[మాయా ఏంజిలో రచించిన ‘Through the inner city to the suburbs’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(నగరం నుంచి బయటకు ప్రయాణించే రైలు ప్రయాణపు అనుభవాలను కొంతమేర కళ్ళకు కట్టిన కవిత!!)
~
[dropcap]మ[/dropcap]సి బారిన దృఢమైన కిటికీల్లోంచి
చూస్తుంటే.. ఎంతో ఆశ్చర్యం
కేక్ కంపెనీ నుంచి దొంగిలించి తెచ్చిన
ఈ హిమతుషారం
అబ్బ.. చాలా రుచిగా ఉంది
నల్ల ప్రజలు వేగంగా కదుల్తున్నారు
వేసవి వీధుల్లో, చెల్లాచెదురైన
పుచ్చపండు గింజలు
అలవాటుగా నవ్వుతూ
ఆడంబరంగా, విశృంఖలంగా
నెమ్మదిగా కదుల్తున్న రైలులోంచి
కనిపిస్తున్నవన్నీ వెల లేనివి
దొంగిలించిన రత్నాలు అమ్మలేవు ప్రియతమా
ఉప్పొంగే సంధ్యా సమీరాలు
అడవిలోని చెమటరాత్రులు
వాన నృత్యాలు, నలుపు తొడల తడి రహస్యాలు
చక్కని దృశ్యమాలిక రూపొందుతోంది
కిటికీ పక్కనుంచి దూరంగా జరగకు
బయటదంతా భేషుగ్గా కనిపిస్తోంది
దుస్తులు మార్చుకునే గదుల చెత్తకబుర్లు
మరుగుదొడ్లలో తడి తువ్వాళ్ళ
టాయిలెట్ సీట్ల చప్పుళ్ళు
నేతల రాజకీయ లోకాభిరామాయణం
కొందరు తల్లిదండ్రులు
పిల్లలకు బూట్లు కొనాలని
వాళ్ళకో పరిశుభ్రమైన
ప్రత్యేక స్నానశాల ఇవ్వాలని
మాట్లాడుకుంటున్నారు
ఆకుపచ్చని పచ్చికబయళ్ళకు పక్కగా
డబుల్ గ్యారేజీల పైనుంచి
నీరసించిన స్త్రీలున్న దుర్భరమైన ఇండ్ల పక్కనుంచి
తనకు అలవాటైన మార్గంలో
వేగంగా పరిగెడుతోంది రైలు
నల్లగా నర్తించే
పొగమేఘాల ఆకృతులను
ఆకాశంలోకి వదులుతూ
నవ్వుతూ దూసుకెళ్తుంది రైలు
నవ్వుతూ..
ఇంకా.. నవ్వుతూ..
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ