[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
పొద్దే రాని లోకం నీది
~
చిత్రం: గోకులంలో సీత
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం : కోటి
గానం: చిత్ర
~
పాట సాహిత్యం
పల్లవి:
పొద్దే రాని లోకం నీది
నిద్రే లేని మైకం నీది
పాపం ఏ లాలి పాడాలి జాబిలి
అయినా ఏ జోల వింటుంది నీ మది
వేకువనైనా వెన్నెలనైనా చూడని కళ్ళే తెరిచేలా
ఇలా నిను లాలించేదా లేలేమ్మని..
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మెల్లగా చల్లగా మేలుకో నేస్తమా ॥పొద్దే రాని లోకం నీది ॥
చరణం:
ఎన్నో రుచులు గల బ్రతుకుంది
ఎన్నో ఋతువులతో పిలిచింది
చేదొక్కటే నీకు తెలిసున్నది
రేయొక్కటే నువ్వు చూస్తున్నది
ఉదయాలనే వెలి వేస్తానంటావా
కలకాలమూ కలలోనే ఉంటావా
నిత్యమూ నిప్పునే తాగినా తీరని
నీ దాహం తీర్చే కన్నీరిది
మిత్రమా మిత్రమా మైకమే లోకమా మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా ॥పొద్దే రాని లోకం నీది ॥
చరణం:
నీలోచూడు మంచి మనసుంది
ఏదో నాడు మంచు విడుతుంది
వాల్మీకిలో ఋషి ఉదయించినా
వేమన్నలో భోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా
మలినాలనే మసిచేస్తూ మండేలా
అగ్నిలో కాలినా స్వర్ణమై తేలదా
నిను తాకిందేమో ఈ వేదన
మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా ॥పొద్దే రాని లోకం నీది ॥
♠
“కలిమి నిలవదు, లేమి మిగలదు కలకాలం ఒకే రీతి గడవదు..
నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా.. వాడిన బ్రతుకే పచ్చగిల్లదా
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము..”
అంటూ భుజంగరాయశర్మ, రంగులరాట్నం చిత్రంలోని ఒక పాట ద్వారా నిస్పృహలో ఉన్న మనసులను కూడా తట్టి లేపేలాంటి ఓ ఆశావహ గీతం రాశారు.
జీవిత పయనంలో అయినా, ఓ గెలుపును సాధించడంలో అయినా, ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వారు నిరాశను ఎదుర్కోవాల్సిందే. కానీ ప్రకృతి నియమం ఏంటంటే, ఈ సృష్టిలో ఎవరు దేనికై నిర్దేశింపబడ్డారో.. వారి ప్రమేయం లేకుండానే దాని వైపు వారు సాగిపోతారు; నిజానికి విశ్వమే మనల్ని ఆ బాట వైపు నడిపిస్తుంది! ఆ పోరాటంలో జయాలు- అపజయాలు, ఆశలు-నిరాశలు, అన్నీ ఉండొచ్చు. Great stories of success, are also great mirrors of failure. కాబట్టి జీవితంలో పతనమైన వ్యక్తులు, మళ్లీ ఉన్నతిలోకి రాలేరు.. అన్నది సత్యం కాదు. అలాంటి స్థితిలో ఉన్నవారికి ప్రేరణ కలిగించడానికి యథార్థ జీవిత గాథలు, కొటేషన్లు, పాటలు, కవితల వంటి అంతులేని సాహిత్యం ప్రపంచమంతా అందుబాటులో ఉంది. వాడిన పూలు వికసించనూ వచ్చు, వాడిన బ్రతుకులు పచ్చగిల్లనూ వచ్చు. మార్పు సర్వసాధారణ ప్రకృతి నియమం.
The Song of the Potter అనే ప్రఖ్యాతమైన కవితలో Henry Wadsworth Longfellow.. మార్పు చాలా సహజమైనదని, ఒక కుమ్మరి చక్రం లాగా నిరంతరంగా ఒక రూపం నుండి మరొక రూపానికి మారుతూనే ఉంటుందనీ, ఏదీ దాని నుండి తప్పించుకోలేదని అంటాడు.
Turn, turn, my wheel! All things must change
To something new, to something strange;
Nothing that is can pause or stay;
The moon will wax, the moon will wane,
The mist and cloud will turn to rain,
The rain to mist and cloud again,
To-morrow be to-day.
~
కోకొల్లలుగా తెలుగు సినీ గీతాల్లో వినిపించే ఇలాంటి ప్రేరణాత్మక, సందేశాత్మక పాటలు మన హృదయాల్లో నిరంతరంగా మారుమోగుతూనే ఉంటాయి. సంకల్ప బలం ఉంటే, మారిపోని కథలే ఉండవని అలాంటి పాటల మనకు ఉపదేశం చేస్తాయి. అదే కోవలో, ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎన్నడూ కోలుపోవద్దురా ఓరిమి…’, వంటి సానుకూల దృక్పథాన్ని చాటే అగ్ని జలపాతం లాంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైన పాటలను రాశారు సిరివెన్నెల.
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి అతిగారాబంతో విలాసాలకు అలవాటుపడి, తాగుడు వంటి వ్యసనాలకు బానిసై, విశృంఖలంగా ప్రవర్తిస్తుంటాడు కథానాయకుడు, కళ్యాణ్ (పవన్ కళ్యాణ్). అతనికున్న బలహీనతల్లో ఒకటి, అమ్మాయిలను లొంగదీసుకోవడం. అదే తరహాలో కథానాయికైన, మంచి విలువలు కలిగిన శిరీషను(రాశిని) కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతాడు, కళ్యాణ్. అనుకోని పరిస్థితులలో, హీరో ఇంట్లో తలదాచుకున్న హీరోయిన్, అతని మనస్తాపానికి తాను కారణం అని బాధపడుతుంది. అతని వ్యవహార శైలిని మార్చుకోమనీ, జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకోమనీ సూచన చేస్తూ పాడే ఒక నేపథ్య గీతాన్ని ఎంతో సందేశాత్మకంగా అక్షరీకరించారు సిరివెన్నెల. హీరో పాత్రను ఉద్దేశించి రాసినట్టు అనిపించినా.. నిజానికి ఇది కూడా సమాజంలో ఎందరికో ఉపయోగపడే ఓ ప్రబోధాత్మక గీతం. ఇక పాట విశ్లేషణలోకి వెళ్దాం.
పొద్దే రాని లోకం నీది
నిద్రే లేని మైకం నీది
పాపం ఏ లాలి పాడాలి జాబిలి
అయినా ఏ జోల వింటుంది నీ మది
వేకువనైనా వెన్నెలనైనా చూడని కళ్ళే తెరిచేలా
ఇలా నిను లాలించేదా లేలేమ్మని..
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మెల్లగా చల్లగా మేలుకో నేస్తమా
Arise, Awake అని స్వామి వివేకానంద పిలుపునిచ్చినట్టు, తాగుడుకు బానిసైన కల్యాణ్‌ను, ఆ మత్తు వదిలి బయటికి రమ్మని, పొద్దులూ, హద్దులూ తెలుసుకోమని, మైకమే లోకంగా బతకొద్దు మిత్రమా! అంటూ అతనిలో చైతన్యం తీసుకురావడానికి శిరీష చేసే ప్రయత్నాన్ని సూచిస్తుంది పల్లవి.
ఎన్నో రుచులు గల బ్రతుకుంది
ఎన్నో ఋతువులతో పిలిచింది
చేదొక్కటే నీకు తెలిసున్నది
రేయొక్కటే నువ్వు చూస్తున్నది
ఉదయాలనే వెలి వేస్తానంటావా
కలకాలమూ కలలోనే ఉంటావా
నిత్యమూ నిప్పునే తాగినా తీరని
నీ దాహం తీర్చే కన్నీరిది
మిత్రమా మిత్రమా మైకమే లోకమా మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా ॥పొద్దే రాని లోకం నీది॥
~
ఓం పూర్ణమదః పూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఈశావాస్యోపనిషత్తులో చెప్పినట్టు, దేన్నయినా పూర్ణంగా చూడడం, పూర్ణం నుండి పూర్ణాన్ని గ్రహించడం, నేర్చుకోవాలి. జీవితంలో సంపూర్ణంగా ఎదగాలంటే దాని పట్ల ఒక comprehensive view ని కలిగి ఉండాలి. ఈ విషయాన్నే సిరివెన్నెల తెలియజేస్తూ, బ్రతుకులో ఎన్నో ఋతువులు ఉన్నాయని, మరెన్నో రుచులు ఉన్నాయని, చేదును మాత్రమే చూడడం తప్పని హితవు పలుకుతున్నాడు. జీవితం ఉగాది పచ్చడి లాంటిది! తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం; అన్నిటి కలబోతే జీవితం. అది ఆరు రుచుల సమ్మేళనం. ఏ ఒక్క రుచితోనో దానిని తయారు చేయనూలేము.. ఆస్వాదించనూ లేము. మంచే జరిగిందని పొంగిపోతూ వున్నా, ఏదో ఒక చెడు సంభవించిందని జీవితంలో కృంగిపోవడం, ఆగిపోయినా – రెండూ తప్పే.
Ab_Rasheed అనే ఆఫ్రికన్ కవి వర్ణించినట్టు, సంవత్సరంలో ఎన్నో ఋతువులు ఉన్నాయి; ప్రతి ఋతువుకి ఆయా విలువలు, ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే ప్రతి ఋతువులోని అందాల్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి.. అంటాడు The Beauty of the Seasons అనే తన కవితలో..
In the heart of every year,
There are four seasons that appear.
Each with its own unique way,
Of coloring the world in a different way.
……………..
For in every season, there is something new,
A wonder to behold, a memory to pursue.
So let us cherish each and every one,
For the beauty of the seasons has only just begun.
చీకట్లోనే జీవిస్తూ, ఉదయాలని వెలివేయడం తప్పు, అని గట్టిగా వాదిస్తారు సిరివెన్నెల. గత జ్ఞాపకాల కొలిమిలో గుండె మండిపోతూ ఉంటే, దాన్ని చల్లార్చడానికి నిత్యం నిప్పునే (మత్తు పానీయాలు) తాగినా లాభం లేదు. హృదయం ద్రవించి వచ్చే కన్నీటితో ఆ మంటలను ఆర్పవచ్చు కాబట్టి, మనసులో నుండి పరివర్తన రావాలని సూచిస్తాడు కవి ముద్ర వేసుకున్న మన నిజమైన Life Coach. ఒంటరితనాన్ని, శూన్యాన్ని స్వర్గంలా భావించి పొరపడకూడదనీ, నలుగురితో కలిసి ఆనందంగా జీవించాలని గట్టిగా మందలిస్తాడు.
నీలోచూడు మంచి మనసుంది
ఏదో నాడు మంచు విడుతుంది
వాల్మీకిలో ఋషి ఉదయించినా
వేమన్నలో భోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా
మలినాలనే మసిచేస్తూ మండేలా
అగ్నిలో కాలినా స్వర్ణమై తేలదా
నిను తాకిందేమో ఈ వేదన
మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా ॥ పొద్దే రాని లోకం నీది॥
ఏ మనిషిలో అయినా పరివర్తన రావాలంటే, వేదన కలగాలి, మదిలో ఆరిపోని జ్వాల రేగాలి. అప్పుడే ఆ వ్యక్తి సక్రమమైన విధానంలో రూపాంతరం చెందుతాడు. పూర్తి నెగటివ్ నుండి పాజిటివ్ స్థితికి మారిన వ్యక్తులు, చరిత్రలు మనకు నిత్యం తారసపడతాయి. అలాంటి మూడు అద్భుతమైన ఉపమానాలను ఈ చరణంలో అందిస్తున్నారు సిరివెన్నెల.
రత్నాకరుడి వంటి దారి దోపిడీ దొంగ, క్రూరమైన వేటగాడు, వాల్మీకి అంత అంత గొప్ప ఋషిగా రూపాంతరం చెందాలన్నా, వేమారెడ్డి లాంటి ఒక భోగి, సర్వసంగ పరిత్యాగియై, యోగిగా మారి.. ప్రజా కవిగా, వేమన సూక్తులను తరతరాలకు అందించి తద్వారా అందరికీ అందరికీ జ్ఞాన భిక్ష పెట్టాలన్నా తగిన స్థాయిలో అంతర్మథనం సాగాలి. భూమిలో నుంచి వెలికి తీసిన ముడి బంగారం, తన మలినాలన్నిటినీ పోగొట్టుకొని, మేలిమి బంగారంగా నిగ్గు తేవాలన్నా, కొలిమిలో సలసలా మరగాలి. అలాంటి వ్యక్తులే అంత గొప్పవారుగా మారినప్పుడు.. నువ్వు ఎందుకు మారలేవు? అని చెంపపెట్టు ఇచ్చినట్టుగా ఉంటుంది, ఆయన కథనం.
ఇంత గొప్ప ఉపమానాలు చెప్పిన తర్వాత, ‘నీలో కూడా ఒక మంచి మనసు ఉంది.. మబ్బు తెరలు విడిపోయి ఏదో ఒక రోజు జ్ఞానోదయం అవుతుంది. మట్టిలో దాగిన రత్నం లాగా, నీవు కూడా ఏదో ఒక రోజు ప్రపంచానికి నీ విలువను చాటగలవు. అందుకే మార్పుకు సిద్ధంగా ఉండు!’ అన్న బలమైన సందేశాన్ని అందరికీ అందిస్తున్నారు, ఈ పాట ద్వారా సిరివెన్నెల.
నేను మారి, ఈ ప్రపంచాన్ని కూడా మార్చాలని అనుకుంటున్నాను… నా గురించి మీరు ఏమైనా భావించుకోండి, కానీ నా దానికి ఎవరూ అడ్డు రాకండి.. అంటాడు, Tiffany Gordon..
Count me among
the weird, the odd,
the unruly
Stare if you must
then kindly step
out of the way
I am here to
change the world
and I have a lot to do..
త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు, ఎక్కడ స్పేస్ దొరికినా, లేదా తనకు కావలసిన స్పేస్‌ను తను సృష్టించుకుని, ఒక పాట ద్వారా అందించగలిగినంత ప్రేరణ, సమాజానికి ఇవ్వగలిగిన సందేశం, తప్పకుండా ఇవ్వగలిగిన నేర్పు మన సిరివెన్నెలది. సమాజ హితవే ధ్యేయంగా తన కలాన్ని నడిపించిన సిరివెన్నెల తన మూల ఉద్దేశానికి నిరంతరం ప్రాణం పోశారు. ఏ లోకాల్లో ఉన్నా.. ఈ మనిషికవి అవి మాత్రం నిస్సందేహంగా మన మనసుల్లో కొలువుంటారు.
Images Courtesy: Internet