మస్తాన్ రెడ్డి మంచోడు

0
4

[శ్రీ ఏరువ శ్రీనాథ రెడ్డి రాసిన ‘మస్తాన్ రెడ్డి మంచోడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]స్తాన్ రెడ్డి చాలా మంచోడు.

అందరికీ ఫోన్లు చేస్తున్నాడు.

“ఏరా.. నాగిరెడ్డి, మొన్న డబ్బులు కావాలని అడిగావు కదా..? ఉన్నాయ్ తీసుకుపోరా..”

“ఇప్పుడేం అవసరం లేదన్నా.. సర్దుబాటయ్యాయి”.

మస్తాన్ రెడ్డి ఫోన్ కట్ చేసి మళ్ళీ ఇంకొకరికి చేశాడు.

“అరే భరత్, అప్పుడు నీ కూతురు చదువుకి డబ్బు సర్దుబాటు చేయమని అడిగావు కదా.. ఇప్పుడు ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళరా, ఉన్నాయి”

“లేదురా ఆల్రెడీ ఫీజు మొత్తం కట్టేసా, బ్యాంకులో లోన్ తీసుకున్నాలే, ఇప్పుడేం వద్దు” అని భరత్ అనేసరికి మస్తాన్ రెడ్డి కాస్త ఫీలయ్యాడు.

ఈసారి తన కొలీగ్ కేశవరావుకి కాల్ చేశాడు.

“కేశవరావు గారు నమస్తే.. మొన్న మీ అబ్బాయి అమెరికా వెళ్లడానికి డబ్బు సాయం అడిగారు కదా.. 25 లక్షలు, ఇప్పుడున్నాయి. తీసుకెళ్లండి”.

“అయ్యో వద్దండి మస్తాన్ రెడ్డి గారు, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మా వాడు అమెరికా కూడా వెళ్ళిపోయాడు.” కేశవరావు అనేసరికి మస్తాన్ రెడ్డి ఇంకాస్త నొచ్చుకున్నాడు.

ఫోన్ పక్కన పడేసి సుశీలని పిలిచాడు. సుశీల వచ్చింది.

“ఏంటండీ పిలిచారు”

“కాస్త కాఫీ పెట్టివ్వు తలనొప్పిగా ఉంది”

“ఎవరైనా డబ్బులు కావాలన్నారా”

“ఎవరిని అడిగినా వద్దంటున్నారు సుశీల”

సుశీల కాసేపు ఆలోచించి – “సర్లెండి మీ చుట్టాలు ఇంతకుముందు మిమ్మల్ని చాలాసార్లు డబ్బులు కావాలి అని అడిగారు కదా? వాళ్ళని ఒకసారి అడగండి”

“అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు కావాలా? అని అడిగితే బాగుండదేమోనే”

“ఏం కాదులెండి మనుషులు ఉన్నంతకాలం అవసరాలు ఉంటాయి. ఒకసారి అడిగి చూడండి. దేవుడు దయవల్ల ఎవరికైనా అవసరమైతే ఇచ్చేద్దాం” అని సుశీల సున్నితంగా చెప్పగానే మస్తాన్ రెడ్డి ఆలోచనలో పడ్డాడు.

“సరే నువ్వు కాఫీ తీసుకొని రా.. నేను ఫోన్లు చేస్తాను” అని మస్తాన్ రెడ్డి మళ్ళీ ఫోన్ అందుకున్నాడు.

మస్తాన్ రెడ్డి తన స్నేహితులకి, బంధువులకి ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు.

సుశీల వంట గదిలోకి వెళ్లి కాఫీ రెడీ చేస్తోంది.

 అప్పుడు సమయం ఉదయం తొమ్మిది దాటింది.

 ఓ పదిహేను నిమిషాల తర్వాత మస్తాన్ రెడ్డి సోఫాలోకి ఫోన్ విసిరినంత పని చేశాడు. ఈలోపు సుశీల రెండు కప్పుల్లో కాఫీ కలుపుకొని (షుగర్ లేకుండా) వచ్చి, మొగుడి పక్కనే కూర్చుంది. ఒక కప్పు మొగుడికి ఇచ్చి తను ఒకటి తీసుకుంది. ఇద్దరూ తాగడం మొదలుపెట్టారు.

“ఏవండీ ఎవరైనా డబ్బులు కావాలని అడిగారా..?”

“అందరూ వద్దని అంటున్నారు. ఎవరికీ అవసరం లేదంట”

“అయితే ఇప్పుడేం చేద్దాం అండి”

“అదే నాకూ అర్థం కావడం లేదు సుశీల” అని మస్తాన్ రెడ్డి తల పట్టుకొని కూర్చున్నాడు. మస్తాన్ రెడ్డికి పెద్ద కష్టమే వచ్చి పడింది. తన లైఫ్‌లో ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదు మస్తాన్ రెడ్డి.

“సరే నావల్ల కావడం లేదుగానీ, నువ్వు ఒక పని చెయ్ సుశీలా.. నీకు తెలిసిన వాళ్లకు ఫోన్ చెయ్, మన వీధిలో కొంతమంది నీకు స్నేహితురాళ్ళు ఉన్నారు కదా..? వాళ్ళని అడుగు డబ్బులేమైనా కావాలేమోనని, నాకు కాస్త నిద్రొస్తుంది, పడుకుంటాను” అని మస్తాన్ రెడ్డి సోఫాలోనే నడుం వాల్చాడు.

సుశీల సరేనంటూ తలూపి తలుపేసి వీధిలోకి వెళ్ళింది.

మస్తాన్ రెడ్డి గురక పెట్టి నిద్రపోతున్నాడు.

సుశీల తెలిసిన వాళ్లకి ఫోన్లు చేస్తూ, వీధిలో తనకి తెలిసిన వాళ్ళిల్లకి వెళ్లి డబ్బులవసరాలేమైనా ఉన్నాయో అని అందరిని అడుగుతూ ఉంది.

మస్తాన్ రెడ్డికి మెలుకువ వచ్చేలోపు సుశీల ఇంటికి వచ్చేలోపు మస్తాన్ రెడ్డి ఎంత మంచి వాడో చెప్తాను పదండి.

***

మస్తాన్ రెడ్డి నాన్న పేరు చెంచిరెడ్డి. అమ్మ పేరు నాగేంద్రం. మస్తాన్ రెడ్డి ఒక్కగానొక్క కొడుకు. లేక లేక కలిగిన సంతానం. పెళ్లయిన పదేళ్లకు కలిగిన సంతానం. వాళ్ళమ్మ నాగేంద్రం కడప దర్గాకి వెళ్లి మొక్కుకున్న తర్వాత మస్తాన్ రెడ్డి పుట్టాడు. అందుకే ఆ పేరు పెట్టారు. మస్తానమ్మ, మస్తాన్ రెడ్డి అనే పేరు గల వాళ్ళు ఆ చుట్టుపక్కల ఊళ్ళలో చాలామంది ఉన్నారు.

మామూలు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. ఒక్క కొడుకే కాబట్టి గారాబంగా పెంచారు. ఇంట్లోనే ఉంచారు. ఉన్నంతలో బాగానే చదివించారు. ఊర్లో కూడా మస్తాన్ రెడ్డి బాగా చదువుతాడనే పేరు వచ్చింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉండగా తోటి విద్యార్థులంతా క్యాంపస్ ప్లేస్మెంట్స్‌లో సెలెక్ట్ అవుతున్నారు. కానీ మస్తాన్ రెడ్డికి ఆ అవకాశం లేదు. ఎందుకంటే అదే సమయంలో మస్తాన్ రెడ్డికి డెంగ్యూ జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. మస్తాన్ రెడ్డి బాధపడలేదు. కానీ నాగేంద్రం మాత్రం కొడుక్కి ఉద్యోగం రాలేదని మూడు నెలల పాటు ముక్కు చీదుకుంటూనే ఉంది.

మస్తాన్ రెడ్డి మంచం దిగిన మూడు రోజుల తర్వాత పేపర్లో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ చూసి అన్యమనస్కంగానే అప్లై చేశాడు. పరీక్ష రాశాడు. రెండు నెలల తర్వాత ఫలితాలు వచ్చాయి. అనూహ్యంగా మస్తాన్ రెడ్డికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. నాగేంద్రం ఆనందం అంతా ఇంతా కాదు. ఉబ్బితబ్బిబ్బై పోయింది. ఆ ఆనందం వల్ల ఆవిడ వారం పాటు నిద్రపోతే ఒట్టు. పక్క ఊరిలోనే పోస్టింగ్. రోజూ వెళ్లి వచ్చేవాడు. జీతం కాస్త తక్కువయినా గవర్నమెంట్ జీతగాడు, అదృష్ట జాతకుడు అనే గౌరవం ఏర్పడింది ఊర్లో మస్తాన్ రెడ్డికి.

వాళ్ల నాన్న చెంచిరెడ్డికి వయసు తగ్గింది. జ్ఞానోదయం అయింది. వ్యవసాయం మానేసి పొలం కౌలుకి ఇచ్చి ఊర్లో కుర్రోళ్ళతో తిరగడం మొదలుపెట్టాడు. రోజు మొత్తం వైన్ షాప్ దగ్గర నిలబడి ప్రభుత్వం పడిపోకుండా చూసేవాడు.

ఏ అర్థరాత్రో ఇంటికి వచ్చి పడుకునేవాడు. కాదు పడిపోయేవాడు.

నాగేంద్రానికి ఇంతకుముందు పొలం పనులతో తీరిక ఉండేది కాదు. ఇప్పుడు ఇంటి పని ఒకటే కాబట్టి చాలా తీరిక దొరికింది. ఊర్లో అందరి ఇళ్లకు వెళ్లి యవ్వారాలు చేసుకుని వస్తూ వస్తూ ఎంతో కొంత ఆవేదనను, అసహనాన్ని మూటగట్టుకుని వచ్చేది. సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన కొడుకు ముందు ఆ మూట విప్పేది. ఈ మాట చెప్పేది.

“ఒరేయ్ మస్తానూ.. నీతో పాటు చదువుకున్నోళ్ళందరికీ జీతాలు లక్షల్లో ఉన్నాయంట, నీకేమో వేలల్లోనే వస్తా ఉంది. లక్షల్లోకి నువ్వు ఎప్పుడు వస్తావు రా..? నువ్వు కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసినా బాగుండేది” అని నాగేంద్రం కొడుకు దగ్గర వాపోయేది.

రెండు క్యాలెండర్లు మారాయి మస్తాన్ రెడ్డి ఇంట్లో.

చెంచిరెడ్డి కూడా బాగా మారిపోయాడు. ఒంట్లో ఉన్న రక్తం ధారపోసి మరీ నరాల్లో మద్యం ఎక్కించుకున్నాడు. ఊళ్లో కొంతమంది కుర్రాళ్ళు అప్పుడప్పుడే అమెరికా మీద మోజు పెంచుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరు ముగ్గురు అప్పటికే అమెరికా వెళ్లి నెలకి 10 లక్షలు ఇంటికి పంపడం మొదలుపెట్టారు. నాగేంద్రం బాధ రెట్టింపు అయ్యింది.

ఆ బాధతో ఆవిడకి మొదటిసారి గుండెపోటు వచ్చింది. ఆవిడ బాధ ఫలించింది.

కొడుక్కి ప్రమోషన్ వచ్చింది. జీతం పెరిగింది.

నాగేంద్రం హార్ట్ బీట్ కొంచెం యధాస్థితికి వచ్చింది.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నాగేంద్రానికి ఒకరోజు అర్ధరాత్రి మస్తాన్ రెడ్డి పేద్ద షాకిచ్చాడు. ఒక గుడ్డ సంచి చేతికిచ్చాడు. చూస్తే కట్టలు. డబ్బు కట్టలు. లెక్కపెట్టమన్నాడు. మస్తాన్ రెడ్డి అన్నం తిని పడుకున్నాడు. నాగేంద్రానికి ఆ రోజు అన్నం సహించలేదు. డబ్బులు లెక్కబెట్టడం మొదలుపెట్టింది. తెల్లవార్లూ లెక్కపెట్టినా.. లెక్క తేలలేదు.

కానీ తెల్లవారింది. తెల్లారాక కొడుకుతో “ఒరేయ్ మస్తానూ.. రాత్రి నువ్వు నాకు ఎంతిచ్చావు?” అంది.

“ఏమో మా నేను లెక్కపెట్టలేదు”.

“నేను ఎంత లెక్కపెట్టినా తేలడం లేదురా”

“సరే సాయంత్రం చూద్దాంలే వాటి పని, ముందు టిఫిన్ పెట్టు” అని మస్తాన్ రెడ్డి అడగడంతో నాగేంద్రం డబ్బు కట్టలన్నీ బీరువాలో దాచేసి పనిలో పడిపోయింది.

కొడుకు ఆఫీసుకి వెళ్లిపోయాక మళ్ళీ లెక్క పెట్టింది. అయినా లెక్క తేలలేదు. సాయంత్రం కొడుకు ఆఫీసు నుండి వస్తూ వస్తూ రెండు మిషన్లు తెచ్చాడు. ఒకటి వేయింగ్ మిషన్ ఇంకొకటి కౌంటింగ్ మిషన్. వాళ్ళమ్మకి ఆ మెషీన్లు ఎలా వాడాలో నేర్పించాడు. అప్పటినుండి నాగేంద్రానికి పని సులువైంది. కాదు కాదు పనెక్కువైంది. ఇంటి పని, వంట పని, డబ్బు పని మూడింటిని బ్యాలెన్స్ చేసుకోలేక పాపం సతమతమవుతోంది.

మస్తాన్ రెడ్డిని చాలామంది డబ్బు సహాయం అడిగేవారు. తనతో పాటు చదువుకున్న మిత్రులు, ఊళ్లోవాళ్లు, బంధువులు ఇలా.., కానీ మస్తాన్ రెడ్డి చాలా మంచోడు. ఎవరికీ అర్ధ రూపాయి కూడా సహాయం చేసేవాడు కాదు. నాగేంద్రం ఇంట్లోనే ఉంటది కాబట్టి ఇంటికి ఎవరూ వచ్చేవారు కాదు. మస్తాన్ రెడ్డి మొఖం తిప్పుకొని పోవడం అలవాటు చేసుకున్నాడు. ఎవరన్నా ఎదురుపడి సాయం అడుగుతారని భయం.

వినాయకుని ఊరేగింపు సందర్భంగా ఊరంతా సందడిగా ఉంటే, ఆరోజు రాత్రి నాగేంద్రం, మస్తాన్ రెడ్డి ఇద్దరూ అన్నం తింటూ మాట్లాడుకుంటున్నారు.

“మా నువ్వు నా జీతం తక్కువని బాధపడ్డావు. వేరే వాళ్ళతో పోల్చావు. వాళ్లు జీతాన్ని లెక్కపెట్టుకుంటారు. మనం తూకం వేస్తాం. అది.. మనకీ, వాళ్ళకీ తేడా.

వాళ్లకి నెలకొకసారే జీతం. మరి నాకు జీతంతో సంబంధం ఏముంది. గవర్నమెంట్ నెలకోసారి జీతం ఇస్తే, ప్రజలు పదిసార్లు ఇస్తారు జీతం. వాళ్ళు వాళ్ళ డబ్బుని అంకెల్లో చూసుకొని మురిసిపోవడమే. మనం మన చేత్తో తడిమి చూసుకుంటాం. మనకున్న అనుభూతి వాళ్లకెక్కడిది. అవన్నీ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు. నాది తుఫానొచ్చినా తొణకని బెణకని నికార్సయిన గవర్నమెంట్ ఉద్యోగం. అందరూ వంగి వంగి దండాలు పెట్టే ఉద్యోగం. గౌరవం బోనస్‌గా ఉండే పర్మినెంట్ ఉద్యోగం. మస్తాన్ రెడ్డి పేరు మామూలు పేరే కావచ్చు. కాని అది ఇప్పుడు సంతకం అయింది. ఆ సంతకానికి సంపదలు సృష్టించేంత విలువ ఉంది. విలువతో పాటు వెల కూడా ఉంది” అని మస్తాన్ రెడ్డి తన గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతుంటే నాగేంద్రానికి నోట మాట రాలేదు. నోరు తెరుచుకునే నిద్రపోయింది.

ఇంకో రెండు క్యాలెండర్లు మారాయి మస్తాన్ రెడ్డింట్లో.

వాటితో పాటు మస్తాన్ రెడ్డి పాత ఇంటి స్థానంలో కొత్త భవంతి వెలిసింది. నాగేంద్రం బీరువాలు కొనే అవసరం లేకుండా మస్తాన్ రెడ్డి రెండు బెడ్ రూముల్లో నాలుగు సీక్రెట్ లాకర్స్ పెట్టించాడు. కౌంటింగ్ మెషిన్, వేయింగ్ మిషన్లు కూడా కొత్తవి కొన్నాడు. ఈసారి ప్రహరీ గోడ ఎత్తుగా కట్టించాడు.

చెంచిరెడ్డికి ప్రమోషన్ వచ్చింది. అవయవాలు అవశాన దశకు చేరుకున్నాయి. మందిలో తిరుగుతూ, మందు తాగుతూ తిరిగే చెంచిరెడ్డి ఇప్పుడు మంచానికే పరిమితం అయ్యాడు. మొగుడి పరిస్థితి చూసి నాగేంద్రానికి బాధ లేదు కానీ కొడుకు భవిష్యత్తు తలుచుకొని భయపడింది. మంచం మీద ఉన్న చెంచిరెడ్డిని మండపంలో చూడాలనుంది.

తండ్రి పోయేలోగా కొడుక్కి పెళ్లి చేయాలనుకుంది. సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. మార్కెట్లో మస్తాన్ రెడ్డి రేటు నిర్ణయించి బేరానికి పెట్టింది. చాలామంది అందమైన, చదువుకున్న, ఆస్తి ఉన్న అమ్మాయిలు మస్తాన్ రెడ్డి సంబంధం కోసం క్యూ కట్టారు. వాటిల్లో ఒకదానికి నాగేంద్రం తలూపింది. కానీ ఆ రోజు రాత్రి మస్తాన్ రెడ్డి చెప్పిన తర్కం విని తలదించుకుంది.

“మా.. ఆస్తి ఉన్న అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు మనకెందుకమ్మ? ఉద్యోగం ఉన్న అమ్మాయితే జీవితాంతం జీతం వస్తుంది. ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తున్నాను. అదే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అమ్మాయితే నాలుగు చేతులా సంపాదించుకోవచ్చు, ఒకసారి ఆలోచించు” అని మస్తాన్ రెడ్డి వాళ్ళ అమ్మకి బ్రెయిన్ వాష్ చేయడంతో నాగేంద్రం ఆలోచనలో పడింది. అయితే ఆ ఆలోచనలో నుండి తీరుకునేలోపే అదృష్ట దేవత నాగేంద్రం గడప తొక్కింది. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అమ్మాయి దొరికింది. ఆ శ్రావణమాసంలో కొడుక్కి ఘనంగా పెళ్లి చేసింది ఆడపిల్ల వాళ్ళ డబ్బుతో. అదే శ్రావణ మాసపు చివరలో చెంచిరెడ్డి పెద్దకర్మ కూడా ఘనంగానే జరిపించింది తన సొంత డబ్బుతో.

నాగేంద్రం కోడలు, మస్తాన్ రెడ్డి భార్య అయిన సుశీల కూడా చాలా కలుపుగోలు మనిషి. తొందరగానే కలిసిపోయింది వాళ్లతో. సుశీల కూడా న్యూస్ పేపర్లలో డబ్బు తేవడం మొదలుపెట్టింది. సుశీల, మస్తాన్ రెడ్డి ఒక్కోసారి పోటీలు పెట్టుకునే వారు ఎవరు ఎక్కువ డబ్బు తెస్తారోనని. వాళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యం చూసి నాగేంద్రం మురిసిపోయేది. కొన్నిసార్లు కోడలి సంపాదన చూసి కొడుకుని సరదాగా ఆట పట్టిస్తుండేది నాగేంద్రం. నాగేంద్రం ఇప్పుడు కౌంటింగ్ మిషన్ పక్కనపెట్టి వేయింగ్ మిషన్ మాత్రమే వాడుతుంది. బరువును బట్టి డబ్బు ఎంత ఉంటుందో అంచనా వేయగలిగే స్థాయికి ఎదిగింది నాగేంద్రం.

కొడుకు కోడలు ఇద్దరూ ఒట్టి చేతులతో ఇంటికి రావడం ఎప్పుడూ చూడలేదు నాగేంద్రం.

పెళ్లయి నాలుగేళ్లవుతున్నా కోడలి కడుపున కాయ కాయలేదని నాగేంద్రానికి ఏం బాధ లేదు కానీ ఒకరోజు మధ్యాహ్నం కోడలు లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్లకి పట్టుబడిన విషయం తెలియడంతో నాగేంద్రానికి రెండోసారి గుండెపోటు వచ్చింది. ఆరు నెలలు విధుల నుండి సస్పెండ్ చేశారు సుశీలని. కానీ సుశీలకి మాత్రం కనీసం తలపోటు కూడా రాలేదు. ఈ ఆరు నెలలు కోడలికి సగం జీతమే వస్తుంది. లంచాలు రావనే బెంగతో మూడు నెలలు గడిచేసరికి ముచ్చటగా మూడోసారి నాగేంద్రానికి గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. మస్తాన్ రెడ్డి ఏమాత్రం బాధపడలేదు కానీ భయపడ్డాడు. ఎందుకంటే ఇప్పటినుండి డబ్బులు ఎవరు తూకం వేస్తారని. సుశీల కూడా అదే సమయంలో పుట్టింటికి వెళ్లి మూడు నెలలు ఉండి వచ్చింది.

కొన్ని సంవత్సరాలు అలా బతుకు బండిని అతి కష్టం మీద నెట్టుకొచ్చారు మస్తాన్ రెడ్డి, సుశీల. పిల్లలు లేరు. అసలు ఆ ఆలోచనే లేదు వాళ్లకి. ప్రేమంతా డబ్బు మీదే చూపించేవారు. ఆశలన్నీ పైసల మీదే పెట్టుకున్నారు. సుశీల రెండోసారి ఏసీబీ వాళ్లకు దొరికినప్పుడు కూడా ఆమె ముఖంలో చిరునవ్వు చెదరలేదు. పశ్చాత్తాపం లేదు. ఆమెలో ఎలాంటి బెరుకు, బెంగా లేవు. టీవీల్లో, పత్రికల్లో హెడ్లైన్స్‌గా వేసినప్పుడు కూడా సుశీల చలించలేదు. మళ్లీ విధుల్లో చేరి యథావిధిగా తన పని తాను నిజాయితీగా చేసుకుంటూ పోయింది. మస్తాన్ రెడ్డి మాత్రం ఏ పనిచేసే ముందైనా కాస్త ముందు వెనకా ఆలోచిస్తాడు. చుట్టుపక్కల ఊళ్లలో మస్తాన్ రెడ్డి చాలా మంచి పేరు సంపాదించాడు. మస్తాన్ రెడ్డి చేతిలో పడితే ఏ పనయినా క్షణాల్లో అయిపోతుందని.

ఎవరి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయో తెలియదు కానీ ఆ శుక్రవారం మస్తాన్ రెడ్డి ఏసీబీ వాళ్లకి అడ్డంగా దొరికాడు. రెండు రోజులు పాటు టీవీల్లో పేపర్లలో మస్తాన్ రెడ్డి గురించి ఊదరగొట్టేసారు. మస్తాన్ రెడ్డి సెలబ్రిటీ అయ్యాడు. ఉన్నఫలంగా ఉద్యోగంలో నుండి ఊడపీకేశారు. మళ్ళీ ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. అప్పటికే ఆరు నెలలు అయింది. ఇంట్లోనే ఉంటున్నాడు. మస్తాన్ రెడ్డి తన మీద పడిన మచ్చని చూసుకొని జీర్ణించుకోలేకపోతున్నాడు. పిచ్చెక్కిపోయింది. త్వరలో IT దాడులు జరుగుతాయని మస్తాన్ రెడ్డికి ఉప్పందింది. మస్తాన్ రెడ్డిలో సన్నగా వణుకు మొదలైంది. భయపడటం మొదలు పెట్టినాడు. ఏసీబీ వాళ్లకి దొరకడంతో అవమానాన్ని తట్టుకోలేక ఇంట్లో కూడా తలవంచుకుని తిరుగుతున్నాడు. వయసు మీద పడుతుంది. సుశీలకి కూడా మోకాళ్ల నొప్పులొచ్చాయి. ఓ రోజు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని ఇంట్లో ఉన్న డబ్బు ఎవరికన్నా సాయంగా ఇచ్చేద్దాం అనుకున్నారు. అలా అనుకున్న మరుసటి రోజు మస్తాన్ రెడ్డి ఫోన్లు చేయడం ప్రారంభించాడు.

ఆ రోజే ఈ రోజు.

***

మస్తాన్ రెడ్డి చాలా మంచోడు.

తొందరగానే మేల్కొన్నాడు. ఈలోపు సుశీల వచ్చింది. అప్పటికే సాయంత్రం నాలుగైంది. ఇద్దరూ భోజనం చేశారు.

“వెళ్లిన పని ఏమైంది సుశీలా..” అని అడిగాడు మస్తాన్ రెడ్డి.

“ఒక్కరు కూడా డబ్బు కావాలని అనలేదండి” అని సుశీల ఏడుపు ముఖం పెట్టుకుంది.

“నిజంగా లోకంలో ఎవరికీ డబ్బు అవసరం లేదా..? లేదా కావాలనే వద్దంటున్నారా? నాకేం అర్థం కావడం లేదు సుశీల”

“అదేనండి నేనూ ఆలోచిస్తున్నాను. ఇంతకుముందు చాలా మంది మనల్ని డబ్బులు ఇవ్వమని అడిగారు. మనం ఇవ్వలేదు. ఇప్పుడు ఊరికే ఇస్తామన్నా ఎవరూ తీసుకోవడం లేదు. పగవాడికి కూడా రాకూడదు ఈ కష్టం. మనం ఏ పాపం చేసామండి. మనకే ఎందుకు దేవుడు ఇన్ని కష్టాలిచ్చాడు” అని సుశీల బోరున ఏడ్చింది.

“రేపు IT దాడులు జరిగితే మన డబ్బు మొత్తం పట్టుకుపోతారు. మన గురించి ప్రపంచానికి తెలిసిపోతుంది. గుట్టుగా బతుకుతున్న మనం రాష్ట్రం మొత్తానికి తెలిసిపోయాం. ఏం చేయాలి ఇప్పుడు. చాలామంది యూట్యూబ్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో అర్థమైంది. మనకు ఎవరూ లేరు ఈ డబ్బు ఇవ్వడానికి. ఎందుకు సంపాదించాం ఈ డబ్బంతా? తల్లిదండ్రులు లేరు. పిల్లలు లేరు. ఏం చేద్దాం చెప్పు సుశీల” అని సుశీల ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు మస్తాన్ రెడ్డి.

సుశీల చాలా సేపు ఏం మాట్లాడలేదు. సమయం ఆరు అయింది. మస్తాన్ రెడ్డి లేచి సుశీలను టీ పెట్టివ్వమన్నాడు. సుశీల ఇద్దరికీ టీ తెచ్చింది. ఇద్దరూ తాగుతున్నారు.

“వెళ్లిపోదాం అనుకుంటున్నా సుశీలా.. ఇక్కడ నుండి”

 “అయ్యో ఎంత మాట అన్నారండి. ఎందుకండీ అంత విరక్తి. ఇంత చిన్న విషయానికే అంత పెద్ద నిర్ణయమా? నేను రెండుసార్లు ఏసీబీ వాళ్లకి దొరికాను. పత్రికల్లో, టీవీల్లో నా గురించి ఎలా రాశారో మీరు కూడా చూశారు. అయినా నేనేమైనా బాధపడ్డానా చెప్పండి. ఎలాగో ఆరు నెలలు గడిపేశారు. కొంచెం ఓపిక పట్టండి. నా పలుకుబడిని ఉపయోగించి మిమ్మల్ని మళ్లీ విధుల్లోకి చేరుస్తాను. మంత్రిని కలుస్తాను. అవసరమైతే డబ్బు పారేస్తాను. ఏమంటారు”. అని సుశీల మస్తాన్ రెడ్డికి చేతిలో చేయి వేసి ధైర్యం చెప్పింది.

“నన్ను కొంచెం ఆలోచించుకొనీ.. సుశీల” అని లేచి ఇంటి బయట బాల్కనీలోకి వెళ్ళాడు మస్తాన్ రెడ్డి.

సుశీల వంటగదిలోకి వెళ్ళింది.

7:45 కి లోపలికి వచ్చాడు మస్తాన్ రెడ్డి. సుశీల సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది. మస్తాన్ రెడ్డి టీవీ ఆఫ్ చేశాడు.

“ఒక నిర్ణయానికి వచ్చాను సుశీల”

“ఏంటండీ అది”

“నేను వెళ్ళిపోవాలి. ముహూర్తం నేనే పెట్టుకున్నాను”

“దయచేసి ఆ ఆలోచన వదిలేయండి”

“జరిగిన అవమానం నన్ను పదేపదే గుచ్చుతుంది. గుక్కతిప్పుకోనియ్యడం లేదు. ఇంక ఈ సమాజంలో తలెత్తుకు తిరగలేను. మనకి కష్టం వచ్చి ఎవరినన్నా సాయం అడిగితే మన వాళ్ళు ఎవరో తెలుస్తుంది అంటారు. ఇప్పుడు మనమే సాయం చేద్దామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు.

ఇప్పుడు తెలిసింది నాకు మనం ఎంత మందిని సంపాదించుకున్నామో?

 ఎంత సంపాదించామో? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు రాత్రికే నా ప్రయాణం”.

“మీరెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటండీ. నాకెవరున్నారు? ఇన్నాళ్ళూ మీతో పాటు నడిచాను. ఇప్పుడు కూడా మీతో పాటు వస్తాను. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి”. అని సుశీల ఏడ్చింది.

మస్తాన్ రెడ్డి కూడా ఏడవటం మొదలుపెట్టాడు. ఇద్దరూ చాలా సేపు ఏడ్చుకున్నారు. మేఘం కరిగిపోయింది. ఇద్దరూ సాంత్వన పడ్డారు. సోఫాలో కూర్చున్నారు. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. చాలా సేపు మౌనంగా ఉన్నారు.

మస్తాన్ రెడ్డే నోరు తెరిచాడు.

“సుశీలా.. నాది ఒక చిన్న విన్నపం. ఎలాగూ వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం. వెళ్లే ముందు ఈ డబ్బును ఏదైనా చేసి వెళ్దాం”

“ఏం చేద్దామండి ఎవరూ అడగడం లేదు కదా? ఇస్తామన్నా వద్దంటున్నారు”.

“అందుకే నేను ఒక ప్లాన్ వేశాను.

ఇది ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికే చేరాలి. ప్రజల్లో నుండి వచ్చింది. ప్రజల్లోకే చేరాలి. డబ్బు మొత్తం తీసుకెళ్లి ఊరి నడిబొడ్డున రాశిగా పోసి వెళ్లిపోదాం. ఎవరికి అవసరం అయింది వాళ్ళు తీసుకుంటారు. ఏమంటావు సుశీలా..”

“అవునండీ అలాగే చేద్దాం.. కానీ నాది కూడా ఒక చిన్న విన్నపం. ఊరొదిలి పోతున్నాం కదా? కాశీకి వెళ్లి గుట్టుగా బతుకుదామండీ. ఎలాగూ ఎవరిని సంపాదించుకోలేకపోయాం. మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుందాం. పోయేటప్పుడు ఆ కాస్త పుణ్యాన్ని మూటగట్టుకుని వెళ్దామండి. ఏమంటారు”

“సరే సుశీలా నువ్వన్నట్టే చేద్దాం. ఈ పాపపు మూటని ఇక్కడే పడేసి పుణ్యం మూటని పట్టుకెళ్దాం అంటావ్. అలాగే చేద్దాం”

“కానీ ఈ డబ్బు మొత్తం ఊరి నడిబొడ్డుకి ఎలా చేర్చడం, అందరూ చూస్తారు కదండీ”

“అందరూ చూడకూడదు. ఇది మన డబ్బు అని ఎవరికీ తెలియకూడదు. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి పని మొదలు పెడదాం. ఈ డబ్బు ఎలాగైతే మూడో కంటికి తెలియకుండా ఇక్కడికి వచ్చిందో అలాగే అక్కడికి చేరుద్దాం” అని మస్తాన్ రెడ్డి తన బుర్రకి పదును పెట్టాడు.

అప్పటికే సమయం పదిన్నర అయింది. ఇద్దరికీ ఆకలిగా లేదు ఆనందంతో.

“సుశీలా.. ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బుందో మొత్తం తెచ్చి హాల్లో పడేద్దాం పదా..” అని మస్తాన్ రెడ్డి హుషారుగా చెప్పడంతో సుశీల తలూపింది.

ఇద్దరూ బీరువాల్లో నుండి, అల్మారాల్లో నుండి, డబుల్ కాట్ మంచాల కింద నుండి, కిచెన్‌లో నుండి, మస్తాన్ రెడ్డి శ్రద్ధగా చేయించిన సీక్రెట్ లాకర్ల నుండి, ఇంకా ఇంటిలో ఎక్కడెక్కడ డబ్బు దాక్కుందో దాన్ని తెచ్చి హాల్లో పడేయడం ప్రారంభించారు.

వాళ్ళిద్దరికీ ఒక్క బంగారపు వస్తువు కూడా లేదు. వాళ్లకి వస్తువుల మీద ఆశ లేదు. మోజు లేదు. ఏదున్నా.. ఏదైనా నగదు రూపంలోకి మార్చుకునేవారు. కరెన్సీ కట్టల సువాసనకి అలవాటు పడ్డ ప్రాణాలు మరి. డబ్బు సంపాదించేటప్పుడు కూడా వాళ్ళు ఇంత కష్టపడలేదు. తొలిసారి చెమట వాసన తగిలింది.

డబ్బు మొత్తం హాల్లోకి తెచ్చి పడేయడానికి వాళ్ళకి నాలుగు గంటలు పట్టింది. సమయం రెండున్నర అయింది. అర్ధరాత్రి దాటింది.

కాశీ ప్రయాణానికి కావాల్సిన బట్టలు సర్దుకున్నారు. అవసరమైనంత మేరకే డబ్బులు బ్యాగులో పెట్టుకున్నారు. వేయింగ్ మిషన్ మాత్రం సుశీల దాచి పెట్టింది.

డబ్బుని నాలుగు గోనె సంచుల్లో మూట కట్టారు. వాటి మూతి కట్టారు. ఇంకా మిగిలి ఉంది. మస్తాన్ రెడ్డి నాలుగు లుంగీల్లో ఎలాగోలా మిగిలిన డబ్బు కష్టపడి సర్దింది సుశీల. మొత్తం ఎనిమిది శాల్తీలు తేలాయి. అలా మూటలు కట్టడానికి తల ప్రాణం తోకకి వచ్చింది ఇద్దరికీ.

ఇప్పుడు అసలైన పరీక్ష వాళ్ళకి. ఈ ఎనిమిది మూటలు ఊరి మధ్యలోకి ఎలా చేర్చడం? వాళ్లకి కారు లేదు. బండి లేదు. కానీ కాళ్లున్నాయి. అవి నొప్పులతో నానుతున్నాయి. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బాగా ఆలోచించారు. ఎలా చేర్చాలి అని తర్జనభర్జనలు పడ్డారు. మోయలేనంత డబ్బు సంపాదించారని బాధపడ్డారు.

మస్తాన్ రెడ్డి ఒకసారి ఊరి నడిబొడ్డు దాకా వెళ్లి చూసి వచ్చాడు. అక్కడ ఒక పేద్ద అరుగు శుభ్రం చేసి వచ్చాడు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. మస్తాన్ రెడ్డికి అదృష్టం కలిసి వచ్చింది. అప్పుడే కరెంటు పోయింది. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి, సుశీలను ఒప్పించి, ఇద్దరూ భుజాల మీద మూటలు పెట్టుకొని తరలించడం ప్రారంభించారు. నాలుగు సార్లు తిరిగేసరికి పని పూర్తయింది.

జీవితంలో ఎప్పుడూ మోయని బరువు బాధ్యతలు అప్పుడు మోసారు వాళ్ళు. దేన్నైనా తెచ్చుకోవడం కంటే వదిలించుకోవడం ఎంత కష్టమో వాళ్లకి తెలిసొచ్చింది.

అందుకే పది రూపాయలు ఇచ్చి ఆనందాన్ని కొనుక్కోవడం కంటే ఇరవై రూపాయలు ఇచ్చి దుఃఖాన్ని దూరం చేసుకోవడం మంచిది.

మూటలన్నీ విప్పి డబ్బు రాశిగా పోసి లుంగీలు, గోనె సంచులు తీసుకొచ్చి ఇంట్లో పడేశారు. అప్పటికే తెల్లవారుజామున 4:30 అయ్యింది. సన్నగా మంచు కురవడం మొదలైంది. డిసెంబర్ నెల ఆఖరి వారం అది.

ఇద్దరూ కాసేపు కునుకు తీశారు. తెల్లవారింది. సమయం ఆరున్నర అయింది. రవి ఇంకా రాలేదు. శీతాకాలం కదా.. కాస్త ఒళ్ళు విరుచుకొని వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఇద్దరూ లేచి చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకొని కాశీ ప్రయాణానికి బయలుదేరారు.

“ఏవండీ ఒక్కసారి చూద్దామండి ఆ డబ్బు ఏమవుతుందో? ఎవరెవరు తీసుకువెళ్తున్నారో? అసలు ఉందో లేదో? మన డబ్బుని మనం చివరు చూపు చూసుకొని వెళ్దామండి” అని సుశీల అనేసరికి అన్యమనస్కంగానే మస్తాన్ రెడ్డి ఒప్పుకున్నాడు.

ఇద్దరు తమ ఇంటి డాబా ఎక్కి చూస్తున్నారు. వాళ్లు పోసిన డబ్బు రాశి స్పష్టంగా కనబడుతుంది.

ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా వచ్చి ఆ డబ్బు రాశి చుట్టూ మూగుతున్నారు. సూర్యుడు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాడు ఆ డబ్బుని చూడటానికి. చిన్నగా సగం ఊరు అక్కడికి చేరింది.

ఈలోపు సూర్యుడు కూడా వచ్చేసాడు. ఆయన వెలుగులో డబ్బు మెరుస్తూ ఉంది. ఊరు మొత్తం చేరుకుంది. అందరూ గుసగుసలు మొదలుపెట్టారు. అవేం వినపడటం లేదు మస్తాన్ రెడ్డికి సుశీలకి. కానీ ఏం జరుగుతుందోనని ఆత్రుతగా ఎదురుచూడసాగారు.

అందరూ డబ్బు చుట్టూ మూగారు. కానీ దగ్గరికి రావడం లేదు. దానిని ముట్టుకోవడం లేదు. చివరికి చిన్నపిల్లలు కూడా. వాళ్లలో చాలామందికి డబ్బుతో చాలా అవసరాలు ఉన్నాయి.

వెంకారెడ్డికి దాదాపు 10 లక్షల దాకా అప్పుంది. వ్యవసాయం కలిసి రాలేదు. పెళ్లి కావాల్సిన కూతుర్లు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు.

నారాయణ పెద్ద కొడుక్కి క్యాన్సర్ అని తేలింది. పెద్ద హాస్పిటల్‌లో ఉన్నారు. చాలా డబ్బులు కావాలంట నయం కావడానికి.

లారీ డ్రైవర్ గోవిందు మొన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చాలా అప్పులు చేశాడు. ఆ భారం భార్య అయిన ఈరమ్మ మీదేసుకుంది.

రమణయ్య తన కొడుకుని అమెరికా పంపించే ఏర్పాట్లలో ఉన్నాడు. ఎన్ని బ్యాంకుల చుట్టూ తిరిగినా పని కావట్లేదు.

సుభానికి పక్షవాతం వచ్చి మంచంలోనే ఉన్నాడు.

నాగిరెడ్డికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్ చేయించడానికి వేలల్లో ఖర్చవుతూ ఉంది. పాపం భారతి బతుకు అప్పుల పాలయింది.

కూలీ నాలి చేసుకుని కూతురు పెళ్లికని దాచిపెట్టిన డబ్బు మొగుడు ఎత్తుకుపోవడంతో కోటమ్మ లబోదిబో మంటుంది.

అంతర్జాతీయ బ్యాట్మెంటన్ పోటీలకి అర్హత సాధించి కూడా డబ్బు లేక ఇంట్లోనే ఉండిపోయింది పాపిగాడి కూతురు స్వాతి.

ఇంకా ఊర్లో చాలామందికి డబ్బుతో చాలా అవసరాలు ఉన్నాయి. కానీ ఎవరూ ధైర్యం చేసి ఒక్క నోటు కూడా ముట్టుకోవడం లేదు.

సమయం తొమ్మిది కావస్తోంది. అందరూ తమ తమ పనుల నిమిత్తం వెళ్ళిపోతున్నారు. మస్తాన్ రెడ్డి, సుశీల బాధపడుతున్నారు.

నలుగురైదుగురు అడుక్కునే వాళ్ళు వచ్చారు. ఒక సాధువు కూడా వచ్చాడు. అడుక్కునే వాళ్ళు చాలాసేపు అక్కడే నిలబడి చూశారు కానీ డబ్బులు తీసుకోలేదు. అక్కడ నిలబడ్డ జనాన్ని నాలుగు రూపాయలు అడుక్కొని వెళ్ళిపోయారు కానీ అక్కడున్న ఒక్క నోటు కూడా ముట్టలేదు. సాధువు మాత్రం ఒక డబ్బు కట్ట తీసుకొని సంచిలో వేసుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చి ఆ డబ్బు కట్టని ఆ రాశి మీద విసిరేసి దండం పెట్టి వెళ్లిపోయాడు.

ఊళ్లో వాళ్ళెవరూ పోలీసులకి సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు డబ్బు దగ్గర ఎవరూ లేరు. ఊరు మొత్తం పనుల్లో మునిగిపోయింది. మస్తాన్ రెడ్డి, సుశీల ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని క్రిందకి దిగి రోడ్డు మీదకు వచ్చారు. బస్సు వచ్చింది. ఎక్కారు.

బస్సులో సుశీల మస్తాన్ రెడ్డిని ఒక మాట అడిగింది. “ఏవండీ ఒక్కరు కూడా ఆ డబ్బు ఎందుకు ముట్టలేదు? అంతమందికి అన్ని అవసరాలు ఉన్నాయి కదా? ఊరికే డబ్బులు తీసుకుపొమ్మన్నా ఎందుకు తీసుకోలేదండి?”

దానికి మస్తాన్ రెడ్డి నవ్వి ఊరుకున్నాడు. ఎందుకంటే మస్తాన్ రెడ్డి చాలా మంచోడు.

నాలుగు సంవత్సరాలు గడిచాయి.

మస్తాన్ రెడ్డి, సుశీల ఊరికి తిరిగి రాలేదు. కానీ వాళ్లు వదిలి వెళ్లిన డబ్బు మాత్రం ఊళ్లోనే ఉండిపోయింది. చెల్లా చెదురుగా, ఊరంతా గాలికి ఎగురుతూ, వానకి తడుస్తూ, ఎండకి ఎండుతూ ఇంకా ఆ ఊర్లోనే తచ్చాడుతుంది.

కానీ ఎవరూ ఒక్క రూపాయి ముట్టలేదు. ఎందుకో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here