వెండి డోనిగర్ పుస్తకాలు – స్పందన

0
3

[వెండి డోనిగర్ తన పుస్తకాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలకు తన స్పందన తెలియజేస్తున్నారు శ్రీ కోవెల సంతోష్ కుమార్.]

[dropcap]సం[/dropcap]చికలో గత వారం (7 జనవరి 2024) వచ్చిన ఒక పుస్తక పరిచయం నన్ను ఆకర్షించింది. వెండి డోనిగర్ అనే ఆవిడ భారతీయ సంస్కృత, ప్రాచీన సాహిత్యంలో మేధావురాలిగా పేరు గడించారని, వారు రచించిన రెండు గ్రంథాలను శ్రీ కాళిదాసు పురుషోత్తం గారు పరిచయం చేశారు. ఈ పరిచయం చదివిన తరువాత నాకు అనిపించిన కొన్ని అంశాలు ప్రస్తావించాలని ఉన్నది. ఎందుకంటే వెండి డోనిగర్ గారు రాసిన గ్రంథాలలో ఒకదాన్ని(The Vedic Antecedents) నేను చదివాను. ఈ రెండు గ్రంథాలను నేను చదువలేదు. కానీ ఈ పరిచయంలో శ్రీ పురుషోత్తం గారు డోనిగర్ ప్రస్తావించిన అంశాలను పేర్కొంటూ వెళ్లారే తప్ప.. తానుగా వ్యాఖ్యానించిన సందర్భాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ పరిచయంలో పేర్కొన్న కొన్ని అంశాల గురించి మాత్రం.. వీటి పరిధిలో మాత్రమే నాకున్న అవగాహన మేరకు కొన్ని అంశాలను మాత్రం కొంత విస్తృతంగానే స్పృశించాలని అనిపించింది. ఇవన్నీ గతంలో మహానుభావులు చెప్పినవే. చర్వితచర్వణంగా మరోసారి చెప్పాల్సిన అవసరం ఉన్నదని అనిపించింది. కారణం.. ఇవే అంశాలు చెప్పిందే చెప్పి పదే పదే శతాబ్దాలుగా చెప్తూనే ఉన్నారు. ఎవరు ఎన్ని సార్లు వివరించాలని చూసినా.. వీటిని అదే పనిగా చెప్తుంటారు. డోనిగర్ చెప్పిన అంశాలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఇందులో ఎలాంటి విచిత్రమూ లేదు. ఇవేవీ కొత్త ఆలోచనలు అంతకంటే కావు. 17వ శతాబ్దం నుంచి కూడా ఈ దేశంపై జరుగుతున్న దాడులు, దుర్వ్యాఖ్యానాలు, అవగాహన లేని వక్రీకరణల్లో ఇవీ కొంత వరకు భాగమే. అందువల్ల కాస్త వివరంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను.

మత గ్రంథాలపైన, మత విశ్వాసాలపైన అచంచల విశ్వాసం ఉన్నవారికి ఆమె లేవనెత్తిన ప్రశ్నలు ఊహల్లోకి కూడా రావు, స్పురించవు అన్న మాటలు నిజమే. ఒక రకమైన ఓరియంటేషన్లో ఉన్నవారు మినహా మిగతా వారికి, భారతీయ ధర్మాన్ని, జీవన విధానాన్ని అర్థం చేసుకొన్నవారికి ఊహల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు రావు గాక రావు. స్ఫురించవు గాక స్ఫురించవు. అసలు భారతీయ ధర్మాన్ని, పుస్తకాలను మతమనే చట్రంలో బిగించడంతోనే వీళ్ల అవగాహన పరిమితులు ఏమిటన్నది స్పష్టమవుతున్నది. ఎందుకంటే ఈ మతం అన్న మాట తెల్లోడు వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు. మనకు వృత్తులు మాత్రమే ఉన్నాయి. వాటిని బట్టే పిలుపులు, పలకరింతలు ఉండేవి. మతం ఓ లాటిన్ పదం. రిలిజియో అన్న లాటిన్ పదమే మతంగా ట్రాన్స్‌ఫామ్ అయింది. పవిత్రమైన వాటికి గౌరవం ఇవ్వడం, దేవతలను పవిత్రంగా ప్రార్థించడం అన్న అర్థంలో ఈ పదాన్ని వాడేవారు. మనిషికి, దేవతలకు మధ్య బాధ్యత, బంధం అన్న భావన నుంచి ఈ రిలీజియో అన్న మాట పుట్టుకొచ్చింది. 16, 17 శతాబ్దాల మధ్యన ఈ రిలీజియో పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. సైనికులు ప్రమాణం చేస్తున్నప్పుడు దానికి కట్టుబడి ఉండటం అన్న భావనకు రిలీజియో అన్న పదాన్ని జూలియస్ సీజర్ వినియోగించాడట. రోమన్ ప్రకృతి శాస్త్రవేత్త ప్లీనీ.. రిలీజియో అన్న మాటను ఏనుగులపై వాడాడు. జోసెఫ్ కాంప్‌బెల్, టామ్ హార్పర్ వంటివారు కూడా ఈ పదాన్ని విశ్వాసము, నమ్మకమూ అన్న అర్థంలో వాడుకుంటూ వచ్చారు. లాటిన్ పరిభాషలో రిలిజియో అన్న మాటకు మనస్సాక్షి, హక్కు, నైతిక బాధ్యత అన్న అర్థాలు ఉన్నాయి. మనదేశంలో దేవుని ఆరాధన అన్నది వ్యక్తిగత ధర్మంగానే పరిగణించారు తప్ప.. సామాజిక అంశంగా ఎప్పుడూ గుర్తించలేదు. రోమన్లు దేవతల పట్ల సంబంధాల సందర్భంలో కట్టుబాటుగా ఈ రిలిజియో మాటను వాడారు. క్రీస్తుశకం 1500 వరకు కూడా రిలీజియన్ అన్న మాటకు ప్రాచుర్యం రాలేదు. యూరప్ దేశాలలో క్రీస్తుశకం 1500 లలో.. పరిపాలనలో చర్చి ఆధిపత్యాన్ని తగ్గించడానికి చర్చికి.. పౌర అధికారుల మధ్య అంతరాన్ని సూచించేందుకు రిలీజియన్ అలియాస్ మతం అన్న మాటను వినియోగించారు. 17వ శతాబ్దంలో క్రైస్తవ మత విభజన, ప్రొటెస్టెంట్ల సంస్కరణ వాదం, ప్రపంచీకరణ వంటి పరిణామాల నేపథ్యంలో రిలీజియన్ అన్న మాటను మతమనే అర్థంలో విస్తృతంగా వాడటం ప్రారంభమైంది. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో ఇది అత్యంత ప్రముఖ పాత్ర పోషించింది. యురోపియన్ భాషలు కాని భాషా సంస్కృతులను మతాలుగా పరిగణించారు. జాతి అన్న నిర్వచనమూ దీంతోపాటే వచ్చింది. వాస్తవానికి అంతకుముందు బైబిల్ ఖురాన్‌లలో కూడా మతం అన్న మాట లేదు. హిబ్రూలో మతానికి సమానమైన పదం కనిపించదు. జూడాయిజం.. దేశం, జాతి, మతం వంటి ప్రత్యేక గుర్తింపులను చూడదు. యూదులు తమ గుర్తింపును ఒక జాతీయ భావనతో చూశారే తప్ప మత ప్రాతిపదికన చూడలేదు. వీరు తప్పనిసరిగా ఒక సిద్ధాంతాన్ని నమ్మడం కానీ.. నియంత్రిత ఆచారాలను పాటించడం కానీ చేయరు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాడు.. తాను ఆక్రమించుకున్న అన్ని దేశాల్లోనూ ఈ మతమనే మహమ్మారిని వ్యాప్తిచేశాడు. పర్యవసానంగా దేశంలో సమాజం విచ్ఛిన్నమవడానికి కారణమైంది. మనదేశంలో మతమన్నదే లేనప్పుడు వేదమతం, హిందూమతం, శైవమతం, వైష్ణవమతం, శాక్తేయ మతం అన్న భావనలకు ఆస్కారమెక్కడిది? యూరోపియన్ చరిత్రకారుల మాయ పొరలు వీడనంతకాలం ఈ దేశంలో వితండ వాదనలు.. వింత సమర్థనలు కొనసాగుతూనే ఉంటాయి. విదేశీ మూకలు ముందునుంచీ భావ దారిద్ర్యంతోనో.. లేక, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్న కుట్ర కోణంలోనో ఈ దేశ చరిత్రను, సంస్కృతిని, భాషను, జీవన విధానాలను ధ్వంసం చేసే యత్నం చేస్తున్నాయి. మనదేశంలో అతి ఛాందస కమ్యూనిస్టులు, హేతువు తెలియని హేతువాదులు, లిబరలిస్టులు, స్వయం ప్రకటిత మేధావులకు మాత్రమే ఇలాంటి సమర్థనలు చేయక తప్పనిస్థితి. ఎందుకంటే వీరి ‘ధర్మం’ ఇది.

ఇక సంస్కృతం పుట్టుక గురించి. దీనిపై వెండి డోనిగరే కాదు.. ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు.. కుప్పలకొద్దీ పుస్తకాలు రాశారు. సంస్కృతం ఇక్కడ పుట్టలేదని శతాబ్దాలుగా ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఈమె కొత్తగా చెప్పిందేమీ లేదు. దీనిపై ‘సంప్రదాయ రక్షకు’ల బూతుకూతలు అని కోట్ చేశారు. భారతదేశంలోని స్వవిషయాలను, సంప్రదాయాలను, ఆచారాలను, సంస్కృతులను ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్లు.. కారుకూతలు కూస్తే.. ఆహా ఓహో అని ప్రశంసలు కురిపించే ‘మేధావు’లకు వాటిని ఖండించేసరికి ఎక్కడలేని కోపం వస్తుంది. (అసలు ఈ మేధావి అన్న పదమే ఒక విచిత్రమైంది) వాళ్లు మాట్లాడితే అదేదో భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలు.. ఇంకా ఏవేవో పోచికోలు మాటలు పదబంధాలు ఉంటాయి. వీళ్లు ఖండిస్తే మాత్రం అబ్బో.. చెప్పనేలేం. ఇక సంస్కృతం మధ్య ఆసియాలో పుట్టిందని వెండి డోనిగర్ రాయవచ్చు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే అలాంటి వెర్షనే రాయాలి కాబట్టి.. రాస్తారు. వీళ్లు ఇలాగే రాస్తూ ఉంటారు. కానీ మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. మన చరిత్ర గురించి మనవాళ్లెవరు చెప్పినా అది తప్పే.. మూఢనమ్మకమే.. కానీ.. ఎవడో కమ్యూనిస్టు దేశం నుంచి వచ్చిన వాడో వచ్చి చెప్తే సూపర్ అని వాడికి పొర్లుదండాలు పెడతాం. ఈ చిత్తభ్రమల్లోనే మనం ఉండిపోయాం. అగ్రవర్ణాలు, నిమ్నవర్ణాలు.. గ్రామాలు, పట్టణాలు.. కులాలు, వృత్తులు.. జాతి, మతం.. దేశం, ఖండం వంటి పనికిమాలినవాటి చుట్టూ గానుగెద్దులాగా తిరుగుతుంటాం. చరిత్ర ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది. వాస్తవ చరిత్ర ఏమిటన్నది మనకు తెలియకుండా శతాబ్దాలనుంచి దాచిపెట్టారు. ధ్వంసం చేశారు. ఇన్నేండ్ల తర్వాత కూడా మనల్ని మనం ఇంకా యురోపియన్ కంటినుంచే చూసుకోవడం కంటే దురదృష్టం ఏముంటుంది? మనకు కనిపిస్తున్న మనం.. మనం కాదు మొర్రో అన్నా.. వినిపించుకొనే పరిస్థితి లేదు. పైగా మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటారు. మాకు మాత్రమే ప్రశ్నించే హక్కుందంటారు.

భాషను ప్రస్తావించారు కాబట్టి దానికి సంబంధించిన చర్చ చేయాల్సి ఉంటుంది. మధ్య ఆసియాలో సంస్కృతం పుట్టిందని ఈ యూరోపియన్ చరిత్రకారులు వాదించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కసారి ఇవాల్టి ప్రపంచ నాగరికతను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే.. భారతదేశ నాగరికత తూర్పున చైనా, కొరియా, జపాన్ దేశాలను చాలావరకు ప్రభావితం చేసింది. అది మనకు ఇవాల్టికీ స్పష్టంగానే కనిపిస్తుంది. ప్రతి దేశంలోనూ ఏదో రూపంలో భారతీయ సంస్కృతి మూలాలను చూడవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ దాటి మాత్రం మన నాగరికత ఆనవాళ్లు ప్రస్తుతం కనిపించవు. కానీ భాషాపరమైన చాలా దగ్గరి అనుబంధం స్పష్టంగానే కనిపిస్తుంది. ఈ అనుబంధాన్ని యురోపియన్లు తమ ఉనికికి అనుకూలంగా మలచుకొన్నారు. ఇందుకోసమే కొలోనియల్ ఇండాలజీ సృష్టి జరిగింది. మన చరిత్ర వినాశనానికీ కారణం ఇదే అయింది. దీన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. మనం ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం (ఏఐటీ) గురించి కొంతమేరకే అధ్యయనం చేశాం. కానీ దాని వెనుక చాలా పెద్ద కథే ఉన్నది. యురోపియన్లు తమ అస్తిత్వాన్ని అన్వేషించడంలో భాగంగా.. తమ ఉనికిని మరింత ప్రాచీనం చేసుకోవడంలో భాగంగా మన చరిత్రను తిరగరాశారు. మనల్ని మూఢ విశ్వాసులు, చాందసులుగా తేల్చేశారు. ఇవాళ మనం చదువుతున్న చరిత్ర అంతా కూడా ఈ మూఢ విశ్వాసం.. మత చాందసం ప్రాతిపదికపైనే సాగిందన్నది గ్రహించాలి. ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా సాకల్యంగా చర్చించినప్పుడు ఒక వినూత్నమైన అంశం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సోకాల్డ్ యురోపియన్ చరిత్రకారులు చెప్పినట్టు 1500 బీసీలో ఆర్యులు వచ్చారని రాసుకున్నారే కానీ.. ఇదే అంశం.. వారి అస్తిత్వపు అన్వేషణకు కేంద్రబిందువైంది. ఎందుకంటే.. ఆర్యులు మాట్లాడిన భాష సంస్కృతం అని తేల్చారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా ఈ భాషలోనే ఉన్నాయి. ఆర్యులు మధ్య ఆసియానుంచి భారతదేశానికి వచ్చారని చెప్పాలంటే.. అక్కడ ఉన్న భాష, సంస్కృతి లెక్క ఏమిటో తేల్చాలి. అలా తేల్చాలంటే ముందుగా తాము ఎవరు అన్నది డిసైడ్ కావాలి. పాశ్చాత్యుల (వెస్టర్న్స్) ఉనికికి ఈ భాషాపరమైన అన్వేషణ తప్పనిసరి అయింది. మొదట్లో వాళ్లు (పాశ్చాత్యులు) మాట్లాడే భాషని ఇండోయురోపియన్ లాంగ్వేజిగా పిలిచేవారు. దీనికి ముందున్న ప్రాచీన భాషను (మూలాన్ని) ప్రోటో ఇండో యురోపియన్ లాంగ్వేజి అని పిలిచేవారు. ఈ ఇండో యూరోపియన్ అన్న పదమే పెద్ద చిక్కుగా మారిపోయింది. విలియం జోన్స్ లాంటివారికి ముందుగా తాము (పాశ్చాత్యులు లేదా యురోపియన్లు) ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తమ గురించి తాము తెలుసుకోవాలంటే.. ముందుగా ఇండోయూరోపియన్ అన్న పదబంధంలోని ఇండో అంటే ఏమిటి.. ఇండియన్ అన్నవాళ్లు ఎవరు అన్నది తేలాలి. ఇది తేలితే తప్ప మనం ఎవరు అన్నది డిసైడ్‌ చేయలేము అన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం యురోపియన్ శాస్త్రవేత్తలు భాషాపరమైన పరిశోధన చేశారు. ప్రోటో ఇండో యురోపియన్ భాష ఉన్నట్టు ఎలాంటి స్పష్టమైన ఆధారం వీరికి దొరకలేదు. ఇందుకోసం ఒక భాషా వృక్షాన్ని వీరు కొత్తగా పునర్నిర్మించారు. ఇందుకోసం తులనాత్మక భాషాధ్యయనమనే పద్ధతిని వినియోగించారు. సాధారణంగా కొన్ని భాషల మధ్య అనుబంధం ఉన్నదని భావించినప్పుడు.. వివిధ భాషల్లో మనుషులు విరివిగా వాడే ముఖం, నిద్ర, చెయ్యి, నోరు, ముక్కు, తినడం లాంటి పదాలను సేకరించి.. వాటి మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తారు. ఒక భాషలోని పదానికి.. మరో భాషలోని అదే అర్థం వచ్చే పదానికి మధ్య సామీప్యత, సారూప్యతలు ఏమేరకు ఉన్నాయో చర్చిస్తారు. ఉదాహరణకు సంస్కృతంలో పాదం.. ఇటాలియన్‌లో పైదే, ఇంగ్లీష్‌లో ఫూట్ మధ్య సామీప్యం ఉంటుంది. అలాగే.. పిత.. పాద్రే, ఫాదర్ మధ్య సామీప్యాన్ని గమనించవచ్చు. ఇలా పదాల మధ్య సంబంధం తేలిన తర్వాత ఒక భాషా వృక్ష నమూనాను తయారు చేస్తారు. దీని ప్రకారం పదాలు ఎంత దగ్గరగా ఉన్నాయనేది తేలుతుంది. తద్వారా పేరెంట్ లాంగ్వేజి ఏమిటన్నది తెలుస్తుంది. యురోపియన్ శాస్త్రవేత్తలు ఇదే పద్ధతిలో భాషాధ్యయనం చేశారు. విలియం జోన్స్ 1786లో యురోపిన్ భాషలకు.. సంస్కృతానికి మధ్య ఉన్న మౌలిక లక్షణాన్ని వివరిస్తూ తన భాషా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే ఇతనికంటే ముందే 16వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన కొందరు యురోపియన్లు ఇండో ఇరానియన్ లాంగ్వేజీలకు, ఇండో యురోపియన్ లాంగ్వేజీలకు మధ్య సారూప్యతను అధ్యయనం చేశారు. 1653లో మార్కస్ జ్యూరియస్, వ్యాన్ బాక్స్‌హర్న్ సిథియన్ అనే ఒక ప్రోటో లాంగ్వేజీని ప్రతిపాదించాడు. ఈ భాషాకుటుంబంలో జర్మనిక్, రొమాన్స్, గ్రీక్, బాల్టిక్, స్లేవిక్, సెల్టిక్ ఇరానియన్ భాషలు ఉన్నాయి. 1767లో గాస్టన్ లారెంట్ కోరెడాక్స్ అనే ఫ్రెంచి భాషాశాస్త్రవేత్త (తన జీవితమంతా భారత్‌లోనే గడిపాడు) సంస్కృతానికి, యురోపియన్ భాషలకు మధ్య ఉన్న మౌలిక సామీప్యతను వివరిస్తూ ఒక డాక్యుమెంట్‌ను ప్రతిపాదించాడు. వీటన్నింటితో పోలిస్తే.. విలియమ్ జోన్స్ 1786లో ప్రతిపాదించిన భాషా సిద్ధాంతానికి హేతుబద్ధత చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇతను అన్ని యురోపియన్, ఇండిక్ భాషలను చర్చిస్తూ హిందీని కావాలనే వదిలేశాడు. 1818లో రాస్మక్ క్రిస్టియన్ రాక్ అనే శాస్త్రవేత్త సంస్కృతం, గ్రీకు భాషల్లోని పదాలను మరింత లోతుగా విశ్లేషించాడు. వీటిలో పూర్తిస్థాయి హల్లులను గుర్తించాడు. 1816లో ఫ్రాంజ్ బాప్ సంస్కృతం, పర్షియా, గ్రీకు, లాటిన్, లిథువేనియన్ ఓల్డ్ స్లావిక్, గోథిక్, జర్మన్ భాషల మధ్య సామీప్యమైన లక్షణాల్ని విశ్లేషించాడు. 1833లో ఇవే భాషల మధ్య ఒకే రకమైన తులనాత్మకమైన వ్యాకరణాన్ని ప్రచురించాడు. 1822లో జేకబ్ గ్రిమ్ ఇండో యురోపియన్ లాంగ్వేజీలో ధ్వని మార్పును విశ్లేషించాడు. వీటిమధ్య ఉన్న మౌలిక లక్షణాన్ని కూడా చర్చించాడు. ఇందులోనూ సంస్కృతం యొక్క ప్రాధాన్యాన్ని ప్రస్తావించాడు. ఆ తర్వాత ఆగస్ట్ స్క్లీషర్, జూలియస్ పొకార్నీ కూడా ఇండో యూరోపియన్ భాషా సమాజానికి తులనాత్మక వ్యాకరణాన్ని ప్రతిపాదించారు. వీటన్నింటిలోనూ సంస్కృతం అత్యంత మూలమైన భాషగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

వీరందరి సిద్ధాంతం ప్రకారం ప్రోటో ఇండో యురోపియన్ భాష అనేది బాల్టో స్లావిక్, జర్మనిక్, సెల్టిక్, ఇటాలిక్, హెలినిక్, ఇండిక్, ఇరానియన్ భాషలకు మూలమైనది (ఆన్సెస్టర్). కానీ.. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందేమిటంటే.. వీటన్నింటిలోనూ సంస్కృతం ఉన్నది. ఒకవేళ మనం ఈ భాషలతో ఒక మ్యాట్రిక్స్ రాస్తే.. (వాటి మధ్య ఉన్న సామీప్యతను అనుసరించి).. మూలంగా ప్రొటో ఇండో యురోపియన్ లాంగ్వేజీ బదులు సంస్కృతాన్ని కనుక వినియోగించి కొత్త మ్యాట్రిక్స్‌గా ట్రాన్స్‌ఫామ్ చేస్తే.. మ్యాథమెటిక్స్ పరంగా వచ్చే ఫలితాలు నూటికి నూరుపాళ్లు కరెక్టు అవుతాయి. అన్ని భాషలు సంస్కృతంలో ఇముడుతాయి. అంటే సంస్కృతం వీటన్నింటికీ మూలభాషగా తేలుతుంది. యురోపియన్ చరిత్రకారులు తమ అస్తిత్వ అన్వేషణలో భాగంగా చేసిన ఈ భాషాపరమైన సిద్ధాంతానికి బలం చేకూర్చడానికి ఆర్కియాలజీ సహాయం చాలా అవసరమైంది. దీంతో ఆర్కియాలజీ ఆనవాళ్లను వెతుక్కుంటూ వెళ్లారు. ఈ క్రమంలో భారత్ అన్నది పాశ్చాత్య ఉనికిని కనుక్కోవడంలో కీలకపాత్ర పోషించింది. ముఖ్యంగా ఏఐటీ అన్నది వాళ్ల వ్యాఖ్యానికులకు కేంద్రబిందువుగా మారింది. వీళ్లలో మరిజా నింబుటాస్ కుర్గాన్ హైపోథిసీస్‌ను 1950లలో ప్రతిపాదించింది. దీని ప్రకారం నల్లసముద్రంలో ఎక్కడో దీని మూలం ఉన్నదని పేర్కొన్నది. ఇండో యురోపియన్ విస్తరణ 4000 బీసీ నుంచి 1500 బీసీ వరకు మూడు రకాలుగా జరిగిందని పేర్కొన్నది. గుర్రాలను మనుషుల కోసం వినియోగించుకోవడం వంటి లక్షణాల ద్వారా ఈ విస్తరణ జరిగిందని నిర్ధారించింది. తరువాత ప్రొఫెసర్ కాలిన్ రెన్‌ఫ్రూ (కేంబ్రిడ్జి యూనివర్సిటీ 1987) అనటోలియన్ హైపొథిసీస్‌ను ప్రతిపాదించాడు. ఇవన్నీ కూడా పైకి ఇండోయూరోపియన్ అని చెప్తున్నా.. అన్ని భాషల్లోనూ సంస్కృతమే నిండి ఉన్నది. సంస్కృతాన్ని విస్మరించి ఏ భాష కూడా పరిపూర్ణం కాలేదని అన్ని సిద్ధాంతాలు కచ్చితంగా చెప్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. సంస్కృతం లేకుండా మిగతా భాషల వికాసాన్ని ఊహించడం సాధ్యమయ్యే పని కాదు. సంస్కృతాన్ని అంగీకరించాల్సి వస్తే.. భారతీయ నాగరికత, సంస్కృతాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు యురోపియన్ అస్తిత్వం సంకుచితమవుతుంది. అందువల్ల సంస్కృత భాషను, ఆర్యులను భారతదేశం నుంచి బయటకు పంపించాలి. యురోపియన్లు చేసిన పని అదే. అలా పుట్టుకొచ్చిందే ఏ.ఐ.టీ. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం. మనం కూడా ఇదే మాయలో పడిపోయాం. ఈ సంస్కృతమే మన నాగరికతకు, జీవనవిధానానికి ఆధారభూతమైంది. దీన్ని మనం పూర్తిగా విస్మరించాం. బ్రిటిష్‌వాడు విస్మరించేటట్టు చేశాడు. దీనివల్లనే మన చరిత్రను మనం కాదనుకున్నాం. వెటకారం చేసుకున్నాం. మొత్తంగా మన మూలాలనే విచ్ఛేదం చేసుకొనే దశకు చేరుకున్నాం. ఇవాళ వెండి డోనిగర్ కూడా చేసింది అదే. కొత్తదేం కాదు.

ఇక పతంజలి యోగశాస్త్రం గురించిన ప్రస్తావన ఈ సమీక్షలో ఉన్నది. ఇందులో రుషులను యోగులని నిర్వచించడం వల్ల యోగశాస్త్రంలో అస్పష్టత ఏర్పడిందన్నారు. ఇందులో అస్పష్టత ఏమున్నది? యోగం అన్నది సాధనకు సంబంధించిన అంశం. రుషులు అంతర్ముఖంగా ఇంట్యూషన్‌తో సాధన చేస్తారు. యోగులు బాహిరంగా సాధన చేస్తారు. ఇద్దరూ సాధకులే. అనేక స్తరాలలో సాగించే సాధన ద్వారా మనిషి పరిశోధకుడుగా, యోగిగా, రుషిగా, మహర్షిగా, బ్రహ్మర్షిగా ట్రాన్స్ఫామ్ అవుతారు. వెండీ డోనిగర్ వీరిని వేరు వేరుగా చూడాలని భావించినట్టున్నారు. దీనివల్ల కొన్ని చిక్కులు వచ్చి ఉండవచ్చు. ఇక మహాబలిపురంలో గోడలమీద కొంగలు, పిల్లులు తపస్సు చేసుకుంటున్న చిత్రాలున్నాయని పేర్కొన్నారు. వీటిని దొంగ సన్యాసులకు, యోగులకు ప్రతీకలుగా పేర్కొన్నారు. తప్పేమున్నది.. ఇప్పుడు కూడా దొంగ సన్యాసులున్నారు కదా.. అంతమాత్రం చేత యోగులు, రుషులు లేరని అర్థం కాదు కదా.. ఇక యోగశాస్త్రంలో మహిళను జుగుప్సాకరంగా, అసహ్యకరంగా పేర్కొన్నారు అని మరొక అంశం రాశారు. ప్రాణాయామ, అష్టాంగ యోగ సాధనలో వెండి డీనిగర్‌కు ఈ పరిస్థితి వచ్చి ఉండకపోవచ్చు. కుండలినీ యోగ సాధనలోనే ఈ పరిస్థితి తలెత్తి ఉంటుంది. ఎందుకంటే.. కుండలిని సర్పయోగంలో మూలాధారం నుంచి సహస్రారం దాకా సాధన ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. ఇందులో మూలాధారం, స్వాధిష్ఠానం రెండూ కూడా మర్మావయవాలు కావడం వల్ల ఆమెకు అసహ్యమని అనిపిస్తుంది. కుండలిని సాధనలో అలాగే చెప్తారు. అలాగే చేయాల్సి ఉంటుంది కూడా. ఉదాహరణకు వైద్యశాస్త్రంలో చదువుతున్నప్పుడు కానీ, ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కానీ.. భౌతిక శరీరంలోని అన్ని అవయవాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే తాకాల్సి ఉంటుంది. చికిత్స చేయాల్సి ఉంటుంది. కుండలినిలో మూలాధారం నుంచి ఊర్థ్వ ముఖంగా సాధన ప్రస్థానం కొనసాగుతుంది. సాధారణ పరిభాషలో మూలాధారం అంటే జననాంగం అని అర్థం. ఇది తెలియకపోతే లేదా ఎర్రబారిన కంటితో చూస్తే బూతుగానే కనిపిస్తుంది.

యోగవాశిష్టం గురించి వెండి డోనిగర్ ప్రస్తావించారు. యోగవాశిష్టం పది పన్నెండు శతాబ్దాలలో కశ్మీరంలో రాశారని పేర్కొన్నారు. దీనికి ఆధారాలు ఆమె దగ్గర ఏమున్నాయో తెలియదు. యోగవాశిష్టానికి కర్తృత్వం అన్నది లేదు. కాలమూ లేదు. ఇది ప్రధానంగా భారతీయ తత్త్వశాస్త్రం, అద్వైత వేదాంతానికి సంబంధించిన అత్యంత ప్రామాణిక మైన గ్రంథం. అద్వైత వేదాంతంలో యోగం కూడా ఒక భాగం. అంతర్లీనంగా ఉండే జ్ఞానం, దానిని వెలికి తీయడానికి పనికివచ్చే ధ్యానం గురించి ఈ గ్రంథం చెప్తుంది. ఇందులో రాముడి ప్రస్తావన ఉన్నది కాబట్టి దీన్ని పురాణంగా భావించారేమో కానీ ఇది పురాణం కాదు. పురాణ లక్షణాలు వేరే ఉన్నాయి. ఇది పూర్తిగా తత్త్వశాస్త్రం. ఇందులో పునర్జన్మల ప్రస్తావన వచ్చింది కాబట్టి కొంత వివరించాలని అనుకుంటున్నా.. భారతీయ ధర్మంతో పాటు.. ప్రపంచంలోని అన్ని మతాలూ పునర్జన్మను విశ్వసించాయి. ఒక్క కమ్యూనిజమనే మతం తప్ప. పునర్జన్మ అనేది ఎప్పుడూ హాట్‌ టాపికే.. హేతువాదులు ఎంతో వాదిస్తారు.. రుజువులు లేనివేవీ సత్యం కాదని, వాటిని నమ్మరాదని బలంగా మాట్లాడతారు.. కానీ, ప్రపంచంలో ప్రతిచోటా విశ్వాసం అనేది చాలా రకాలుగా మనపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపుతున్నాయన్నది అంతా ఒప్పుకొని తీరాల్సిందే. బహిరంగంగా ఎన్ని మాట్లాడినా, అంతర్గతంగా అందరిలో ఏదో ఒక విశ్వాసం ఉంటుంది.. ఆత్మ ఉన్నదనేది అందులో ఒకటి.. ఈ ఆత్మ ఒక శరీరంలోనుంచి మరో శరీరంలోకి వెళ్లి తిరిగి జన్మిస్తుంది కాబట్టే.. దాన్ని పునర్జన్మ అన్నారు.. ఈ సిద్ధాంతాన్ని సైన్స్‌ ఎంతమాత్రం ఒప్పుకోదు.. కానీ, అన్ని మతాలు దీన్ని ఒప్పుకున్నాయి. క్రిస్టియానిటీ, జూడాయిజం, జోరాస్ట్రియిజం, ఇస్లాం, బౌద్ధ, జైన, హిందూ, సిక్కు మతాలన్నీ కూడా కొద్ది తేడాలతో రీ-ఇన్‌కార్నేషన్‌ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నాయి. దాని గురించి చర్చించాయి కూడా. భగవద్గీత మాత్రమే కాదు.. బైబిల్‌, ఖురాన్‌, గురుగ్రంథసాహిబ్‌ లలో కూడా మనిషి మళ్లీ మళ్లీ పుడతాడనే చెప్పుకొచ్చారు.. మనిషి తన మెదడులో 10 శాతమే ఉపయోగిస్తాడని సైంటిస్టులు చెప్తారు.. మిగతా 90 శాతంలో మనకు తెలియకుండానే అనేక విషయాలు దాగుంటాయి. ఈ సబ్‌కాన్షియస్‌ను మేల్కొల్పితే, గత జన్మ వాసనలు బలంగా బయటపడతాయి. గత జన్మలో తాను ఏం చేసిందీ, ఎలా జీవించిందీ స్పష్టంగా తెలుస్తుందనేది పూర్వ జన్మ సిద్ధాంతుల వాదన. సబ్‌కాన్షియస్‌.. షుప్త చేతనావస్థ.. మనం నిద్ర పోతున్నప్పుడు అప్పుడప్పుడూ చేసే కలవరింతలు.. పలవరింతలూ ఈ సబ్‌కాన్షియస్‌ నుంచే వస్తాయి. దీన్ని మరింత డీప్‌గా చైతన్యవంతం చేస్తే గత జన్మస్మృతులు వెలుగుచూస్తాయనే వాదనా ఉన్నది. ఈ హేతువాదులు, సైంటిస్టులు దీనిపై పరిశోధనలు చేసి నిరూపణలు చేయవచ్చు.

సిద్ధ సాధ్య, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషులు వంటి వివిధ జాతుల వారు వివిధ లోకాల్లో, ప్రాంతాల్లో ఉంటారని భారతీయ గ్రంథాలు చెప్తున్నాయి. యక్షులను రాక్షసులుగా చెప్పుకున్నా.. వారు అనేక సందర్భాల్లో మంచి చేసినట్టుగా వీళ్లు పురాణాలు అని చెప్పుకునే గ్రంథాలే పేర్కొన్నాయి. జటాయు, కబంధుడి వృత్తాంతం అలాంటిదే. శివ శబ్దం.. రుగ్వేదంలో ఉన్నది. రుగ్వేదంలో శివుడి ప్రస్తావన ఉన్నది. శివుడిని ఇంద్రుడితో సమానంగా పేర్కొన్నారు.

यो गृणतामिदासिथापिरूती शिवः सखा । स त्वं न इन्द्र मृलय ॥ (RV 6.45.17).

स नो युवेन्द्रो जोहूत्रः सखा शिवो नरामस्तु पाता । (RV 2.20.3)

వెండి డోనిగర్ కూడా తన ’’The Vedic Antecedents”. Śiva, the erotic ascetic. (Oxford University Press US. pp. 84–89.) అన్న గ్రంథంలో రుగ్వేదంలో శివుడి ప్రస్తావన ఉన్నట్టు పేర్కొన్నారు. దాని గురించి వివరించారు కూడా.

ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే వేద దేవతలు, ఇతర దేవతలు వేరు. వేదంలో పేర్కొన్న రుద్రుడు శివుడు కాదు. ఋగ్వేదంలో మొదట ప్రస్తావించిన పేరు రుద్రుడు. ఈ పేరు తరువాతి కాలంలో శివుడికి ప్రత్యామ్నాయ పేరుగా మారిందే కానీ. ఈ ఇద్దరూ వేర్వేరు. మనందరికీ తెలిసింది శివుడైనా, శంకరుడైనా, రుద్రుడైనా, మహాదేవుడైనా ఒకరనే. ఋగ్వేదంలో కనీసం 75 చోట్ల ఈ రుద్రుడి ప్రస్తావన ఉంటుంది. విశ్వంలో 11మంది రుద్రులున్నట్లు కూడా అందులో తెలుస్తుంది. ఈ 11మందిలో శివుడు, శంకరుడు, మహాదేవుడి పేర్లు కూడా ఉంటాయి. హిమాలయాల్లో కొందరు సిద్ధులు ఉపాసించే రుద్రుడు వేదిక్ గాడ్ అని చెప్తారు.

ఇక శివలింగం గురించిన ప్రస్తావన వెండి డోనిగర్ సరిగానే చేశారు. వేదంలో లింగం అన్న శబ్దం స్మోక్, ఫైర్ అన్న సాధారణ శబ్దార్థాలే తప్ప జెండర్ అర్థం కాదు. ఆ తరువాతి కాలంలో దీనికి జెండర్ అర్థాన్ని ఆపాదించారు. మనవాళ్లు మేల్ ఫిమేల్ ఆర్గాన్‌లుగా మాత్రమే ట్రీట్ చేస్తూ.. ఆ విధంగానే గుర్తిస్తున్నారు. భారతీయ ధర్మానికి సంబంధించిన వివిధ అంశాలలో అత్యంత వక్రీకరణకు గురైంది ఏదైనా ఉందంటే అది శివలింగం. 1900 సంవత్సరంలో పారిస్‌లో ప్రపంచ మత సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి స్వామి వివేకానంద హాజరయ్యారు. అదే సమ్మేళనంలో మద్రాసు నుంచి గుస్తవ్‌ ఒప్పర్ట్‌ అనే క్రైస్తవ ప్రొఫెసర్‌ కూడా పాల్గొన్నాడు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో తులనాత్మక అధ్యయనశాఖలో 21 ఏండ్ల పాటు పనిచేశాడు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలుగు భాష అనువాదకుడిగా పనిచేశారు. ఈయనగారి వ్యాఖ్యానాల్లో ఒకటి శివలింగానికి సంబంధించింది. గుస్తవ్‌ ఒప్పర్ట్‌ పారిస్‌ కాంగ్రెస్‌ (1890)లో భారతీయ ధర్మానికి సంబంధించి తనదైన వ్యాఖ్యానం చేశాడు. ముఖ్యంగా సాలగ్రామ శిలపై ఒక పరిశోధనాపత్రాన్ని సమర్పించాడు. ఈయన గారి వ్యాఖ్యానం మేరకు సాలగ్రామశిల స్త్రీ యోనికి ప్రతీక అని, శివలింగం పురుషాంగమని పేర్కొన్నాడు. స్త్రీపురుష సంయోగానికి శివలింగం ప్రతీక అని సూత్రీకరించాడు. ఈయన వ్యాఖ్యానంపై సదస్సుకు హాజరైన స్వామి వివేకానంద తీవ్రంగా స్పందించారు. శివలింగం, సాలగ్రామ శిలకు సంబంధించి వాటికి సంబంధం లేని విపరీతార్థాలు తీశారని ఖండించారు. శివలింగానికి మూలం ఏమిటన్నది సోదాహరణంగా వివరించారు. అథర్వవేద సంహితలో యూప స్తంభం గురించి చర్చించింది. ఇది ఆద్యంతాలు లేనిది. అత్యంత శక్తిమంతమైనది. జగత్తుకంతటికీ ఆధారభూతమైనది. దాన్నుంచి వెలువడే శక్తి అనంతమైనది. శివలింగం అంటే ఆద్యంతములు లేని అసాధారణ శక్తి కలిగినదని అర్థం. అథర్వవేద సంహితలోని పదవకాండలో ఎనిమిదవ సూక్తంలో 25 వ ప్రకరణంలో యూపస్తంభం పస్త్రావన ఉన్నది. ఈ స్తంభానికి ఆద్యంతాలు లేవు. నిరాకారుడైన పరమేశ్వరుడి అసాధారణ శక్తి కలిగి ఉన్నది. ఇందులోనుంచి అగ్ని (ఫైర్‌) విరజిమ్ముతున్నది. ఈ యూపస్తంభమే శివలింగానికి మూలమని స్వామీజీ వివరించారు. లింగము అంటే స్తంభమని అర్థం. శివలింగం అటామిక్‌ ఎనర్జీకి స్పష్టమైన ప్రతీక అని పరిశోధకులు సైతం తేల్చారు.

  1. శివలింగం అన్నది సాధారణంగా గోళాకారంలో ఉంటుంది. న్యూక్లియర్‌ రియాక్టర్‌ కూడా అదే రూపంలో ఉంటుంది.
  2. పానవట్టం అన్నది శివలింగం అభిషేక జలాన్ని విడిచిపెట్టడానికి ఏర్పాటుచేసింది. న్యూక్లియర్‌ రియాక్టర్‌ బేస్‌ కూడా కలుషిత నీటిని వదిలిపెట్టడానికి ఏర్పాటుచేస్తారు.
  3. ప్రాచీన కాలం నుంచి ఇవాళ్టి వరకూ కూడా శివలింగానికి ప్రతిరోజూ నీరు, పాలతో అభిషేకంచేస్తారు. ఇవాళ మనం న్యూక్లియర్‌ రియాక్టర్‌ చల్లబడటానికి దాని పై భాగంలో నీరు పోస్తాం.
  4. ఆసక్తికరమైన విషయమేంటంటే శివాలయాలు అత్యధికంగా నదులు, సరస్సులు, చెరువుల వంటి నీటివనరులు ఎక్కువగా ఉన్నచోటనే ఉంటాయి. న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌లు కూడా నీటి వనరులు ఉన్నచోటనే ఉంటాయి.
  5. శివలింగానికి అభిషేకం చేసిన జలాన్ని తీర్థ ప్రసాదంగా స్వీకరించరు. న్యూక్లియర్‌ రియాక్టర్‌ను చల్లబరిచేందుకు పోసే నీటిని కూడా రేడియేషన్‌ ప్రభావం ఉన్న కలుషిత నీటిగా వదిలిపెడతారు.

త్రిమూర్తి తత్త్వం మన భారతీయ ధర్మంలో ఉన్నది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ త్రిమూర్తులు. ఇంతవరకు అంతా మనకు తెలిసిందే. ఇక్కడ విష్ణువు పాలసముద్రంలో శేషశయనుడై ఉన్నాడు. ఆయన నాభిలోంచి వచ్చిన కమలంపై బ్రహ్మ ఉంటాడు. వీరిద్దరికీ డిటాచ్‌ (విడిగా)గా శివుడు నిరంతర ధ్యానముద్రలో ఉన్నాడు. ఈ కాన్సెప్ట్‌ను కూడా మనం అధ్యయనం చేయాలి. అణుశక్తి అన్నది ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్ల కారణంగా ఉద్భవిస్తుంది. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. ఈ కేంద్రకం ఆధారభూమికగా ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి. కణాల సృష్టిలో ప్రధానమైన భూమిక ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లదే. అందులోనూ ఎలక్ట్రాన్లదే ఎక్కువ పాత్ర. త్రిమూర్తి తత్త్వంలోనూ బ్రహ్మ బాధ్యత అదే. ఎలక్ట్రాన్లు తమ దశ మార్చుకుంటే కేంద్రక విచ్ఛిత్తి జరుగుతుంది. అంటే సృష్టి లయ తప్పితే మహావినాశనం జరుగుతుంది. ఇక్కడ విష్ణువు నాభి కేంద్రకమైతే, హరుడు న్యూట్రాన్‌, హరి ప్రోటాన్‌ అయితే బ్రహ్మ ఎలక్ట్రాన్‌ అన్నమాట.

మరొక అంశం ఏమిటంటే.. భూమి స్త్రీకి ప్రతీక.. ఆకాశం పురుషుడికి ప్రతీక అన్నారు. ఇది అక్షరాలా వాస్తవం. కల్పవృక్షంలో ఒక పద్యం చూడండి..

ఏపున మంటినుండి యుదయించిన జానకి మింటినుండి ఆ

వాపముగన్న రాఘవుడు వచ్చి ఋగధ్వజములందు నుండి ద్యా

వాపృథువుల్ సమాహరణ భావము పొందిన రీతి సంగమ

వాకృతి పండు వెన్నెల మయంబుగ జేసెద రాత్మరోదసిన్

అని విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షము కల్యాణ ఖండంలో పేర్కొన్నారు. రాముడు ఆకాశం నుంచి దిగివచ్చిన చైతన్యమైతే.. సీతాదేవి భూమి నుంచి ఉబికి వచ్చిన మహాశక్తి.. భూమ్యాకాశాల మధ్య విశ్వశ్రేయస్సును సాధించాలన్న లక్ష్యమే ఈ ఇద్దరి అవతారం. భూమ్యాకాశాల సమాహరణం గురించి వేదాల నుంచి కూడా మనవాళ్లు చెప్తూనే ఉన్నారు. ఈ రెండింటి మధ్య మధ్య సమన్వయం ఆత్మరోదసిని పండువెన్నెల మయం చేస్తున్నదన్నాడు. భూమ్యాకాశాల మధ్య కలయికే ఈ సమస్త విశ్వానికి, సృష్టి వికాసానికి హేతువయింది. ఇక్కడ భౌతిక శాస్త్రం చెప్పేమాట కూడా ఇంచుమించు ఇలాంటిదే. భూమి పరాశక్తి. అందులోని విత్తు మూలాధారం. ప్రాణం. ఈ ప్రాణానికి జీవం పోసేది సూర్యుడు. ప్రత్యక్ష నారాయణుడు. సూర్యుడి కిరణ ప్రసారంతో జరిగే సంయోజక్రియ చేత విత్తు మొక్కవుతుంది. చెట్టవుతుంది. వృక్షమవుతుంది. మహావృక్షమై నిలుస్తుంది. ఈ విత్తు మూలాధారం నుంచి ఆకాశం వైపు ఊర్థ్వముఖంగా ఎగుసుకొంటూ పోతుంది. ఆయన కిరణాలు పృథ్వి ముఖంగా దిగివస్తూ ఉంటాయి. ఆమె శక్తి. ఆయన ఆధారం. ఇవి రెండూ అభిన్నమైనవి. పరస్పర పూరకములైనవి. ఆది దంపతులు కూడా అభిన్నమైన శక్తి. భారతీయ దాంపత్య ధర్మం అన్నది కూడా ఈ అభిన్నత్వానికి ఇంకా చెప్పాలంటే.. భిన్నంగా కనిపించే ఏకత్వానికి ప్రతీక. భిన్నత్వంలో ఏకత్వం అంటే.. మనం జనరల్‌గా అనుకొనే దేశంలోని రకరకాల సమాజాలు, సంస్కృతుల మధ్య అంతర్లీనంగా కనిపించే ఏకత్వం కాదు. ఇదిగో ఈ ద్యావాపృథివీ సమాగమమే భిన్నంగా కనిపించే అభిన్నం. మొత్తంగా ఇదీ ‘భూమి స్త్రీకి ప్రతీక.. ఆకాశం పురుషుడికి ప్రతీక’ అన్న మాటకు అర్థం. యజ్ఞ బలులు అన్నది రుగ్వేదం నుంచి మనకు ఉన్నదే కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. రామాయణంలో దశరథుడి యజ్ఞానికి ముందు కౌసల్య గుర్రాన్ని బలిస్తుంది. దీని మీద ఎవరి వ్యాఖ్యానాలు వారు చేస్తూనే ఉన్నారు. అన్ని మతాల్లోనూ ఈ బలులు ఉన్నాయి. ఇతిహాసాలు, పురాణాల్లో ప్రక్షిప్తాలు అనేకానేకం చేరిన మాట వాస్తవం. ఇందులో సందేహం లేదు. ఈ ప్రక్షిప్తాలు ఆయా కాలాలను బట్టి.. వారి వారి పోకడలను బట్టి చేరుస్తూ పోయారు. హిందూ జనజీవితాల్లో శూద్రులు చాలావరకు హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పోగొట్టుకున్నట్టు డోనిగర్ అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. ఈ శూద్రులకు మనం ఇచ్చే నిర్వచనం ఏమిటన్నది ఇప్పటివరకు ఎవరూ పేర్కొనలేదు. ఎవరూ చర్చించరు. ఇవాళ 21 వ శతాబ్దంలో శూద్రులంటూ ఈ రాజకీయ వ్యవస్థ నిర్దరించిన కొన్ని కులాలను శూద్రులని అనాలా? లేక వర్ణ వ్యవస్థలో పేర్కొన్న శూద్రులని శూద్రులుగా పిలువాలా? ఈ రెండింటి మధ్యన భేదం ఏమిటి? శూద్రత్వం అంటే ఏమిటి? వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఒకటే ఎలా అవుతుందో మేధావులు చెప్పాలి కదా.. ఈ శూద్రులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోవడం అంటే ఏమిటి? ఏమి కోల్పోయారు? ఇక సీతా పరిత్యాగం, అహల్య, శకుంతల గురించి మన దేశంలో సోకాల్డ్ మేధావులు చెప్పుకునే మాటలే డోనిగర్ కూడా వక్కాణించారు. ఇంకా చెప్పాలంటే.. ఆమె చెప్పిన వాటినే వీళ్లూ మాట్లాడుతారు. ఇందులో కొత్తేమీ లేదు. ప్రక్షిప్తాల గురించి మాట్లాడేది వీరే.. తిరిగి వీళ్లకు అనుకూలమైన ప్రక్షిప్తాలను నిజం చేసేదీ వీళ్లే.. రామాయణంలో ఉత్తరకాండ ప్రక్షిప్తమే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు హేతుబద్ధత వెతికేవారికి రామం భజే శ్యామలం గ్రంథం జవాబు ఇస్తుంది. చదువుకోవచ్చు.

స్కాంధ పురాణం గురించిన ప్రస్తావన తెచ్చారు. ఇందులో దుర్మార్గుడైన భక్తుడిని, పశ్చాత్తాపం కూడా ప్రకటించని వ్యక్తిని శివుడు అనుగ్రహించాడు అని పేర్కొన్నారు. మన ధర్మంలోనే ఆ కల్చర్ ఇమిడి ఉన్నది. గుణనిధి కథ అలాంటిదే. మనకు నిందాస్తుతి అన్న భావన ఉన్నది. అధిక్షేపించినా సరే.. నిత్యం తనను తలచుకొన్నంత మాత్రాన్నే అనుగ్రహిస్తానని ఈశ్వరుడు చెప్తాడు. జయవిజయుల కథ అదే. భక్తులుగా ఏడు జన్మలుంటారా? విరోధులుగా మూడు జన్మలుంటారా అంటే.. విరోధులుగానే ఉంటామని వెళ్లారు. వారు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, రావణకుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తృలుగా జన్మించి విరోధాభాసంతోనే దేవుడిని చేరుకున్నారు. భారతీయ ధర్మంలో ఈ రకమైన క్షమాగుణం ఉన్నందువల్ల మాత్రమే.. మహమ్మద్ బిన్ ఖాసిం లాంటి వాడు ఈ దేశంలో ఇస్లాంను చొప్పించగలిగాడు. మన ధర్మంలో ఈ గుణం ఉన్నందువల్లనే దేశంలో ఎవరు పడితే వారు ఎలా పడితే అలా మాట్లాడగలుగుతున్నారు. నిందించగలుగుతున్నారు. గమ్మత్తేమిటంటే ఈ గుణానికి వాళ్లు పెట్టిన పేరు ‘ఇంటాలరెన్స్’.

ఇంకొక మాట కూడా ఈ పరిచయంలో పేర్కొన్నారు. మన పూర్వులు వివాహ బంధాలు, వివాహేతర బంధాల ద్వారా సంతానాలు పొందడం గురించి మాట్లాడారు. ఇవాళ మనం అనుసరిస్తున్న వివాహ బంధం అన్నది ఎప్పటి నుంచి భారతీయ సంప్రదాయంలో ప్రారంభమైందో తెలిస్తే.. వివాహ, వివాహేతర బంధాల గురించి చెప్పుకోవచ్చు. వేద కాలంలో వివాహ సంప్రదాయం ఉన్నదా? అంతకు ముందు నుంచి ఉన్నదా? ఆ తరువాత వచ్చిందా? మరి ఇన్నిన్ని పరిశోధనలు చేసిన పాశ్చాత్యులు ఇది కూడా తేలిస్తే బాగుంటుంది కదా.. ఇంతెందుకు వాల్మీకి రాసిన రామాయణంలో సీతా కల్యాణ ఘట్టం ఉన్నదా? చెప్పగలరా? కర్ణ శబ్దం రుద్రంలో కూడా ఉన్నదని పేర్కొన్నారు. భారతంలో కర్ణుడికి, రుగ్వేదంలో కర్ణుడికి సంబంధం లేదు. శివపార్వతులు అర్ధనారీశ్వరులు అంటే.. దాంపత్య ధర్మంలో స్త్రీ పురుషులు చెరి సమానంగా.. చెరిసగంగా ఉంటారని అర్థం. ఇక మోహినీ అవతారఘట్టం. ఇక కామసూత్ర గురించి ఈ పరిచయంలో చాలా వివరంగానే చెప్పారు. కామసూత్ర వాత్స్యాయనుడు రచించింది వేశ్యా గృహాల వెంట నడిచి.. అక్కడ తిరిగి.. అక్కడ ఉండి.. అనేకానేక అంశాలను చూసి తద్వారా కామసూత్రాలను రచించాడు. వేశ్యావాటికలకు వచ్చే విటులు సంపన్నులు.. అర్బన్ ప్రాంత వాసులే ఉంటారు. సాధారణ జీవితాలను గడిపేవారికి కామసూత్రాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది సంపన్నులకు ఉద్దేశించి రాసినదే అని అనిపించడంలో తప్పేం లేదు. ఇదే కామసూత్రాలలో.. ఇల్లీగల్ సెక్స్ తప్పు అని కూడా వాత్స్యాయనుడు పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు సంతోషం. ఇక చివరగా ఒక మాట. పురాణాలలోని చాలా కథలను, పాత్రలను ఆయా చోట్ల విస్తారంగా ప్రస్తావిస్తూ వెళ్లారు. ఈ పురాణ కథలే మనపైన నానా రకాల దాడులకు.. మనపైన నిష్టీవనం వేయడానికి కారణాలవుతూ వచ్చాయి. మొదట సంస్కృత భాష గురించిన అవగాహన ఉండాలి. ఆ తరువాత వేదాలకు, ఉపనిషత్తులకు, ఇతిహాసాల(చరిత్ర)కు, పురాణాలకు తేడా ఏమిటో స్పష్టంగా తెలియాలి. ఇవేవీ తెలియకుండా సాధారణ చర్చ, ట్రూ ట్రాన్స్‌లేట్ చేసి.. అదిగో తోక అంటే ఇలాగే ఉంటుంది. సోకాల్డ్ హేతువాదులు ఇంతకాలంగా చేస్తున్నది ఇదే. మహా మహా చరిత్రకారిణి రోమిలా థాపర్ లాంటి వారు సైతం సంస్కృతం తెలియకపోవడం వల్ల చరిత్రను యురోపియన్ చరిత్రకారుల కంటినుంచే చూసినట్టు అన్యాపదేశంగా చెప్పారు కూడా. రోమిలా థాపర్ తన ప్రాచీన భారతదేశ చరిత్ర అన్న పుస్తకంలో రాసుకొన్న మాటలివి. Clues can be of many kinds. The most commonly used are manuscripts. Manuscripts are ancient books, written either on dried palm leaves or the thin bark of the birch tree or on paper. (Generally the latter kind have survived, though books written on paper are not as old as the others.) Some of the languages in which they very old books are written are languages which we in India do not use in everyday life anymore. such as Pali and Prakrit. Others are written in Sanskrit and Arabic. Which we still study and use in our religious ceremonies although we do not speak them at home. Yet others are written in Tamil, a language which IS spoken in South India and whose literature goes back to an early period. These are called Classical Languages and the history of many parts of the World recorded in various classical languages In Europe, ancient manuscripts were often written in Greek and Latin in western Asia they were written in Arabic and Hebrew, and in china, classical Chinese was used. The writing or the scripts in which the manuscripts of India are written resemble the modern scripts. For example, you could probably read the script in Sanskrit manuscripts are written in the Devanagari script.. Although you will not understand what was written until you learn Sanskrit. But the writing which was used two thousand years ago looks different and in order to read that you would have to be specially trained.

ఇక భారతీయ గ్రంథాలను చదవటం, అర్థం చేసుకోవడం ఎలా సాధ్యపడుతుంది? ఉదాహరణకు రామాయణాన్ని తీసుకొందాం.. ‘రామాయణం సంధి చెయ్యాలంటే రామ+అయనం. మొదటి శబ్దం అకారాంత పుంలింగం. It is a short vowel and the second letter also begins with a short vowel. They both mix and become long vowel. దీని పేరు సవర్ణదీర్ఘ సంధి. అందుచేత రామ+ఆయనం= రామాయణం. ఆ ‘రా’ వెనుక ‘మా’ ఉంటే, ఈ ‘న’ ణ అవుతుంది. ఇంతే కాకుండా యింకో చమత్కారం ఉందిక్కడ. ఈ సవర్ణ దీర్ఘసంధిలోనే ఇది చూడండి. అ+అ=ఆ; ఆ+ఆ=ఆ. రెండూ ఒకటే.. అక్కడ రెండు పొట్టి అచ్చులున్నా దీర్ఘమే వస్తుంది. రెండు దీర్ఘాలున్నా దీర్ఘమే వస్తుంది. మొదటిదాని చివర దీర్ఘముండి, రెండవదాని ముందు హ్రస్వమున్నా దీర్ఘమే వస్తుంది. రామ+ఆయనం=రామాయణంలో రామా+ఆయనం.. రామా అంటే స్త్రీ.. లోకంలో సీతమ్మను మిగిలిస్తే స్త్రీ ఎవరు? కనుక స్త్రీ శబ్ద వాచ్యురాలు తల్లి యొక్కతే. అందుచేత రామాయణం అంటే ‘సీతాచరిత అన్నమాట’. సంస్కృతం భాషను డెరివేటివ్ లాంగ్వేజి అని బ్రిటిష్‌వాళ్లు అన్నారు. ఎందుకంటే.. ఈ భాషలో అన్ని శబ్దాలు రెండు రకాలుగా ఉంటాయి. ఆఖ్యాతజములు, ధాతుజములు అని. ఆఖ్యాతజములంటే వెర్బ్స్ నుండి పుట్టకుండా వాటంతటవే పుట్టినవి. ఆయనం అంటే గమనం అని అర్థం. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తూ ఉంటే అది ఉత్తరాయణం.. ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తూ ఉంటే.. దక్షిణాయనం అని అంటారు. ‘అయి’ అనేది ఒక ధాతువు. దీనికి వెళ్లుట, నడక అన్న అర్థాలున్నాయి. కాబట్టి.. రామాయణం అంటే.. రాముడి గమనం, సీతా గమనం అన్న రెండు అర్థాలు ధ్వనిస్తాయి. ఇక్కడ మరొక ఉదాహరణ చెప్తాను. తల్లి సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లాడు. ఇక్కడ వాల్మీకి వాడిన శబ్దం ‘బలాత్’. అంటే బలాత్కారంగా ఆమెను తీసుకొని వెళ్లాడని అర్థం. సీతాదేవిని లంకలోకి తీసుకొని వెళ్లిన తరువాత ఆమెను వెంటపెట్టుకొని అంతఃపురాలను, భవనాలను, తోరణాలు, కుడ్యాలు, వనాలు అన్నింటినీ చూపించాడట. అసలే బలాత్కారంగా తీసుకెళ్లిన తల్లికి ఇవన్నీ ఇంత విపులంగా చూపించడం సాధ్యమేనా? ఇదంతా ఏమిటన్న ప్రశ్నకు ‘బలాత్’ అన్న శబ్దమే జవాబివ్వాలి. ‘బల్’ అన్న ధాతువుకు సంస్కృతంలో ‘ప్రాణము’ అన్న అర్థమున్నది. ఈ భాష ధాతు జనితమని ముందే అనుకొన్నాం. తల్లి వాడి ప్రాణాలలోనే ఉన్నదని అర్థం. బలాత్ అంటే ప్రాణాత్ అని అర్థం. భారతీయ ఆధ్యాత్మిక, తాత్త్విక చింతనకు మూలాధారం అయింది కాబట్టే ఈ భాష దేవభాషగా ప్రసిద్ధి చెందింది. దీన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోకపోతే.. రామాయణమే కాదు.. భారతదేశంలోని ఏ ఒక్క గ్రంథాన్నైనా అర్థం చేసుకోవడం కష్టమే. దీనితోపాటు మన సంప్రదాయంలో రహస్య కథా కథన సంవిధానం ఉన్నది. మన పురాణాలు, వాటిలోని పాత్రలు, దేవీ దేవతలు, సంబంధాలు, కథలు వీటన్నిటిలోనూ కథ వేరు.. అంతర్గతంగా చెప్పదలచుకున్న కథనం వేరు. ఈ రెండింటి గురించి అర్థం చేసుకోకుండా మన పూర్వికుల రచనలను వివేచించడం తెలివితక్కువ పనే అవుతుంది. వ్యాసుడు వేదాలను ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం.. అన్న మూడు స్తరాలలో అవగాహన చేసుకోవాలి అన్నాడు.. వేదాలే కాదు.. మన ఇతిహాసాలు, పురాణాదులు.. ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు అన్ని కూడా ఈ సంవిధానంలోనే రచించినవి. స్వస్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here