[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, కథ, నవల, నాటక రచయిత డా. వి. ఆర్. రాసాని గారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ వారి ‘విశిష్ట సాహిత్య పురస్కారం’ లభించింది.
అన్ని సాహిత్య ప్రక్రియల్లో అందెవేసిన చేయి గానూ, నాటకప్రయోక్తగాను, నటుడిగాను, గొప్ప పరిశోధకుడు, సాహిత్య విశ్లేషకుడి గాను బహుముఖ ప్రజ్ఞాశాలిగాను, ఉత్తమ అధ్యాపకుడిగాను పేరు తెచ్చుకున్నారు రాసాని.
రాసాని ఇంతవరకు 160 కథలు,14 నవలలు, 30నాటికలు, 8 నాటకాలు, 6 పరిశోధనా గ్రంథాలు, రెండు జీవితచరిత్రలతో సహా, కాలమ్ రచనలు ఎన్నో చేశారు.
వీరు ప్రచురించిన చీకటి రాజ్యం, ముద్ర, బతుకాట, వలస, స్వప్నజీవి, ఆదియోధుడు లాంటి నవలలు, మెరవణి, విషప్పురుగు, మావూరి కతలు, ముల్లు గర్ర, పయనం లాంటి కథా సంపుటాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, చెంచిత, కాటమరాజు యుద్ధం, అజ్ఞాతం వంటి నాటకాలు వంటివి ప్రసిద్ధి చెందినవి. వీరి రచనలపైన పలు విశ్వవిద్యాలయాలలో పలువురు పరిశోధనలు సాగించి పట్టాలు పొందారు. 11 జనవరి 2024 నాడు ఏలూరులో జరిగిన సభలో రాసాని గారికి ఈ పురస్కారాన్ని అందించారు.