మనవడి పెళ్ళి-6

0
3

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘మనవడి పెళ్ళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[గతాన్ని తలచుకుంటూ – పెళ్ళి తరువాత తన అభిరుచులన్ని అణచుకోవాల్సి వచ్చినందుకు బాధపడుతుంది కోమలి. ఇంతలో ఫోన్ మోగుతుంది. కాంతమ్మ అక్కడే ఉన్నా, ఆమె ఫోన్ తీయదు. కోమలి ఫోనెత్తి  కాల్ చేసింది మైత్రేయి అని తెలిసి కాసేపు మాట్లాడుతుంది. తన పెద్ద కూతురు వైవాహిక జీవితం సర్దుకుందనీ, ఇప్పుడు గల్ఫ్‌లో భర్తతో ఉంటోందని అంటుంది. పిల్లలు తన భర్త షష్టిపూర్తి వేడుక చేస్తున్నారనీ, మీ ఆయనతో కల్సి తప్పక రావాలని ఆహ్వానించి, కాంతమ్మకి నమస్కారాలు చెప్పమని చెప్పి పెట్టేస్తుంది మైత్రేయి. ఎవరు, నీ పుట్టింటి వాళ్లా, అంత ఆనందంగా ముఖం వికసించిందని అడుగుతుంది కాంతమ్మ. కాదు మైత్రేయి అని చెప్పి, మీకు నమస్కారాలు చెప్పమందని చెప్పి ఫంక్షన్‍ సంగతి చెబుతుంది. మీ మామగారికి వచ్చే ఏడు ఎనభై నాలుగు వస్తాయి. ఏడాది పొడుగునా ఉత్సవం చెయ్యవచ్చును, ఈ లోపు కిరణ్ పెళ్ళి చేయాలి అని అంటుంది కాంతమ్మ. సరేనంటుంది కోమలి. భర్త వచ్చాకా విషయం చెబుతుంది. కోమలి, సుబ్బారావు – మైత్రేయి భర్త షష్టిపూర్తి వేడుకకి హాజరవుతారు. చాలా ఘనంగా జరుగుతుంది కార్యక్రమం. కోమలి మరోసారి గట్టిగా ప్రయత్నించి కొడుకు కిరణ్‍కి ఒక సంబంధం కుదురుస్తుంది. వాళ్ళు బాగా ధనవంతులు, కూతురు సౌందర్యని గారాబంగా పెంచుతారు. పెళ్ళి అయ్యాకా, కిరణ్ వాళ్ళతో పాటే ఉంటాడు. కాంతమ్మకి నచ్చకపోయినా, పెళ్ళి ముఖ్యమని ఊరుకుంటుంది. కోమలి, సుబ్బారావు, వియ్యంకులు బాగా కలిసి మెలసి ఉంటారు. – ఇక చదవండి.]

అధ్యాయం-13

[dropcap]“పె[/dropcap]ద్దల పెంపకం సవ్యంగా ఉండాలి.

మనవల అభివృద్ధికి ఎన్ని కోట్లు ఇస్తున్నాము అని కాదు, మనవలను ఎలా పెంచాం అన్నది ముఖ్యము.

నేడు ఏ కాలేజీ ముందు చూసినా పిల్లలకి కారు స్కూటర్ ఇచ్చి పంపుతున్నారు. సైకిల్ అసలు లేనేలేదు. అటెండర్లు సహితము స్కూటర్లు వేసుకుని వస్తున్నారు. రెడీమేడ్ షాపులకి వెడితే వెయ్యికి తక్కువ బట్టలు గౌన్లు లేవు. ఎల్.కె.జి. డగ్గర నుంచి లక్షల ఫీజ్ కురిపించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా పిల్లల్ని కంటే ఎలా?

ముందు చదువుల కోసం, బిడ్డ పుట్టే ముందరే ఓ పాతిక లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. లేకపోతే కాంతమ్మ లాంటి బామ్మ ఉండాలి” అంటూ కోమలి వియ్యాలవారు వెక్కిరించారు.

మనవడి ఇద్దరు పిల్లల్ని చూసి మురవడం కాంతమ్మ వంతు అయింది. ముద్దుగా ముచ్చటగా చూడటం వరకే. పెంపకం అంతా వాళ్ళ ఇష్టమే.

సౌందర్య పిల్లలు సౌందర్యంగా ఉన్నారు. ఇలా ఎన్నో కుటుంబాలలో పెద్దల పెత్తనం వల్ల పిల్లలు నలిగిపోయి జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెద్దలు కూడా పిల్లల మాటలు వినాలి.

జీవితంలో నాటకంలో ఎన్నో భావాలు, భాగాలు. నానాటి బ్రతుకు నాటకము అంటూ పుట్టుట గిట్టుట నిజము అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో చెప్పినట్లు మానవ జీవితంలో ఎందరినో మాటలు రకరకాల పెంపక సమస్యలు.

కోడళ్ళు ఎదురు చెప్పకూడదు. అత్త ఇంట పెత్తనం ఎందరో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని ఎంతో తెలివిగా ఎదుర్కొని కుటుంబాలు నిలుపుకునే అవసరం నేటి క్లిష్ట పరిస్థితిల్లో ఎంతైనా అవసరం ఉంది.

మీరు ఏమంటారు?

కోమలి జీవితంలో మార్పు వచ్చింది.

మనవడు పెళ్ళాన్ని చూసి కాంతమ్మ మురిసి పోయింది. అంతే కాదు సహస్ర చంద్రోదయం ఎప్పుడు అని అడిగింది. మనవడి పెళ్ళితో కాంతమ్మ ఆనందం చెందింది.

అంతేకాదు “నా కోడలు నాకు ఎలా కావాలంటే అలా వింటుంది. కావాలన్న సరుకు కొడుకు తెస్తే కోడలు వండి పెడుతుంది” అంటూ వియ్యరాలు దగ్గర పొగిడింది.

‘చాలు తన పరువు కాపాడింది’ అనుకుంది కోమలి.

అధ్యాయం 14

కొడుకును ఇప్పటికీ చంటి పిల్లాడు మాదిరి చూస్తుంది కాంతమ్మ.

“కోమలి ఎక్కడ ఉన్నావు? సుబ్బు వచ్చాడు. మంచినీళ్ళు పట్టుకురా!” అంది.

“సుబ్బు పెట్టెలో డబ్బు ఉన్నది. పట్టుకురా!” అని చెప్పింది.

అది కోమలికి ‘సబ్బు పెట్టెలో డబ్బు’లా వినిపించింది.

‘సబ్బు పెట్టెలో డబ్బు ఏమిటి? అందులో అత్తగారు కొత్త మేజిక్ ఏం చేసింది? ఈ మధ్య టి.వి.సీరియల్స్ చూసి లాజిక్ లేని మాటలు అంటోందా!’ అనుకుంది.

“మళ్ళీ చెప్పండి అత్తయ్యా” అంది.

“ఏమిటి నీకు ఇంకా వినపడలేదా? కోడలు వచ్చిన ఆనందంలో పధ్యానంగా ఉంటున్నావు” అన్నది కాంతమ్మ.

“లేదండీ మీరు కొత్తగా చెప్పిన విషయం సబ్బు పెట్టెలో డబ్బు..”

“సుబ్బు గాడి పెట్టెలో డబ్బు పెట్టాడు. తీసుకో అన్నాడు. నువ్వు తెస్తావులే అని చెప్పాను” అంది కాంతమ్మ.

***

ఇక్కడ కోమలి మామగారి విషయం చెప్పాలి.

ఆయన మహా మేధావి. అరవైకి షష్టిపూర్తి వద్దు అంటూ.. డెబ్బయిఐదులో అమృత ఉత్సవాలు చేసుకుంటున్నాడు. అప్పుడే అత్తగారు పట్టు పట్టి నందికేశుడి నోము నోచుకుని అన్ని రకాల దినుసులు వండించి నోము పూర్తి చేసింది.

ఉండ్రాళ్ళు, పులగం, గారెలు, అప్పాలు, అట్లు, శనగలు, పరమాన్నం, చిమ్మిలి, చలివిడి ఇలా తొమ్మిది రకాల పిండి వంటలు వండించి గడప దాటకుండా సూర్యాస్తమయం లోపు పెట్టి తినమనాలి.

కోమలి అత్తగారికి పన్నెండు లోపు అయిపోయింది.్!

కొందరు ఆఫీస్ వాళ్ళని కార్లో తీసుకు వచ్చి, కొందరికి వ్యాన్ పంపి కుటుంబ సమేతంగా మరికొందరును పిలిచి వారికి ఆటోలు పంపి చక్కగా నోము పూర్తి చేశారు.

కోమలి పిన మామగారు మహా తెలివితో అందర్ని ఆకట్టుకుని రిటైర్ వచ్చాక పెళ్ళాన్ని నోములు నోచమని; ఆవిడతో పాటు వదిన గారు అంటే కోమలి అత్తగారు చేత కూడా అన్ని చేయించాడు.

కైలాస గౌరీ దేవి నోము అర్థబలం ఉన్నా సరే అంగ బలం ఉండాలి. పూనుకుని చెయ్యాలి.

పదిమందిని పురమాయించి చక్కగా పసుపు, పారాణి గంధం, కుంకుమ బొట్టు అన్ని పెట్టేలా పురమాయించారు.

ఒకళ్లు గాజులు, ఒకళ్ళు పువ్వులు, ఇంకొకళ్ళు కొబ్బరి బొండాం, ఒకళ్ళు రవికెల ముక్క పెట్టి సంచులు అందించడానికి, కూల్‌డ్రింక్స్, కాఫీ అందరికి అందేలా ఏర్పాటు చేశాడు.

నోము పుచ్చుకున్న వాళ్ళు అంతా కూడా టిఫిన్ తిని వెళ్ళాలి, దూరం వారికి బంధువులకు భోజనాలు ఏర్పాటు చేశారు. పెన్నెండు లోపు నోము పూర్తి అయ్యింది.

సహాయం చేసిన పేరంటాళ్ళకు ఉప్పాడ జరీ చీర, ఐదు వందలు దక్షిణ పెట్టి సంతృప్తిపరచడము వల్ల వాళ్ళు చాలా ఆనందం చెందారు.

“మేము పుణ్యానికీ చేశాము అన్నా సరే పుణ్యం పురుషార్థం ఉండాలి” అన్నాడు మామగారు.

మరి అదే సిటీ తెలివి, ఏదో కొంచెం ఖర్చుతో అత్తగారు నోములు పూర్తి అయ్యాయి.

ఇంకా సహస్ర చంద్రోదయం కూడా అన్నదమ్ములు ఆవిడ చెల్లెలు మరిదితో కలిసి సంప్రదించి ఘనంగా చేశారు.

“అక్కా, మన టైమ్లో ఎన్ని అలంకరణలు లేవు. ఇప్పటి ఆధునిక తరంలో పువ్వులు దీపాలు వీడియోలు కొత్త వంటలు అన్నీ వచ్చాయి” అంటూ ఆనందంగా కార్యక్రమం చేశారు. కాంతమ్మ కోరిక నెరవేరింది.

కూతుళ్ళు లేకపోయినా చల్లెలు కూతురు మాదిరి అన్నీ కూడా ఎంతో బాగా చేస్తుంది. అసలు ఖర్చుకి వెనుకాడరు.

“అవసరం వచ్చినప్పుడే ఖర్చు పెట్టాలి. మళ్ళీ మళ్ళీ ఈ బంధువులు వస్తారా! ఏమిటి.

చెప్పండి. ఇప్పుడు వచ్చారు ఘనంగా అన్నీ చూసుకోవాలి” అంటుంది. నందికేశుడు నోము ఇద్దరికి ఒకసారి చెప్పిందంటే ఎంత ఘనత?

ఒక్కొక్కరికి ఐదు, సిరుల సరుకు ఉండాలి. అంటే ఐదు కేజీల కాని ఇంకో కేజీ కలిపి వండిస్తారు. మినపపప్పు శనగలు బియ్యపు రవ్వ, బియ్యం బియ్యం ఇలా అన్నీ కూడా ఐదు పేరులు సరుకుతో వండించి పరేయ్య కుండా అంతా చక్కగా తినాలి.

అంతేనా ఒక్కొక్క ఇంటికి పదివేలు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాలి. వండేవారు వడ్డించే వారు అంతా ఉండాలి. చివరలో పండు తాంబూలం దక్షిణ పూలు పళ్ళు ఇస్తారు. అక్షింతలు వేయించుకుని దీవెన పొందుతారు. ఇలా పెద్ద నోములు అందరికీ కుదరవు.

ఆర్థిక బలం ఉంది, కనుక కాంతమ్మకి అన్నీ కుదిరాయి. అలాగే అంతా దగ్గర ఉండి సహస్ర చంద్రోదయం అద్భుతంగా నిర్వహించారు. అంతా ఆనందించారు.

ఇంకా కిరణ్ అత్తవారి బలగం కూడా వచ్చింది. వాళ్ళు చాలా బాగా సంతోషించారు.

ఇలాంటి వేడుకలు ఎవరో కానీ చేసుకోరు.

అన్ని పూర్తి అయి స్థిమిత పడేటప్పటికి ఆషాడం రానే వచ్చింది. ఇంకా కోడలు ఎప్పుడు వేరేగా – అమ్మనాన్న ఇంట్లోనే లేక వాళ్ళ సొంత ఇంట్లోనో ఉంటుంది. కనుక ఇబ్బంది లేదు.

ఆషాడ పట్టి తెస్తున్నాం అని వాళ్ళు ఫోన్ చేశారు. కోమలి అత్తగారికి చెప్పింది.

“ఏమిటి ఇంకా ఈ వేడుక చేస్తున్నారా! కోమలీ నువ్వు అడిగినప్పుడు ఏదైనా అన్నారా!”

“నేను అడగలేదు వాళ్ళే తెస్తున్నారు” అన్నది కోమలి.

“నీకు మీ వాళ్ళు ఏదో ఉంగరం కొత్త బట్టలు పరిపెట్టారు. అడిగినవి ఇవ్వలేదు. మరి నీ కొడుక్కి ఏమి తెస్తున్నారో!”

“నేను ఏమీ అడగలేదు. నా కొడుక్కి అన్నీ మీరే పెట్టారు కదా! అయినా వేడుక కనుక వద్దు అని అనలేదు” చెప్పింది కోమలి.

***

ఆ రోజు ఐదు గంటలకే ఈవెంట్ వాళ్ళు వచ్చి పచ్చిపూలతో పెళ్ళికి అలంకరించిన మాదిరి పూలు దండలు అలంకరించి చక్కగా పూల మండపం కట్టి సన్మానం సోఫా వేశారు.

కాంతమ్మ ఆశ్చర్యపోయింది.

ఇప్పుడు ప్రతి ఫంక్షన్‌కి ఇంటిని ఎంతో బాగా అలంకరణ చేసి బాగా ఫోటోలు, వీడియోలు కనువిందుగా తీస్తున్నారు.

మళ్ళీ చిన్నగా పెళ్ళి వేడుకగా చేస్తున్నారు. తెలుసున్న వారిని పిలిచి తాంబూలం ఇప్పించారు.

ఖర్చు అంతా ఆడపిల్ల వారే పెట్టుకున్నారు.

ఆ రోజు ఏకాదశి అంటే తొలి ఏకాదశి ఇంటిల్లి పాదికి బట్టలు పట్టుకు వచ్చారు.

పిల్లాడికి రాళ్ళ బ్రాస్‌లెట్, మళ్ళీ శ్రీ వేంకటేశ్వర స్వామి ముద్ర ఉ న్న ఉంగరము కొత్త సూటు తెచ్చారు. పిల్లని పిల్లాడిని అలంకరించి మండపంలో సన్మానం కుర్చీలో కూర్చోపెట్టి అందించి దీవించారు. ఏదైనా మనిషికి ఆసక్తి కళాత్మకత ఉండాలి.

ఆషాడ మాసం అద్భుతంగా జాలీగా గడిచింది.

***

ఆఫీస్ నుంచి వచ్చి కిరణ్ భార్యతో “సాయంత్రం ఇద్దరం బయటికి వెళ్ళి అక్కడే హోటల్‌లో భోజనం చేసి వచ్చేద్దాం” అన్నాడు.

ఉద్యోగానికి సెలవు ఇవ్వరు వేరే ఊరు వెడదాము అంటే, ఎంత డబ్బు ఉన్నా ఉద్యోగం మానవ ధర్మం కదా!

శ్రావణం మొదలు మబ్బులు చిరుజల్లులు. ఆకాశంలో దట్టంగా మబ్బులు. జరీ అంచుల మాదిరి సూర్య కిరణాలు అక్కడక్కడ మెరుస్తూ ఉన్నాయి.

ఆ మార్పులు చేర్పులు ఆలోచనలు తలపులు అన్నీ ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి.

కోడలు సౌందర్యని కోమలి ఎంతో బాగా చూసుకునేది. ఆమె ఎంత అంటే అంత. “శ్రావణ తగు ఏమీ ఇవ్వమంటావు? నీకు నచ్చిన వస్తువు కొనుక్కో” అన్నది కోమలి.

కోడలు నవ్వింది.

కిరణ్ మాత్రం “అమ్మా వాళ్ళు అన్ని ఆరేంజ్ చేస్తున్నారు. మీరు వచ్చి అందివ్వడమే” అన్నాడు.

“మరి సుమంగళి వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం కదా! నీ ఆయుష్షు కోసం సౌభాగ్యం కోసం చేసేది నాయనా అందుకు మనమే పెట్టుకోవాలి” అన్నది.

“మా అత్తగారు మాట్లాడుతారు” అన్నాడు.

“సరే ఇవ్వు ఫోన్” అన్నది కోమలి.

ఆవిడ ఫోన్ అందుకుని “వదిన గారు మీరు మేము అనే బేధం మాకు లేదు. ఒక్క కూతురు. దాని ఇష్టమే మా ఇష్టం. కనుక మీరు ఎంత ఖర్చు పెట్టాలి అనుకుంటే అంతే ఇవ్వమంది. మిగతావి మేము చూసుకుంటాము. మా వాళ్లని భోజనానికి పిలుస్తాము.

మీరు కూడా మీకు కావాల్సిన వారిని పిలవండి” అన్నారు.

కోమలి మనస్సు ఒక ప్రక్క చివుక్కుమన్నా తన కొడుకు మంచి ఇంటిలో పడ్డాడు అనుకున్నది.

శ్రీ వరలక్ష్మీ వ్రతం అంతా ఎంతో ఘనంగా జరిపించి భోజనాలు పెట్టారు.

“కోమలి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, మంచి పూజ చేశావు, నేను పెంచాను కనుక నా మనుమడు అదృష్టవంతుడు” అన్నది కాంతమ్మ.

సౌందర్య పేరుకి తగ్గట్టే ప్రతి పనిలోను సౌందర్యంగా ఉండాలి అంటుంది. కాలక్రమంలో సౌందర్య ఒక కూతురు కొడుకుకి తల్లి అయ్యింది. ఇంక ఇక్కడ కాంతమ్మ పెత్తనం లేదు.

కోమలి కోడలికి అనువుగా ఉంటుంది. మనుమలని కోడలు ఎలా చెపితే అలా పెంచుతుంది.

మనవడికి కూతురు పుట్టినందుకు కొంచెం బాధపడినా, తరువాత మగపిల్లాడు పుట్టాడు. కనుక ఆనందించింది కాంతమ్మ. ఇద్దరికి బంగారు వస్తువులు చేయించి ఇచ్చింది. అంతే కాదు, బంగారు ఉగ్గు గిన్నె, వెండి పాల సీసా పురిటి ఇంట్లోనే ఇచ్చింది. పురిటి నీళ్లనాడే బాలసార ఘనంగా చేశారు. అంతా వచ్చి దీవించారు.

ఈ గొప్ప అంతా నాదే అని కాంతమ్మ మురిసిపోతుంది. పిల్లకి లక్ష్మీపద్మ కాంతి అని, పిల్లాడికి శ్రీనివాస చరణ్ అని పేరులు పెట్టారు. సంతృప్తి పడింది కాంతమ్మ.

మనవడు పెళ్ళికి పడ్డ అలసట కాస్త తగ్గిపోయింది. ఆనందం వచ్చింది. హాయిగా మునిమనుమల్ని పెట్టుకుని ‘జో అచ్చుతానంద జోజో ముకుందా.. లాలి పరమానంద రామగోవింద’ అని లాలి పాటలు; శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అలిమేలు మంగ పద్మావతి సంకీర్తనలు పాడుతూ హాయిగా జీవితం గడుపుతోంది.

శ్రీ వినాయక పూజలు సరస్వతి పూజలు శ్రీ వేంకటేశ్వర దీపారాదన సత్యనారాయణ వ్రతం నోములు పూజలు వివరాలు వీలున్నప్పుడల్లా అన్నిటి గురించి సౌందర్యకి చెపుతుంది “వింటున్నావా?” అంటుంది కాంతమ్మ.

“ఆఁ అమ్మమ్మ గారు” అంటుంది సౌందర్య.

వృద్ధులకు ఇంత కన్నా ఏమి కావాలి?

శుభము, శాంతి.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here