[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
దర్శకనిర్మాత సి.వి.శ్రీధర్
ప్రముఖ దర్శకుడు, నిర్మాత సి.వి. శ్రీధర్ తన గురించి తాను ఇలా చెప్పారు:
“నేను మధురాంతకం తాలూకాలోని చెంగల్‌పేట్‌లో పుట్టాను. నా బాలసారకి మంచి ముహూర్తం ఉండి ఉంటుంది, అందుకే నాకు శ్రీధర్ అని పేరు పెట్టారు. శ్రీధర్ అంటే ‘శ్రీ’ని తలపై ధరించే వ్యక్తి. మా పూర్వీకులు చెంగల్‌పేటలో రెండు తరాలుగా స్థిరపడిన తెలుగువారు. వారు తమిళ సాంప్రదాయాలు, సంస్కృతిని పూర్తిగా తమలో ఇముడ్చుకున్నారు. నేను ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఇంకా తమిళ భాషలను నేర్చుకునేలా చేసారు మా పెద్దలు. ఇంట్లో ఎక్కువగా తెలుగు మాట్లాడినప్పటికీ నేను తమిళ భాషను ఎక్కువగా ఇష్టపడేవాడ్ని. నేను తమిళ సాహిత్యంపై లోతైన పరిశోధన జరిపి ఆనందించాను. నేను సాధారణ చదువులు చదవలేదు, కానీ ప్రపంచం ఒక విశ్వవిద్యాలయమని, దాని నుండి నేర్చుకోవడానికి ఆకాశమే హద్దు అని భావించాను. ఈ అధ్యయనాల ఫలితం నన్ను రచయితని చేసింది, కథలు రాసి వాటిలో లీనమైపోయాను. జీవితాంతం యవ్వనంగా ఉండటానికి ఇష్టపడతాను. అందుకే నా వయసు, పుట్టిన తేదీ ఎవరికీ చెప్పను.
వీనస్ ఫిల్మ్స్‌లో భాగస్వామిగా చేరి ‘అమరజీవి’కి, ‘ఉత్తమ పుతిరన్’కి కథ, మాటలు రాశాను. ఇవి తెలుగులోకి డబ్ అయ్యాయి, తమిళం, తెలుగు రెండు వెర్షన్లు పెద్ద హిట్ అయ్యాయి. ‘తూయ ఉల్లం’ పేరుతో తమిళంలోకి డబ్ చేయబడిన ‘మాంగల్య బలం’ వంటి తెలుగు సినిమాలకు నేను తమిళ సంభాషణలు కూడా రాశాను. అలాంటి సినిమాలతో నాకు చక్కని గుర్తింపు వచ్చింది. ప్రజలు నన్ను ప్రోత్సహించి నాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేవారు.
వీనస్ ఫిల్మ్స్ సంస్థను వదిలేసి సొంతంగా ‘చిత్రాలయ’ అనే బ్యానర్ ప్రారంభించాను. దర్శకుడిగా నా మొదటి సినిమా ‘కళ్యాణ పరిసు’, నాకు చిరస్థాయిగా నిలిచే కీర్తిని తెచ్చిపెట్టింది. ఇది తెలుగులో ‘పెళ్లి కానుక’గా రీమేక్ అయింది, ఇది కూడా హిట్ చిత్రం. నేను హిందీలో ‘నజరానా’గా రీమేక్ చేశాను, ఈ చిత్రానికి నా మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది.
తరువాత నేను అందరూ కొత్తవాళ్ళతో ‘కాదలిక్క నేరమిల్లై’ అనే సినిమా తీశాను. ఇదే తెలుగులో ‘ప్రేమించి చూడు’, హిందీలో ‘ప్యార్ కియే జా’. మూడు భాషల్లోనూ గొప్ప హిట్ అయింది. ‘నెంజిల్ ఒరు ఆలయం’ ఓ స్త్రీ మానసిక స్థితికి అద్దం పడుతుంది, ఈ కథ రాయడానికీ, సినిమా తీయడానికీ నేనెంతో ఇష్టపడ్డాను.
నాకు 1963లో అక్టోబర్ 28న మద్రాసులో వివాహం జరిగింది. నా భార్య పేరు దేవసేన. ఆమె అప్పటికి బీఏ చదువుతోంది. ఈమె బెజవాడ రామచంద్రారెడ్డి మనవరాలు. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను. తను నాకొక ఆస్తిలాంటిది, అన్ని విషయాల లోనూ నాపై శ్రద్ధ చూపిస్తుంది. నా కూతురు ఎడ్వర్డ్స్ ఇలియట్స్ రోడ్ [మైలాపూర్]లోని కల్యాణి క్లినిక్‌లో జన్మించింది. అప్పట్లో నేను వాహిని – విజయా స్టూడియోలో పని చేస్తున్నాను. ఎవరో వచ్చి ఈ వార్త చెప్పారు. నేను వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాను, కాని రైల్వే క్రాసింగ్ వద్ద చిన్న గేటు మూసేసి ఉంది. నేను దాని కింద నుంచి దూరి ఆసుపత్రికి పరిగెత్తాను. నా భార్య, కుమార్తె ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్ చెప్పడంతో, నేను వేగం తగ్గించి ఆనందంతో మురిసిపోయాను. నా కూతురు ఏడున్నర పౌండ్లు అని డాక్టర్ చెప్పారు కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు, నాకదే చాలు. అంతకు ముందు పుట్టబోయేది పాపా, బాబా అని అంచనా వేసేందుకు పందేలు కాశారు. అబ్బాయి అని నేనన్నాను, అమ్మాయి అని నటుడు నగేష్ చెప్పారు. 500 రూపాయలు పందెం వేసుకున్నాం. ఈ పందెంలో నటి సావిత్రి కూడా చేరింది. ఆమె, ఇంకా ఆమె కార్యదర్శి నాగభూషణం 100 రూపాయలు పందెం కాశారు. సావిత్రి అబ్బాయి అని చెప్పగా, ఆమె సెక్రటరీ అమ్మాయి అని చెప్పాడు. అంతా చాలా సరదాగా గడిచిపోయింది..
నేను తెలుగు కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి చాలా మంది నన్ను తెలుగు సినిమా చేయమని అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే తమిళంలో తప్ప మరే ఇతర భాషపై నేను దృష్టి పెట్టలేను. నేను కథ, ఇంకా మాటలు వ్రాస్తాను, నేను తమిళ చిత్రాలను నిర్మిస్తాను, దర్శకత్వం వహిస్తాను. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తాను. మరింక సమయం ఎక్కడ ఉంది?..”
~
శ్రీధర్ గురించి ఆయన సన్నిహితుడు ‘చిత్రాలయ గోపు’ ఏమన్నారో చదవండి:
సాహసం ఆయన నేస్తం, నూతనత్వం ఆయన ఇంటి పేరు! ఈ లక్షణాల వల్లే శ్రీధర్‌కు గొప్ప హోదా లభించింది. ఈ దిగ్గర రచయిత-దర్శకుడు అనేక రంగాలలో మార్గదర్శకుడు. తమిళం లోనే కాకుండా, హిందీ ఇంకా ఇతర దక్షిణాది భాషలతో 75 చిత్రాలు తీశారు. “గోపూ, ‘నువ్వు రిస్క్ తీసుకునేవాడిగా ఉండాలి, లేకపోతే గెలవలేవు’, అనేవాడు” అని శ్రీధర్ స్నేహితుడు, అసోసియేట్ – ‘చిత్రాలయ’ గోపు గుర్తుచేసుకున్నారు.
“ఎంజీఆర్, శివాజీ గణేశన్ తమిళ చిత్రసీమను ఏలుతున్న కాలంలో, తనకంటూ విడిగా అభిమానులను కలిగి ఉన్న అరుదైన దర్శకనిర్మాతలలో శ్రీధర్ ఒకరు. విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్, ఎక్కడైనా ప్రజలు ఆయనని చుట్టుముట్టేవారు. నేను పక్కనే నిలుచుని, సినీరంగంలో ఆయన ఎదుగుదలకు కారణమైన నిర్భీతిని, చతురతని నిశ్శబ్దంగా ఆరాధిస్తూ ఉండేవాడిని” అని గోపు చెప్పారు.
శ్రీధర్, గోపులది చిన్నప్పటి స్నేహం. “నిజానికి రచయిత పి.ఎస్.రంగనాథన్ (అగస్తియన్; కడుగు)తో సహా వాళ్ళు త్రిమూర్తులు” అంటారు శ్రీధర్ బంధువు, అనేక చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన దర్శకుడు సి.వి.రాజేంద్రన్.
శ్రీధర్ ఒకరోజు గోపు ఆఫీసుకి వచ్చి, “ఈ ఉద్యోగం మానేసి నాతో రా. త్వరలో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను’’ అని చెప్తే, గోపు క్షణం కూడా ఆలోచించలేదట. “శ్రీధర్‌పై నాకున్న నమ్మకం అలాంటిది. నా స్నేహితుడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని ఖచ్చితంగా అనుకున్నాను, శ్రీధర్ నన్ను అలాగే చూశాడు. ఒక్కసారి కూడా నన్ను తన అసిస్టెంట్‌గా ఇతరులకు పరిచయం చేయలేదు. నేనెప్పుడూ ఆయనకి ‘క్లాస్‌మేట్‍నీ, మిత్రుడినే’,” అని గోపు కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. “శ్రీధర్ లాంటి స్నేహితుడు దొరకడం కష్టం.” అన్నారు.
ఆ చిత్రం ‘కళ్యాణ పరిసు’. అది అద్భుత విజయం సాధించింది. కొద్దికాలంలోనే హిందీ, ఇంకా ఇతర భాషలలో రీమేక్ చేయబడి విజయవంతమైంది. శ్రీధర్ పేరు ఓ సంచలనం అయింది. “శ్రీధర్ హీరోయిన్లు దృఢమనస్కులు, త్యాగం చేసేవారు. ఆయన సంభాషణలు ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ఉండేవి. మహిళా ప్రేక్షకులు ఆయన్ను ఆదరించారు. నాలోని హాస్యగాడిని గుర్తించింది ఆయనే..” అని గోపు చెప్పారు.
“కామెడీ, ట్రాజెడీ, ముక్కోణపు ప్రేమ, సరసాలు, అవిశ్వాస ప్రేమ, పునర్జన్మ – ఇలా అన్ని జానర్‍లలోనూ శ్రీధర్ సినిమాలు రూపొందించారు. ఆయన చిత్రాలలో అద్భుతమైన క్లైమాక్స్‌లు ఉంటాయి. అనేక విధాలుగా ఆయన అగ్రగామిగా నిలిచారు” అని రాజేంద్రన్ చెప్పారు. “మేము ‘ఎందుకు’ అని అడిగినప్పుడల్లా, ‘ఎందుకు కాకూడదు’ అని ఆయన మాతో సవాలు చేసేవారు.”
శ్రీధర్ డైలాగ్‍లని తగ్గించి సినిమా దృశ్యాత్మకంగా మార్చారు. “‘అంత డైలాగ్ ఎందుకు? ఇదొక దృశ్య మాధ్యమం. అందమైన లొకేషన్లు, ఎక్స్‌ప్రెషన్‌లు, క్లోజప్‌లు చూపిద్దాం’ అని ఆయన అనేవారు.”
శ్రీధర్ సినిమా రంగం లోకి దూసుకువచ్చాకా, అప్పటి వరకు స్వచ్ఛమైన తమిళంలో ఉన్న సినిమా డైలాగ్ లని వ్యావహారికంగా, సంభాషణాత్మకంగా మార్చారు. షూటింగ్ కోసం స్టూడియోలు దాటి ఎవరూ బయటకి వెళ్లని కాలంలో, శ్రీధర్ ‘తేన్ నిలవు’ షూటింగ్ కోసం కాశ్మీర్; ‘శివంద మాన్’ కోసం యూరప్ వెళ్ళారు. దీనికి విరుద్ధంగా, ‘నెంజిల్ ఓరు ఆలయం’ చిత్రాన్ని ఒకే సెట్‌లో తీశారు, అది కూడా కేవలం 25 రోజుల్లో. అప్పట్లో ఒక సినిమాకి రెండేళ్లకు పైగా సమయం పట్టేది. ‘శివంద మాన్’ కోసం వాహిని స్టూడియోస్‌లో ఒక నదినే సృష్టించారు. షూటింగ్ ప్రారంభం కాకముందే ఆ ప్రదేశమంతా జలమయమైంది. శ్రీధర్ కంగారు పడలేదు, ‘నదీ తీరాన్ని కాంక్రీట్‌తో మళ్లీ నిర్మిద్దాం’ అని చెప్పి ముందుకు సాగారు. “ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చుకోలేదు” అని రాజేంద్రన్ గుర్తు చేసుకున్నారు. అలాగే ‘కాదలిక్క నేరమిల్లై’ జెమినీ కలర్ ల్యాబ్‌లో ప్రాసెస్ చేయబడిన మొదటి ఈస్ట్‌మన్ కలర్ చిత్రం.
సినీరంగంలో నిలదొక్కుకుపోయిన హీరోలకు మించి ఏ దర్శకనిర్మాత ఆలోచించనప్పుడు – కొత్త ముఖాలతో సూపర్ హిట్‌లను అందించవచ్చని శ్రీధర్ నిరూపించారు. స్క్రిప్టు బాగుంటే చాలని నమ్మారు. ‘కాదలిక్క నేరమిల్లై’, ‘వెన్నిరా ఆడై’ సినిమాలు ఇందుకు ఉదాహరణలు. ‘నెంజిరుక్కుం వరై’ సినిమా కోసం నటీనటులెవరూ మేకప్ వేసుకోలేదు. ఇది కూడా తొలి ఘనతే.
శ్రీధర్ – ఎంజిఆర్, శివాజీ గణేశన్, తరువాత రజనీకాంత్, కమల్ హాసన్ లతో హిట్ సినిమాలు తీయడమే కాకుండా, కొత్తవాళ్ళనీ, రంగస్థల నటులనీ, చిన్న నటులను కూడా స్టార్స్‌ని చేశారు. శ్రీధర్‍కి సహాయం అవసరమైనప్పుడు, ఎంజిఆర్ ‘ఉరిమై కురల్’లో హీరోగా నటించడానికి ముందుకు వచ్చారు – ఇది సిల్వర్ జుబ్లీ హిట్ అయి, శ్రీధర్ కొత్త ఉత్సాహంతో తిరిగి పుంజుకున్నారు.
శ్రీధర్‌కి సంగీతం పట్ల అభిరుచి ఉంది. ఆయన చిత్రాలలో ముఖ్యంగా ఎం.ఎస్. విశ్వనాథన్, ఇళయరాజా పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. గాయకులలోని సామర్థ్యాన్ని గుర్తించి వారిని స్వరకర్తలుగా చేశారు శ్రీధర్. ఉదాహరణ – ఎ.ఎం. రాజా (కళ్యాణ పరిసు); ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (తుడిక్కుమ్ కరంగల్).
“విద్యావంతులైన సినిమా ప్రేక్షకుల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు శ్రీధర్. ఆయన వీరాభిమాని, రిటైర్డ్ ప్రొఫెసర్ రామన్ గారు – శ్రీధర్ ట్రీట్‌మెంట్ మరియు ప్రెజెంటేషన్ ఎప్పుడూ సాధారణంగా ఉండవు. ఆయన మెగా హిట్‌లు స్టార్ వాల్యూని గొప్పగా చెప్పుకోలేదు’ అని అన్నారు. నేను చెబుతున్న దాంట్లో అర్థం ఉందిగా?” గోపు కంఠం గర్వంతో నిండిపోయింది.