గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 1

1
3

[box type=’note’ fontsize=’16’] తాము దర్శించిన ఆలయాల గురించి ఆసక్తి వున్నవారితో పంచుకోవటం తనకి చాలా ఇష్టమని చెబుతూ తాము గుంటూరు జిల్లాలో జరిపిన భక్తి పర్యటనల వివరాలు అందిస్తునారు పి.యస్.యమ్.లక్ష్మిగుంటూరు జిల్లా భక్తి పర్యటన ” అనే వ్యాస పరంపరలో. [/box]

[dropcap]ఇ[/dropcap]ప్పుడంటే ఓపికలు తగ్గాయిగానీ, ఇదివరకు నాకూ, మా శ్రీవారు శ్రీ వెంకటేశ్వర్లుగారికీ, 2 రోజులు ఖాళీ దొరికితే చాలు… కారు వేసుకుని ఎక్కడికో ఒక చోటకి చెక్కేయటం బాగా అలవాటు. కారు ఆయనే నడిపేవారు. అందుకే మాకు ఒక సమయం, సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే బయల్దేరటం బాగా అలవాటయిపోయింది. ఎందుకో తెలియదుగానీ, మేము ఎక్కువగా ఆలయాలకి అందులోనూ పురాతన ఆలయాలకి వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళం. అలా చూసిన ఆలయాల గురించి ఆసక్తి వున్నవారితో పంచుకోవటం నాకు చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు మీకు గుంటూరు జిల్లాలోని ఆలయాల గురించి చెబుతాను. అయితే జిల్లా మొత్తం ఒకేసారి చూడటం సాధ్యం కాదుగనుక వేరు వేరు సందర్భాలలో వేరు వేరు వ్యక్తులతో చూడటం వలన కొన్ని ఆలయాల గురించి ట్రావెలాగ్ లాగా రావచ్చు, కొన్నింటిని గురించి వేరు వేరు వ్యాసాలు రావచ్చు. పాఠకులు మన్నించి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

మరొక్క విషయం. నేను ఇప్పటిదాకా నేను చూసిన ఆలయాలను గురించి మాత్రమే వ్యాసాలు వ్రాశాను. చూడనివి చాలా వుండవచ్చు. శ్రేయోభిలాషులు సహృదయంతో గుంటూరు జిల్లాలో నేను వ్రాయని పురాతన ఆలయాలు గురించి తెలిస్తే నాకు తెలియజేయమని ప్రార్ధన. వీలైనప్పుడు దర్శించగలను.

ఆ రోజు 13-1-2009. సంక్రాంతి… భోగి పండుగ. పిల్లలిద్దరూ చదువులకి యు.యస్. వెళ్ళారు. ఇంట్లో మేమిద్దరమే. సమయం గడపటానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. పిల్లలు లేని ఇంట్లో పండుగలకీ ప్రాముఖ్యత వుండదనిపిస్తుంది. పొద్దున్నే లేచి మామూలుగా పూజ, వంట చేసేశాను. అప్పటికప్పుడు అనుకున్నాము. బోర్ కొట్టుకుంటూ ఇంట్లో కూర్చునే బదులు ఎటన్నా వెళ్ళి వద్దామని. అంతకు ముందు టీ.వీ. కార్యక్రమంలో చూశాను గుంటూరుకి సమీపంలో మూలాంకురేశ్వరీదేవి ఆలయం గురించి. ఆ పేరేదో కొత్తగా అనిపించి ఆ ఆలయం చూద్దామని బయల్దేరాము. ఆ ఆలయం గుంటూరు సమీపంలో వున్నది. దోవలో వున్న కోటప్పకొండ చూసుకుంటూ వెళ్ళి రాత్రికి గుంటూరులో బస చేద్దామనుకున్నాము. వండిన పదార్ధాలని బాక్సుల్లో సర్ది, బట్టలు చిన్న సూట్‌కేస్‌లో సర్ది ఉత్సాహంగా బయల్దేరాము ఇంట్లోంచి ఉదయం 9-15కి.

బయల్దేరేటప్పుడు ఏదో ఒక ఆలయమనుకున్నా దోవలో కనబడేవో, తెలుసుకునేవో, దగ్గరలోనే వున్నాయనో, అలా ఇంకా కొన్ని ఆలయాలు చూడకుండా ఎప్పుడూ తిరిగిరాము. మేమనుకున్నవికాక వేరే చూసిన వాటికి బోనస్ అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నాము. అలాంటి బోనస్ ఈ మారు మాకు మొదట్లోనే తగిలింది.

మధ్యాహ్నం 12 గంటలకి నార్కేట్ పల్లి దగ్గర దోవలో కుడి పక్క వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం అని చూశాము కొండమీద పెద్ద అక్షరాలతో. ఇదివరకు ఆ దోవలో వెళ్ళేటప్పుడల్లా ఆ ఆలయానికి వెళ్ళాలనుకోవటం, కుదరక అలా వెళ్ళిపోవటం జరుగుతూ వుండేది. ఇప్పుడు సమయం అంతా మాదే గనుక ముందు ఆ ఆలయానికి వెళ్ళాము. ఇది గుంటూరు జిల్లాలో ఆలయం కాదండోయ్. మీరూ బోనస్‌గా దీని గురించి కూడా తెలుసుకోండి.

వేణుగోపాలస్వామి ఆలయం, వారిజాల

ఇది నల్గొండ జిల్లాలోని ఆలయం. కారు కొండమీద వున్న ఆలయం దాకా వెళ్తుంది. దర్శన సమయాలు ఉదయం 6 గం. లనుంచీ 1 గం. దాకా, తిరిగి 4 గం. నుంచి 8 గం. ల దాకా. కావాలంటే అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చుగానీ, మన తిండీ, తీర్థం విషయాలన్నీ మనమే చూసుకోవాలి. అక్కడ ఏమీ దొరకవు.

ఈ ఆలయం అతి పురాతనమైనదికానీ అభివృధ్ధిమాత్రం 1979 నుంచీ జరుగుతూ వస్తున్నది. పూర్వం ఇక్కడ కొందరు మునులు తపస్సు చేసుకునేవాళ్ళుట. అప్పుడు స్వామి అక్కడ వెలిశారు. గర్భగుడి చిన్న గుహలాగా వున్నది. దానిలో చిన్న పుట్ట… పుట్టపైన ఆది శేషుడు. ఆ పుట్టలోంచి మునులకు వేణుగానం వినిపించేదిట.

ఆలయం పరిసరప్రాంతాలు విశాలంగా, అందంగా వున్నాయి. సమీపంలోనే శివాలయం కూడా వున్నది. స్వామి దర్శనం చేసుకుని కొంతసేపు సేద తీరటానికి అనువుగావున్న ప్రాంతం.

ఇక్కడ ప్రతి పౌర్ణమికీ స్వామివారి కళ్యణోత్సవం జరుగుతుంది. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

సాధారణంగా ఆలయాలు మధ్యాహ్నం 12 గం. లకి కట్టేస్తారు. వుంటుందో వుండదో అనుకుంటూ వెళ్ళిన మాకు స్వామి దర్శనం అయింది. తిరిగి బయల్దేరాము.

మధ్యాహ్నం 2 గం. లకి ఆకలి వేస్తే దోవలో ఒక చెట్టు నీడన కారు ఆపి ఇంటినుంచి తెచ్చుకున్న భోజనాలు కానిచ్చాము. మనింట్లో రోజూ వండుకునే పదార్ధాలే అయినా రహదారి మీద చెట్టు నీడలో తింటుంటే వాటి రుచే వేరనిపించింది. అందుకే మన పెద్దవాళ్ళు పూర్వంనుంచీ చెబుతున్నారు… అప్పుడప్పుడన్నా తీర్థయాత్రలకి వెళ్ళి రావాలీ అని. సరే… భోజనాలయ్యాక మళ్ళీ బయల్దేరాము.

సాయంకాలం 4-45కి చిలకలూరి పేట మీదనుంచి కోటప్పకొండ చేరుకున్నాము. ఇది నరసారావు పేటకి 16 కి.మీ.ల దూరంలో, గుంటూరుకి 50 కి.మీ. ల దూరంలో వుంది.

కోటప్పకొండ సుప్రసిధ్ధ శైవ క్షేత్రం. ఇక్కడ పరమ శివుడు మేధా దక్షిణామూర్తి రూపంలో వెలిశాడు. సతీ వియోగంతో తల్లడిల్లిన స్వామి ఈ ప్రాంతాలలో తిరిగి ఇక్కడ తపస్సు చేసుకున్నారుట. మరి ఇంత ప్రసిధ్ధ క్షేత్రం గురించి కొంచెం వివరంగా చెప్పాలికదా. అందుకే వచ్చే వారం వివరంగా చెప్పుకుందాము.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here