[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
ద్రుపదుణ్ని గురుదక్షిణగా కోరిన ద్రోణుడు
[dropcap]ఒ[/dropcap]కరోజు ఉదయాన్నే తన పనులన్నీ పూర్తి చేసుకున్న ద్రోణాచార్యుడు శిష్యులందర్నీ పిలిచాడు. అందరూ వచ్చి గురువుగారి దగ్గర నిలబడ్డారు. గురువు ద్రోణాచార్యుడు తనకు గురుదక్షిణ కావాలని అడిగాడు.
రాజకుమారులు అందరూ ఆయనకి వినయంగా నమస్కారం చేసి గురుదక్షిణగా ఆయనకి ఏం కావాలో అడగమన్నారు. ద్రోణాచర్యుడు “నాయనలారా! ద్రుపదుడు ఎక్కువ సంపద కలవాడు. దాని వల్ల వచ్చిన అహంకారంతో వివేకాన్ని మర్చిపోయాడు. ద్రుపదుణ్ని ఓడించి తీసుకుని రండి! ఇదే నాకు మీరు ఇవ్వవలసిన గురుదక్షిణ” అన్నాడు గంభీరంగా.
రాజకుమారులందరు ద్రోణాచార్యుడు అడిగిన గురుదక్షిణ సమర్పించడానికి అంగీకరించారు. వెంటనే ఖడ్గాలు, ధనస్సులు ధరించారు. దిక్కులు మారుమోగేలా సింహనాదం చేస్తూ రథాలెక్కారు. ఇప్పుడే ద్రుపదుణ్ని పట్టి తెస్తామని చెప్పి అందరూ కలిసి వెళ్లి ద్రుపదుడి నగరాన్ని ముట్టడించారు.
పాండవులు ద్రోణుడి చుట్టూ గుమిగూడి తమకి మధ్యలో ఆయన్ని ఉంచుకుని రక్షించుకుంటూ కౌరవుల వెనక బయల్దేరారు. అర్జునుడు ద్రోణుడితో “కౌరవులు వేగంగా వెళ్లారుగాని, భుజబలంతో ద్రుపదరాజుని ఓడించడం సాధ్యపడుతుందా? ఇంత చిన్నవాళ్ల చేతిలో చిక్కడానికి ద్రుపదుడు అంత చేతకానివాడు కాదుకదా? ద్రుపదుడు గొప్ప శౌర్యం కలవాడని, ధనుర్విద్యలో నేర్పరుడని, మీకు స్నేహితుడని విన్నాము” అన్నాడు. ద్రోణుడు అతడి మాటలకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు.
దుర్యోధనుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, జలసంధుడు మొదలైన ధృతరాష్ట్రుడి కొడుకులు అనేకమంది ఇతర రాజకుమారులతో కలిసి ద్రుపదుడి నగరాన్ని ముట్టడించారు. ద్రుపదుడు కోపంతో రథాలు, గుర్రాలు, ఏనుగులు, మిగిలిన సైన్యంతో కలిసి వెళ్లి కౌరవుల్ని ఎదుర్కున్నాడు. ద్రుపదుడు కౌరవ సైన్యం మీదకి అనేక బాణాలు వేశాడు. కాంపిల్య నగరంలో ఉన్న ప్రజలు కూడా కేకలు వేస్తూ వచ్చి తమ దగ్గర ఉన్న కత్తులు, రోకళ్లు, కర్రలతో కౌరవ సేనని కొట్టడం మొదలుపెట్టారు.
కౌరవులు కూడా తగ్గకుండా ద్రుపద సైన్యాన్ని ఎదుర్కున్నారు. అన్ని వైపుల నుంచి అనేక రకాల బాణాలతో కొడుతున్న ద్రుపదుణ్ని చూసి కౌరవసేన భయపడ్డారు. ద్రుపదుడి బాణవర్షానికి కుమారస్వామితో కొట్టబడిన రాక్షసుల్లా భయంతో పరుగెత్తుకుని పాండవుల దగ్గరికి వచ్చారు. వాళ్లని చూసిన అర్జునుడు ధర్మరాజుకి, ద్రోణుడికి నమస్కారం చేసి “మీరు ఇక్కడే ఉండండి. మేము వెళ్లి ద్రుపదుణ్ని పట్టి తెస్తాము” అని చెప్పాడు. భీముడు సైన్యాన్ని తీసుకుని ముందు నడుస్తుండగా అర్జునుడు నకుల సహదేవులతో కలిసి ద్రుపదుణ్ని ఎదుర్కోడానికి బయలుదేరాడు.
ద్రుపదమహారాజుతో భీమార్జునుల యుద్ధము
భీముడు వజ్రాయుధంలాంటి తన గదతో ఏనుగుల కుంభస్థలాల్ని, దంతాల్ని, తొండాల్ని, ముఖాల్ని పగులగొట్టాడు. మావటీవాళ్లతో సహా ఏనుగుల గుంపుని చావగొట్టాడు. ద్రుపదుడి గజ, అశ్వ, రథాల్ని నాశనం చేసి సైన్యాన్ని మాత్రం చంపకుండా అదిలించి అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు.
ద్రుపదుడి మీద కోపంతో బాణాలు వేస్తున్న విశాలమైన భుజాలు కలిగిన అర్జునుడు ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నట్టు ప్రకాశించాడు. అతడి పరాక్రమం చూసిన ద్రుపదుడి తమ్ముడు సత్యజితుడు ధైర్యంగా అర్జునుణ్ని ఎదుర్కున్నాడు. సత్యజితుడు బాణాల్ని మధ్యలోనే విరక్కొట్టాడు అర్జునుడు. అనేక అస్త్రాలు తెలిసిన అర్జునుడు సత్యజితుడి రథాన్ని, సారథిని నేలమీద పడేట్లు కొట్టాడు. అది చూసిన ద్రుపదుడు విజృంభించి అర్జునుణ్ని ఎదుర్కున్నాడు.
అస్త్రవిద్యలో నేర్పరులు, బలవంతులు అయిన ద్రుపదుడు, అర్జునుడు ఒకళ్లని ఒకళ్లు ఎదుర్కుని బాణాలు ప్రయోగించుకుంటున్నారు. యుద్ధభూమి మొత్తం పదునైన బాణాలతో దట్టంగా కప్పబడి, ఆ ప్రదేశమంతా చీకటిగా మారిపోయింది. చీకటిపడిపోయిందని అనుకుని సైన్యమంతా యుద్ధం చెయ్యడం ఆపేశారు.
ద్రుపదుణ్ని పట్టి కట్టి తెచ్చిన అర్జునుడు
ద్రుపదుడు తనకు అర్జునుడికి మధ్య జరుగుతున్న యుద్ధంలో తనే జయించాలన్న కోరికతో అర్జునుడి విల్లుని సగానికి నరికేశాడు. అర్జునుడు కోపంతో చేత్తో కత్తిని పట్టుకుని కొండమీదకి దూకిన కొదమ సింహంలా ద్రుపదుడి రథం మీదకి ఎగిరి దూకి అతణ్ని పట్టుకున్నాడు. ద్రుపదుడి సైన్యం హహాకారాలు చేసింది. గర్వం అణిగిపోయిన ద్రుపదుణ్ని అర్జునుడు ఇరుసుకి కట్టి తెచ్చి గురువు ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఇచ్చాడు. ద్రోణాచార్యుడు అర్జునుడి పరాక్రమానికి సంతోషించాడు.
ద్రుపదుడితో “ద్రుపదమహారాజుగారా! ఈ రకంగా నా శిష్యులతో పట్టుబడి దిక్కు లేకుండా అయిపోయారా? మహారాజుని అనే గర్వం ఇప్పటికయినా తగ్గిందా? ఇప్పుడు తమరు మమ్మల్ని గుర్తుపట్టారని అనుకుంటాను?” అని ఎగతాళిగా మాట్లాడి ద్రుపదుణ్ని వదిలెయ్యమన్నాడు ద్రోణుడు.
ధర్మరాజుకి యువరాజ పట్టాభిషేకము
ద్రోణాచార్యుడు తన శిష్యుల చేత పట్టుబడిన ద్రుపదుణ్ని ఎగతాళి చేసి వదిలి పెట్టేశాడు. తరువాత ద్రుపదుడిలో మార్పు రాలేదు సరికదా తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అందుకోసం బ్రాహ్మణులకి సేవచేస్తున్నాడు.
ధృతరాష్ట్రుడు యువరాజుగా పట్టాభిషేకం ఎవరికి చెయ్యాలని భీష్ముణ్ని, విదురుణ్ని సలహా అడిగాడు. వాళ్లు ఇచ్చిన సలహా ప్రకారం ధర్మరాజుకి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. ధర్మరాజు తమ్ముళ్లు నలుగురూ నాలుగు దిక్కులకీ వెళ్లి రాజులందర్నీ జయించారు. వాళ్లనుంచి ఎన్నో విలువైన వస్తువుల్ని ధర్మరాజుకి తెచ్చి ఇచ్చారు. స్వచ్ఛమైన కీర్తితో ధర్మరాజు యువరాజే అయినా చక్రవర్తిగా ప్రకాశించాడు.
గద, రథ, అశ్వ, యుద్ధాల్లోగాని, గదాయుద్ధంలోగాని ఏ యుద్ధంలో అయినా సరే కుంతీదేవి కుమారుడు భీముడే అసలయిన పరాక్రమాన్ని చూపగలడు అని భీముడు పేరు తెచ్చుకున్నాడు. ఆయుధ విద్యల్లో ఆరితేరి ఓటమి తెలియని విలుకాడని అతడితో సమానమైనవాడు లేడని అర్జునుడు పేరు తెచ్చుకున్నాడు.
నకులసహదేవులు ఎంతో ప్రావీణ్యం కలవాళ్లని, శత్రురాజులకి యముడివంటి వాళ్లని మంచి నడవడిక కలవాళ్లని, అనేక విద్యల్లో ప్రావీణ్యం సంపాదించి పెద్దలయందు వినయం కలిగి ఉంటారని భూమండలమంతా పేరు తెచ్చుకున్నారు.
అర్జునుడికి ’బ్రహ్మ శిర’ అనే బాణాన్ని ఇచ్చిన ద్రోణుడు
పాండవులందరూ మంచి గుణాలతోను, నడవడికతోను అందరి ప్రేమని పొందుతున్నారు. వాళ్లల్లో అర్జునుడి పిడికిలి పట్టుకి; గురికొట్టే నేర్పుకి; దూరంగా పడేట్టు ప్రయోగించే సామర్థ్యానికి; వేగానికి; కత్తి, గద, బల్లెం, చిల్లకోల మొదలైన ఆయుధ విద్యల్లో పొందిన ప్రావీణ్యతకి; శత్రు రాజుల్ని జయించగల పరాక్రమానికి; తన పట్ల చూపిస్తున్న భక్తి ప్రేమలకి మెచ్చుకున్న ద్రోణాచార్యుడు (భరద్వాజమహర్షి) ‘బ్రహ్మశిర’ అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించడం, ఉపసంహరించడం నేర్పించాడు.
అర్జునుడితో “లోకంలో అందరితోను మన్ననలు పొందిన అర్జునా! ఈ అస్త్రాన్ని ప్రేమతో అగస్త్య మహర్షి అగ్నివేశుడికి ఇచ్చాడు. ఆయన నాకిచ్చాడు. నేను ఇప్పుడు నీకు ఇస్తున్నాను. పరాక్రమంలో గొప్పవాడివి కనుక దీనికి నువ్వే తగినవాడివి. బ్రహ్మశిర అనే పేరు గల ఈ అస్త్రాన్ని సామన్య మనుషుల మీద ప్రయోగించవద్దు. శక్తిలేని మనుషుల మీద ప్రయోగిస్తే అది లోకాల్ని దహించేస్తుంది. నిన్ను బాధపెడుతున్న మనుషులు ఉంటే వాళ్ల మీద సులభంగా పనిచేస్తుంది కనుక, వాళ్ల మీద ప్రయోగించు” అని అస్త్రానికి ఉన్న మహిమని గురించి కూడా తెలియ చెప్పాడు.
తరువాత ద్రోణాచార్యుడు అర్జునుణ్ని తనకు గురుదక్షిణ ఇమ్మని అడిగాడు. ఏది కావాలన్నా ఇస్తాను అని చెప్పాడు అర్జునుడు. “నువ్వు నాతో ఎదురుగా ఉండి ఎప్పుడూ యుద్ధం చెయ్యకూడదు” అన్నాడు ద్రోణాచార్యుడు. గురువుగారి కోరికని అంగీకరించాడు అర్జునుడు.
దుర్యోధనుడు భీమార్జున నకుల సహదేవుల పరాక్రమాన్ని చూసి అసూయపడ్డాడు. వాళ్లకి హాని తలపెట్టి కర్ణ, శకుని, దుశ్శాసనులతో కలిసి ఆలోచనలు చేశాడు.
కణికుడు నీతి
దుర్యోధనుడు “ఆయుధ విద్యల్లో పండితులు, గొప్ప పరాక్రమవంతులు, అంతులేని ఉత్సాహం కలవాళ్లు, అనే గర్వంతో ఉన్న పాండవులకి నేను భయపడుతూ ఉంటాను. అంతేకాక, ధృతరాష్ట్రుడు కూడా ధర్మరాజునే యువరాజుగా చేశాడు. నాకు ఇప్పుడు ఏం చెయ్యలో తోచట్లేదు. ఏదైనా ఉపాయం చెప్పండి” అని తన వాళ్లు అనుకున్న వాళ్లని అడిగాడు.
నీతులు చెప్పడంలో నేర్పరి, శకునికి ఇష్టమైన మంత్రి అయిన కణికుడు దుర్యోధనుడితో ఇలా చెప్పాడు. “ప్రభువు అధికార బలం కలిగి ఉండాలి. దండనీతిని అవలంబించాలి. తను మంచి నడవడిక కలిగి ఉండాలి. ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించ కలగాలి. ప్రజలందర్నీ సమభావంతో చూడగలిగితే అన్ని జాతులవాళ్లు తమ తమ జాతి ధర్మాల్ని పాటించ కలుగుతారు. ఈ పనులు చెయ్యాలి.. ఈ పనులు చెయ్యకూడదు అనే విచక్షణా జ్ఞానం లేకుండా ప్రవర్తించేవాళ్లని అతడు తన తండ్రైనా, గురువైనా, బంధువులు స్నేహితులైనా సరే వాళ్లని క్షమించ కూడదు. ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రభువు అతణ్ని దండించి తీరాలి.
మొదలుపెడదామని అనుకున్న ఏ పని అయినా ముందు తెలివైనవాళ్లతో సంప్రదించి చెయ్యాలి. ముందుగా ఆలోచించి చేసే పనే ఎప్పుడూ సక్రమంగా జరుగుతుంది. ప్రభువు నేర్పుగా ముందు తనను తాను రక్షించుకోవడం తెలుసుకోవాలి. తనకు ప్రమాదం కలుగదు అనిపించిప్పుడే ఆ రాజధర్మాల్ని ఎంచుకోవాలి. తనలో ఉన్న లోపాల్ని ఇతరులకి తెలియకుండా చూసుకోవడం, ఇతరుల్లో ఉన్న లోపాల్ని తెలుసుకోవడం ఎప్పటికప్పుడు చెయ్యవలసిన విధులు. దేశకాల పరిస్థితుల్ని బట్టి ఎక్కువమంది స్నేహితులతో కలిసి రాజధర్మాల్ని జాగ్రత్తగా నెరవేర్చాలి.
శత్రువులు బలహీనంగా ఉన్నారు అని తెలిసినప్పుడు వెంటనే వాళ్లని సంహరించాలి. శత్రువులకి బాహుబలం, మిత్రబలం బాగా పెరిగిపోతే వాళ్లని సంహరించడం చాలా కష్టం. ప్రజలని పాలించే రాజు తను చేస్తున్న పనుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఎప్పటికప్పుడు విసుగు లేకుండా తెలుసుకోవడం అన్నింటికంటే ముఖ్యం. అదే విధంగా శత్రువుల పనుల గురించి కూడా దూతల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శత్రువుల దేశాల్లో జరుగుతున్న విషయాల గురించి కూడా తెలుసుకోవాలి. పాలకుడు అప్పుడప్పుడు రకరకాలైన ఆటస్థలాలకు, ఉద్యానవనాలకి, సభలకి, పుణ్యతీర్థాలకి, దేవాలయాలకి, వేటకి అనువైన ప్రదేశాలకి వెళ్లవలసి వస్తుంది.
అటువంటప్పుడు పాలకుడికి ప్రమాదం కలగకుండా ఆ ప్రదేశాల్ని ముందుగానే పరిశీలించడం ఎంతైన అవసరం. ఆ ప్రదేశాల్లో ప్రమాదం కలిగించే వ్యక్తులుగాని, ఆయుధాలు గాని కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి తప్పించాలి. ప్రభువు బాగా నమ్మకమైనవాళ్లమీద, అసలు నమ్మకం లేనివాళ్లమీద ఎప్పుడూ ఆధారపడ కూడదు. తనని తనే రక్షించుకో గలిగేలా ఉండాలి. ప్రభువు తనని తాను రక్షించుకున్నట్టే తన రహస్యాలోచనల్ని కూడా ఎప్పటికప్పుడు రక్షించుకోవాలి. రాజ్యం గురించి చేసిన రహస్య ఆలోచనలు ఇతరులకి తెలియకుండా రక్షించుకో గలిగితే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. రహస్య అలోచనలు ఇతరులకి తెలిస్తే జరగవలసిన పనులు సక్రమంగా చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు.
చెడు నడవడిక కలిగినవాళ్లు ఎప్పుడూ ఒట్టు పెడుతూ, చేతులు జోడించి నమస్కారాలు చేస్తూ, చెవులకి ఇంపుగా వినిపించేలా తియ్యని మాటలు మాట్లాడుతూ కపటంగా ఎక్కువ వినయాలు ప్రదర్శిస్తారు. పరిస్థితి తనకు అనుకూలంగా మారే వరకు దుర్మార్గుడు స్నేహితుడిలా ప్రవర్తిస్తాడు. పరిస్థితులు తనకు అనుకూలంగా మారగానే పాములా తనలో ఉన్న విషాన్ని పైకి చిమ్ముతాడు. పిడుగు పడడం, గాలి వీచడం అవి మొదలైనప్పుడే జనాలకి తెలుస్తాయి. అదే విధంగా కోపాన్ని, స్నేహాన్ని అవసరమైనప్పుడే ఇతరులకి తెలియచెయ్యాలి.
తగిన సమయం వచ్చేవరకు శత్రువుల్ని భుజం మీదకి ఎత్తుకుని మొయ్యాలి. తగిన సమయం రాగనే రాతి కుండని ఎత్తి కింద పడేసినట్టు నాశనం చెయ్యాలి. అపకారం తక్కువ చేసినా కొంచెమే కదా అని అతడిని ఆదరించకూడదు. ముల్లు చిన్నదైనా పాదంలో ఉంటే నడవడానికి ఎంత అడ్డుపడుతుందో అదే విధంగా శత్రువు తక్కువవాడే అయినా పనులకి అడ్డుపడుతూనే ఉంటాడు. శత్రువు చిన్నవాడే కదా అని అతడితో కలిసి ఉండకూడదు. భయంకరమైన అరణ్యాలు కాలి బూడిదవడానికి ఒక్క నిప్పు రవ్వ చాలినట్టే, అతడు కూడా అపకారం తలపెట్టగలడు.
వివేకంతో అలోచించకుండా తనకు అపకారం చేసేవాడిని తన దగ్గరే ఉంచుకుంటే ఎత్తుగా ఉన్న చెట్టు చిటారు కొమ్మ మీద ఎక్కి నిద్రపోయే వాడికి జరిగినట్టు అనర్థం జరుగుతుంది. ఓ రాజా! అపకారం చేసేవాళ్లని సామదానదండోపాయాలతో దండించడంగాని, నమ్మకంగా మాట్లాడి ఆలస్యం చెయ్యకుండా చంపడం కాని చెయ్యాలి. ఇది శుక్రుడు చెప్పిన రాజనీతి.
కనుక, ఎలా చేసినా రాజనీతితో శత్రువుల్ని నాశనం చెయ్యాలి. అపకారం చేసేవాళ్లు శత్రువులైనా, బంధువులైనా అశ్రద్ధ చెయ్యకూడదు. తనను తాను రక్షించుకోవడం కోసం వెంటనే నాశనం చెయ్యాలి” అని కణికుడు చెప్పాడు.
తన బాధని తండ్రితో చెప్పుకున్న దుర్యోధనుడు
ఒకరోజు దుర్యోధనుడు ఒంటరిగా కూర్చుని ఉన్న ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి “తండ్రీ! పాండవులు పరాక్రమాన్ని చూసి నేను భయపడుతున్నాను. నా భయానికి తగినట్టే నువ్వు కురువంశానికి చెందిన పెద్దల ఎదురుగా పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుని యువరాజుని చేశావు. అసలే బలవంతుడైన వ్యక్తి చేతికి అధికారం వస్తే అది అతడి బలాన్ని ఇంకా పెంచుతుంది. ధర్మరాజుకి యౌవరాజ్యం ఇవ్వడం వల్ల పట్టణ ప్రజలు, పల్లెలో ఉండే ప్రజలు, మంత్రులు అతడి మీద అభిమానం చూపిస్తూ ఉంటారు.
నిన్నూ, భీష్ముణ్నీ కూడా లెక్కచెయ్యరు. వాళ్లందరూ ‘ఈ రాజ్యాన్ని రక్షించే సామర్థ్యం ధృతరాష్ట్రుడికి లేదు. భీష్ముడు రాజ్యభారం తీసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ధర్మరాజు యువకుడైనా గుణవంతుడు, ధర్మాత్ముడు. అంతేకాకుండా అతడికి పరాక్రమవంతులైన తమ్ముళ్లు ఉన్నారు. కనుక అతణ్ని రాజుగా చేస్తే మంత్రుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని, గౌరవించదగ్గ వాళ్లందరినీ ఇంతకు ముందు కంటే ఎక్కువగా గౌరవిస్తాడు. తాతగారైన భీష్ముణ్ని, కొడుకులున్న ధృతరాష్ట్రుణ్ని ఇంకా భక్తిగా పూజిస్తాడు. వాళ్లకి భోగభాగ్యాలు అందించి సుఖంగా ఉండేలా చూస్తాడు. అందుకు విదురుడు కూడా అంగీకరిస్తాడు’ అని ప్రజలందరూ తమలో తాము చెప్పుకుంటున్నారు” అని తన బాధని చెప్పుకున్నాడు.
దుర్యోధనుడి మాటలు విని ధృతరాష్ట్రుడు “రాజైనవాడు తన రాజ్యానికి సంబంధించిన విషయాలు తనే విచారించుకోవాలి. నేను ఆరు అంగాలతో ఉన్న వేదాన్ని చదివాను, అర్ధనీతిశాస్త్రాన్ని నేర్చుకున్నాను, బలపరాక్రమాలు కలవాణ్నే కాని, అంధుణ్ని. అందువల్ల శత్రుసైన్యాల్ని ఎదిరించే విధంగా వ్యూహాలు చెయ్యలేను. కనుక, భూమండలంలో ఉన్న అందరి ప్రశంసలు అందుకున్నవాడు, పవిత్రుడు, సద్గుణసంపన్నుడు అయిన పాండురాజు గొప్ప మనస్సుతో గుడ్డివావాడినైనా నన్ను రాజుగా అంగీకరించి భక్తితో సేవ చేసాడు.
ప్రపంచం మొత్తాన్ని జయించాలన్న కోరికతో గొప్ప పరాక్రమవంతుడైన పాండురాజు కురువంశ రాజ్యభారాన్ని మోశాడు. భరతవంశంలో గొప్పవాడైన పాండురాజు శత్రువులకి భయం కలిగిస్తూ, శత్రువుల్ని అణిచివేస్తూ కప్పం తీసుకుని ధనాన్ని రాశులుగా పోసి నాతో అనేక యజ్ఞాలు చేయించాడు. తండ్రికంటే గుణాలలో గొప్పవాళ్లైన పాండవుల మీద ప్రజలు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అంత గొప్ప కీర్తితో ప్రకాశిస్తున్న పాండవుల్ని నేను ఏం చెయ్యగలను?” అని బాధపడ్డాడు ధృతరాష్ట్రుడు.
అది విని దుర్యోధనుడు “ఇంతకు ముందు పాండురాజు ప్రజల మన్ననలు పొంది ఉన్నాడు కనుక అందరూ ధర్మరాజే రాజుగా ఉండాలని కోరుకుంటున్నారు. కాని, ఈ రాజ్యం మొదటి నుంచీ నీది. నీ ద్వారా ఈ రాజ్యం మాకు రావాలి. అందుకోసం నేను ప్రతిరోజూ దానాలు, సన్మానాలు చేసి ప్రజల్ని సంతోష పెడుతున్నాను. ఇక్కడ పాండవ పక్షపాతులు మాట్లాడడం ఆపేసే వరకు కుంతీదేవిని, పాండవుల్ని, వాళ్ల సేవకుల్ని, మంత్రుల్ని అందర్నీ ఉపాయంతో వారణావతం పంపిద్దాం. మనకి రాజ్యం మీద అధికారం స్థిరపడ్డాక వాళ్లని మళ్లీ ఇక్కడికి రప్పిద్దాం!” అన్నాడు.
అతడి మాటలు విని ధృతరాష్ట్రుడు “నాయనా! నా మనస్సులో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఈ ఆలోచన చెడ్డది కనుక నేను పైకి అనలేక పోతున్నాను. పాండవుల్ని పంపడానికి ఎలా వీలు కలుగుతుంది? దీనికి పెద్దలైన భీష్మ, ద్రోణ, విదుర, అశ్వత్థామ, కృపాచార్యులు అంగీకరిస్తారా?” అన్నాడు.
తండ్రి మాటలు విని దుర్యోధనుడు “తండ్రీ! మీ మాటని గౌరవించే భీష్ముడు, ద్రోణుడు మొదలైనవాళ్లు మీరు ఆజ్ఞాపిస్తే చాలు దేన్నైనా అంగీకరిస్తారు. వాళ్లకి కౌరవులు, పాండవులు సమానమే. నాకు ఇష్టమైన అశ్వత్థామ ఎప్పటికీ నన్ను వదిలి వెళ్లడు. ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామని వదలడు. కృపాచార్యుడు తన చెల్లెలి భర్త అయిన ద్రోణుణ్ని విడిచి ఉండడు. భీష్ముడు మా అందర్నీ సమభావంతోనే చూస్తాడు. కనుక పాండవులవైపు వెళ్లడు. విదురుడు పూర్తిగా పాండవుల వైపే ఉంటాడు. అతడు ఒంటరిగా నాకు కీడు చెయ్యలేడు. కాబట్టి ఈ పని జరిగే తీరుతుంది. నాకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ బాధని పోగొట్టి నాకు మంచి జీవితాన్ని ఇవ్వండి” అని అనేక విధాలుగా ప్రార్థించి మొత్తానికి ధృతరాష్ట్రుణ్ని ఒప్పించాడు.
మంచివాళ్లు, తెలివైనవాళ్లు, తనకు దగ్గరగా ఉండే మంత్రుల్ని పిలిపించాడు. వాళ్లకి వారణావతాన్ని గురించి పాండవుల దగ్గర గొప్పగా పొగడమని చెప్పాడు. ఆ మంత్రులు పాండవుల దగ్గరికి వెళ్లి పూలతోను, పండ్లతోను బరువెక్కి వంగిన చెట్లతోను ఉన్న ఉద్యానవనాలు, జలక్రీడ, చెండ్లాట, వేట మొదలైనవాటికి తగిన ప్రదేశాలతోను, చంద్రుడి కాంతివంటి తెల్లటి కాంతితో ప్రకాశించే తెల్లటి పెద్ద పెద్ద మేడలతోను, అలకానగరాన్ని మించిన గొప్పతనంతో అంగళ్లు కలిగిన వీధులతోను, అనేక భోగాలు అనుభవిస్తున్న పుణ్యాత్ములైన ప్రజలతోను, పవిత్రమైన నదీ ప్రవాహాలతోను ఉన్న వారణావత నగరాన్ని గురించి పాండవుల దగ్గర చాలా గొప్పగా వర్ణించారు. కొంతకాలం దుర్యోధనుడు ఆపకుండా చెప్పిన చెడుమాటలకి ధృతరాష్ట్రుడు లొంగిపోయాడు.