[మాయా ఏంజిలో రచించిన ‘America’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(‘అమెరికా’ కవిత – దేశంలోని ప్రజలందరికీ అందాల్సిన సమాన న్యాయం అందడంలేదన్న ఆక్రోశం వినిపిస్తు, అక్కడి వాస్తవ పరిస్థితిని చూపిస్తుంది.)
~
[dropcap]త[/dropcap]న వాగ్దానపు బంగారు గని
ఎన్నడూ తవ్వి తీయలేదు
ఎవరికీ ఏమీ దక్కలేదు
తన న్యాయవ్యవస్థ సరిహద్దులు
స్పష్టంగా నిర్వచించబడలేదు
తన పుష్కలమైన పంటలు,ఫలాలు, ధాన్యరాశి
అన్నార్తుల ఆకలి ఎప్పుడూ తీర్చలేదు
వారి తీవ్రమైన వేదనని ఎవరూ మాన్పలేదు
తాను చేసిన గర్వించదగిన ప్రకటనలన్నీ
గాలికి ఎగిరిపోయిన ఆకులే
దక్షిణ ప్రాంతపు నల్ల మృత్యువు
తనతో బహిరంగంగానే స్నేహం చేసింది
గతించిన శతాబ్దాల ఆక్రందనలను
ఈ దేశంలో వినండి మీరు
ఎవరూ ఖండించలేనిచోట
ఉన్నతమైన ఆలోచనలను
శిలాఫలకం వలె నిటారుగా నిలబెట్టండి
“అతి తక్కువ విలువకు అమ్ముడుబోయి
తన ఉజ్వల భవిష్యత్తుని
బలాత్కారానికి గురిచేసింది కాకుండా
తర్వాత – తాను
అసత్యపు ఇతిహాసాలతో
యువతను తన బుట్టలో వేసుకుంటుంది”
వేడుకుంటున్నా.. మిమ్మల్ని..
ఈ దేశాన్ని కాపాడండి!
Discover this country..!!
నిజమైన అమెరికాని ఆవిష్కరించండి!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ