ్మన్నారు.” అన్నది మహతి.
నేనే మహతిని హాస్పటల్ దగ్గర దిగబెట్టాను. మహతి అమ్మగార్ని నాన్నగార్ని పలకరించాను. వారు నన్ను చూసి చాలా సంతోషించారు. మహీ చెప్పినట్లే బోలెడు మంది ఆటోగ్రాఫుల కోసమూ, ఫోటోల కోసమూ వచ్చారు. ‘ఇందిర’ గారిని చూశాను. చాలా అందగత్తె, కానీ చాలా డస్సిపోయి వున్నారు. ఇంకెంతో కాలం బ్రతకరు అనిపించింది. జనాల గోల భరించలేక మహతితో చెప్పి కారెక్కి ఇంటికి వచ్చాను. వినోద్ కపూర్ రాత్రి ఎనిమిదింటికి ఫోన్ చేశారు. షెడ్యూల్ ఖరారైందనీ, ట్రావెల్ ఎరేంజ్ చేస్తున్నామనీ, మరి రెండు మూడు రోజుల్లో బయల్దేరాలనీ. లైఫ్.. అదో మాజిక్.
(ఇంకా ఉంది)