నేనేం చేస్తానంటే..!

1
4

[పాలస్తీనా కవయిత్రి సుహైర్ హమ్మద్ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Suheir Hammadh’s poem ‘What I will…?’ by Mrs. Geetanjali.]

~

[dropcap]నీ[/dropcap]వు మ్రోగించే యుధ్ద ఢంకాకి
నేను నృత్యం చేస్తాననుకుంటున్నావా.. చేయను గాక చేయను!
నా ఆత్మని, ఎముకల్ని కూడా నీ యుద్ద దాహానికి బలి ఇవ్వను!
నీ యుధ్ద ఢంకా మోత ఒట్టి జీవం లేనిదని నాకు తెలుసు.
నువ్వు కొడుతున్న ఆ ఢంకా ఎండిన చర్మం ఎవరిదో..
నాకు బాగా దగ్గరగా తెలుసు.
ఒకప్పుడా చర్మం సజీవంగా ఉండింది.
తరువాత కారుణ్యం లేకుండా నీచే వేటాడబడింది..
దొంగలించ బడింది.. క్రూరంగా సాగదీయ బడింది.
ఇక నిస్సిగ్గుగా నువ్వు యుద్ధ ఢంకా బజాయిస్తుంటే నేనెందుకు నృత్యం చేయాలి?
అసలు నేనేం చేస్తానుకుంటున్నావు?
నేనేం చేస్తానంటే..
నీ పేలుళ్ల ధ్వనికి అంతరాయం కలిగించను..
నీ కోసం ఎవరినీ ద్వేషించను.. కనీసం నిన్నూ ద్వేషించను.
నీ కోసం ఎవరినీ చంపను.
మరీ ముఖ్యంగా నీ కోసం నేను చావనే చావను!
మీరు హత్యలు చేస్తే మరణించిన వారికి
సంతాపం కూడా ప్రకటించను!
కనీసం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకైనా సరే!
నీకు మద్దతుగా ఎప్పటికీ నిలబడను!
నీ బాంబుల పేలుడు శబ్దాలకి
అందరూ నాట్యం చేస్తున్నట్లు నేను చేయను!
అయితే.. అందరూ తప్పులు చేస్తుండోచ్చు.. నువ్వూ అంతే!
కానీ.. నీకు తెలియంది ఏంటంటే జీవించడం ఒక హక్కని!
జీవితం ఎప్పటికి హామీ లేనిది.. సాధారణమూ.. అలాగే ఆకస్మికమైంది కూడా!
నేనెక్కడి నుండి వచ్చానో..
నా మూలాలు ఏమిటో నేనెన్నటికీ మరువలేను!
నేనేం చేస్తానంటే..
నా యుధ్ద ఢంకాని నేనే తయారు చేసుకుంటాను!
అప్పుడు నా ప్రియమైన వాళ్ళందరూ గుమిగూడతారు.
లేదా.. నేనే పిలుచుకుంటాను.
అప్పుడు మా సామూహిక మంత్రాలు.. పాటలే నాట్యం చేస్తాయి!
మా కూనిరాగాలే దిక్కులు పిక్కటిల్లే ఢంకా నాదాలవుతాయి!
అప్పుడు.. నేను నీతో ఆడించబడే కీలు బొమ్మను కాను!
ఇకప్పుడు నేనేం చేస్తానంటే..
నా పేరును అరువు తెచ్చుకోను..
లేదా నీకు భయపడి నకిలీ పేరు పెట్టుకోను!
నా పాటకి నీ లయను అప్పుగా తీసుకోను!
నేను రాసుకున్న పాటకే నేను నాట్యం చేస్తాను..
తిరుగుబాటు చేస్తూ.. అలిసిపోతూ కూడా
మళ్లీ మళ్లీ స్థిరంగా నాట్యం చేస్తూనే ఉంటాను!
అప్పుడు కొట్టుకునే గుండె చప్పుడుంది చూశావూ..
మరణం కన్నా పెద్దగా వినపడుతుంది!
ఒక విస్ఫోటనంలా!
కానీ.. నీ యుద్ధ ఢంకా నుంచి వచ్చే ధ్వని మాత్రం
నీ శ్వాస చేసే శబ్దం కంటే కూడా చిన్నగా ఉంటుంది.. కావలిస్తే విను!

~

మూలం: సుహైర్ హమ్మద్

అనుసృజన: గీతాంజలి


సుహైర్ హమ్మద్ పాలస్తీనా మూలాలు కల కవయిత్రి, నటి. జోర్డాన్‍లో జన్మించారు. ఆమె 5వ ఏట ఆమె తల్లిదండ్రులు అమెరికాకి వలస వచ్చారు. హమ్మద్ న్యూ యార్క్ నగరంలోని బ్రూక్లిన్‌లో పెరిగారు. కవిత్వమే కాకుండా హమ్మద్ నాటకాలు వ్రాశారు. వీడియోలు చేశారు. Born Palestinian, Born Black; Drops of This Story, Breaking Poems వంటివి ఆమె రచనలు. పలు అంతర్జాతీయ పత్రికలలో ఆమె కవితలు ప్రచురితమయ్యాయి. The 2009 American Book Award, The Morris Center for Healing Poetry Award వంటి పురస్కారాలతో పాటు Van Lier Fellowship పొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here