మహతి-35

12
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[ఇప్పటిదాకా ‘అల’ కథని చెబుతున్న మహతి దానికి కాస్త విరామం ఇచ్చి తన కథను చెప్పడం మొదలెడుతుంది. అల రాసిన ఉత్తరం చదివాకా, మహతి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అది చూసిన తాతయ్య – అమ్మమ్మ గుర్తొచ్చిందా – అని అడుగుతారు. అమ్మమ్మ హఠాత్తుగా చనిపోయిన సంగతి గుర్తుచేసుకుంటుంది మహీ. అందరూ కర్రావూరి వుప్పలపాడుకి వెళ్ళి అక్కడే అంత్యక్రియలూ, 10, 11, 12 రోజుల చిన్న, పెద్ద కర్మలు జరిపిస్తారు. కార్యక్రమాలన్నీ ముగిసి, బయల్దేరే సమయం వచ్చినప్పుడు తాతయ్య తానిక టౌన్‍కి రాలేనంటారు. ఆయన అన్న మాటలతో మహి అమ్మ గట్టిగా ఏడుస్తుంది. ఆయన్ని ఒంటరిగా ఉండనీయద్దని డా. శ్రీధర్ అంటారు. తానూ అదే అనుకుంటున్నానని మహీ వాళ్ళ నాన్న చెప్తారు. ఎవరు ఎంత చెప్పినా, తాతయ్య మాత్రం టౌన్‍కి వెళ్ళడానికి ఇష్టపడరు. ‘పోనీ నువ్వు మీ నాన్నగారికి తోడుగా ఉండిపో, నేను మహీతో కలిసి అక్కడ మేనేజ్ చేసుకుంటాన’ని మహతి నాన్న అంటే, చిన్నపిల్లలతో చేసుకోవడం కష్టం, కుదరదంటుందామె. తన గురించి ఆలోచించవద్దని తాతయ్య అంటే, మీ గురించి కాక ఇంక ఎవరి గురించి ఆలోచించాలని మహతి అమ్మ అడుగుతుంది. ఊరెళ్ళే ప్రోగ్రాం ఇంకో రెండు రోజులు వాయిదా వేసుకోమని డా. శ్రీధర్ సూచించడంతో, తాత్కాలికంగా ప్రయాణం ఆగుతుంది. – ఇక చదవండి.]

మహతి-3 మహి-2

[dropcap]“అం[/dropcap]దరూ యీ లోకంలోకి ఒంటరి గానే వస్తారు. కొందరు ఏ అలజడీ లేకుండా ఏ ఆశలూ ఆశయాలూ లేకుండా హాయిగా బ్రతికి వెళ్ళిపోతారు. కొందరు మాత్రం, జీవితాన్ని అత్యంత విలువైనదిగా భావించి, దానికో అర్థమూ, గమ్యమూ వుండే విధంగా నిర్మించుకుంటారు. అగ్గిపెట్టి మొట్టమొదట కనిపెట్టినవాడి పేరు చెప్పగలవా? గరిటెనీ, కంచాన్నీ, గునపాన్నీ, కత్తెరనీ, చక్రాన్నీ, దారాన్నీ, కత్తినీ, పిండి రుబ్బుకునే రోలునీ ఎవరు కనిపెట్టి ఉంటారో చెప్పగలవా? వాళ్ళెవరో యీనాడు ఎవరికీ తెలియదు. కానీ వారు దశాబ్దాల పాటు చెమటోడ్చి సృష్టించిన పరికరాలు మాత్రం యావత్ ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయి.. యీనాటికీ!” – ఈ మాటలు ఎవరో డిగ్రీలు తెచ్చుకున్న మేధావులు మాట్లాడిన మాటలు కావు. మా అమ్మమ్మ నాకు వంట నేర్పుతూ చెప్పిన మాటలు.

విద్య వేరు – వివేకమూ విచక్షణా వేరు. ఒకప్పుడు ‘విద్య రానివాడు వింతపశువు’ అనేవాళ్ళు. ఇవ్వాళ విద్య తెగ చదివిన వింతపశువులు కొల్లలుగా దర్శనమిస్తున్నాయి.

“నాకు చదువు రాదే. కానీ ‘వంట’నే నేను విద్యగా భావించి సాధన చేశాను. నీకు తెలీదు. ఒకప్పుడు యీ చుట్టు పక్కల గ్రామాల్లో ఏ శుభం జరిగినా నన్ను బ్రతిమాలి వాళ్ళింటికి తీసుకుపోయేవారు. వంట, వడ్డింపులూ నా పర్యవేక్షణలో జరిగేవి”. అమ్మమ్మ మొహంలో తృప్తితో కూడిన గర్వరేఖ. “మా అత్తగారు అన్ను ‘నువ్వేమన్నా వంటలక్కవా?’ అని నానా తిట్లు తిట్టేది. కానీ, మీ తాతయ్యే వాళ్ళమ్మని శాంతపరిచేవారు, ‘అమ్మా, దానివల్లనేగా చుట్టుపక్కల గ్రామాల్లో మనకింత పేరు వచ్చింది’ అని నవ్వేవారు.” మురిపెంగా అన్నది అమ్మమ్మ.

“ఎన్నెన్నో రకాలు చేసేదాన్ని. ఎందరికో నేర్పేదాన్ని. రాత్రి పడుకునే ముందు కూడా కొత్తగా ఏం చెయ్యాలనే! ఒకప్పుడు మా అమ్మ అన్నది, ‘నీకు వంట పిచ్చి పట్టింది’ అని.” అమ్మమ్మ మోహంలో చిన్న నవ్వు. “అప్పట్లో కట్టెల పొయ్యి. కట్టి పచ్చిదైనా తడిసిపోయినా చచ్చే పొగ వచ్చేది. దాంతో ఇల్లింటిపాదీ దగ్గులూ, తిట్లూ, పెద్ద వంటలకి గాడిపొయ్యి. అందులోనూ కట్టెలే. వంట బ్రాహ్మణులని వుండేవారు. వారు చెప్పిందే చెయ్యాలి. వారు చేసిందే తినాలి. నేను పైసా కూడా తీసుకొను గనక అందరూ నా చుట్టూ మూగేవారు. ‘దమ్మిడీ’ల కెంత విలువ వుండేదో తెలుసా?”

అమ్మమ్మ కళ్ళు ఏ లోకంలోకో చూస్తున్నాయి.

“మీ తాతకి మాత్రం నేనంటే చెప్పలేనంత ప్రేమ. ఏనాడూ ఆయనకి చద్ది వస్తువో, చల్లారిన వస్తువో పెట్టలేదు. ముఖం చూసి కనుక్కునే దాన్ని ఆయనకి ఆకలి వేస్తుందో లేదో!” మళ్ళీ ఆవిడ పెదాలపై ఓ దరహాసం.

“ఒక్కటే బాధే.. నేను ముందు వెళ్ళిపోతే ఆయనకి ఎవరు వేడి వేడిగా వండిపెడతారూ? ఎప్పుడూ ఇది కావాలని అడగలేదు. అడగలేడు. పెడితే తింటారు. లేకపోతే చెప్పను కూడా చెప్పడు. నిజం చెబితే ఎంత తినాలో కూడా ఆయనకి తెలీదు.” అమ్మమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి.

“అదేంటి అమ్మమ్మా, ..నువ్వు ఎప్పటికీ వుంటావు” కావలించుకుని అన్నాను.

“ఉండాలనే నా ఆశ కూడా.. సరేలే.. కబుర్లు వింటూ బెండకాయలు ఎంత ఛండాలంగా తరిగావో చూడు. ఇలా తరిగితే ఉప్పూ కారం ముక్కలకి సరిగ్గా అతుక్కుంటాయా?” చిన్నగా కేకేలేసి నా చేతి లోంచి చాకు తీసుకుంది అమ్మమ్మ.

నిజానికి అమ్మమ్మకి ‘చాకు’ అలవాటు లేదు. కత్తిపీటతోనే తరుగుతుందిట. ఆ కత్తిపీట ఆవిడ అత్తగారి అత్తగారిదిట. కూరలు తరిగీ తరిగీ ఆ కత్తిపీట అరిగిపోయింది. నేనే కొద్దిగా చాకుని అలవాటు చేస్తున్నా. ఆ రోజు చేసింది బెండకాయ పులుసు జ్ఞాపకం వుంది. కాలం ఎంత నిర్దయి.

రెండు రోజులైనా తాతయ్య తన నిర్ణయం ప్రకటించలేదు. అమ్మా నాన్న తర్జన భర్జన పడుతున్నారు. పిల్లలు ఎటూ చెప్పలేక సైలెంటయ్యారు. వాళ్లకి విషయాన్ని గ్రహించి ఆలోచించే వయసు మరి లేదుగా.

శ్రీధర్ గారు కూడా చాలా చాలా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు గానీ, తాతయ్య విని నవ్వుకుంటున్నాడు. ఆ మధ్యాహ్నం తోటలో నడుస్తూ, “మహీ.. మీ అందరికీ నేనో సమస్య సృష్టిస్తున్నానని నాకు తెలుసు. నా కంటే ముందు ఆవిడ వెళ్ళిపోతుందని కలలో కూడా ఊహించలా. నాకు గుండెపోటు వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డా.. ఆవిడ కంటే నేను ముందరేపోతానాని” సైలెంటయ్యాడు తాతయ్య. “చివరి రోజుల్లో మేము చాలా చాలా దగ్గరయ్యాము. ఎన్ని మాటలు మాట్లాడేదో! నిజం చెబితే ఆ మాటలతో మా జీవితాన్ని మళ్ళీ జీవించాం. మహీ, ఇప్పుడా గది అంతా ఆవిడ మాటలే వున్నాయి.. చిత్రం ఏమంటే, తను లేదు.” మళ్ళీ సైలెంటయ్యాడు తాతయ్య.

ఒక ఆవు దూరంగా మేస్తుంది. దాని పక్కనే దాని బుల్లి దూడ. కొన్ని గేదెలు మామిడి చెట్టు కింద పడుకుని నెమరు వేస్తున్నాయి. కొన్ని కాకులు వాటి మీద వాలి గంభీరంగా కూర్చున్నాయి.

మొట్టమొదటి సారి అనిపించింది.. మృత్యువుని గురించి మనిషి ఆలోచించే పద్థతి వేరని.

బ్రతికి వున్నంత కాలం ప్రేమ, ద్వేషం, లాలస, ఇలా అనేకానేక భావాల్ని మరో మనిషిపై మనం పెంచుకుంటాం. ప్రతి భావనకీ ఓ కొత్త పేరు పెడతాం. కొన్నిసార్లు అసూయతోటో  కోపంతోటో మనం ప్రేమించిన మనుషుల్ని మనమే దూరం పెడతాం. కానీ, వాళ్ళు యీ లోకాన్నీ వదిలి వెళ్ళిపోయాక? ఒక్కక్షణమైనా వారి గురించిన మనలో వున్న భావాన్ని చెప్పే అవకాశం జన్మాంతం వస్తుందా?

విధి ఎంత చిత్రమైనదంటే, పోయేవాళ్ళకి కూడా తెలీదు.. పోయే క్షణం ఎప్పుడో!

“మీ అమ్మమ్మ చాలా మంచిదే. గొప్ప మనిషి. చాలా కలివిడిగా, తనున్న చోటుని ఓ సంతోషకరమైన తోటలా మార్చేది. మా అమ్మా మంచిదే. కానీ, సాంప్రదాయాల పిచ్చి. పెద్దలు, శాస్త్రాలు, నీతి గ్రంథాలూ ఆవిడ బుర్రనే గ్రంథాలయాన్ని చేశాయి. దాంతో ఎక్కడ లేని ‘శుభగుణ లక్ష్మణాల’నూ మీ అమ్మమ్మకి వల్లించి వల్లించి దాన్నో మూగ మొద్దుని చేసింది” ఆగాడు తాతయ్య. ఆయన మాటలు ఎక్కడి నుంచో వస్తున్నై. “పరుగులు పెట్టే ఉత్సాహానికి సాంప్రదాయాల ముళ్ల కంచెలు వేసింది మా అమ్మ. నేనేం చెయ్యనూ? అందరి ఇళ్ళలోనూ అవే సుద్దులు, అవే హద్దులు.” మళ్ళీ సైలెంటయ్యాడు తాతయ్య.

“నిజం చెబితే అది నీలా ఉండేది! మా అమ్మ మీ అమ్మమ్మకి చెప్పిన సుద్దులన్నీ నీకూ చెప్పేది. ఎందుకో తెలుసా? నీకు చెబుతుంటే నేను వినాలని” నా పక్కకి తిరిగి చిన్నగా నవ్వాడు తాతయ్య. అవును. ఆవిడ సుద్దులు చెప్పేదే గానీ, పాటించమని ఏనాడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు.

“మీ అమ్మమ్మకి చదువు లేదు. కానీ అద్భుతమైన గ్రహణశక్తి, అనంతమైన ఉత్సాహం. అన్నిటికంటే గొప్ప విషయం ఎవరెన్ననా పట్టించుకోకపోవడం, అన్నవాళ్ళని అప్పటికప్పుడే క్షమించడం.”

తాతయ్య గొంతులో ప్రవహిస్తున్నవి మాటలు కాదు, అమ్మమ్మ మీద ఉన్న ప్రేమ, ఆరాధనా అన్నీ.

“చిత్రం ఏమంటే, నేను నీతో చెబుతున్న యీ మాటలన్నీ ఒక్కసారి కూడా నోరు విప్పి మీ అమ్మమ్మతో చెప్పలేదు, కనీసం ఒక్కసారి కూడా. ఇప్పుడు నేను ఎంత అరిచి చెప్పినా తనకి వినబడవుగా.” నడుస్తున్నవాడల్లా ఆ గట్టు మీదే కూర్చుని మొహం కప్పుకున్నాడు తాతాయ్య. ఒళ్ళు  వణుకుతోంది.

ఆయన పక్కనే నేనూ కూర్చున్నాను.. ఆనుకుని. బాధకి భాష లేదు. ప్రేమకి భాష లేదు. కోపానికీ ద్వేషానికీ అసూయకీ మదానికీ మాత్రం బోలెడు భాషలున్నాయి. బాధకీ ఓ భాష ఉంది.. అది ప్రవహించే భాష. దాన్ని కన్నీరంటాం. ప్రేమకీ ఓ భాషుంది. అది మాటల్లో వ్యక్తమవదు. చూపులో వ్యక్తమవుతుంది, స్పర్శలో వ్యక్తమవుతుంది, మౌనంలో మహాద్భుతంగా వ్యక్తమవుతుంది.

దాదాపు ఓ అరగంట అక్కడే, ఆ ఎండలోనే కూర్చుండిపోయాం. పెదవులు దాటని మాటల్ని మనసుతో విన్నానానాడు. దూరాన మా పాలేరు రావడం చూసి తాతయ్య మెల్లిగా లేచాడు. బహుశా మమ్మల్ని వెతికి తీసుకురమ్మని అమ్మ పంపించి వుంటుంది. ఇద్దరం ఇంటి బాట పట్టాం. ఒక్క మాట కూడా కదల్లేదు. ఇద్దరి మనసుల్లోనూ అమ్మమ్మ మాత్రం నిండుగా ఉందని చెప్పగలను.

***

చర్చ చాలా జరిగింది. కానీ నేను వినలేదు. తాతయ్యతో పాటు కర్రావూరి ఉప్పలపాడు లోనే వుంటానని పట్టుబట్టాను.

“మరి చదువు?” పిచ్చికోపంతో అన్నది అమ్మ.

“అసలు ఇప్పుటిదాకా చదివింది చదువు కానే కాదమ్మా. కేవలం భాషల్ని నేర్చుకోవడం, లోకంలో కనిపెట్టబడ్డ వాటినించీ, కనిపెడుతూ వున్న వాటి గురించి తెలుసుకోవడం మాత్రమే. సరే, వంద డిగ్రీలు పుచ్చుకున్నా మృత్యువు ఆగుతుందా? లక్ష పుస్తకాలు బట్టీ పట్టినా వచ్చిన తలనెప్పి తగ్గుతుందా? ఇవన్నీ ప్రశ్నలు నేను మీకు వేస్తున్నవి కాదు. నాకు నేను వేసుకుంటున్నవి. చదవాల్సింది పుస్తకాలని కాదని నా మనసు ఎప్పట్నించో చెబుతూనే వున్నా, ఆ మాటలు నాకు వినిపించలేదు. అమ్మా – ఒక సంవత్సరం పాటు నన్ను ఆలోచించుకోనివ్వండి.” మా అమ్మని ఒప్పించే ప్రయత్నం చేశా.

“చదువు ఓ సంవత్సరం ఆగిపోతే ఎంత నష్టమో తెలుసా?” మా అమ్మ గొంతులో కోపం పెరిగింది.

“నష్టం ఏ మాత్రం రాదు. ఎందుకంటే, సంవత్సరం తరవాత నేను నిర్ణయించుకునే పునాది మీదేగా నా జీవితమంతా నిలబడేదీ!” మా అమ్మ చేతిని మా ఇంకాస్త గట్టిగా పట్టుకుని అన్నాను.

మా నాన్నా, తాతయ్య, శ్రీధర్ గారు అందరూ అవాక్కయ్యారు.

“అది కాదు మహీ.. నా కోసం..” తప్పు చేసిన వాడిలా అన్నాడు తాతయ్య.

“లేదు తాతయ్యా.. ఇది ఎవరి కోసమో కాదు. నా కోసం. కేవలం నా కోసం.” దృఢంగా అన్నాను.

ఆ మాట నిజంగా నా గుండె లోతుల్నించే వచ్చింది.

“అది కాదు మహీ – చదువుకి ఒకసారి బ్రేక్ పడితే మళ్ళీ వేగం అందుకోవడం అంత తేలిక కాదు. నువ్వు చదువు మానేసినంత మాత్రాన జరిగేది ఏమి ఉంటుంది? మీ తాతగార్ని జాగ్రత్తగా చూసుకోగలవు నిజమే! అది చదువుకుంటూ కూడా చూసుకోవచ్చు.. తాతగారు కనుక మీతో వస్తే!”

డా. శ్రీధర్ మాట కన్విన్సింగ్‌గా మాత్రమే కాదు, నా పరిస్థితి గురించి తాతయ్యను హెచ్చరించినట్లుగా కూడా ఉంది.

“సరే డాక్టరు గారూ, నా మొండితనం వల్ల తన చదువు ఎందుకు ఆగాలి. అహీ.. నా బట్టలు కూడా సర్దేయ్.” మా తాత తొందర తొందరగా అన్నాడు. తన కోసం నా ప్యూచర్ పాడవకూడదని ఆయన ఆలోచన ఆ మాటల్లో స్పష్టంగా వినిపించింది.

“అమ్మయ్య గుండె మీది భారం తొలగిపోయింది.. థాంక్స్ నాన్నా” అంటూ రిలీఫ్‌తో లేచింది అమ్మ. నాన్న కూడా తలాడించి హాయిగా నవ్వాడు. శ్రీధర్ గారి మొహంలో ఓ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసినప్పుడు వచ్చే తృప్తి లాంటిది కదలాడింది.

“అప్పుడు కూడా నేను టౌన్‌కి రాను. ఓ సంవత్సరం పాటు ఇక్కడే వుంటా. చదువు కోసమో డిగ్రీ కోసమో పరుగులు పెట్టాలని లేదు. జీవితానికి ఓ అర్థం ఉండాలి. అది ఏదో ఎలాంటిదో నేను నిర్ణయించుకోవాలి. అమ్మా, నాది మొండితనం అని మీరు అనుకోవచ్చు. ఇప్పటి వరకూ మీరు నన్ను ఏ హద్దుల్లోనూ బంధించలా. ఇప్పుడూ ఫ్రీ గా ఆలోచించుకోనివ్వండి” నేను లేచి గది లోకి వెళ్ళిపోయాను. చర్చని పెంచడం నాకు ఇష్టం లేకపోయింది.

***

నా పట్టే నెగ్గింది.

నన్నూ తాతయ్యనీ ఇంట్లో ఉంచి అమ్మ నాన్నా చెల్లీ, తమ్ముడు బెజవాడ వెళ్ళిపోయారు.

నా చదువు విషయంలో తాతయ్య మథనపడ్డా, వాళ్ళంతా వెళ్ళిపోయాక ఆయన ముఖంలో చాలా రిలీఫ్ కనిపించింది.

మరోసారి డాక్టర్ గారితో తాతయ్యకి హెల్త్ చెకప్ చేయించి, ఏ పద్ధతిలో ఆయన ఆరోగ్యం ఇంకా బాగుపడుతుందో తెలుసుకుని ఓ పుస్తకంలో ఆ విషయాలన్నీ రాసుకున్నా.

మా అమ్మమ్మ చెప్చిన సంగతులన్నీ నాకు జ్ఞాపకం వున్నాయి. ఆయన ఏ కూరల్ని ఎలా చేస్తే ఇష్టపడతారో, ఏవి ఆయనకి పడవో – అన్నీ ఓ లిస్టు రాసుకున్నా. పొద్దున్న సాయంత్రం కాసేపు వాకింగ్‌కి వెళ్ళడం, కాసేపు నేను చదివి వినిపించే భగవద్గీత వినడం ఆయనకి అలవాటు చేశాను. పెరట్లో కూరగాయాన్ని పెంచడం మొదలెట్టాలని నిర్ణయించుకున్నాను. పాలేరుతో చెప్పి పెరడుని కూరపాదులు నాటడానికి అనుగుణంగా తయారు చేయించాను. నెలలో ఒక వారం మా ఇంట్లోలో సత్సంగం, భజన జరిగే విధంగా శ్రీ సత్యసాయి సేవా సమితి వారిని రిక్వెస్ట్ చేసి ఒప్పించాను.

హాస్పిటల్లో ‘సేవ’కి నేను వెడుతూ తాతయ్యని కూడా తీసుకువెళ్ళేదాన్ని. ఒక పెద్దవాడుగా ఆయన చాలా మంది కష్ట సుఖాలు విని సలహాలివ్వడం నేను గమనించాను. రోజు రోజుకీ ఆయనకీ అభిమానులు పెరిగారు. కొందరు సలహాలతో కోసం వస్తే, కొందరు కష్టాలు చెప్పుకొని ఓదార్పుని పొందేవారు. ఆయన చక్కగా మళ్ళీ దారిలో పడ్డారు.

కష్టసుఖాలు రెండు చుట్టాలు లాంటివి. వస్తాయి. పోతాయి. ఎక్కువ కాలం మనతోటి వుండవు. తాతయ్య అమ్మమ్మ మరణాన్ని సమాజ పరిణామంగా తీసుకునే ప్రయత్నాన్ని గమనించాను.

ఓ రోజున లైబ్రరీ లోకి వెళ్ళాను. ‘అభిలాష్’ గుర్తుకొచ్చాడు. ‘మీరు’ అని నన్ను మొదటిసారి సంబోధించింది ‘అభీ’నే. మా లైబ్రేరియన్ విశ్వం గారు నన్ను చూసి మనసారా ఆహ్వానించారు. “మహీ.. యీ వూరి హాస్పటల్ అందంగా తయారవడంలో నీ బాధ్యత, నీ శ్రద్ధ ఎంతో వుందని నాకు తెలుసు. నిజం చెబితే యీ వూళ్ళో వున్నన్ని మంచి, గొప్ప పుస్తకాలు చాలా టౌన్లలో కూడా వుండవు. అయితే సమస్య ఏమంటే, యీ గొప్ప గ్రంథాలయాన్ని వినియోగించుకునేవారే లేరు. ఊరి మొత్తం మీద అయిదారుగు తప్ప ఎవరూ రారు. వాళ్ళు కూడా దినపత్రాలు చదవడానికి వస్తారు” నిట్టూర్చి అన్నారు విశ్వం గారు.

గుడి – బడి జీవితంలో ఎంత ముఖ్యమైనవో గ్రంథాలయం వీటికంటే గొప్పదనీ, ఎంతో విజ్ఞానాన్ని ఆహ్లాదపూర్వకంగా ఇవ్వగలదనీ నాకనిపించింది.

“అవును మాస్టారూ, జనాలు వచ్చినా రాకపోయినా గ్రంథాలయం పై మీ శ్రద్ధ అణు మాత్రం కూడా తగ్గలేదు. అప్పుడెంత శుభ్రంగా వుంచేవారో ఇప్పుడూ అంతే శుభ్రంగా వుంచుతున్నారు.” అని ఆయనతో కాసేపు కబుర్లు చెప్పి ‘బీదలపాట్లు’ (లె-మిజరబుల్స్), అన్నా కెరినినా, ప్రకృతి పిలుపు (ద కాల్ ఆఫ్ ద వైల్డ్) నవలల్ని మళ్ళీ తీసుకున్నాను. విశ్వనాథ సత్యనారాయణ గారి పురాణవైర గ్రంథమాలలోని ‘నాస్తిక ధూమము’, ‘భగవంతుని మీది పగ’ నవలలు కూడా తీసుకున్నాను. మొదట చదివినప్పుడు ఎక్సై‍ట్‌మెంట్‌తో చదువుతాం. మళ్ళీ చదివినప్పుడే అందులోని ‘రసం’ ఆస్వాదించగలమని నాకెందుకో అనిపించింది. ఆ మాటే విశ్వం గారితో అంటే, “నూటికి నూరుపాళ్ళు నువ్వు చెప్పింది రైట్ అమ్మా. నీకు తెలుసా, యీ లైబ్రరీలోని ప్రతి పుస్తకాన్నీ కనీసం 20 సార్లు చదివి వుంటాను. అది ఏ పుస్తకమైనా కానీ, చదివిన ప్రతి సారీ ఓ కొత్త కోణంలో తనని తాను ఆవిష్కరించుకుంటుంది. అందుకే, చదివిన నవలలూ పుస్తకాలూ చదివినా నాకు ఏనాడూ బోరు కొట్టదు. సరికదా, ప్రతిదాన్ని అనేక కోణాల్లో ఎలా దర్శించవచ్చో అర్థమవుతుంది.” ఆయన అనుభవం వివరించారు విశ్వం గారు. అది నాకు అద్భుతంగా అనిపించింది.

వెళ్తూ నేనన్నాను, “మాస్టారూ.. తప్పకుండా స్టూడెంట్స్ మళ్ళీ లైబ్రరీలోకి వచ్చేలా ప్రయత్నిస్తాను” అన్నాను.

***

చదువరీ, నేనీ కథని అప్రస్తుత సన్నివేశాలతో నింపడం లేదు, మృత్యువుని, అది ఎవరి మృత్యువైనా ఎలా మనసుకి తీసుకోవాలీ అనేది అమ్మమ్మ మృతితో నేర్చుకుంటే –

పరీక్షల కోసం చదివే చదువు కాక, జీవితాన్ని చదువుకోమని చెప్పే గ్రంథాలయం ఆత్మ ఘోషని మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను.

ఒక్క వృక్షం ఇచ్చే ఆక్సిజన్‌ని వంద ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వలేవు. ఒక పుస్తకం ఇచ్చే జ్ఞానాన్ని జీవితంలోని వెయ్యి సంఘటనలు ఇవ్వలేవు.

రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ పుస్తకాల్ని ప్రేమతో గుండెలకి హత్తుకున్నాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here