[శ్రీ ఎం. వి. సత్యప్రసాద్ రచించిన ‘మారుతున్న విలువలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]రా[/dropcap]జారావుకు మెలకువ వచ్చి టైం చూసుకున్నాడు. ఉదయం 4.30 గంటలయింది. లేద్దామా, కాసేపు పాడుకుందామా అని ఆలోచిస్తూ, కాదులే చాలా పనులున్నాయి అనుకుంటూ లేచేసాడు. లేచి మొహం కడుక్కుని కాఫీ పెట్టేసి, తానూ ఓ కప్పు కాఫీ తాగేసి, ఉదయాన్నే వాకింగ్‌కు బయలుదేరాడు.
రాజారావు, ఒక ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్‌గా చేసి రిటైర్ అయ్యాడు. చాలా పద్ధతి గల మనిషి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఆయనకు స్నేహితులు తక్కువ. మారుతున్న కాలానికి తగినట్టు మనం కూడా మారాలి అన్న భావం తోనే ఆలోచిస్తాడు. ఎన్నో ఏళ్ళుగా పాఠాలు చెబుతూ పిల్లలను సరిదిద్దే అలవాటు ఉన్న మనిషి అవడం మూలానేమో, ఏ సందర్భంలోనయినా – సమయం సందర్భం చూడకుండా ఎదుటివారిని సరిదిద్దాలని తాపత్రయ పడతాడు. ఈ రకమైన మనస్తత్వంతో ప్రతిరోజూ ఎవరితోనో ఒకరితో గొడవ పెట్టుకుంటాడు. కాదు. ఈయన చెప్పే విషయం మంచిదే అయినా, అవతల వాళ్లకి నచ్చేరీతిలో చెప్పకపోవటం వలన కొంత వాగ్వివాదం జరుగుతుంది. మరి పిల్లలకు పాఠాలు చెప్పినంత తేలిక కాదు సమాజంలో మనుషులను మార్చడం. రాజారావు గారు ఒక మాట అన్నా కూడా ఎవరూ చెడుగా అనుకోరు, ఎందుకంటే చెప్పే విషయం మంచిది కనుక.
దీనికి తోడు రాజారావు, తాను ఉంటున్న కాలనీకి ప్రెసిడెంట్. ‘అన్నిపనులు నావే’ అనుకుంటూ ప్రతి పనీ నెత్తినేసుకుని పని చేస్తాడు. రిటైర్ అయ్యాక మరీ ఎక్కువయింది. ఈయన పద్దతి కాలనీలో అందరికీ తెలుసు కాబట్టి, ఆ కాలనీవాసులందరూ కలసి ఏకగ్రీవంగా రాజారావు గారిని ఆ కాలనీ అస్సోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. అదే కాలనీలో ఉంటున్న సరోజ గారు మహిళల తరుపున ఎన్నిక కాబడ్డ సెక్రటరీ గారు. ఇకపోతే వెంకట్ రావు గారు ట్రెజరర్. వీరు ముగ్గురు కలసి వీళ్ళ కాలనీలో బాగోగులు చూస్తుంటారు.
రాజారావు ఉదయాన్నే వాకింగ్ చేస్తూ అందరినీ పలకరిస్తూ ఉంటాడు. వాకింగ్ అయ్యాక తన స్నేహితులతో కూచుని కబుర్లు చెప్పుకుని నెమ్మదిగా ఇల్లు చేరతాడు. రాజారావు భార్య రమాదేవి, ఉద్యోగం చెయ్యడం లేదు. ఇల్లు చూసుకుంటుంది. అందరితోనూ సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు. మొదట అబ్బాయి, పేరు రవి. ఢిల్లీలో ఉద్యోగం చేస్తాడు. ఇంకా పెళ్లి కాలేదు. తర్వాత అమ్మాయి రజని, పెళ్లి చేశారు. అల్లుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. రాజారావు తన భార్యతో హైదరాబాద్ లోనే ఉంటారు.
***
మాధవి వాళ్ళు, రాజారావు గారి పక్కన ఇంట్లో ఉంటారు. మాధవి భర్త ‘కరోనా’ వల్ల చనిపోయారు. ఉష బి.టెక్. రెండో సంవత్సరం చదువుతోంది. ఉషని చిన్నప్పటినుంచి గారాబంగా పెంచారు వాళ్ళ నాన్న. ఉషకి కొంచం మొండితనం ఎక్కువ, తనకు ఏది కావాలో అది ఇచ్చేదాకా ఏడ్చి సాధించుకునేది. ఇపుడు వాళ్ళ అమ్మ కంట్రోల్ చెయ్యలేక పోతోంది. ఉష అలాగే మొండితనం, ఉక్రోషం, ప్రతి విషయం లోనూ మాట పట్టింపు ఇలాటి లక్షణాలన్నీ పెంచుకుంటూ, తనను తాను గొప్పగా అనుకుంటూ, తాను చేస్తున్న ప్రతి పనీ సరైనదే అని సమర్థించుకుంటూ మాట్లాడుతూ, ఇదే పద్ధతిలో బ్రతకడానికి అలవాటుపడింది.
“ఉషా! నిద్ర లే, ఏంటి ఇంకా నిద్ర” అంటూ ఉషా రూమ్ లోకి వచ్చి కేక పెట్టింది మాధవి
“ఒక్క ఫైవ్ మినిట్స్ మమ్మీ” అంటూ దీర్ఘం తీసింది ఉషా దుప్పట్లోంచే.
“ఏంటే ఆ మొద్దు నిద్ర! ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా! పది గంటలు అవుతోంది. అయినా రాత్రిళ్ళు అంత అర్ధరాత్రి దాకా ఏంచేస్తున్నావు, నిన్న రాత్రి అంత ఆలస్యంగా వచ్చావు” అడిగింది మాధవి ఉషను.
“రాత్రి తాగావా” అడిగింది మాధవి ఉషని.
“కొంచమే మమ్మీ” చెప్పింది ఉష.
“ఆ రమేష్‌తో తిరగొద్దని చెప్పానా? వాడొక వెధవ, వాడితో స్నేహం మొదలుపెట్టిన దగ్గరనుంచి నువ్వు ఇట్టా తయారయ్యావు” అన్నది మాధవి.
“ఏమయ్యింది మమ్మీ!” సాగదీసుకుంటూ అడిగింది ఉష.
“ఇంతకన్నా ఏం కావాలి! ఆడపిల్లలు తాగి తందనాలాడటం ఉందా ఎక్కడన్నా? మరీ అడ్డూ ఆపూ లేకుండా పోయింది నీకు మీ నాన్నగారు పోయినప్పటినుంచి” అంది మాధవి వస్తున్న ఏడుపు ఆపుకుంటూ.
“ఇపుడు ఏమయ్యింది మమ్మీ, రమేష్, వాళ్ళ ఫ్రెండ్‌ని కలవటానికి పబ్‌కి వెళదాం అంటే పబ్‌కి వెళ్ళాం, అక్కడ కొంచం తీసుకున్నాం. అయినా రమేష్ ఇంటి దగ్గర దింపాడులే!” అన్నది ఉష.
“ఆ రమేష్ గాడితో స్నేహం మానెయ్, బాగు పడతావ్” అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధవి.
ఈ పిల్లతో ఎలా వేగాలో అనుకుంటూ ఆలోచనలో పడ్డది మాధవి.
ఈరోజుల్లో పాశ్చాత్య పోకడలు ఎక్కువయి, మన సంస్కృతీ, పద్ధతులు పక్కన పెట్టి, మగవాళ్ళు తాగి తందనాలాడుతుంటేనే సంసారాలు నాశనమౌతున్నాయి అనుకుంటే ఆడపిల్లలు, ముఖ్యంగా కాలేజీ పిల్లలు తాగుడు, పబ్బులు, తిరుగుళ్లకు బాగా అలవాటు పడ్డారు. ఇది వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మీద బాగా దెబ్బతీస్తోంది. ఇది ఒక ఇంటి సమస్య కాదు, దాదాపు ప్రతి ఇంటిలోనూ యువతరం అలవాట్లతో ఇలాటిది ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. దీని వలన వాళ్ళ ఆరోగ్యం పాడవుతోంది, ఇంకా డబ్బు కూడా ఖర్చు అవుతోంది. పెద్దవాళ్ళు చెబితే, మీరు ఎంజాయ్ చెయ్యలేక పోయిన లైఫ్‌ని మేము ఎంజాయ్ చేస్తున్నాం, అందుకు మీరు సంతోషించాలి గానీ, ఇలా ఉడుకుమోతుతనం చూపించకూడదు అంటారు.
***
కొన్నిరోజుల తర్వాత..
“అమ్మా! నే కాలేజీ కి వెళ్ళొస్తా” అని కేక వేసింది ఉష, బాగ్ సర్దుకుంటూ.
“ఇప్పుడేం కాలేజీనే! ఒంటిగంట అవుతూంటేనూ, భోజనం టైం కూడా అవుతోంది” అన్నది మాధవి.
“స్పెషల్ క్లాసులు ఉన్నాయి, కొంచం లేటుగా వస్తా” అన్నది ఉష, వాళ్ళ అమ్మతో.
“కొంచం లేటుగా రావడం ఏంటి, రోజూ నువ్వు వచ్చేది లేటు గానే కదా.” అన్నది మాధవి కోపంగా ఉషతో.
“హబ్బా! ఏంటమ్మా ప్రతిదానికీ ఏదో ఒకటి చెప్తావు” అని విసుక్కుంటూ బయలుదేరబోయింది.
“భోజనం చేసి వెళ్లవే” అంటూ కేక వేసింది మాధవి.
“కాంటీన్‌లో చేస్తా లేమ్మా” అంటూ ఇంటి గేట్ దాటి వెళ్ళిపోయింది
“ఈ పిల్లకు రోజూ లేట్‌గా రావడం అలవాటయిపోయింది” అనుకుంటూ పనిలో పడింది మాధవి.
***
ఒక రోజు రాత్రి సుమారు పదకొండున్నర దాటాక రాజారావు ఇంటి గేట్‌కి ఏ లారీనో, ఆటోనో గుద్దినట్లు పెద్ద చప్పుడు వచ్చి రాజారావు నిద్ర లోంచి లేచి వెళ్లి వీధి తలుపు తీసి చూసాడు. గేట్ మూడొంతులు విరిగి కిందకు వేలాడుతోంది. తీరా బయటకు వెళ్లి చూస్తే ఎవరో కుర్రాడు మోటార్ సైకిల్ మీద వచ్చి బండిని గేట్‌కి గుద్దాడు. ఆ పిల్లాడితో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. రాజారావు గేట్ దగ్గరకు వెళ్లి చుస్తే, ఆ అమ్మాయి పక్కింటి మాధవి గారి అమ్మాయి. ఆ పిల్లాడు బాగా తాగి ఉన్నాడు, ఈ పిల్ల ఉష కూడా తాగిందేమో అన్న అనుమానం వచ్చింది రాజారావుకి.
రాజారావు, ఆ బండిని గేట్‌కి డాష్ కొట్టిన కుర్రాణ్ణి గట్టిగా అడిగాడు, “బుద్ధి ఉందా, తాగి వచ్చి గేట్ విరగ్గొడతావా! బండి నడిపే పద్దతి ఇదేనా” అంటూ. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ కుర్రాడితో పాటు ఉష కూడా రాజారావుతో పోట్లాడింది. “ఏదో కుక్క అడ్డం వచ్చింది, అందుకని బాలన్స్ తప్పి గేట్‌కి గుద్దేశాము” అన్నాడు ఆ కుర్రాడు.
“ఆ కుర్రాడు ఎవరు” ఉషని అడిగాడు రాజారావు.
“నా బాయ్ ఫ్రెండ్” అని సమాధానం ఇచ్చింది ఉష.
ఈ గొడవ జరుగుతుండగానే, చుట్టూ పక్కల ఇళ్లలో వాళ్లు బయటకు వచ్చారు. ఇద్దరినీ శాంతపర్చ బోయారు. మాటా మాటా పెరిగి ఆ కుర్రాడు రాజారావుని కొట్టాడు. రాజారావు కింద పడ్డాడు. రాజారావు చెయ్యి విరిగింది. కంగారుపడి అందరూ చేరి రాజారావుని కాలనీకి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లి కట్టు కట్టించారు.
రెండు వారాల తర్వాత రాజారావు కాలనీ లోనే, అందరి సభ్యులని పిలిచి మీటింగ్ పెట్టి, ఉష, తన బాయ్ ఫ్రెండ్‌తో కలసి వచ్చి బండితో గుద్దినందు వలన తన ఇంటి గేట్ విరిగింది కాబట్టి, ఉష మరియూ ఆ అబ్బాయి కలిసి గేట్ బాగుచేయించడానికి అయ్యే ఖర్చు తనకు ఇవ్వాల్సి ఉంటుంది అని కంప్లైంట్ ఇచ్చి, దాని మీద పంచాయితీ పెట్టాడు. “ఆ పిల్లాడు ఎవరో గేట్ విరక్కొడితే మేము ఎందుకు కట్టాలి, మీరు ఆ పిల్లాడిని అడగాలి కానీ మమ్మల్ని అడుగుతారేంటి” అని ప్రశ్నించింది మాధవి.
“అమ్మా! ఆ పిల్లవాడు, మీ ఉషకి బాయ్ ఫ్రెండ్, వీళ్ళు ఇద్దరూ ఆ రోజు రాత్రి తాగి వచ్చి బండిని గేట్‌కి గుద్ది గేట్ విరక్కొట్టారు” అని చెప్పాడు రాజారామ్. ఆ మీటింగ్‌లో ఉష కూడా ఉంది. ఉషకి బాయ్ ఫ్రెండ్ ఉన్నదన్న సంగతి, వాడితో ఉష తిరుగుతోందన్న విషయం మాధవికి తెలిసినా తనకు ఇప్పుడే తెలిసింది అన్నట్లు అక్కడ మాట్లాడింది మాధవి.
ఉష చేసిన ఈ పని వలన, మాధవికి అక్కడ చాలా అవమానంగా అనిపించింది. దీనికి తోడు మాధవి వాదించడం మొదలు పెట్టేసరికి, రాజారావుకి మద్దతుగా సెక్రటరీ గారు అయిన సరోజ గారు, ట్రెజరర్ వెంకట్ రావు గారు గట్టిగా మాట్లాడారు. మిగిలిన సభ్యులు కూడా రాజారావుకే మద్దతుగా పలికారు.
సరోజ సెక్రటరీ అయినా, తను ఎక్కువగా మహిళలకు విలువ పెంచే విషయాలు. మహిళల వైపే మాట్లాడుతుంది. పూర్తి మహిళలను కాపాడటానికే అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ ఈ విషయంలో న్యాయం రాజారావు గారి వైపు ఉంది కాబట్టి తను ఆయన వైపే మాట్లాడింది. రాజారావు గారంటే సరోజకు చాలా గౌరవం. రాజారావు గారి మంచితనం, న్యాయంగా మాట్లాడటం, క్రమశిక్షణగా ఉండటం, నిర్మలమైన రాజారావు గారి మనసు, సరోజను ఎంతో ఆకర్షించాయి. సరోజ వాళ్ళు ఈ కాలనీకి వచ్చి కూడా ఐదేళ్లు అవుతోంది. సరోజ భర్త కాంట్రాక్టు వ్యాపారం చేస్తాడు.
మిగిలిన సభ్యులు కూడా రాజారావు గారికే మద్దతు పలికారు. ఒకవేళ ఆ డబ్బు కట్ఠకపోతే, బండి నడిపిన ఆ అబ్బాయిని, ఉషని కలిపి వీరిద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని రాజారావు, సరోజ ఇద్దరూ దాదాపు బెదిరించినట్లే చెప్పారు.
ఈ మీటింగ్ జరిగిన తర్వాత, మాధవికి చాలా అవమానంగా అనిపించింది. కాలనీలో తలెత్తుకోడానికి లేకుండా అయింది. ఎవరింట్లో చూసినా ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు. ఇది తట్టుకోలేక, మాధవి, ఉషని బాగా కంట్రోల్ చేసింది. అస్సలు ఇల్లు కదలనీయడం లేదు, కాలేజీ పూర్తిగా మానిపించేసింది. “నువ్వు చదవక పోయినా పరవాలేదు, ఇంట్లో తిన్నగా ఉంటే చాలు” అని చెప్పి అసలు ఇల్లు దాటి బయటకు వెళ్లనీయలేదు. ఉష తన బాయ్ ఫ్రెండ్‌ని కలవకుండా పూర్తి కట్టుదిట్టం చేసింది. ఉషకి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం, తన బాయ్ ఫ్రెండ్‌ని కూడా కలవడానికి లేకుండా అవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. గేట్‌కి బండి తగిలి గేట్ విరిగినంత మాత్రాన ఆ రాజారావు గారు ఇంత గోల చేస్తారా అనుకుంటూ, ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి తనకు అయినన్ని ప్రయత్నాలు చేస్తోంది.
***
ఒకరోజు రాజారావు భార్య రమాదేవికి వాట్సాప్‌లో ఒక ఫోటో వచ్చింది. ఎవరు పంపించారో తెలీదు. ఏ నెంబర్ నుండి వచ్చిందో, ఆ నెంబర్ తమకు తెలిసిన వాళ్ళది కాదు. అది రాజారావు గారు ఒక యాభై వయసు కల ఆమె ఒళ్ళో తల పెట్టుకుని ఆమెను చూస్తున్నట్లుగా ఉంది.
ఇంకేముంది రాజారావు భార్య రమాదేవి ఇంట్లో నానా గోల చెయ్యడం మొదలుపెట్టింది. ఎన్నడూ నోరెత్తి గట్టిగా కూడా భర్తతో మాట్లాడని రమాదేవి వెనకా ముందు చూడకుండా, రాజారావును చెడామాడా తిట్టడం మొదలుపెట్టింది. నాలుగు రోజుల తర్వాత మరో రెండు ఫోటోలు, రాజారావు ఆమె ఇద్దరు పార్క్‌లో కలిసి నడిచి వెళ్తున్నట్టు, రాజారావు ఆమె భుజం మీద చెయ్యి వేసి కూచున్నట్టు, ఆమెతో ఎక్కడో షాపింగ్ చేస్తున్నట్టు ఫోటోలు రాజారావు, రమాదేవికే కాదు, దాదాపు ఆ కాలనీలో అందరికీ వచ్చాయి. రాజారావు బయటకు వెళ్ళినప్పుడల్లా మగవాళ్ళు ఎవరో ఒకరు ఈ ఫోటోల విషయం మీద రాజారావుని అడగటం, ఎగతాళిగా మాట్లాడటం, కొందరు కొత్త సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అదివరకు ఎంతో గౌరవంగా చూసిన ఆడవాళ్లు, మొహం తిప్పుకోవడం, ‘ఛీ’ అన్నట్టు చూడటం మొదలయింది.
రాజారావు స్నేహితులు ఒకరిద్దరిని తనకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళతో ఈ ఫొటోస్ ఎవరు పంపించి ఉంటారు, అని చర్చించాడు. ఆ పంపినవాళ్లు ఒక్కోసారి ఒక్కో నెంబర్ నుండి పంపిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఈ అవమానం భరించలేక రాజారావు ఆ కాలనీకి ప్రెసిడెంట్‌గా ఉండనని రాజీనామా ఇచ్చాడు. ఇంట్లో భార్యతో తిట్లు, ఆమె ఏడుపులు, సూటిపోటి మాటలు మామూలే.
రాజారావు ఆలోచనలో పడ్డాడు. తన లైఫ్‌లో ఎన్నడూ ఒకరి చేత మాట అనిపించుకోవడం అన్నది జరగలేదు. కానీ ఇపుడు అన్నీ అవమానాలే. రిటైర్ అయిన వాళ్లకు ఎవ్వరూ విలువ ఇవ్వరు. చివరికి భార్య కూడా విలువ ఇవ్వదు. డబ్బు సంపాదన ఉన్న వాళ్ళకే విలువ లేకుండా పోతోంది, అదే పెన్షన్ రాక, డబ్బు లేక, పిల్లలు పంపించే డబ్బు మీద ఆధార పడాల్సి వస్తే మరీ కష్టం. ఇప్పటికే చాలావరకు, సిగ్గు వదిలేసి, అందరితో మాటలు అనిపించుకుంటూ, తాను చేసిన తప్పు ఏంటో తనకు అర్థం కాక, ఈ సమాజంలో ఇమడలేక, ఒంటరి బ్రతుకు వెళ్లదీస్తున్నారు. ఇపుడు రాజారావు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీనికి తోడు ఈమె ఎవరితోనో అక్రమ సంబంధం ఉన్నట్టు ఈ ఫోటోలు రావడం ఏమిటో అర్థం కావడం లేదు.
దీంతో రాజారావు కొంత అస్వస్థతకు గురి అయ్యాడు. బీపీ, షుగరు రెండూ పెరిగాయి. ఎంతో యాక్టివ్‌గా ఉన్న మనిషి పూర్తిగా డల్ అయ్యాడు. దాదాపు ఇంట్లోనే ఉంటున్నాడు. బయట వాళ్లకు మొహం చూపించడం కూడా ఇష్టం లేదు అన్నట్లు.
“రాత్రంతా ఆ టీవీ చూస్తూ కూచుంటారు. పొద్దున్నే నిద్ర లేవాలంటే కష్టం. ఈ సినిమాల పిచ్చి ఏమిటో అర్ధం కాదు. కానీ రోజూ చూడరు, ఎప్పుడన్నా చూస్తారు, చూసిన రోజున మటుకు మరుసటి రోజు ఉదయం లేవలేరు” అనుకుంటూ వంటింట్లో పనిచేసుకుంటోంది రాజారావు భార్య రమాదేవి.
రమాదేవి మళ్ళా టైం చూసింది. పది గంటలయింది. “ఏమిటో ఈయన ఇంకా నిద్ర లేవలేదు” అనుకుంటూ భర్త రాజారావుని నిద్రలేపింది. కానీ ఆయన ఎంతకీ లేవడం లేదు. ఇల్లు బాగా వేడిగా ఉంది. గట్టిగా తట్టి లేపింది. మగతగా కళ్ళు తెరిచారు రాజారావుగారు.
“లేవండి లేచి మొహం కడుక్కోండి” అన్నది రమాదేవి.
రాజారావు గారు చెయ్యి సపోర్ట్ తీసుకుని లేద్దాం అని ప్రయత్నం చేశారు కానీ, ఆయన లేవలేక పోయారు.
వెంటనే, రమాదేవి కాలనీలో అందుబాటులో ఉన్న డాక్టర్‌కి ఫోన్ చేసి, ఒకసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడింది.
డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి, జ్వరం బాగా ఎక్కువగా ఉంది, బీపీ కూడా ఎక్కువ అవటం మూలాన రాజారావు గారికి లైట్‌గా ఎడమ చేతికి పక్షవాతం వచ్చింది. “భయపడాల్సింది ఏమీ లేదు. సార్ రెస్ట్ గా ఉండాలి. దేనిగురించీ ఎక్కువ గా ఆలోచించ కూడదు. బీపీ పెరిగినందువలనే చేతికి ఇబ్బంది అయ్యింది” అని చెప్పి మందులు రాసి ఇచ్చారు.
రమాదేవి కన్నీరు మున్నీరైంది. తన వేధింపు వల్లనే రాజారావుకు ఇలా అయ్యిందని చాలా బాధపడింది. వెంటనే తన తమ్ముడు మాధవ రావు, ఇంట్లో మధు అని పిలుస్తారు, మధుకి ఫోన్ చేసి రాజారావు గారికి సుస్తీ చేసిన సంగతి చెప్పింది.
మధు వెంటనే బెంగళూర్ నుండి రాజారావు గారి అమ్మాయి రజని, అల్లుడు రాంబాబుని కలుపుకుని హైద్రాబాదుకు వచ్చారు.
రమాదేవి తమ్ముడికి జరిగినది అంతా చెప్పి, “మీ బావగారు ఈ అవమానాన్ని భరించలేక పోయారు. బీపీ బాగా పెరగటం వలన ఇలా అయ్యింది” అని తమ్ముడు మధు దగ్గర జరిగిన విషయం చెప్పింది. కానీ ఆ మెసేజ్‌లు, ఫోటోలు ఎలా వచ్చాయో ఏమిటో తెలియడం లేదు. అవి ఒక పెద్దాయనను ఇలా ఇబ్బంది పెడతాయి అనుకోలేదు.” అంటూ ఒకటే ఏడుస్తోంది.
“అక్కా! నువ్వు బాధ పడకు, అసలేం జరిగిందో చెప్పు” అడిగాడు మధు, రమాదేవిని. మధు బెంగళూరులో గత పదిహేను సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నాడు. రమాదేవి జరినదంతా వివరంగా చెప్పింది.
“అక్కా! బావగారి ఫోన్ ఎవరో హాక్ చేసినట్లున్నారు” అన్నాడు మధు, వంటిట్లోకి వస్తూ..
“హాక్, అంటే ఏమిట్రా!” అడిగింది రమాదేవి తమ్ముడికి కాఫీ పెడుతూ.
“హాక్, అంటే మన ఫోన్‌ని, కాంటాక్ట్స్‌ని, బ్యాంకు అకౌంట్స్‌ని, ఫొటోస్, మెసేజ్లు మొత్తం, ఎవరైతే హాక్ చేస్తారో, వాళ్ళ కంట్రోల్ లోకి తీసుకోవడం. అంటే మనం మన ఫోన్‌ని ఎలా వాడతామో, వాళ్ళు మన ఫోన్‌ని అచ్ఛం వాళ్ళ ఫోన్ లాగా వాడతారు. కానీ దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. మన అకౌంట్‌లో డబ్బులు పోవచ్చు, మన ఫోటోలు వేరే వాళ్లకు పంపొచ్చు, మనం పంపినట్లు మెసేజ్లు వాళ్ళు మన ఫోన్ నుండి పంపించొచ్చు. అందుకే ఫోన్ పాస్వర్డ్‌లు, ఎటిఎం పాసువర్డ్‌లు టైపు చేసేటప్పుడు, మన పక్కనుండి గానీ, మన వెనెకనుండి గానీ పాస్వర్డ్ లు ఎవరైనా చూస్తున్నారా అన్నది మనం జాగ్రత్తగా గమనించాలి.” అన్నాడు మధు.
“అంత ‘హాక్’ చెయ్యాల్సిన అవసరం ఏముందిరా, ఈయన ఈ కాలనీ ఫంక్షన్స్‌లో ఎన్నో ఫొటోస్‌లో ఉన్నారు. ఏ ఫోటో నయినా వాడుకోవచ్చు. “ అన్నది రమాదేవి.
“ఇది ఎవరో కేవలం బావగారిని పరువు తీసి బజారున పడెయ్యాలన్న ఉద్దేశ్యంతోనే చేశారు. బావగారి ఫోన్‌లో ఉన్న ఫొటోస్‌ని తీసుకుని, వాటికి మరొకరి ఫోటోలను జోడించి ఒక కొత్త ఫోటో తయారు చెయ్యవచ్చు “ అన్నాడు మధు.
“అయితే, ఈ పని ఎవరు చేసి ఉంటారు, అది మనకు ఎలా తెలుస్తుంది” అడిగింది రమ.
“అది కనుక్కోవడం కొంచం కష్టమే, అయినా ప్రయత్నం చేద్దాం” అన్నాడు మధు.
***
“అక్కయ్య! ఈ కాలనీలో బావ గారి ఫోన్ నెంబర్ ఎవరెవరి దగ్గర ఉంటుంది. బయట, మన చుట్టాలలో కాకుండా బావగారి ఫ్రెండ్స్‌లో ఎవరి దగ్గర ఉంటుంది” అడిగాడు మధు.
“బావగారు రిటైర్ అయ్యాక వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చెయ్యడం బాగా తగ్గిపోయింది. ఇకపోతే, మన కాలనీలో ఈయన కమిటీ మెంబర్‌గా పనిచేశారు కాబట్టి మన కాలనీ వాళ్ళ అందరి దగ్గర ఉంటుంది. కానీ మన కాలనీలో ఈయనకు చెడు చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. ఈయనా అందరితోనూ బాగానే ఉంటారు.” అన్నది.
“లేదక్కా! ఈమధ్య ఎవరో అబ్బాయి మోటార్ సైకిల్‌తో మన గేట్‌ని కొట్టి పోట్లాడాడు అన్నావు కదా! అతను ఏమన్నా చేసి ఉంటాడా!” అనుమానంగా అడిగాడు మధు.
“ఒకవేళ అతను చేసి ఉంటే, అతని వివరాలు, ఫోన్ నెంబర్ అన్నీ మన పక్కింటి అమ్మాయి ఉషని అడిగితే తెలుస్తుంది. కానీ చెపుతుందో లేదో” అన్నది రమాదేవి తమ్ముడు మధుతో.
***
రాజారావు గారి ఆరోగ్యం కాస్త మెరుగయ్యింది. హాస్పిటల్ నుండి రాజారావు గారిని ఇంటికి పంపించారు. మధు, “అక్కయ్యా, పద ఒకసారి మాధవి గారింటికి వెళదాం” అన్నాడు.
“ఇప్పుడెందుకురా వాళ్ళ ఇంటికి?” అన్నది రమాదేవి కాఫీ రెడీ చేస్తూ.
“ఒకసారి వాళ అమ్మాయి ఉషని, తన బాయ్ ఫ్రెండ్ గురించిన వివరాలు అడుగుదాం.” అన్నాడు.
కాఫీలు తాగాక, మధు, రమాదేవి ఇద్దరూ, మాధవి గారింటికి వెళ్లారు.
వెళ్ళగానే వీళ్ళను చూసి మాధవి ఆశ్చర్యపోయినా, నవ్వుతూ లోపలికి పిలిచింది.
“మాధవి గారు, మా తమ్ముడు, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తాడు” అని మధుని పరిచయం చేసింది.
“ఒకసారి మీ కంప్యూటర్ మీద ఏదో పని చేసుకుంటాడట” అని పర్మిషన్ అడిగింది.
“దానికేం భాగ్యం, చేసుకోండి, అయినా ఉష బయటకు వెళ్ళింది, తాను పనిచేసుకోడానికి ఇప్పుడే రాదు” అంటూ స్విచ్ వేసింది.
వీళ్ళు మాటాడుతూ ఉండగానే ఉష వచ్చింది. ఉషని మధుకి పరిచయం చేసింది మాధవి తాను తెచ్చిన కాఫీ, మధు, రమాదేవిలకు అందిస్తూ. ఉష, మధుకి నమస్కరించింది. మధు, రమాదేవి ఇద్దరూ నవ్వుతూ పలకరించారు.
“అన్నయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది” అడిగింది మాధవి.
“ఫరవాలేదు, మామూలు మనిషి అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది అన్నారు డాక్టర్లు” అన్నది రమాదేవి.
“అయినా ఉన్నట్లు ఉండి బీపీ పెరగటం, నిజంగా దురదృష్టం” అన్నది మాధవి.
అప్పుడు మధు కల్పించుకుని “లేదండి, నలుగురిలో పరువు పోయింది అన్న దిగులు, ఆలోచన తోనే మా బావగారి బీపీ పెరిగింది. ఆ ఫోటోలు రాకుండా ఉంటే బాగుండేది” అంటూ టాపిక్ లోకి వచ్చాడు. మధు.
“మా బావగారు వేరే అమ్మాయితో ఉన్నట్లు వైరల్ అయిన ఫొటోస్ ఎవరో కంప్యూటర్ ద్వారా తయారుచేశారు. ఇది కేవలం మా బావగారిని అవమానించడానికి, వారి క్యారెక్టర్‌ని చెడుగా చూపించడానికి చేసిన పని” అన్నాడు మధు ఆవేశంగా.
“ఆ బండితో గేట్‌ని కొట్టిన కుర్రాడి వివరాలు కావాలి, మాకు అతనిమీదనే అనుమానం” అన్నాడు మధు.
“అతను మా ఉషకి ఫ్రెండ్, ఉష దగ్గర ఉండొచ్చు” అన్నది మాధవి.
“అతని వివరాలు ఎందుకు, అతన్ని అడుగుతారా, ఈ విషయంలో” అడిగింది ఉష.
“అతన్ని అడగటం ఎందుకండీ, డైరెక్ట్‌గా అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. స్టేషన్‌లో రెండు దెబ్బలు పడితే వాడే నిజం చెప్తాడు. తర్వాత అతని మీద కేసు పెట్టి, కోర్ట్‌కి ఈడుస్తాము.” అన్నాడు మధు కొంచం ఆవేశంగా.
ఉష మొహంలో ఖంగారు, భయం క్లియర్‌గా కనపడింది మధుకి.
వాళ మధ్యలో మాట్టాడుతున్నదే కానీ ఉష ఆలోచన ఇక్కడ లేదు. ఏదో ఆలోచిస్తోంది. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే చాలా గొడవ అవుతుంది అనుకుని “పోలీస్ స్టేషన్ దాకా ఎందుకులే అంకుల్” అన్నది ఉష.
“కంప్లైంట్ ఇవ్వకపోతే నిజం బయటకు రాదు కదమ్మా! పోలీసులు వాళ్ళే ఎంక్వయిరీ చేసి నిజం తెలుసుకుంటారు. అసలు ఇదంతా ఎవరు చేశారు అన్నది మనం మాత్రం ఎలా కనిపెట్టగలం. మీ ఫ్రెండ్ మీద కేవలం అనుమానం మటుకే. పోలీసులు, కేవలం అతన్ని పిలిచి ఎంక్వయిరీ చేస్తారు” అన్నాడు మధు.
“అంకుల్ నేనొక మాట చెబుతాను” అన్నది ఉష భయం భయంగా.
“చెప్పమ్మా” అన్నాడు మధు.
“మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వనంటే ఒక మాట చెబుతాను, ప్రామిస్ చేస్తారా!” అన్నది భయంతో.
“చెప్పమ్మా! ఆ పని చేసిందెవరో మనకు తెలిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన పని ఏముంది” అన్నారు మధు, మధు వాళ్ళ అక్క రమాదేవి గారు ఒక్కసారిగా.
“జరిగింది ఏమిటంటే, ఆ ఫొటోస్ పంపినది మా ఫ్రెండ్ కాదు అంకుల్” అన్నది ఉష.
“మరి ఎవరమ్మా! నీకు తెలుసా!” అడిగాడు మధు ఆత్రంగా.
“నా ఫ్రెండ్ రమేష్ తనకి తెల్సిన నెట్ సెంటర్‍లో, తన ఫ్రెండ్‍తో కలిసి ఓ యాప్ ద్వారా ఫోటో మార్ఫింగ్ చేయించి పెన్ డ్రైవ్‌లో తెచ్చాడు. ఎక్కడి నుండో ఓ అయిదారు సిమ్ కార్డులు తెచ్చాడు. అవి వాడి ఆ ఫోటోలు పంపాము..” అన్నది ఉష భయం భయంగా.
“నువ్వా?” అని అడిగాడు మధు ఆశ్చర్యంతో ఉషని.
“నువ్వెందుకు చేసావ్ అలాగ!” అడిగాడు మధు.
“రమేష్ బైక్, అంకుల్ వాళ్ళ గేట్‌కి తగిలించిన రోజు, అంకుల్ మా ఫ్రెండ్‌ని బాగా తిట్టారు, అందుకు మా ఫ్రెండ్‌కి కోపం వచ్చి, ఛాలా అవమానం అనిపించి ఇలా చేద్దాం అన్నాడు.” చెప్పింది ఉష భయంతో.
మధు, రమాదేవి, ఇద్దరికీ ఏం మాట్లాడాలో కాసేపు అర్ధం కాలేదు.
“చూడమ్మా! మీరు ఆవేశంతో చేసిన పని అవతల వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపించిందో, మా బావగారి మంచాన పడే పరిస్థితి వచ్చింది. ఇలా చేసినందువలన మీకు వచ్చిన ప్రయోజనం ఏంటి.” అడిగాడు మధు కొంచం ఆవేశంగా.
“మీరు తృప్తి పడటం కోసం, ఆ పెద్దాయన మీద ఇలా నిందలు వేస్తారా. ఆయన పోగొట్టుకున్న ఆరోగ్యం మీరు తెచ్చి ఇవ్వగలరా?” గట్టిగా అడిగింది రమాదేవి.
ఏం చెప్పాలో అర్ధం కాక, చూస్తూ నిలబడిపోయింది ఉష.
ఇంతలో మాధవి కల్పించుకుని, “మా అమ్మాయి తరుపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. చిన్న పిల్ల తెలియక చేసింది, దయచేసి, క్షమించండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి, అమ్మాయిని నేను కంట్రోల్ చేస్తాను” అని, దాదాపు కాళ్ళ మీద పడ్డంత పని చేసింది. ఉష కూడా, వీళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది.
“చూడమ్మా! మీరు కంప్యూటర్ మీద విద్య నేర్చుకుని, ఆ విద్యని ఒక మంచి పనికి ఉపయోగించాలికానీ, ఇలాంటి చెడ్డ పనులకి వాడకూడదు” అని మందలించారు.
మధు, రమాదేవిని, పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దని మరోసారి మాధవి బ్రతిమిలాడింది.
మధు, రమాదేవి ‘ఈ కాలం పిల్లలు టెక్నాలజీని చెడుగా వాడుకుంటున్నారు’ అని ఆశ్చర్యపోయారు. వాళ్ళ నిర్లక్ష్యానికి, ఎంత చెడ్డ పని అయినా ఏమాత్రం ఆలోచించకుండా చేయడాన్ని తలచుకొని, ఆ పిల్ల ఉష, రమేష్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నారు.
సరేలెండి అని మధు, రమాదేవి ఇద్దరూ, ఉషని, ఇలాటి పనులు ఇకమీదట ఎవ్వరి విషయం లోనూ చెయ్యవద్దని, మరోసారి మందలించి వెనుతిరిగి ఇంటికి వచ్చారు.
ఉష నుంచి రమేష్ ఫోన్ నెంబర్ తీసుకుని తనకి తెలిసిన పోలీస్ అధికారి ద్వారా గట్టి వార్నింగ్ ఇప్పించాడు మధు. రమేష్ మీద నిఘా ఉంటుందని హెచ్చరించాడా అధికారి.
ఉష కూడా తన పద్ధతి మార్చుకుని, రమేష్‌తో సావాసం వదిలేసి, చెడు తిరుగుళ్ళు మానేసి, చక్కగా చదువుకుంటూ, బుద్ధిగా ఉన్నది.