[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
హైదరాబాద్:
[dropcap]స[/dropcap]మయం పది గంటలు. వేసవి ఎండ తీవ్రంగా ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ట్రాఫిక్ ఫర్లాంగు దూరం స్తంభించిపోయింది. వాహనాల శబ్దం. హారన్ల ధ్వని. ఆటోలు, టూ వీలర్స్ నుండి వస్తున్న వస్తున్న ధూమం. ధ్వని, ధూమ, వాయు కాలుష్యాల మధ్య మధ్య యుద్ధం జరుగుతోందక్కడ.
చిక్కడపల్లి వైపు నుండి స్పీడ్‌గా వస్తున్న బైక్ ట్రాఫిక్ చూసి స్లో అయి, ఆగింది. బైక్ మీదున్న కార్తీక్ అసహనంగా హెల్మెట్ తీసి, వాచ్ వైపు చూశాడు. కర్చీఫ్ తీసి మొహం తుడుచుకున్నాడు. హెల్మెట్ తగిలించుకొని లెఫ్ట్ సైడ్ ఉన్న వాహనాలను ఒడుపుగా తప్పించుకుంటూ.. ముందుకు వెళుతున్నాడు. గ్రీన్ సిగ్నల్ పడటంతో వాహనాలు మెల్లగా కదులుతూంటే ‘హమ్మయ్య’ అనుకున్నాడు. మళ్లీ అంతలోనే వాహనాలు ఆగేసరికి, అసహనంగా చూశాడు. అతని బండి ఫ్రంట్ వీల్, నిలబడి ఉన్న ఓ వ్యక్తి కాలికి తగిలేసరికి..
“ఏయ్.. కళ్ళు అవుపట్లే..” అరిచాడతను.
“అవ్ మల్లా” అంటూ స్తంభించిపోయిన ట్రాఫిక్‌లో పక్క నుంచి తప్పుకుంటూ పోతున్నాడు. వెనక నుండి అంబులెన్స్ సైరన్ వినిపిస్తోంది. ఆగి ఉన్న వాహనాలు అంబులెన్స్‌కి దారి ఇవ్వలేక నిస్సహాయంగా నిలబడున్నాయి. బిగ్ బజార్ దగ్గరికి వచ్చే సరికి గ్రీన్ సిగ్నల్ పడ్డది. వాహనాల్లో మళ్ళీ కదలిక మొదలైంది. కార్తీక్ వేగం పెంచి సిగ్నల్‌ని సమీపించేంతలో రెడ్ సిగ్నల్ పడింది. 90 సెకన్లు చూపుతున్న డిజిటల్ డిస్ప్లే వైపు విసుగ్గా చూసాడు. అంతే! లెఫ్ట్ హ్యాండ్ వైపు డైవర్షన్ తీసుకుని వేగంగా వెళుతున్న వాహనాల్లో కలిసి పోయి, U టర్న్ తిరిగి, ఖాళీగా ఉన్న ముషీరాబాద్ రోడ్లోకి 30 సెకన్లలో దూసుకెళ్ళాడు.
***
ఆఫీస్ పార్కింగ్ ప్లేస్‌లో బైక్ పార్క్ చేస్తున్న కార్తీక్‌ని చూసి విష్ చేశాడు అభిరాం.
“హాయ్.. ఇంకా టెన్ మినిట్స్ ఉందిగా! ఆక్సీకి వెళ్దాం రా!” అన్నాడు కార్తీక్.
“లాగిన్ అయ్యాక వెళ్దాం. కొత్త డ్రెస్సా? చాలా బాగుంది. ఏంటి స్పెషలు?” అడిగాడు అభిరాం.
“నాకు ప్రతిరోజూ పండగే.. అని ఇప్పటికి వంద సార్లు చెప్పాను నీకు.”
“ఇట్స్ ఓ.కే. పద”
ఇద్దరూ లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి లిఫ్ట్ కిందకు వస్తున్న ఇండికేషన్ చూపుతోంది.
“హలో! హలో! అభి, కార్తీక్!” పిలుపు వినిపించే సరికి వెనక్కి తిరిగి చూశారిద్దరూ..
చిన్న సైజు వినాయకుడిలా ఆయాసపడుతూ వచ్చాడు విఘ్నేష్.
“ఏ క్యారే.. ఆస్తమా పేషెంట్‌కి జై సా దమ్ ఆరా.. క్యా బాత్ హై” అన్నాడు అభిరాం.
“అదేం లేదు లేరా! స్పీడ్‌గా వచ్చానంతే” అన్నాడు ఆయాసపడుతూ.
“కొయ్యకు బాసూ! ఉదయాన్నే టీ.వీలో రాందేవ్ బాబా, మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రోగ్రాంలు చూస్తూ యోగాసనాలెయ్యమని మనోడికి హెచ్.ఆర్. అడ్వైజ్ ఇచ్చింది. వీడు టీ.వీ ముందు పడుకుని హాయిగా నిద్రాసనం వేసి, 9 గంటలకు లేచి వస్తే ఆయాసమూ వస్తుంది, ఆస్తమా కూడా వస్తుంది” టీజ్ చేశాడు కార్తీక్.
“పోండ్రా ! నా ఒళ్ళు, నా ఇష్టం. దీని మీద ఎవరైనా కామెంట్ చెయ్యడం నాకు ఇష్టం ఉండదు.” కొంచెం కోపంగా అన్నాడు విఘ్నేష్.
“ఛ! చిన్న విషయానికి అంత సీరియస్ అవుతావేంట్రా.. బాబూ!”
లిఫ్ట్ కిందికొచ్చింది. లిఫ్ట్ నుండి హడావిడిగా బయటకు వచ్చింది మీనాక్షి.
“ఎన్నా? మీనాక్షీ! ఎన్నాయిడ్తు!?” కంగారుగా అడిగినట్టు అన్నాడు కార్తీక్.
“మోపెడ్ బాక్స్‌ల సెల్ఫోన్ మరందుటె..” అనెళ్తున్న మీనాక్షి వెనుక భాగాలను ఆస్వాదిస్తూ చూస్తున్నాడు అభిరామ్.
“అభీ! లిఫ్ట్ లోకి రా! రా! బాబూ! ఆ మతిమరుపు మీనాక్షి బ్యాక్ భాగాల్ని ఏం చూస్తావు లే! ఆ దినకరన్ గాడు నిన్నిలా చూసాడంటే.. నీ కళ్ళు పీకి చేతిలో పెడతాడు”.
భుజాలు ఎగరేసి లోపలికొచ్చాడు అభి. లిఫ్ట్ దిగి, స్టేర్ కేస్ కింద ఉన్న స్మోకింగ్ ప్లేస్‌కి వెళ్లారు.
కార్తీక్ సిగరెట్ ప్యాకెట్ తీశాడు.
“ఏంటి బ్రాండ్ మార్చావు?” అన్నాడు అభిరాం.
“ఈ రోజుల్లో స్టైలే రా ముఖ్యం. రొటీన్‌గా ఒక్కదానికే స్టిక్ అయితే, బోర్ కొడుతుంది. కింగ్‌లా ఆలోచించు.. కింగ్‌లా జీవించు, కింగ్‌లా అనుభవించు.. లివ్ లైక్ ఏ కింగ్” అన్నాడు కార్తీక్.
“ఎన్నప్పా! కింగ్.. కింగ్ అంటున్డావూ” వెనక నుంచి వచ్చాడు ముకుందన్.
సిగరెట్ ఆఫర్ చేశాడు కార్తీక్.
“అరే! ప్యాకింగ్ కొత్తగా ఉండాదే” అంటూ సిగరెట్ ముట్టించాడు ముకుందన్.
“వీడు వద్దు.. వద్దంటూనే ఓ.సి.లో రోజుకి అరపేక్ సిగరెట్లు పీల్చేస్తున్నాడు.” అన్నాడు అభిరామ్.
“కుట్టిగాడు కంజూస్ అని తెలిసిందే కదా! వీడి మొహానికి ఆ సోడాబుడ్డీ శశికాంతకి లైనేస్తున్నాడు!”
“ఇద్దరివీ పక్క పక్క క్యూబికల్సే కదా!.. వీడు.. సీ అండ్ ఎంజాయ్ వరకే.. ఆ సోడాబుడ్డి శశికాంతకి కనీసం కాఫీ కూడా ఆఫర్ చెయ్యని పిసినారిగాడు వీడు.”
“ఎన్నప్పా! అరదం కాకుండా తెలుంగులో మాట్లాడతా ఉండారు?”
“ఏం లేదు సార్!.. శశికాంత మేడం డ్రెస్సింగ్ సెన్స్ గురించి..” అన్నాడు కార్తీక్.
ఆ మాట వినగానే ముకుందన్‌కి క్షణం తత్తరపాటు కలిగింది. వాళ్లు కావాలని తనని టీజ్ చేస్తున్నారని అర్థమైంది. తన గురించే మాట్లాడుతున్నారని గ్రహించాడు. “పోదాం” అని సగం పీల్చిన సిగరెట్ పడేసాడు.
అభిరాం బ్యాగ్‌లో ఉన్న ‘సెంటర్ ఫ్రెష్’ తీసి వాళ్ళిద్దరికీ ఇచ్చి, తనూ నోట్లో వేసుకుని ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యారు.
***
హెచ్. ఆర్. హారిక పేపర్లు పట్టుకుని ఎదురొచ్చి, కార్తీక్ పక్కనుండి వెళుతూ, ఒక్క క్షణం ఆగి చూసి..
“ఏంటి న్యూ పెర్ఫ్యూమా?” అంది నవ్వుతూ.
“ఎస్” అన్నాడు
“బాగుంది. బ్రాండ్ ఏంటి?”
“కాస్ట్లీ”
“బ్రాండ్ అడిగితే.. కాస్ట్లీ అంటావేంట్రా బాబూ!”
“అదే బ్రాండ్ నేమ్. మొన్నే మార్కెట్లోకి వచ్చింది”
“అవునా! నాకు ఇంపోర్టెడ్ ఫేస్ క్రీం తెచ్చిస్తానన్నావు. గుర్తుందా?”
“ఉంది కానీ.. రేట్ ఎక్కువగా ఉంది”
“హౌ మచ్?”
“జస్ట్ మూడు వేలు”
“ఈచ్ వన్!?!” అంది ఆశ్చర్యంగా.
“యాఁ..”
“టూ మచ్.. యూ..నో! డోంట్ వాంట్. డోన్ట్ బై ఫర్ మి.”
“ఐ విల్ గెట్ ఫర్ యు”
“వద్దు మేన్. నీదీ మనీయే కదా!”
“నువ్వు మనసు పడ్డావుగా!”
“స్ట్రెయిట్‌గా దేనికీ ఆన్సర్ ఇవ్వవుగా! సిల్లీ ఫెలో..” అంటూ కార్తీక్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆమె చేతిని గట్టిగా నొక్కుతూ..
“యూ.. టూ” అన్నాడు ఒకలా నవ్వుతూ.
కార్తీక్ తన క్యూబికల్ కి వెళ్ళి లాగిన్ అయ్యి, పక్క క్యూబికల్‌లో ఉన్న మీనాక్షిని తదేకంగా చూశాడు.
“ఏయ్! ఎన్నా పార్కరే..” అంది.
“సెల్‌ఫోన్ దొరికిందా?” అంటూ చూపుల్ని ఆమె ఎదపై ఉంచాడు.
“ ఆఁ.. ఆఁ..”
అతని చూపులు ఎక్కడున్నాయో గమనించి దుపట్టా సరిచేసుకుంది.
“రేపట్నుంచి దుపట్టాకి బదులు దుప్పటి తెచ్చి కప్పుకో. నిన్ను ఎవరూ చూడరు”
“షట్ అప్”
ఇంతలో మీనాక్షి సెల్‌ఫోన్‌కి కెల్విన్ మెసేజ్ పంపాడు. అది బూతు జోక్. చదివి ముసిముసిగా నవ్వుకుంది.
‘మళ్ళీ బూతు జోక్స్ పంపించి ఉంటాడు. అందుకే ఇంత పరవశించిపోతోంది’ అనుకున్నాడు.
డి.ఎల్.ఎఫ్.లో ఉన్న మృదుల గుర్తుకొచ్చి, సెల్ ఫోన్ తీసి కాల్ చేశాడు.
***
కార్తీక్ బైకు ఐ-ల్యాబ్స్ దాటి డౌన్‌లో టర్నింగ్ తీసుకోబోతుంటే.. పక్కగా వెళ్తున్న ఓలా క్యాబ్‌ని తప్పించబోయిన ఓ మోపెడ్ వేగంగా వచ్చి బైక్‌ని గుద్దేసింది. పక్కగా బైక్ ఆపి దిగాడు కార్తీక్. మోపెడ్‌తో సహా కింద పడిపోయిన అమ్మాయిని చూశాడు. దగ్గరికి వెళ్ళి మోపెడ్ తీసి నిలబెట్టాడు. ఆమెకి చెయ్యందించాడు..
“దెబ్బలు ఏమైనా తగిలాయాండీ?”
“సారీ! క్యాబ్ వాడు సైడివ్వకుండా మీదికి వచ్చేస్తుంటే.. టర్న్ అయ్యేసరికి బ్యాలెన్స్ తప్పింది..” అంది.
“అవన్నీ తర్వాత. మీకు దెబ్బలు తగిలినట్టున్నాయి. రండి.. హాస్పిటల్‌కి తీసుకెళ్తా”
“వద్దు మీ బైక్‌కి, మీకు..”
“పర్లేదు. ముందు మీకు ఫస్టెయిడ్ చేయిద్దాం. రండి! మీ మోచేతి నుంచి రక్తం కారుతోంది”
అప్పుడు ఆ అమ్మాయి మోచేతిని చూసుకుంది.
కార్తీక్ ఆటోని పిలిచి “ముందు ఎక్కండి” అన్నాడు.
“థాంక్స్ అండ్ సారీ.. నే వెళ్తాను” అని ఆమె మోపెడ్ వైపు వెళ్ళబోయింది. ఆమె చేయి పట్టుకొని ఆపాడు.
“ఈ గాయాలతో డ్రైవ్ చేయలేరు. రిలాక్స్ ఫస్ట్. ముందు ఫస్టెయిడ్ తీసుకున్నాక వెళ్దురుగాని” అని ఆమెను ఆటో ఎక్కించాడు.
“నా మోపెడ్!?!”
“పక్కన పెట్టి లాక్ చేశాను” అని మోపెడ్ కీస్ ఆమెకి ఇచ్చాడు.
దగ్గర్లో ఉన్న మెడ్విన్ హాస్పిటల్‌కి తీసుకెళ్లి ఆమెకి ఫస్టెయిడ్ చేయించాడు. ఆఫెన్ అవర్లో మళ్ళీ మోపెడ్ దగ్గర డ్రాప్ చేశాడు.
“థాంక్యూ సో మచ్. ఐ యాం మేఘన. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వర్కింగ్ ఫర్ జే.పీ మోర్గాన్”
“నా పేరు కార్తీక్. వర్కింగ్ ఫర్ టి.సి.ఎస్ “
“ఇది నా ఫోన్ నెంబర్” అని నెంబర్ చెప్పి, “మిస్డ్ కాల్ ఇవ్వండి” అంది.
“అలాగే!” అని తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు.
***
రాత్రి పది గంటలు:
మేఘన కార్తీక్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తోంది. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఉదయం నుండి నాలుగు సార్లు కాల్ చేసినా రిప్లై ఇవ్వటం లేదు. ఆ నెంబర్‌కి వాట్సప్ ఉందేమోనని వెతికింది. కనిపించ లేదు.
‘సహాయం చేసిన కార్తీక్‌కి మనస్పూర్తిగా థాంక్స్ కూడా చెప్పలేకపోయాను.’ అనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది.
“హలో! కార్తీక్ గారేనా?” అంది డిస్‍ప్లే చూసుకోకుండా.
“మేఘనా! నేను అన్నయ్యని”
“ఆఁ.. అన్నయ్యా! చెప్పు”
“కార్తీక్ ఎవరు?”
“మా టీం లీడర్. రేపటి నుంచి కొత్త ప్రాజెక్టు లాంచ్ చేస్తున్నారట. ఆ డీటెయిల్స్ చెప్తాను అన్నాడు. అతనేమో అనుకున్నాను” అని కాసేపు ఇంటి విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది.
పడుకోబోతూ.. మరోసారి కార్తీక్‌కి ట్రై చేద్దామనుకుని కాల్ చేసింది.
“హలో! హూ ఇస్ దిస్”
“హలో! కార్తీక్ గారూ! నేను మేఘన. మొన్న ఐ-లాబ్స్ దగ్గర యాక్సిడెంట్..” అని గుర్తు చేసింది.
“ఓ..! మీరా! సారీ! ఉదయం కాల్ చేసినట్టున్నారు? బిజీగా ఉండటం వల్ల మీ కాల్ అటెండ్ అవ్వలేకపోయాను. చెప్పండి” అన్నాడు.
“నిన్న, ఇవాళ నాలుగు సార్లు కాల్ చేశాను”
“సారీ! మీ నెంబర్ సేవ్ చేసుకోలేదు. ఏమీ అనుకోకండి”
“ఇట్స్ ఓ.కే.”
“మీది ఏ ఊరు?”
“ప్రస్తుతానికి హైదరాబాద్”
“మాది నెల్లూరు”
“అలాగా!”
“బిజీగా ఉన్నాను అన్నారు. మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీరేగా!”
“అవునండి! అదొక్కటే కాదు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ప్రస్తుతం ఓ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ చేస్తున్నాను. అందుకని బిజీ.. బిజీ..”
“వావ్! గ్రేట్! మీ మ్యూజిక్ నేను వినొచ్చా!?”
“వై నాట్.. పూర్తి కాగానే పంపుతాను”
“ఇంకేంటి సంగతులు?”
“నిద్ర వస్తోందండీ”
“అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతుంటే నిద్రొస్తోందంటారేంటి?”
“అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, నిద్ర నిద్రే కదండీ! క్యాచ్ యు లేటర్. బై. గుడ్ నైట్” అని ఫోన్ కట్ చేశాడు.
మేఘన నిరాశగా ఫోన్ పక్కన పడేసింది.
***
వారం రోజుల తర్వాత: సాయంత్రం ఐదు గంటలు..
కార్తీక్ ఫ్రెండ్స్‌తో స్ట్రీట్ ఫుడ్ దగ్గర రోడ్డు పక్కన పానీ పూరి బండి దగ్గర పానీపూరి తింటున్నాడు.
ఫ్రెండ్స్‌లో చైతన్య “నాకు వద్దురా!” అన్నాడు.
“ఏం మొన్న ఇనార్బిట్‌లో తిన్నావు కదా”
“ఇక్కడ హైజీనిక్.. నో! నో!”
“ఇనార్బిట్‌లో పది రూపాయల దానికి వంద రూపాయలు కడతావు. లోపల వాడు ఏం చేస్తున్నాడో? తెలియదు. వీళ్ళూ బతకాలిగా! హైజీనిక్ మనసులో ఉండాలి బ్రో! ఇతను చూడు మనల్ని చూడగానే.. ఎంత శుభ్రంగా ప్రిపేర్ చేస్తున్నాడో” అన్నాడు.
“నువ్వే కదరా! లీవ్ లైక్ ఎ కింగ్ అంటావు”
“నిజమే కాదనటం లేదు. ఆలోచనలలో నీకు నీకు నువ్వే కింగ్ అనే భావనతో ఉండాలి. కానీ ఇలాంటి సిల్లీ విషయాలకి కాదు. మొన్న నువ్వు స్టార్టప్ కంపెనీల ఇంపార్టెన్స్ గురించి మాట్లాడావు. ఇవి స్టార్టప్ కంపెనీలే బ్రదర్. మనలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనేగా వీళ్ళూ ఎదిగేది.” అని అందరికీ చెప్పాడు.
“సార్! మా గురించి ఆలోచించినందుకు థాంక్స్. నేను పి.జీ. వరకు చదువుకున్నాను. కరోనా పుణ్యమా అని ఏజ్ బార్ అయింది. మా నాన్నకి మా ఊళ్లో చిన్న హోటల్ ఉంది. ఇక్కడైతే బిజినెస్ బాగుంటుందని తొలి ప్రయత్నంగా ఈ మధ్యే పెట్టాను. నా పేరు రామకృష్ణ” అన్నాడు పానీపూరీలు అమ్ముకుంటున్న యువకుడు.
“ఓ.కే.. ఎవరు వచ్చినా రాకపోయినా.. నేను మాత్రం ఇటు వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్‌తో వస్తాను బ్రో!” అన్నాడు కార్తీక్.
చైతన్య అందరికంటే ముందే అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు.
“రేయ్! కార్తీక్ నిజంగా నువ్వు కింగే రా! ఎక్కడైనా ఒదిగిపోగలవు” అన్నాడు అభిరామ్.
“సరే రా! బై..” అని కార్తీక్ బైక్ స్టార్ట్ చేయబోతుంటే పక్కగా ఓ మోపెడ్ వచ్చి ఆగింది.
“హలో కార్తీక్ గారూ!”
“అవును మేఘన గారూ!”
“పర్వాలేదు గుర్తుపెట్టుకున్నారే!”
“మర్చిపోవటానికి మన పరిచయానికి ఏళ్లు గడవలేదుగా!”
“ఏంటి మీరిక్కడ?”
“జస్ట్ పానీపూరీ తిందామని”
“ఇక్కడా!” అంది చుట్టూ చూసి.
“ఏమైంది?”
“ఏం లేదు” అని ఎంబ్రాసింగ్ గా చూస్తుంటే..,
“రామకృష్ణ గారూ! మేడంకి ఓ ప్లేట్ పానీపూరి ఇవ్వండి” అన్నాడు.
ఇబ్బందిగా మొహం పెట్టి “నేను ఎక్కడపడితే.. అక్కడ తినను. ప్లీజ్!” అంది
“ఓ.కే. నో కంపల్షన్. యాజ్ యు విష్. బై ద బై.. హి ఈజ్ రామకృష్ణ. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ అమలాపురం. ఈ పానీపూరీ బండి జస్ట్ స్టార్ట్ అప్. ట్రై టు ఎంకరేజ్” అని బైక్ స్టార్ట్ చేశాడు.
“హలో! కార్తీక్ గారూ! కొంచెం నాలాంటి ఫ్రెండ్‌కి కూడా మీ టైం కేటాయించండి”
“అయ్యో! అంత గొప్పవాడిని కాదండీ! సమయం వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం” అని వేగంగా వెళ్ళిపోయాడు.
(సశేషం)