తల్లివి నీవే తండ్రివి నీవే!-15

1
3

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

జ్ఞానం పరమగుహ్యం

[dropcap]భీ[/dropcap]ష్ముడు ఎనిమిది రోజులు తపస్సు లాగా విశ్వం అనే నామాన్ని స్మరించి, సమయం వచ్చినప్పుడు ఆ పదాన్నే తొల్తగా ఉచ్చరించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్క క్షణం అలా యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆ రెప్పపాటు కాలంలోనే అక్కడ ఉన్న అందరికీ ఒక మాటలకందని అపూర్వమైన అసమాన సౌందర్య శోభితమైన అనుభూతి కలిగింది. అదే అనుభవం శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసే సందర్భంలో హరిః ఓమ్ అని పలికాక విశ్వమ్ అని ఒక్కసారి అంటే కలుగుతుంది. కలగాలి కూడా మనకు.

ఏదైనా మన్త్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ సంపూర్ణంగా అవగాహన చేసుకుని, లేదా అర్థమన్నా తెలుసుకుని చదివితే ఫలితం చాలా అధికంగా ఉంటుంది. కారణం ఆ స్తోత్రం లేదా మన్త్రం వర్ణించిన దేవతా స్వరూపం మన ముందు పూర్తి స్థాయిలో ఆవిష్కృతమౌతుంది కనుక.

శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసే వారికి ఇలా చేయాలి అలా చేయాలి అని ప్రత్యేక నియమాలు లేవు కానీ, ఏ మన్త్రమైనా, ఏ స్తోత్రమైనా కామ్యార్థం చేసే సమయంలో ఆ దేవతా రూపం (మనం ధ్యానించే) హృదయన్యాసం వల్ల గతంలో చెప్పినట్లు హృదయంలో అధివశించటమే కాక మనం పారాయణం, జపం చేసే చోట వచ్చి నిలుస్తారు. మరి ఉచితరీతిన మనం పరిసరాలను శుచిగా, శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి.

విశ్వమ్!

  1. ద్వైత సంప్రదాయం ప్రకారం

జగత్ ప్రవిష్టమ్ = జగత్తునందు ప్రవేశించిన వాడు (విశ్ – ప్రవేశన ఇతి ధాతుః)

ఏ జగత్తు? ఎక్కడిదా జగత్తు?

అది కూడా ఆ విశ్వ శక్తి సృష్టించినదే. ఇది వేద వాక్కు. పరమాత్మ జగత్తును సృష్టించి, అందులో ప్రవేశించాడు.

ఎందుకు?

ఆ జగత్తుకు శక్తినిచ్చి దానిని నడిచేలా చేసేందుకు.

సర్వత్ర ప్రవిష్టత్వాత్ జ్ఞాన రూపత్వాత్ వా.

అన్నిటి యందు ప్రవేశించిన వాడు. జ్ఞాన స్వరూపుడు.

అద్వైతం ప్రకారం

జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ అన్నిటా ప్రవేశించాడు. అంధకారమయమైన జగత్ అనే మాయను ఆయన వశం చేసుకుని, జగత్తునందు జ్ఞానమనే వెలుగు రూపంలో ప్రవేశించిన వాడు.

ఇది విశ్వమ్.

విశిష్టాద్వైతం ప్రకారం

సాకారమైనా, నిరాకారమైనా, తన సౌలభ్య స్వరూపాన్ని జ్ఞాన రూపంలో మార్చి, జగత్తుకు లేదా సృష్టికి అందించాడు. దానిని తొల్త చూసిన వాడు చతుర్ముఖ బ్రహ్మ.

అందుకే ఈ విశ్వం అనే నామానికి బ్రహ్మ ఋషి.

***

సుమారుగా 1,53,36,00,000 సంవత్సరాల క్రితం.

శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. సర్వం ఆయన అధీనంలోనే ఉన్నాయి. వటపత్రశాయి రూపం ముగిసి, పరమ శాన్త రూపంలో ఆయన ఉన్నాడు. చుట్టూ ఎవరూ లేరు. ఏవీ లేవు. హాయిగా ఆయన చూపు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది.

ఆ ఎక్కడ అన్నది పౌరాణిక వాఙ్మయం కూడా కలుపుకుంటే గట్టిగా ఐదుగురికి తెలుసు. లేకపోతే ఐతిహాసికంగా అందుతున్న చరిత్రలో ఒకేవ్యక్తికి తెలుసు. క్రమంగా ఆయన యోగనిద్ర ముగిసింది. మాయను ఉపసంహరించాడు. అంతలో ఆయన నాభి కమలంలో ఒక శిశువు. కళ్ళు తెరిచాడు. ఏమీ కనపడలేదు. ఏమీ అర్థం కాలేదు.

బేర్మన్నాడు. కంట నీరు. అది కన్నుల జారి క్రమంగా క్షీర సాగరంలో పడింది. దాని మీద పడి గడ్డ కట్టిందా కన్నీటి చుక్క. ఆ నిశీధి వాతావరణంలో. శ్రీమహావిష్ణువు రెండు కన్నుల నుంచీ మాత్రమే వెలుగు. మిగిలినదంతా చీకటి. క్రీరసాగరం తప్ప మిగిలినదేదీ ఉష్ణోగ్రతకు అతీతం కాదు.

ఆ గడ్డకట్టిన కన్నీటి బిందువు క్షీరసాగరం అలల వల్ల ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. అక్కడే

క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేర్మౌక్తికానాం

ఒక ముత్యంలా మారింది. దాని సంగతి తరువాత చూద్దాం. ఆ నాభి కమలంలో వికసించిన శిశువు చూస్తుండగనే (ఎవరు? – సాక్షీ! అదికూడా శ్రీమహావిష్ణువే – నిర్వికారంగా) పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ శిశువే బ్రహ్మ. నాలుగు వైపులా చూడలేదు. నాలుగు దిక్కులా ఉన్నది గ్రహించాడు. తనకేమీ అవగతం కాలేదని అవగతమైంది. ఆ అవగతం కానిది, ఆ అవగతం కానిది అవగతం కాలేదని అవగతమైనది – రెండు ఒకటే అని జ్ఞానం కలిగింది. అయినా తానెవరు? ఎక్కడి నుంచీ వచ్చాడు? ఎవరి/దేని నుంచీ వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎవరు పిలిపిస్తే వచ్చాడు? ఎందుకు పిలిపించారు?

ఏవీ అర్థం కాలేదు. కానీ ఒకటి తెలిసింది. ఇవన్నీ ఒకటే. ఇది తెలియగానే ఆయన జ్ఞాన చక్షువు తెరచుకుంది.

అప్పుడు ఒక దివ్యమైన వెలుగు ఆయనకు గోచరించి సృష్టి చేయమని చెప్పింది.

మరల ఆ సృష్టి ఎలా చేయాలో తెలియలేదు. ఆ విషయం కూడా ఆయనకు అర్థమైంది. ఇది అర్థమవగానే ఆయనకు ఆ కాన్తి నుంచే సూచన అందింది. అక్కడ చూడు అని.

క్షీర సాగరంలో చూస్తే ఏవో అక్షరాలు. అవి కూడా ఆ ఒకటిలో ఒకటే అని తెలుసుకున్నాడు. ఆ అక్షరాల వల్ల కలిగిన ఆలోచన

॥తపః॥

బ్రహ్మ తపస్సు చేయనారంభించాడు. ఆ తపస్సు వల్లే ఆయనకు అక్షర స్వరూపుడైన పరబ్రహ్మ గోచరించాడు.

ఆయన గ్రహింపుకు, నిశ్చల తపస్సుకు మెచ్చిన ఆ పరబ్రహ్మ 132 శబ్దాల ద్వారా పరబ్రహ్మ తత్వం అవగతం అయ్యేలా చేశాడు.

అదే చతుః శ్లోకీ భాగవతం. చెప్పినది పరబ్రహ్మ. విన్నది బ్రహ్మ.

॥ శ్రీ భగవానువాచ ॥

జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితమ్।

సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా॥

యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః।

తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్॥

॥ శ్రీ భగవానువాచ॥

ఇప్పుడు నీకు వినిపిస్తున్నది అత్యంత రహస్యమైనది. అలవికాని అనుభూతితో కూడుకున్నది. అనుభవంతో కూడిన విషయం. ఇచట అంతా, అన్నీ, నీవు, నేను, ఈ సాగరం, ఆ కన్నీటి ద్వారా క్షీర సాగర స్పర్శలో ఏర్పడిన ముత్యం, ఆ సైకతం, దానిలో ఉన్నవి, దానిలో లేకున్నను నీవు ఉన్నవని అనుభూతించగలిగినవి అన్నీ ఒకటే అని నీవు గ్రహించావు.

ఇలా పలుకుతుండగనే ఆ ముత్యం నుంచీ ఒక శిశువు ఉదయించాడు. ఆ శిశువుకు ఏమీ అర్థం కాక రోదించింది. ఆ శిశువే శివుడు కాబోతున్న రుద్రుడు. రోదన చేయటం వల్ల రుద్రుడయ్యాడు.

గ్రహించావు కనుక సృష్టించగలవు. అందులకు అవసరమైన జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తాను.

ఇలా పలికి నాలుగే శ్లోకాలలో, 132 శబ్దాలలో పరమాత్మ స్వరూప స్వభావాలు అవగాహన చేసుకునేలా బోధించాడు.

అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్।

పశ్చాదహం యదేతచ్చ యోఽవశిష్యేత సోఽస్మ్యహమ్ ॥ 1 ॥

నీవు గ్రహించినట్లు గానే నీవు చేయబోయే సృష్టి జరుగటానికి ముందు నేను ఇక్కడే ఉన్నాను. ఆ కార్యం జరిగే సమయంలో కూడా నేను ఇక్కడే ఉంటాను. జరగటం ముగిశాక కూడా ఇక్కడే ఉంటాను.

ప్రకృతిని సృష్టించినది నేనే. దానితో మీకు అనుసంధానం ఉన్నంత వరకూ ఆత్మ స్వరూప జ్ఞానం నీకు వంట పట్టదు. ఆత్మ స్వరూప జ్ఞానాన్ని అనుభవించే సమయంలో ప్రకృతిని గూర్చిన ఆలోచనలు రావు. ఈ వైరుధ్యమే నా అసలు స్వరూపము. తత్వము. వైచిత్ర్యము.

That’s how static energy announced its existence through parmaatma.

ఋతేఽర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని।

తద్విద్యాదాత్మనో మాయాం యథాఽఽభాసో యథా తమః ॥ 2 ॥

యథా మహాంతి భూతాని భూతేషూచ్చావచేష్వను।

ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహమ్ ॥ 3 ॥

ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త్వజిజ్ఞాసునాఽఽత్మనః ।

అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్సర్వత్ర సర్వదా ॥ 4 ॥

ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా ।

భవాన్కల్పవికల్పేషు న విముహ్యతి కర్హిచిత్ ॥ ॥

నేను ఇచట, ఇచటకు వెలుపల, నీవు చేయబోయే సృష్టిలో, సృష్టి అవతల, నీవు సృష్టించే జీవులలోను, ఆ జీవుల వెలుపలా (నారాయణ తత్వం), వీటితో కలిసి, వీటికి వెలుపల స్వతంత్ర్యముగా ఉంటాను.

నీవు నా పై దృష్టి నిలిపినంత కాలం ఈ అవగాహన అన్నది నీలో నిలుస్తుంది. వీత రాగాలకు, అహంకార, మమకారాలను నీ దరిచేర నీయదు. (అద్వైత స్థితి)

ఈ విధంగా తను నింపిన జ్ఞాన కాంతి వల్ల బ్రహ్మ చుట్టూ ఉన్న సృష్టి కార్యమునకు అవసరమైన విజ్ఞానం వేదాల రూపంలో అందింది.

ఈ జ్ఞాన కాంతిని ప్రసరింపజేయటమే (తన కరుణ వల్ల) విశ్వమ్!

విశ్వాయ ఇతి నమ ఓమ్!

ఎనిమిది అక్షరములు. అనుష్టుప్ అనే ఛందస్సు లో ఒక వంతు. అందుకే ఇది విశ్వ ఛన్దస్ అయింది. 32 అక్షరాలు నాలుగు పాదాలలో.

ఈ విశ్వశక్తి అందించిన పరమాత్మ సారం కూడా 4×32 = 132 శబ్దాలు మాత్రమే. నాలుగు శ్లోకాలు కలిపి. అదే చతుః శ్లోకీ భాగవతం.

ఈ ప్రసరించినది, తద్వారా వ్యాపించటమే విష్ణువు.

ఓమ్ విష్ణవే నమః

The Kinetic energy in its purest form.

Till this point, the universe is nothing but a form of energy.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here