భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-11

0
5

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-12: ‘భక్తి’ ప్రాముఖ్యత

[dropcap]శ్రీ [/dropcap]శంకర భగవత్పాదులు ‘వివేక చూడామణి’లో భక్తి ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూ “మోక్షకారణ సామగ్ర్యాం భక్తి రేవ గరీయసి” అన్నారు.

నారదాదులు భక్తి నిర్వచనాలుగా ‘సాపరానురక్తి రీశ్వరే’ అని, ‘సాత్వస్మిన్ పరమ ప్రేమరూపా’ అని అన్నారు. భక్తులకు భగవంతుని విషయమై ఉన్న ప్రేమాతిశయాలే భక్తి అని స్సష్టం అవుతోంది.

రామదాసు, త్యాగరాజు మొదలగువారి భక్తి ఈ ప్రేమాతిశయమే; భగవద్భాగవతుల మధ్యనున్న సన్నిహితత్వం ఇదే. వారిని ఏకసూత్రంలో బంధించేది భక్తియే. దీనికి శైవ వైష్ణవ శాక్తాది భేదాలు లేవు.

“మే హృదయ కపి మత్యంత చపలం, దృఢం భక్త్యా బద్ధ్వా శివ! భవదధీనం కురు విభో” అంటారు శ్రీ శంకరులు.

భక్తి ప్రాముఖ్యత మీద చర్చలు, వాదోపవాదాలు చాలా ఉన్నాయి. భక్తి రసం కాదనీ, భావమే అని అభిప్రాయం ఉండేది. శ్రీ చైతన్య మహాప్రభువు ప్రియశిష్యులైన రూపగోస్వామి భక్తికి రసత్వాన్ని ఆపాదించి రసరాజుగా వ్యపదేశించారు.

శ్రీకృష్ణ గోపిక విషయకమై శృంగార రూపంలో అభిభవ్యక్తమైన భక్తి రసమనీ ఆయన నిర్ణయం.

మధుసూదన సరస్వతులు తమ ‘భగవద్భక్తి రసాయన’ గ్రంథంలో భక్తికి సంపూర్ణ రసత్వాన్ని అంగీకరించారు.

జ్ఞాన భక్తులు – ఒకే నాణం యొక్క రెండు పార్శ్వాలని తత్త్వవేత్తల అభిప్రాయం.

స్థిర చిత్తంతో నిర్వేద సాధన చేసేవారు జ్ఞానన మార్గాన్ని, ద్రుతచిత్తులైనవారు భగవత్కథాశ్రవణం, భాగవత ధర్మ ప్రీతి వల్ల ప్రభావితులై భక్తిని ఆశ్రయిస్తారని స్పష్టంగా వివరించారు.

చాలా మంది వాగ్గేయకారులలో రామదాసు వారు ఒకరు. వాల్మీకి శోకం శ్లోకమైతే, రామదాసు ఆర్తి – కీర్తన అయింది.

భక్తి అయిదు విధాలు – సంచారి భావాలు

  1. శాంత భక్తికి- విదురుడు – ఔత్సుక్యము, ముదం, శ్రద్ధ, విశ్వాసం, మానస సంబోధన, మంగళాశాసనం
  2. దాస్య భక్తికి – ఆంజనేయుడు – దైన్యము, ఆత్మగర్హణ, నిర్వేదం, వితర్కం, భక్తశోధన
  3. సఖ్య భక్తికి – అర్జునుడు – నర్మ ప్రార్థన, నర్మ స్తుతి
  4. వాత్సల్య భక్తికి – యశోద – లీలావర్ణన
  5. మధుర భక్తికి – గోపికలను ఉదాహరణగా చెప్పవచ్చు.

మచ్చుకి కొన్ని కీర్తనలు (రామదాసు విరచితం)

1) శాంత భక్తి:

కలవరపాటు లేని ప్రశాంతమైన మనస్సులో ప్రతిఫలించేది.

ఉదాహరణ (అ)

రాగం – కేదార; తాళం- ఆది.

పల్లవి:

భజరే శ్రీరామం హే మానస।

భజరే రఘురామం రామం॥

చరణము(లు):

  1. భజ రఘురామం భండనభీమం। రజనిచరాఘ విరామం రామం॥
  2. వనరుహ నయనం కనదహి శయనం। మనసిజ కోటిసమానం మానం॥
  3. శ్యామలగాత్రం సత్యచరిత్రం। రామదాస హృద్రాజీవ మిత్రం॥

ఈ కీర్తనలో నిర్మలము, ప్రశాంతము అయిన మనస్సుతో శ్రీరామచంద్రుని రూపాన్నే భావిస్తూ ఆయన గుణకీర్తనం చేయటం ద్యోతకమవుతుంది. ఈ కీర్తనలో సంస్కృత పదాలు రమ్యంగా మధురంగా ఉండటమే గాక రాముని మీద రామదాసుకు గల ప్రీతి చక్కగా వెల్లడయింది.

ఉదాహరణ (ఆ)

రాగం – ముఖారి; తాళం- ఆది

పల్లవి:

పాలయమాం జయ రామ – జయ

భద్రాదీశ్వర రామ

చరణము(లు)

1) కమలావల్లభ రామ జయ। కబంధ సంహర॥

2) కమలానాయక రామ జయ। కమనీయానన రామ॥

3) కంబుగ్రీవ రామ జయ। కార్ముక పాణే రామ॥

ఇటువంటి చరణాలు 30 వున్నాయి.

2) దాస్య భక్తి:

భక్తుడు తాను పరమాత్మకు దాసుడనని భావించి, ప్రభువుగా ఎంచి కీర్తించటం.

ఉదాహరణ (ఆ)

రాగం – కాపి; తాళం – ఆది

పల్లవి:

చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ

చరణము(లు):

1) వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా। నీ దివ్య చరణములే నమ్మితీ॥

4) పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి। నీ దివ్య చరణములే నమ్మితీ॥

6) బాగుగ నన్నేలు భద్రాచల రామదాసుడ దాసుడ దాసుడ। నీ దివ్య చరణములే నమ్మితీ॥

తాను రామునికి దాసుడని చెప్పుకోవడం, త్యాగయ్యగారు కూడా ‘బంటురీతి కొలువియ్యవయ్య రామ’ అని విన్నవించుకున్నారు.

ఉదాహరణ (ఆ)

రాగం – యమునా కళ్యాణి; తాళం – ఆది

ఫల్లవి:

గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరా।

పరమపురుష యే వెరపులేకనీ మరుగుజొచ్చితి నరమరసేయకు॥

చరణము(లు):

1) పిలువగానె రమ్మి అభయము తలపగానెయిమ్మి। కలిమి బలిమి నాకిలలో నీవని పలువరించితి నను గన్నయ్య॥

2) పాలకడలి శయన దశరథబాల జలజనయన। పాలముంచు నను నీటముంచు నీ పాలబడితినిక జాలముచేయక॥

3) ఏలరావు స్వామి ననునిపు డేలుకోవదేమి। ఏలువాడవని చాల నమ్మితిని ఏలరావు కరుణాలవాల హరి॥

4) ఇంతపంతమేల భద్రగిరీశ వరకృపాల। చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతివై రక్షింపుము॥

‘అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అనే ప్రపత్తి భావం నిండిన ఈ కీర్తన దాస్య భక్తికి ఉదాహరణ.

‘గరుడ గమన రారా’ అని పిలవటంలో గరుడ వాహనం ఉన్నది గదా, శీఘ్రంగా రాగలిగిన వాడవే గదా. జాలము (ఆలస్యం) చేయవద్దు, తనకు రాముడే కలిమి, బలము; పాల ముంచినా, నీట ముంచినా ఆయనదే భారము అంటున్నారు.

3) సఖ్య భక్తి:

భగవానుని తనతో సమానునిగా భావించి ఆయనతో సరాగాలాడుతూ ఆయనను చనువుగా మందలిస్తూ సఖ్యభక్తిని ప్రకటిస్తున్న కీర్తనలు రామదాసు ఎక్కువగా వ్రాయలేదు. స్నేహ భావం, చనువు ప్రకటన కావటం వల్ల రెండు కీర్తనలు సఖ్య భక్తికి ఉదహరణలుగా గ్రహించటం జరిగింది

ఉదాహరణ (అ)

రాగం – వరాళి; తాళం – త్రిపుట

పల్లవి:

అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను

అనుపల్లవి:

గడియగడియకు తిరిగితిరిగి యడిగితిని వేసారవచ్చెను

గడువుదప్పిన నేను నిక బహు దుడుకుతనములు సేయుదును నిను

చరణము(లు):

కుదురుగా గూర్చుండనియ్యను కోపమొచ్చిన భయము చెందను

మది నెరింగి యుండుమిక మొగమాటమేమియు లేదుగద నా

హృదయ కమలమునందు నీ మృదు పదములను బంధించివేతును

~

స్నేహ భావంలో తిరస్కార వచనాలు రావడం సహజం అనటానికి ఈ క్రింది భగవద్గీత శ్లోకం తార్కాణం.

“యచ్చావహాసార్థమసత్కృతోఽసి విహారశయ్యాసనభోజనేషు।
ఏకోఽథ వాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామహమప్రమేయమ్॥”
(అధ్యాయం-11 విశ్వరూప సందర్శన యోగం, 42వ శ్లోకం)

కృష్ణుని విశ్వరూపాన్ని దర్శించి అప్రతిభుడైన అర్జునుడు ‘స్నేహితుడవని భావించి ఏకాంతములోను ఇతరుల ఎదుట, విహారశయ్యాసన భోజన సమయాలతో నిన్ను తిరస్కరిస్తూ మాట్లాడి ఉంటాను. నన్ను క్షమించు స్వామీ’ అని చెప్పిన మాటలు ఈ శ్లోకంలో వున్నాయి.

రాముని స్నేహితుడుగా భావించటం వలన రామదాసు చనువు తీసుకొని మారాము చేసినట్లు వాదులాడటం జరిగింది.

ఉదాహరణ (ఆ)

రాగం – మధ్యమావతి; తాళం – త్రిపుట

పల్లవి:

నిను బోనిచ్చెదనా సీతారామ

నిన్ను బోనిచ్చెదనా సీతారామ

అనుపల్లవి:

నిన్ను బోనిచ్చెదనా నన్ను రక్షింపక ఏ

మైనగాని నా కనులాన శ్రీరామా

చరణము(లు):

1) రట్టు చేసెద నిన్ను అరికట్టుదునింక మొర। బెట్టుకోరా దిక్కు గలిగితే రామ॥

2) గట్టిగ నీ పదకమలము లెప్పుడు। పట్టి నా మదిలో గట్టియుందును శ్రీరామా॥

~

దిక్కు గలిగిన మొర పెట్టుకోరా రామా అని శ్రీరాముని అమితమైన చనువుతో మాట్లాడడం; రాముడు తనతో సమానుడని భావించటం వల్ల జరిగింది. లేకపోతే రామదాసు నోటి వెంట ఇంత తిరస్కార పదాలు వచ్చి ఉండవు.

4) వాత్సల్య భక్తి:

భక్తుడు భగవంతుని తన కన్న బిడ్డగా, ఊహించుకొని లాలిస్తాడు. ‘బూచివాని పిలువబోదునా’ అనే కీర్తన శ్రీకృష్ణుని ఉద్దేశించి చెప్పిన్నది. రామదాసు తనని తాను యశోదగా భావించుకొని బాలకృష్ణుని అల్లరి పనులను తలచుకొని ఆనందిస్తున్నాడు.

ఉదాహరణ (అ)

రాగం – పంతువరాళి; తాళం – రూపక

పల్లవి:

బూచివాని పిలువబోదునా ఓ గోపాలకృష్ణ

ఈ విధంగా చాలామంది వాగ్గేయకారులు తమ రచనల ద్వారా ‘భక్తి’ని ప్రస్ఫుటం చేసారు.

అవి ఎప్పటికి తరగని మూల సంపదలు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here