జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-79

1
3

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]జో[/dropcap]నరాజ రాజతరంగిణిలో ప్రక్షిప్తాలుగా నిర్ణయించిన శ్లోకాల లోని విషయాలు గ్రహించిన తరువాత మళ్లీ – జోనరాజు రచించిన రాజతరంగిణిగా పండితులు నిర్ధారించిన రాజతరంగిణి వైపు దృష్టి మళ్లించాల్సి ఉంటుంది.

నిర్దిశన్ యశసా శుభ్రా దిశో నృపతిరాదిశాత్।
అవధం ఖగమత్స్యనామనేకేషు సరఃసు సః॥
(జోనరాజ రాజతరంగిణి 953)

సరస్సు నడుమ అందమైన భవంతి నిర్మించిన తరువాత జైనులాబిదీన్ తన దృష్టి జీవహింస నిర్మూలనంపై పెట్టాడు. ఎంతగా దయామయుడయ్యాడంటే, ఆయన ఎవరినయినా శిక్షించాల్సిన పరిస్థితి వస్తే, శిక్షలు కూడా జాలి, దయలతో కూడినవి అయి ఉంటాయి. జేబుదొంగలకు ఆయన మరణ శిక్ష విధించేవాడు కాదు. వాళ్ల కాళ్లను సంకెళ్లలో బంధించనిచ్చేవాడు కాదు. వారిని నిరంతరం కొట్టటం వంటి వాటిని కూడా నిషేధించాడు. అంటే, దొంగలను కూడా కఠినంగా శిక్షించేందుకు ఒప్పుకునేవాడు కాదన్నమాట. అలాంటి జైనులాబిదీన్, సరస్సు, నదీ తీరాలలో పక్షులను, చేపలను కూడా వధించేందుకు ఒప్పుకోలేదు. అలా చంపటాన్ని నిషేధించాడు. అంతటి దయాళువయిన జైనులాబిదీన్ ఖ్యాతి దశదిశలా వ్యాపించింది.

చేపలను, పక్షులను చంపటంపై నిషేధం విధించటం జైనులాబిదీన్‍పై అధికమవుతున్న పండితుల ప్రభావం, తద్వారా తీవ్రమవుతున్న భారతీయ ధర్మ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటీవలి కాలంలో భారతీయ ధర్మం హింసాయుతమైనదనీ, ధర్మంలో దేవతలు ఆయుధాలు ధరించి ఉంటారని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. దేవతల ఆయుధాలు దుష్టులని శిక్షించటం కోసమని,  శిష్టులను రక్షించటం కోసమన్న కనీస గ్రహింపులేక, దేవతల ఆయుధాలను చూసి భయపడే దుష్టుల్లా ప్రవర్తిస్తున్నారు.  తమ అజ్ఞానాన్ని విజ్ఞానంగా భావించుకుని, అజ్ఞానాన్ని వెదజల్లుతున్నారు. భారతీయ ధర్మాన్ని ఏ మాత్రం అధ్యయనం చేసినా, వారికి ఈ దుర్వ్యాఖ్యానాలలోని మూర్ఖత్వం, అనౌచిత్యాలు బోధపడుతాయి. జైనులాబిదీన్ వంటి సుల్తాను, భారతీయ ధర్మ సంపర్కంతో సంపూర్ణంగా రూపాంతరం చెందాడు. శాంతి, దయ, సహనం కల గొప్ప రాజుగా ఎదిగాడు. జైనులాబిదీన్ ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. అందుకే ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని కశ్మీరు వదిలిన పండితులు తిరిగి కశ్మీరుకు వచ్చి చేరుకున్నారు. మళ్లీ కశ్మీరులో విద్యాలయాలు వెలిశాయి. మందిరాలు నిర్మితమయ్యాయి. వేద పఠనం ప్రారంభమయింది. విజ్ఞానం కశ్మీరులో పరవళ్లు తొక్కటం ఆరంభమయింది. సాహిత్య సృజన స్వేచ్ఛ లభించింది.

జైనులాబిదీన్ గొప్పతనాన్ని వివరిస్తూ జోనరాజు ఓ సంఘటనను పొందుపరిచాడు తన రాజతరంగిణిలో.

కొందరు దొంగలు ఓ బ్రాహ్మణుడికి చెందిన ఆవును దొంగిలించారు. తన ఆవును దొంగిలించటంతో  బ్రాహ్మణుడు విపరీతంగా రోదించాడు. విషయం తెలిసిన సుల్తాను దొంగలను పట్టుకున్నాడు. వారిని రాజసభలో నిలిపాడు. బ్రాహ్మణుడిని సభకు పిలిపించాడు.  ఆవు రూపరేఖలను వర్ణించమన్నాడు. నిజాయితీపరుడైన బ్రాహ్మణుడు సరిగ్గా వర్ణించలేకపోయాడు. కానీ తన ఆవు కొమ్ములు మాత్రం వంకర తిరిగి ఉన్నాయని చెప్పాడు. అయితే, దొంగలు బ్రాహ్మణుడి మాటలను కొట్టివేశారు. మనిషి శరీరం మీద మచ్చలుండటం ఎంత సహజమో, ఆవు కొమ్ములు వంకర తిరిగి ఉండటం అంత సహజం అన్నారు. రాజసభలో ఉన్న ప్రముఖుల అభిప్రాయం అడిగారు. కానీ ఎవరు సత్యం చెప్తున్నారో చెప్పలేక సభలోని వారందరు మౌనం వహించారు. అయితే రాజు ఏదో పథకం వేసి ఆవు కొమ్ములు బ్రాహ్మణుడు చెప్పినట్టే  వంకర తిరిగి ఉన్నాయని నిరూపించాడు. దొంగలు చెప్తున్న అబద్ధాన్ని నిరూపించాడు. సభలోని వారందరూ రాజు తీర్పును ప్రశంసించారు.

ప్రాడ్‍వివాక్ క్షమాబుద్ధిః యుక్త దండత్వర జ్ఞాకః।
రాజ్ఞో వహత్ప్రజాభారం గణనాపతి గౌరకః॥
(జోనరాజ రాజతరంగిణి 959)

సుల్తాను భారం తగ్గిస్తూ గణపతి గౌరకుడు తన క్షమా గుణంతో ప్రజలకు సంతోష పరచాడు. న్యాయబద్ధమైన శిక్షలు వేస్తూ, అందరి అభిమానం చూరకొన్నాడు.

యైద్దత్తముపకారిత్వాదుత్కో చంద్రవిణం స్వయమ్।
కాలాన్తరే కృతఘ్నేషు తష్యేవా స్థానమండపే॥
(జోనరాజ రాజతరంగిణి 960)

ప్రకాశయత్సు తద్దానం కుపితేన మహీభుజా।
మౌలానో మల్లఎసాకస్తేభ్యస్తత్ ప్రతిదాపితః॥
(జోనరాజ రాజతరంగిణి 961)

అతి అప్రియమైన విషయాన్ని కూడా ఆమోదకరంగా చెప్పటం జోనరాజు దగ్గరే నేర్చుకోవాలి ఎవరైనా. మౌలానా మల్ల ఇసాక్ అనే ఆయన మంచివాడు. అతని మంచితనాన్ని మెచ్చి కొందరు అతనికి స్వచ్ఛందంగా లంచం (ధనం) ఇచ్చారు. తరువాత, కొంత కాలానికి వారు కృతఘ్నులయ్యారు. బహుశా ధనం ఇచ్చిన పని కాలేదేమో! లేక, వారు కోరిన విధంగా పని చేయలేదేమో మౌలానా! వారు తాము మౌలానుకు ధనం ఇచ్చిన విషయాన్ని బహిరంగం చేశారు. నిండు సభలో ఈ విషయాన్ని చెప్పారు. దాంతో సుల్తానుకు కోపం వచ్చింది. ఆగ్రహంతో ఆయన, వారి వద్ద నుంచి తీసుకున్న ధనాన్ని వారికి తిరిగి ఇచ్చేయవలసిందని మౌలానాను ఆజ్ఞాపించాడు. మౌలానా అందుకు ఒప్పుకున్నాడు. ఇది జోనరాజు చెప్పింది.

ఇక్కడ గమనించవలసినదేమిటంటే, రాజు వహిస్తున్న నిర్వహణా భారాన్ని గౌరకుడు స్వచ్ఛందంగా స్వీకరించాడు. ప్రజల మెప్పు పొందాడు. అదే సమయానికి తీర్పు చెప్పేందుకు మౌలానా ధనం తీసుకున్నాడు. ఆ ధనం ఇచ్చి పని చేయించుకున్న వారు కొంత కాలానికి కృతఘ్నులై, మౌలానా తమకు చేసిన సహాయాన్ని మరిచి, విషయం బహిర్గతం చేశారు. సుల్తాన్ ఆ ధనాన్ని వారికి తిరిగి ఇప్పించాడు. ఈ సంఘటన ఆనాటి సమాజంలో ధనాశ లేని పండితులను – ధనాశతో, లోభంతో, ధనం తీసుకుని అనుకూలమైన తీర్పులను చెప్పే మౌలానాలను పక్కపక్కన పెట్టి, ప్రత్యక్షంగా ఏమీ అనకున్నా; పరోక్షంగా పోల్చే వీలును కల్పిస్తున్నాడు జోనరాజు. సుల్తాన్ పట్ల విధేయతను, నిజాయితీని పోల్చి చూపిస్తున్నాడు. అనేక విషయాలను చెప్పకనే చెప్తున్నాడు. పైకి సుల్తాన్ గొప్పతనం చెప్తున్నాడు. తరచి చూస్తే పండితులకు ఇతరులకూ తేడాను ఎత్తి చూపిస్తున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here