మహతి-34

7
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[మహతి కళ్యాణిగారింట్లో ఉండగా, అర్జెంటుగా బయల్దేరి వచ్చేయమని వాళ్ళమ్మగారు ఫోన్ చేస్తారు. గబగబా టిఫిన్ తినేసి, కళ్యాణిగారి కారులో హాస్పటల్‍కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఎన్నాళ్లు కావస్తే అన్నాళ్ళు కారుని ఉంచుకోమని, తమ ఇంట్లో మరో గదిని సిద్ధం చేయిస్తానని అంటుంది కళ్యాణి. ప్రస్తుతానికి కారు, డ్రైవరూ చాలంటుంది మహతి. హాస్పటల్‍కి నేనూ రానా అని అల అడిగితే వద్దంటుంది మహతి. అల వస్తే అందరూ ఆటోగ్రాఫులకి ఎగబడతారని అంటుంది. మహతి ఆసుపత్రికి వెళ్లాకా, కళ్యాణి వంటకి రెడీ చేస్తుంటే, అల కూరలు తరుగుతూ కబుర్లు చెప్పుకుంటారు. వంటలకి అదనంగా పెరుగన్నం చేస్తుంది. హాస్పటల్‍లో వాళ్ళు తినడానికి డ్రైవర్‍తో ఇచ్చి పంపిస్తానంటుంది. కళ్యాణిలా ఆలోచించడం తనకి వస్తుందా అని అల అడిగితే, అన్నీ జీవితమే నేర్పిస్తుందని అంటుంది కళ్యాణి. సత్యమోహన్ గారు ఫోన్ చేశారని కనకాక్షి ఫోన్ చేసి చెప్తుంది. అలకి కేరేజ్‍లో సర్ది, మరో నాలుగు పేకెట్లుగా సాంబారన్నం, కర్డ్ రైస్ సర్దుతుంది కళ్యాణి. నాలుగోదెవరికి అని అల అడిగితే, తనకే ననీ, తాను తినలేదంటే, హాస్పటల్‍లో వాళ్ళు తప్పక తింటారని అంటుంది. తన ఇంటికి చేరాకా సత్యమోహన్ గారికి ఫోన్ చేస్తే కథలో కొన్ని మార్పులు చేశామనీ, అలకి వినిపించి తన అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నామని అంటారాయన. పైగా మహతి వచ్చిందని తెల్సిందని, ఆమెని కలవాలని ఉందని, వీలైతే సాయంత్రం రాగలరా అని అంటారు. సాయంత్రం 4.30కి మహతి అల ఇంటికి వస్తుంది. అలసిపోయాను, కాసేపు నిద్రపోతాను అంటుంది. కానీ అల రెడీ అయి ఉండడం చూసి, బయటకి వెళ్తున్నావా అని అడిగితే, సత్యమోహన్ గారి ఫోన్ సంగతి చెబుతుంది. మహతి కూడా రెడీ అయ్యాకా, సత్యమోహన్ గారివద్దకి వెళ్తారు. సత్యమోహన్ గారూ, సదాశివరావుగారూ, వసంత్‍కుమార్ గారూ, డైలాగ్ రైటర్ శివసాగర్ అందరూ మహతిని చూసి సంతోషిస్తారు. పలకరింపులయ్యాకా, సత్యమోహన్ కథ చెప్తారు. పూర్తయ్యాక, ఏవైనా తప్పులు గానీ, సూచనలు గానీ ఉన్నాయా అని మహతిని అడుగుతారు. ఇప్పటికప్పుడు ఏమీ చెప్పలేననీ, కథని మెల్లిగా జీర్ణించుకున్నాక చెప్పగలనని అంటుంది. ఇంటికి వెళ్ళాకా, మహతి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే – వెంటనే బట్టలు తీసుకుని రమ్మంటారు ఆయన. అల కూడా హాస్పటల్‍కి వెళ్ళి మహతి అమ్మానాన్నలని పలకరిస్తుంది. ‘ఇందిర’ గారిని చూస్తుంది. అక్కడ జనాల గోల భరించలేక ఇంటికి వచ్చేస్తుంది. రెండు మూడు రోజుల్లో హిందీ ‘ధీర’ రెండో షెడ్యూల్ మొదలవబోతోందని తెలుస్తుంది. – ఇక చదవండి.]

మహతి మనవి

ఒక చిన్నమాట:

[dropcap]నా[/dropcap] పేరు మహతి. నా కథ నేను మీతో చెప్పుకుంటున్నప్పుడు ‘అల’ తన కథని కూడా నన్నే వ్రాయమని అడిగింది. వ్రాయక తప్పలేదు అనేకంటే, నాతో బాటు తన కథనీ వ్రాయడం నాకు చాలా ఇష్టమనిపించింది. ఎందుకంటే, నా జీవితం మామూలు జీవితం, కొంత వైవిధ్యం వుండు గాక! కానీ అల జీవితం మామూలు జీవితం కాదు. సంచలనాలకు పేరైన సినిమా జీవితం. నాకు ఏ మాత్రం పరిచయం లేని జీవితం. అయితే ఎలా వ్రాస్తున్నానూ? అనేదే మా ప్రశ్న అయితే, తననించే విని నేను అక్షర రూపం కల్పిస్తున్నాననేది జవాబు.

కొంచెం పరకాయ ప్రవేశం చెయ్యక తప్పదు. ‘రచన’ అంటేనే పరకాయ ప్రవేశం. సరే. ప్రస్తుతానికి కాసేపు అలని ‘ధీర’ హిందీ సినిమా రెండో షెడ్యూల్‌కి పంపించి, మళ్ళీ నా కథని మీ ముందుకు తీసుకువస్తాను. నా పేరు మహతి, అమ్మ పేరు అహల్య, నాన్న పేరు గౌతమ్, సోదరులిద్దరు నరేన్, సురేన్; చెల్లి కల్యాణి. నన్ను పెంచిన తాతయ్య అమ్మమ్మ, నాకు పరిచయమై నన్ను సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితురాలిని చేసిన డా. శ్రీధర్, ఫ్రెండ్స్ హరగోపాల్ (హగ్గీ) తిమ్మూ (తిరుమలరావు) ఇంకా ఎందరెందరో మీకు గుర్తుండే వుంటారు. మా వూరు పేరు గుర్తుందా? ‘కర్రావూరి వుప్పలపాడు’.

ప్రస్తుతం నేను ఏం చేయ్యాలా, భవిష్యత్తులో ఏం కావాలో అని ఆలోచిస్తున్నా. ఓ పని మీద హైదరాబాదు వచ్చి అలనీ, కళ్యాణి గారినీ, డైరెక్టర్ సత్యమోహన్ గారినీ, సదాశివరావుగారినీ – అందర్నీ కలిశాను. ఇక్కడ్నించే నా కథ మళ్ళీ మొదలు పెట్టాలి. కానీ, ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మొదలు పెడతా.  అల ‘ధీర’ హిందీ సినిమా కోసం ‘సిర్సా’ అని పట్టణ ప్రవేశం నించీ; సరేనా. Come.. మరో పయనం ప్రారంభిద్దాం.

మీ మహతి.

~

మహతి-3 మహి-1

తొమ్మిది పేజీల ఉత్తరం వ్రాసింది అల.

‘సిర్సా’ అనే హర్యాణా సిటీ నుంచి. ఊరి పొలిమేరలోనే కారు దిగి నేలతల్లికి నమస్కారం చేసిందిట. ఇల్లూ బంధువులు అనే బావినించి బయటి కొచ్చానే మహీ! ఎంత అద్భుతంగా వుందో తెలుసా జీవితం? మనం చదువు వుద్యోగం అంటూ జీవితాన్ని వెళ్ళదీస్తాం. కానీ జీవించడం ఎలాగో ఏనాడూ మనం తెలుసుకోము. పెద్ద వాళ్ళు అనుకునే మనవాళ్ళు కూడా పనికిరాని శుష్క వేదాంతాలు వల్లిస్తారే గానీ జీవితం గురించి చెప్పరు. చెప్పకపోతే పీడాబాయిరి.. భయపెట్టి చంపుతారు. వాళ్ళ దృష్టిలో అది భయపెట్టడం కాదు, జాగ్రత్తలు చెప్పడం. మహీ., మా అమ్మ నిజంగా గొప్ప మనిషే. నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఎంతో ప్రోత్సహించింది. ఇవ్వాళ చెప్పగలను.. ‘స్వాతంత్ర్యం అంటే ఏమిటో’ అని పెద్ద పేరా మొదటి పేజీలోనే వ్రాసింది.

జీవితం ఎంత విచిత్రమైనదీ? అందర్నీ తన ప్రవర్తనలో ఇబ్బంది పెట్టిన ‘అల’, ఇప్పుడు సీతాకోకచిలుకై జీవిత పాఠాలు చెబుతోంది. జీవితపు అనుభవాల లోతుల్నీ చూస్తోంది.. నాకు సంతోషమనిపించింది.

“మహీ, నార్త్ నార్తేనే. వీళ్ళకి జీవించడం తెలుసు. ప్రతి పండుగలోనూ గానం, నృత్యం ఉండి తీరాల్సిందే, ఇక్కడా అచ్చమ్మ బుచ్చెమ్మ కబుర్లూ, తోటివాళ్ళ మీద నిందలు వెయ్యడం లాంటి అవలక్షణాలు ప్రజల్లో కనబడతాయి. కానీ, వీటన్నటికీ మించింది ఏదో వుంది. అదేదో నాకు ఇప్పటి వరకూ అంతుపట్టలేదు. హాయిగా తింటారు.. తినిపిస్తారు. సినీవాలాలకి మనలాగా ఇక్కడ భేషజాలు పుండవు. అందరితో కలిసిపోతారు” అంటూ, నాకు పరిచయం లేని సినీ జగత్తు గురించి రాసింది.

“జీవితాన్ని నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా. కాలేజీలో, ఇంట్లో భయం తప్ప, మూర్ఖత్వపు ఆలోచనలు తప్ప ఏమీ లేవు. అందరి కంటే ముందు ‘నన్ను నేను’ ప్రేమించుకోవడం ఇప్పుడే నేర్చుకుంటున్నా. నిజమూ అంతేగా! నన్ను నేను ప్రేమించుకోలేనిదాన్ని ఎవరైనా ఎట్లా ప్రేమించగలను? నన్ను నేను ప్రేమించుకోవడం అంటే యీ లోకం మొత్తాన్నీ ప్రేమించడం అని మెల్ల మెల్లగా అర్థమవుతోంది.” అని కూడా వ్రాసింది. ఆ లైను నాకు నచ్చడమే కాదు, చాలా ఆలోచింప జేసింది.

అల చాలా ఎదుగుతోంది.. మానసికంగా. అది కాదనలేని నిజం.

“చిన్నచిన్న బిందువులు సింధువైనట్టుగా, చిన్నచిన్న ఫిలిం ముక్కలు సినిమాగా రూపుదిద్దుకుంటాయి. కొన్ని వందల భావాలు ముఖల్లో ప్రతిఫలించి ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. భావాలు ముఖం నుంచి సినిమాగా తర్జుమా కావడం ఓ అద్భుతమైన అనుభవం. చిన్న చిన్న నవ్వుల్నో, కన్నీటి చుక్కల్నో పోగు చేసి ఓ గుట్టనో, సెలయేటినో తయారు చెయ్యడం లాంటిదన్నమాట.”

ఈ పేరాని చదివి కాసేపు నిశ్శబ్దంగా వుండిపోయా. ఆ అల రీడర్ కాదు. ఈ అల ఖచ్చితంగా ఫెరేషియస్ రీడర్. సాహిత్యపు లోతులు చూస్తే గానీ, అల చెప్పిన ఉపమానాలు అక్షరరూపం దాల్చవు. చాలాసేపు ఆలోచించాను. ఫ్యూచర్‌లో నేను ఏం చెయ్యాలీ అనే ప్రశ్న మళ్ళీ నా ముందుకి వొచ్చింది.

ఓ నిట్టూర్పు అప్రయత్రంగా నా నాశిక నుంచి సుదీర్ఘంగా వెలువడింది. మళ్ళీ అల ఉత్తరం చేతిలోకి తీసుకున్నాను. “మొదట్లో భయపడ్డాను మహీ.. సినిమా అంటే. కానీ ఇప్పుడా భయం లేదు. జీవితమూ ఓ తెరకెక్కించబడని సినిమానేగా! బోర్లపడలేని శిశువు దశ నించి ఎక్కడిదాకా ఎదిగాం? తల్లిదండ్రులు, బందువులు, స్నేహితులు, గురువులూ, పరిచయస్థులూ, ప్రవచకులు అందరూ మన మన జీవితాల్లో పాత్రలేగా! ఏ పాత్రనీ మనం సృష్టించలేదు. వాటంతట అవి జీవితంలోకి వచ్చి వాటంతట అవి నిష్క్రమిస్తున్నాయి. ఈ జీవితమనే సినిమాని తీస్తున్న భగవంతుడు ఎంత గొప్ప డైరక్టరే!”

నాకు షాక్. అది చెప్పిన విధానం ఎంత బాగుందీ! అందరూ పాత్రలే! మనం సృష్టించని పాత్రలే.

నా కళ్ళవెంట బొటబొటా నీళ్ళు కారాయి.

“అమ్మమ్మ గుర్తు కొచ్చిందా?” నా పక్కనే కూర్చుని నా తల నిమురుతూ అన్నాడు తాతయ్య. నాకు నోరు పెగల లేదు.

“అమ్మమ్మ మనని విడిచి ఎక్కడికో పోయిందని అనుకుంటాం. ఎక్కడికి పోయిందీ? ప్రతిక్షణం మనతోటే ఉంటోందిగా. ప్రతిక్షణం మన ఆలోచనల్లో ఉయ్యాల వూగుతునే వుందిగా” తాతయ్య చెయ్యి నా తల నిమిరేటప్పుడు వణకటం నాకు స్పష్టంగా తెలుస్తూనే వుంది.

దుఃఖంతో గుండె నిండిపోయినప్పుడు ‘నిట్టూర్పులు’ కూడా అపురూపమైన వరాలే. ఓ క్షణం పాటైనా ఆలోచనలకి అవి అడ్డుకట్ట వేస్తాయి.

తాత బాగా క్రుంగిపోవడం కనిపిస్తూనే ఉంది. అమ్మానాన్నలు కూడా అమ్మమ్మ మరణంతో క్రుంగిపోయారు. తమ్ముడు, చెల్లి సంగతి సరేసరి.

వారం కిందటి వరకూ, అమ్మమ్మ మా మధ్యనే ఉంది. చక్కగా బొబ్బట్లు, పులిహోర, పచ్చిమిరపకాయ బజ్జీలు, సగ్గుబియ్యం సేమ్యా కలిపిన పాయసం – అన్నీ – తనే కబుర్లాడుతూ వొండి మా కందరికీ నవ్విస్తూ తినిపించింది.

“నువ్వు తిను అమ్మమ్మా” అన్నాను.

“వండేటప్పుడే సగం పొట్ట నిండిపోయిందే. ఓ గంట ఆగాక తింటే ఇంకో బొబ్బట్టు మరో నాలుగు బజ్జీలు ఎక్కువ తినొచ్చు.. అదే మీ తాతయ్యని వూరిస్తూ” అని పకపకా నవ్వింది. ఎన్నడూ లేనిది, “ఇదివో పెద్దాయనా, ఇంట్లో బోలెడు తమలపాకులూ వక్కలూ ఉన్నై. ఏనాడయినా నీకు తాంబూలం ఇవ్వలేదని గొణుగుతావుగా, ఇదిగో చిలకలు చుట్టి తెచ్చా.. హాయిగా నవులు” అని తమలపాకు చిలకలని తాత వేళ్ళకి తొడిగింది. ఆయన మహదానందంతో నవలడం మొదలుపెట్టాడు.

మా భోజనాలన్నీ అయ్యాక వంటిల్లు చక్కగా సర్ది, “అహీ.. గుండెల్లో ఏదో నొప్పిగా ఉందే.. వచ్చిన పని అయిపోయిందనుకుంటూ” అంటూనే నేలకి వాలిపోయింది. అదే ఆవిడ చివరి మాట. హాస్పటల్లో చేర్చాం. ఆక్సిజన్ పెట్టించాం. ఏమీ లాభం లేకపోయింది. ఇంట్లోంచి వెళ్లిన రెండు గంటలకల్లా ఇంటికి తిరిగొచ్చింది. కర్రావూరి వుప్పలపాడుకి  ఫోన్లు చేసి విషయం చెప్పి కర్మకాండలకు సర్వం సిద్ధం చేయించాం. ఊరు వూరంతా వచ్చి ఆవిడకి వీడ్కోలు పలికింది. కన్నీళ్ళు కార్చని వారు లేరు. మూడు రోజుల పాటు వూరంతా మా వెంటే ఉంది. 10, 11, 12 రోజుల చిన్న, పెద్ద కర్మలు కూడా అక్కడే జరిగేలా ఏర్పాట్లు చేశాం. రేపు వూరికి బయలుదేరుతానగా అల ఉత్తరం.

జాగ్రత్తగా ఉత్తరాన్ని మడిచి కవర్లో పెట్టాను. పూర్తిగా చదివే శక్తి లేదనిపించింది. మరో విషయం ఏమంటే, ఎన్నో ఎన్నో మాట్లాడాలనుకుంటాం, ఎన్నో ఎన్నో చెప్పాలనుకుంటాం, ఆ చెప్పాలనుకున్నవి ఎన్నటికీ చెప్పలేకపోయే రోజూ వస్తుందని నేను ఏనాడూ వూహించలా. ఇప్పుడు ఎన్ని గంటలు రోదించినా ఏమి లాభం. ఒక్కసారి శరీరాన్ని విడిచి ప్రాణం వెళ్ళిపోయాక విశ్వాన్ని అంతా రాసిస్తానన్నా తిరిగి వస్తుందా?

రోదనకీ వేదకీ ఇది సమయం కాదని నాకు తెలుసు. ఓ హిందీ పాటలో కవి అంటాడు – ‘జీవన్ కా మత్‍లబ్‌తో ఆనా ఔర్ జానా హై’ అని. అంటే జీవితానికి అర్థం రావడం పోవడం, అంతే. అమ్మమ్మ వచ్చింది వెళ్ళింది. ఏం తీసుకొచ్చింది, ఏం తీసుకెళ్లింది? నిజమే – ఏమీ తీసుకురాలా, తీసుకుపోలా.. కానీ అహల్య అనే తను సృష్టించిన సజీవమూర్తిని యీ నేల తల్లికి ఇచ్చింది. పరోక్షంగా మమ్మల్నీ యీ లోకానికి తీసుకొచ్చింది. నవ్వులు పంచి, వాడిపోయిన పువ్వులా నేలవాలింది.

అన్ని ఏర్పాట్లూ నేనే చేశాను. ఓ అనంతమైన వేదన లోంచి, కొంత ఊరటని కూడా అన్ని ఏర్పాట్లూ స్వయంగా చేయడంలో పొందాను. భోజనాలకి వూరు వూరే తరలి వచ్చింది. మా అమ్మమ్మ ఊరించి వడ్డించినట్లుగానే నేనూ ఊరించి ఊరించి వడ్డించాను.

ఊరందరికీ తెలుసు, ఆవిడ వొండుతూ వడ్డిస్తూ ఎలా ఊరిస్తుందో! పేదలందరికీ పెద్ద స్టీలు కంచాలు గ్లాసులు పంచాం.. స్వీట్లతో నింపి. చుట్టాలకీ పక్కాలకీ స్వీట్లు నింపిన స్టీలు డబ్బాలు ఇచ్చాం.

అందరూ వెళ్ళిపోయాక, తుఫాను వెలసిన సంద్రంలా ఉంది ఇల్లు. అమ్మమ్మ పెద్ద ఫోటోని కుర్చీలో నించి గోడకి మార్చాం. గంధపు రేకుల దండ తగిలించాం ఫోటోకి. నిన్నటి దాకా సజీవం అయిన ఓ వ్యక్తి నేడు గోడ మీది జ్ఞాపకంలా మారిపోయింది.

***

“గుండెల్లో బాధని గుండెల్లోనే దాచుకోకు.. అది గడ్డ కట్టి తరువాత తరువాత ఎప్పుడో, మనసులోని సున్నితత్వాన్ని కూడా గడ్డకట్టించేస్తుంది. మృత్యువుని ఓ సహజ పరిణామంలా తీసుకో.” కార్యక్రమాలు అన్నీ అయిపోయాక మెల్లగా నాతో అన్నారు డాక్టర్ శ్రీధర్. నేను నీరసంగా నవ్వాను. “డాక్టర్.. నా పుట్టుక నించి హైస్కూలు చదువుల వరకూ ఇక్కడే, అమ్మమ్మ తాతయ్యల దగ్గరే జరిగింది. నిజం చెబితే వాళ్ళే నా దృష్టిలో నన్ను ‘కన్నవారు’. అమ్మమ్మ తిరిగి రాదని తెలుసు. కానీ బ్రతికున్న తాతయ్య సంగతే తెలీదు. మీకో విషయం చెప్పనా? అమ్మమ్మ తాతయ్య ఇక్కడున్న కాలం కాలం ‘మంచి’ భార్యాభర్తల్లానే గడిపారు. ఆయన పొలానికి వెళ్ళి వస్తే ఆవిడ చక్కగా వొండిపెట్టేది. కానీ సార్, వారిద్దరూ మాతో టౌన్‍లో వున్నప్పుడు ప్రాణస్నేహితులయ్యారు. అంత దగ్గరితనం పెరిగింది. కారణం ఏ బాధ్యతా వాళ్ళకి లేకపోవడం, కలిసి అన్నిట్నీ పంచుకోవడం. అందుకే తాతయ్య బాధని ఎలా తీర్చడం? మళ్ళీ ఆయన ఆ టౌన్‌లో వాళ్ళుండే ఆ గదిలో ఇప్పుడు ఒంటరిగా గడపగలడా?” ఆగాను.

ఓ చుక్క కన్నీరు బుగ్గల మీదకి జారింది.

“నిజం మహి.. నీ ఆలోచన ముమ్మాటికీ నిజం, నేనంత దూరం ఆలోచించనే లేదు!” మెల్లగా లేచి తన పోర్షన్ వైపుకి వెళ్ళారు డాక్టర్ గారు. తమ్ముడు చెల్లి కొంత తేరుకున్నారు. అమ్మానాన్న మాత్రం మౌనం నుంచి బయటపడలేదు. మళ్ళీ తట్టా బుట్టా సర్దుకుని బయలుదేరాం.

“అమ్మా.. నేను మళ్ళీ టౌన్‌కి రాలేను. చిన్నప్పటి నుంచి గడిపిన యీ వూళ్ళోనే గడుపుతాను. కంగారు వద్దు. మీ అమ్మ కూడా యీ వూరి నేలలోని వుందిగా. పొలాలూ, తోటలూ చూస్తూ వుంటే పొద్దుపోతుంది. ఏ మాత్రం కంగారు చేసినా, మీకు చెప్పడానికి ఫోన్ ఉందిగా. నా ఆరోగ్యం గురించి దిగులు పెట్టుకోవద్దు. మన పాలేరు భార్య కూరలూ అవీ తరిగిపెడుతుంది. మీ అమ్మ నన్ను వంటింట్లోకి రానిచ్చేది గాదు గానీ, ఏదెలా వండాలో మాత్రం తెగ వర్ణించేది. ఆ మాత్రం చాలు.. వంట మొదలుపెట్టడానికి. అదీ ఓ టైంపాస్ అవుతుంది. నిన్న దాక అది నాతో వుంది. ఇవాళ దేవుడిలో కలిసిపోయింది. అందుకే నేను వంట చేసుకుని, దానికి నైవేద్యం పెట్టి..” ఠక్కున సైలెంటైపోయారు తాతయ్య.

బావురామని ఏడవడం మొదలెట్టింది మా అమ్మ. ఏనాడూ ఆవిడ ఇంతగా అల్లాడిపోవడం నేను చూడలేదు.

నేను మౌనంగా మా తాతయ్య దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేశాను. నాకు తెలుసు.. కోటి మాటలు ఓదార్చలేని బాధని ఓ చిన్న స్పర్శ ఓదార్చగలదని. మా నాన్న వైపు చూశా. నిర్ఘాంతపోయి శిలలా కూర్చున్నారు.

“ఆయనని ఒంటరిగా వదలడం మంచిది కాదు. ఆల్రెడీ ఆయనకి స్ట్రోకు వచ్చింది” తన గదిలోంచి బయటకు వచ్చి అన్నారు డాక్టర్ శ్రీధర్. బహుశా మా సంభాషణలన్నీ ఆయన చెవులబడి వుండాలి. హాల్లోంచి రూమ్‌కి ఎంత దూరం వుంది గనక.

“అవును శ్రీధర్ గారూ, నేనూ అలాగే అనుకుంటున్నాను. అమ్మ ఎలానూ పోయింది. ఆయన్ని విడిగా, ఒంటరిగా విడిచి పెట్టేది లేదు.” దృఢంగా అన్నారు మా నాన్న.

“నాన్నా.. అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. నువ్వూ మాకు దూరంగా వుంటే? వద్దు నాన్నా.. ఏ నిర్ణయాలూ వద్దు. అందరం కలిసేవుందాం..” కూర్చున్న చోటు నించి లేచి తాతయ్య దగ్గరికి వచ్చి అన్నది అమ్మ. నేను తాతయ్య ముఖాన్ని చూస్తునే వున్నాను. ఆయన ముఖంలో ఓ బాధావీచిక.

“తాతగారూ, మీరు మీ పిల్లల మాటలు వినండి. ఓ డాక్టరుగా నేనిచ్చే సలహా కూడా అదే. తన అనే వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు వచ్చే దుఃఖం చాలా భారంగా మారుతుంది, ముఖ్యంగా హార్ట్‌కి. దయచేసి మీ అల్లుడుగారి మాట మన్నించండి. చుట్టూ నలుగురు వున్నప్పుడే దుఃఖ నివృత్తి అవుతుంది. ఒంటరిగా వున్నంత కాలం మీకు అమ్మమ్మ గారే గుర్తుకొచ్చి మనసు వేదన పాలవుతుంది.” నచ్చచెప్పే ప్రయత్నం చేశారు శ్రీధర్ గారు.

ఏదో మాట్లాడాలని తాతయ్య ప్రయత్నంచి విఫలుడవటం నేను చూస్తూనే వున్నాను. ఇంకొటి కూడా అనిపించింది. ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మనసు కోరుకునేది చుట్టూ జనాల్ని కాదు. ఒంటరితనాన్ని!

నాకు అర్థమైనంత వరకూ తాతయ్య ఎవరి మాటన విన్నట్టు లేదు. ఆయనదైన లోకంలో, ఆయనదైన ఆలోచనలో ఉన్నారు. ఆ లోకంలో దృశ్యం తప్ప మాటల్లేవు.

ఇల్లంతా నిశబ్దం అలుముకుంది. ఎవరి ఆలోచనల్లో వారు వున్నారు. ఎలాగైనా తాతయ్యని ఒప్పించాలని అమ్మనాన్నల ఆలోచన. చిన్నపిల్లలు, అంటే చెల్లీ తమ్ముడు బయటకి పోయారు పాలేరుతో. అంటే తోటకన్న మాట.

“సరే అహల్యా.. నువ్వు మీ నాన్నగారికి తోడుగా ఇక్కడుండిపో. మహితో అక్కడి పరిస్థితిని నేను మేనేజ్ చెయ్యగలను.” సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి అన్నారు నాన్న.

“అదెలా?” వెంటనే అన్నది అమ్మ. “ఇద్దరి పిల్లల్ని పెట్టుకుని మహి ఎలా మేనేజ్ చెయ్యగలదు? వాళ్ళు ఇంకా స్కూల్లో చదివే పిల్లలు. వాళ్ళని స్కూలుకి పంపే తయారీలోనే నాకు తల ప్రాణం తోక కొస్తోంది. మహీ ఏం చెయ్యగలదు?” అమ్మ గొంతులో నిస్సహాయతతో కూడిన నిష్ఠూరం. బహుశా ‘రాను’ అని మొండికేసిన తాతయ్య మీద కూడా కోపం వుండివుండొచ్చు.

“నా గురించి మీరేమీ..” మళ్ళీ ఆగిపోయాడు తాతయ్య. ఆయనకి గొంతు లోంచి మాట పెగిలి రావడం లేదు. ‘గాద్గదికం’ అంటారు కదూ.. అదే నేను చూసింది.

“మీ గురించి కాక ఎవరి గురించి ఆలోచించాలి? మిమ్మల్ని ఒంటరిగా ఇక్కడ పడేసి వెళ్ళి పొమ్మంటారా? మీ పరిస్థితిలో అమ్మ వుంటే ఆవిడ్ని ఇక్కడే వదిలెయ్య మనగలరా? నాన్నా నేను నీ కూతుర్ని. నిన్ను చూసుకోలేకపోతే నేను బ్రతికి వుండటంలో అర్థం ఏముంటుందీ? నిన్ను ఇక్కడ వుంచి ఒక్కక్షణం నేనక్కడ శాంతంగా ఉండగలనా?” చాలా చాలా చాలా ఎమోషనల్‍గా అన్నది అమ్మ. అమ్మ సామాన్యంగా చాలా కంట్రోల్డ్‌గా వుంటుంది. ఎప్పుడూ బయటపడదు. ఆవిడ మాటల్లో ఓ పక్క తండ్రి మీద ప్రేమా, ఓ పక్క మాపైన వున్న బాధ్యతా అన్నీ కలగాపులగంగా వ్యక్తమయ్యాయి.

ఒక్కసారి నా మనసు వెనక్కి పోయింది.

“నువ్వు డాక్టరు వయితే మనకీ దేశానికీ మంచిది” అన్నారు తాతయ్య ఆనాడు.

“నువ్వు లాయరు వైతే గొప్ప పేరు తెచ్చుకుంటావు” అన్నది అమ్మ.

“నీ నడక అచ్చు ఇందిరాగాంధీలా వుంటుంది. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవకపోయినా, మనూరి పంచాయతీ ప్రెసిడెంటుగా నిలబడవే.. నేను కాలరెగరేస్తాను” అన్నది అమ్మమ్మ.

“నువ్వు టీచరువి కా” అన్నారు తమ్ముడు, చెల్లెలూ.

నేను ఆలోచిస్తున్నా.

“పోనీ మీ వూరెళ్ళే ప్రోగ్రాం ఇంకో రెండు రోజుల తరవాత పెట్టుకోండి. ఎంత కాదనుకున్నా అందరూ పనులతో అలసిపోయారు. అలసిన మనసు చేసే ఆలోచన అర్థవంతంగా ఉండదు” అన్నారు  డాక్టరుగారు

“అవునండయ్యా.. అయ్యగారింకా కోలుకోలేదండీ. ఆరిని చూస్తే మా ప్రాణాలు తరుక్కుపోతున్నాయండీ.. ఇంకో రెండు రోజులు ఆగండి.” పాలదుత్త తీసుకొచ్చిన పాలేరు డాక్టరు గారి మాట విని అన్నాడు. అందరికంటే ముందు తాత తలపంకించాడు ‘సరే’ అన్నట్టు.

ప్రయాణం ఆగింది.

నాలో ఆలోచనల ప్రవాహం ఎగసిపడుతోంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here