[అయోధ్యలో రామాలయ ఆనంద సంరంభంపై దుర్వ్యాఖ్యలు చేస్తున్న కొందరికి జవాబుగా ఈ కవిత రాశారు శ్రీ శ్రీధర్ చౌడారపు.]
[dropcap]నే[/dropcap]ను
నిద్ర పోతున్నపుడో
నీరసపడి ఉన్నప్పుడో
నాలో నేనే పోరాటపడి
అల్పమైనవాటికై ఆరాటపడి
బలహీనమైనపుడో
నైతికతకు నైష్ఠికతకు
తిలోదకాలు ఇచ్చుకున్నపుడో
కుట్రలకూ కుతంత్రాలకూ తెరతీసి
నాలోని లోలోని
నమ్మకద్రోహపు నాగులకు పాలుపోసి
నన్ను దెబ్బతీసావు
నమ్మించి చావు దెబ్బతీసావు
నా నిన్నను చెరిపేసావు
నా రేపుకు దారులు మూసేసావు
నేటి నాలుగుదారుల కూడలిలో
నేనెటువెళ్ళాలో తెలియని
అయోమయానికి అలవాటు చేసేశావు
ఇప్పుడిప్పుడే
నీవు కూల్చేసినవి
కష్టపడి తిరిగి కట్టేసుకుంటున్నాను
నీవు చింపేసినవి
మెల్లమెల్లగా అతికేసుకుంటున్నాను
నీవు కాల్చేసినవి
చల్లబరుస్తూ సరిచేసుకుంటున్నాను
నీవు దూరదూరంగా విసిరేసినవి
వెతికి వెనక్కి తెచ్చుకుంటున్నాను
నా నిన్నటిని
నా వాళ్ళు నడయాడిన మొన్నటిని
నా ప్రయాణపు మొదటి మైలురాయిని
నా తొలికేకనూ
నే వేసిన మొదటి అడుగునూ
శోధించి అన్వేషించి పట్టుకుంటున్నాను
మూకబలంతో నీవు
నావైనవి ఎన్నెన్నో నిర్మూలిస్తున్నప్పుడు
అది ధర్మమే అయితే
సాధించిన మందబలంతో నేను
నావైనవి ఏవో కొన్ని పునర్నిర్మిస్తున్నపుడు
అదెందుకు అధర్మమో
అలజడి సృష్టించేందుకు
ఓ రంగును నీవు ఎంచుకోవడం
ఒప్పే అయినప్పుడు
మనసులోని అలజడి తగ్గేందుకు,
మరో రంగు నీడన నే తలదాచుకుంటే
తప్పెందుకు అవుతుంది
రేపటి పూదోటలో
శాంతి లతలకు నీళ్ళు పోస్తున్నాను
నీవు చేసిన గాయాల చెమరింపు
నా పాదముద్రల్లో చిక్కగా
అదేపనిగా రక్తాన్ని అచ్చు పోస్తున్నా కూడా
సమకాలీనుడా..!
వర్తమానానికి వేళ్ళు
గతంలోకే చొచ్చుకుని ఉంటాయి
చరిత్రనడుగు, చెబుతుంది నీకు
ఫలాలెందుకు చేదుగా అనిపిస్తున్నాయో