[శ్రీమతి నాగమంజరి గుమ్మా రాసిన ‘అష్టమి రోజు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“బా[/dropcap]బోయ్ వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు.. వొదినా దయచేసి వీళ్ళని కాసేపు వంటగది వైపు తీసుకువెళ్లరా. నాకు కాస్త పని కి ఇబ్బంది అవుతోంది” అభ్యర్ధించాడు మురళి.
“బావుందయ్యా ముగ్గురు పిల్లల అల్లరికే నువ్వు బెంబేలెత్తిపోతే ఎలా? ఇప్పటి వరకు అంతర్జాల తరగతులు అయ్యాయి వాళ్ళకి. నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా.. ఇప్పుడే కాస్త ఆటవిడుపు వచ్చింది. నేను చెప్తానులే వాళ్ళకి.” అంటూ, “పిల్లలూ! బాబాయి పనికి కాస్త ఇబ్బందిగా ఉందట. మీకు పెరటిలో జామ చెట్టుకింద నులకమంచం వేస్తాను. అక్కడ కూర్చుని మనమంతా పాములు నిచ్చెనలు ఉండే వైకుంఠ పాళీ ఆడుకుందాం రండి” అని పిల్లలను పెరటిలోకి తీసుకువెళ్లింది వాణి.
***
మూర్తి, విశాల దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కూతురు వింధ్య వాసిని. తెలుగు పండిట్ శిక్షణ పూర్తి చేసి, ఖాళీగా ఉండటం ఎందుకని ఒక ప్రైవేటు కళాశాలలో పనిచేసేది. ఇంతలో మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసేసారు. అల్లుడు భాస్కర్ పోలీస్ ఉద్యోగి కావడం, వేళపాళ ఉండకపోవడంతో ఉద్యోగం మానేసి ఇంట్లో అత్తమామలను, పిల్లలను కనిపెట్టుకుని ఉంటోంది. వింధ్యకు ఇద్దరు పిల్లలు. అనుపమ ఆరవ తరగతి, ఆదిత్య నాల్గవ తరగతి చదువుతున్నారు.
మూర్తి గారి పెద్దకొడుకు వేణుగోపాల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కోడలు వాణి టీచర్. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. శరత్ మూడవ తరగతి, వరుణ్ కిండరుగార్డెన్.
చిన్నకొడుకు మురళీకృష్ణ, కోడలు దివ్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. వాళ్ళకి ఒక కూతురు. సునయన. వరుణ్ ఈడుదే. ఇప్పుడు దివ్య మళ్ళీ నెల తప్పింది. వీళ్లంతా మేనత్త కూతురి పెళ్లికి వచ్చారు. పెళ్లి అయిన రెండురోజులకే లాక్‌డౌన్ విధించబడి, తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయారు.
వాణికి, పిల్లలకు ఎలాగూ సెలవులే. ఇద్దరు కొడుకులు, కోడలు వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నారు. వింధ్య భర్తకు తీరిక లేని ఉద్యోగం కావడంతో భార్యను, పిల్లలను ఇక్కడే ఉంచి, ప్రత్యేక అనుమతి మీద తన వూరికి వెళ్ళిపోయాడు. ఈ కరోనా పుణ్యమా అని పిల్లలు అందరూ వాళ్ళ పిల్లలతో సహా ఇన్నిరోజులు ఇక్కడ గడపడం ఎంతో హాయిగా అనిపించింది పెద్దవాళ్ళిద్దరికి.
వంట ఇంటి పని నుంచి విశాలమ్మను తప్పించేశారు వింధ్య, వాణి. ఏ పూటకు ఏ వంట చెయ్యాలో చెప్పడమే ఆమె పని. చాలా రోజులకు విశ్రాంతి దొరికి, పిల్లలంతా కళ్ళ ముందు కదలాడుతూ ఉండడంతో మనసుకు కాస్త ప్రశాంతత చేకూరి, మనవళ్ళతో కాస్త కాలక్షేపం చేస్తోంది.
నాలుగు గదులు, విశాలమైన వరండాలు, పెద్ద పెరడు, కావలసినన్ని పూల మొక్కలు, కూరగాయల పాదులు, ఒకటి రెండు పండ్ల చెట్లు.. వీటిని చూసుకోవడమే ఒకప్పుడు విశాలమ్మ పని. ఇప్పుడు పిల్లల కేరింతలు, ఆటలతో చక్కగా పొద్దుపోతోంది. వీలున్నప్పుడు భారత, భాగవత, రామాయణాలలో చిన్న చిన్న కథలు, పద్యాలు పిల్లలకు చెప్తున్నారు మూర్తి గారు, విశాలమ్మ.
పనులకు, చదువులకు, నెట్ సిగ్నల్స్ కోసమని పెద్దలు, పిల్లలు తలొక గదిలో చేరి అన్ని గదులనూ ఉపయోగంలోకి తెచ్చారు.
***
ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాసేపు వీధి వరండాలో కూర్చున్నారు. చిన్న పిల్లలు అమ్మల ఒడిలోను, పెద్ద పిల్లలు విశాల చుట్టూ కూర్చున్నారు.
“నాన్నమ్మా! నాన్నకి వీకెండ్ సెలవు వస్తే మేము మాల్‌కి వెళ్తాము తెలుసా!” అన్నాడు శరత్ విశాలమ్మ గెడ్డం పట్టుకుని తనవైపు తిప్పుకుంటూ..
ఆదిత్య వెంటనే తాతయ్య దగ్గరకు పరుగెత్తాడు. “తాతయ్యా! మా నాన్నకు వీకెండ్ ఏమిటి, ఎప్పుడూ సెలవుండదు తాతయ్యా.. సెలవు దొరికిందంటే మాకు పండగే” అన్నాడు.
“అవును అమ్మమ్మా, ఇప్పుడు మాకు ప్రతిరోజు సెలవుల్లాగానే ఉన్నాయి. భలే బావున్నాయి” అంది అనుపమ.
“అవును అత్తయ్యా, సునయన కడుపులో ఉన్నప్పుడు సెలవులు లేక, సరైన తిండి, విశ్రాంతి లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నా ప్రాణానికి ఎంత హాయిగా ఉందో” అంది చిన్న కోడలు దివ్య.
“వదినకి రోజు స్కూల్ పిల్లలతో గడిచిపోయేది, ఇప్పుడు ఇక్కడ మా పిల్లలను తాను, అక్క చూసుకుంటున్నారు. ఈ నెల రోజుల్లో పిల్లలు ఇంకా ఆరోగ్యంగా, చురుకుగా తయారయ్యారు. మేమే ఇంట్లో కూర్చుని, తిని పొట్టలు పెంచుతున్నాం” అన్నాడు మురళి అన్న వైపు చూసి, హాస్యంగా..
“మీ ఆవిడకు పోటీ వద్దాం..” అన్నాడు వేణు ఏమి తగ్గలేదన్నట్లు.
అందరూ నవ్వుకున్నారు. “అసలు ఈ వీకెండ్ సెలవులు భలే కనిపెట్టారు. వారంలో ఐదు రోజులు తిన్నామా లేదా అన్నట్లు ఉరుకులు, పరుగుల ఉద్యోగాలు, శని ఆదివారాల్లో విశ్రాంతి..” అంది దివ్య.
“ఇప్పుడంటే శని, ఆదివారాల్లో సెలవులు.. కానీ బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన సెలవుల విధానం ఎలా ఉండేదో తెలుసా” అన్నారు మూర్తి గారు.
“అంటే ఈ సెలవులు బ్రిటిష్ వాళ్ళు వచ్చేక ఇచ్చినవా? అంతకు ముందు ఈ చదువులు, ఉద్యోగాలు లేవా తాతయ్యా?” అంది అనుపమ.
“ఉన్నాయి అనుపమా! బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ చదువుల్ని, వాళ్లకు అనుకూలంగా శని, ఆదివారాల సెలవుల్ని తెచ్చారు. ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు గత పది సంవత్సరాల్లో బాగా పెరిగాయి. అంతకు ముందు అంటే ఇంగ్లీష్ చదువులు రాకముందు, ఆంధ్రం, అమరం, వేదాలు, వృత్తివిద్యలు మాత్రమే చదువులుగా ఉన్నకాలంలో వారాంతపు సెలవుల విధానం వేరేగావుండేది.” ఆగారు మూర్తిగారు.
“చెప్పండి నాన్నా, మాకు కూడా ఈ విషయం కొత్తగా ఉంది” అన్నారు కొడుకులు ఇద్దరూ..
“మీకు తిథుల పేర్లు తెలుసా?” పిల్లలను ప్రశ్నించారు మూర్తి గారు.
“నాకు తెలుసు” ఒకేసారి అన్నారు అనుపమ, ఆదిత్య, శరత్.
“నాకు కూడా వచ్చు తాతయ్యా” అంటూ వరుణ్, సునయన కూడా దగ్గరకు వచ్చారు. సునయన అంతటితో ఆగకుండా “పాడ్యమి, విదియ, తదియ..” అంటూ మొదలుపెట్టేసింది కూడా..
“మా తల్లే ఎంత ముద్దుగా చెప్పేస్తోందో” అంటూ మనవరాల్ని ముద్దాడింది విశాల. “నాన్నమ్మా నాకో” అంటూ బుగ్గల్ని అందించాడు వరుణ్. నవ్వుకుంటూ కొనసాగించారు మూర్తిగారు.
“మీకు భలేగా నేర్పేరు.. అవే.. మనం చాంద్రమానాన్ని అనుసరించి నెలలు, వారాలు లెక్కపెట్టుకునే వాళ్ళం. ఇంకా అప్పట్లో ప్రపంచం అంతటా ఒకే కేలండర్ అమలులో ఉండేది కాదు. పెద్దవాళ్ళు, చదువుకున్నవాళ్ళు ఇంగ్లీష్ తేదీలు అనుసరించినా, ఉత్తర భారతదేశంలోనూ, దక్షిణ భారతదేశంలో పల్లెలు, కొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా తిథులు, చైత్రం మొదలైన చాంద్రమాన మాసాలే వ్యావహరికంలో ఉండేవి. ఆ క్రమం లోనే పూర్ణిమ, అమావాస్య, రెండు పక్షాలలో వచ్చే అష్టమి తిథులను వారాంతపు సెలవులుగా భావించేవారు, ఏ పనులు, చదువులు ఆ రోజు ఉండేవి కావు. అలాగే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి కూడా..” చెప్పి ఆగేరు మూర్తి గారు.
“ఓహ్.. ఇప్పటి ఆదివారాలు, రెండవ శనివారంలా అన్నమాట” అంది అనుపమ.
“అవునమ్మా, ఎలాంటి చదువు లేకపోయినా, అందరికి ఈ తిథులు తెలిసి ఉండటం వలన సులువుగా పనులకు విరామం ఇచ్చుకునే వారు.” అంది విశాలమ్మ.
“అంతే కాదు ముఖ్యమైన పనులు ఏవైనా కూడా అష్టమి, అమావాస్యలలో చెయ్యకూడదు అనేవారు. అంటే అవి మంచిరోజులు కావు అని అర్థం కాదు, కాస్త తీరిక కల్పించే ఉద్దేశం మాత్రమే” విడమర్చింది.
“ఓహ్. అదా సంగతి. కానీ రాను రాను మూఢనమ్మకంగా ఉండిపోయింది కదా..” అంది దివ్య.
“అత్తయ్యా, మామయ్యా ప్రతిరోజూ మధ్యాహ్నం పూట కాసేపు, రాత్రుళ్ళు భోజనాలు అయ్యాక ఇలాంటి విషయాలు కాస్త చెప్తూ ఉండండి. స్కూల్‌లో పిల్లలు వేసే కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం వెతుక్కోలేక పోతున్నాను” అంది వాణి.
“నిజమే ఈనాటి చదువుల్లో ఈ విషయాలు ఏవి తెలియనే తెలియవు. ఈ కరోనా సెలవుల పుణ్యమా అని కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం.. కాసేపు తాతయ్య నిద్రపోతారు. మీరు అల్లరి చెయ్యకండి, మేము పని మొదలుపెడతాం” అని లేచాడు వేణు.
“మీరు నాతో రండి, మంచి కథలు చెప్పుకుందాం” అని వాణి పెరటిలోకి దారితీసింది. పిల్లలతో సహా వింధ్య కూడా వాణిని అనుసరించింది.
అష్టమి దినమునను కష్టమేమియు లేదు
కృష్ణుడు జనియించె గీత చెప్పె
భగవదాంశ కంటె బలమైన తిథి యేది?
మంచిదైన దినము మనుగడకును